...

SPECIALIZED SITE FOR HUMAN HEALTH CARE,
SPECIALLY ON GASTROENTEROLOGY, LIVER AND PANCREAS

అర‌గంట స‌మ‌యం అంత విలువైన‌దా..!

అర‌గంట అంటే చాలా చిన్నదిగా అనిపిస్తుంది. కానీ, ఈ అర‌గంట‌లో ఎంతో సాధించ‌వ‌చ్చు. రోజు లో 24 గంట‌లు ఉంటాయి అంటే 48 అర్థ గంట‌లు ఉంటాయి. ఇందులో ఒక్క అర్థ గంట ప్రతీ వ్యక్తి త‌న గురించి తాను కేటాయించుకొంటే ఎంతో బాగుంటుంది.

స‌మ‌యాన్ని ఇత‌రులకు బాగానే కేటాయిస్తాం కానీ, మ‌న గురించి మ‌నం ఆలోచించుకొనే తీరిక ఉండ‌దు. కానీ ప్రతీ రోజు ఏదో ఒక స‌మ‌యం నిర్ధిష్టంగా పెట్టుకొని, ఆ స‌మ‌యంలో అంత‌కు ముందు రోజు చేసిన ప‌నుల‌న్నీ చ‌క్కగా రివ్యూ చేసుకోవ‌చ్చు. అంతే కాకుండా మ‌న ఆరోగ్యం, మ‌న వికాసం, మ‌న ఆలోచ‌న‌లు వంటి విష‌యాల‌న్నీ ఆలోచించుకోవ‌చ్చు.
అంత‌కు మించి ఈ అర‌గంట‌లో న‌డ‌క‌, తేలిక పాటి వ్యాయామం త‌ప్పనిస‌రిగా చేయాలి. న‌డ‌క‌, తేలిక పాటి వ్యాయామంతో శ‌రీరం దృఢంగా ఉంటుంది. వ్యాధి నిరోధ‌క శ‌క్తిని పెంచుకోగ‌లుగుతుంది. అంతే గాకుండా స్థూల‌కాయం, మ‌ధుమేహం వంటి స‌మ‌స్యల‌కు దూరంగా ఉండ‌వ‌చ్చు. అందుచేత అరగంట స‌మ‌యం మ‌న గురించి మ‌నం కేటాయించుకొంటే అది విలువైన‌దే క‌దా..!

ఆయ‌న‌కు కొంచెం హెచ్చు ఉంది...కానీ దానికో లెక్కుంది..!


బ‌రువు ఎక్కువ‌గా ఉంటే చూడ‌టానికి అంత బాగోదు క‌దా..! అంతే క‌దా అని తేలిగ్గా తీసుకోవ‌ద్దు సుమా. బ‌రువు ఎక్కువ‌గా ఉంటే మ‌ధుమేహం, ర‌క్త పోటు వంటి ఆరోగ్య స‌మ‌స్యలు కూడా త‌లెత్తుతాయి. మ‌రి, బ‌రువు ఎక్కువ‌గా ఉండ‌టం అంటే ఎలా గుర్తించాలి.. దీనికి ఏమైనా కొల బ‌ద్ద ఉంటుందా అని పరిశీలిస్తే కొన్ని ప్రాతిపదికలు క‌నిపిస్తాయి.

స్థూల‌కాయాన్ని గుర్తించ‌టానికి ప్రధానంగా బాడీ మాస్ ఇండెక్స్ మీద ఆధార‌ప‌డ‌తారు. మ‌నిషి బ‌రువు ని కిలోగ్రాముల్లో గ‌ణించాలి. ఎత్తుని మీటర్ల లో కొలిచి దాన్ని స్క్వేర్ చేయాలి. ఈ ఫ‌లితంతో బ‌రువు ని భాగించాలి. ఫ‌లితాన్ని బాడీ మాస్ ఇండెక్సుగా చెబుతారు. ఈ బాడీ మాస్ ఇండెక్సు ఎంత ఉంది అనే దానిపై స్థూల‌కాయం గ‌ణించి చెప్పవ‌చ్చు. ఈ బాడీ మాస్ ఇండెక్సు 18.5 క‌న్నా త‌క్కువ ఉంటే త‌క్కువ బ‌రువు క‌లిగి ఉన్నట్లు లెక్క. 18.5 నుంచి 25 పాయింట్ల దాకా ఉంటే స‌క్రమ‌మైన బ‌రువు ఉన్నట్లు లెక్క. 25 నుంచి 30 దాకా ఉంటే ఎక్కువ బ‌రువు ఉన్నట్లన్న మాట‌. 30 నుంచి 35 దాకా ఉంటే టైప్‌-ఒన్ స్థూల‌కాయం, 35 నుంచి 40 దాకా ఉంటే టైప్‌-టూ స్థూల‌కాయం, 40 దాటి ఉంటే టైప్ - త్రీ స్థూల‌కాయం ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ గ‌ణాంకాలు చెబుతున్నాయి.
స్థూల కాయాన్ని న‌డుము కొల‌త‌ను బ‌ట్టి కూడా చెబుతారు. ఆరోగ్యవంతుడైన పురుషుల్లో  న‌డుము కొల‌త 90 సెం.మీ., మ‌హిళ‌ల్లో 80 సెం.మీ. వ‌ర‌కు ఉండ‌వ‌చ్చు. పురుషుల్లో 102 సెం.మీ. దాటితే ప్రమాదం అనీ, మ‌హిళ‌ల్లో 88 సెం.మీ. దాటితే మాత్రం ప్రమాదం అని చెబుతారు.
స్తూల కాయం అన్నది ఎవ‌రికి వారు లెక్క చూసుకోవ‌చ్చు. బ‌రువు కాస్త  ఎక్కువ‌గా ఉంటే వ్యాయామం, ఆహార జాగ్రత్తల‌తో త‌గ్గించుకోవ‌చ్చు. మ‌రీ ఎక్కవ ఉంటే మాత్రం వైద్యుల స‌ల‌హాతో స‌ర్జరీ, నాన్ స‌ర్జరీ ట్రీట్ మెంట్ లు తీసుకోవ‌చ్చు. ఇప్పుడు ఉన్న ఆధునిక టెక్నాలజీతో సుర‌క్షిత‌మైన చికిత్సను పొంది, బ‌రువు ను త‌గ్గించుకొని చ‌క్కటి శ‌రీర ఆకృతి ని పొంద‌వ‌చ్చు. 

లావు పెరిగిపోతున్నారా..! జ‌ర భ‌ద్రం

లావు పెరుగుతుంటే ఎవ‌రికైనా ఇబ్బందే. దీన్ని ముందుగానే గుర్తించక పోతే త‌ర్వాత కాలంలో స‌మ‌స్యలు త‌లెత్తుతాయి. చాలామంది స్తూల కాయం వ‌ల‌న చూప‌రుల‌కు ఇబ్బంది ఉంటుంది అని భావిస్తారు. అది మాత్రమే కాదు, ఆరోగ్య ప‌రంగా కూడా ఇబ్బందులు ఉంటాయి. స్థూల కాయుల్లో కొవ్వు పేరుకొని పోవ‌టం వ‌ల‌న రక్త ప్రస‌ర‌ణ‌, జీర్న క్రియ వంటి జీవ‌న క్రియ‌లు స‌క్రమంగా ప‌ని చేయ‌వు.

కొవ్వు పేరుకోవ‌టం వ‌ల‌న  కొలెస్టిరాల్ శాతం పెరుగుతుంది. దీని వ‌ల‌న ర‌క్తం స‌ర‌ఫ‌రా స‌క్రమంగా జ‌ర‌గ‌దు. అందాల్సిన ప్రాంతంలో ర‌క్తం స‌క్రమంగా అంద‌క పోవ‌టం వ‌ల‌న అక్కడ‌కు శ‌క్తి స‌రిగ్గా అంద‌దు. అందుకే స్థూల కాయులు కాస్త ఎక్కువ ప‌ని చేసినా, కాస్త ఎక్కువ దూరం న‌డిచినా అల‌సి పోతారు. ఆయాస ప‌డ‌తారు. ఎందుచేత‌నంటే ఆ పనుల కోసం కావాల్సిన శ‌క్తి ఉత్పత్తి కాదు. మ‌రో వైపు నాళాలు మందంగా త‌యార‌వ‌టం అన్నది స్థూల కాయుల్లో త‌లెత్తే మ‌రో స‌మ‌స్య. దీంతో ఊపిరి తీసుకోవటం కూడా క‌ష్టంగా ఉంటుంది.
స్థూల కాయుల‌కు మ‌ధుమేహం పొంచి ఉంటుంది. శ‌రీరంలో స‌క్రమంగా గ్లూకోజ్ ప్రస‌ర‌ణ లేక పోవ‌టం వ‌ల‌న దీన్ని గుర్తిస్తారు. కొ్వ్వులు పేరుకొని పోవ‌టం వ‌ల‌న క్లోమం ప‌నితీరు దెబ్బ తింటుంది. దీని కారణంగా ఇన్సులిన్ స్రావంలో స‌మ‌స్య త‌లెత్తి అంతిమంగా మ‌ధుమేహానికి గురి కావాల్సి వ‌స్తుంది. ఒక్క సారి మ‌ధుమేహం త‌లెత్తితే అది శాశ్వత స‌మ‌స్య అని తెల‌సుకోవాలి. జీవితాంతం జాగ్రత్తలు తీసుకోవ‌టం తో పాటు మందులు వాడాల్సిన అవ‌స‌రం కూడా ఏర్పడ‌వ‌చ్చు.

స్థూల కాయుల‌కు శరీర భాగాల్లో కొవ్వు పేరుకొని పోతుంది. ర‌క్త ప్రస‌ర‌ణ అన్నది చురుగ్గా జ‌ర‌గాల్సిన ప్రక్రియ‌. కానీ అన‌వ‌స‌ర‌పు పదార్థాల నిల్వలు పేరుకొని పోవ‌టం వ‌ల‌న గుండె కు సంబంధించిన ర‌క్త నాళాల్లో స‌మ‌స్య త‌లెత్తుతుంది. దీంతో ఆయా నాళాల్లో ర‌క్తపు పంపింగ్ కోసం ఒత్తిడి ఏర్పడుతుంది. ఈ ఒత్తి డి అన్ని ప్రాంతాల‌కు వ్యాపిస్తే క‌రోన‌రీ సంబంధిత స‌మ‌స్యల‌తో పాటు స్ట్రోక్ వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది.
శ‌రీర ఆకృతికి మూలంగా ఎముక‌ల‌తో కూడిన అస్థి పంజ‌ర వ్యవ‌స్థ ను చెప్పవ‌చ్చు. ఈ అస్థి పంజ‌రం త‌గిన బ‌రువును మోసేందుకు డిజైన్ చేయ‌బ‌డి ఉంటుంది. కానీ బ‌రువు అదే ప‌ని గా పెరిగిపోతుంటే మాత్రం ఈ ఎముక‌ల మీద ఒత్తిడి ఏర్పడుతుంది. అటు నాడుల ప‌ని తీరు మీద కూడా ఇబ్బంది ఏర్పడుతుంది.
ఇన్ని స‌మ‌స్యల‌కు కార‌ణ‌మైన స్థూల కాయం అన్నది చాలావ‌ర‌కు స్వయంకృతం. ఎక్కువ ఫుడ్ తీసుకోవ‌టం వ‌ల‌న ఈ స‌మ‌స్య త‌లెత్తుతుంది. అందుచేత స్థూల కాయాన్ని త‌గ్గించుకొనేందుకు ఎవ‌రికి వారు ప్రయ‌త్నించాలి. అప్పుడే పైన చెప్పిన స‌మ‌స్యలు రాకుండా జాగ్రత్త ప‌డేందుకు వీల‌వుతుంది.

మంట‌ల్ని అరిక‌ట్టలేమా..!


మంట అనే ప‌దమే కొంత విచిత్రంగా ఉంటుంది. మండే స్వభావాన్ని వ్యక్తీక‌రించే ప‌దం ఇది. ఈ ప‌దం విన‌గానే దాని స్వభావం అర్థం అయిపోతుంది.

ఈ మంట పుట్టడానికి అనేక కార‌ణాలు క‌నిపిస్తాయి. ఒకే నిర్దిష్ట కార‌ణాన్ని మ‌నం చెప్పలేం కానీ, ప్రధానంగా ఆధునిక జీవ‌న శైలిలో ఉండే ఒత్తిళ్లతో మంట పుట్టడం అన్నది కామ‌న్ గా మారింది.
శ‌రీరంలో ఆహార ప‌దార్థాలు ప్రవేశించ‌గానే జీర్ణాశ‌యంలోని గ్రంథులు ఉత్తేజితం అవుతాయి. వీటి నుంచి ఎంజైమ్ ల‌తో పాటు హైడ్రో క్లోరిక్ ఆమ్లం స్రావితం అవుతుంది. ఇది ఆహారాన్ని ఖైమ్ గా మార్చేందుకు అవ‌స‌ర‌మైన ఆమ్లత్వాన్ని క‌లిగిస్తుంది. అప్పుడు మాత్రమే ఆహారాన్ని జీర్ణం చేసే ఎంజైమ్‌లు ప‌ని చేస్తాయి. కానీ, ఆహార‌పు అల‌వాట్లు స‌క్రమంగా లేక‌పోతే స‌మ‌స్య త‌లెత్తుతుంది. ఆధునిక లైఫ్ స్టయిల్ లో ఒక టైమ్ కు తిండి తిన‌టం అన్నది మ‌రిచిపోతున్నారు. దీంతో ఏదో ఒక టైమ్ లో ఏదో ఒక ఫుడ్ తిన‌టం ఎక్కువ అయింది. దీని వ‌ల‌న ఎప్పుడు గ్రంథులు స్రవించాలో తెలీక‌, స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా ఎంజైమ్‌లు, ఆసిడ్స్ బ‌య‌ట‌కు వ‌స్తుంటాయి. కానీ, జీర్ణాశ‌యంలో త‌గినంత ఆహారం లేక‌పోతే మాత్రం ఈ ఏసిడ్ కు త‌గినంత ప‌ని ఉండ‌దు. అప్పుడు ఈ ఆమ్లం జీర్ణాశ‌య గోడ‌ల మీద‌నే ప్రభావం చూపుతుంది. సరిగ్గా ఈ కార‌ణం వ‌ల్లనే  ఈ మ‌ధ్య కాలంలో చాలామందిలో క‌డుపు మంట స‌మ‌స్యను గుర్తించ‌టం జ‌రిగింది.

దీన్ని అరిక‌ట్టాలంటే ఆహార‌పు అల‌వాట్లను నియంత్రించాలి. స‌రైన టైమ్ కు స‌రైన ఆహారం తీసుకొనేందుకు ప్రయ‌త్నించాలి. ఇందుకోసం టైమ్ షెడ్యూల్ ఫాలో అయితే మంచిది. స‌మ‌స్య తీవ్రంగా ఉంటే వైద్యుల్ని సంప్రదించాలి. ఎసిడిటీ కి విరుగుడు మందుల్ని వాడే ముందు వైద్య స‌ల‌హా తీసుకోవ‌టం మేలు.

సెల‌వుల్లో పిల్లల‌ను కంట్రోల్ చేయాల్సిందేనా...!



సెల‌వులు అంటే పిల్లల‌కు ఎంతో ఇష్టం. సెల‌వుల్లో హాయిగా ఎంజాయ్ చేయ‌వ‌చ్చు అని భావిస్తారు. ఈ మూడ్ ను పెద్దలు కూడా ప్రోత్సహిస్తుంటారు. అంత‌వ‌ర‌కు బాగానే ఉంది. కానీ, వీకెండ్స్ లో కానీ, సెల‌వుల్లో కానీ పిల్లల ఫుడ్ అల‌వాట్లు మారిపోతున్నాయి. ఇది మాత్రం ఆలోచించాల్సిన విష‌య‌మే.

ఇటీవ‌ల కాలంలో జంక్ ఫుడ్ తిన‌టం బాగా ఫ్యాష‌న్ గా మారింది. చిప్స్, బ‌ర్గర్‌, పిజ్జాలు తిన‌టం అన్నదే క్రేజ్ గా మారిపోయింది. ఒక చేత్తో ఈ ఫుడ్ తిన‌టం, మ‌రో చేత్తో కూల్ డ్రింక్ తిన‌టం స్టయిల్ గా పాటిస్తున్నారు. ఈ జంక్ ఫుడ్ వ‌ల‌న శ‌రీరానికి ఎటువంటి ఉప‌యోగంలేదు స‌రికదా.. అన‌ర్థం మాత్రం త‌ప్పదు. కొవ్వు సంబంధిత ప‌దార్థాలతో పాటు అన‌ర్థక మెటీరియ‌ల్ కూడా పోగుప‌డుతోంది. అంతిమంగా ఈ చెడు ప‌దార్థాల వ‌ల‌న వివిధ అవ‌యవాల‌ల్లో కొవ్వు పేరుకు పోతోంది. ఫ‌లితంగా శ‌రీరానికి స‌క్రమంగా అందాల్సిన శ‌క్తి అంద‌కుండా పోతుంది. ఈ ఆహారం వ‌ల‌న మంచి ఉత్పేర‌కాలు మెద‌డుకు అంద‌కుండా పోతాయి.

అందుచేత పిల్లల‌ను జంక్ ఫుడ్స్ కు దూరంగా ఉంచ‌టం పెద్దల బాధ్యత‌. ఈ విష‌యంలో పిల్లల‌కు న‌చ్చ చెప్పి ఈ అల‌వాటు మానిపించుట మేలు.

ఎటో వెళ్లిపోయింది మ‌న‌స్సు.. అక్కడే అస‌లు చిక్కు ఉంది..!



ఎటో వెళ్లిపోయింది మ‌నస్సు... ఈ ప‌దబంధం భ‌లే ఉంది క‌దా నిజంగానే మ‌న‌స్సు అనే దానికి క‌ళ్లెం ఉండ‌దు. అది ఎటు కావాలంటే అటు ప‌రిగెడుతుంటుంది.దీన్ని ఎంత ఆహ్లాదంగా ఉంచుకొంటే అంత చ‌క్కగా ప‌నులు చ‌క్కబెట్టుకోవ‌చ్చు. దీన్ని ప్రశాంతంగా ఉంచుకోవ‌టం అన్నది మ‌న చేతిలో ప‌ని.

ఈ మ‌ధ్య కాలంలో మ‌నుషుల మీద ఒత్తిడి బాగా పెరుగుతోంది. ఆధునిక జీవ‌న‌శైలి, వృత్తి ఉద్యోగాల్లో టెన్షన్ లు, ప్రయాణం వంటి ప‌నుల్లో చికాకు పెరిగి పోతున్నాయి. వాస్తవానికి ఈ విధంగా టెన్షన్ ప‌డిన‌ప్పుడ‌ల్లా శ‌రీరంలో ర్యాడిక‌ల్స్ ఉత్పత్తి అవుతాయి. ఈ రాడిక‌ల్స్ క్రమంగా నెగ‌టివ్ ప్రబావాన్ని చూపుతుంటాయి. టెన్షన్ పెరిగే కొద్దీ వీటి సంఖ్య పెరిగిపోయి మెద‌డు మీద అంటే మ‌న‌స్సు మీద ప్రభావం చూపుతుంటాయి. దీన్ని త‌ట్టుకోలేక ప‌గ‌టి పూట టీ విప‌రీతంగా తాగే వారు కొంద‌రైతే సాయంత్రానికల్లా మ‌ద్యాన్ని ఆశ్రయించే వారు మ‌రికొంద‌రు. ఈ టీలు తాగ‌టం, మ‌ద్యం  తాగ‌టం వ‌ల‌న ఏర్పడే అన‌ర్థాలు అన్నీ ఇన్నీ కావు. ఈ డ్యామేజీ కి అడ్డుక‌ట్ట వేయాలంటే టెన్సన్ ప‌డ‌టాన్ని త‌గ్గించుకోవాలి. ఇందు కోసం మ‌న‌స్సుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. అప్పుడే మ‌న‌స్సు ఎటూ వెళ్లి పోకుండా ఉంటుంది.

ఎక్కువ‌గా టీ తాగితే ఏమ‌వుతుంది..!


