...

SPECIALIZED SITE FOR HUMAN HEALTH CARE,
SPECIALLY ON GASTROENTEROLOGY, LIVER AND PANCREAS

ఈ సీజ‌న్ లో ఈ సంగ‌తి మ‌రిచిపోవ‌ద్దు సుమా..!

జూలై నెల వ‌చ్చేసిందంటే రుతుప‌వ‌నాలు ప్రవేశిస్తుంటాయి. ఈ స‌మ‌యంలో దేశ వ్యాప్తంగా వ‌ర్షాలు ప‌డుతుండ‌టం స‌హ‌జం. వాన‌లు ప‌డేట‌ప్పుడు దీనికి అనుగుణంగా కొన్ని స‌మ‌స్యలు పుట్టుకొస్తాయి.
వానా కాలంలో తాగునీటితో పాటు క‌లుషిత నీరు కలిసిపోయే అవ‌కాశం ఉంటుంది. అటువంటప్పుడు క‌లుషిత నీటిలోఉండే క్రిములు శ‌రీరంలోకి ప్రవేశిస్తాయి. చాలా జీర్ణ కోశ వ్యాధుల‌కు క‌లుషిత నీరు కార‌ణం కావ‌చ్చు. ముఖ్యంగా కామెర్లు సోకేందుకు ఎక్కువ‌గా చాన్సు ఉండే సీజ‌న్ ఇది. క‌లుషిత నీరు ద్వారా హెప‌టైటిస్ ఏ, హెప‌టైటిస్ ఈ సంక్రమిస్తాయి. ఇది మొద‌ల‌య్యాకే వెంట‌నే బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు లేదా కొద్ది పాటి స‌మ‌యం తీసుకోవ‌చ్చు. కానీ అన‌ర్థం మాత్రం ఒకేలా ఉంటుంది.

 కాలేయంలో తిష్ట వేసిన క్రిములు అక్కడి జీవ‌న క్రియ‌ల‌కు ఇబ్బంది క‌లిగిస్తాయి. దీంతో శ‌రీరంలో వ‌ర్ణకాలు ప‌చ్చగా మారుతాయి.అందుకే దీన్ని పచ్చ కామెర్లు గా పిలుస్తారు. కొన్ని ప్రాంతంలో దీన్ని ప‌సిరిక‌లుగా చెబుతారు. కామెర్లు లేక ప‌సిరిక‌లకు ఆధునిక వైద్యంలో మెరుగైన చికిత్స అందుబాటులో ఉంద‌ని గుర్తించుకోవాలి. నాటు మందుల‌తో స‌రిపెట్టుకొనే కంటే శాస్త్రీయ‌మైన చికిత్స తీసుకోవ‌టం మేల‌ని తెలుసుకోవాలి.
ఎప్పుడైనా వ్యాధి వ‌చ్చాక చికిత్స తీసుకొనే క‌న్నా, వ్యాధి రాకుండా జాగ్రత్త ప‌డ‌టం మేలు. అందుకే ఇటువంటి రోగాలు రాకుండా సుర‌క్షిత తాగునీటిని తీసుకోవాలి. అన్ని వేళ‌లా కాచి చ‌ల్లార్చిన నీటిని తాగ‌టం ఉత్తమ‌మైన ప‌ద్దతి. లేదంటే ఫిల్టర్ ద్వారా క్రిముల్ని దూరం పెట్టవ‌చ్చు. ఇటువంటి తేలిక‌పాటి జాగ్రత్తల‌తో ఎన్నో ప్రమాద క‌ర‌మైన వ్యాధుల్ని నివారించుకోవ‌చ్చు.

ఫుడ్ విష‌యంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..!

ఫుడ్ తీసుకొనేట‌ప్పుడు అంద‌రూ జాగ్రత్తగా ఉండాల్సిందే. కడుపులో అన్నింటినీ కుక్కేసుకొని త‌ర్వాత బాధ ప‌డేకంటే ముందుగానే జాగ్రత్త తీసుకోవ‌టం మేలు.

