...

SPECIALIZED SITE FOR HUMAN HEALTH CARE,
SPECIALLY ON GASTROENTEROLOGY, LIVER AND PANCREAS

ఈరోజు ప్రత్యేక‌త మీకు తెలుసా..!

ఇవాళ ప్రపంచ హెప‌టైటిస్ డే. ప్రపంచాన్ని క‌బ‌ళించి వేస్తున్న ప్రమాద‌క‌ర వ్యాధుల్లో ఒక‌టిగా గుర్తింపు పొందిన హెప‌టైటిస్ పై ఇవాళ అవ‌గాహ‌న తెచ్చుకోవాల్సి ఉంది.
మాన‌వ శ‌రీరంలో కాలేయం ఒక ప్రధాన అవ‌య‌వం. జీర్ణ వ్యవ‌స్థలో ఇది చురుకైన పాత్ర పోషిస్తుంది. ఉద‌ర కోశంలో కుడి వైపు పై భాగంలోఉంటుంది. చూసేందుకు పెద్దదిగా కనిపిస్తూ జీవ‌న క్రియ‌ల్లో ముఖ్య భూమిక పోషించును. చాలామంది ఇది జీర్ణ క్రియ‌లో మాత్రమే ఉప‌క‌రిస్తుంద‌ని భావిస్తారు. కానీ, ప్రోటీన్ సంశ్లేష‌ణ‌, డ్రగ్ మెట‌బాలిజం, శ‌రీర స‌మ‌తుల్యత‌, విస‌ర్జన వంటి అనేక ముఖ్య ప్రక్రియ‌ల్లో ప్రత్యక్షంగా, ప‌రోక్షంగా పాలు పంచుకొంటుంది. ప్రధాన జీవ‌న క్రియ‌ల్లో భూమిక పోషిస్తుండ‌టం వ‌ల్ల కాలేయాన్ని ప్రధాన అవ‌య‌వంగా చెబుతారు.
కాలేయం జీర్ణ వ్యవ‌స్థలో ప్రధానంగా ఉప‌యోగ‌పడుతుంది. కాలేయంలో పైత్యర‌సం త‌యార‌వుతుంది. ఇందులోఎటువంటి ఎంజైమ్ లు ఉండ‌వు. అయిన‌ప్పటికీ ఇందులో ఉండే బైలిరుబిన్‌, బైలివిర్డిన్ అనే వ‌ర్ణక ప‌దార్థాలు ముఖ్యమైన‌వి. ఇవి కాలేయ వాహిక ద్వారా ఆంత్ర మూలంలోకి స్రావితం అవుతాయి. అక్కడ ఆహారంలోని క‌ఠిన‌ ప‌దార్థాల్ని విచ్ఛిన్నం చేయ‌టంలో ఉప‌క‌రిస్తాయి. దీంతో పాటు మ‌లం త‌యార‌య్యే స‌మ‌యంలో పెద్ద పేగు ద్వారా అక్కడ‌కు చేరుకొని .. దానికి ప‌సుపు రంగును క‌లిగిస్తాయి.
శ‌రీరంలో ప్రస‌ర‌ణ వ్యవ‌స్థకు ర‌క్తం మూలం అన్న సంగ‌తి తెలిసిందే. ఎర్ర ర‌క్త క‌ణాలు, తెల్ల ర‌క్త క‌ణాలు అనే రెండు ప్రధాన క‌ణాల స‌మ్మేళ‌న‌మే ర‌క్తం అన‌వ‌చ్చు. ఇందులో అధిక భాగం ఎర్ర ర‌క్త క‌ణాల‌దే. హీమో గ్లోబిన్ అనే వ‌ర్ణకం ఉండుట చేత వీటికి ఎర్ర ర‌క్త క‌ణాలు అనే  పేరు వ‌చ్చింది. ఇవి శాశ్వత కణాలు కానే కావు. ప్రతీ 120 రోజుల‌కు ఒకసారి ఈ ర‌క్త క‌ణాలు శిథిలం అయిపోతాయి. మ‌ళ్లీ కొత్త ర‌క్త క‌ణాలు పుట్టుకొని వ‌స్తాయి. ఈ క్రమంలో ర‌క్త క‌ణాలు శిథిలం అయిపోవ‌టం అనే ప్రక్రియ కాలేయంలో జ‌రుగుతుంది. కాలేయ క‌ణాల వేదిక‌గా  ఈ ఘ‌ట్టం చోటు చేసుకొంటుంది. అయితే ఈ వ్యర్థ ప‌దార్థాలు బ‌య‌ట‌కు వెళ్లకుండా కాలేయంలోనే పోగు ప‌డితే దాన్ని కామెర్లుగా వ్యవ‌హ‌రిస్తారు.

