...

SPECIALIZED SITE FOR HUMAN HEALTH CARE,
SPECIALLY ON GASTROENTEROLOGY, LIVER AND PANCREAS

క్యాన్స‌ర్ చికిత్స‌లో అపోహ‌లు వ‌ద్దు..!

క్యాన్స‌ర్ అంటే అదో చికిత్స లేని పెద్ద వ్యాధి అన్న నానుడి ఉంది. వాస్త‌వానికి క్యాన్స‌ర్ మొండి రోగం అన‌టంలో సందేహం లేదు. అంత‌మాత్రాన దీనికి చికిత్స లేదు అనుకొంటే మాత్రం పొర‌పాటే. క్యాన్స‌ర్ కు మొద‌టి ద‌శ‌ల్లో ర్యాడిక‌ల్ ఆప‌రేష‌న్ ద్వారా చికిత్స అందించ‌వ‌చ్చు. రెండో ద‌శ‌, మూడో ద‌శ‌కు వెళితే మాత్రం ఆప‌రేష‌న్ తో పాటు కీమో థెర‌పీ, రేడియో థెర‌పీ చికిత్స‌లు అందించాల్సి ఉంటుంది. చివ‌రి ద‌శ‌కు చేరుకొన్నా కూడా చికిత్స అందించిన‌ప్పుడు నాణ్య‌త‌తో కూడిన జీవితాన్ని అందించేందుకు వీలవుతుంది.

 అయితే, క్యాన్స‌ర్ కు ర్యాడిక‌ల్ ఆప‌రేష‌న్ చేస్తే ఇత‌ర ప్రాంతాల‌కు వ్యాపిస్తుంది అన్న అపోహ ఉంది. ఇది స‌రి కాదు. ప్ర‌స్తుతం ఆధునిక టెక్నాల‌జీ తో కూడిన ఆసుప‌త్రులు అందుబాటులో ఉన్నాయి. స‌మ‌ర్థుడైన స‌ర్జ‌న్ ను సంప్ర‌దించి మెరుగైన చికిత్స చేయించుకోవ‌చ్చు. అంతే కానీ ఆప‌రేష‌న్ చేయిస్తే ఏదో జ‌రిగిపోతుంది అని భ్ర‌మ ప‌డి చికిత్స కు దూరంగా ఉండ‌టం స‌రి కాదు.

అన్ని సంద‌ర్భాల్లో ప‌రీక్ష చేయ‌టం స‌రి కాదు..!

ప‌రీక్ష చేయ‌టం ద్వారా విష‌యాన్ని నిర్ధారించ‌టానికి వీల‌వుతుంది. ముఖ్యంగా క్యాన్స‌ర్ వంటి సంక్లిష్ట‌మైన వ్యాధుల విష‌యంలో నిర్ధార‌ణ పరీక్ష‌లు త‌ప్పనిస‌రి. ఇందుకోసం ర‌క్త ప‌రీక్ష‌, స్కానింగ్ వంటి సాధార‌ణ ప‌రీక్ష‌ల‌తో పాటు బ‌యాప్సీ చేయించ‌టం మామూలే. బ‌యాప్సీ అంటే అనుమానిస్తున్న శ‌రీర భాగంలోంచి కొంత భాగాన్ని వేరు చేసి దీన్ని ల్యాబ‌రేట‌రీ లో ప‌రీక్షిస్తారు. క్యాన్స‌ర్ క‌ణ‌జాలం ఉన్న‌దీ లేనిదీ నిర్ధారిస్తారు.

