...

SPECIALIZED SITE FOR HUMAN HEALTH CARE,
SPECIALLY ON GASTROENTEROLOGY, LIVER AND PANCREAS

రాళ్లతో ఎప్పటికీ స‌మ‌స్యే..!

జీర్ణ వ్యవ‌స్థ లో క్లోమం, పిత్తాశ‌యం వంటి భాగాల్లో రాళ్లు ఏర్పడుతూ ఉంటాయి. అక్కడ అవాంచ‌నీయ క‌ణ‌జాలం పేరుకొని పోయి రాళ్లు గా మార‌తాయి. ఈ రాళ్లు అక్కడ జీర్ణ ఎంజైమ్ ల ప్రసారానికి అడ్డు త‌గులుతూ ఉంటాయి. దీంతో అక్కడ స్రావ‌కాలునిలిచిపోతాయి. దీంతో నొప్పి ఏర్పడుతుంటుంది. రెండు భాగాల్లో రాళ్లు ఏర్పడ‌టం, వాటి విధానం వేర్వేరుగా ఉంటాయి. ఆహార‌పు అల‌వాట్లు స‌రిగ్గా లేక‌పోవ‌టం, జ‌న్యు ప‌ర‌మైన తేడాలు ఉండ‌టం, మ‌ద్యం వంటి చెడు అల‌వాట్లు, హార్మోన్‌ల అస‌మ‌తుల్యత వంటివి స్థూలంగా కార‌ణాలు అని చెప్పవ‌చ్చు.

 తీవ్రమైన నొప్పిని ప్రధానంగా చెప్పవ‌చ్చు. వాంతులు, నిద్ర ప‌ట్టక‌పోవ‌టం వంటివి కార‌ణాలుగా చెప్పవ‌చ్చు. స‌రైన డాక్టర్ ను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. ర‌క్త ప‌రీక్ష, సీటీ స్కాన్‌, ఎండోస్కోపీ వంటి ప‌రీక్షల‌తో నిర్ధారించ‌వ‌చ్చు. రాళ్లను పూర్తిగా వ‌దిలించుకోవ‌టమే ఈ స‌మ‌స్యకు అంతిమ ప‌రిష్కారం అని గుర్తుంచుకోవాలి. మందులు వాడితే త‌గ్గని సందర్భాల్లో ఆప‌రేష‌న్ అవ‌స‌రం అవుతుంటుంది. నిపుణులైన స‌ర్జన్ ను సంప్రదించి చికిత్స చేయించుకోవాలి. అధునాత‌న ప‌రికరాలు అందుబాటులోకి రావ‌టంతో లాప‌రోస్కోపిక్ విధానాల‌తో నూటికి నూరు శాతం విజ‌యవంతం అయ్యేట్లుగా శ‌స్త్ర చికిత్సలు చేయ‌టానికి వీల‌వుతోంది.

క‌డుపులో నొప్పి వ‌స్తే కంగారు ప‌డాలా..!

క‌డుపులో నొప్పి అన్నది చాలా మంది ఎప్పుడో ఒక‌ప్పుడు ఎదుర్కొనే స‌మ‌స్య. చాలా సార్లు అది దానంత‌ట అదే త‌గ్గిపోతుంది. విరోచ‌నాలు అయిన‌ప్పుడు లేదా, జీర్ణం స‌రిగ్గా కాన‌ప్పుడు లేదా ప‌డని ప‌దార్థాలు తిన్నప్పుడు ఈ నొప్పి త‌లెత్తుతుంది. కొన్ని సార్లు సాధార‌ణ చిట్కాల‌తో కూడా ఇది త‌గ్గిపోతుంటుంది. అందుచేత క‌డుపులో నొప్పి అంటే కంగారు ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. కానీ, కొన్ని సార్లు మాత్రం నొప్పి విప‌రీతంగా వ‌స్తున్నా, లేక తీవ్రంగా నొప్పి బాధిస్తున్నా మాత్రం ఆలోచించాల్సిందే. ఆ నొప్పి వ‌స్తున్న ప్రాంతాన్ని బట్టి క‌డుపులో ఆయా ప్రాంతంలో ఉండే అవ‌య‌వంలో ఇబ్బంది ఏర్పడి ఉంటుంద‌ని ఊహించ‌వ‌చ్చు. అందుచేత‌నే అక్కడ నొప్పి వ‌స్తుంద‌ని ఒక సాధార‌ణ అంచ‌నా కు రావ‌చ్చు.