ముఖ్యంగా రిఫ్లెక్స్ స‌మ‌స్య ఉన్న వారు ఈ విష‌యంలో జాగ్రత్తగా ఉండాలి. ఆహారం తినేట‌ప్పుడు మనం నెమ్మదిగా న‌మిలి మింగుతుంటాం. అప్పుడు ఆహార‌పు ముద్దలు ... ఆహార వాహిక‌లోకి జార‌తాయి. అక్కడ ఉండే కండ‌రాలు నిర్దిష్టమైన చ‌ల‌నాలు చూపుతాయి. అంటే సంకోచ వ్యాకోచాల‌కు లోన‌వుతాయన్న మాట. అప్పుడు ఆహార‌పు ముద్ద నెమ్మదిగా కింద‌కు జారిపోయి జీర్ణాశ‌యంలోకి ప్రవేశిస్తుంది. ఈ కండ‌ర సంకోచాలు ఒకే వైపుకి ఉండ‌టం వ‌ల‌న ఆహారం కింద‌కు వెళుతుంది త‌ప్పితే మ‌ళ్లీ తిరిగి వెన‌క్కి రావ‌టం జ‌ర‌గ‌దు. కానీ రిఫ్లెక్స్ స‌మ‌స్య ఉన్న వారికి మాత్రం ఈ కండ‌ర చ‌ల‌నాల్లో స‌మ‌స్య ఉండ‌టంతో ఆహారం వెన‌క్కి వ‌స్తుంటుంది. అంటే ఆహారం తిన్న త‌ర్వాత కొంత‌మందిలో తేన్పులు రావ‌టం, కొంత మందిలో గ్యాస్ రావ‌టం, మరికొంద‌రిలో ఆహార‌పు ముద్దలు వెనక్కి రావటం జ‌రుగుతుంటాయి.
ఇటువంటి స‌మ‌స్య ఉన్న వారు ఆహారం విష‌యంలో జాగ్రత్తలు తీసుకోవాలి. బాగా వేడెక్కించిన వేపుడుల‌కు దూరంగా ఉండాలి. కాఫీ, టీలు ఎక్కువ‌గా తాగ‌టం మంచిది కాదు. క్రమం త‌ప్పకుండా వ్యాయామం చేస్తుండాలి. రాత్రి భోజ‌నం త‌ర్వాత వెంట‌నే నిద్రకు ఉప‌క్రమించ‌రాదు. బోజ‌నం త‌ర్వాత 2 లేక 3 గంట‌ల పాటు విరామం ఉండాలి. ప‌డుకొనేట‌ప్పుడు మిగ‌తా శ‌రీర భాగాల‌తో పోలిస్తే త‌ల భాగం ప10 డిగ్రీల ఎత్తు ఉండేట్లు జాగ్రత్త తీసుకోవాలి. ఇటువంటి నియ‌మాలు అంద‌రికీ మంచిదే అని గుర్తుంచుకోవాలి.

ఈ కాలం యువ‌తలో ఈ ల‌క్షణం ఉంటే జాగ్రత్త..!

యువ‌త ఈ మ‌ధ్య కాలంలో ఫ్రెండ్స్ మోజులో ప‌డుతున్నారు. స్నేహితులు చెప్పిన‌ది విన‌టం, వాళ్లు చేసేది చేయ‌టం వంటివి చేస్తున్నారు. దీంతో కొన్ని సార్లు మంచి, కొన్ని సార్లు చెడు జ‌రుగుతున్నాయి.

