...

SPECIALIZED SITE FOR HUMAN HEALTH CARE,
SPECIALLY ON GASTROENTEROLOGY, LIVER AND PANCREAS

తెగ కొనేసే అల‌వాటుందా..! జ‌ర భ‌ద్రం

కొన‌టం అనే అల‌వాటుతో ఒక చిక్కు ఉంది. దీనికి అల‌వాటు ప‌డితే అంత త్వర‌గా వ‌దులుకోలేరు. మిగిలిన విష‌యాల్ని ప‌క్కన పెడితే, మందుల విష‌యంలో మాత్రం దీని గురించి ప‌ట్టించుకోవాలి.

కొంత మంది అనారోగ్యాన్ని పెద్దగా పట్టించుకోరు. ఎటువంటి స‌మ‌స్య వ‌చ్చినా మందుల షాపు మీద పూర్తిగా ఆధార ప‌డ‌తారు. ఎంత పెద్ద సమ‌స్యకు అయినా మందుల షాపు కి వెళ్లి తోచిన మందులు తెచ్చుకొని వాడేస్తుంటారు. మాములు త‌ల‌నొప్పి , సాధార‌ణ జ్వరాల విష‌యంలో అయితే ఇటువంటి అల‌వాటు ఓకే. కానీ, అన్ని స‌మ‌స్యల‌కు ఇదే రూట్ లో వెళ్లటం అంత క‌రెక్ట్ కాదు. దీని వ‌ల‌న రెండు ర‌కాల స‌మ‌స్యలు ఉన్నాయి. స‌రైన చికిత్స అంద‌క పోవ‌టం కార‌ణంగా ఆ వ్యాధి ముదిరి పోవ‌చ్చు. హేండ్ మెడిసిన్స్ తో తాత్కాలికంగా త‌గ్గిన‌ట్లు అనిపించినా త‌ర్వాత కాలంలో రోగం ముదిరే చాన్సు ఉంటుంది. అప్పుడు బాగా ఇబ్బంది ప‌డాల్సి ఉంటుంది. మ‌రో వైపు ఈ టెంప‌ర‌రీ మెడిసిన్స్ ఎక్కువ తీసుకొంటే ఆ మందుల కార‌ణంగా సైడ్ ఎఫెక్ట్ లు వ‌చ్చే చాన్సు ఉంది. ఈ సైడ్ ఎఫెక్ట్ ల‌తో దీర్ఘకాలిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుచేత ఎక్కువ‌గా మందులు కొనేసే అల‌వాటుకి దూరంగా ఉంటే మేలు.

తాగునీటి విష‌యంలో గుర్తుంచుకోవాల్సిన విష‌యాలు..!

తాగునీరు చేసే మేలు అంతా ఇంతా కాదు. జ‌ర్నల్ ఆఫ్ క్లినిక‌ల్ మెట‌బాలిజ‌మ్ చేసిన ఒక అధ్యయ‌నంలో తాగునీటితో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజ‌నాలు ఉన్నాయని తేలింది. బ‌రువు త‌గ్గాల‌నుకొనే వారికి నీరు ఒక మంచి మార్గం చూపుతుంది.

 ప‌రిశుద్ధమైన నీటిని తాగితే మెట‌బాలిక్ రేటు 30 శాతం త‌గ్గుతుంద‌ని ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి. నీరు తీసుకొన్న అర‌గంట దాకా ఈ ప్రభావం ఉంటుంది. అంతే గాకుండా భోజ‌నం తీసుకొనేముందు కొద్దిగా నీరు తీసుకోవ‌చ్చు. మరీ ఎక్కువ తాగ‌టం మంచిది కాదు. కొద్ది గా నీరు తీసుకోవ‌టం తో జీర్ణాశ‌యంలో జీర్ణ ప్రక్రియ‌కు రంగం సిద్దం అవుతుంది. దీంతో ఆహారం చ‌క్కగా జీర్ణం అవుతుంది. అంతే కాదు ఆహారం మితి మీరి తీసుకొనే వారికి నీరు చెక్ చెబుతుంది. క‌డుపులో 50 శాతం ఘ‌న ఆహారం, 25 శాతం నీరు, 25 శాతం ఖాళీ ఉంటే జీర్ణం కావ‌టం తేలిగ్గా ఉంటుంది. అక్కడ ఆహారం చ‌క్కగా క‌ద‌లాడి పూర్తి గా శ‌క్తి శ‌రీరానికి అందుతుంది. దీంతో ఉత్సాహంగా ఉండ‌టానికి వీల‌వుతుంది.

టీ తాగితే క్యాన్సర్ వ‌స్తుందా..! కొట్టి పారేయ‌వ‌ద్దు సుమా..!