టీ తాగ‌టం అన్నది ఈ రోజుల్లో చాలా సాధార‌ణ‌మైన అల‌వాటు. ఇది ప‌రిమితుల్లో ఉంటే ఫ‌ర్వాలేదు. స‌రి కదా నాడీ వ్య వ‌స్థ ను ఉత్తేజ ప‌ర‌చ‌టం, ఆహ్లాదాన్ని క‌లిగించ‌టం వంటి మంచి ల‌క్షణాలు ఉన్నాయి. అయితే ఎక్కువ సార్లు టీ తాగే అల‌వాటు ఉంటే మాత్రం కాస్త ఆలోచించాల్సిందే. ఎక్కువ‌గా టీ తాగ‌టం వ‌ల‌న టీ పొడిలో ఉండే ర‌సాయ‌నాలు ఎక్కువ‌గా శ‌రీరంలో క‌లుస్తాయి. దీని వ‌ల‌న అన‌ర్థాలు త‌ప్పవు.

టీ ఆకుల్లో ఫ్లోరైడ్ ఉంటుంది. రోజుకి 10-12 సార్లు టీ తాగితే మాత్రం నాలుగు గ్రామ్ ల దాకా ఫ్లోరిన్ శ‌రీరంలోకి చేరుతుంది. సంవ‌త్స రాల త‌ర‌బ‌డి కొనసాగితే మాత్రం ఫ్లోరోసిస్ వృద్ధి చెందే అవ‌కాశం ఉంటుంది. దీంతో పాటు టీ ఆకు లో ఉండే అల్యూమినియం కూడా క్రమంగా ప్రవేశిస్తుంది. దీంతో శ‌రీరంలో విష ప్రభావం క‌నిపిస్తుంది. టీ లో స‌హ‌జంగా ఉండే ఆక్జలేట్ ల‌తో ముప్పు పొంచి ఉంది. త‌క్కువ ప‌రిణామంలో ఇవి మేలు చేస్తాయి. కానీ, ఎక్కువ‌గా తీసుకొంటే మాత్రం మూత్ర పిండాళ్లో రాళ్లు ఏర్పడుట‌కు కార‌ణ భూతం అవుతాయి.కొంత మందికి వేడి వేడి టీ ప‌దే ప‌దే తాగే అల‌వాటు ఉంటుంది. ఇటువంటి వారికి గొంతు క్యాన్సర్ మొద‌ల‌య్యే ప్రమాదం ఉంటుంది సుమా..! మ‌రి కొంత మందిలో ప్రోస్టేట్ క్యాన్సర్ కూడా రావ‌చ్చున‌ని ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి.

ఈ అన‌ర్థాలన్నీ ఒక్క సారిగే వ‌చ్చేస్తాయ‌ని కాదు కానీ ఎక్కువ మోతాదులో ప‌దే పదే టీ తాగ‌టం వ‌ల‌న త‌లెత్తే అనర్థాలు మాత్రమే. దీనికి తోడు టీ కి అల‌వాటు ప‌డితే .. ఒక్క పూట టీ తాగ లేక పోతే ఉండ‌లేని ప‌రిస్తితి ఏర్పడుతుంది. అందుచేత టీ తాగ‌టం మంచిదే కానీ, అతి స‌ర్వత్ర వ‌ర్జయేత్.

అప్పుడు ఓకే.. ఇప్పుడు రాళ్లు ఎందుకు ప‌డుతున్నట్లు..!


రాళ్లు అంటేనే నెగ‌టివ్ ప‌దం. అటువంటి రాళ్లు ఎక్కడ ఉన్నా వాటిని నెగ‌టివ్ గానే చూస్తాం.. స‌రిగ్గా ఈ సూత్రం మ‌నిషి కి వ‌ర్తిస్తుంది. ఎందుకంటే ఈ రాళ్లు చేసే కీడు అంతా ఇంతా కాదు.

మాన‌వ శ‌రీరంలో కొన్ని భాగాల్లో రాళ్లు పేరుకొనే చాన్స్ ఉంటుంది. ఆహారంలో ఆయిల్ పుడ్స్, కొవ్వు కారకాలు ఎక్కువ‌గా తీసుకొంటే వీటి వ‌ల‌న ఆయా ఉత్పన్నకాలు ఘ‌న రూపంలోకి మార‌తాయి. వీటినే మామూలు భాష‌లో రాళ్లు పేరుకొన్నాయి అంటారు. మూత్రపిండాలు, పిత్తాశ‌యం వంటి చోట్ల వీటిని మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. ఇవి శ‌రీరంలో స‌హ‌జంగా జ‌రిగే ప్రక్రియ‌ల‌కు అడ్డుగా నిలుస్తాయి. ఒక వైపు శ‌రీరం త‌న మెట‌బాలిక్ క్రియ‌ల కోసం తీవ్రంగా ప్రయ‌త్నిస్తుంటుంది. కానీ ఈ రాళ్లు వాటికి అడ్డు ప‌డుతుంటాయి. దీంతో నొప్పి జ‌నిస్తుంది. మొద‌ట్లో ఈ నొప్పి ఎందుకు వ‌స్తోందో తెలీదు. కానీ త‌ర‌చు ఈ నొప్పి వ‌స్తుంటే అప్పుడు తీవ్రత తెలుస్తుంది. చాలామంది క‌డుపులో నొప్పి అంటే ఏదో మాత్రలు వేసుకొని, ఇంటి వైద్యం చేసుకొంటూ ఉంటారు.కానీ దీన్ని నిర్లక్ష్యం చేస్తే మాత్రం స‌మ‌స్య తీవ్రం అవుతుంది. అంటే ఈ రాళ్లు పేరుకోవ‌టం మొద‌ట్లో అయితే సాధార‌ణ మందుల‌తో త‌గ్గిపోతుంది. అలా వ‌దిలేస్తే శ‌స్త్ర చికిత్స చేయాల్సి వ‌స్తుంది. ఆయిల్ ఫుడ్ త‌ర‌చు తీసుకొనే వారికి మొద‌ట్లో అంతా ఓకే అనిపిస్తుంది. కానీ త‌ర్వాత కాలంలోనే రాళ్లు ప‌డుతుంటాయి. అందుచేత ఈ ఆయిల్ ఫుడ్స్, మ‌సాలా ఆహార ప‌దార్థాల విష‌యంలో జాగ్రత్త అవ‌స‌రం.

మీ ఫుడ్డుతో మీకే ముప్పు..!


వీకెండ్ వ‌చ్చిందంటే బ‌య‌ట‌కు వెళ్లి ఫుడ్ తీసుకోవ‌టం ఈ మ‌ధ్యకాలంలో పెరిగింది. వీకెండ్ స‌మ‌యంలో ఇటువంటి అలవాట్ల లో త‌ప్పు లేదు. కానీ, ఈ ఫుడ్ లోఏమి తీసుకొంటున్నామ‌న్నది మాత్రం ముఖ్యం. ఇప్పుడు ఈ విష‌య‌మే గ‌మ‌నించ ద‌గిన విష‌యం. ఈ మ‌ధ్య కాలంలో పిల్లలు జంక్ ఫుడ్ కు అల‌వాటు ప‌డుతున్నారు.

 బ‌య‌ట‌కు వెళితే చాలు ఆయిల్ తో కూడిన ఫుడ్‌ను తీసుకొంటున్నారు. ఇందుకు త‌ల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా ఉండ‌టం దుర‌దృష్టక‌రం. పిజ్జాలు, బ‌ర్గర్లు రెగ్యుల‌ర్ గా తీసుకొంటున్నారు. ఇటువంటి జంక్ ఫుడ్ అప్పుడ‌ప్పుడు అయితే ఫ‌ర్వాలేదు కానీ క్రమం త‌ప్పకుండా తిన‌టం మాత్రం మంచిది కాదు. దీని వ‌ల్ల క‌డుపులో జీర్ణం కావటం క‌ష్టం అవుతుంది.

ప‌లితంగా క‌డుపు నొప్పి వంటి స‌మ‌స్యలు త‌లెత్తవ‌చ్చు. ఈ క‌డుపు నొప్పి ర‌క ర‌కాల మందులు వాడేస్తుంటాం కానీ, అస‌లు సంగ‌తి గుర్తించ‌టం మ‌రిచిపోతాం. ఈ జంకు ఫుడ్ ను ఆప‌గ‌లిగితే కొన్ని కేసుల్లో క‌డ‌పు నొప్పి మాయం అవుతుండ‌టం గ‌మ‌నించ‌టం జ‌రిగింది. అందుచేత జంక్ పుడ్ ను అదుపు చేయంటం చాలా ముఖ్యం అని గుర్తించాలి.

ఆడ వాళ్లకు మండిందంటే అంతే సంగ‌తులా..!

ఆడ వాళ్లకు మండిందంటే ఏమి జ‌రుగుతుంది.. అస‌లు మంట ఎందుకు వ‌స్తుంది... మంట వ‌చ్చిన‌ప్పుడు ఆడ‌వాళ్లు ఎలా ఉంటారు.. వంటి మాట‌లు చిన్నవిగా ఉంటాయి. కానీ, వీటిని అప్పటికి అలా వ‌దిలేయ‌కూడ‌దు సుమా...! ఎందుకంటే స‌మ‌స్యను అర్థం చేసుకోవాలి కానీ, స‌మ‌స్య రూపం గురించి ఆలోచించ‌కూడ‌దు. దీని వ‌ల‌న స‌మ‌స్య అంతు ప‌ట్టకుండా పోతుంది.

క‌డుపులో మంట లేక క‌డుపులో నొప్పి అనేదానికి చాలా అర్థాలు, ప‌ర‌మార్థాలు ఉంటాయి. ఆ విష‌యం ప‌ట్టించుకోకుండా మామూలు విష‌య‌మే అని ఊరుకొంటే మాత్రం ఒక్కోసారి కొంప మున‌గ‌వ‌చ్చు. మ‌హిళ‌ల‌కైనా, పురుషుల‌కైనా అప్పుడ‌ప్పుడు క‌డుపులో నొప్పి గా అనిపించ‌వ‌చ్చు. అయితే తిన్న ఆహారం జీర్ణం కాన‌ప్పుడు కాస్తంత నొప్పి అనిపించ‌వ‌చ్చు. ఇది స‌ర్వ సాధార‌ణం అయిన విష‌యం. కానీ, అన్ని నొ్ప్పులు ఈ బాప‌తు అనుకోవ‌ద్దు సుమా. వాస్తవానికి మాన‌వ జీర్ణ వ్యవ‌స్థలో అనేక భాగాలు ఉన్నాయి. ప్రాథ‌మిక ఆహార వాహిక‌లో భాగంగా జీర్ణాశ‌యం లేక క‌డుపు, ఆంత్ర మూలం, చిన్న పేగు, పెద్ద పేగు అనే భాగాల‌తో పాటు, కాలేయం, క్లోమం అనే అనుబంధ గ్రంథులు క‌నిపిస్తాయి. వీటిలో వాపు వ‌చ్చినా, ఇన్ ఫెక్షన్ సోకినా, రక్త ప్రసారానికి అంత‌రాయం ఏర్పడినా క‌డుపు నొప్పి అనిపిస్తుంది. స‌రిగ్గా జీర్ణాశయం లేక క‌డుపు ద‌గ్గరే నొప్పి వ‌స్తోందా లేక ఇత‌ర ప్రాంతాల నుంచి అటూ ఇటూ వ్యాపిస్తోందా అన్నదికూడా ముఖ్యమే. ఏదో ఒక సంద‌ర్భంలో వ‌చ్చి పోతే దాన్ని మామూలు నొప్పి గా భావించ‌వ‌చ్చు. కానీ, త‌రుచు నొప్పి వ‌స్తుండ‌టం, నొప్పి వ‌చ్చిన‌ప్పుడు ఎక్కువ సేపు ఉండ‌టం, నొప్పి తీవ్రం గా ఉండ‌టం వంటి ల‌క్షణాలు ఉన్నప్పుడు మాత్రం దీని గురించి ఆలోచించాల్సిందే.

క‌డుపు మ‌ధ్య భాగంలో నొప్పి జ‌నించి, కుడి వైపు కింది భాగంలోకి వ్యాపిస్తే ఉండుక నొప్పి గా, ఎడ‌మ‌వైపు కింది భాగంలో నొప్పి మొద‌లై కుడి వైపు కింది భాగంలోకి వ్యాపిస్తే పురీష నొప్పి అని, మధ్యలో నొప్పి మొద‌లై కుడి దిశ‌గా పైకి వ్యాపిస్తుంటే దాన్ని పిత్తాశ‌య నొప్పి అని చెబుతారు. ఈ అంచ‌నా ప్రాథ‌మిక‌మైన‌దే సుమా..! స‌రిగ్గా నిర్ధార‌ణ కావాలంటే మాత్రం డ‌యాగ్నిస్టిక్ టెస్టులు త‌ప్పనిస‌రి. వ్యాధి తీవ్రం అవుతోంద‌ని భావిస్తే మాత్రం నిపుణులైన వైద్యుల్ని సంప్రదించి చికిత్స జ‌రిపించుకోవాలి. లేని ప‌క్షంలో సమ‌స్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది. నొప్పి ఒకే క‌డుపులో వ‌స్తున్నా.. అన్ని నొప్పిలు ఒక బాప‌తు కాద‌ని గుర్తించుకోవాలి. మ‌హిళ‌ల‌కైనా, పురుషుల‌కైనా ఇన్ని ర‌కాల ఇబ్బందులు త‌ప్పవు. ( మ‌హిళ‌ల్లో మాత్రం గైనిక్ సంబంధిత స‌మ‌స్యల‌తో కొన్ని ర‌కాల నొప్పి వ‌స్తుంటుంది, అది వేరే విష‌యం) అందుచేత నొప్పి ని తేలిగ్గా తీసుకోకుండా అశ్రద్ధ చేయ‌కుండా స‌రైన స‌మ‌యంలో స‌రైన వైద్య స‌ల‌హా తీసుకోవ‌టం మేలు.

పెద్దాయ‌న‌కు పెద్ద స‌మ‌స్య వ‌చ్చి ప‌డితే...!


మాన‌వ శ‌రీరంలో అనేక గ్రంథులు ఉన్నాయి. వీటిలో దేని ప్రాధాన్యం దానిదే. కానీ అతి పెద్ద గ్రంథిగా పేరు తెచ్చుకొన్నది మాత్రం కాలేయం అని చెప్పుకోవాలి. దాదాపు కిలోన్నర బ‌రువు ఉండే ఈ గ్రంథి... అంత‌ర్గత అవ‌య‌వాల్లో పెద్దదిగా కూడా పేరు గాంచింది. శ‌రీరంలోని కుడి భాగంలో అమ‌రి ఉంటుంది. కాలేయానికి వ‌చ్చే వ్యాధుల్లో తీవ్రమైన‌దిగా కాలేయ క్యాన్సర్ ని చెబుతారు. ఇది మ‌హిళ‌ల్లో క‌న్నా పురుషుల్లోనే ఎక్కువ‌గా సోకుతున్నట్లు తెలుస్తోంది. పెద్ద వ‌య‌స్సు వారికి ఈ ముప్పు ఎక్కువ అన్నది కొంద‌రి అభిప్రాయం.

కాలేయంలోనే జ‌నించి విజృంభించే క్యాన్సర్ ను హెప‌టో సెల్యులార్ కార్సినోమా అని పిలుస్తారు. ఇత‌ర ప్రాంతాల్లో జ‌నించి, కాలేయంలో విస్తరించే క్యాన్సర్ ను మెటా స్టాటిక్ లివ‌ర్ క్యాన్సర్ అని అంటారు. స‌ర్వ సాధార‌ణంగా కాలేయంలో సిర్రోసిస్ ఏర్పడి అది ముదిరి క్యాన్సర్ గా రూపాంత‌రం చెందుతుంది.  కాలేయంలోని ఆరోగ్య క‌ణ‌జాలాన్ని తొల‌గించి అక్కడ అవాంఛ‌నీయ క‌ణ‌జాలం పేరుకొని పోతుంది. ఇది ప్రబ‌లి పోయిన‌ప్పుడు కాలేయం ప‌నితీరు దెబ్బ తింటుంది. ఈ ద‌శ‌లో దీన్ని గుర్తించి చికిత్స చేయించ‌క పోతే ముద‌రిపోయి క్యాన్సర్ గా మారే ప్రమాదం ఉంటుంది. దీనికి తోడు కామెర్లు, మ‌ద్యం అల‌వాటు వంటివి తోడ‌యితే ప్రమాదం మ‌రింత పెర‌గ‌వ‌చ్చును.
ఇందుకు అనేక కార‌ణాలు ఉన్నాయి. 1. మ‌ద్యాన్ని తాగే అల‌వాటు 2. కాలేయంలో ఆటో ఇమ్యూన్ ద‌శ త‌లెత్తటం. 3.హెప‌టైటిస్ బీ లేక హెప‌టైటిస్ సీ వైర‌స్ సోక‌టం. 4. శ‌రీరంలో ఐర‌న్ శాతం పెరిగిపోవ‌టం. కాలేయానికి క్యాన్సర్ వ‌చ్చినట్లు గుర్తించాకే వెంటనే చికిత్స చేయించాలి. నిపుణులైన జీర్ణ కోశ వ్యాధుల వైద్యుల్ని సంప్రదించాలి. వ్యాధి ఏ ద‌శ‌లో ఉందో తెలుసుకొనే ప్రయ‌త్నం చేయాలి. దీన్ని బ‌ట్టి చికిత్స ఏ స్థాయిలో అవ‌స‌ర‌మో గుర్తిస్తారు. అవ‌స‌రం అయితే కాలేయానికి కీమో థెర‌పీ, రేడియో థెర‌పీల‌తో పాటు శ‌స్త్ర చికిత్స చేయించాల్సి ఉంటుంది. కొన్ని సంద‌ర్భాల్లో సంక్లిష్ట మైన చికిత్స అవ‌స‌రం ఉంటుంది.

"ఢమరుకం" లో అంత సీన్ ఉందా..?

ఢ‌మ‌రుకం గురించి విన్నప్పుడు భ‌లే ఆశ్చర్యం వేస్తుంది. ఇంత‌టి శ‌క్తి మంత‌మైన‌దా అనిపిస్తుంది కూడా..! అస‌లు డ‌మ‌రుకం అన్న ప‌ద‌మే చ‌క్కటి ఉత్సాహ‌క‌రంగా ఉంటుంది. శ‌క్తి సామ‌ర్థ్యాల‌కు గుర్తుగా దీన్ని జ్ఞప్తికి ఉంచుకోవ‌చ్చును. ఎందుకంటే శ‌క్తినంత‌టినీ ఒక్క చోట‌కు చేర్చితే త‌ప్ప  ఢ‌మ‌రుకం ప్రజ్ఞ మ‌న‌కు అర్థం కాదు. శ‌రీరంలో కూడా ఇదే ప‌రిస్థితి క‌నిపిస్తుంది. శ‌రీరంలో డ‌మ‌రుకం అని చెప్పదగిన కాలేయానికి ఉన్న శ‌క్తి అంతా ఇంతా కాదు. ఎందుచేత‌నంటే శ‌క్తిని సంశ్లేషించి, శ‌రీర బాగాల‌కు అందించ‌టంలో ఇది చాలా ప్రధానం. ఇక్కడ నుంచి అనేక భాగాల‌కు శ‌క్తి నేరుగా అందించ‌టానికి వీల‌వుతుంది. అంతేగాకుండా నిల్వ శ‌క్తి కార‌కాల్ని కూడా రూపొందిస్తుంది. అవ‌స‌రమైన‌ప్పుడు ఒక్కసారిగా శ‌క్తి వివిధ రూపాల్లో అందించ గ‌లుగుతుంది కాబ‌ట్టే కాలేయాన్ని డ‌మ‌రుకంతో పోలుస్తారు. 