అయితే జీర్ణ కోశ వ్య‌వ‌స్థ లోని భాగాల్లో క్యాన్స‌ర్ అను మానించిన‌ప్పుడు మాత్రం బ‌యాప్సీ త‌ప్ప‌నిస‌రి అని భావించ‌రాదు. ఒక్కోసారి బ‌యాప్సీ చేసేట‌ప్పుడు స‌రిగ్గా చూసుకోక‌పోతే ఈ క‌ణ‌జాలం ఇత‌ర భాగాల‌కు సోకే అవ‌కాశం ఉంటుంది. అటువంట‌ప్పుడు బ‌యాప్సీ మాట దేవుడెరుగు కానీ ఈ క్యాన్స‌ర్ క‌ణ‌జాలం ఇత‌ర భాగాల్లో స్థిర‌ప‌డి అక్క‌డ క్యాన్స‌ర్ కు దారి తీయ‌వ‌చ్చు. అందుచేత త‌గిన వైద్య స‌ల‌హా మేరకు మాత్ర‌మే బ‌యాప్సీ చేయించ‌టం మేలు.

ప‌సిరిక‌ల తో పాటు ఈ స‌మ‌స్య‌లు ఉంటే జాగ్ర‌త్త‌..!

ప‌సిరిక‌లు వ‌చ్చిన‌ప్పుడు చాలా మంది చిన్న పాటి చికిత్స‌ల‌తో స‌రి పెడుతుంటారు. సాధార‌ణంగా మందుల‌తో కామెర్లు త‌గ్గిపోతాయి. శాస్త్రీయ‌మైన వైద్యం చేయించుకోవ‌టం ముఖ్యం అని గుర్తుంచుకోవాలి. ప‌సిరిక‌ల తో పాటు క‌డుపు నొప్పి, బ‌రువు త‌గ్గ‌టం, దుర‌ద‌లు, చ‌లి జ్వ‌రం వంటి ల‌క్ష‌ణాలు ఉంటే ప్ర‌మాదాన్ని శంకించాలి. మ‌లంలో బూడిద‌రంగు ఉండ‌టం లేదా న‌లుపు రంగులో మ‌లం ఏర్ప‌డ‌టం వంటి ల‌క్ష‌ణాల్ని ప‌రిశీలించాలి.

ఇటువంటి ల‌క్ష‌ణాలు ఉంటే శ‌రీరంలో ఇత‌ర ర‌కాల ఇబ్బందులు కూడా ఉన్నాయ‌ని గ‌మ‌నించుకోవాలి. అటువంట‌ప్పుడు త‌గిన వైద్య స‌ల‌హా వెంట‌నే తీసుకోవాలి. నిపుణులైన గ్యాస్ట్రో ఎంట‌రాల‌జిస్టు ను సంప్ర‌దించి వైద్య చికిత్స తీసుకోవాలి. అందుచేత ప‌సిరిక‌ల‌తో పాటు ఉండే ఇత‌ర స‌మ‌స్య‌ల్ని కూడా గమ‌నించి మెల‌గాలి.

ప్ర‌తిష్టాత్మ‌క స‌మావేశాలు..!

అసోసియేష‌న్ ఆఫ్ స‌ర్జ‌న్స్ ఆఫ్ ఇండియా వార్షిక స‌మావేశాలు ఈ సారి మ‌న రాష్ట్రంలో జ‌రుగుతున్నాయి. కాకినాడ‌లోని రంగరాయ వైద్య క‌ళాశాల‌లో APASICON XXXVI ANNUAL STATE CONFERENCE జ‌రుగుతోంది. దీనికి ఇప్పటికే 600 కి పైగా డెలిగేట్ల రిజిస్ట్రేష‌న్ పూర్త‌యింది. దేశ వ్యాప్తంగా ఉన్న స‌ర్జ‌న్ లు హాజ‌ర‌య్యే ఈ స‌మావేశంలో ప్ర‌తిష్టాత్మ‌క లెక్చ‌ర్ 20వ తేదీ ఉన్న‌ది. ఉద‌యం 11 గం.ల‌కు చారి ఎండోమెంట్ లెక్చ‌ర్ నేను ఇవ్వ‌బోతున్నాను. ఈ కార్య‌క్ర‌మానికి ఆస‌క్తి గ‌ల వారికి ఆహ్వానం.

అతిగా వేపుడు ప‌దార్థాలు తింటే ఏమ‌వుతుంది..!