దుర‌ల‌వాట్లలో ఇటీవ‌ల కాలంలో గుట్కా న‌మ‌లటం ఎక్కువ అయింది. ప‌ల్లెటూర్లలో పొగాకు ను ముక్కలు చేసుకొని న‌మిలేవారు. అది ప‌ల్లె వాసుల అల‌వాటు గా ఉండేది. ఇప్పుడు గుట్కా న‌మ‌ల‌టం మాత్రం ఫ్యాష‌న్ అయిపోయింది. ర‌క ర‌కాల పేర్లతో దొరుకుతున్న ఈ పొగాకు ఉత్పత్తి... ప్రమాద‌క‌ర‌మైన‌దిగా గుర్తుంచుకోవాలి. అందుకే ఈ ప్యాకెట్ ల పైన కూడా ప్రభుత్వ సూచ‌న మేర‌కు హెచ్చరిక లు ముద్రిస్తున్నారు. ఇటువంటి ఉత్పత్తుల‌ను క్రమం త‌ప్పకుండా న‌ములుతుండ‌టం వ‌ల‌న నోటిలో పుండ్లు ఏర్పడుతున్నాయి. ఇవి క్రమేణా అల్సర్ లుగా ఏర్పడుతున్నాయి. ఇవి ముదిరి క్యాన్సర్ కు దారి తీసిన సంద‌ర్భాలు ఉన్నాయి. కొంత మంది ఈ అల‌వాటు తో ప్రాణాలు పోగొట్లుకొన్నట్లు గుర్తించారు. మొద‌ట్లో ఆస‌క్తి క‌రంగా అనిపించిన ఈ అల‌వాటు త‌ర్వాత కాలంలో విడ‌దీయ‌రాని అల‌వాటు అయిపోతోంది.

పేగు టీబీ - అవ‌గాహ‌న‌

టీబీ అంటే ట్యూబ‌ర్ క్యులోసిస్ అని అర్థం. సాధార‌ణంగా ఊపిరితిత్తుల‌కు సోకే దీర్ఘకాలిక వ్యాధిగా దీని గురించి చాలా మందికి తెలుసు. బ్యాక్టీరియా క్రిముల సంక్రమించ‌టంతో ఈ రోగం అంటుకొంటుంది.  ఈక్రిములు  ఊపిరితిత్తుల్లో తిష్ట వేసి శ్వాస ప్రక్రియ‌లో ఇబ్బంది పెడుతుంటాయి. తీవ్రమైన ద‌గ్గు, బ‌రువు త‌గ్గిపోవటం వంటి ల‌క్షణాలు గోచ‌రిస్తాయి.

అటువంటి టీబీ కొన్నిసార్లు పేగుల‌కు కూడా సోకుతుంది. ఊపిరితిత్తుల నుంచి ఇన్ ఫెక్షన్ పేగుల‌కు వ్యాపించ‌వ‌చ్చు. లేదా టీబీ కి సంబంధించిన క‌ళ్లె ను మింగిన‌ప్పుడు - ఆ క్రిములు పేగుల్లో ప్రవేశిస్తాయి. అప్పుడు అక్కడ వ్యాది ఏర్పడుతుంది. ఇది దీర్ఘ కాలికంగా ప‌రిణ‌మించవ‌చ్చు. బ‌రువు త‌గ్గిపోవటం, క‌డుపులో నొప్పి వంటి ల‌క్షణాల్ని గ‌మ‌నించ‌వ‌చ్చు. జ్వరం కూడా వ‌స్తుంటుంది. పేగుల్లో టీబీ సోకిన‌ట్లు గ‌మ‌నిస్తే నిపుణులైన వైద్యుల్ని సంప్రదించాలి. క‌చ్చిత‌మైన మందుల్ని వాడ‌టంతో పేగు టీబీ కి చికిత్స దొర‌కుతుంది. పేగు టీబీ అసాధార‌ణ వ్యాధి కాద‌ని గుర్తించుకోవాలి.

కుటుంబ చ‌రిత్ర కూడా ముఖ్యమే..ఇటువంటి చోట్ల అవ‌స‌రం కూడా..!

ఒక వ్యక్తి గురించి తెలుసుకొనే ముందు కుటుంబ చ‌రిత్ర కూడా ప‌ట్టించుకోవాల్సి ఉంటుంది. ఒక్కో సారి దీనికి ప్రాధాన్యం ఉంటుంది. మ‌రీ వంశంలోని త‌ర త‌రాల్ని ఏక‌రువు పెట్టాల్సిన అవ‌స‌రం లేదు కాని ద‌గ్గర సంబంధీకుల విష‌యం తెలుసుకోవాలి.

