...

SPECIALIZED SITE FOR HUMAN HEALTH CARE,
SPECIALLY ON GASTROENTEROLOGY, LIVER AND PANCREAS

కొత్త సంవ‌త్స‌రంలో ఇంటి ఇల్లాలు ఒక కొత్త నిర్ణ‌యం తీసుకొంటే బాగుంటుందేమో..!

ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. ఎందుకంటే ఇంటిల్లిపాది చ‌ల్ల‌గా ఉండాలని, వాళ్ల జీవితంలో వెలుగు నిండాల‌ని అనుక్ష‌ణం కోరుకొనేది ఇల్లాలే. కొవ్వొత్తి తాను క‌రిగిపోతూ గ‌దంతా వెలుగులు ప‌రుస్తుంది. ఇంట్లో ఇల్లాలు కూడా అలాగే తాప‌త్ర‌య ప‌డుతుంది. భ‌ర్త, పిల్ల‌లు, పెద్ద‌లు అంతా ఆరోగ్యంగా ఉండాల‌ని, ఆనందంగా ఉండాల‌ని కోరుకొంటూ ఉంటారు. ఈ హ‌డావుడిలో త‌మ ఆరోగ్యం సంగ‌తి ప‌ట్టించుకోకుండా వ‌దిలేస్తుంటారు.
ఈ కోణంలో ఆలోచిస్తే ఒక అంశాన్ని గుర్తు చేసుకొందాం. ప్ర‌తీ రోజూ రాత్రి 8,9 గంట‌ల‌కు భోజ‌నం చేసి కొద్ది సేప‌టి త‌ర్వాత నిద్రించ‌టం చాలా ఇళ్ల‌లో జ‌రిగేదే. ఉద‌యం నిద్ర లేచిన ద‌గ్గ‌ర నుంచి కుటుంబ స‌భ్యుల బాధ్య‌త‌లు తీర్చ‌టంలో ప‌రిగెత్తుతుంటారు. పిల్ల‌ల‌ను స్కూల్స్ లేక కాలేజీల‌కు పంపించాలంటే వాళ్ల‌కు కావ‌ల్సిన‌వ‌న్నీ సర్దిపెట్టి, లంచ్ బాక్సులు స‌ర్ది పంపించాలి. ఆ త‌ర్వాత భ‌ర్త లేక కుటుంబ స‌భ్యులు ఆఫీసుల‌కు లేక వ్యాపారాల‌కు వెళ్లాలంటే వాళ్ల‌కు కావ‌ల్సిన‌వి అమ‌ర్చి పెట్టాలి.

ఈ హ‌డావుడిలో బ్రేక్ ఫాస్టు మానేస్తుంటారు. పైగా ఇంటినిండా పని ఉంది కదా అని కొంద‌రు, పిల్ల‌లు కుటుంబ స‌భ్యులు హ‌డావుడి ప‌డుతుంటే బాగోద‌ని మ‌రి కొంద‌రు, ఇత‌ర కార‌ణాల‌తో మ‌రి కొంద‌రు మానేస్తుంటారు. న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లో దాదాపుగా ఇటువంటి ముఖ‌చిత్రాన్ని మ‌నం చూస్తుంటాం. అదే వ‌ర్కింగ్ ఉమెన్ అయితే ఈ క‌ష్టాలు రెట్టింపు అని వేరే చెప్ప న‌క్క‌ర లేదు.  ఆ త‌ర్వాత ఇల్లు స‌ర్దుకొని ఒక రూపంలో అమ‌ర్చుకొనే స‌రికి 10,11 అవుతుంది. అప్పుడు కాస్తంత ఆహారం తీసుకొంటారు త‌ప్పితే అప్ప‌టి దాకా ఏమీ తీసుకోకుండానే ప‌రుగులు తీస్తుంటారు. అంటే రాత్రి 10 నుంచి ఉద‌యం 10 దాకా .. దాదాపు స‌గం రోజు పాటు ఏమాత్రం ఆహారం తీసుకోవ‌టం లేదు. కానీ ఆ త‌ర్వాత స‌గంలో మాత్రమే ఆహారం తీసుకొంటారు. ఇది ఇల్లాలి ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. అందుచేత ఉద‌యం పూట కాస్తంత బ్రేక్ ఫాస్టు చేయ‌టం అన్న‌ది మంచి అల‌వాటు. దీంతో శ‌రీరానికి కావ‌ల‌సిన గ్లూకోజ్ అందుతుంది. ఆ త‌ర్వాత లంచ్‌, స్నాక్స్, డిన్న‌ర్ వంటివి ప్లాన్ చేసుకోవ‌చ్చు. ఇల్లాలు ఆరోగ్యంగా ఉంటేనే క‌దా, ఇల్లంతా మ‌రింత ప్ర‌కాశ‌వంతంగా ఆరోగ్యంగా ఉండేది.
పాఠ‌కులు అంద‌రికీ తెలుగు వారి కొత్త సంవ‌త్స‌రం యుగాది శుభాకాంక్ష‌లు.