అతిగా వేపుడు ప‌దార్థాల్ని కొంద‌రు ఇష్ట ప‌డ‌తారు. ఎర్ర‌గా కాల్చిన మాంస‌పు వంట‌ల్ని ఆస్వాదించేవారి సంఖ్య ఇటీవ‌ల పెరుగుతోంది. సాల్ట్ రెడ్ మీట్ వంటి ప‌దార్థాలు తినేట‌ప్పుడు ఇష్టంగా అనిపిస్తాయి. కానీ ఇవి శ‌రీరంలోకి ప్ర‌వేశించాక జీర్ణ ప్ర‌క్రియ స‌మ‌యంలో ఇబ్బంది పెడ‌తాయి.

వాస్త‌వానికి ఆహార ప‌దార్థాలు నోటిలోకొంత‌, క‌డుపులో కొంత‌, చిన్న పేగులో కొంత‌, చివ‌ర‌గా పెద్ద పేగు ప్రారంభంలో మ‌రికొంత జీర్ణం అవుతాయి.చివ‌ర‌గా మిగిలి పోయిన ప‌దార్థాల పునః శోష‌ణ అన్న‌ది పెద్ద పేగులో జ‌రుగుతుంది. ఈ అతిగా వేయించిన పదార్థాలు పేగు గోడ‌ల మీద ప్ర‌భావం చూపుతాయి. క్ర‌మం త‌ప్ప‌కుండా ఈ ప‌దార్థాల్ని తీసుకోవ‌టంతో పేగులో దుష్ప‌రిణామాలు చోటు చేసుకొంటాయి. కొన్ని సార్లు క్యాన్స‌ర్ కు దారి తీస్తాయి. ఒక వేళ ఈ అల‌వాటు తో పాటు మ‌ద్యం తాగే అల‌వాటు ఉంటే క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశాలు మ‌రింత ఎక్కువ ఉంటాయ‌ని గుర్తుంచుకోవాలి. అందుచేత ఈ అల‌వాట్ల‌కు దూరంగా ఉంటే మంచిది. మ‌ద్యం అల‌వాటు ఉంటే పూర్తిగా మాన‌టం మేలు.

చిన్న విష‌యాల్లో నిర్ల‌క్ష్య‌మే పెద్ద స‌మ‌స్య‌ల్ని తెచ్చి పెడుతుంది..!

నిర్లక్ష్యం అన్న‌ది ఎంత చిన్న‌దిగా ఉన్నా ఇబ్బందే. ఒక్కోసారి పెద్ద స‌మస్య‌ల‌కు ఇది కార‌ణం అవుతుంటుంది.
ఉదాహ‌ర‌ణ‌కు గోళ్లు క‌త్తిరించుకోవటం శ‌రీర స‌హ‌జ శుభ్ర‌త లో భాగం. దీన్ని క్ర‌మం త‌ప్ప‌కుండా చేసుకోవాలి అని చెబుతుంటారు. కానీ చాలా మంది ఈ విష‌యంలో బ‌ద్ద‌కించేస్తుంటారు.

 ఆహారం తినేముందు చేతులు శుభ్రం చేసుకొన్నాం క‌దా అని అనుకొంటారు. కానీ గోళ్లు ఉన్న‌ప్పుడు మాత్రం గోళ్ల మొద‌ళ్ల‌లో శుభ్రం చేసుకోవటం కుద‌ర‌దు. స‌బ్బు ప‌ట్టించినా కూడా ఈ ప్రాంతంలో శుభ్రం చేయటం కుద‌ర‌దు. అక్క‌డ క్రిములు ఇరుక్కొంటే అవి ఆహారం తినేట‌ప్పుడు ఆ క్రిములు శ‌రీరంలోకి ప్ర‌వేశిస్తాయి. చెడు చేయ‌టానికి బోలెడు బోలెడు క్రిములు అవ‌స‌రం లేదు. అందుచేత చేతి శుభ్రత‌లో ఎంతో ప్రాధాన్యం దాగి ఉంది. అందుచేత ఎప్ప‌టిక‌ప్పుడు చేతి గోళ్ల‌ను క‌త్తిరించుకొంటూ శుభ్ర‌త పాటించ‌టం మేలు.