టీ తాగ‌టం అన్నది ఈ రోజుల్లో అంద‌రికీ ఉన్న అలవాటు. ఇదేమి చెడ్డ అల‌వాటు కానేకాదు. ఉద‌యం లేచిన త‌ర్వాత వేడి టీ తో గుడ్ మార్నింగ్ చెప్పుకోవ‌టం ఒక ఆహ్లాద‌క‌ర‌మైన అనుభూతి. అందుచేత రోజుకి 2,3 సార్లు టీ తాగ‌టం లో త‌ప్పేమీ లేదు. దీని వ‌ల్ల నాడీ వ్యవ‌స్థ లో చురుకుద‌నం పుడుతుంది. అందుచేత ఫ్రెష్ ఐడియాల కోసం కొంత మంది టీ ల‌ను ఆశ్రయిస్తారు. కానీ, అదే ప‌నిగా టీలు తాగ‌టం మాత్రం మంచిది కాదు. దీని వ‌ల‌న శ‌రీరం టీ కి అల‌వాటు ప‌డితే కష్టం. కొంత మంది వేళ‌కు టీ తాగ‌క‌పోతే త‌ల‌పోటు వ‌స్తుంద‌ని చెబుతారు. అంత‌కు మించి టీ లు ఎక్కువ తాగ‌టం వ‌ల‌న ఎసిడిటీ వంటి స‌మ‌స్యలు వ‌స్తాయి. కొంత‌మంది భోజ‌నం తినే స‌మ‌యంలో టీల‌ను ఎక్కువ తాగుతారు. వాస్తవానికి ఆ స‌మ‌యానికి భోజ‌నం తింటార‌న్న ఉద్దేశంలో శ‌రీరంలోని గ్రంథులు యాక్టివ్ అయిపోయి ఉంటాయి. అందుచేత ఆయా ఎంజైమ్ లు బ‌య‌ట‌కు వ‌స్తాయి. కానీ టీ ను తాగ‌టంతో ఈ ఎంజైమ్ లు, టీ తో క‌ల‌గ‌లిసి వేరే ఉత్పన్నకాలుగా మార‌తాయి.

అయితే కొంత‌మందికి వేడి వేడిగా ఉండే టీ తాగ‌టం అల‌వాటు. ఎంత వేడి టీ తాగితే అంత గొప్ప అనుకొంటారు. కానీ, ఇంత‌టి వేడి టీ తాగ‌టం వ‌ల‌న గొంతులోప‌ల‌కు దిగేట‌ప్పుడు ఆహార వాహిక లోని మ్యూక‌స్ పొర‌ల్ని ఇబ్బంది పెడ‌తాయి. దీని వ‌ల‌న అక్కడ క‌ణ జాలం ఈ వేడికి క‌రిగి పోయి ఇత‌ర ప‌దార్థాలుగా మారుతుంది. కొన్ని సార్లు ఈ అవాంచ‌నీయ ప‌దార్థం ఎక్కువ‌గా పోగుప‌డి క‌ణితిగా మారుతుంది. కొంత‌మందిలో ఈ క‌ణితి క్యాన్సర్ గా మారిన సంద‌ర్భాలు ఉన్నాయి. అందుచేతే వేడి వేడి టీలు అదే ప‌నిగా తాగ‌టం మంచిది కాదు. రోజుకి 2,3 సార్లు చ‌క్కగా టీ తాగి ఆ టేస్ట్ ను ఎంజాయ్ చేయ‌వ‌చ్చు. దీనికి మిరియాల టీ, అల్లం టీ, గ్రీన్ టీ వంటి ప్రత్యామ్నాయాలు కూడా ఉన్నాయి

అంతా హైద‌రాబాద్ చుట్టూ ... ఎందుచేత !

హైద‌రాబాద్ రాష్ట్రానికి రాజ‌ధాని. అందుచేత ఎక్కువ మందికి హైద‌రాబాద్ తో అనుబంధం ఉంటుంది. ఏ అవ‌స‌రం వ‌చ్చినా హైద‌రాబాద్ కు వ‌చ్చే అల‌వాటు ఉంటుంది. ఏ రాష్ట్రంలో అయినా ఇది స‌ర్వ సాధార‌ణం.
ముఖ్యంగా హైద‌రాబాద్ ఇప్పుడు ఆరోగ్య రాజ‌ధాని గా మారుతోంది. అన్ని స్పెష‌లైజేష‌న్ ల‌లో చ‌క్కటి చికిత్స ల‌భిస్తోంది. వ్యాధి నిర్ధార‌ణ‌కు ఆధునిక ప‌రికరాలు అందుబాటులోకి వచ్చాయి. అంత‌ర్జాతీయ స్థాయి ప‌రిశోధ‌న‌ల వివ‌రాలు అందిపుచ్చుకోగ‌లుగుతున్నారు.

 ఒక‌ప్పుడు ఇన్ని స్పెష‌లైజేష‌న్ లు ఉండేవి కావు. కిడ్నీ మార్పిడి చేస్తే అద్భుతంగా చెప్పుకొనేవారు. ఇప్పుడు కాలేయ మార్పిడి ఆప‌రేష‌న్ లు కూడా చేయ‌టం సాధ్యం అవుతోంది. కాలేయ మార్పిడి అన్నది నిపుణులైన వైద్యులు మాత్ర మే చేయ‌గ‌లుగుతారు. ముఖ్యంగా అందుకు అవ‌స‌ర‌మైన సౌక‌ర్యాలు క‌లిగిన ఆప‌రేష‌న్ థియోట‌ర్  ఉండాలి. ముఖ్యంగా చీఫ్ సర్జన్ కు స‌హ‌క‌రించే ఇత‌ర వైద్య నిపుణులు కూడా అందుబాటులో ఉండాలి. అప్పుడే కాలేయ మార్పిడి ఆప‌రేష‌న్ చేయ‌టానికి వీల‌వుతుంది. కొన్ని సంవ‌త్సరాలుగా కాలేయ‌మార్పిడి చేయించుకొంటున్న రోగులు ఇక్కడ ఎక్కువ‌గా ఉంటున్నారు. ఆప‌రేష‌న్ త‌ర్వాత స‌ర్జన్ గా వాళ్లతో మాట్లాడిన‌ప్పుడు ఇంత‌టి మెరుగైన చికిత్సలు హైద‌రాబాద్ లో ల‌భించ‌టం చాలా సంతోషంగా ఉంద‌ని చెబుతున్నారు. అందుకే ఇది ఆరోగ్య రాజ‌ధాని అనుకోవ‌టంలో త‌ప్పులేదు. ఇక్కడి వైద్యులు చికిత్స తో పాటు అభిమానాన్ని, ఆప్యాయ‌త‌ను అందిస్తార‌ని ఒక పేషంట్ అన్నప్పుడు చాలా సంతోషం క‌లిగింది. అందుకే ఎక్కడెక్కడ నుంచో రోగులు హైద‌రాబాద్ చుట్టు తిరుగుతున్నారు.