మాన‌వ శ‌రీరంలో కాలేయం ఒక ప్రధాన‌మైన గ్రంథి. ఆహారంలోని ముఖ్య ప‌దార్థాల సంశ్లేష‌ణ‌లో కీల‌క పాత్ర పోషించును. ఇది అతి బ‌రువైన గ్రంథిగా పేరు తెచ్చుకొంది. దీనికి ఉన్న మ‌రో విశేషం ఏమిటంటే.. శ‌రీరంలోప‌లి అవ‌యవాల్లో కాలేయం మాత్రం పున‌రుజ్జీవం (రీజ‌న‌రేష‌న్) పొందే శ‌క్తిని క‌లిగి ఉంటుంది. దాదాపు నాలుగో వంతు కాలేయానికి కూడా పూర్తిగా పున‌ర్ నిర్మించుకోగ‌ల స‌త్తా ఉంటుంది. కాలేయ క‌ణాలు మ‌ళ్లీ క‌ణ‌చ‌క్రం లోకి ప్రవేశించ‌టం ద్వారా ఇది సాధ్యం అవుతుంది. అందుచేత‌నే కాలేయం పాడైన‌ప్పుడు స‌రైన వైద్యుల ద‌గ్గర చికిత్స తీసుకోవాలి. అప్పుడు సక్రమ‌మైన ప‌ద్దతిలో శ‌స్త్ర చికిత్స చేయించటానికి వీల‌వుతుంది. దీని ఫ‌లితంగా కాలేయం నుంచి పూర్తి శాతం ప‌నిత‌నాన్ని ఆశించ‌గ‌లుగుతాం. శ‌రీరానికి కావ‌లిసిన శ‌క్తిని అందించ‌గ‌లుగుతుంది. డ‌మ‌రుకం మాదిరిగా ఒక్కసారిగా ప‌ని త‌నాన్ని చూప‌గలుగుతుంది. కాలేయం కు మాత్రమే ఉన్న ఈ అద్భుత శ‌క్తి గురించి తెలుసుకొంటే మాత్రం భ‌లే ఆశ్చర్యంగా ఉంటుంది క‌దా..!

రోజూ చేసే పని ఒక్క సారిగా ఆపేస్తే ఏమవుతుంది?


విన‌టానికి గ‌మ్మతుగా ఉన్నా ఈ విష‌యం ఆలోచించి తీరాల్సిందే. రోజూ అల‌వాటుగా చేసే ప‌నికి శ‌రీరం అల‌వాటు ప‌డిపోయి ఉంటుంది. అది మంచి ప‌ని అయినా, చెడ్డ ప‌ని అయినా బాడీ - ఫిక్స్ అయిపోయి ఉంటుంది. అటువంటి ప‌నిని స‌డెన్ గా వ‌దిలేస్తే శ‌రీరం అంతా వేగంగా ఆ అల‌వాటుని వ‌దిలేసుకోలేదు.

ఉదాహ‌ర‌ణ‌కు రోజూ విప‌రీతంగా మ‌ద్యం తాగే వ్యక్తి లో ఇటువంటి స‌మ‌స్య త‌లెత్తుతుంది. చాలా కాలం మ‌ద్యం తాగే వారిలో ఆల్కహాలిక్ అంత్య ఉత్పన్నాల‌కు శ‌రీరం అల‌వాటు ప‌డిపోయి ఉంటుంది. అటువంటి అంత్య ఉత్పన్నాలు ఒక్కసారిగా ఆగిపోతే శ‌రీరంలో రివ‌ర్స్ చ‌ర్యలు మొద‌ల‌వుతాయి. ఆల్కహాలిక్ అంత్య ఉత్పన్నాల‌ను పోలిన క‌ణజాలాన్ని శ‌రీరం రూపొందిస్తుంది. ఈ ప‌దార్థంతో కొత్త ర‌కం స‌మ‌స్యలు పుట్టుకొని వ‌స్తాయి. అందుచేత రోజూ విప‌రీతంగా మ‌ద్యం తాగే అల‌వాటు ఉన్న వారు ఒక్కసారిగా బ్రేక్ వేయ‌కుండా కొంచెం క్రమంగా ఈ అలవాటునుంచి బ‌య‌ట ప‌డ‌టం మంచిది. ఏది ఏమైనా ఈ అల‌వాటుని పూర్తిగా వ‌దులుకోవ‌టమే ఉత్తమం అని గుర్తుంచుకోవాలి.

మ‌ద్యం తాగే వారిలో ఉన్న మ‌రో అపోహ ఏమిటంటే త‌క్కువ మోతాదులో తాగుతున్నాను కాబ‌ట్టి పెద్దగా ప్రమాదం ఉండ‌ద‌ని వాదిస్తుంటారు. ఇది స‌రి కాదు. ఎందుచేత‌నంటే మ‌ద్యం తాగేందుకు ఇంత ప‌రిమితి ఉంది అన్న నిర్ధార‌ణ ఏమాత్రం లేదు అన‌వ‌స‌రంగా అటువంటి ప్రమాణాలు పెట్టుకోక‌పోవటం మేలు. ఎంత మోతాదులో తీసుకొన్నా జ‌ర‌గాల్సిన అన‌ర్థం జ‌రుగుతుంద‌ని గుర్తుంచుకోవాలి. పైగా అప్పుడ‌ప్పుడు తాగినా కూడా ఆల్కహాలిక్ విష ప‌దార్థాలు చెడు ప్రభావ‌మే చూపుతాయని గుర్తెర‌గాలి.

ఒక్క సారిగా పెద్ద శిక్ష సరైనదేనా..


త‌ప్పు జ‌రిగితే శిక్ష ప‌డాల్సిందే. ఈ మాట ఎవ‌రూ కాద‌న‌రు. కానీ శిక్ష దాకా వ‌చ్చే దాకా ప‌రిస్థితి తెచ్చుకోవ‌టం మాత్రం స‌రికాదు. ఇందుకు ఆరోగ్యం కూడా మిన‌హాయింపు కాదు. ఆరోగ్య విష‌యంలో కూడా ఈ అంశాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాలి.

మాన‌వ శ‌రీరంలో కాలేయం ఒక ముఖ్యమైన అవ‌యవం. జీర్ణక్రియ‌లో దోహ‌ద ప‌డ‌టంతో పాటు, ర‌క్తం పున‌ర్ నిర్మాణంలో కీల‌క పాత్ర వ‌హిస్తుంది. ప్రోటీన్ ల సంశ్లేష‌ణ‌లో ఉప‌క‌రిస్తుంది. కానీ, మ‌ద్యం తాగే అల‌వాటు ఉన్న వారిలో ఈ ముఖ్యమైన అవ‌య‌వం పాడై పోతుంది. మొద‌ట్లో ఇది కొద్ది గా మొద‌ల‌వుతుంది. రోజూ కొంచెం తాగుతున్నాం క‌దా, అప్పుడ‌ప్పుడు తాగుతున్నాం క‌దా అని కొంద‌రు భావిస్తారు. కానీ ఆల్కహాల్ శ‌రీరంలోకి ప్రవేశించాక అది అసిటాల్డిహైడ్ అనే విష ప‌దార్థ రూపంలో కి మారిపోతుంది. అటువంట‌ప్పుడు కాలేయ క‌ణాల్ని ఈ విషం నాశ‌నం చేస్తుంది. మొద‌ట్లో ఇది కొంచెంగా ప్రారంభం అవుతుంది. అటువంట‌ప్పుడే గుర్తించి చికిత్స చేయించుకోవాలి. చికిత్స తో పాటు మ‌ద్యం తాగే అల‌వాటు వెంట‌నే మానుకోవాలి. అప్పుడే మందులు స‌క్రమంగా ప‌ని చేయ‌గ‌లుగుతాయి. లేదంటే కాలేయం క‌ణాలు పాడ‌వ‌టం మొద‌లైతే, క్రమంగా కొంత భాగం కాలేయం నిర్వీర్యం కావ‌చ్చు. ఈ స్థితిని సిర్రోసిస్ అని పిలుస్తారు.ఈ ద‌శ‌కు కాలేయం చేరుకొంటే చికిత్స చాలా క‌ష్టం. శ‌స్త్ర చికిత్స మార్గాల్ని అనుస‌రించాల్సి ఉంటుంది. నిపుణులైన వైద్యులు మాత్రమే ఈ ఆప‌రేష‌న్ లు చేయ‌గ‌లుగుతారు. పరిస్థితి అంత దాకావ‌స్తే మాత్రం క‌ఠిన శిక్షగానే భావించాలి. అంత దాకా తెచ్చుకోకుండా జాగ్రత్త ప‌డ‌టం మేలు.

కొంచెం నిర్లక్ష్యం కొంప ముంచుతోందా..!


నిర్లక్ష్యం మానవ స‌హ‌జం. కానీ, ఇది హ‌ద్దు దాటితే మాత్రం అన‌ర్థం త‌ప్పదు. ముఖ్యమైన విష‌యాల్లో నిర్లక్ష్యం వ‌హిస్తే మాత్రం ఇబ్బందే. అటువంటి ముఖ్యమైన అంశాల్లో ఆరోగ్యం కూడా ఒక‌టి. ఆరోగ్య స‌మ‌స్యల‌పై నిర్లక్ష్యం వ‌హిస్తే ఇబ్బంది ప‌డ‌క త‌ప్పదు.

ఇటీవ‌ల కాలంలో మాన‌వ జీవ‌న శైలి మారిపోయింది. గ‌తంలో వ్యవ‌సాయం, వృత్తి ప‌నులు ముఖ్య ఉపాధి మార్గాలుగా ఉండేవి. అప్పట్లో శారీర‌క శ్రమ ఎక్కువ‌గా ఉండేది. ఇప్పుడు మాత్రం సీటును అతుక్కొని పని చేయాల్సిన ఉద్యోగాలే ఎక్కువ‌గా ఉపాధి మార్గాలు. న‌గ‌రాలు, ప‌ట్టణాల్లో ఎక్కువ మంది ఇటువంటి వారే క‌నిపిస్తున్నారు. ఈ త‌ర‌హా ఉద్యోగుల్లో జీర్ణక్రియకు సంబంధించిన స‌మ‌స్యలు క‌నిపిస్తున్నాయి. వాటిని వివ‌రంగా చ‌ర్చించుకోవ‌చ్చు. కానీ, ఇక్కడ ఒక స‌మ‌స్య ముఖ్యమైన‌ది. విరేచ‌నంలో ర‌క్తం ప‌డుట అప్పుడప్పుడు కొంద‌రిలో త‌లెత్తుతుంది. వాస్తవానికి జీర్ణ క్రియ లో స‌మ‌స్య త‌లెత్తితే ఏదో ఒక అవ‌యవంలో ఇబ్బంది ఏర్పడుతుంది. ఇందులో ఆహార వాహిక‌, జీర్ణాశ‌యం, ఆంత్ర మూలం, శేషాంత్రికం అనే చిన్న పేగు, పెద్ద పేగు, మ‌లాశ‌యం అనే భాగాల‌తో పాటు కాలేయం, క్లోమం అనే గ్రంథులు, పిత్తాశ‌యం, ఉండూకం అనే చిన్న పాటి సంచీ భాగాలు ఇమిడి ఉంటాయి. వీటిలో ఎక్కడైన స‌మ‌స్య ఏర్పడితే వాటికి అనుసంధానంగా ఉండే ర‌క్త కేశ నాళికలు చిట్లుతాయి. అప్పుడు ర‌క్తం ఆహార వాహిక లోకి విడుద‌ల అవుతుంది. ఈ ర‌క్తం దిగువ‌కు అంటే మ‌లం ద‌గ్గర‌కు చేరి బ‌య‌ట‌కు విస‌ర్జితం అవుతుంది.

సాధార‌ణంగా పైల్స్ స‌మస్య తో బాధ ప‌డే వారికి ఇది క‌నిపిస్తుంది. అంత మాత్రాన అన్ని స‌మ‌స్యల్నీ ఆ గాట‌న క‌ట్టేయ‌లేం.  కానీ, ర‌క్తం ప‌డ‌టానికి అనేక కార‌ణాలు ఉన్నాయి. పేగు లో అల్సర్స్ ఏర్పడ‌టం, పేగు క్యాన్సర్, జీర్ణ కోశ సంబంధిత ఇన్ ఫెక్షన్ లు వంటి కార‌ణాలు ఉంటాయి. వీటిలో ఏ కార‌ణంతో స‌మ‌స్య ఏర్పడిందో తెలుసుకొని చికిత్స చేయించుకోవాలి. లేదంటే ఈ స‌మ‌స్య ముదిరిపోయి స‌మ‌స్య తీవ్రం అవుతుంది. అందుచేత ఆరోగ్య  స‌మ‌స్యలు త‌లెత్తిన‌ప్పుడు స‌రైన వైద్యుల్ని సంప్ర దించి శాస్త్రీయ‌మైన చికిత్స తీసుకోవాలి. నిర్లక్ష్యం వ‌హిస్తే మాత్రం చేతులారా కొంప ముంచుకొన్నట్లవుతుంది.
డ‌మ‌రుకం ఎందుకు ఆగిపోతోందంటే..!
డ‌మ‌రుకం అన్న ప‌దం వింటేనే శ‌క్తి జ‌నిస్తుంది. స‌మాజంలో శ‌క్తిని జ్వలింప చేసేందుకు పూర్వకాలంలో డ‌మ‌రుకాన్ని వాడే వారు. డ‌మ‌రుకం మోగుతుంటే ఆ చుట్టుప‌క్కల అంద‌రిలో ఉత్తేజం క‌లుగుతుంది. డ‌మ‌రుకం అనేది శ‌క్తి కి కేంద్ర బిందువు అని కూడా అనుకోవ‌చ్చు.

స‌రిగ్గా శ‌రీరంలో కూడా ఇటువంటి శ‌క్తిని అందించే అవ‌య‌వం ఒక‌టి ఉంది. అదే కాలేయం. శ‌రీరంలోని అన్ని భాగాల‌కు శ‌క్తిని ప్రస‌రింప చేయ‌టంలో కాలేయం ముఖ్య పాత్ర వ‌హిస్తుంది. అటువంటి ముఖ్యమైన భాగాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఈ పాయింట్ అర్థం కావాలంటే ఎటువంటి ప‌నుల వ‌ల్ల కాలేయం చెడిపోతుందో తెలుసుకోవాలి. మ‌ద్యం కాలేయానికి ప్రధాన శ‌త్రువు. ఆల్కహాల్ తీసుకోవ‌టం వ‌ల‌న కాలేయ క‌ణాలు పాడై పోతాయి. క‌లుషిత నీటిని తాగ‌టం, సుర‌క్షితం కాని ర‌క్తాన్ని తీసుకోవటం వంటివి కూడా ఇందుకు కార‌ణం అనుకోవ‌చ్చు. వీటి వ‌ల‌న వ్యాధి కార‌క వైర‌స్ లు ఒక‌రి నుంచి ఒక‌రికి వ్యాపిస్తాయి. ఈ వైర‌స్ లు శ‌రీరంలోకి చేరాక కాలేయ క‌ణాల మీద దాడి చేస్తాయి.
కాలేయానికి జ‌రిగే అన‌ర్థాన్ని నాలుగు ద‌శ‌ల్లో చెబుతారు. కాలేయ ఇన్ ప్లమేష‌న్‌, ఫైబ్రోసిస్‌, సిర్రోసిస్‌, క్యాన్సర్‌. మొద‌టి రెండు ద‌శ‌ల్లో కాలేయం ప‌ని తీరు కొద్దిగా ఇబ్బందిక‌రంగా మారుతుంది. అటువంట‌ప్పుడు మందుల‌తో చికిత్స చేయ‌టం సాధ్యం అవుతుంది. కానీ సిర్రోసిస్ ద‌శ‌కు, క్యాన్సర్ ద‌శ‌కు చేరితే మాత్రం కాలేయం రూపం మారిపోతుంది.ఇటువంటి ద‌శ‌లో మందుల క‌న్నా కీమో థెర‌పీ, రేడియో థెర‌పీ వంటి చికిత్స  ల‌తో పాటు శ‌స్త్ర చికిత్స అవస‌రం అవుతుంది. వ్యాధి ముదిరిపోతే కాలేయాన్ని మార్చాల్సి ఉంటుంది. (దీని వివ‌రాలు త‌ర్వాత పోస్ట్ లో చూద్దాం..)రోగం ముద‌ర‌క ముందే నిపుణులైన వైద్యుల్ని సంప్రదిస్తే ప్రమాద తీవ్రత‌ను తగ్గించుకోవ‌చ్చు. ఇటువంటి జాగ్రత్తలు తీసుకొంటే శ‌రీరంలో డ‌మ‌రుకం అన‌ద‌గ్గ ప‌వ‌ర్ హౌస్ కాలేయాన్ని ఆగ‌కుండా ప‌ని చేయించుకోవ‌చ్చు.

" బ‌స్ స్టాప్ " లో అలా చూపించ‌టం స‌రైన‌దేనా..!


ఇప్పుడు చ‌ర్చ బ‌స్ స్టాప్ వైపు మ‌ళ్లింది. బ‌స్ స్టాప్ అంటే అంద‌రికీ తెలిసిందే. బ‌స్ లు అక్కడ ఆగుతాయి కాబ‌ట్టి వాటిలో ప్రయాణం చేయ‌ద‌ల‌చుకొన్న వారు అక్కడ వేచి ఉంటారు. అందుచేత బ‌స్ స్టాప్ అంటే జ‌నం కొంత సేపు వేచి ఉండే ప్రదేశం గా రూఢి అయింది. అటువంటి చోట ఎటువంటివి చూపించాలి అనేదానిపై వివాదం ఉండ‌వ‌చ్చు గాక‌, కానీ ఇప్పుడు ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌టం పై ప్రచారం చేయ‌టం స‌రైన‌దే అనుకోవాలి.

ఈమ‌ధ్య వ్యక్తిగ‌త శుభ్రత మీద ప్రచారం జ‌రుగుతోంది. ముఖ్యంగా చేతులు శుభ్రం చేసుకోవ‌టం మీద అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ప్రయ‌త్నిస్తున్నారు. హ్యాండ్స్ వాష్ అన్నది ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రచారాంశం. భోజ‌నం చేసే ముందు, టాయ్ లెట్ కి వెళ్లి వ‌చ్చాక ముఖ్యంగా చేతులు శుభ్రం చేసుకోవ‌టం ముఖ్యం. గోరువెచ్చని నీటితో స‌బ్బు ఉప‌యోగించి చేతులు శుభ్రం చేసుకోవాలి. దీని వల్ల వేలాది క్రిముల్ని నివారించిన వాళ్లం అవుతాం. చాలా వ‌ర‌కు జీర్ణ కోశ వ్యాధులు ఈ రూపంలో ప్రవేశిస్తాయ‌ని తెలుస్తోంది. హెప‌టైటిస్ ఏ, ఈ వంటి ర‌కాల వ్యాప్తికి ఇటువంటి క్రిములే కార‌ణం అవుతాయి. అంటు వ్యాధుల నివార‌ణ‌లో ఈ శుభ్రత చాలా ముఖ్యం.

ఇంత ముఖ్యమైన అంశాన్ని బ‌స్ స్టాప్ ల్లో హోర్డింగ్ లు, పోస్టర్ ల రూపంలో ప్రచారం చేయ‌టం మంచిదే. ఇటువంటి ప్రచారం వ‌ల్ల ప్రజ‌ల‌కు అనేక విష‌యాలు తెలిసి వ‌స్తాయి. అందుచేత బ‌స్ స్టాప్ లో అలా చూపించ‌టం స‌రైన‌దే అనుకోవ‌చ్చు.

నాటు రూటు ఎంత వ‌ర‌కు సేఫ్‌..!


ఆలోచించండి.. నాటు మార్గంలో వెళితే ఎంత వ‌ర‌కు సుర‌క్షితం. ఎవ‌రో ఏదో చెప్పార‌ని న‌మ్మేసి ముందుకు వెళ్లిపోతే, ఫ‌లితం ఆశాజ‌న‌కంగా ఉండ‌దు. ఒక్కోసారి ఇది విక‌టించే అవ‌కాశం ఉంటుంది. దీనికి ఎన్నో ఉదాహ‌ర‌ణ‌లు క‌నిపిస్తాయి. కామెర్లు విష‌య‌మే తీసుకొంటే.. కామెర్లకు ఎన్నో కార‌ణాలు ఉంటాయి. ఆ విష‌యం తెలుసుకోకుండా కేవ‌లం చెట్టు మందు తింటేనో, నాటు మందు తీసుకొంటేనో త‌గ్గిపోతుంది అనుకొంటే .. అంత‌కు మించిన భ్రమ మ‌రొక‌టి ఉండ‌దు.

