కాలేయ మార్పిడి అంటే చాలామందికి పూర్తి వివరాలు తెలియదు. వివిధ కారణాలతో కాలేయం పూర్తిగా చెడిపోయినప్పుడు దానికి ప్రత్యామ్నాయం అనుసరించాల్సి ఉంటుంది. అటువంటప్పుడు పూర్తి స్థాయి ఆరోగ్యవంతుడు లేదా బ్రెయిన్ డెడ్ అయిన ఆరోగ్య వంతుడి శరీరం నుంచి కాలేయ భాగాన్ని తీసి, రోగి శరీరంలో అమర్చటాన్నే కాలేయ మార్పిడి అంటారు.
దాత నుంచి కాలేయాన్ని సేకరించాక గ్రహీత లోకి అమర్చటం అన్నది నిపుణులైన వైద్యుల టీమ్ మాత్రమే చేయగలుగుతుంది. ట్రాన్సు ప్లాంటేషన్ సర్జన్, అనెస్థటిస్టు, పెర్ ఫ్యుషనిస్టు, హెపటాలజిస్టు వంటి నిపుణులు ఇందులో పాలు పంచుకొంటారు. కాలేయ మార్పిడి లో వివిధ విభాగాల మధ్య సమన్వయం అవసరం. అదే సమయంలో సదరు ఆస్పత్రిలో అన్ని వసతులు ఉన్న ఆపరేషన్ థియోటర్, ఇంటెన్సివ్ కేర్ యూనిట్, బ్లడ్ బ్యాంక్, సపోర్టివ్ ల్యాబ్ లు ఉండాలి. సుశిక్షితులైన సిబ్బంది ఉండాలి. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకొని ఆలోచిస్తే కాలేయ మార్పిడి ఒక ఖరీదైన అంశంగా చెబుతారు. కానీ భారత్ లో మాత్రం ఇది చౌకగా జరుగుతుందనే చెప్పాలి.
కాలేయాన్ని గ్రహీత శరీరంలో అమర్చాక.. అది అక్కడ నెమ్మదిగా ఇమిడిపోతుంది. ఇతర అవయవాల నుంచి సహాయం తీసుకొని కుదురుకొంటుంది. ఆ తర్వాత నెమ్మదిగా తన విధులు నిర్వర్తించటం ప్రారంభిస్తుంది. ఇందుకు కొన్ని వారాల నుంచి నెలల సమయం పడుతుంది. సాధారణంగా శరీరంలోకి ఇతరుల అవయవాలు ప్రవేశిస్తే.. దేహం దాన్ని తిరస్కరిస్తుంది. ఇటువంటి పరిస్థితి చోటుచేసుకోకుండా ఉండేందుకు ఇమ్యునో సప్రెసివ్ మందులు వాడాల్సి ఉంటుంది. తక్కువ ఇమ్యూనోజెనిక్ సామర్థ్యం కల అవయవంగా కాలేయాన్ని చెబుతారు. అందుచేత ఎక్కువ కాలం ఈ మందుల్ని వాడుతున్నా..చౌకగానే సాధ్యం అని గుర్తించుకోవాలి. ఇటువంటి ఆపరేషన్ లలో తరచుగా వచ్చే సైడ్ ఎఫెక్టు గా ఇన్ ఫెక్షన్ ను చెబుతారు. అందుచేత కాలేయ మార్పిడికి ముందుగానే వైరల్, బ్యాక్టీరియా ఇన్ ఫెక్షన్ సోకకుండా టీకాల్ని ఉపయోగించాల్సి ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే కాలేయ మార్పిడి ఆపరేషన్ లు విజయవంతం అవుతున్నట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఇటువంటి రోగులు ..మిగిలిన రోజుల్లో అవసరం అయినప్పుడల్లా వైద్యుల సాయం తీసుకోవాలి.