కామెర్లకు చాలా కార‌ణాలు క‌నిపిస్తాయి. ఒక‌రకం కామెర్లకు క‌లుషిత నీరు, కలుషిత ఆహారం కార‌ణాలు కాగా, మ‌రో ర‌కం కామెర్లకు అర‌క్షిత ర‌క్తాన్ని ఎక్కించ‌టం, అర‌క్షిత శృంగారం కార‌ణాలుగా చెబుతారు. ఇందులో రెండో ర‌కం కామెర్లు ప్రమాద‌క‌రం గా గుర్తించుకోవాలి.
కామెర్లను ప్రధానంగా క‌ళ్లు ప‌చ్చ ప‌డ‌టం, మూత్రం ప‌చ్చగా మార‌టంతో గుర్తిస్తారు. దీన్ని నిర్ధారించేందుకు మూత్రం, రక్తం ప‌రీక్షలు అవ‌స‌రం అవుతాయి. ఒక‌సారి కామెర్లు నిర్ధార‌ణ అయ్యాక ఆల‌స్యం చేయ‌కుండా నిపుణుల సాయంతో చికిత్స తీసుకోవాలి. కామెర్లకు నాటు మందులు వాడుతుంటారు. ఇది స‌రి కాదు. శాస్త్రీయ‌మైన చికిత్స త‌ప్పనిస‌రి అని గుర్తించుకోవాలి. మ‌ద్యం తాగ‌టం, క‌లుషిత నీరు వాడ‌టం వంటి అల‌వాట్లకు దూరంగా ఉండాలి. సుర‌క్షిత ర‌క్తం, సుర‌క్షిత శృంగారం ముఖ్యం అని గ‌మ‌నించాలి.