ఢిల్లీ లో ప‌ల్స్ ఏమిటి.. ఏం చేయ‌బోతున్నారు..!

ఢిల్లీ అంటే దేశానికి అంత‌టికీ రాజ‌ధాని. అక్కడ జ‌రిగే యాక్టివిటీస్ గురించి అంద‌రికీ బాగా ఆసక్తి ఉంటుంది. స‌రి క‌దా, అన్ని రాష్ట్రాల ప్రజ‌ల‌కు అనుబంధం ఉంటుంది. అందుకే ఢిల్లీ ప‌ల్స్ కు అంత‌టి ప్రాధాన్యం ఉంటుంది.
అస‌లు ప‌ల్స్ అంటే వైద్య విద్యార్థుల క‌ల‌యిక అని అర్థం. ఢిల్లీ లో ఉండే అఖిల భార‌త వైద్య విజ్ఞాన సంస్థ దీన్ని నిర్వహిస్తుంది. దేశ వ్యాప్తంగా మెడిక‌ల్ కాలేజీలు ఉన్నప్పటికీ, ఎయిమ్స్, ల‌క్నో లో ఉండే సంజ‌య్ గాంధీ పోస్టు గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ (ఎస్‌జిపిజిఐ), జిప్‌మ‌ర్ వంటి సంస్థలు చాలా ప్రతిష్టాత్మక‌మైన‌వి. అక్కడ చ‌దువుకొన్న వైద్య శాస్త్ర వేత్తల‌కు ఆయా స‌బ్జెక్టు ల్లో గట్టి ప‌ట్టు దొర‌కుతుంది. ఆయా స‌బ్జెక్టుల్లో నిష్ణాతులుగా త‌యారు చేయ‌టానికి ఈ సంస్థలు అంత‌ర్జాతీయంగా పేరు గ‌డించాయి.

 ఎస్‌జిపిజిఐ లో గ్యాస్ట్రో ఎంట‌రాల‌జిస్ట్ గా ప‌రిశోధ‌న‌లు చేసిన‌ప్పుడు వైద్య వృత్తిని త‌పస్సు లా భావించాల‌ని అర్థం అయింది. ఒక రుషి మాదిరిగా అధ్యయ‌నం చేస్తేనే వైద్య వృత్తి లో ప‌ట్టు సాధించ‌వ‌చ్చని అర్థం అయింది. అందుకే తోటి మెడికోల‌ను క‌లిసిన‌ప్పుడు వారి అధ్యయ‌న రీతులు తెలిసేవి. స‌రిగ్గా ఈ క‌ల‌యిక దిశ‌గానే ప్రతీ ఏటా  వైద్య విద్యార్థుల‌కు ఢిల్లీ లో ప‌ల్స్ పేరుతో ఒక స‌మ్మేళ‌నం నిర్వహిస్తారు. భార‌త్ నుంచే గాకుండా అనేక ద‌క్షిణాసియా దేశాల నుంచి వైద్య విద్యార్థులు, ప‌రిశోధ‌కులు ఇక్కడ‌కు హాజ‌ర‌వుతుంటారు.
ఇటు వైద్య వృత్తి లో ఉన్న వారు కూడా ఎప్పటిక‌ప్పుడు అప్ డేట్ విజ్ఞానం తెలుసుకొంటూ ఉండాలి. ప్రపంచ వ్యాప్తంగా   వైద్య రంగంలో జ‌రిగే ప‌రిశోధ‌న‌ల వివ‌రాలు ఎప్పటిక‌ప్పుడు తెలుసుకొంటూ ఉండాలి. అందుకే వృత్తి ప‌ర‌మైన స‌ద‌స్సులు జ‌రుగుతు ఉంటాయి. దేశ వ్యాప్తంగా ఉండే జీర్ణ కోశ వ్యాధుల నిపుణుల‌కు జాతీయ స‌ర్జిక‌ల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టుల అసోసియేష‌న్ ఉంది. దీనికి జాతీయ ఎగ్జిక్యూటివ్ మెంబ‌ర్ గా అనేక సెమినార్ లు నిర్వహించిన‌ప్పుడు అంత‌ర్జాతీయ ప‌రిశోధ‌న‌ల వివ‌రాలు చెప్పటానికి ప్రాధాన్యం ఇస్తుంటాను. త్రివేండ్రం, బెంగ‌ళూరు, గౌహ‌తి వంటి చోట్ల ఈ మ‌ధ్య కాలంలో అక్కడ స‌ర్జన్ ల‌కు శిక్షణ ఇచ్చిన‌ప్పుడు ఎన్నో అంశాలు ప్రస్తావ‌న‌కు వ‌చ్చాయి. ఒక‌ప్పటితో పోల్చిన‌ప్పుడు అంత‌ర్జాతీయ స్థాయిలో జీర్ణ కోశం, కాలేయం, క్లోమం వంటి అంత‌రాంగాల చికిత్సలో అద్భుత‌మైన ఫ‌లితాలు వ‌స్తున్నాయి. వీటిని తెలుసుకొని అవ‌గాహ‌న‌తో మెలిగితే దీర్ఘకాలిక రోగాలు కూడా న‌యం అవుతాయి. పెద్ద రోగం ఉంద‌ని తెలిసిన‌ప్పుడు కంగారు ప‌డ‌కుండా మెరుగైన చికిత్సలు మ‌న భార‌త్ లో, మ‌న హైద‌రాబాద్ లో అందుబాటులో ఉన్నాయని చెప్పట‌మే నా ఉద్దేశం సుమా..అంత‌కు మించి ఢిల్లీ ప‌ల్స్ గురించి నేను వివ‌రాలు అందించ‌టం లేదు.

