...

SPECIALIZED SITE FOR HUMAN HEALTH CARE,
SPECIALLY ON GASTROENTEROLOGY, LIVER AND PANCREAS

కొన్ని కొన్ని విష‌యాల్ని వ‌దిలేస్తే ప్ర‌మాదం సుమా.. ముందు జాగ్ర‌త్తే శ్రీరామ ర‌క్ష‌..!

చిన్న చిన్న విష‌యాల్ని నిర్ల‌క్ష్యం చేయటం చాలా మందికి అల‌వాటు. ఆరోగ్యం విష‌యంలో చాలా మంది ఈ పని చేస్తుంటారు. రోగ ల‌క్ష‌ణాలు బ‌య‌ట ప‌డిన‌ప్ప‌టికీ వాటికి త‌గిన వైద్యం చేయించుకోకుండా నాన్చుతుంటారు. త‌ర్వాత కాలంలో అవి పెద్ద విష‌యాలుగా మారుతుంటాయి.
మొన్నీ మధ్య‌న మా హాస్పిట‌ల్ లో ఒక కేసు తీసుకోవ‌టం జ‌రిగింది. పేషంట్ (పేరు వ‌ద్దులెండి) ఒక మ‌ధ్య వ‌య‌స్కుడు. ఆయ‌న మీదనే ఆయ‌న కుటుంబం ఆధార ప‌డి ఉంటుంది. ఆయ‌న‌కు త‌ర‌చు క‌డుపు నొప్పి వ‌స్తు ఉండేది. దానికి స్థానికంగా దొరికే మందులు వేసుకొంటూ ఉండేవాడు. అప్ప‌టిక‌ప్పుడు త‌గ్గిపోతుండ‌టంతో బండి న‌డిపించేశాడు. త‌ర్వాత కాలంలో క‌డుపు ద‌గ్గ‌ర వాపు క‌నిపించ సాగింది. ఈ లోగా కామెర్లు కూడా తోడ‌య్యాయి. అప్పుడు వైద్యుల్ని సంప్ర‌దించాడు. స్థానిక వైద్యులు దాని తీవ్ర‌త‌ను గ‌మ‌నించి నా ద‌గ్గ‌ర‌కు పంపించారు. కాలేయం లో ప‌రీక్ష‌లు చేయిస్తే క‌ణితి ఉన్న‌ట్లు తేలింది.


పై ఫోటో లో ఉన్న‌ట్లుగా కాలేయం అంటే దాదాపు 10 సెంటీ మీట‌ర్ల నిడివి ఉండి, 2 కిలోల దాకా బ‌రువు ఉండే ఒక త‌మ్మె వంటి గ్రంథి. ఇందులో క‌ణితుల్ని అప్పుడ‌ప్పుడు చూస్తుంటాం. కానీ ఈయ‌న కాలేయంలో సుమారు 5 కిలోల క‌ణితి పేరుకొని పోయింది.(దిగువ ఫోటోలో మ‌నం చూడ‌వ‌చ్చు) కాలేయంలోప‌ల పేరుకొని పోయిన క‌ణితి ప్ర‌మాద‌క‌రంగా మారిపోయింది. అక్క‌డ నుంచి దాన్ని తొల‌గించ‌క పోతే ఆయ‌న‌కు ప్ర‌మాదం ఏర్ప‌డుతుంది. అలాగ‌ని తొంద‌ర‌ప‌డి తొల‌గించే ప‌రిస్థితి కూడా కాదు. అందుకే ఆయ‌న‌కు హెప‌టెక్ట‌మీ ఆప‌రేష‌న్ చేయాల‌ని నిర్ణ‌యించాం. దాదాపు 3 గంట‌ల పాటు సంక్లిష్ట‌మైన ఆప‌రేష‌న్ చేసి క‌ణితిని తొల‌గించ‌టం జ‌రిగింది. దీంతో ఆయ‌న‌కు పెద్ద ప్ర‌మాదం త‌ప్పింది.
ఈ కేసు విష‌యంలో కూడా ముందు జాగ్ర‌త్త యొక్క ప్రాధాన్యం తెలిసి వ‌చ్చింది. క‌ణితి ప్రారంభ కాలంలోనే గ‌మ‌నించి ఉంటే ఇంత‌టి రిస్క్ తో ఆప‌రేష‌న్ చేయాల్సిన అవ‌స‌రం ఉండేది కాదు. అదే స‌మ‌యంలో కనీసం అప్పుడైనా గుర్తించాం కాబ‌ట్టి స‌రిపోయింది లేక‌పోతే చాలా చాలా ఇబ్బంది ఏర్ప‌డేది.