హైద‌రాబాద్‌లో జాతీయ స్థాయి వైద్య విజ్ఞాన సంస్థ

గ‌తంతో పోలిస్తే ఆధునిక కాలంలో కాలేయ వ్యాధులు ఎక్కువ అవుతున్నాయ‌ని సీనియ‌ర్ గ్యాస్ట్రో ఎంట‌రాల‌జిస్టులు ఆందోళ‌న వ్యక్తం చేశారు. అల్సర్ లు, కామెర్లు, సిర్రోసిస్‌, క్యాన్సర్  వంటి వ్యాధులు పెరిగిపోతున్నాయ‌ని వివ‌రించారు. ఆధునిక జీవ‌న శైలితో ఏర్పడే ఒత్తిళ్లు, ఒడిదుడుకుల జీవితంతో పాటు మద్యపానం వంటి చెడు అల‌వాట్లు ఇందుకు కార‌ణం అవుతున్నాయని వివ‌రించారు. జీర్ణకోశ కాలేయ వ్యాధుల‌పై న‌గ‌ర వాసుల‌కు అవ‌గాహ‌న కార్యక్రమం ఏర్పాటైంది. హైద‌రాబాద్ దోమ‌ల్ గుడా లోని సాయివాణి  ఆస్పత్రి ప్రాంగ‌ణంలో జాతీయ స్థాయిలో నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్      గ్యాస్ట్రో ఎంట‌రాల‌జీ అండ్ లివ‌ర్ డిసీజెస్ సంస్థ ఏర్పాటైంది. ఈ సంద‌ర్భంగా ఏర్పాటైన అవ‌గాహ‌న కార్యక్రమంలో జీర్ణ కోశ మ‌రియు కాలేయ వ్యాధులు విజ్రంభిస్తున్న తీరు ని వైద్య నిపుణులు వివ‌రించారు. ఆధునిక జీవ‌న శైలిలో ఒత్తిళ్లు, నిర్ణీత స‌మ‌యానికి ఆహారం తీసుకోక‌పోవ‌టం , ఒకే చోట కూర్చొని ఎక్కువ సేపు ప‌నిచేయ‌టం, హైరానా ప‌డ‌టం ఎక్కువ‌గా జ‌ర‌గుతోంది. దీనికి తోడు పొగ తాగ‌టం, మ‌ద్యం తీసుకోవటం వంటి అల‌వాట్లు ఎక్కువ అవుతున్నాయి. ఈ కార‌ణాల‌తో జీర్ణ కోశ వ్యాధులు, కాలేయ వ్యాధులు ఎక్కువ‌గా విజృంభిస్తున్నాయి. శ‌రీరంలో అత్యంత ఎక్కువ విస్తీర్ణం ఆక్రమించే వ్య‌వ‌స్థ అయిన జీర్ణ వ్యవ‌స్థ కు స‌మ‌స్యలు ఏర్పడితే ఇత‌ర అవ‌య‌వ వ్యవ‌స్థ కూడా పాడ‌య్యే అవ‌కాశాలు ఉన్నాయి. ఇటువంటి రోగాల్ని ముందుగానే గమ‌నించి స‌మ‌ర్థులైన వైద్య నిపుణుల ద‌గ్గర చికిత్స చేయించుకొంటే స‌మ‌స్యల్ని నివారించ‌వ‌చ్చు. 
జాతీయ జీర్ణ కోశ మ‌రియు కాలేయ వ్యాధుల వైద్య విజ్ఞాన సంస్థ వివ‌రాల్ని సంస్థ డైర‌క్టర్ డాక్టర్ ఆర్‌. వి. రాఘ‌వేంద్ర రావు వివ‌రించారు. జీర్ణ కోశ వ్యాధుల్ని గుర్తించేందుకు అవ‌స‌ర‌మైన అత్యాధునిక డ‌యాగ్నస్టిక్ సౌక‌ర్యాలు ఉన్నాయ‌ని చెప్పారు. రోగుల‌కు మెరుగైన చికిత్స అందించేందుకు జాతీయ అంత‌ర్జాతీయ వైద్య సంస్థ ల్లో శిక్షణ పొందిన డాక్టర్ సేతుబాబు, డాక్టర్ డీవీ శ్రీ‌నివాస్‌, డాక్టర్ వాసిఫ్ అలీ, డాక్టర్ ప్రతాప్ రెడ్డి, డాక్టర్ ఆకాష్ చౌదురి అందుబాటులో ఉంటారు. జాతీయ స్థాయిలో పేరు గాంచిన ఈ వైద్య బృందం ఎప్పటిక‌ప్పుడు రోగుల్ని ప‌రీక్షిస్తూ మెరుగైన చికిత్స అందిస్తుంటుంది. 
జీర్ణ కోశ వ్యాధుల చికిత్స కు 24 గంట‌లూ వైద్య సేవ‌లు అందుబాటులో ఉంటాయ‌ని సంస్థ డైర‌క్టర్ డాక్టర్ డీవీ శ్రీ‌నివాస్ వెల్లడించారు. కాలేయ వ్యాధుల‌కు ప్రత్యేక యూనిట్ తో పాటు సుశిక్షితులైన సిబ్బంది తో కూడిన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఉంటుంద‌ని వివ‌రించారు. జీర్ణ కోశ వ్యాధులు, కాలేయ వ్యాధులకు అందుబాటు ధ‌ర‌ల్లో అత్యాధునిక చికిత్సను అందించ‌ట‌మే త‌మ ల‌క్ష్యమ‌ని ఆయ‌న చెప్పారు. 
జీర్ణ కోశ వ్యాధులు, కాలేయ వ్యాధుల‌కు జాతీయ స్థాయి వైద్య విజ్ఞాన సంస్థ ను అందుబాటులోకి తేవ‌టం వెనుక  వైద్య నిపుణులు కృషి ఉంది. ఈ కృషి ఫ‌లితంగా అత్యాధునిక అద్భుత వైద్య సేవ‌లు హైద‌రాబాద్‌లోని సాయివాణి సూప‌ర్ ష్పెషాలిటీ ఆస్పత్రి ప్రాంగ‌ణంలోకి అందుబాటులోకి వ‌చ్చాయి.