కామెర్లు అనేది నాలుగైదు ర‌కాల వైర‌స్ ల వ‌చ్చే వ్యాధి. ఇందులో కొన్ని ప్రమాద‌క‌రం కాగా, మ‌రి కొన్ని అంత ప్రమాదం లేనివి ఉంటాయి. ఏవి ప్రమాద క‌రం అనేది స‌రైన డ‌యాగ్నస్టిక్ ప‌రీక్షల ద్వారానే తేలుతుంది. హెప‌టైటిస్ ఏ, ఈ వంటి వ్యాధులు అంత ప్రమాదం కాద‌నే చెప్పుకోవ‌చ్చు. 70 శాతం దాకా కామెర్లు ఈ ర‌కానికి చెందిన‌వే ఉంటాయి. చాలా సార్లు ఈ ర‌క‌పు కామెర్లు మందులు ఏమీ తీసుకోకుండానే త‌గ్గిపోతాయి. శ‌రీరానికి స‌హ‌జంగా ఉండే వ్యాధి నిరోధ‌క శ‌క్తితో ఈ కామెర్లు దూరం అవుతాయి. అటువంట‌ప్పుడు ఎవ‌రైనా చెట్టు మందు లేక నాటు మందు లేక ప‌స‌ర మందు తీసుకొన్నార‌నుకొందాం. అప్పుడు స‌హ‌జంగానే కామెర్లు త‌గ్గిపోతాయి, తీరాచూస్తే ఈ ర‌క‌పు మందుతో వ్యాధి నివార‌ణ అయిపోయింద‌ని భావిస్తారు. అస‌లు విష‌యం ఏమిటంటే శ‌రీర ధ‌ర్మం తోటే ఆ వ్యాధులు త‌గ్గిపోయాయ‌న్న మాట‌.

అస‌లు ముప్పు మాత్రం హెప‌టైటిస్ బీ, సీ వంటి రకాల‌తో పొంచి ఉంటుంది. ఈ ర‌క‌పు కామెర్లు సోకిన‌ప్పుడు క‌చ్చితంగా వ్యాధి నిర్దార‌ణ ప‌రీక్షలు చేయించుకోవాలి. ఆ త‌ర్వాత నిపుణులైన వైద్యుల్ని సంప్రదించాలి. సుశిక్షితులైన డాక్టర్ చేత వైద్యం చేయించుకోవాలి. స‌రైన మందులు తీసుకొంటేనే వ్యాధి నివార‌ణ అవుతుంది. ఇందుకు బ‌దులు నాటు వైద్యాన్ని ఆశ్రయిస్తే... రోగం ముదిరిపోతుంది. అప్పుడు అస‌లు డాక్టర్ ను సంప్రదిస్తే మాత్రం ఎవ‌రూ ఏమీ చేయ‌లేని పరిస్థితి ఉంటుంది. కొన్ని సార్లు ముదిరిపోయి రోగి చ‌నిపోయే ప‌రిస్థితి కూడా ఏర్పడుతుంది. అందుచేత ఎవ‌రో చెప్పార‌ని చెప్పి నాటు వైద్యాన్ని ఆశ్రయిస్తే మాత్రం ఫ‌లితం విక‌టిస్తుంటుంది.

శ‌ని, ఆది వారాల్లో ఎందుకు రెచ్చిపోతున్నారు.. ఈ సంగ‌తి గుర్తించుకొంటే మేలు..!

శ‌ని, ఆది వారాలు వ‌చ్చాయంటే ఉద్యోగుల‌కు ఊర‌ట అనుకోవ‌చ్చు. వారం మొత్తం క‌ష్టప‌డి ప‌నిచేస్తే వీకెండ్స్ లో హాయిగా గ‌డ‌ప‌టం అన్నది పాశ్యాత్య దేశాల నుంచి దిగుమ‌తి అయిన అల‌వాటు. అంత వ‌ర‌కు బాగానే ఉంది కానీ, హాయిగా గ‌డ‌ప‌టం ఎలా అన్న చోటే అస‌లు చిక్కంతా..! విదేశాల్లో చ‌లి ఎక్కువ‌గా ఉంటుంది కాబ‌ట్టి అక్కడి అల‌వాట్లు అక్కడివి. వాటిని మ‌నం అనుక‌రించాల్సిన అవ‌స‌రం లేదు. ఇటీవ‌ల ఒక అద్యయ‌నం ప్రకారం మ‌న రాష్ట్రంలో శ‌ని, ఆది వారాల్లో మ‌ద్యం విప‌రీతంగా అమ్ముడ‌వుతోంద‌ని తెలిసింది. వీకెండ్ పేరుతో మ‌న ప్రజానీకం పీపాల కొద్దీ తాగేస్తోంద‌న్న మాట‌. మ‌ద్యం తో వ‌చ్చే అన‌ర్థాల గురించి తెలుసుకొంటే భ‌లే విష‌యాలు బ‌య‌ట ప‌డ‌తాయి. నోటిలో మ‌ద్యం ప్రవేశించిన చోట నుంచి అంతిమంగా ప‌దార్థాలు బ‌య‌ట‌కు వెళ్లే దాకా న‌ష్టం చేస్తూనే ఉంటుంది.

1.మ‌ద్య తాగ‌టం మొద‌లెట్టగానే విష ప‌దార్థాలు నోరంతా వ్యాపిస్తాయి. ఫలితంగా నోటి క్యాన్సర్ కు దారి తీయ‌వ‌చ్చు. పొగ తాగే అల‌వాటు త‌ర్వాత ఎక్కువ నోటి క్యాన్సర్ మ‌ద్యం తో వ‌స్తుంద‌ని తేలింది. ఒక వేళ ఈ రెండు అల‌వాట్లు ఉంటే మాత్రం నోటి క్యాన్సర్ అవ‌కాశాలు బాగా విప‌రీతం అనుకోవ‌చ్చు. కొంత‌మందిలో చిగుళ్ల స‌మ‌స్యల‌కు దారి తీయ‌వ‌చ్చు.
2. గొంతు నొప్పి... మ‌ద్యం గొంతు లో ప్రవేశించాక స్వర పేటిక ద్వారా లోప‌ల‌కు వెళుతుంది. ఆ స‌మ‌యంలో ఆక్కడ ఉండే స్రావాల మీద ప్రభావం చూపుతుంది. కొన్ని సార్లు శ్వాస నాళాల్ని కూడా ఇబ్బంది పెట్టవ‌చ్చు.
3. క‌డుపులోకి మ‌ద్యం దిగాక అది అక్కడ కొంత సేపు ఉంటుంది. దీని వ‌ల్ల జీర్ణాశ‌యానికి లోప‌ల ఉండే స్రావ‌కాల పొర ను దెబ్బ తీయ‌వ‌చ్చు. దీంతో గ్యాస్ట్రిటిస్ అనే స‌మ‌స్య త‌లెత్తవ‌చ్చు.
4. కొన్ని అధ్యయ‌నాల ప్రకారం క‌డుపు క్యాన్సర్, ప్రేగు క్యాన్సర్  కు మ‌ద్యపానం ఒక కార‌ణం అని చెబుతారు.

5. మ‌ద్యం క‌డుపులో ఉండ‌టం తో ఆక‌లి మీద ప్రభావం చూపుతుంది. దీంతో అన్ని ర‌కాల పోష‌కాల్ని తీసుకోవ‌టం త‌గ్గిపోతుంది. ఇది అంతిమంగా అనారోగ్యానికి దారి తీస్తుంది.
6. జీర్ణ వ్యవ‌స్థకు అనుబంధంగా ఉండే కాలేయం, క్లోమం మీద మ‌ద్యం విప‌రీత‌మైన దుష్ప్రభావాలు చూపుతుంది. ఈ వివ‌రాలు చ‌ర్చించాం.
7. కొన్ని విష పదార్ధాలు పేగుల ద్వారా శ‌రీర భాగాల‌కు చేరే అవ‌కాశం ఏర్పడుతుంది. దీన్ని సాంకేతికంగా లీకీ గ‌ట్ సిండ్రోమ్ అంటారు. దీంతో తీవ్ర అనారోగ్యం ఏర్పడ‌వ‌చ్చు.
8. మ‌ద్యం తాగ‌టంతో విరోచ‌నాలు, వాంతులు వంటి సాధార‌ణ అనారోగ్యం తలెత్తవ‌చ్చు.
   మ‌ద్యం తాగే అల‌వాటు తో నాడీ వ్యవ‌స్థ లో ఇబ్బంది ఏర్పడి ప్రవ‌ర్తన మారిపోతుంద‌న్న సంగ‌తి తెలిసిందే. దీని వ‌ల్ల త‌లెత్తే ఇబ్బందులు తెలిసిన‌వే. ఇన్ని స‌మ‌స్యలు ఉన్నాయి కాబ‌ట్టే మ‌ద్యం తాగేందుకు పూర్తిగా దూరంగా ఉండ‌టం మేలు. వీక్ డేస్, వీకెండ్ అన్న తేడా లేకుండా పూర్తిగా దూరం పెట్టడ‌మే ఉత్తమం.

అదే అల‌వాటు ఇప్పుడు కొంప ముంచుతోందా..!

అల‌వాటు అనేది మొద‌ల‌వ్వాలే కానీ, త‌ర్వాత కాలంలో దాన్ని వ‌ద‌లుకోవ‌టం క‌ష్టమే. అల‌వాట్లు అంటే రెండు ర‌కాలు. మంచి ప‌నులు చేయ‌టం ఒక ర‌కం అయితే, చెడు ప‌నుల బాట ప‌ట్టడం మ‌రో ర‌కం. మొద‌టి కేట‌గిరీ తో స‌మ‌స్యలేదు కానీ, రెండో కేట‌గిరీ తో మాత్రం ఇబ్బంది త‌ప్పదు. చెడు అల‌వాట్లు అంటే పొగ తాగ‌టం, మ‌ద్యం తాగ‌టం, గుట్కా వంటి అల‌వాట్లుగా అంతా చెబుతారు. ఇందులో మ‌ద్యం తాగే అల‌వాటు తో వ‌చ్చే అన‌ర్థాలు గ‌త పోస్ట్ లో చూశాం. ముఖ్యంగా కాలేయానికి వ‌చ్చే అన‌ర్థం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

కాలేయం అంటే శ‌రీరంలోని అత్యంత ప్రధాన‌మైన అవ‌య‌వాల్లో ఒక‌టి. ఆహారం జీర్ణం కావ‌టంలో, ర‌క్త ప్రస‌ర‌ణ ప్రక్రియలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. మ‌ద్యం అతిగా సేవించ‌టం తో పాటు, రోజు క్రమం త‌ప్పకుండా మ‌ద్యం తాగ‌టం వ‌ల్ల అనేక అన‌ర్థాలు ఏర్పడుతాయి. మ‌ద్యం తాగ‌టం వ‌ల్ల కొన్ని రాడిక‌ల్స్ త‌యారుఅవుతాయి. ఇవి నేరుగా కాలేయ క‌ణాలు నాశ‌నం చేసి చెడు క‌లిగిస్తాయి. ఈ చెడు ప్రభావాన్ని మూడు ర‌కాలుగా గుర్తించ‌వ‌చ్చు. 1. ఫాటీ క‌ణాలు రూపుదిద్దుకోవటం.. కాలేయం లో కొవ్వుల సంశ్లేష‌ణ నిలిచి పోతుంది. మ‌ద్యం తాగే అల‌వాటుతో కొవ్వు సంబంధిత ప‌దార్థాలు పేరుకుపోయి కాలేయం ప‌ని తీరు లో ఇబ్బంది ఏర్పడుతుంది. దీంతో కాలేయం ఉనికిని కోల్పోతుంది.
2. ఆల్కహాలిక్ హెప‌టైటిస్.. కామెర్లు అనే సాధార‌ణ ప‌దంతో పిల్చుకొన్నప్పటికీ.. మ‌ద్యం తాగే వారికి తలెత్తే కామెర్లు ప్రమాద‌క‌ర‌మైన‌వి. కాలేయం నుంచి విడుద‌ల అయ్యే స్రావ‌కాల ఉత్పత్తి త‌గ్గి పోతుంది. దీంతో కాలేయ విధులు నిలిచిపోతాయి. ఫ‌లితంగా విష ప‌దార్థాలు పేరుకొనే అవ‌కాశం ఉంది.
3. సిర్రోసిస్.. కాలేయం లో అన‌ర్థ కార‌క ప‌దార్థాలు పేరుకొన్నప్పుడు కాలేయ‌వాహిక మూసుకొని పోయే ప‌రిస్థితి ఏర్పడుతుంది. దీంతో సిర్రోసిస్ రూపం దాలుస్తుంది. ఒక్క మాట‌లో చెప్పాలంటే కాలేయం క్రమంగా ప‌ని చేయ‌ని స్థితికి చేరిపోతుంది. అంతిమంగా కాలేయం చెడిపోయింది అని చెప్పాల్సి వ‌స్తుంది.

మొద‌ట‌గా ఫాటీ క‌ణాలు రూపు దిద్దుకొని, త‌ర్వాత కామెర్ల లోకి మారి, చివ‌రగా సిర్రోసిస్ రూపం దాల్చ వ‌చ్చు. ఏ క్రమంలో జ‌రిగినా ఫ‌లితం మాత్రం విషాదాంతం అనుకోవ‌చ్చు. వాస్తవానికి మ‌ద్యం లో ఉండే ఆల్కహాల్ ప‌దార్ధం ఆక్సీక‌ర‌ణ ప్రక్రియ ద్వారా అసిటాల్డిహైడ్ అనే ప‌దార్థంగా మారుస్తుంది. ఇది శ‌రీరంలో విష ప్రభావం చూపే కెమిక‌ల్‌. అందుచేత ఆల్కహాల్ ఎంత మోతాదు లో తీసుకొన్నా కానీ చేటు త‌ప్పద‌ని గుర్తుంచుకోవాలి. ఈ అల‌వాటు ఎప్పటికైనా కొంప ముంచుతుంద‌ని తెలుసుకోవాలి.

అస‌లు ఆ చిత్రానికి అంత సీనుందా..!

స‌మాజంలోచిత్రం భ‌లే ప్రభావం చూపుతుంది. ఎందుకంటే దృశ్య మాధ్యమం చాలా ప్రభావం శీలి. అటువంట‌ప్పుడు ఒక చిత్రం ద్వారా ఎన్నో విష‌యాల్ని పంపించ‌వ‌చ్చు. ఆ చిత్రాన్ని ఉప‌యోగించుకొనే తీరులోనే ఎంతో గ‌మ్మతు ఉంది. దాన్ని అర్థం చేసుకొంటే భ‌లే విష‌యాలు బోధ ప‌డ‌తాయి. ఇంత‌కీ ఈ చిత్రాన్ని చూస్తే మీకు అంతా అర్థం అవుతుంది.

ఇటీవ‌ల కాలంలో పాశ్చాత్య దేశాల్లో ఈ చిత్రం బాగా ప్రాచుర్యం పొందింది. మ‌ద్యం తాగ‌టం వ‌ల్ల వ‌చ్చే అన‌ర్థాల్ని ఒక్క చిత్రం ద్వారా చెప్పే ప్రయ‌త్నం ఇది. జాగ్రత్తగా గ‌మ‌నిస్తే...  డ‌జ‌నుకి పైగా శ‌రీరావ‌యవాలు మ‌ద్యం కార‌ణంగా ఎఫెక్ట్ అవుతాయి. తాగుడు ఎక్కువైతే మెద‌డు మొద్దుబారుతుంది. అక్కడ స‌రైన నిర్ణయాలు లేకుండా పోతాయి. కంటి చూపుకి కూడా ఇబ్బంది త‌ప్పదు. మాట త‌డ‌బాటుతో మ‌ద్యం అలవాటు బ‌య‌ట‌కు పొక్కుతుంది. ఇదంతా జ‌న‌ర‌ల్ గా జ‌రిగిపోయేవి. కానీ గొంతు, శ్వాస నాళాల్లో ఇన్ ఫెక్షన్ సోకుతుంది. దీంతో వ్యాధి తీవ్రత పెరుగుతుంది. ర‌క్తంలో విష‌తుల్యత పెరిగి గుండె మీద ప్రభావం చూపుతుంది. క‌డుపులో అల్సర్ లు ఏర్పడుతాయి. శ‌రీరంలోని ప్రధాన‌మైన అవ‌య‌వంగా చెప్పుకొనే కాలేయం లో అనేక అన‌ర్థాలు ఏర్పడుతాయి.(మ‌ద్యంతో కాలేయం లో ఏర్పడే అన‌ర్ధాల్ని వేరే పోస్ట్ లో చూద్దాం.) కండ‌రాల బ‌ల‌హీన‌త, ఎముక‌ల్లో ఆస్టియోపోరోసిస్ వంటి దుష్ఫలితాలు క‌నిపిస్తాయి. జీర్ణనాళాల్లో అల్సర్స్, క్యాన్సర్ ఏర్పడ‌వ‌చ్చు. వంధ్యత్వానికి కూడా దారితీయ‌వ‌చ్చని తాజా ఫ‌లితాలు చెబుతున్నాయి.

ఇన్ని చెడు ఫ‌లితాలు క‌లిగించే మ‌ద్యాన్ని తాగ‌టం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అనేది ఎవ‌రికి వారు నిర్ణయించుకోవాలి. మ‌ద్యపానానికి దూరంగా ఉంటే అన్ని అవ‌య‌వాలకు మంచిది. లేదంటే అన్ని భాగాల‌కు అన‌ర్థమే. ఇన్ని విషయాల్ని ఒక్క చిత్రం లో చూపించ‌టం గొప్పత‌న‌మే క‌దా. అందుచేత ఈ చిత్రానికి అంత సీన్ ఉందా అన్న అప‌న‌మ్మక‌మే అవ‌స‌రం లేదు. ఇది నిజంగానే వండ‌ర్‌ఫుల్ చిత్రం..!

స‌రిగ్గా ఇక్కడే మోస‌పోతారు... జాగ్రత్త!


మోసం చేయ‌టం ఎదుటి వారి టాలంట్ మీద ఆధార ప‌డి ఉంటుంది.కానీ, మోస పోవటం మాత్రం మ‌న చేత‌కానిత‌నం మీద ఆధార‌ప‌డి ఉంటుంది. చాలా సార్లు ఇది రుజువైన వాస్తవం. ఇక‌, మ‌న పాయింట్ కు వ‌స్తే.. ఇటీవ‌ల కాలంలో బ‌య‌ట‌కు వెళ్లి ఫుడ్ తిన‌టం కామ‌న్ గా మారింది. వీకెండ్స్ లో కానీ, ప్రత్యేక సంద‌ర్భాల్లో కానీ కుటుంబంతో క‌లిసి హోట‌ల్ కు వెళ్తుంటాం. బ‌య‌ట న‌గ‌రాల‌కు వెళ్లిన‌ప్పుడు త‌ప్పనిస‌రిగా బ‌య‌ట ఫుడ్ మీద ఆధార‌ప‌డాల్సి వ‌స్తుంది. ఇటువంట‌ప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిందే.