క‌డుపు మ‌ధ్య లో నొప్పి వ‌చ్చి, కింద‌కు కుడివైపు కు వ్యాపిస్తే అపెండిక్సు నొప్పి అంటారు. అంటే అపెండిక్సు (తెలుగులో ఉండుకం అంటారు.) ఎడ‌మ వైపు కింది భాగంలో నొప్పి వ‌చ్చి కుడి వైపుకి వ్యాపిస్తే పేగు నొప్పి అని చెబుతారు. కుడి వైపు పై భాగంలో నొప్పి వ‌స్తే కాలేయం లేదా పిత్తాశ‌య‌పు నొప్పిగా, ఎడ‌మ వైపు వ‌స్తే క్లోమంలో స‌మ‌స్యగా చెప్పవ‌చ్చు. ఇది ఒక అంచ‌నా మాత్రమే. క‌చ్చితంగా నొప్పి కి కార‌ణం తెలుసుకోవాలంటే డ‌యాగ్నస్టిక్ ప‌రీక్షలు చేయించుకోవాలి. నిపుణులైన వైద్యుల సాయంతో ప‌రీక్ష చేయించుకోవాలి.

చేతుల శుభ్రత‌.. దాని ప్రాధాన్యం..!

చేతులతో చాలా ప‌నులు చేస్తుంటాం. ఇత‌ర జంతువుల‌తో పోలిస్తే కేవ‌లం మాన‌వునికి మాత్రమే చేతులు ఉన్నాయి. వాటిని ఉప‌యోగించుకోవ‌టం మాన‌వునికే సాధ్యం.

భార‌త దేశంలో దాదాపుగా అంద‌రూ చేతితోనే భోజ‌నం చేస్తారు. స్పూన్‌లు, ఫోర్కులు ఉప‌యోగించ‌టం త‌క్కువ‌. అందుచేత చేతుల్ని శుభ్రంగా ఉంచుకోవాలి. లేదంటే చేతులను అంటుకొని ఉన్న క్రిములు శ‌రీరంలోకి చేర‌తాయి. చేతులు బ‌య‌ట‌కు వెళ్లిన‌ప్పుడు ఎక్కడ ప‌డితే అక్కడ వేస్తుంటారు. ఇది మంచిది కాదు. అప‌రిశుభ్ర వాతావ‌ర‌ణంలో చేతుల్ని ఉప‌యోగించుట త‌గ్గించుకోవాలి. అస‌లు అంత‌క‌న్నా మంచి అల‌వాటు ఏమిటంటే భోజ‌నానికి ముందు, వంట‌కు ముందు అర‌చేతుల్ని శుభ్రం చేసుకోవాలి. దీంతో పాటు ఎప్పటిక‌ప్పుడు గోళ్లను పూర్తిగా క‌త్తిరించుకోవాలి. లేదంటే గోళ్లకు దిగువ‌న క్రిములు దాక్కొని ఉంటాయి. చేతులు పై పైన క‌డిగేసుకొని వెళ్లిపోతే అక్కడ దాగి ఉన్నక్రిములు శ‌రీరంలోకి ప్రవేశించే చాన్సు ఉంటుంది. దీంతో స‌మ‌స్యలు తలెత్తుతాయి. అందుచేత భోజ‌నం, వంట‌కు ముందు...మ‌ల విస‌ర్జన‌, వాహ‌నాలు, ఇళ్లు శుభ్రం చేసిన త‌ర్వాత చేతుల్ని స‌బ్సు లేక లిక్విడ్ తో క‌డుక్కోవాలి.

ఆ సంగ‌తి తెలిస్తే క‌డుపు మండిపోతోంది..!

క‌డుపు మంట అంటే చాలా కార‌ణాలు క‌నిపిస్తాయి. ఎందుచేత ఈ మంట వ‌స్తోందో తెలుసుకొంటే అస‌లు విష‌యాలు అర్థం అవుతాయి. లేదంటే స‌మ‌స్య పెద్దది అవుతుంది.
క‌డుపు లో అల్సర్ లు ఏర్పడిన‌ప్పుడు మాత్రం ఈ మంట తీవ్రంగా ఉంటుంది. జీర్ణాశ‌యం పొర‌ల్లో కానీ, ఆంత్ర మూలం (డుయోడిన‌మ్ ) పొర‌ల్లో కానీ ఇది ఏర్పడుతు ఉంటుంది. దీనికి నిర్దిష్టమైన కార‌ణం ఉండ‌క పోవ‌చ్చు. హెలికో బాక్టర్ పైలోరీ వంటి బ్యాక్టీరియాల సంక్రమ‌ణ తో కానీ, ఎక్కువ‌గా పెయిన్ కిల్లర్స్ వాడ‌కంతో కానీ, స‌రైన ఆహార‌పు అల‌వాట్లు లేక‌పోవ‌టంతో కానీ ఇవి ఏర్పడుతుంటాయి. ఆల్కహాల్  ఎక్కువ‌గా తీసుకోవ‌టం, కాలేయంలో స‌మ‌స్య‌లు ఉన్నా కూడా ఇందుకు కార‌ణం అవుతుంటాయి.