డాష్ అంటే ఏమిటో తెలుసా..!

 వైద్య ప‌రిభాష‌లో  డాష్ అంటే వేరే అర్థం ఉంది.
డ‌యిట‌రీ అప్రోచ్ టూ స్టాప్ హైప‌ర్ టెన్షన్ (Dietary Approaches to Stop Hypertension (DASH))అన్న మాట‌. అంటే హైప‌ర్ టెన్షన్ స‌మ‌స్యను అధిగ‌మించాలంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలి అనే దానిపై అనేక అధ్యయ‌నాలు జ‌రుగుతున్నాయి. అనారోగ్యానికి దారి తీసే ఆహారాన్ని ప‌క్కన పెట్టేసి చ‌క్కటి ఆరోగ్యాన్ని పెంచే ఆహారాన్ని ప్రోత్సహించ‌టం అన్న మాట‌. ఇందులో పండ్లు, తాజా కూర‌లు, ప‌ప్పు ధాన్యాలు, గుడ్లు వంటివి ఉంటాయి. వీటిలో పొటాషియం, కాల్షియం, పీచు, ప్రోటీన్సు ఎక్కువ‌గా ఉంటాయి. అంతే గాకుండా సోడియం, చ‌క్కెర‌, కొవ్వుల శాతం త‌క్కువ‌గా ఉంటాయి. ప‌ప్పు ధాన్యాలు 7-8 మోతాదులు, కూర‌లు 4-5 మోతాదులు, పండ్ల ముక్కలు 4-5 మోతాదులు ఉంటే మేలు. తాజా ఫుడ్స్ కు ప్రాధాన్యం ఇస్తే మేలు. దీంతో పాటు సోడియం లేక సాల్ట్ ఒక టీ స్పూన్ మించ‌కుండా చూసుకోవాలి. జంక్ పుడ్‌, ఎక్కువ కొవ్వులు ఉండే ఆహారాన్ని తీసుకోవాల‌ని సూచిస్తున్నారు. అయితే ఆహారపు అల‌వాట్లను ఒక్కసారి మార్చుకోవ‌టం మంచిది కాదు. నెమ్మదిగా షెడ్యూల్ ప్రకారం మార్చుకోవ‌టం ఉత్తమం.

స‌మైక్యంగా ఉంచ‌టం సాధ్యమేనా..! లాభ న‌ష్టాలు ఏమిటి..!

క‌లిపి ఉంటే స‌మైక్యం అని, విడివిడిగా ఉంచితే ప్రత్యేకం అని సూటిగా చెప్పుకోవ‌చ్చు. అందుకే స‌మైక్యం మేలా, ప్రత్యేకం మేలా అన్న దానిపై చ‌ర్చలు జ‌రుగుతుంటాయి. ఈ రెంటిని విడ‌దీసి చూడ‌లేం. అలాగ‌ని క‌లిపేసి ఆలోచించ‌లేం. దేని ప్రత్యేక‌త దానిదే.

మ‌నం రోజు తీసుకొనే ఆహారం విష‌యంలో కూడా ఈ కోణాన్ని ఆలోచించాలి. ఆహారంలో ప్రధానంగా కార్బొహైడ్రేట్‌లు, ప్రోటీన్‌లు, కొవ్వు ప‌దార్థాలు ప్రధానంగా ఉంటాయి. వీటితో పాటు విటమిన్ లు, ల‌వ‌ణాలు, పోష‌కాలు, నీరు మొ. కూడా ఉంటాయి. ప్రధానంగా ఉండే కార్బొహైడ్రేట్‌లు, ప్రోటీన్ లు, కొవ్వులు వంటివి ఏ శాతంలో ఉండాలి అనేది నిర్ధిష్టంగా ఉంటుంది. ఉదాహ‌ర‌ణ‌కు రోజుకి 2000 క్యాల‌రీల శ‌క్తి అవ‌స‌రం అనుకొందాం. ఇందులో కార్బొహైడ్రేట్ లు-225 గ్రా.లు, ప్రోటీన్ లు - 150 గ్రా.లు, కొవ్వులు-55 గ్రా.లు తీసుకొంటే మేలుగా ఉంటుంది. అంటే కార్బొహైడ్రేట్ లు-900 క్యాల‌రీలు, ప్రోటీన్ లు - 600 క్యాల‌రీలు, కొవ్వులు- 500 క్యాల‌రీల శ‌క్తిని ఉత్పత్తి చేయాల‌న్న మాట‌. అందుచేత ఈ అంశాల‌న్నీ ఉండే మాదిరిగా స‌మ‌గ్రమైన ఆహారం తీసుకోవాలి. ఆహార సంబంధిత ప‌దార్థాల్ని స‌మైక్యంగా తీసుకోవ‌చ్చు. లేదా విడి విడిగా అయినా తీసుకోవ‌చ్చు. కానీ మొత్తం మీద స‌మ‌గ్ర ఆహారం తీసుకోవ‌ట‌మే ప్రధానం.

ఉప్పు చేసి త‌ప్పు కూడు..!

 ఇదేదో అక్షర దోషం అనుకోవ‌ద్దు సుమా. ఇది వాస్తవం. అప్పు చేసి పప్పు కూడు తిన‌వ‌ద్దని సామెత ఉంది. ఆ విష‌యాన్ని ప‌క్కన పెడితే ఉప్పు తో చేసిన ఆహారం ఎంత వ‌ర‌కు అవ‌స‌రం అన్నది తెలుసుకోవాలి. ఉప్పు లేనిదే ఇంట్లో కూర‌లు, ప‌చ్చళ్లు సాధ్యం కాదు. వీటితో పాటు పెరుగు లేక మ‌జ్జిగ లో కూడా ఉప్పు వాడే అల‌వాటు ఉంటుంది.