ఆరోగ్యం విష‌యంలో కుటుంబ స‌భ్యుల ఆరోగ్య చ‌రిత్ర తెలుసుకోవాలి. చిన్న వ‌య‌స్సులోనే పేగు క్యాన్సర్ తో ఎవ‌రైనా చ‌నిపోతే సంబంధిత కుటుంబ స‌భ్యులు కాస్తంత జాగ్రత్తగా ఉంటే మంచిది. ఎందుకంటే ఇది జ‌న్యుపర‌మైన మార్పుల‌తో వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. అంటే ఇదే స‌మ‌స్య సంబంధిత కుటుంబ స‌భ్యుల జ‌న్యువుల్లో కూడా దాక్కొని ఉండ‌వ‌చ్చు. అది బ‌య‌ట ప‌డితే మాత్రం క్యాన్సర్ గా ఏర్పడ‌వ‌చ్చు. పేగులో ఏర్పడే ఈ స‌మ‌స్యను హెరిడిట‌రీ పాలీపోసిస్ కొలై అని పిలుస్తారు. అంటే పేగుల్లో పాలిప్స్ మాదిరిగా ఏర్పడ‌తాయ‌న్న మాట‌. ఇటువంటి పేగు క్యాన్సర్ అనుమానం క‌లిగితే కొలినోస్కోపీ ప‌రీక్ష ద్వారా తెలుసుకొనేందుకు వీల‌వుతుంది. కుటుంబంలో ఎవ‌రైనా పేగు క్యాన్సర్ కు గురైతే మాత్రం మిగిలిన స‌భ్యులు కూడా అనుమానం క‌లిగిన‌ప్పుడు వెంట‌నే స్పందిస్తే మేలు. ఒక వేళ ఇది నిర్ధారణ అయితే కంగారు ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. ప్రస్తుతం ఉన్న ఆధునిక వైద్య చికిత్సల సాయంతో మెరుగైన చికిత్స పొంద‌వ‌చ్చు. క్యాన్సర్  ప్రారంభ స‌మ‌యంలో ఆప‌రేష‌న్ విధానాల‌తో స‌రిచేయ‌వ‌చ్చు. వ్యాధి ముదిరితే మాత్రం ఆప‌రేష‌న్ తో పాటు కీమో థెర‌పీ, రేడియో థెర‌పీ వంటి చికిత్సలు అవ‌స‌రం అవుతాయి. అటువంట‌ప్పుడు రోగికి నాణ్యత‌తో కూడిన శేష జీవితాన్ని అందించేందుకు వీల‌వుతుంది.

న‌గ‌ర వాసుల‌కు క్యాన్సర్ వచ్చే అవ‌కాశాలు ఎక్కువా..!

న‌గ‌ర వాసుల‌కు క్యాన్సర్ చాన్సెస్ ఎక్కువ అని నేరుగా చెప్పేందుకు వీలు లేదు. కానీ కొన్ని కార‌కాలు మాత్రం ఇందుకు దోహ‌ద‌ప‌డుతుంటాయి అని చెప్పవ‌చ్చు.

క్యాన్సర్ అంటే అవాంఛ‌నీయ క‌ణ‌జాలం ఒక్క చోట పేరుకొని పోవ‌టం అనుకోవ‌చ్చు. ఈ విధంగా పేరుకొన్న క‌ణ‌జాలం స‌జీవ క‌ణ‌జాలాన్ని నాశ‌నం చేయ‌టం వ‌ల‌న స‌మ‌స్య ఏర్పడుతుంది. క్రమేణా ఇది క్యాన్సర్ కు దారి తీస్తుంది. ఇందుకు అనేక కార‌ణాలు క‌నిపిస్తున్నాయి. ఇందులో క‌ణాల్లో ఉండే డీఎన్ ఎ లో ఆక‌స్మికంగా త‌లెత్తే మార్పుల కార‌ణంగా ఉత్పరివ‌ర్తనం (మ్యూటేష‌న్ ) చెంద‌టంతో క్యాన్సర్ ఏర్పడుతుంది. ఇందుకు ప్రధానంగా వాతావ‌ర‌ణ మార్పులు లేక వాతావ‌ర‌ణ కాలుష్యం ను చెబుతారు. దీంతో పాటు పొగ తాగ‌టం, మ‌ద్యం తీసుకోవ‌టం వంటి దుర‌ల‌వాట్లను పేర్కొంటారు. వీటి కార‌ణంగా క్యాన్సర్ వ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయి. న‌గ‌రాల్లో ఉండే ఆధునిక జీవ‌న శైలి కార‌ణంగా కాలుష్యానికి గుర‌వ‌టం తో పాటు న‌యా అల‌వాట్ల పేరుతో చెడు అల‌వాట్లకు బానిస అవ‌టం జ‌రుగుతుంటుంది. దీంతో క్యాన్సర్ కు దారి తీయ‌వ‌చ్చని చెబుతారు. అంతే కానీ, క్యాన్సర్ కు ప‌ట్టణ వాసులు లేక ప‌ల్లె వాసులు అన్న తేడా మాత్రం ఉండ‌దు సుమా..!