పండ‌గ నాడు హెవీగా తినేస్తున్నారా...! శ‌రీరం పెర‌గ‌టానికి అది కూడా కార‌ణ‌మా..!

శ‌రీరం పెరుగుతోంద‌న్న కంప్ల‌యింట్ ఈమ‌ద్య ఎక్కువ‌గా వినిపిస్తోంది. కుర్చీకు అతుక్కొని పోయి ప‌నిచేసే క‌ల్చ‌ర్ ఎక్కువ‌గా ఉంటుండ‌టంతో  ఈ స‌మ‌స్య అనేక మంది నుంచి వినిపిస్తోంది.

సాధార‌ణంగా శ‌రీరంలో కొవ్వు ఎక్కువ‌గా పేరుకొని పోవ‌టం వ‌ల్ల ఈ స‌మస్య ఏర్ప‌డుతుంది. అందుచేత నిరంత‌ర వ్యాయామం, క్ర‌మ‌బ‌ద్దీక‌రించిన జీవ‌న శైలి తో ఈ స‌మస్య‌ను అధిగ‌మించ‌వ‌చ్చు. కొన్ని సార్లు మాత్రం కాలేయంలో స‌మ‌స్య ఏర్ప‌డితే ఈ ఇబ్బంది ఏర్ప‌డుతుంది. చాలామంది ఈ సంద‌ర్భంలో కూడా కొవ్వు ఏర్ప‌డటమే కార‌ణంగా భావించి బ‌ద్ద‌కించేస్తుంటారు. ఇది మాత్రం స‌రి కాదు. కొన్ని రోజుల‌కు ఈ స‌మ‌స్య ప‌రిష్కారం అయితే స‌రి.. లేదంటే మాత్రం ముందుగానే జాగ్ర‌త్త ప‌డాల్సిందే. అవ‌స‌రమైతే కాలేయ ఫంక్ష‌న్ టెస్ట్ (ఎల్ ఎఫ్ టీ) అనే చిన్న పాటి ప‌రీక్ష చేయించుకోవ‌టం ద్వారా దీన్ని నిర్ధారించుకోవ‌చ్చు. కాలేయంలో స‌మ‌స్య‌ను గుర్తిస్తే మాత్రం దీనికి త‌గిన చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. అందుచేత జాగ్ర‌త్త ప‌డ‌టం ముఖ్యం.

టీచ‌ర్స్ ను అంతా గుర్తుంచుకొనాలి స‌రే, టీచ‌ర్లు గుర్తుంచుకొనాల్సిందేమిటి..!

అంద‌రికీ ఉపాధ్యాయ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు. స‌మాజానికి దిశా నిర్దేశం చేసే మ‌హోన్న‌త వృత్తిలోఉన్న గురువులంద‌రికీ శుభాభివంద‌నాలు.
వృత్తి ప‌ట్ల మ‌మ‌కారం క‌లిగిన వారిగా టీచ‌ర్ల‌ను చెప్పుకోవ‌చ్చు. నూటికి 90శాతం టీచ‌ర్లు శ్ర‌ద్ధా భ‌క్తుల‌తో విధులు నిర్వ‌హిస్తుంటారు. అయితే ఉద‌య‌మే స్కూల్స్ కు, కాలేజీల‌కు టీచ‌ర్లు, లెక్చ‌ర‌ర్లు ప‌రిగెత్తుతూ ఉంటారు. ఉద‌య‌మే ఠంచ‌న్‌గా వెళ్లిపోవాల‌ని, క్లాసులు తీసుకోవాల‌ని ఆరాట‌ప‌డుతుంటారు.