 క‌డుపులో విప‌రీతంగా ముఖ్యంగా మ‌ధ్య లో కానీ, ఎగువ భాగంలో కానీ విప‌రీతంగా మంట పుడుతుంది. గుండెల్లో కూడా మంట ఏర్పడుతూ ఉంటుంది. అప్పుడ‌ప్పుడు వాంతులు అవుతుంటాయి. ఆహార‌పు అల‌వాట్లు మార్చుకోవ‌టం, దుర‌ల‌వాట్లు వ‌దిలేసుకోవ‌టంతో పాటు నిపుణులైన వైద్యుల్ని సంప్రదించి చికిత్స తీసుకొంటే ఈ మంట స‌మ‌స్య త‌గ్గుతుంది. మందుల‌తో పాటు కొన్ని సార్లు చిన్న పాటి ఆప‌రేష‌న్ కూడా అవ‌స‌రం అవుతుంది. అందుచేత ప్రమాద తీవ్రత‌ను బ‌ట్టి వైద్యుల ప‌ర్యవేక్షణ‌లో చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.
అల్సర్ ఉంద‌ని తెలియ‌గానే క‌డుపులో ఆందోళ‌న తెచ్చుకోకూడ‌దు. దీంతో మంట‌, ఆందోళ‌న మ‌రింత పెరుగుతుంది. స్థిమితంగా వైద్యుల్ని సంప్రదించి చికిత్స చేయించుకోవాలి.

చిన్నారుల్లో కామెర్లు ప్రమాద‌క‌ర‌మా.. కాదా..!

అప్పుడే పుట్టిన ప‌సివాళ్లకు కామెర్లు వ‌స్తుంటాయి. చాలా మందిలో ఇది క‌నిపిస్తుంటుంది. వీటిని బాల కామెర్లు అంటారు. చాలా సంద‌ర్భాల్లో ఇది 2,3 వారాల్లో త‌గ్గిపోతుంది. ఒక్కో సారి మాత్రం ఈ కామెర్లు త‌గ్గకుండా కొన‌సాగుతాయి. వాస్తవానికి అప్పుడే పుట్టిన ప‌సివాళ్లలో అన్ని అవ‌య‌వాలు పూర్తిగా విచ్చుకోవు. నిదానంగా ఆయా శ‌రీర భాగాలు చురుగ్గా పుంజుకొంటాయి. ఈ విస్తరించే క్రమంలో కామెర్లు ఉంటే కాలేయం స‌క్రమంగా రూపు దిద్దుకోదు. అటువంట‌ప్పుడు వెంట‌నే మేలుకోక‌పోతే ఇబ్బంది త‌ప్పదు. దీన్ని ఎక్సట్రా హెపాటిక్  బిలియ‌రీ అట్రాజియా అంటారు. ఈ స‌మ‌స్యను సాధ్యమైనంత తొంద‌ర‌గా స‌రిదిద్దాల్సి ఉంటుంది. నిపుణులైన వైద్యుల్ని సంప్రదించి చికిత్స చేయించాలి. లేదంటే ప్రమాదం ఏర్పడుతుంది. ఇంకొక విష‌యం ఇక్కడ స్పష్టం చేయాల్సి ఉంది. చిన్నారుల‌కు వ‌చ్చిన అన్ని కామెర్లు ఇంత‌టి ప్రమాదం కానే కాదు. చాలావ‌ర‌కు కామెర్లు వాటంత‌ట అవే త‌గ్గిపోతాయి. ఒక వేళ కొన‌సాగితే మాత్రమే చికిత్స అవ‌స‌రం అని గుర్తించాలి.

కొవ్వెక్కిందా..! అన్న స్టేట్ మెంట్ లో త‌ప్పేంటి..?

కొవ్వు అన్న ప‌దం వాస్తవానికి నెగ‌టివ్ షేడ్ లో వాడ‌తారు. అందుచేత‌నే కొవ్వెక్కిందా.. అన్న మాట అంటే ఎవ‌రికైనా కోపం వ‌స్తుంది. నిజానికి కొవ్వు పెర‌గ‌టం అన్న ది అనారోగ్య సూచ‌కం కాబ‌ట్టి ఈ ర‌క‌మైన పద ప్రయోగం పుట్టి ఉండ‌వ‌చ్చు.