వానా కాలంలో ఈ జాగ్రత్త త‌ప్పనిస‌రి..!

వాన‌లు మొద‌ల‌య్యాక నీటి స‌ర‌ఫ‌రాలో ఇబ్బంది ఏర్పడుతుంది. ఒక్కోచోట తాగునీటి గొట్టాలు ప‌గిలిన‌ప్పుడు క‌లుషిత నీరు అందులో ప్రవేశిస్తుంది. లేదా బ‌య‌ట‌కు వెళ్లిన‌ప్పుడు అక్కడ సుర‌క్షితం కాని నీటిని ఒక్కో సారి తీసుకోవాల్సి వ‌స్తుంది. సామూహిక ప్రదేశాల్లో తాగు నీటి స‌ర‌ఫ‌రా సుర‌క్షితంగా ఉండ‌క పోవ‌చ్చు. ఇటువంటి సంద‌ర్భాల్లో తాగునీరు క‌లుషితం కావ‌చ్చు. అంటే తీసుకొనే నీటిలో కాలుష్య కార‌క సూక్ష్మ జీవులు, బ్యాక్టీరియాలు ఉండ‌వ‌చ్చు. వీటితో ప్రమాద‌క‌ర‌మైన డ‌యేరియా తో పాటు కామెర్లు వ‌చ్చే అవ‌కాశం ఉంది. ముఖ్యంగా హెప‌టైటిస్ ఏ, హెప‌టైటిస్ ఈ వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌. ఈ రెండు ర‌కాల క్రిములతో జీర్ణ వ్యవ‌స్థ లోని కాలేయంలో క‌ణ‌జాలం పాడవుతుంది. ఫ‌లితంగా కామెర్లు సోక‌వ‌చ్చు. అందుచేత ఈ సీజ‌న్ లో సుర‌క్షిత‌మైన తాగునీటిని తీసుకోవాలి.

 అన్ని వేళ‌లా కాచి చ‌ల్లార్చి, వ‌డ‌గ‌ట్టిన తాగునీరు ఉత్తమం. ఇది సాధ్యం కాక‌పోతే క‌నీసం ప్యూరిఫ‌యిర్ల ద్వారా అయినా సుర‌క్షిత తాగునీటిని తీసుకోవాలి. అనుమానం ఉన్న చోట్ల, వెసులు బాటు క‌లిగిన వారు హెప‌టైటిస్ కు వ్యాక్సీన్ దొర‌కుతుంది. దీన్ని ముందు జాగ్రత్తగా తీసుకోవచ్చు.  కొంత‌మంది ఈ సీజ‌న్ లో పానీ పూరి వంటివి ఎక్కువ తీసుకొంటారు. అటువంటి చోట దొరికే నీరు ఎటువంటిదో తేలిగ్గా తెలిసిపోతుంది. బ‌య‌ట హోట‌ల్స్ లో కూడా స‌రైన నీరు ఇస్తున్నారో , లేదో అక్కడ ప‌రిస్థితుల్ని గ‌మ‌నిస్తే అర్థం అయిపోతుంది.  క్రమం త‌ప్పకుండా క‌లుషిత నీరు తీసుకోంటే ఇబ్బంది ఉంటుంద‌ని గుర్తుంచుకోవాలి.