వాస్తవానికి ఉప్పు తోటే రుచి వ‌స్తుంది. ఇందులోని సోడియం ల‌వ‌ణం రూపంలో శ‌రీరానికి స‌హ‌క‌రిస్తుంది. కానీ, ఇది ఎక్కువ అయినా, త‌క్కువ అయినా ఇబ్బందే. వాస్తవానికి ఒక రోజుకి ఒక మ‌నిషికి1,500మి.గ్రా. ఉప్పు స‌రిపోతుంది. అంటే అర స్పూన్ ఉప్పు అన్నమాట‌. న‌లుగురు ఉన్న కుటుంబంలో కూర, ప‌చ్చళ్లు, సూప్ త‌యారు చేసుకొంటే అందులో రెండు స్పూన్ లు ఉంటే చాలు అన్న మాట‌. అది కూడా ఉద‌యం బ్రేక్ ఫాస్ట్, మ‌ధ్యాహ్నం లంచ్‌, రాత్రి డిన్నర్ లో క‌లుపుకొని లెక్క వేసుకోవాలి. ఇక‌, పెరుగు లేక మ‌జ్జిగ లో సాల్ట్ క‌లుపుకొంటే ఒక‌టిన్నర స్పూన్ సాల్ట్ తీసుకొన్నట్లు అవుతుంది. అంటే దాదాపు 4,500 మి.గ్రా. తీసుకొన్నట్లు అన్న మాట‌. దీని వ‌ల‌న ర‌క్తంలో సోడియం శాతం పెరుగుతుంది. ఇది బ్లడ్ ప్రెజ‌ర్‌, హైప‌ర్ టెన్సన్ వంటి స‌మ‌స్యల‌కు దారి తీస్తుంది. అందుచేత ఆహారంలో ఉప్పు శాతం ప‌రిమితంగా ఉంచుకొంటే అనారోగ్యం దూరంగా ఉంటుంది. అప్పుడు త‌ప్పు ఆహారం తీసుకోకుండా ఉండ‌వ‌చ్చు.

కూర‌గాయ‌లు, పండ్ల తో ఆ టైప్ లో స‌మ‌స్య ఉంటుందా..!

తాజా కూర‌లు, పండ్లు తీసుకొంటే ఆరోగ్యానికి మంచిది. ఆ సంగ‌తి అంద‌రికీ తెలిసిందే.. కానీ, పుస్తకాల్లో చెప్పిన విధంగా ఆ కూర‌లు, పండ్లు తీసుకొంటే విటిమిన్స్, పోష‌కాలు వ‌స్తాయా అన్న పాయింట్ ద‌గ్గరే చ‌ర్చ న‌డుస్తోంది. ఎందుకంటే ఒక్కో ర‌కం పండులో ఒక్కో రకం విటమిన్ లు, పోష‌కాలు , యాంటీ ఆక్సిడెంట్ లు ఉంటాయి

.అయితే ఇటీవ‌ల కాలంలో పండ్లు, కూర‌గాయ‌ల సాగులో ర‌సాయ‌నాల వాడ‌కం ఎక్కువ అయిపోయింది. దీంతో స‌హ‌జంగా ఉండాల్సిన పోష‌కాలు, విట‌మిన్ ల స్థానంలో ర‌సాయ‌నాలు ఎక్కువ అయిపోతున్నాయి. కూర‌ల్ని బాగా ఉడికించి, ఉప‌యోగించిన‌ప్పుడు ప‌రిస్థితి వేరు. కానీ, ప‌చ్చి కూర‌లు, పండ్లు తినేట‌ప్పుడు పోష‌కాల స్థానంలో ర‌సాయ‌నాలు ఉండిపోతున్నాయ‌న్న వాద‌న ఉంది. హార్ట్ సైన్స్ అనే అంత‌ర్జాతీయ సైన్స్ జ‌ర్నల్ ప్రచురించిన స‌ర్వే ప్రకారం 50 సంవ‌త్సరాల క్రితంతో పోలిస్తే పండ్లు, కూర‌గాయ‌ల్లో పోష‌కాలు బాగా త‌గ్గిపోయాయి. గ‌తంలో ఒక నారింజ తీసుకొంటే వ‌చ్చే విటమిన్ లు, పోష‌కాలు .. ఇప్పుడు 8 నారింజ‌లు తీసుకొంటే త‌ప్ప శ‌రీరానికి అంద‌టం లేద‌ని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ప‌చ్చి కూర‌లు, తాజా పండ్ల విష‌యంలో కూడా అనేక పండ్లు, కూర‌లు తీసుకొంటేనే ఫ‌లితం ఉంటుంద‌ని చెబుతున్నారు. అందుచేత అర కొర‌గా పండ్లు, కూర‌లు తీసుకొనే బ‌దులు క్రమం త‌ప్పకుండా తీసుకొంటే ఫ‌లితం అందుకోటానికి వీలు ఉంటుంది.

ఫుల్ గా ఆహారం తింటే వ‌య‌స్సు త‌గ్గిపోతుందా..!