చాలా సంద‌ర్భాల్లో డాబుగా, అందంగా తీర్చిదిద్దిన డైనింగ్ రూమ్ ఉన్న హోట‌ల్ ను ప్రిఫ‌ర్ చేస్తాం. టిక్ టాప్ గా త‌యారైన వెయిట‌ర్లు, లైటింగ్ కాంతుల‌తో మెరిసిపోయే టేబుల్స్ ఉంటే సంతోషిస్తాం. కానీ, అంత‌కన్నా ముఖ్యంగా చూడ‌వ‌ల‌సిన‌ది ఒక‌టి ఉంది. అదేమిటంటే కిచెన్ రూమ్ ప‌రిస్థితి. న‌గ‌రాల్లో వంట‌గ‌దిని చూసే అవ‌కాశం హోట‌ల్ యాజ‌మాన్యం ఇవ్వనే ఇవ్వదు. అనేక ప్రముఖ హోట‌ల్స్ సైతం డైనింగ్ రూమ్ ను బ్రహ్మాండంగా అలంక‌రిస్తాయి త‌ప్పితే, వంట గ‌ది ని చాలా అధ్వానంగా ఉంచుతాయి. ఏదో నూటికి ఒక్కసారి వెళ్లేప్పుడు సంగ‌తి కానీ, పొరుగూరిలో పరిస్థితి కానీ.. ప‌క్కన పెడితే సొంత ఊర్లో రెగ్యుల‌ర్ గా వెళ్లేప్పుడు మాత్రం ఈ విష‌యాన్ని త‌ప్పనిస‌రిగా చెక్ చూసుకోవాలి. అప‌రిశుభ్ర ప‌రిస్థితుల్లో వంట చేసిన‌ప్పుడు ఆ ఆహారంలో సూక్ష్మ క్రిములు క‌లిసి పోతాయి. వీటిని తీసుకొన్నప్పుడు కొన్నిసార్లు వెంట‌నే ప్రభావం చూపుతాయి. మ‌రికొన్ని సార్లు ఈ ఫుడ్ లోప‌ల దాగి ఉన్న క్రిములు కాస్త రెస్ట్ తీసుకొని ఆ త‌ర్వాత విజృంభిస్తాయి. అంతిమంగా అనారోగ్యం పాల‌వ్వాల్సి ఉంటుంది.

జ‌న‌ర‌ల్ గా ఫుడ్ ఆర్డర్ చేసేట‌ప్పుడు వెయిట‌ర్ ఒపీనియ‌న్ తీసుకొన‌టం అల‌వాటు. చాలాసార్లు అక్కడ రెడీగా ఫుడ్ ను వెయిట‌ర్ చెప్పేస్తుంటారు. దాన్ని ఫాలో అవ‌కుండా మ‌నం ఏది తిన‌ద‌ల‌చుకొన్నామో ఆలోచించుకొని ఆర్డర్ చేయ‌టం మేలు. మ‌నం ఏది ఇష్ట ప‌డ‌తామో, అంత‌కు మించి ప‌రిశుభ్రంగా ఉండే ఆహారం ఏమిటో వెద‌క్కొని ఫుడ్ తీసుకోవటం మేలు. అప్పుడే ఎదుటివారి చేతిలోమోస‌పోకుండా ఉండ‌గ‌లుగుతాం.

అవార్డు ఎలా ద‌క్కిన‌ట్లు..! స‌మ‌ర్థించుకొనే కార‌ణాలు క‌రెక్టేనా..!


స‌డెన్ గా ఈ అవార్డుల హ‌డావుడి ఏమిటి.. అన్న ప్రశ్న రావ‌చ్చు. కానీ, ఈ విష‌యాన్ని అంత‌టితో వ‌దిలేయ‌ట‌మూ స‌రి కాదు. ఎందుచేత‌నంటే అవార్డులు అంటే ప్రోత్సాహ‌కాలు అని అంతా భావిస్తారు. అటువంట‌ప్పుడు అవార్డులు ద‌క్కిన సంద‌ర్భాన్ని, స‌హేతుక కార‌ణాన్ని అంతా తెలుసుకోవ‌టం మేలు. అప్పుడే అవార్డుల గురించి పూర్తిగా వివ‌ర‌ణ ల‌భిస్తుంది..
మ‌ద్యం తాగ‌టాన్ని ఇప్పటి త‌రం చాలా కామ‌న్‌గా తీసుకొంటున్నారు. దీన్నిస‌మ‌ర్థించుకొనేందుకు కొన్ని కార‌ణాలు రెడీ గా ఉంచుకొంటారు. ఇప్పుడు ఆ కార‌ణాలు చూద్దాం.

1. త‌క్కువ మోతాదులో తీసుకొంటే ఏమీ కాదు.. ఇది స‌రైన‌ది కాదు. త‌క్కువ అనే దానికి కొల‌బ‌ద్ద లేదు. శ‌రీరానికి మ‌ద్యం తాగ‌టం అల‌వాటైతే దానికి క‌ళ్లెం వేయ‌టం క‌ష్టం అవుతుంది. కొద్ది గా తాగ‌టం మొద‌లెట్టి త‌ర్వాత విజృంభించిన వారు ఉన్నారు.
2. తండ్రి, తాత‌లు బాగా తాగేవారు, వాళ్లకు ఏమీ కాలేదు కాబ‌ట్టి మాకూ ఏమీ కాద‌నే వాద‌న‌.. ఇందులో నిజం లేదు. ఎందుకంటే శ‌రీరంలో మ‌ద్యం ప్రవేశించాక జ‌ర‌గాల్సిన అన‌ర్థం జ‌రుగుతునే ఉంటుంది. బ‌హుశా పెద్దల్లో వారి శారీర‌క ప‌టిష్టత రీత్యా అన‌ర్థాలు బ‌య‌ట ప‌డి ఉండ‌క పోవ‌చ్చు కానీ ఇబ్బందులు మాత్రం త‌ప్పదు. ఆల్కహాలిక్ డీ హైడ్రోజినేజ్ ఎంజైమ్‌ల స్రావ‌కం తో పెద్దగా అనర్థం లేకుండా ఉండ‌వ‌చ్చు.
3. వైన్ తాగితే మేలు.. మ‌ద్యం ఏ రూపంలో తీసుకొన్నా అన‌ర్థమే. వైన్ తాగ‌టం తో కొన్ని మార్గాల్లో లాభ‌సాటి కావచ్చు. కానీ, మొత్తంగా ఆలోచిస్తే మాత్రం శ‌రీరానికి స‌మ‌స్యలు త‌ప్పవు.
4. వీకెండ్ పార్టీల్లోనే తాగుతుంటాం.. ఇది కూడా స‌రైన వాద‌న కాదు. వీకెండ్ ఫార్టీలు, వీక్ డెస్ సిట్టింగ్‌లు అన్నవి మన ఆలోచ‌న‌ల‌కు తెలిసిన‌వి. కానీ శ‌రీరం అనేది ఒక బ‌యో కెమిక‌ల్ స‌మ్మేళ‌నం. దీనికి ఈ వాద‌న‌లు అప్లయ్ కావు. మ‌ద్యం ఎప్పుడు తీసుకొన్నా డామేజీ జ‌రిగిపోతుంది.
ఇన్ని కార‌ణాలు చూసిన త‌ర్వాత మ‌ద్యం తాగ‌టానికి పూర్తిగా దూరంగా ఉండ‌టం ఒక్కటే స‌రైన విధానం అన్న సంగ‌తి అర్థం అవుతుంది. స‌మ‌ర్థించుకొనే కార‌ణాలు ఎలా ఉన్నా... అంతిమంగా ఆలోచించాల్సిన సూత్రం అదే. మ‌ద్యానికి దూరంగా ఉంటే కుటుంబ స‌భ్యుల మ‌న్నన‌లు పొంద‌వ‌చ్చు. కుటుంబ స‌భ్యుల మ‌న్నన‌ల్ని మించిన అవార్డు ఉంటుందా...!

పిల్లలు చూడ‌కూడ‌ని చిత్రం..!


ఇల్లు.. ఇల్లాలు... పిల్లలు.. ఇదే క‌దా కుటుంబం అంటే. అన్ని విష‌యాలు కుటుంబ స‌భ్యుల‌తో చ‌ర్చించ‌టం అన్నది మంచి అల‌వాటు. అయితే పిల్లలు ఉన్నఇంట్లో మాత్రం కొన్ని విష‌యాల్లో జాగ్రత్త తీసుకోవాలి. మంచి విష‌యాలు పిల్లల ముందు చ‌ర్చించ‌టం వ‌ర‌కు ఫ‌ర్వాలేదు కానీ, చెడు అంశాల్ని మాత్రం దూరం పెట్టడ‌మే మేలు.

ఉదాహ‌ర‌ణ‌కు సిగ‌రెట్ తాగ‌టం, పాన్ న‌మ‌ల‌టం, మ‌ద్యం తాగ‌టం వంటి అలవాట్లు ఉన్నవారు ఈ సంగ‌తి గుర్తు పెట్టుకోవాలి. ఏమ‌వుతుందిలే అన్న నిర్లక్ష్యం, అడిగే వాళ్లెవ‌రు అన్న అహంకారం, నా అల‌వాట్లు.. నా ఇష్టం...వంటి ఆలోచ‌న‌ల‌తో కొంద‌రు ఇంట్లోనే ఈ ప‌నులు కానిస్తుంటారు. దీని వ‌ల్ల పిల్లల‌పై వీటి ప్రభావం ఉంటుంది. తండ్రి సిగ‌రెట్ తాగుతుంటే, కొడుకు కూడా దీన్నిఇనిస్పిరేష‌న్ గా తీసుకొనే అవకాశం ఉంటుంది. పేరంట్స్ మ‌ద్యం తాగితే దాన్ని చూసిన పిల్లలు కూడా ఈ అల‌వాటు వైపు మొగ్గే చాన్స్ ఉంది. అంతిమంగా దీని వ‌ల్ల పిల్లల్లో కూడా ఈ అల‌వాటు మొద‌లైపోతుంది.

పైగా సిగ‌రెట్ వంటి అల‌వాట్లలో పాసివ్ స్మోకింగ్ ముఖ్యం. పొగ తాగే వారికి ఎంత చేటు ఉంటుందో, ప‌క్కనే ఉండి ఆ పొగ ను పీల్చే వారికి అంతే ఇబ్బంది ఉంటుంది. ఈ సంగ‌తి తెలిసో, తెలియ‌కో చాలామంది ఇంట్లోనే ద‌ర్జాగా సిగ‌రెట్లు ఊదేస్తుంటారు. దీంతో కుటుంబ సభ్యుల‌కు కూడా క్యాన్సర్ వంటి రోగాల్ని తెచ్చిపెడుతుంటారు.

మ‌ద్యపానం విష‌యంలో కుటుంబ స‌భ్యుల‌పై ప్రభావం క‌చ్చితంగా ఉంటుంద‌ని స‌ర్వేలు చెబుతున్నాయి. మద్యం తాగుతుంటే చూసిన పిల్లలు.. ఆస‌క్తి కొద్దీ అటువైపు మొగ్గు చూపుతారు. త‌ర్వాత కాలంలో పూర్తిగా మ‌ద్యానికి అల‌వాటు ప‌డిపోతారు. చిన్న వ‌య‌స్సులోనే మ‌ద్యానికి అల‌వాటు ప‌డిన యువ‌త‌లో చాలా వ‌ర‌కు ఇటువంటి కేసులే ఎక్కువ‌. ఇక్కడ ఒక విష‌యం గ‌మ‌నించాలి. కేవ‌లం త‌ల్లితండ్రులు మ‌ద్యం తాగుతుంటేనే .. పిల్లలు చూసి నేర్చుకొంటారు అనుకొంటే పొర‌పాటే. చుట్టు ప‌క్కల అయినా పెద్దలు క‌లిపి మందు కొడుతుంటే కావ‌ల్సినంత ఇనిస్పిరేష‌న్ దొర‌కుతుంది అందుకే, సినిమాల్లో మ‌ద్యం తాగ‌టం, సిగ‌రెట్ తాగటం వంటి సీన్ లు పెట్టవ‌ద్దని ఆరోగ్యవేత్తలు మొత్తుకొంటున్నారు. లేదంటే అక్కడ ఒక హెచ్చరిక ను క్యాప్షన్ గా వేయ‌మ‌ని కూడా చెబుతున్నారు. సో, అదండీ..పిల్లలు చూడ‌కూడ‌ని దృశ్యాలు ఇవి కాబ‌ట్టి జాగ్రత్త తీసుకోవటం పెద్దల వంతు..!

ప్రత్యేక వాదానికి అస‌లు మూలం ఇక్కడ ఉంది...!


ప్రత్యేక వాద‌న అంటే ఏమిటి... అస‌లు ఈ ప్రత్యేక వైఖ‌రి ఎలా పుడుతుంది.. ప్రత్యేకంగా ఉండాల‌న్న ఆలోచ‌న ఎలా మొగ్గ తొడుగుతుంది... ఇటువంటి విష‌యాల్ని ఆలోచిస్తే భ‌లే గ‌మ్మతైన జ‌వాబు దొర‌కుతుంది. ఆలోచ‌న‌లే మ‌నిషిని న‌డిపిస్తాయ‌న‌టంలో ఎటువంటి సందేహం లేదు.  ఈ ఆలోచ‌న‌లు మొగ్గ తొడిగే క్రమంలో అస‌లు ప‌రిణామాలు చోటు చేసుకొంటాయి. న‌లుగురిలో ప్రత్యేకంగా ఉండాల‌ని, జీవితంలో దూసుకు పోవాల‌న్న ఆలోచ‌న‌.. ఇప్పటి త‌రానికి బాగా పెరిగిపోయింది. కెరీర్ లో టార్గెట్లు, వ్యక్తిగ‌త జీవితంలో బడా ఆలోచ‌న‌లు, ... వీటి నుంచి ఎదుర‌య్యే ఒత్తిళ్లతో జీవితం సంక్లిష్టంగా మారిపోతోంది. ఈ ఒత్తిళ్లతో స‌క‌ల అనారోగ్యాలు కొని తెచ్చుకోవ‌టం అవుతోంది.

ఒత్తిళ్ల స‌మ‌యంలో శ‌రీరంలో ఆక్సిడెంట్స్ పుట్టుకొని వ‌స్తుంటాయి. ఆహారపు అల‌వాట్లు స‌రిగ్గా లేక‌పోవ‌టం, కాలుష్యం పెరిగిపోవ‌టం, ఫిట్ నెస్ లోపించ‌టం వంటి స‌మ‌స్యలు తోడ‌వ‌టంతో ఈ ఆక్సిడెంట్స్ చెల‌రేగిపోతాయి. ఈ ఒత్తిళ్లతో ఆక్సిడెంట్స్ కు ప‌ట్ట ప‌గ్గాలు లేకుండా పోతాయి. దీంతో శ‌రీరంలో నిస్త్రాణ‌త పెరిగిపోవ‌టంతో రోగ నిరోధ‌క శ‌క్తి త‌గ్గిపోతుంది. దీంతో వ్యాధులు ఎక్కువ‌గా అచ్చే అవ‌కాశం ఏర్పడుతుంది. అంతిమంగా అనేక దీర్ఘకాలిక రోగాలకు నిల‌యంగా మారిపోవాల్సి ఉంటుంది.
ప్రత్యేకంగా క‌నిపించాల‌న్న త‌ప‌న‌లో ఒత్తిడికి లోనై, అంతిమంగా అనారోగ్యానికి కేరాఫ్ అడ్రస్ గా మారాల్సి వస్తోంది. ఈ ప‌రిస్థితికి శ‌రీరంలోనే ప‌రిష్కారం ఉంది. ఆక్సిడెంట్స్ ను నిర్మూలించే యాంటీ ఆక్సిడెంట్ ల‌ను త‌యారు చేసుకొనే శ‌క్తి శ‌రీరానికి ఉంది. ఎటొచ్చీ మ‌నం ఆ ప‌ని చేసుకొనేట్లుగా శ‌రీరానికి అవ‌కాశం క‌ల్పించాలి. ప‌చ్చటి ఆకుకూరలు, తాజా పండ్లతో శ‌రీరంలో ఇటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ త‌యారు అవుతాయి. టీ కాఫీల‌కు బ‌దులు గ్రీన్ టీ తీసుకొంటే ఈ ప‌ని సులువు అవుతుంది. శ‌రీరానికి వ్యాయామం లేకుండా, కేవ‌లం మెద‌డుకి విప‌రీతంగా పని కల్పించ‌టం తో ఆక్సిడెంట్స్ త‌యార‌వుతున్నాయని శాస్త్రీయంగా తేలింది. దీనికి విరుగుడుగా శ‌రీరానికి వ్యాయామం క‌ల్పించి, మెద‌డుకి కాస్తంత ఆహ్లాదం క‌ల్పించ‌టంతో ప‌రిష్కారం దొర‌కుతుంది.

 క్రమం త‌ప్పకుండా వ్యాయామం చేయ‌టం, ఆనందంగా ఉండేందుకు ప్రయ‌త్నించ‌టం ద్వారా యాంటీ ఆక్సిడెంట్లను సృష్టించుకోవ‌చ్చు. అప్పుడు కెరీర్‌లోనూ, ప‌ర్సన‌ల్ లైఫ్ లోనూ దూసుకెళ్లేందుకు వీల‌వుతుంది. స‌మాజంలో ప్రత్యేక‌త‌ను హాయిగా సంపాదించుకోవ‌చ్చు.

శ‌త‌మానం భ‌వ‌తి...ఆనందంగా క‌ల‌కాలం జీవించ‌టం సాధ్యమేనా..!


ఇష్ట ప‌డి ఏ ప‌ని చేసినా ఆనందంగానే ఉంటుంది. అది క‌ష్టప‌డే ప‌ని అయిన‌ప్పటికీ..! ఇదే సూత్రాన్ని ఆరోగ్యానికి వ‌ర్తింప‌చేయ‌వ‌చ్చు. అంటే శ‌రీరం ఆరోగ్యంగా ఉంటే ఆ ఆనందమే వేరు. ఆరోగ్యంగా ఉంచుకోవ‌టంలో శారీర‌క వ్యాయామం కూడా ముఖ్యమే. పూర్వ కాలంలో జీవ‌న శైలిలోనే వ్యాయామం ఇమిడిఉండేది. దీంతో అప్పటిత‌రం వారు నూరేళ్లు, అంత‌కు మించి జీవించిన దాఖ‌లాలు ఉన్నాయి. ఇప్పటి త‌రానికి 60, 70 ఏళ్లు బ‌త‌క‌ట‌మే గొప్పగా మారుతోంది. ఇందుకు కార‌ణం చాలా సింపుల్‌.. శారీర‌క వ్యాయామం లేక‌పోవ‌టం, మాన‌సిక ఆందోళ‌న పెరిగిపోవ‌టం. ఈ రెంటిని ప‌రిష్కరించుకొంటే ఆనందంగా క‌ల‌కాలం జీవించ‌టం సాధ్యమే.

ఆధునిక జీవ‌న శైలిలో సీటుకి అతుక్కొని గంటల త‌ర‌బ‌డి ప‌ని చేయాల్సి వ‌స్తోంది. దీంతో ఊబ‌కాయం, బ‌రువు పెర‌గ‌టం అన్నది సర్వ సాధారణంగా మారిపోయింది. ఇటువంటి జీవ‌న శైలి వ‌ల్ల అనేక అన‌ర్థాలు ఉన్నాయి. రక్తనాళాల్లో కొవు పేరుకోవ‌టం, గుండె సంబంధిత వ్యాదులు, కొల‌న్ కేన్సర్‌, షుగ‌ర్‌, బీపీ, మాన‌సిక ఒత్తిడి వంటి స‌మ‌స్యలు ఏర్పడుతున్నాయి. వీటి ప్రభావంతో ఆయుష్సు చాలా త్వర‌గా క‌రిగిపోతుంద‌ని వేరే చెప్పన‌క్కర లేదు. ఈ ప‌రిస్థితిని అధిగ‌మించేందుకు ఐదంటే ఐదు చిన్న పాటి ప‌రిష్కారాలు చూద్దాం..
1. ఆఫీసులో పని చేసుకొంటేనే మ‌ధ్య మ‌ధ్యలో లేచి న‌డ‌వ‌టం. లేదంటే వీలుంటే ఆఫీసుకి న‌డిచి వెళ్లటానికి ప్రయ‌త్నించ‌వ‌చ్చు. ఉద‌యం, సాయంత్రం వాకింగ్ లేదా జాగింగ్ కు వెళ్లటం చాలా ఉత్తమం. ఇది సాధ్యం కాక‌పోతే వీధి చివ‌ర షాపుకి లేదా ఆఫీసు ఆవ‌ర‌ణ దాటి వెళ్లటం వంటివి చేయాలి. ఇదేదో ఈసురోమ‌ని నీరసంగా కాళ్లీడ్చుకొంటూ వెళ్లకుండా చ‌క చ‌కా వెళ్లేందుకు ప్రయ‌త్నించాలి.
2. ఇంటి ప‌నిలో భాగ‌స్వామ్యం తీసుకోవ‌టం.. ఇంటి పనిలో చాలా వ్యాయామం ఇమిడి ఉంటుంది. ఉద‌యం ఇల్లు శుభ్రం చేయ‌టం, వంట కు సిద్దం చేసుకోవటం, ఇల్లు స‌ర్దు కోవ‌టం, దుస్తులు రెడీ చేసుకోవ‌టం... ఒక‌టేమిటి, భార్యా భ‌ర్త ఇద్దరూ క‌లిసి క‌ట్టుగా పని చ‌క్క బెట్టుకొంటే చాలా వ్యాయామం జ‌రుగుతుంది. పైగా ఆడుతు పాడుతూ ప‌నిచేస్తుంటే.... అన్న మాట ను రుజువు చేసుకోవ‌చ్చు.
3. వారాంత‌పు శెల‌వుల్ని ఆరోగ్యం కోసం కేటాయించండి. ఆరోజున సైక్లింగ్ చేయ‌టం, స్విమ్మింగ్ చేయ‌టం వంటి ప‌నులు పెట్టుకోవ‌చ్చు. లేదా వారానికి రెండు రోజులు లిఫ్ట్ ఉప‌యోగించ‌కుండా మెట్లదారిని ఉప‌యోగించుకోవ‌చ్చు. ఇంట్లోనే స్కిప్పింగ్ చేయ‌టం వంటివి చేయ‌గ‌లిగితే భేష్..!
4. ఆట పాట‌ల్ని మించిన వ్యాయామం ఉండ‌దు. టెన్నిస్, ష‌టిల్‌, స్కిప్పింగ్ వంటి వాటిలో పార్టిసిపేట్ చేయ‌వ‌చ్చు. స‌ర‌దాగా డాన్స్ క్లాస్ ల‌కు అటెండ్ అయినా స‌రిపోతుంది.
5. ఒంట‌రిగా వ్యాయామం కుద‌ర‌దు అనుకొంటే ఇద్దరు, ముగ్గురు క‌లిపి సామూహికంగా చేసుకోవ‌చ్చు. ఆరోగ్యం మీద క‌లిసి వ‌చ్చే మిత్రుల‌తో క‌లిసి యాక్టివిటీస్ క‌లుపుకోవ‌చ్చు. కుటుంబ స‌భ్యులు క‌లిసి వాకింగ్‌కు వెళ్లటం అన్నది ఆరోగ్యక‌రం.