శ‌రీరంలో కొవ్వు ప‌దార్థాలు పెరిగితే.. అవి విభిన్న శ‌రీర అవ‌య‌వాల్లో డిపాజిట్ అయిపోతాయి. కాలేయంలో ఈ ర‌క‌మైన కొవ్వు ప‌దార్థాలు పేరుకొంటే ఫ్యాటీ లివ‌ర్స్ గా చెబుతారు. ఈ కొవ్వు క‌ణ‌జాలం కార‌ణంగా కాలేయం ప‌ని తీరు దెబ్బతింటుంది. అంతే గాకుండా అక్కడ ప్రస‌ర‌ణ‌కు ఇబ్బంది ఏర్పడుతుంది. దీంతో మ‌రిన్ని ఇబ్బందులు ఏర్పడుతాయి. కాలేయంలో కొవ్వులు పేరుకొన్నట్లు గుర్తిస్తే మాత్రం వెంట‌నే మేలుకోవాలి. త‌గిన చ‌ర్యలు తీసుకోవ‌టం ద్వారా వీటిని వ‌దిలించుకోవాలి. లేదంటే ఇబ్బంది ఏర్పడుతుంది. ఈ ప‌రిస్థితిని నాలుగు ద‌శ‌లుగా చెబుతారు. గ్రేడ్ 1,2 ద‌శ‌ల్లో ఉంటే మాత్రం శారీర‌క వ్యాయామంతో రిలీఫ్ ఏర్పడుతుంది. నూనెలు, వేపుళ్లు త‌గ్గించి వాడ‌టం వంటి చ‌ర్యలు తీసుకోవాలి. గ్రేడ్ 3,4 ద‌శ‌ల‌కు వెళితే మాత్రం మందులు వాడాల్సి ఉంటుంది. లేదంటే అవాంఛిత ప‌దార్థాలుగా మారి ప్రస‌ర‌ణ‌కు ఇబ్బంది ఏర్పడుతుంది. ఇది క్రమంగా లివ‌ర్ సిర్రోసిస్ అనే వ్యాధి కి దారి తీస్తుంది. అప్పుడు మ‌రింత చికిత్స అవ‌స‌రం అవుతుంది.

ప్రతీరోజూ తాగ‌టం మంచిదే.. ఎలాగంటారా..!

తాగ‌టం అన్నది ఎప్పటినుంచో ఉన్న అల‌వాటు. దీని ప్రభావం ఏమిటి, ఎలా ఉంటుంది అన్నది మాత్రం త‌ప్పకుండా గ‌మ‌నించాల్సిందే సుమా..! చూసుకోకుండా ఎడా పెడా తాగేయ‌టం మాత్రం మంచిది కాదు.

అయితే ఈ తాగ‌టం అన్నది నీరు తాగ‌టం గురించి సుమా..! అంతే కానీ ఏమాత్రం అపార్థం చేసుకోవ‌ద్దు. ప్రతీరోజు క్రమం త‌ప్పకుండా నీటిని త‌గుపాళ్ల లో తాగ‌టం మంచి అల‌వాటు. ఎందుచేత‌నంటే శ‌రీరంలో దాదాపు 60 శాతం దాకా నీటితో నిర్మిత‌మై ఉంటుంది. ఇందులో కండ‌రాలు 75శాతం, మెద‌డు 90 శాతం, ఎముక‌లు 20 శాతం, ర‌క్తం 80 శాతం దాకా నీటిని క‌లిగి ఉంటాయి. శ‌రీరంలోని ఈ ద్రవాలు జీర్ణ క్రియ‌, శోష‌ణ‌, ప్రస‌ర‌ణ‌, విస‌ర్జన వంటి అనేక ముఖ్య క్రియ‌ల్లో కీలక పాత్ర పోషిస్తాయి. అందుచేత నీటిని తాగ‌టం ద్వారా ఈ శ‌రీర ద్రవాల్ని స‌మతౌల్యంతో ఉంచేందుకు వీల‌వుతుంది. రోజుకి స‌రిప‌డా నీటిని తీసుకొంటే ఈ ప్రక్రియ‌లు స‌జావుగా సాగుతాయి. ముఖ్యంగా వేస‌విలో ఈ నీటి అవ‌స‌రం ఇంకా ఎక్కువ‌గా ఉంటుంది. అంతేగాకుండా అధిక క్యాల‌రీల‌ను నివారించ‌టంలో కూడా ముఖ్య పాత్ర వ‌హిస్తుంది. చ‌ర్మం తేజోవంతంగా ఉండేందుకు, కండ‌రాలు ప‌టిష్టంగా ఉండేందుకు కూడా నీరు చాలా అవ‌స‌రం అవుతుంది. మూత్ర పిండాల వంటి అవ‌య‌వాలు స‌క్రమంగా పనిచేయ‌టంలో నీరు చురుకైన పాత్ర పోషిస్తుంది.