త‌ర‌చు మ‌న ఇంట్లో దొర్లే త‌ప్పులు..!

ఇంట్లో త‌ర‌చు కొన్ని త‌ప్పులు దొర్లుతుంటాయి. వీటిని గ‌మ‌నించుకొని దిద్దుకొంటే మంచిది. లేదంటే ఆ త‌ప్పుల‌కు మ‌న‌మే న‌ష్టపోవాల్సి ఉంటుంది.
ఉదాహ‌ర‌ణ‌కు ఇంట్లో వంట చేసేట‌ప్పుడు ఎంత‌మందికి అవ‌స‌ర‌మో లెక్క వేసుకొని సుమారుగా వంట చేస్తుంటారు. అటువంటప్పుడు ఒక్కోసారి ఆ వంట చేసిన ప‌దార్థాలు మిగిలిపోతుంటాయి. వీటిని ఏం చేయాల‌నేది స‌మ‌స్య గా మారుతుంది. ఒక్కోసారి అనుకోకుండా ఇంటి ద‌గ్గర ఆహారం ఉన్నప్పటికీ, బ‌య‌ట ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. అటువంటి సంద‌ర్భాల్లో ఈ చిక్కుల్ని మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. చాలా మంది దీన్ని ఫ్రిజ్ లో దాచి త‌ర్వాత తీసుకొంటారు.

 ఇటువంట‌ప్పుడు మ‌ళ్లీ ఉప‌యోగించేట‌ప్పుడు ఆ ఆహారం ఎలా ఉందో గ‌మ‌నించుకొని తీసుకోవాలి. క‌క్కుర్తి ప‌డి ఎలా ఉన్నా లాగించేస్తే ఇబ్బంది త‌ప్పదు. మ‌రి కొంద‌రు మాత్రం ఆహారం మిగిలిపోతోంద‌ని కాస్త ఎక్కువ తినేస్తుంటారు. దీంతో అజీర్ణ స‌మ‌స్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇంట్లో ఉండే మహిళ‌లు ఈ పొదుపు చ‌ర్యలు పాటిస్తుంటారు. మ‌హిళ‌ల్లో శ‌రీరం పెర‌గ‌టానికి ఇది కూడా ఒక కార‌ణంగా గుర్తించారు. అందుచేత ఆహారాన్ని వృధా చేయ‌కూడ‌ద‌నే వాస్తవాన్ని అంతా ఒప్పుకొంటారు. కానీ ఇటువంటి త‌ప్పుల‌తో ఇబ్బంది త‌ప్పద‌ని గుర్తించాలి.

చిన్న చిన్న జాగ్రత్తల‌తో పెద్ద పెద్ద స‌మ‌స్యల్ని త‌ప్పించుకోవ‌చ్చు..!

చిన్న పాటి జాగ్రత్తల‌తో పెద్ద స‌మ‌స్యల్ని తేలిగ్గా త‌ప్పించుకోవ‌చ్చు. అయ్యో ఇది చిన్న విష‌య‌మే క‌దా  అనిపించ‌వ‌చ్చు. కానీ దాని తీవ్రత ఎక్కువ‌గా ఉంటుంది.