- ఇవి కొన్ని మార్గాలు మాత్రమే. మొత్తం మీద శ‌రీరానికి చెమ‌ట ప‌ట్లే విధంగా ఏ రూపంలో క‌ష్టప‌డినా బాగుంటుంది. దీని వ‌ల్ల శ‌రీరంలో చురుగ్గా ర‌క్త ప్రస‌ర‌ణ జ‌రిగి అన్ని అవ‌య‌వాలు చైత‌న్య వంతం అవుతాయి. వీటి ప్రభావంతో చ‌క చ‌కా ప‌నిచేయ‌గ‌లుగుతాం. అప్పుడు ఆనందంగా క‌ల‌కాలం జీవించ‌డం సాధ్యం అవుతుంది. శ‌త‌మానం భ‌వతి అన్న సూక్తిని నిజం చేయ‌వ‌చ్చు.

ఆడ‌వాళ్లు ఉద‌యం పూట చిరాకుగా ఉంటారా..ఎందుకు..!


ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. మ‌రి అటువంటి ఇల్లాలు ఆనందంగా ఉంటే, ఇల్లంతా ఆనందంగా ఉంటుంది. కుటుంబ స‌భ్యుల‌కు ఇల్లాలే ఆయువు ప‌ట్టు. ఆమె ప్రవ‌ర్తన, ప‌ని తీరుని బ‌ట్టి ఇల్లంతా న‌డుచుకొంటుంది. ఇది మ‌హిళ‌ల్ని పొగిడేందుకు చెప్పడం లేదు. ప్రతీ ఇంట్లో మ‌నం చూసే విష‌యాలే. అయితే, చాలా సంద‌ర్భాల్లో మ‌హిళ‌లు ఉద‌యం పూట చిరాకుగా ఉంటార‌న్న మాట వినిపిస్తోంది. ముఖ్యంగా పిల్లలు ఉన్న ఇంట్లో ఈ ప‌రిస్థితిని గ‌మ‌నించ‌వ‌చ్చు.

మ‌హిళ‌లు ఉద‌యం పూట చాలా బిజీ. నిద్ర లేవ‌గానే ఇంటి శుభ్రత‌ను ప‌ట్టించుకోవాలి. బెడ్ రూమ్ ద‌గ్గర నుంచి, వంటిల్లు, హాల్‌, పూజ గ‌ది అన్ని శుభ్రంగా ఉంచేట్లుగా చూసుకోంటారు. భ‌ర్తను, పిల్లల్ని రెడీ చేయ‌టం ఒక ప్రహ‌స‌న‌మే. బెడ్ కాఫీ లేదా టీ రెడీ చేయ‌టం, బ్రేక్ ఫాస్ట్ కు టిఫిన్ త‌యారు చేయ‌టం, ఆఫీసులు, స్కూలుకు కావ‌ల్సినివ‌న్నీ సిద్దంగా ఉంచ‌టం, ఆ త‌ర్వాత లంచ్ బాక్స్ త‌యారు చేసి కుటుంబ స‌భ్యుల్ని సాగ‌నంప‌టంతో సరిపోతుంది. అదే వ‌ర్కింగ్ వుమెన్ అయితే డ‌బుల్ ఢ‌మాకా క‌ష్టాలు ఉంటాయి. గ‌బ గ‌బా తాను కూడా రెడీ అయిపోయి, వ‌స్తువులు రెడీ చేసుకొని ఆఫీసుకు పరిగెత్తాల్సి ఉంటుంది. ఇక‌, ప‌ల్లెటూర్లో అయితే ప‌నులు మార‌తాయి త‌ప్పితే ఈ ప‌నుల‌న్నీ త‌ప్పవు.

ఇన్ని ప‌నుల మ‌ధ్య స‌తమ‌తం అవుతున్న మ‌హిళ‌లు చాలా సార్లు చికాకు ప‌డుతుంటారు. ప‌నుల్లో ఉండ‌గా అడ్డు త‌గిలితే గ‌య్ మంటారు అని మ‌హిళా ద్వేషులు అంటుంటారు.ఇటువంటి కామెంట్లు త‌ప్పు కాబ‌ట్టి చికాకు కి కార‌ణం ఏమిటో క‌నుక్కొందాం.
వాస్తవానికి మ‌నం అంద‌రూ రాత్రి 8-9 గం.ల‌కు డిన్నర్ చేస్తుంటాం. త‌ర్వాత నిద్ర పోయి ఉద‌యం నిద్ర లేచి ఉరుకులు, ప‌రుగులు జీవితం మొద‌లెడ‌తాం. మ‌హిళ‌లు అయితే ర‌న్నింగ్ రేస్‌, హై జంప్ లు, లాంగ్ జంప్ లు చేసుకొంటూ కొన్ని సార్లు భ‌ర‌త నాట్యం, క‌రాటే లు కూడా చేసేస్తారు. త‌ర్వాత కుటుంబ స‌భ్యుల్ని బ‌య‌ట‌కు పంపించాక 10-11 గంట‌ల‌కు కాస్తంత ఎంగిలి ప‌డ‌తారు. అప్పటి దాకా తిండి ఏమాత్రం తిన‌రు. ఇదే పెద్ద త‌ప్పు. అస‌లు అన‌ర్థాల‌కు ఇదే కార‌ణం. రాత్రి చేసిన భోజ‌నం లేదా ఫ‌ల‌హారం నుంచి ఉద‌యం మ‌ళ్లీ తినేదాకా దాదాపు 10-12 గంట‌లు గ్యాప్ వ‌చ్చేస్తుంది. అంటే స‌గం రోజు ఖాళీ క‌డుపుతో ఉండి, స‌గం రోజు మొత్తం తిండికి కేటాయిస్తారు. దీంతో ఉద‌యం పూట శ‌రీరానికి కావ‌ల‌సిన శ‌క్తి అంద‌టం లేదు. శ‌క్తి లేక పోవ‌టంతో మెద‌డు ప‌ని చేయ‌టంలో ఇబ్బంది ఏర్పడుతుంది. దీంతో చిరాకులు, ఒత్తిళ్లు ఉంటాయి. ఫ‌లితంగా అల‌స‌ట‌, కోపం కలుగుతుంది. దీన్ని నివారించాలంటే చిన్న పాటి జాగ్రత్త తీసుకొంటే స‌రిపోతుంది. ఉద‌యాన్నే శ‌రీరానికి కావ‌ల‌సిన గ్లూకోజ్ అందించే పాలు, బిస్కట్ తీసుకోవ‌చ్చు. లేదా పండ్ల ముక్కలు నోటిలో వేసుకొన్నా భేష్... అస‌లు ఉద‌యం కొద్ది సేప‌టి త‌ర్వాత బ్రేక్ ఫాస్ట్ చేసేస్తే అన్ని స‌మ‌స్యలు పరిష్కారం అవుతాయి. లేదంటే మ‌హిళ‌ళే కాదు, పురుషుల‌కు కూడా ఉద‌యం పూట చిరాకు త‌ప్పదు.

లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్‌..! చిన్న పాటి జాగ్రత్త తీసుకోగ‌ల‌రా..!


లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్‌..!.. నిజంగా చాలా అద్భుత‌మైన ప‌ద బంధం ఇది. జీవితాన్ని అందంగా ఆస్వాదించాల‌న్న ఆకాంక్షను మూడు ప‌దాల్లో చెప్పేశారు. ఆనందంగా ఆస్వాదించాలంటే ఆరోగ్యం ఎంతో ముఖ్యం అన్న సంగ‌తి తెలిసిందే. ఆరోగ్యాన్ని కాపాడుకోడానికి చాలా చాలా నియ‌మాలు, నిబంధ‌న‌లు పాటించాల‌ని చాలామంది అనుకొంటారు. అంత‌టి హ‌డావుడి ప‌క్కన పెడితే చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొంటే చాలా విలువైన ప్రయోజ‌నాలు ద‌క్కించుకోవ‌చ్చు.
ఆహారంలో తాగు నీరు చాలా అవ‌స‌రం అని ఇది వ‌ర‌కే తెలుసుకొన్నాం. కానీ, సుర‌క్షిత తాగునీరు చాలా అవ‌స‌రం. అంటే చాలా ఖ‌రీదైన ప్యూరీ ఫ‌యిర్ల్స్ కొనుక్కొని వాటిలో నీరు పోసి తాగాలని మాత్రం అనుకోవ‌ద్దు. ఫిల్టర్ వాట‌ర్ మాత్రమే సుర‌క్షితం అనుకోవ‌ద్దు. వీట‌న్నింటి క‌న్నా ముఖ్యంగా నీటిని కాచి చ‌ల్లార్చి తాగితే ఎంతో మేలు. ఈ చిన్నపాటి జాగ్రత్త తీసుకొనేందుకు మ‌న మ‌న‌స్సు అంగీక‌రించ‌దు.

నీటితో చాలా సూక్ష్మ జీవులు వ్యాపిస్తాయి. వీటిని వైర‌స్‌, బ్యాక్టీరియా, ప్రోటోజోవ‌న్లు, వ‌ర్మ్ జీవులు అని వ‌ర్గీక‌రించ‌వ‌చ్చు. వీటి ద్వారా వ‌చ్చే వ్యాధుల్ని వాట‌ర్ బార్న్ వ్యాధులు అంటారు. ఉదాహ‌ర‌ణ‌కు నీటిలో సంక్రమిత వైర‌స్ ఉంటే హెప‌టైటిస్ ఎ, హెప‌టైటిస్ ఈ అనే ర‌కపు కామెర్లు సోకుతాయి. డ‌యేరియా అనే ప్రమాద‌క‌ర వ్యాధి కూడా నీటి ద్వారానే సంక్రమిస్తుంది. బ్యాక్టీరియా తో టైఫాయిడ్‌, పారా టైఫాయిడ్‌, క‌ల‌రా వంటి రోగాలు సోకుతాయి. ఇత‌ర సూక్ష్మ జీవుల‌తో  అమీబియాసిస్ వంటి ఇబ్బందులు ఏర్పడుతాయి. వీటిలో కొన్ని ప్రాణాంత‌క వ్యాధులు కూడా..!
ఇన్ని వ్యాధులు సంక్రమించ‌టానికి నీరే కార‌ణం. ముఖ్యంగా ఈ వ‌ర్షాలు ప‌డే స‌మ‌యంలో తాగు నీటి పైప్ లైన్‌లు, మురుగు నీటి పైప్ లైన్ లు క‌లుస్తుంటాయి. మ‌న‌కు తెలియ‌కుండానే మురుగు నీరు, ఈ తాగునీటితో క‌లిసిపోతుంది. అటువంట‌ప్పుడు ఫిల్టర్ లు, ప్యూరిఫ‌యిర్లు ఎంత వ‌ర‌కు శుభ్రప‌రుస్తాయ‌న్నది ఆయా ప‌రికరాల నాణ్యత మీద ఆధార‌ప‌డి ఉంటుంది.

 అంత‌మాత్రాన ఈ పరికరాల్ని త‌ప్పు ప‌ట్టడం మ‌న ఉద్దేశం కానే కాదు. కానీ, సామాన్యులు సైతం ఈ ప‌రిక‌రాలు లేక‌పోయిన సుర‌క్షిత తాగునీటిని తీసుకోవ‌చ్చు అని చెప్పట‌మే మ‌న ఉద్దేశం. చ‌క్కగా కాచి చ‌ల్లార్చిన నీటిని తీసుకొంటే వాట‌ర్ బార్న్ డిసీజ్‌ల‌కు దూరంగా ఉండ‌వ‌చ్చు. కుటుంబ స‌భ్యులంతా ఆరోగ్యంగా ఉంటే జీవ‌తాన్ని అందంగా ఆస్వాదించ‌వ‌చ్చు. అప్పుడే క‌దా లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్‌..!...!

నీళ్లు ఎక్కువ తాగితే ఏమ‌వుతుంది..!


ఇటీవ‌ల కాలంలో తాగునీటి మీద అవ‌గాహ‌న పెరిగింది.గ‌తంతో పోల్చుకొంటే నీటిని ఎక్కువ‌గా తీసుకోవ‌టం అల‌వాటుగా మార్చుకొంటున్నారు. శ‌రీరానికి నీరు చాలా అత్యవ‌స‌ర అంశం అన‌టంలో ఎటువంటి సందేహం లేదు పైగా వివిధ ర‌కాల జీవ‌న క్రియ‌లు సాఫీగా జ‌ర‌గ‌టానికి తాగునీరు చాలా బాగా ఉప‌యోగ ప‌డుతుంది. అదే స‌మ‌యంలో చాలినంత నీరు ఉంటే జీవ‌నానికి స‌రిపోతుంది. అదే ప‌నిగా నీరు తాగితే మాత్రం ఇబ్బంది త‌ప్పదు.

స‌గ‌టున మాన‌వునికి ఒక రోజుకి మూడు లీట‌ర్ల నీరు స‌రిపోతుంది. నేరుగా తీసుకొనే నీటితో పాటు అడ‌పా ద‌డ‌పా ఆహార ప‌దార్థాల రూపంలో కూడా నీరు అందుతుంది. ఈ మాత్రం నీరు స‌రిపోతుంది. ఇంత‌కు మించితే మాత్రం జీర్ణాశ‌యం, కాలేయం మ‌రియు మూత్ర పిండాల ప‌నితీరు మీద ప్రభావం చూపుతుంది. అక్కడ నీరు ఎక్కువ‌గా పేరుకొని పోతే, ఇత‌ర ప‌దార్థాలు స‌క్రమంగా వినియోగించుకోవటం క‌ష్టత‌రం అవుతుంది. ఉదాహ‌ర‌ణ‌కు జీర్ణాశ‌యాన్ని తీసుకొంటే, క‌డుపులో సగం ఆహారం తీసుకొని, పావు భాగం నీటితో నింపి, పావు భాగాన్ని ఖాళీగా ఉంచుకోమ‌ని చెబుతారు. దీన్ని పాటించ‌కుండా అదే ప‌నిగా నీటితో నింపితే జీర్ణ వ్యవ‌స్థ ప‌నితీరు దెబ్బతింటుంది. దీంతో చిన్న ప్రేగుల మీద కూడా ఒత్తిడి ఏర్పడుతుంది.
ప‌గ‌టి పూట ఎక్కువ‌గా నీరు తీసుకొంటే రాత్రి పూట ఈ నీటి వినియోగం త‌గ్గించుకొంటే స‌రిపోతుంది. దీంతో నీటి వినియోగం స‌మ‌తుల్యంగా ఉంటుంది. ఈ విష‌యాన్ని ఎప్పటిక‌ప్పుడు క‌చ్చితంగా పాటించాల్సిన అవ‌స‌రం లేదు. కానీ, నీటిని స‌రాస‌రిన లెక్కవేసుకొంటే చాలు.

హాయిగా ఫుడ్డు తినండి.. చ‌క్కగా బ‌రువు త‌గ్గండి..!

బ‌రువు కి ఆహారానికి విడ‌దీయ‌రాని సంబంధం ఉంది. చాలామంది బ‌రువు త‌గ్గాలంటే ఆహారం తినటం త‌గ్గించాల‌ని అనుకొంటారు. ఇందులో కొంత వ‌ర‌కు వాస్తవం ఉంది. ఎక్కువ కొవ్వును మిగిల్చే ఆహారం తీసుకొంటే బ‌రువు పెర‌గ‌టం త‌థ్యం. ఇది స‌హ‌జ సూత్రం. అదే స‌మ‌యంలో ఆహారాన్ని త‌గ్గిస్తే మాత్రం కొంచెం ఇబ్బందే. శ‌రీరానికి అవ‌స‌ర‌మైన పోష‌కాలు అందించే ఆహారం తీసుకొంటూనే కొద్ది పాటి జాగ్రత్తలు తీసుకొంటే మాత్రం నాజూకుగా మారిపోవ‌చ్చు.ఇందుకోసం ఉప‌క‌రించే ఆహారం ఇప్పుడు చూద్దాం..

1.ఆకు కూర‌లు.. ఆకు కూర‌ల‌తో చాలా ఉప‌యోగం ఉంద‌న్న సంగ‌తి తెలిసిందే. వీటిని తీసుకొంటే కొవ్వు బెడ‌ద ఉండ‌దు, కానీ చ‌క్కటి పోష‌కాలు, ల‌వ‌ణాలు అందుతాయి. నడుము భాగంలో కొవ్వు పేరుకొని పోతోంద‌ని బెంగ ప‌డే వారికి ఇది చ‌క్కటి ప‌రిష్కారం. నూనెలో వేయించ‌కుండా, నీటితో ఉడికించుకొని పొడి ఆహారంగా తీసుకొంటే కావాల్సిన ప్రయోజ‌నాలు పొంద‌వ‌చ్చు.
2. పాలు, మ‌జ్జిగ‌.. పెరుగు, మీగ‌డ‌ల‌తో కొవ్వు పెరిగే అవ‌కాశం ఉంది. కానీ, పాలు, ప‌ల్చటి మ‌జ్జిగ‌తో ఈ ఇబ్బంది ఉండ‌దు. పైగా శ‌రీరానికి కావ‌ల్సిన కాల్షియం అందుతుంది. కాల్షియం తో శ‌రీర ప‌టుత్వం సాధ్యం అవుతుంది.
3. గుడ్లు.. గుడ్డు ఎక్కువ‌గా తీసుకొంటే ప్రొటీన్స్ ఎక్కువ‌గా చేర‌తాయి. కండ‌రాలు గట్టి ప‌డేందుకు ఇది చాలా అవ‌స‌రం. విటమిన్ బీ 12, తో పాటు ఎనిమిదిర‌కాల ల‌వ‌ణాలు, కాల్షియం, ఐర‌న్ వంటి పోష‌కాలు ల‌భిస్తాయి. జీవ‌న‌క్రియ‌లు సాఫీ గా జ‌రిగేందుకు అవ‌స‌ర‌మైన అన్ని అంశాలు గుడ్డులో దొర‌కుతాయి.