వ‌య‌స్సు ఎప్పటికీ త‌గ్గేదు కాదుకానీ, వ‌య‌స్సు తగ్గిన‌ట్లుగా క‌నిపించ‌టం అన్నది సాధ్యం అవుతుంది. అది కూడా చ‌క్కటి ఆరోగ్యాన్ని క‌లిగి ఉంటే మాత్రమే ఇది సాధ్యం అవుతుంది. ఇందుకు అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఆహారంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవ‌టం ద్వారా వ‌య‌స్సు భారాన్ని క‌నిపించ‌కుండా చేసుకోవ‌చ్చు. ఇందుకు యాంటి ఆక్సిడెంట్స్ బాగా ఉప‌యోగ ప‌డ‌తాయి. ముఖ్యంగా విట‌మిన్ సీ, జింక్‌, బీటా-కెరోటిన్ వంటి కాంపొనెంట్స్ క్రమం త‌ప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది.

ఇది ముఖ్యంగా తాజా ఆకు కూర‌లు, కూర‌లు, పండ్లు లో ల‌భిస్తాయి. ఆహార‌పు మెనూ లో వీటిని క‌చ్చితంగా ఉంచుకోవ‌టం మ‌రిచిపోకూడదు.  కార్బోహైడ్రేట్ ల‌ను త‌గ్గించి,  ప్రోటీన్స్ ను పెంచుకొంటూ స‌మ‌పాళ్ల లో ఆహారం తీసుకొంటే శ‌రీరం ప‌టిష్టంగా ఉంటుంది. ఆరోగ్యం కుదురుగా ఉంటుంది. చేప‌లు బ‌ల‌వ‌ర్థక ఆహారం. ఇందులోని ఒమేగా -3 ఫాటీ ఆసిడ్స్ ప‌టిష్టత‌కు ఉప‌క‌రిస్తాయి. పాలు, పెరుగు తీసుకొంటే కాల్సియం ల‌భిస్తుంది. దీంతో పాటు సూర్య ర‌శ్మి త‌గిలేట్లుగా చూసుకొంటే విట‌మిన్ డీ వృద్ధి చెందుతుంది. వీటితో పాటు ఎక్కువ కొవ్వులు ఉండే మాంసాహారాన్ని, స్వీట్స్, జంక్ ఫుడ్ ల‌ను దూరం పెట్టాలి. అప్పుడే ఆహారం నుంచి ల‌భించే సుగుణాలు ల‌భించి ఆరోగ్యం భేష్ గా ఉంటుంది. త‌ద్వారా వ‌య‌స్సు త‌గ్గిన‌ట్లుగా న‌వ న‌వ లాడుతూ  క‌నిపించ‌వ‌చ్చు.

అన్నంతో .......... అన‌ర్థమా..!

అన్నం ప‌ర‌బ్రహ్మ స్వరూపం అంటారు. ఎందుకంటే అన్నం తిన‌టం అన్నది ద‌క్షిణ భార‌త దేశంలో ప్రాథ‌మిక అల‌వాటు. ప్రధాన ఆహారంగా అన్నం ను ఇక్కడివారంతా భావిస్తారు. రెండు పూటలా అన్నం తిన‌ట‌మే ఆరోగ్యక‌ర ల‌క్షణంగా చెబుతారు.

 అన్నం కు మూల రూపమైన బియ్యం అన్ని ప్రాంతాల్లో ల‌భిస్తుంది. ధాన్యాన్ని ఆడించి బియ్యాన్ని త‌యారు చేస్తారని మ‌న‌కు అంద‌రికీ తెలుసు. కానీ, వ‌రి పంట లో ఎక్కువ దిగుబ‌డి కోసం ఎరువులు, పురుగు మందుల వాడ‌కం ఇటీవ‌ల కాలంలో బాగా ఎక్కువ అయింది. ఈ ర‌సాయ‌నాల వాడ‌కంలోరైతులు పోటీ ప‌డే ప‌రిస్థితి నెలకొంది. ఈ ర‌సాయ‌నాల అవశేషాలు మొక్కలోకి ఇంకి పోయి, అంతిమంగా ధాన్యంలో నిక్షిప్తం అవుతున్నాయి. ఫ‌లితంగా ఈ బియ్యాన్ని వాడేట‌ప్పుడు ఈ ర‌సాయ‌నాల ఉత్పన్నకాలు శ‌రీరంలోకి ప్రవేశిస్తాయి. అన్నం ఉడికించి తింటాం కాబ‌ట్టి చాలా ర‌కాల అవ‌శేషాలు తొల‌గిపోతాయి. కానీ, ఆర్సినిక్ వంటి ర‌సాయ‌న ప‌దార్థాలు మాత్రం ఉడికించినా తొల‌గిపోవు. అందుచేత ఈ విష ప‌దార్థాలు క్రమంగా శ‌రీరంలో పోగు ప‌డ‌తాయి. ఇవి అనారోగ్యానికి కార‌ణం అవుతుంటాయి.
ఇటువంటి విష‌యాలు ఆలోచిస్తుంటే క‌డుపు త‌రుక్కొని పోతుంది. వ్యక్తిగ‌తంగా ఇటువంటి ప‌రిస్థితిని ఫేస్ చేయ‌టమూ క‌ష్టమే. అందుకే వ్యవ‌స్థలోనే మార్పులు రావాలి. అప్పటిదాకా స‌మ‌స్య త‌ప్పదు.

అటువంటి ఉద్యోగాల్లో జాగ్రత్త త‌ప్పనిస‌రి..!