పిల్లల్లో త‌లెత్తే మ‌రో స‌మ‌స్య..!

పిల్లలు పుట్టిన వెంట‌నే త‌ల్లి నుంచి సుర‌క్షితంగా వేరు చేస్తారు. ఈ క్రమంలో బొడ్డును క‌త్తిరించి వేరు చేయ‌టం జరుగుతుంది. ఈ స‌మ‌యంలో సుర‌క్షిత‌మైన సాధ‌నాన్ని వాడాల్సి ఉంటుంది.లేదంటే దీని నుంచి ఇన్ ఫెక్షన్ త‌లెత్తే చాన్సు ఉంది. వాస్తవానికి తల్లి గ‌ర్భంలో ఉన్నప్పుడు ఈ మార్గం ద్వారానే ఆహారం, ఆక్సిజ‌న్ మొద‌లైన‌వి శిశువుకి అందుతుంటాయి.

 ఇది బిడ్డ శ‌రీరంలోని కాలేయ ప్రాంతంలోని వాహ‌క ర‌క్త నాళాల ద‌గ్గర అతికి ఉంటుంది. ప్రస‌వం స‌మ‌యంలో ఇన్ ఫెక్షన్ త‌లెత్తిన‌ప్పుడు ఇది శిశువు కి వ్యాపిస్తుంది. చిన్నారి శ‌రీరంలోని వాహ‌క ర‌క్త నాళాల‌కు ఇది సోకుతుంది. అప్పుడు శిశువు పెద్ద అయ్యే కొద్దీ స‌మ‌స్యలు ఏర్పడుతాయి. ర‌క్త ప్రసారంలో ఇబ్బంది ఏర్పడుతుంది. దీన్ని ఎక్స్ ట్రా హెపాటిక్ పోర్టల్ వీన్ అబ్ స్ట్రక్షన్ అని పిలుస్తారు. ఇటువంటి స‌మ‌స్యలు రాకుండా వైద్యుల ప‌ర్యవేక్షణ‌లో సుర‌క్షిత ప్రసావానికి ప్రయ‌త్నించాలి.

వాళ్లకు లోక‌మంతా ప‌చ్చగా క‌నిపిస్తోందా..!

ప‌చ్చ కామెర్లు వ‌స్తే లోక‌మంతా ప‌చ్చగా క‌నిపిస్తుంది అని సామెత ఉంది. ఇది ఎందుకు పుట్టిందంటే కామెర్లు వ‌చ్చిన‌ప్పుడు క‌ళ్లు ప‌చ్చగా మార‌తాయి. దీంతో అన్నీ ప‌చ్చగా క‌నిపిస్తుంటాయ‌ని చెబుతారు. వాస్తవానికి క‌ళ్ల లో బైలిరూబిన్ అనే వ‌ర్ణ కం పేరుకొని పోవ‌టం వ‌ల‌న ఈ ప‌రిస్థితి ఏర్పడుతుంది. సాదార‌ణంగా క‌ళ్లు ప‌చ్చబ‌డిన‌ప్పుడే కామెర్లుగా చెబుతారు.

అయితే ఇక్కడ ఒక విష‌యం గుర్తుంచుకోవాలి. కామెర్ల వ్యాధి కి త‌గిన చికిత్స తీసుకొంటే కొన్ని రోజుల‌కే త‌గ్గిపోతుంది. ఒక్కో సారి శ‌రీరంలో వ్యాధి త‌గ్గిపోయినా కూడా క‌ళ్లకు ఉండే ప‌చ్చద‌నం త‌గ్గదు. దీనికి కార‌ణం ఏమిటంటే అక్కడ పేరుకొన్న బైలిరూబిన్ వ‌ర్ణకం పూర్తిగా తొల‌గిపోవ‌టానికి స‌మ‌యం ప‌డుతుంది. ఒక్కోసారి 3-4 వారాల స‌మ‌యం ప‌డుతుంది. అంటే అటువంట‌ప్పుడు శ‌రీరంలో కామెర్లు త‌గ్గిపోయినా, క‌ళ్లలో మాత్రం ప‌చ్చద‌నం నిలిచే ఉంటుంది.