లోక‌ల్ టాలెంట్ మంచిదే కానీ, కాస్త ఆలోచించండి..:

మ‌న బంగారం మ‌న‌కు మంచిదే. దీన్ని కాద‌నం. అందుకే లోక‌ల్ విష‌యాలు మ‌న‌కు న‌చ్చుతాయి. మ‌న అన్న మాట వాడితే చాలు విన‌టానికి చాలా బాగుంటుంది. కానీ కొన్ని విష‌యాల్లో మాత్రం జాగ్ర‌త్త‌గా ఉండాలి సుమా..:
ముఖ్యంగా ఆరోగ్యం విష‌యంలో ఈ సూత్రాన్ని ప‌ట్టించుకోవాలి.

 సాఫ్ట్ ఫుడ్ తినేట‌ప్పుడు సాస్ తీసుకోవ‌టం చేస్తుంటాం. ఈ సాస్ సాధారణంగా బేక‌రీ వాళ్లు ఎరేంజ్ చేసిన‌ది తీసుకొంటాం. అప్ప‌టి దాకా బ్రాండెడ్ ఫుడ్ తీసుకొంటున్నా, సాస్ విష‌యంలో పెద్ద‌గా ప‌ట్టించుకోం. వాస్త‌వానికి ఈ సాస్ ఎక్క‌డ త‌యారు చేస్తుంటారు, ఎలా త‌యారు చేస్తుంటారు అన్న విష‌యాలు తెలుసుకొంటే మాత్రం ఆశ్చ‌ర్య పోతాం. సాస్ క‌ల‌ర్ ఫుల్ గా ఉండేందుకు కొన్ని లోక‌ల్ సంస్థ‌లు ప్ర‌మాద‌క‌ర‌మైన ర‌సాయ‌నాలు వాడుతున్న‌ట్లు ఇటీవ‌ల బ‌య‌ట‌ప‌డింది. బ్రాండెడ్ ఫుడ్ విష‌యంలో అయితే ఆయా సంస్థ‌లు ఈ ర‌సాయ‌నాల వాడ‌టంలో జాగ్ర‌త్త‌లు తీసుకొంటాయి. కొన్ని లోక‌ల్ సంస్థ‌లు మాత్రం చౌక‌గా త‌యారు చేసేందుకు ఇటువంటి మార్గాల్ని అన్వేషిస్తున్నారు. అందుచేత అదే ప‌నిగా తెలియ‌ని చోట్ల సాస్ ఎక్కువ‌గా తీసుకోవ‌ద్దు. ముఖ్యంగా పిల్ల‌ల‌కు ఇటువంటి అల‌వాటు ఉంటుంది కాబ‌ట్టి జాగ్ర‌త్త ప‌డ‌టం మంచిది.
అంత మాత్రాన లోక‌ల్ సంస్థ‌ల‌న్నీ చెడ్డ‌వీ, బ్రాండెడ్ సంస్థ‌ల‌న్నీ మంచివ‌ని చెప్ప‌టి మ‌న ఉద్దేశం కాదు. ఆరోగ్య ప‌రంగా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని చెప్ప‌ట‌మే మ‌న ఉద్దేశం.

ఇప్పుడు నీటి గురించి ఆలోచించాల్సిందే..!

నీరు అన్న‌ది జీవాధారం. ప్ర‌పంచ వాట‌ర్ డే గా మార్చ్ 22ను పాటిస్తుంటాం. ఈ సంద‌ర్భంగా నీటి కి ఉన్న ప్రాధాన్యాన్ని తెలుసుకొందాం..

మాన‌వ శ‌రీరంలో 60 శాతం నీరు ఉంటుంది. వివిధ రూపాల్లో ఉండే ఈ ద్ర‌వాలు జీర్ణ క్రియ‌, శోష‌ణ‌, ప్ర‌స‌ర‌ణ‌, ర‌వాణా, ఉష్ణోగ్ర‌త స‌మ‌తుల్య‌త వంటి అంశాల్లో కీల‌క పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా శ‌రీర బ‌రువు నిర్దిష్టంగా ఉండేట్లు చేయ‌టంలో నీటి ప్రాధాన్యం గుర్తించుకోద‌గిన‌ది. నీటిని కావాల్సినంత‌గా తీసుకోవ‌టం వ‌ల‌న శ‌రీరంలో జీవ‌న క్రియ‌లు చురుగ్గా సాగి, ప‌రిమితిగా బ‌రువు ఉంటుంది. ముఖ్యంగా చురుగ్గా ర‌క్త ప్ర‌స‌ర‌ణ జ‌రుగుతుంది కాబ‌ట్టి గుండె పోటు వ‌చ్చే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయి. అంతే గాకుండా మూత్ర పిండాల ప‌ని తీరు కూడా మెరుగ‌వుతుంది. విస‌ర్జ‌న సాఫీగా ఉండ‌టం వ‌ల‌న శ‌రీరం చైత‌న్య వంతంగా ఉంటుంది. ప్ర‌ధానంగా చ‌ర్మానికి చెందిన గ్రంథులు చ‌క్క‌గా ప‌ని చేసి చ‌ర్మం కాంతివంతంగా ఉంటుంది. శ‌రీర భాగాలు చైత‌న్య వంతంగా ఉండటంతో పాటు మెద‌డు చురుగ్గా ప‌ని చేస్తుంది. దీంతో వివిధ అవ‌యవాల మ‌ధ్య స‌మ‌న్వ‌యం చ‌క్క‌గా సాగుతుంది.
అందుచేత శ‌రీర బ‌రువును బ‌ట్టి త‌గినంత‌గా నీటిని తీసుకోవాల్సి ఉంటుంది. అంత మాత్రాన విప‌రీతంగా మాత్రం తాగ‌కూడ‌దు సుమా..:

ఇప్పుడు ఉన్న ప‌రిస్థితుల్లో కాస్త వేడి త‌గ్గించండి..!

అతి వేడి ఆహారం తిన‌టం, అతి వేడి టీ తాగ‌టం, వేయించిన మాంసాహారం తీసుకోవ‌టం వంటివి త‌గ్గించుకొని దుర‌ల‌వాట్లకు దూరంగా ఉంటూ స‌మ‌తుల్య ఆహారం తీసుకొంటే జీర్ణ వ్య‌వ‌స్థ ఆరోగ్యానికి మంచిది. స‌రైన జీవ‌న శైలి లేక‌పోవ‌టం, దుర‌ల‌వాట్లు, జ‌న్యుప‌ర‌మైన మార్పులు, వంశ‌పారంప‌ర్యంగా వ‌చ్చే జ‌న్యు లోపాలు వంటి కార‌ణాల‌తో డైజ‌స్టివ్ క్యాన్స‌ర్ వంటి రోగాలు రావ‌చ్చు. దీనికి నిర్దిష్టమైన కార‌ణాన్ని చెప్పటం వీలు కాదు. ఆహారం మింగ‌టంలో ఇబ్బంది, ఏమీ తిన‌కుండానే క‌డుపు నిండుగా ఉండ‌టం, కొద్ది పాటి ఆహారం తిన్నా నొప్పి ,అజీర్తి, మ‌లంలో ర‌క్తం వంటి స‌మ‌స్యల‌తో దీన్ని అనుమానించాల్సి ఉంటుంది. అనుమానం ఏర్పడిన‌ప్పుడు ఎక్సురే, ర‌క్త ప‌రీక్షల‌తో పాటు ఎండోస్కోపీ, కొల‌నోస్కోపీ, సీటీ స్కాన్‌; ఎమ్ ఆర్ ఐ స్కాన్  వంటి ప‌రీక్షలు చేయించాల్సి ఉంటుంది.

 డైజ‌స్టివ్ క్యాన్సర్ నిర్ధార‌ణ అయితే కంగారు ప‌డాల్సిన ప‌ని లేదు సుమా..!వ్యాధి తొలిద‌శ‌లో ఎండో స్కోపీ, కొల‌నోస్కోపీ విధానాల‌తో చికిత్స చేయ‌వ‌చ్చు.  త‌ర్వాత ద‌శ‌లో ర్యాడిక‌ల్ ఆప‌రేష‌న్ చేయ‌టం ద్వారా మెరుగైన ఫ‌లితాలు పొందవ‌చ్చు.  వ్యాధి ముదిరినప్పుడు ఆప‌రేష‌న్ తో పాటు కీమో థెర‌పీ, రేడియో థెర‌పీ వంటి విధానాల‌తో నాణ్యమైన శేష జీవితాన్ని అందించ‌వచ్చు.
    ఒక‌ప్పుడు క్యాన్సర్ వ‌చ్చిందంటే మ‌ర‌ణం త‌ప్పద‌న్న భావ‌న ఉండేది.   ఆధునిక వైద్య శాస్త్ర ప‌రిశోధ‌న‌ల‌తో చికిత్స మార్గాలు అందుబాటులోకి వ‌స్తున్నాయి. ప్రతిష్టాత్మక వైద్య సంస్థల్లో ప‌రిశోధ‌న‌లు జ‌రిపిన వైద్యులు ఈ చికిత్స మార్గాల్ని అంది పుచ్చుకొని చికిత్సలు అందించ‌గ‌లుగుతున్నారు.  క్యాన్సర్ మీద అపోహ‌లు తొల‌గించుకొని అవ‌గాహ‌న తెచ్చుకొంటే నాణ్యమైన శేష జీవితం ల‌భిస్తుంది.
దుర‌ల‌వాట్ల‌కు దూరంగా ఉంటూ స‌రైన జీవ‌న విధానాల్ని , ఆహార నియ‌మాల్ని పాటిస్తే వ్యాధుల‌కు దూరంగా ఉండ‌వ‌చ్చు.