4. చేప‌లు.. మాంసాహారంలో కోడిమాంసం, మేక మాంసం వంటి వాటిక‌న్నా చేప‌లు మేలు అని చెబుతారు. వీటితో కొవ్వులు క‌ర‌గ‌టంతో పాటు ప్రోటీన్లు స‌మృద్ధిగా ల‌భిస్తాయి. ఒత్తిడి సంబంధిత ర‌సాయ‌నాలు పేరుకోకుండా నిరోధించ‌టం ద్వారా లావు కాకుండా నివారించ‌వ‌చ్చు. చ‌క్కటి ల‌వ‌ణాలు ల‌భించ‌టం మ‌రో ఉప‌యోగ‌క‌ర‌మైన అంశం.
5. గ్రీన్ టీ.. తాజా గ్రీన్ టీ తో ఉత్సాహం క‌లుగుతుంది. మెద‌డు చురుగ్గా ఉండ‌టం ద్వారా అన‌వ‌స‌ర‌పు ర‌సాయ‌నాల స్రావ‌కాన్ని నిరోధించ‌వ‌చ్చు.
శ‌రీరంలో అన‌వ‌స‌ర‌పు నిల్వల్ని తొల‌గించ‌టంలో గ్రీన్ టీ ఉప‌క‌రిస్తుంది.
ఈ ఐదు ర‌కాల ఆహారాన్ని తీసుకోవ‌టం ఎంత ముఖ్యమో, కొవ్వును మిగిల్చే జంక్ ఫుడ్ ల‌కు దూరంగా ఉండ‌టం అంత ప్రధానం. ఐస్ క్రీమ్‌లు, బ‌ర్గర్ల, స్వీట్స్ ను దూరం పెడితే బ‌రువు త‌గ్గటం సాధ్యం అవుతుంది.

మీ ఫుడ్ కు ఒక చిక్కుంది.. దానికో లెక్కుంది..!


ఆహారం తీసుకోవ‌టంలో ఒక చిక్కు ఉంది. కానీ దీన్ని ఒక లెక్క ద్వారా ప‌రిష్కరించుకోవ‌చ్చన్న మాట‌. అదేమిటో ఇప్పుడు తెలుసుకొందాం.
శ‌రీరం దైనందిక క్రియ‌లు నెర‌వేర్చుకొనేందుకు శ‌క్తి అవ‌స‌రం. దీన్ని క్యాల‌రీల్లో కొలుస్తారు. ఈ శ‌క్తి వినియోగం అన్నది జీవ‌న శైలి మీద ఆధార ప‌డి ఉంటుంది. శారీర‌క క‌ష్టం చేసేవారి విష‌యంలో ఒక ర‌కంగా ఉంటే, నీడ ప‌ట్టున ఉండి ఉద్యోగాలు చేసే వారికి ఒక ర‌కంగా ఉంటుంది. ప‌ల్లె జీవుల్లో ఆయా వృత్తి వ్యవ‌హారాల మీద ఈ క్యాల‌రీల వినియోగం మారుతూ ఉంటుంది. ప‌ట్టణ, న‌గ‌ర వాసుల విష‌యంలో ఈ క్యాల‌రీల వినియోగం దాదాపుగా ఒకే మాదిరి ఉంటుంది. ఈ వ్యాసంలో మాత్రం ఆహారంలో తాజా పండ్లు, కూర‌గాయ‌ల వినియోగం గురించి చ‌ర్చించుకొందాం..

శ‌రీరానికి అవ‌స‌ర‌మైన ప‌దార్థాల్లో పిండిప‌దార్థాలు, మాంస‌కృత్తులు, కొవ్వులు ముఖ్యమైన‌వి. వీటితో పాటు ల‌వణాలు, విట‌మిన్‌లు, సూక్ష్మ పోష‌కాలు అవ‌స‌రం. అన్నం, పెరుగు వంటి వాటి ద్వారా పిండి ప‌దార్థాలు, కొవ్వులు అందుతుంటాయి. కానీ, ముఖ్యమైన మాంస‌కృత్తులు, ల‌వ‌ణాలు, విట‌మిన్స్ కోసం త‌ప్పనిస‌రిగా కూర‌గాయ‌లు లేదా మాంసాహారం మీద ఆధార ప‌డాలి. పైగా ఈ మాంస‌కృత్తులు(ప్రొటీన్స్) లేక‌పోతే మాత్రం చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. అందుచేత ఆహారంలో కూర‌గాయ‌లు త‌ప్పనిస‌రి. అటు, ల‌వ‌ణాలు, విట‌మిన్స్ కోసం పండ్లు కూడా త‌ప్పనిస‌రి.

పండ్లు, కూర‌గాయ‌లు ఏ మేర‌కు అవ‌స‌రం అనే విష‌యంలో ఒక లెక్క ఉంది. ప‌ట్టణ లేక న‌గ‌ర జీవులు అర గంట కు మించి శారీర‌క శ్రమ ఉండ‌దు అన్న సాదార‌ణ సూత్రం ప్రకారం దీన్ని గ‌ణించ‌వ‌చ్చు. పురుషుల విష‌యంలో పాతికేళ్ల లోపు వ‌య‌సు వారికి 2,600 క్యాల‌రీలు అవ‌స‌రం. అందుచేత రెండు క‌ప్పుల పండ్లు, మూడున్నర క‌ప్పుల కూర‌ అవ‌స‌రం ఉంటాయి. పాతికేళ్లు దాటిన వారికి 2,200 క్యాల‌రీలు అవ‌స‌రం కాబ‌ట్టి రెండు క‌ప్పుల పండ్లు, మూడు క‌ప్పుల కూర అవ‌స‌రం ఉంటుంది. మ‌హిళల విష‌యానికి వ‌స్తే పాతికేళ్ల లోపు వ‌య‌సు వారికి 2,000 క్యాల‌రీలు అవ‌స‌రం. అందుచేత రెండు క‌ప్పుల పండ్లు, రెండున్నర క‌ప్పుల కూర అవ‌స‌రం. పాతిక సంవ‌త్సరాల వ‌య‌సు దాటిన వారికి 1800 క్యాల‌రీలు అవ‌స‌రం. అందుచేత ఒక‌టిన్నర క‌ప్పుల పండ్లు, రెండున్నర క‌ప్పుల కూర అవ‌సరం.
వాస్తవానికి కొద్దో గొప్ప కూర‌లు రోజూ తీసుకొంటారు. కానీ, చాలామంది పండ్లు రోజు తీసుకొనే అల‌వాటు ఉండ‌దు. ఇది చాలా త‌ప్పు. పండ్లు ద్వారా శ‌రీరానికి అవ‌స‌ర‌మైన ల‌వ‌ణాలు, పోష‌కాలు అందుతుంటాయి. అందుచేత పండ్లు రోజూ తీసుకోవ‌టం అల‌వాటు చేసుకోవాలి. దీంతోపాటు కూర కూడా ఎక్కువ తీసుకోవ‌టం ఉత్తమం.

బ‌రువు త‌గ్గించుకొనేందుకు ఒక చిట్టి చిట్కా..!


బ‌రువు త‌గ్గించుకోవాల‌న్న ఆరాటం ఇటీవ‌ల కాలంలో ఎక్కువైంది. సైజు త‌గ్గించుకోవ‌టం ఒక ఎత్తయితే, బ‌రువు కు క‌ళ్లేం వేయాల‌న్న ఆరాటం అధికంగాఉంది. ఈ టెన్షన్ లో తిండి మానలేక‌, బ‌రువు త‌గ్గలేక ఇబ్బంది ప‌డుతుంటారు. ఇటువంటి వారి కోసం ఒక చిట్కా చెబుతున్నారు వైద్యులు. నీటిని తాగ‌టం పెంచితే ఆటోమేటిక్ గా బ‌రువు త‌గ్గవ‌చ్చట‌..! విన‌టానికి వింత‌గా ఉన్నా, ఇది నిజం అంటున్నారు. ద జ‌ర్నల్ ఆఫ్ క్లినిక‌ల్ ఎండోక్రైనాల‌జీ అండ్ మెట‌బాల‌జీ అనే వైద్య శాస్త్ర సంచిక‌లో ఈ విష‌యాన్ని వెల్లడించారు.

వాస్తవానికి మెద‌డుకి ఆక‌లి, దాహం మధ్య తేడా పెద్దగా తెలీదు. రెండు విష‌యాల్లో ఒకే ర‌కమైన సిగ్నల్స్ అందుతాయ‌ట‌. అందుచేత జీర్ణాశ‌యంలో కాస్తంత నీటిని నింపితే క‌డుపు నిండుతున్నట్లుగా ఉంటుంది. దీంతో తీసుకొనే ఆహారం ప‌రిణామం త‌గ్గుతుంది. ఆహారం లో ఉండే నీటి విలువ‌తో ఈ తాగునీటి విలువ క‌లుపుకొంటే క‌డుపులో ప‌దార్థం ప‌రిణామం పెరుగుతుంది. దీంతో పాటుగా నీటిలో ఉండే ల‌వ‌ణాలు ఈ మోతాదు పెంపుకి తోడ్పడుతాయి. పైగా నీటిలో ఎటువంటి క్యాల‌రీల శ‌క్తి ఉండ‌దు. ఈ క్యాల‌రీల గోల లేకుండా క‌డుపుని నింపేసుకొనే చాన్స్ అన్న మాట‌.

అందుచేత చ‌క్కగా నీటిని తాగ‌టం ద్వారా ఈ ప‌రిస్థితిని అదుపుచేసుకోవ‌చ్చు. ఒక లెక్క ప్రకారం రోజుకి ఒక లీట‌రున్నర నీటిని ఎక్కువ‌గా తాగితే 17 వేల 400 క్యాల‌రీలు క‌రుగుతాయి.అంటే దాదాపు రెండు కిలోల బ‌రువుకి ఎస‌రు పెట్టవ‌చ్చు. నెల రోజుల క్రమంలో ఈ ఫ‌లితాన్ని చూడ‌వ‌చ్చట‌. అంత మాత్రాన అదే ప‌నిగా నీటిని తాగేస్తే మాత్రం కొంప కొల్లేరు అవుతుంది సుమా..!

ఆహారంలో పంచామృతం..


ఆహారంలో ఐదు ర‌కాల అమృతాలు ఉన్నాయి. అవి మీకు తెలుసా..ఆహారం చ‌క్కగా జీర్ణం అయి, శ‌రీరంలో చ‌క్కగా శ‌క్తి క‌లిసి పోతే అది అమృత‌మే అవుతుంది క‌దా..దీన్ని బ‌ట్టి చూస్తే ఐదు ర‌కాల ఆహారాలు తేలిగ్గా జీర్ణం అవుతాయ‌ని గుర్తించారు. అవేమిటో ఇప్పుడు చూద్దాం..

1. అన్నం.. చూడ‌టానికి సాదా సీదాగా ఉన్నా అన్నం .. తేలిగ్గా జీర్ణం అయ్యే ఆహారం. కూర‌లు, సాంబారు వంటివే గాకుండా పాలు, పెరుగు వంటి వాటితో క‌లుపుకొని అన్నం తింటూ ఉంటారు. అయితే ఏ ప‌దార్థంతో క‌లిపినా కానీ, అన్నం స్వభావ రీత్యా తేలిగ్గా జీర్ణం అయ్యే ల‌క్షణం క‌లిగి ఉంటుంది. అందుకే అన్నం ప‌ర‌బ్రహ్మ స్వరూపం అన్న సూక్తి జ‌నించి ఉంటుంది. అన్నం ద్వారా ఎక్కువ‌గా పోష‌క ప‌దార్థాలు శ‌రీరానికి స‌మ‌కూర‌తాయి.

2. చికెన్.. మాంసాహారంలో చికెన్ త్వర‌గా జీర్ణం అయ్యే ల‌క్షణం క‌లిగి ఉంటుంది. మ‌ట‌న్‌, చేప‌లు, పీత‌లు వంటి వాటికి గ‌ట్టి జీర్ణ స్వభావం ఉంటుంది. చికెన్ ను తేలిగ్గా జీర్ణించుకోవ‌చ్చు. పైగా భార‌త్ వంటి దేశాల్లో ఇది కామ‌న్ గా ఉండే నాన్ వెజ్ డిష్‌. ప‌ల్లెల్లో, ప‌ట్టణాల్లో కూడా విరివిగా దొరికే మాంసాహారం ఇది.

3. సూప్‌.. బోజ‌నంలో చారు, ర‌సం వంటివి జోడించుకోవ‌టం ఎప్పటినుంచో ఉన్న అల‌వాటు. ఆహారానికి మొద‌ట‌గా కొంచెం సూప్ తీసుకోవ‌టం మోడ‌ర్న్ మెనూ లో త‌ప్పనిస‌రి. రుచిగా ఉండ‌టంతో పాటు ఇందులో ఇంకో ప‌ర‌మార్థం కూడా ఉంది. కొంచెం కారం, కొంచెం ఉప్పగా ఉండే సూప్ తీసుకోవ‌టంతో నాలుక మీద ఉండే రుచిమొగ్గలు క్రియాశీల‌కంగా మార‌తాయి. దీంతో త‌ర్వాత తీసుకొనే ఆహారంలోని అన్ని రుచులు చ‌క్కగా తెలుస్తాయి. ఫ‌లితంగా అన్ని రుచుల్ని ఆస్వాదించేందుకు వీల‌వుతుంది.

4. పండ్లు.. ఆహారంలో పండ్లు, పండ్ల ముక్కలు వంటివి జోడిస్తే చ‌క్కగా జీర్నం అవుతాయి. అంతే గాకుండా పండ్లను తీసుకొంటే జీర్ణాశ‌యం శుభ్ర ప‌ర‌చుకొనేందుకు వీల‌వుతుంది. పండ్ల లో ఉంటే కొన్ని ర‌కాల జీవ ర‌సాయ‌నాలు యాక్టివేట‌ర్స్ గా ఉప‌క‌రిస్తాయి. పండ్లను స‌లాడ్ గా, పండ్ల ర‌సాలుగా, చిన్న ముక్కలుగా తీసుకొనే అల‌వాటు ఉన్నది.

5. ఆకు కూర‌లు... ఆకు కూర‌లు, ఆకుల‌తో కూడిన క్యాబేజీ వంటివి పోష‌క విలువ‌లు క‌లిగి ఉంటాయి. అంతేగాకుండా త్వర‌గా ప‌చ‌నం అవుతాయి. ఈ ఆకు కూర‌ల‌ను జోడించ‌టంతో ఆహారం చ‌క్కటి పోష‌క స‌మ‌తుల్యత క‌లిగి ఉంటుంది.

ఆహారం తీసుకోవ‌టంలో మెళ‌కువ‌లు అవ‌స‌ర‌మా..!


ఆరోగ్యమే మ‌హా భాగ్యం అంటారుక‌దా..! అటువంటి ఆరోగ్యానికి ఆహారానికి ఉన్న అనుబంధం అంతా ఇంతా కాదు.ఆహారం తీసుకోవ‌టంలో కొద్ది పాటి మెళ‌కువ‌లు పాటిస్తే ఆరోగ్యాన్ని మ‌హా భాగ్యం గా కాపాడుకోవ‌చ్చు. ఆ మెళ‌కువలు ఇప్పుడు చూద్దాం..

ఆహారం తీసుకోగానే జీర్ణాశ‌యంలో కొన్ని స్రావ‌కాలు ఊర‌టం మొద‌ల‌వుతాయి. అందుచేత మొద‌ట‌గా ఆహారంలోని ప‌దార్థాలు లోప‌ల‌కు ప్రవేశించ‌గానే .. ఇందుకు సంబంధించిన సిగ్నల్స్ అందిపోతాయి అన్న మాట‌. దీంతో ఆహారం లోప‌ల‌కు ప్రవేశిస్తుంది కాబ‌ట్టి జీర్ణం చేయ‌టానికి కావ‌ల‌సిన స‌రంజామా రెడీ అవుతుంది. తీరా చేసి ఆ స‌మ‌యానికి కొద్ది పాటి చిరుతిళ్లు తినేసి, త‌ర్వాత బై చెప్పేస్తే ఈ ఏర్పాట్లు అన్నీ వృధా అయిపోతాయ‌న్న మాట‌. ముఖ్యంగా చాలామంది ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లేప్పుడు చాట్ కానీ, స్నాక్స్ కానీ తీసుకొని క‌డుపుని కాస్తంత ఇబ్బంది పెట్టి ఆ త‌ర్వాత ఇంటికి తాపీగా వెళ‌తారు. ఆ త‌ర్వాత భోజ‌నానికి ఉప‌క్రమిస్తారు. దీని వ‌ల్ల క‌డుపు కూడా మ‌నమీద విసుక్కొంటుంది. ఈ విసుగుద‌ల తో స‌రిగ్గా ప‌ని చేయ‌టానికి మొండికేస్తుంద‌న్న మాట‌. అందుచేత భోజ‌నం చేసే స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు చిరుతిళ్ల వైపు వెళ్ల కుండా ఉండే మేలు. ఈ లోగా ఆక‌లి అంటూ బెల్స్ మోగుతూ ఉంటాయి కాబ‌ట్టి నేరుగా భోజ‌నం చేసేలా ప్లాన్ చేసుకోవాలి.

దీంతో పాటు భోజ‌నంలో కొంత ప‌దార్థం తినేసి టీవీ సీరియ‌ల్స్ లో మునిగిపోయి, ఆ త‌ర్వాత వాణిజ్య ప్రక‌ట‌న‌లు వ‌చ్చినప్పుడు మిగతా భాగం తినే అల‌వాటు కొంద‌రికి ఉంటుంది, సారీ చాలామందికే ఉండ‌వ‌చ్చు. కానీ, ఇది కూడా స‌రికాదు, ఎందుకంటే ఆహారం లోప‌ల‌కు ప్రవేశించాక అన్నవాహిక‌, జీర్ణాశ‌యం, కాలేయం, క్లోమం, శేషాంత్రికం, పిత్తాశ‌యం, పెద్ద ప్రేగు వంటి అనేక భాగాలు ఉత్తేజితం అవుతాయి.అక్కడ జీర్ణ ప్రక్రియ ఒక నిర్దిష్ట ప‌ద్దతిలో జ‌రుగుతుంది. దీనికి ప‌దే ప‌దే అంత‌రాయం క‌లిగించ‌టం స‌రికాదు. అదే స‌మ‌యంలో ఒకేసారి ఆహారాన్ని పెద్ద మొత్తంలో తీసుకోవ‌టం క‌న్నా వాయిదాల ప‌ద్దతిలో తిన‌టం మేలు అన్న వాద‌న ఉంది. దీని వివ‌రాలు త్వర‌లోనే తెలుసుకొందాం...

రాత్రి భోజ‌నంలో చిన్న పాటి జాగ్రత్త..!


ఆహారానికి ఆరోగ్యానికి ఎంతో అవినావ భావ సంబంధం ఉంది. ఆహారం బాగుంటే ఆరోగ్యం దానంత‌ట అదే బాగుంటుంది. ముఖ్యంగా రాత్రి భోజ‌నం విష‌యంలో కొద్ది పాటి జాగ్రత్త అవ‌స‌రం. ఎందుకంటే రాత్రి ఆహారం తీసుకొన్న త‌ర్వాత జీర్ణం అయ్యేందుకు ప‌ట్టే స‌మ‌యం దృష్టి పెట్టుకోవాలి. భోజ‌నం లో గ‌ట్టి పాటి ఘ‌నాహారం ఉంటే జీర్ణం అయ్యేందుకు స‌మ‌యం తీసుకొంటుంది. చాలామంది భోజ‌నం తిన్న వెంట‌నే ప‌డుకొనే అల‌వాటు క‌లిగి ఉంటారు. ఇది స‌రి కాదు. ఎందుకంటే ఆహారం తీసుకొన్న త‌ర్వాత 3-4 గంట‌ల పాటు జీర్ణాశ‌యంలోనే ఉంటుంది. ఆ స‌మ‌యంలో ఎంజైమ్ లు స్రవించ‌టం, జీర్ణ ప్రక్రియ ఊపందుకోవ‌టం జ‌రుగుతుంది. కానీ, ఆహారం తీసుకొన్న వెంట‌నే నిద్ర లోకి జారుకొంటే ఈ ప్రక్రియ మంద‌గిస్తుంది. కొద్ది సేపు మెళ‌కువగా ఉండ‌టం ద్వారా జీర్ణ ప్రక్రియ మొద‌లై పోతుంది. ఈ స‌మ‌యంలో కొద్ది దూరం న‌డిస్తే చాలా మంచిద‌ని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కొద్ది పాటి న‌డ‌క ద్వారా జీర్ణ ప్రక్రియ చ‌క్కగా ప్రారంభం అవుతుంది. అందుచేత దీనికి త‌గిన‌ట్లుగా ఆహార వేళ‌లు ప్లాన్ చేసుకొంటే మంచిది. భోజ‌నం తీసుకొన్న త‌ర్వాత కొద్ది పాటి న‌డ‌క‌తో కాసేపు విశ్రాంతి తీసుకొని, ఆ త‌ర్వాత నిద్రకు ఉప‌క్రమించాలి. ఈ స‌మ‌యంలో వేడిగా పాలు తీసుకొనే అల‌వాటు కొంత‌మందికి ఉంటుంది. ఇది ఆమోద‌యోగ్యమే. ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తల‌తో ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌టం మంచి ల‌క్షణం.