ఉదాహ‌ర‌ణ‌కు కామ‌న్ ఏరియాలో ఉన్న డోర్ నాబ్ లు, డోర్ హేండిల్స్ ను అంద‌రూ వాడుతుంటారు. ముఖ్యంగా ఆఫీసులు, హోట‌ల్స్ లో ఉండే వాష్ రూమ్స్ ను అంతా వాడుకొంటారు. అటువంట‌ప్పుడు వారు టాయ్ లెట్స్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేట‌ప్పుడు చేతుల్ని స‌రిగ్గా శుభ్రం చేసుకొని ఉండ‌వ‌చ్చు. లేదా చేసుకోకుండా ఉండ‌వ‌చ్చు. అటువంటి వారు డోర్ నాబ్స్, డోర్ హేండిల్స్ తీసిన‌ప్పుడు ఆ చేతుల్ని ఉండే క్రిములు వాటికి అంటుకొంటాయి. వాటిని మ‌నం వాడుతున్నప్పుడు మ‌న చేతికి అవి అంటుకొంటాయి. అందుచేత చేతిని ఆ క్రిములు ఆశ్రయిస్తాయి. అందుచేత ఆహారం తీసుకొనేట‌ప్పుడు చేతుల్ని సక్రమంగా శుభ్రం చేసుకోక‌పోతే ఆ చేతుల‌తో క్రిములు క‌డుపులోకి ప్రవేశిస్తాయి. క‌డుపులో అవి చేసే దుష్ప్రభావం మొద‌లై పోతుంది. అందుచేత ఆహారం తీసుకొనేట‌ప్పుడు చేతుల్ని శుభ్రం చేసుకోవ‌టం మ‌రిచిపోకూడ‌దు.

ఈ రోజు ప్రత్యేక‌త మీకు తెలుసు క‌దా...!


క్యాలండ‌ర్ లో కొన్ని రోజుల‌కు ఒక్కో ప్రత్యేక‌త ఉంటుంది. ఆయా రోజుల్లో ఆయా ప్రత్యేక‌త‌ల‌ను గుర్తు చేసుకొనే వెసులుబాటు క‌లుగుతుంది. ఈ సంద‌ర్భంగా ఇవ్వాల్టి ప్రత్యేక‌త‌ను మీకు గుర్తు చేస్తున్నాం.
ప్రతీ ఏటా జూలై ఒక‌టో తేదీన డాక్టర్స్ డే గా పాటిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా మీకు డాక్టర్స్ క‌మ్యూనిటీ త‌ర‌పున శుభాకాంక్షలు..

ప్రముఖ వైద్యులు డాక్టర్ బిద‌న్ చంద్ర రాయ్ జ‌యంతి మ‌రియు వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఈ రోజున డాక్టర్స్ డే గా పాటిస్తున్నాం. వైద్యుల్లో దృవ తార‌గా డాక్టర్ రాయ్ ను చెబుతారు. భార‌త్ లో ఇండియ‌న్ మెడిక‌ల్ అసోసియేష‌న్ స్థాపించి వైద్యుల స‌మైక్యత కోసం కృషి చేశారు. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు. స్వాతంత్ర్యం త‌ర్వాత ప‌శ్చిమ బెంగాల్ కు ముఖ్యమంత్రిగా వ్యవ‌హ‌రించారు. ఆయ‌న సేవ‌ల‌కు గాను కేంద్ర ప్రభుత్వం భార‌త ర‌త్న తో స‌త్కరించింది.
డాక్టర్స్ డే సంద‌ర్భంగా ఒక ముఖ్య విష‌యాన్ని గుర్తు చేసుకొందాం..స‌మాజంలో క‌నిపించే వ్యాధుల్లో మూడు నుంచి నాలుగో వంతు దాకా వ్యాధుల్ని ముందుగానే నివారించ‌వ‌చ్చు. మాన‌వ చ‌ర్యల కార‌ణంగా ఈ రోగాలు పెచ్చు మీరుతున్నాయి. పొగ తాగటం, మ‌ద్యం తీసుకోవ‌టం, గుట్కాలు న‌మ‌ల‌టం వంటి చెడు అల‌వాట్లకు దూరంగా ఉండాలి. ఆహార‌పు అల‌వాట్లు క్రమ‌బ‌ద్దీక‌రించుకోవాలి. త‌గిన వ్యాయామం, స‌రిప‌డ విశ్రాంతి, ఆందోళ‌న‌లు లేని జీవ‌నాన్ని అల‌వర్చు కోవాలి. స‌మాజ‌మంతా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాల‌ని కోరుకొంటూ.. మ‌రోసారి డాక్టర్స్ డే శుభాకాంక్షలు....