ఒక‌ప్పుడు ఉద్యోగాలు అంటే నిర్ణీత ప‌ని వేళ‌లు ఉండేవి. ఉద‌యం ఆఫీసుకి వెళితే సాయంత్రానికి ఇంటికి వచ్చే వెసులుబాటు ఉండేది. కాల‌క్రమంలో షిప్టుల్లో ప‌ని చేయాల్సిన ఉద్యోగాలు ఎక్కువ అయ్యాయి. ఇటువంటి ఉద్యోగులు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి.
ముఖ్యంగా షిప్టు ల్లో ప‌ని చేసే ఉద్యోగుల‌కు ... ఫిఫ్టులు మారుతుంటాయి. సాధార‌ణంగా ఉద‌యం ఆరు నుంచి రెండు గంట‌ల దాకా ఉద‌యం షిప్టు, రెండు గంట‌ల నుంచి 10 గంట‌ల దాకా మ‌ధ్యాహ్నం షిప్టు, రాత్రి 10 నుంచి ఉద‌యం ఆరు దాకా నైట్ షిఫ్టుగా చాలా చోట్ల అమ‌లు అవుతుంటుంది. కొన్ని చోట్ల 1,2 గంట‌లు అటూ ఇటూ గా షిప్టు లు మారుతుంటాయి. ఏది ఏమైనా ఒక వారం ఉద‌యం ప‌ని చేస్తే, రెండో వారం మ‌ద్యాహ్నం, ఆ త‌ర్వాత నైట్ ప‌ని చేయాల్సి ఉంటుంది. ఈ ప‌ని వేళ‌లు మారిన‌ప్పుడ‌ల్లా ఆహారం తీసుకొనే స‌మ‌యం మారిపోతూ ఉంటుంది. అదే ప్రమాదం.

 ఉద‌యం షిప్టు నుంచి ఇంటికి వ‌చ్చాక 3,4 గంట‌ల‌కు భోజ‌నం చేస్తే రాత్రి త్వరగా ప‌డుకొనేందుకు గాను 7,8 గంట‌ల‌కే తినేస్తారు. మ‌ధ్యాహ్నం షిప్టు ఉన్నప్పుడు 12,ఒంటి గంట‌కు తినేసి ఆఫీసుకి వెళ్లి రాత్రి ఇంటికి వ‌చ్చాక అంటే 11,12 గంట‌ల‌కు డిన్నర్ చేస్తారు. రాత్రి షిప్టు ఉన్నప్పుడు డ్యూటి నుంచి వ‌చ్చాక ప‌డుకొని 4,5 గంట‌ల‌కు నిద్ర లేచి తినటం, మ‌ళ్లీ ఆఫీసుకి వెళ్లే ముందు 8,9 గంట‌ల‌కు తినటం చేస్తుంటారు. ఈ ర‌కంగా టైమ్ కాని టైమ్ ల్లో భోజ‌నం తిన‌టం వ‌ల‌న ఆరోగ్యం బాగా చెడిపోతుంది.

దీన్ని నివారించుకొనేందుకు ఒక నిర్దిష్ట స‌మ‌యం లోనే బోజ‌నం చేయ‌టాన్ని అల‌వ‌ర్చుకోవాలి. ఇందుకోసం షిప్ట్ విధుల్లో సైతం అడ్జస్ట్ చేసుకోవాలి. క్యారియ‌ర్ తీసుకొని వెళ్లటం, స‌మ‌యానికి బ‌య‌ట‌కు వ‌చ్చి బోజ‌నం చేయ‌టం అల‌వాటు చేసుకోవాలి. దీని వ‌ల‌న ఒకే స‌మ‌యానికి ఆహారం తీసుకొనటం సాధ్యం అవుతుంది. స‌క్రమంగా శ‌క్తి స‌ర‌ఫ‌రా అవుతుంది.

ఆదివారం రోజున ఆ ఐదింటితో కాస్త జాగ్రత్త..!

ఆదివారం వచ్చిందంటే పిల్లల‌కు పండ‌గే. ఎంచ‌క్కా స్కూల్ కి వెళ్లన‌క్కర లేదు. హాలీ డే ని ఎంజాయ్ చేయ‌చ్చు. అందుకే ఆదివారం రోజున ఫుల్ జోష్ లో ఉంటారు ఈ స్పీడ్ లో రోజువారి ఫుడ్ కు భిన్నంగా వెరైటీ గా తినాల‌నుకొంటారు. కొంత‌వ‌ర‌కు ఇది ఫ‌ర్వాలేదు కానీ, అదే ప‌నిగా రూట్ మారిస్తే మాత్రం ఇబ్బందే.
ఆది వారం వంటి సెల‌వు దినాల్లో పిల్లల ఫుడ్ లో ఇబ్బందిక‌ర‌మైన ఐదింటిని ప్రిన్సిట‌న్ యూనివ‌ర్శిటీ గుర్తించింది. ఆ సంస్థ చెప్పిన వివ‌రాల ప్రకారం ఆదివారం నాడు పిల్లల‌కు ఎక్కువ‌గా జంక్ ఫుడ్ తీసుకొంటారు. ఈ జంక్ ఫుడ్ తో ఉప‌యోగం సంగ‌తి ప‌క్కన పెడితే కొవ్వులు, ఫాటీ ఆమ్లాలు ఎక్కువ‌గా ఉంటాయి. వీటితో పాటు హానిక‌ర ప‌దార్థాలు ఉంటాయి.