అన్నం తిన‌టం అంద‌రికీ తెలుసు..కానీ, ఆరోగ్య క‌రంగా తిన‌టం తెలుసా..!


ఇటువంటి ప్రశ్న అడ‌గ‌టం స‌భ్యత‌గా ఉండ‌దు. ఎందుకంటే చిన్నత‌నం నుంచి అంద‌రికీ అల‌వాటైన ప‌ని గురించి ప్రశ్నించ‌టం త‌ప్పు. అయిన‌ప్పటికీ, ఆరోగ్యక‌రంగా ఆహారాన్ని తీసుకోవ‌టం అన్నది ముఖ్యం. తిన్నామంటే తిన‌టం, తిరిగామంటే తిర‌గ‌టం అన్నది స‌రైన విధానం కాదు. ఆహారం తీసుకొనేట‌ప్పుడు స‌రైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు ఇప్పుడు చూద్దాం..



1. ఆహారం తీసుకొనే ముందు ప్రశాంత‌త అవ‌స‌రం. హ‌డావుడి ప‌డ‌కుండా, నెమ్మదిగా భుజించాలి.దాదాపుగా 20 నిముషాల వ్యవ‌ధిలో ఆహారం తీసుకొంటే మంచిద‌ని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. టీవీ చూస్తూ, సీరియ‌ల్స్, సినిమా్ల్లో లీనం అయి ఆహారం తీసుకోవ‌టం స‌రికాదు. కుటుంబ స‌భ్యుల‌తో కానీ, మిత్రుల‌తో క‌లిసి కానీ ఆనంద‌క‌రంగా ఆహారం తీసుకోవటం ఉత్తమం.
2. ఆహారం తీసుకొనేముందు ఒక గుక్క నీటిని తాగాలి. త‌ర్వాత క‌నీసం రెండుసార్లు అయినా కొద్ది పాటి నీరు తాగాలి. దీని వ‌ల్ల ఆహారం చ‌క్కగా మిశ్రమం అవుతుంది.
3. ఆహారంలో ఒకే ర‌క‌మైన ఫుడ్ మంచిది కాదు. కూర‌లు, ప‌చ్చడి, సాంబారు వంటి వెరైటీలు అనుకోవ‌ద్దు. పిండిప‌దార్థాలు, మాంస‌కృత్తులు, కొవ్వులు ఉండేట్లుగా చూసుకోవాలి. విట‌మిన్స్, ల‌వ‌ణాలు, సూక్ష్మ పోష‌కాలు కూడా త‌ప్పనిసరి.
4. ఒకే ర‌కమైన ఆహారానికి అల‌వాటు ప‌డ‌కూడ‌దు. విభిన్న ర‌కాలు ఆహార ప‌దార్థాల‌తో స‌మ్మిశ్రితంగా భుజించాలి.
5. న‌చ్చిన ఆహారం విప‌రీతంగా తిన‌టం, న‌చ్చక‌పోతే దూరం పెట్టడం అంత మంచిది కాదు. ఆహారాన్ని స‌మతుల్యంగా ఉంచుకోవాలి.

6. ఆహారం లో క‌డుపు నిండ‌టం ముఖ్యం. అంటే క‌డుపులో స‌గం వ‌ర‌కు ఘ‌న ఆహారం, పావు వంతు ద్రవం ఉండాలి. మిగిలిన పావు వంతు ఖాళీగా ఉంటే చ‌క్కగా జీర్ణం అవుతుంది.
7. భోజ‌నంలో పండ్లు, కూర‌గాయ‌లు ఉంచుకొంటే బాగుంటుంది.
8. ఆహారం ఒకే సారి ఎక్కువ‌గా తీసుకోవ‌ద్దు. మితంగా నాలుగైదు విడ‌త‌లుగా తీసుకోవ‌టం మేలు.
9. భోజ‌నం త‌ర్వాత స‌రిప‌డినంత నీరు తీసుకోవాలి.
10. రాత్రి భోజ‌నం త‌ర్వాత క‌నీసం 100 నుంచి 200 అడుగులు న‌డ‌వాలి. క‌నీసం అర‌గంట వ్యవ‌ధి త‌ర్వాతే నిద్రకు ఉప‌క్రమించాలి.

లైఫ్ లో టైమ్ టేబుల్ చాలా ముఖ్యం..


చిన్నప్పుడు స్కూల్ కు వెళ్లేప్పుడు టైమ్ టేబుల్ చెక్ చేసుకోవ‌టం అంద‌రికీ గుర్తుండే ఉంటుంది. టైమ్ టేబుల్ కు అనుగుణంగా బుక్స్ స‌ర్దుకోవ‌టం, హోమ్ వ‌ర్క్ వ‌గైరా పూర్తి చేసుకోవ‌టం అప్పట్లో త‌ప్పనిస‌రి. ఇప్పుడు అదే టైమ్ టేబుల్ ను గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే మ‌న శ‌రీరంలో కూడా అంత‌ర్గత అవ‌య‌వాల‌కు ఒక టైమ్ టేబుల్ ఉంటుంది. ఆయా భాగాల‌న్నీ ఒక టైమ్ ప్రకారం ప‌ని చేస్తాయి. ముఖ్యంగా జీర్ణ వ్యవ‌స్థలో ఇది స్పష్టంగా క‌నిపిస్తుంది.
ఆహారాన్ని తిన‌టం మొద‌లు పెట్టగానే నోటిలో లాలాజ‌లం ఊరుతుంది క‌దా. అప్పటి నుంచి లోప‌ల‌కు ప్రవేశించాక‌, ఒక్కో అవ‌యవాన్ని దాటుకొని వెళ్లేప్పుడు కొన్ని జీవ ర‌సాయ‌న ప్రక్రియ‌లు జ‌రుగుతాయి. ఇవ‌న్నీ ఒక స‌మ‌యానికి జ‌రిగేట్లుగా లోప‌ల బ‌యో వాచ్ అమ‌రి ఉంటుంది. ఆ స‌మ‌యానికి ఆయా అవ‌య‌వం అల‌ర్టు గా ఉంటుంది. ఉద‌యం టిఫిన్ స‌మ‌యం, మ‌ధ్యాహ్నం భోజ‌న స‌మ‌యం, సాయంత్రం స్నాక్స్ టైమ్‌, రాత్రి మ‌ళ్లీ ఆహారం తీసుకొనే స‌మ‌యం ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఆ స‌మ‌యంలో ఆహారం ఆయా అవ‌యవంలో చేరుకొంటే చ‌క్కగా జీర్ణం అవుతుంది. దీని వ‌ల్ల ఫ‌లితం స‌క్రమంగా అందుతుంది.

ఉద్యోగం, వ్యాపారం, ఇత‌ర ప‌నుల్లో ప‌డిన వారు ఈ స‌మ‌య పాల‌న ప‌ట్టించుకోరు. ముఖ్యంగా మ‌హిళ‌లు ఇంట్లో ఒంట‌రిగా ఉన్నప్పుడు ర‌క ర‌కాల స‌మ‌యాల్లో ఆహారం తీసుకొంటారు. దీని వ‌ల్ల ఈ బ‌యో వాచ్ స‌మ‌య పాల‌న పాడ‌వుతుంది. అటువంటి స‌మ‌యాల్లో శ‌రీరంలో జీవ ర‌సాయ‌న ప్రక్రియ‌ల‌కు ఇబ్బంది ఏర్పడుతుంది. ఈ ఇబ్బంది ని త‌ప్పించుకోవాలంటే సాధ్యమైనంత వ‌ర‌కు ఒకే స‌మ‌యంలో ఆహారం తీసుకొనే అల‌వాటు చేసుకోవటం మేలు.

ఆహార‌మే మ‌హాభాగ్యం


సామెత కొద్దిగా మారిన‌ట్లు అనిపిస్తోంది క‌దా..! ఆరోగ్యమే మ‌హా భాగ్యం అంటారు క‌దా, కానీ, ఈ ట్విస్ట్ ఏమిటి అనుకొంటున్నారా.. దీనికి ఒక కార‌ణం ఉంది. ఆరోగ్యానికి మూలం ఆహారం అన్న మాట‌. క‌లుషిత ఆహారంతో దాదాపు 35 శాతం దాకా క్రిములు వ్యాపిస్తాయ‌ట‌. ఆహారం జాగ్రత్తగా తీసుకొంటే ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ముఖ్యంగా వ‌ర్షాకాలం వ‌చ్చిందంటే ఆహారపు అల‌వాట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే వానలు ప‌డినప్పుడు సూక్ష్మక్రిములు ఎక్కువ‌గా వ్యాపిస్తాయి. వీటిని గుర్తించి ఆహారంలో మ‌లిన ప‌దార్థాలు లేకుండా చూసుకోవాలి. సాధ్యమైనంత వ‌ర‌కు బ‌య‌ట ఆహారం తీసుకోకుండా ఉంటే మేలు. ఇది అన్ని వేళ‌లా సాధ్యం కాదు, కాబ‌ట్టి బ‌య‌ట ఆహారం తీసుకొనేట‌ప్పుడు న‌మ్మక‌మైన చోట మాత్రమే తీసుకోవాలి. రోడ్ వెంబ‌డి ఉండే చాట్ బండ్ల ద‌గ్గర చాట్ లాగించేసే అల‌వాటు ఉంటే కాస్తజాగ్రత్త  తీసుకోవాలి. రోడ్ వెంట ఉండే సూక్ష్మక్రిములు ఈ ఆహారాన్ని ఆశిస్తాయి. దీంతో ఇబ్బంది త‌ప్పదు. ఆహారంతో పాటు తాగునీరు కూడా ముఖ్యమే. తాగునీరు లో మురికి నీరు క‌లిసిపోతే, క్రిములు వ్యాపించ‌టం త‌థ్యం. అందుకే తాగునీరు విష‌యంలో కూడా జాగ్రత్త త‌ప్పనిస‌రి...

మీ ఆరోగ్యం మీ చేతుల్లో...!


ఆరోగ్యమే మ‌హా భాగ్యం అంటారు. అటువంటి ఆరోగ్యం మ‌న చేతుల్లోనే ఉందంటే న‌మ్మగ‌ల‌రా..! అచ్చంగా ఇది నిజం. ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌టానికి చేతులే చ‌క్కటి మార్గం. ఎందుకంటే ఆరోగ్యాన్ని కాపాడేది చేతులే. ఆహారాన్ని తీసుకోటానికి, ఇత‌రుల‌తో చేతులు క‌లుపుకోవ‌టానికి, విస‌ర్జన స‌మ‌యంలోనూ అర‌చేతులు వాడుకొంటాం. ఆహారాన్ని తీసుకొనేట‌ప్పుడు అర చేతుల‌పై ఉండే సూక్ష్మజీవులు కూడా లోప‌ల‌కు వెళ్లిపోతాయి. ఆహారం చేసే మేలు మాట దేవుడెరుగు కానీ, ఈ సూక్ష్మ జీవులు చేసే హాని మాత్రం ఎక్కువే. ఈ సూక్ష్మ జీవులు ఒక‌రి నుంచి ఒక‌రికి వేగంగా వ్యాపిస్తాయి. సెంట‌ర్ ఫ‌ర్ డీసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప‌రిశోధ‌న‌ల ప్రకారం వ్యాధికార‌క సూక్ష్మ జీవుల వ్యాప్తిని నిరోధించ‌టంలో చేతుల శుభ్రత కీల‌క పాత్ర పోషిస్తుంది. ఆట‌ల‌మ్మ, క్షయ, కామెర్లు వంటి ఎయిర్ బోర్న్ వ్యాధుల వ్యాప్తి ఇది ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల్సిన అంశం.

చేతులు శుభ్రప‌ర‌చుకోవ‌టంలో అనేక ప‌ద్దతులు ఉన్నాయి. ఇవన్నీ చాలా చాలా సాధార‌ణ‌మైన ప‌ద్దతులు. స‌బ్బుతో నీరు ఉప‌యోగించుకొని క‌డుక్కోవ‌టం ఉత్తమ‌మైన ప‌ద్దతి. చేతులకు స‌బ్బు ప‌ట్టించి 20 సెక‌న్లుఆహారం తీసుకొనేముందు, మ‌ల విస‌ర్జన త‌ర్వాత చేతుల్ని శుభ్రం చేసుకొంటే చాలా వ్యాధికార‌కాల వ్యాప్తిని నిరోధించ‌వ‌చ్చు. కొన్నిసార్లు నేరుగా వేడినీటితో చేతుల్ని క‌డుక్కోవ‌చ్చు. స‌బ్సు సాలిడి కానీ, లిక్విడ్ కానీ ఉప‌యోగించుకోవ‌చ్చు. ఇటీవ‌ల కాలంలో హ్యాండ్ వాష్ వాడకం పెరిగింది. ఇది కూడా అభిల‌ష‌ణీయ‌మే. చేతులు శుభ్రంగా నీటితో క‌డుక్కోవ‌టం ఎంత ముఖ్యమో, ఆ త‌ర్వాత చేతుల్ని తుడుచుకొని పొడిగా ఉంచుకోవ‌టం కూడా అంతే ముఖ్యం.
సాధార‌ణ పౌరుల‌కు చేతుల శుభ్రత అవ‌స‌రం. కానీ, చేత్తో లేబ‌ర్ ప‌ని చేసే కార్మిక సోద‌రులు, మెకానిక్ లు, వ‌ర్కర్లు వంటి వారికి ఇది మ‌రింత అవ‌స‌రం. అప‌రిశుభ్ర ప‌రిస్థితుల్లో పని చేసే వారంతా గుర్తుంచుకోవ‌ల‌సిన విష‌యం. ఎక్కువ మంది ఒకే కంప్యూట‌ర్ మీద ప‌నిచేసే ప‌రిస్థితి ఉంటే కీ బోర్డ్ మీద ఉండే సూక్ష్మి క్రిములు చేతి వేళ్లకు అంటుకొంటాయి. వీటి ద్వారా క్రిములు శ‌రీరంలోకి వ్యాపిస్తాయి. ఈ పరిస్థితుల దృష్ట్యా ఆఫీసులోనే లంచ్ చేసే సిబ్బంది ద‌గ్గర హ్యాండ్ వాష్ ఉంచుకోవ‌టం మేలు. హోట‌ల్స్ లో భోజ‌నానికి వెళ్లినప్పుడు అక్కడ మ‌రింత శుభ్రత పాటించాల్సి ఉంటుంది.

కాలేయ సంర‌క్షణ మీ చేతుల్లో...!


-) కాలేయ వ్యాధుల‌కు సంబంధించిన అవ‌గాహ‌న అంద‌రికీ త‌ప్పనిస‌రి. ముఖ్యంగా ప్రమాద‌క‌ర‌మైన సిర్రోసిస్
గురించి అంద‌రూ తెలుసుకోవ‌టం మేలు.
-) ఈ వ్యాధి సోకిన‌ప్పుడు కాలేయం ప‌రిణామం కుచించుకొని పోతుంది. 
-) ఇటువంటి సంద‌ర్భాల్లో కాలేయం సాధార‌ణ స్థితికి చేర‌టం సాధ్యం కాదు.
-) కాలేయ మార్పిడి మాత్ర మే దీనికి ప‌రిష్కారం. భార‌త దేశంలో కాలేయ మార్పిడి కొన్ని చోట్ల జ‌రుగుతున్న‌ప్ప‌టికీ,
సామాన్యుల‌కు అందుబాటులో లేదు. ఈ శ‌స్త్ర చికిత్సకు, మందుల‌కు చాలా ఖ‌ర్చు కావ‌ట‌మే దీనికి కార‌ణం.
-) వ్యాధి నివార‌ణ క‌న్నా వ్యాధి నిరోధ చ‌ర్యల‌పై దృష్టి పెట్టాల్సి ఉంది.
-) కొన్ని సార్లు ఈ వ్యాధి క్యాన్సర్ కు దారి తీయ‌వ‌చ్చు.
ఈ వ్యాధికి నాలుగు కార‌ణాల్ని గుర్తించ‌వ‌చ్చు.
1) మ‌ద్యపానం - మ‌ద్యం ద్వారా కాలేయం ఎక్కువ‌గా పాడ‌వుతుంది. మ‌ద్యపానాన్ని పూర్తిగా మానివేయ‌టం 
ఉత్తమ ప‌రిష్కారం. లేదంటే వారానికి 10 ఔన్సుల‌కు దీన్ని ప‌రిమితం చేయాలి. అది కూడా ఒకే సారి కాకుండా
కొద్ది కొద్దిగా అనేక  సార్లు తీసుకోవ‌చ్చు.
2) హెప‌టైటిస్ బీ వైర‌స్‌... దీన్ని హెచ్ బీ వీ అని పిలుస్తారు. ఈ వైర‌స్ వ్యాప్తి తో సిర్రోసిస్ సంక్రమిస్తుంది. చిన్నత‌నంలోనే టీకా వేయిస్తే దీన్ని నిరోధించ‌వ‌చ్చు. వ్యాధి ముదిరిన‌ప్పుడు మందుల‌తో నివారించ‌వ‌చ్చు.అర‌క్షిత ర‌క్త మార్పిడి ద్వారా కూడా వ్యాధి సోక‌వ‌చ్చు. సుర‌క్షిత ర‌క్తాన్ని మాత్రమే స్వీక‌రించ‌టం మేలు.
3) హెప‌టైటిస్ సీ వైర‌స్‌.. దీన్ని హెచ్‌సీవీ అని పిలుస్తారు. కొన్ని మందుల ద్వారా  ఈ వైర‌స్ వ్యాప్తిని నియంత్రించ వ‌చ్చు. 
బీ, సీ ర‌కం వైరస్ ల వ్యాప్తికి ర‌క్తం మార్పిడి ఒక వాహ‌కం. అందుచేత ర‌క్తం స్వీక‌రించేట‌ప్పుడు ఈ వైర‌స్ లేన‌ట్లుగా నిర్ధారించ‌వ‌చ్చు.
4) కొవ్వు కార‌కాలు.. రానున్న రెండు ద‌శాబ్దాల్లో ఇది స‌ర్వ సాధార‌ణం కానుంది. ఎంత ఆహారం తీసుకొంటున్నారు, ఎంత వ్యాయామం చేస్తున్నారు అనే దానిపై ఇది ఆధార ప‌డి ఉంటుంది. మ‌నిషి ఎత్తు కి  త‌గిన‌ట్లుగా బరువు ఉండేట్లు చూసుకోవాలి. వ్యాయామం చేయ‌టం, మ‌ద్యాపానానికి దూరంగా ఉండ‌టం ద్వారా కాలేయంలో కొవ్వు చేర‌కుండా నివారించ‌వ‌చ్చు.
ఈ విధ‌మైన జాగ్రత్తలు తీసుకోవ‌టం ద్వారా 95 శాతం కాలేయ వ్యాధుల‌ను నివారించ‌వ‌చ్చు. లేనిప‌క్షంలో కాలేయ మార్పిడి అవ‌స‌రం అవుతుంది.

స్వాగ‌తం..


అచ్చ తెలుగులో ఆరోగ్య అంశాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించ‌ట‌మే మా ఉద్దేశం. ఇందుకోసం ఈ బ్లాగ్ ను ప్రారంభించా.. బ్లాగ్ కు స్వాగ‌తం...