...

SPECIALIZED SITE FOR HUMAN HEALTH CARE,
SPECIALLY ON GASTROENTEROLOGY, LIVER AND PANCREAS

కడుపు మంట - అజీర్తి

ఒక్కోసారి విపరీతమైన ఆకలి వేస్తుంది. వడ్డించింది సరిపోదేమో అనిపిస్తుంది. కానీ కొంచెం తినగానే కడుపు నిండిపోయినట్లు అనిపిస్తుంది. ఇంకో ముద్ద తిందామంటే  పొట్ట బరువెక్కిపోతుంది. ఇంక మెతుకు కూడా దిగని పరిస్థితి వస్తుంది. సరే అని చెయ్యి కడుక్కుంటే.. మళ్లీ కాసేపటికే ఆకలి వేస్తుంది. తట్టుకోలేక ఏది కనిపిస్తే అది తినేద్దాం అనిపిస్తుంది. ఇదే అజీర్తి కథ.
           ఇప్పటిదాకా వేసింది నిజమైన ఆకలి కాదు. మాయా ఆకలి. అది కడుపులో మంట. కడుపులోకి తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకుండా అలాగే ఉండిపోవడం వల్ల అజీర్తి చేస్తుంది. ఆహార పదార్థాల ఆమ్లీకరణ తర్వాత చిన్నపేగుల్లో శోషణ జరుగుతుంది. తర్వాత పెద్దపేగుల ద్వారా మూత్రపిండాల్లోకి వ్యర్థపదార్థాలు చేరతాయి. అయితే శోషణ సరిగా జరగకపోతే అజీర్తి వస్తుంది. 

అన్నం తినకపోవడం.. దీర్ఘకాలిక వ్యాధి

వ్యక్తిగత అలవాట్లను బట్టి జీవితాంతం వెంటాడే సమస్య గ్యాస్ ట్రబుల్. ఇది దీర్ఘకాలిక వ్యాధి. దీన్నేగ్యాస్ట్రైటిస్ అని కూడా అంటారు. గ్యాస్ట్రైటిస్ లో పేగుల్లోపలి పొరలు వాచిపోతాయి. అన్నం సహించకపోవడం, ఆకలి లేకపోవడం, వికారం, విరోచనాలు వంటివి గ్యాస్ ట్రబుల్ లక్షణాలు. సాయంకాలం కంటే పొద్దున పూటే ఈ బాథలు ఎక్కువగా ఉంటాయి. పేగుపై పూత అంటే గ్సాస్ట్రిక్ అల్సర్ ఉన్నా కూడా ఇవే లక్షణాలు ఉంటాయి. ప్యాంక్రియాజ్ క్యాన్సర్ వచ్చినప్పుడు, లివర్ లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కూడా గ్యాస్ ట్రబుల్ వచ్చే అవకాశాలు ఎక్కువ.
            రోజువారీ తినే అన్నమా కదా అని తేలిగ్గా తీసుకోవడానికి లేదు. ఆ అన్నం తినే అలవాట్లను బట్టి కూడా దీర్ఘకాలిక వ్యాధి లక్షణాలను అంచనా వేయొచ్చు. ఎప్పుడో ఓసారి అన్నం మానేస్తే పర్వాలేదు కానీ.. తరచుగా అన్నం తినాలని అనిపించకపోతే మాత్రం తప్పనిసరిగా అనునామనించాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఈ అన్నం తినాలనిపించకపోవడం టీబీ, క్యాన్సర్, గ్యాస్ట్రైటిస్ లాంటి దీర్ఘకాలిక వ్యాధుల లక్షణం కావచ్చని హెచ్చరిస్తున్నారు.

అన్నం సహించట్లేదా..?

