...

SPECIALIZED SITE FOR HUMAN HEALTH CARE,
SPECIALLY ON GASTROENTEROLOGY, LIVER AND PANCREAS

కాలేయ క్యాన్సర్ - అవ‌గాహ‌న‌

ఒక‌ప్పుడు క్యాన్స‌ర్ అంటే పెద్ద‌ల్లో మాత్ర‌మే గ‌మ‌నించేవాళ్లం. ఇటీవ‌ల మాత్రం పిల్ల‌ల్లో కూడా క్యాన్స‌ర్ క‌నిపిస్తుండ‌టం ఆందోళ‌న క‌లిగించే విష‌యం. కాలేయ క్యాన్స‌ర్ విష‌యానికి వ‌స్తే ఈ మ‌ధ్య కాలంలో దీన్ని గుర్తిస్తూ ఉన్నాం.
మాన‌వ శ‌రీరంలో కాలేయం ఒక ప్రధాన అవ‌య‌వం. జీర్ణ వ్యవ‌స్థ, ప్రోటీన్ సంశ్లేష‌ణ‌, డ్రగ్ మెట‌బాలిజం, శ‌రీర స‌మ‌తుల్యత‌, విస‌ర్జన వంటి అనేక ముఖ్య ప్రక్రియ‌ల్లో  పాలు పంచుకొంటుంది. కాలేయానికి ఏర్ప‌డే స‌మ‌స్య‌ల్లో ప్ర‌ధాన స‌మ‌స్య‌ల్లో కాలేయ క్యాన్స‌ర్ ఒక‌టి. కాలేయంలో క‌ణితి ఏర్ప‌డి అది అవాంఛ‌నీయంగా పెరిగిపోతుంది. స‌జీవ క‌ణ‌జాలాన్ని నాశ‌నం చేసి విస్త‌రిస్తున్న క్ర‌మంలో క్యాన్స‌ర్ ను నిర్ధారిస్తారు. అన్ని క‌ణితులు క్యాన్స‌ర్ క‌ణితులు కాద‌ని మ‌నం గుర్తించుకోవాలి. వైర‌స్ సంక్ర‌మ‌ణ‌, అధిక మ‌ద్య‌పానం అల‌వాటు, పుట్టుక‌తో వచ్చిన లోపాలు, సిర్రోసిస్ వంటి కార‌ణాల‌తో క్యాన్స‌ర్ త‌లెత్త‌వ‌చ్చు.

దుర‌దృష్ట‌వ‌శాత్తు కాలేయ క్యాన్స‌ర్  ముదిరిపోయే దాకా ల‌క్ష‌ణాలు బ‌య‌ట ప‌డ‌వు. క‌డుపులో ఎగువ భాగంలో నొప్పి రావ‌టం, బ‌రువు త‌గ్గ‌టం, ఆక‌లి త‌గ్గ‌టం, బాగా నీర‌సంగా ఉండ‌టం వంటి ల‌క్ష‌ణాలు ఉంటాయి. కొన్ని సార్లు కామెర్లు సోకి శ‌రీరం, క‌ళ్లు రంగు మార‌తాయి. కాలేయం పెరిగిన‌ప్పుడు క‌డుపు ప్రాంతంలో వాపు క‌నిపిస్తుంది. చిన్న పిల్ల‌లకు స్నానం  చేయించేట‌ప్పుడు త‌ల్లిదండ్రులు త‌డిమి చూస్తే చేతికి త‌గిలే అవ‌కాశం ఉంది.
అందుచేత అటువంటి ఆన‌వాళ్లు ఉన్న‌ప్పుడు వెంట‌నే స్పందించాలి. అవ‌స‌ర‌మైతే స్కానింగ్ వంటి ప‌రీక్ష‌లు చేయించుకోవ‌టంతో పాటు నిపుణులైన వైద్యుల్ని సంప్ర‌దించాలి. క్యాన్స‌ర్ ను ఎంత ముందుగా గుర్తిస్తే అంత స‌మ‌ర్థంగా చికిత్స అందించేందుకు వీల‌వుతుంది.

మ‌హిళ‌లూ..! ముందే జాగ్ర‌త్త ప‌డండి..!

మ‌హిళ‌లు అనే కాదు, పురుషులు కూడా కొన్ని సార్లు చిన్న‌పాటి ఆరోగ్య స‌మ‌స్య‌ల్ని నిర్ల‌క్ష్యం చేస్తుంటారు. ఇందులో ర‌క్త హీన‌త ల‌క్ష‌ణాలు కూడా ఒక‌టి. సాధార‌ణంగా ఈ స‌మ‌స్య మ‌హిళ‌ల్లో ఎక్కువ ఉంటుంది అనుకొంటుంటారు. అంత‌కు మించి మ‌హిళ‌లు దీన్ని ఎక్కువ నిర్ల‌క్ష్యం చేస్తున్నార‌ని మాత్రం చెప్ప‌వ‌చ్చు.

ర‌క్తంలో ఎర్ర ర‌క్త క‌ణాలు త‌క్కువ‌గా ఉంటే దాన్ని ర‌క్త హీన‌త గా చెబుతారు. హీమో గ్లోబిన్ అనేది ఈ ఎర్ర ర‌క్త క‌ణాల్లో ప్ర‌ధాన వ‌ర్ణ‌క ప‌దార్థం. దీంతో ర‌క్తం త‌గ్గిన‌ట్లుగా భావిస్తారు. అదే ర‌క్త‌హీన‌త‌. దీంతో చాలా నీర‌సంగా క‌నిపిస్తారు. చిన్న పాటి ప‌నికే అలిసిపోయిన‌ట్లుగా క‌నిపిస్తారు. నిస్త్రాణ‌త ఉంటుంది. గ‌ర్భ‌వ‌తులు, వృద్దుల్లో ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే మ‌రింత జాగ్ర‌త్త ప‌డాల్సి ఉంటుంది. చాలా వ‌ర‌కు దీనికి పోష‌కాహార లోప‌మే కారణంగా భావిస్తు ఉంటారు. అందుచేత ఆహారాన్ని స‌మృద్దిగా తీసుకోమ‌ని చెబుతారు.
ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. కానీ అన్ని సార్లు పోష‌కాహార లోప‌మే ర‌క్త హీన‌త కు కార‌ణం కాక‌పోవ‌చ్చు. ఎర్ర ర‌క్త క‌ణాలు శిథిలం కావ‌టంలో స‌మ‌స్య కానీ, ఎర్ర ర‌క్త క‌ణాల ఉత్ప‌త్తిలో స‌మ‌స్య కానీ ఉండ‌వ‌చ్చు. అటువంట‌ప్పుడు పోష‌కాహార లోపం అనుకొని నిర్ల‌క్ష్యం చేస్తే స‌మ‌స్య త‌ప్ప‌దు. అందుచేత ర‌క్త హీన‌త ఉన్న‌ప్పుడు స‌రైన వైద్య స‌ల‌హా తీసుకొని ప‌రీక్ష‌లు చేయించుకొంటే మంచిది. ముంద‌స్తు జాగ్ర‌త్త‌తో ఇబ్బందుల్ని త‌ప్పించుకోవ‌చ్చు.