కానీ ఈ హ‌డావుడిలో ఉద‌య‌మే బ్రేక్ ఫాస్ట్ చేయ‌టాన్ని కొంద‌రు ప‌క్క‌న పెట్టేస్తుంటారు. ఇది మంచిది కాదు. రాత్రి ఎప్పుడో తీసుకొన్న ఆహారం నుంచి విడుద‌లైన శ‌క్తి ఉద‌యానికి స‌రిపోతుంది. ఆ త‌ర్వాత చ‌క్క‌గా ప‌నిచేసేందుకు శ‌క్తి అవ‌స‌రం అవుతుంటుంది. ఈ శ‌క్తి విడుద‌ల కావాలంటే ఉద‌య‌మే ఆహారం త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాలి. అందుచేత బ్రేక్ ఫాస్టు త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాలి. చ‌క్క‌టి ఆహార‌పు అల‌వాట్ల‌ను కొన‌సాగించాలి. అందుకే ఆద‌ర్శ‌నీయ‌మైన టీచ‌ర్ల‌ను అంద‌రూ అభినందిద్దాం.

త‌రుచు క‌డుపు నొప్పి వ‌స్తోందా..!


సాధార‌ణంగా క‌డుపు నొప్పి అనే స‌మ‌స్య ను ప్ర‌తీ ఒక్క‌రూ ఎప్పుడో ఒక‌ప్పుడు అనుభ‌వించే ఉంటారు. చాలా సార్లు అజీర్ణం, అతి సారం వంటి స‌మ‌స్య‌ల‌తో ఇది ఏర్పడుతుంది. చాలా సంద‌ర్భాల్లో క‌డుపు నొప్పి దానంత‌ట అదే త‌గ్గిపోతుంది. ఇంట్లో వాడే చిట్కాల‌తో ఈ నొప్పి కి అడ్డుక‌ట్ట వేయ‌టానికి వీల‌వుతుంది. కానీ ఈ నొప్పి ని పూర్తిగా అశ్ర‌ద్ధ చేయ‌టం మాత్రం కూడ‌దు.

కొన్ని సార్లు క‌డుపు నొప్పితో పాటు విరేచ‌నాలు ఉంటాయి. అందులో రంగు క‌నిపించ‌వ‌చ్చు. అటువంట‌ప్పుడు ఈ నొప్పి విష‌యంలో జాగ్ర‌త్త ప‌డాల్సి ఉంటుంది. ఇన్ ఫ్ల‌మేట‌రీ బౌల్ డిసీజ్ లో ఈ రెండు ల‌క్ష‌ణాలు ప్ర‌ధాన‌మైన‌వి. అంటే వీటితో పాటు బ‌రువు త‌గ్గ‌టం, చిరాకు, వంటి ల‌క్ష‌ణాలు ఉంటుంటాయి. అటువంట‌ప్పుడు మాత్రం నిర్ల‌క్ష్యం చేయ‌టం మంచిది కాదు. త‌గిన వైద్య ప‌రీక్ష‌లు చేయించుకొంటే ప్రారంభ ద‌శ‌లోనే గుర్తించేందుకు వీల‌వుతుంది. వ్యాధి ముదిరితే మాత్రం శ‌స్త్ర చికిత్స చేయాల్సి ఉంటుంది. గ‌తంలో ఇది సంక్లిష్టంగా ఉండేది. ఇప్పుడు కాలంలో మాత్రం స‌శాస్త్రీయంగా, సాఫీగా చేసేందుకు వీలవుతోంది. పేగుల్లో పూర్తిగా స‌మ‌స్య ఏర్ప‌డిన ప్రాంతాన్ని గుర్తిస్తారు. దీన్ని క‌త్తిరించి ఆ భాగాన్ని తీసివేసి పేగుల్ని జ‌త చేసేస్తారు. ఆ త‌ర్వాత నుంచి జీర్ణ ప్ర‌క్రియ సాఫీగా జ‌రిగిపోతుంది. అందుచేత స‌మ‌స్య పదే ప‌దే త‌లెత్తుతున్న‌ప్ప‌డు నిర్ల‌క్ష్యం వ‌హించ‌కుండా ఉంటే బాగుంటుంది.