 చాక్ లెట్స్ కూడా ఎక్కువ‌గా తినేందుకు ఆస‌క్తి చూపిస్తారు. ఇందులో టెట్రా హైడ్రో బీటా కార్బొలిన్స్ అనే ఆల్కలాయిడ్స్ ఉంటాయి. వీటిలో ఆల్కహాలిక్ ను పోలిన ర‌సాయ‌న స్వభావం ఉండ‌వ‌చ్చు. అందుచేత‌నే కొన్ని ర‌కాల చాక్ లెట్స్ తినేందుకు అల‌వాటు ప‌డితే, పిల్లలు వాటిని వ‌ద‌ల‌లేక పోతారు. కాల‌క్రమేణా ఈ బ్రాండ్ చాక్ లెట్లకు అల‌వాటు ప‌డిపోతారు. చ‌క్కెర‌, చ‌క్కెర సంబంధిత ప‌దార్థాల్లో కూడా ఇటువంటి స‌మ‌స్య ఉంటుంది. అతిగా తింటే అన‌ర్థం త‌ప్పదు. చ‌క్కెర తీసుకొన్నాక మెద‌డులో ఒపియాయిడ్స్ విడుద‌ల అవుతాయి. ఇవి క‌ల్గించే ఫీలింగ్స్ కు పిల్లలు త్వర‌గా అల‌వాటు ప‌డ‌తారు. వీటికి సాల్ట్, సోడియం అధికంగా ఉండే జంక్ ఫుడ్ క‌లిసిందంటే ప‌దే ప‌దే వాటిని తినాల‌నిపిస్తుంది. పిజ్జా, బ‌ర్గర్ ల‌కు ఎక్కువ‌గా అల‌వాటు ప‌డ‌టానికి ఈ ర‌సాయ‌నాలే కార‌ణ‌మని ప్రిన్స్ ట‌న్ యూనివ‌ర్శిటీ గుర్తించింది.
అందుచేత అన‌ర్థం క‌లిగించే ఆహారంతో జాగ్రత్తగా ఉండాల‌ని ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి. అందుచేత ఆదివారం ఆట‌విడుపు క‌దా అని పిల్లల‌ను వ‌దిలేస్తే అన‌ర్థం క‌లిగించే ఫుడ్స్ తీసుకొంటూంటారు.

క‌డుపు మండిందంటే ఏం జ‌రుగుతుంది....!


అన్ని ప‌రిస్థితులు ఒకేలా ఉండ‌వు. ఒక్కోసారి ఒక్కో ప‌రిస్థితి బ‌య‌ట ప‌డుతుంది. దీన్ని బ‌ట్టి ఫ‌లితం ఉంటుంది. క‌డుపు లో మంట పుట్టడానికి కార‌ణాలు అనేకం ఉంటాయి. మంట లేక నొప్పి ఎందుకు వ‌స్తోందో చూసుకోవాలి. అప్పుడే కడుపు మంట కు కార‌ణం తెలుస్తుంది. సాధార‌ణంగా అజీర్తి వ‌ల‌న‌, ఎక్కువ ఆహారం తిన‌టం వ‌ల‌న, స‌రైన నిద్ర లేక పోవ‌టం వ‌ల‌న‌, టెన్షన్ ఎక్కువ‌గా ప‌డ‌టం వ‌ల‌న నొప్పి వ‌స్తుంటుంది. ఇది తేలిక పాటి కడుపు నొప్పి. వంటింటి చిట్కాలతో ఈ నొప్పి కి నివార‌ణ చేసుకోవ‌చ్చు.

క‌డుపు మ‌ధ్య భాగంలో నొప్పి జ‌నించి, కుడి వైపు కింది భాగంలోకి వ్యాపిస్తే అపెండిక్సు నొప్పి గా చెబుతారు. ( చిన్న పేగు, పెద్ద పేగు క‌లిసే చోట చిన్న సంచీ మాదిరిగా ఉండే అవ‌శేషావ‌య‌వ‌మే ఉండుకం. దీంట్లో ఇన్ ఫెక్షన్ వ‌స్తే అది అపెండిక్సు నొప్పి.) సాధార‌ణంగా ఈ నొప్పి వ‌స్తే సాధ్యమైనంత తొంద‌ర‌గా చికిత్స చేయాల్సి ఉంటుంది.
క‌డుపు లో ఎడ‌మ వైపు లో నొప్పి మొద‌లై కుడివైపు కింది భాగంలోకి వ్యాపిస్తుంటే దాన్ని పేగు నొప్పి గా చెబుతారు. మాన‌వ శ‌రీరంలో కిలోమీట‌ర్ల పొడ‌వు లో పేగులు చుట్ట బెట్టి ఉంటాయి. వీటిలో ఇన్ ఫెక్షన్ వ‌ల‌న నొప్పి జ‌నిస్తుంది. ఇందుకు మందుల ద్వారా తేలిగ్గా ప‌రిష్కారం చేసుకోవ‌చ్చు.
క‌డుపు లో మ‌ధ్య భాగంలో నొప్పి మొద‌లై కుడి దిశ‌గా పైకి  క‌దులుతుంటే దీన్ని పిత్తాశ‌య నొప్పి గా చెబుతారు. కాలేయం నుంచి స్రవించే పైత్య ర‌సం ఆంత్ర మూలానికి చేరే లోపు తాత్కాలికంగా పిత్తాశ‌యంలో నిల్వ ఉంటుంది. ఇక్కడ ఇన్ ఫెక్షన్ ఏర్పడిన‌ప్పుడు నొప్పి జ‌నిస్తుంది. ఇది అప్పుడప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చి ఇబ్బంది పెడుతు ఉంటుంది.
ఇదే గాకుండా మ‌హిళ‌ల్లో రుతు స్రావం సంబంధిత నొప్పులు, గ‌ర్భ ధార‌ణ సంబంధిత నొప్పులు ఉంటాయి.
క‌డుపు నొప్పి అన్నది చాలా చిన్న విష‌యం అని నిర్లక్ష్యం చేయ‌టం ఎంత త‌ప్పో, నొప్పి వ‌చ్చిన ప్రతీ సారి గాభ‌రా ప‌డిపోవ‌ట‌మూ అంతే త‌ప్పు. నొప్పి జ‌నించిన వెంట‌నే వైద్యుల్ని సంప్రదిస్తే నొప్పికి త‌గిన కార‌ణాన్ని గుర్తించి త‌గిన చికిత్స చేయిస్తారు.