అన్నం వాసన తెలియకపోవడం, అీన్నపు రుచి తెలియకపోవడం, ఆస్వాదించలేకపోవడం, ఒక రుచికి, మరో రుచికి తేడా తెలియక పోవడం, నోటిలోపల అసహ్యకరమైన ఏదో రుచి ఉండటం వంటివన్నీ.. అన్నం సహించట్లేదనడానికి సంకేతాలు. నోటి దుర్వాసన, మన ఊపిరి ఇతరులకు అసహ్యం కలిగిస్తుందనే భయంతో శ్వాస బిగపట్టడం కూడా దీని లక్షణాలే.
       రక్తహీనత కారణంగా రక్తంలో హీమోగ్లోబిన్ తగ్గిపోయి ఆ ప్రభావం ఎర్రరక్తకణాలతో పాటు జీర్ణకోశవ్యవస్థ మీద కూడా ఉంటుంది. దీని వల్ల ఆక్సిజన్ శరీరానికి అందడం తగ్గిపోయి జీవక్రియలో లోపాలు ఏర్పడతాయి. వీటితో పాటు మానసిక సమస్యలు కూడా ఉత్పన్నమౌతాయి. ఆకలి మందగించడం, వికారం, మలబద్ధకం వంటి వన్నీ రక్తహీనత లక్షణాలే. 

కడుపు మంటే.. పేగుపూత

మనకు చాలా కోపం వచ్చినప్పుడు తెలియన ఆందోళన, అసంతృప్తికి గురవుతాం. కొంతమందికి కోపం వస్తే వాళ్లేం చేస్తున్నారో కూడా వారికే తెలియదు. అనవసర ఆందోళన, అసంతృప్తి కోపంతో పాటు కడుపు మంటకు కూడా కారణమౌతాయి. కడుపుమంట దీర్ఘకాలం ఉంటే అది పుళ్లుగా ఏర్పడి.. పేగుపూతకు దారితీస్తుంది. నాలికపూస్తే ఎర్రగా అయి మంట పెట్టినట్లే.. పేగుల్లో యాసిడ్ ఎక్కువైతే ఎర్రగా మారి పొక్కిపోతాయి.
             పేగుపూత ఉన్నవారికి పొట్ట మీద చెయ్యి వేస్తే నొప్పిగా ఉంటుంది. కడపు లోపల్నుంచి విపరీతమైన నొప్పి ఉంటుంది. కొంతమందికి ఆహారం తీసుకుంటే నొప్పి పెరుగుతుంది.  భోజనం చేయగానే అనీజీగా ఉంటుంది. వికారం వాంతి వస్తున్నట్లు ఉంటుంది. భోజనం కాస్త ఆలస్యమైతే కడుపులో ఏదో అవుతున్నట్లుగా ఉంటుంది. కొంచెం తినగానే కడపు నిండటం, మళ్లీ వెంటనే ఆకలి వేయడం పేగుపూత లక్షణాలు. పేగుపూత లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించడం ఉత్తమం.

బయటి తిళ్లతో జాగ్రత్త..!

బయటకు వెళ్లినప్పుడు, ప్రయాణాల్లో టైం పాస్ కోసం బయటి తిళ్లు తినడం మనలో చాలా మందికి ఉండే అలవాటు. అయితే మనం తీసుకునే ఆహారపదార్ధాలు శుభ్రంగా ఉన్నాయో.. లేదో చూసుకోకపోతే అవి గ్యాస్ట్రైటిస్ కు దారితీస్తాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. 
1. సాధారణంగా రైలు, బస్సు ప్రయాణాల సమయంలో బయటి ఆహారపానీయాలు తీసుకుంటాం. వీటిలో చాలావరకు అపరిశుభ్రమైన వాతావరణంలో తయారుచేయబడతాయి. 
2. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు వెళ్లినప్పుడు విందు భోజనంలో కూడా ఆహారం, పానీయాలు తినడం, తాగడం తప్పనిసరి. ఇక్కడ ఆహారం కూడా ఎంతో కొంత కలుషితం అయ్యే అవకాశం ఉంటుంది. 
3. హోటళ్లలో, హాస్టళ్లలో, మిర్చిబళ్ల దగ్గర తినే ఆహారం ఎక్కువశాతం కలుషితమై ఉంటుంది. ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల కూడా గ్యాస్ట్రైటిస్ రావచ్చు. 
4. ఇంట్లో తాగే నీరు కూడా పంచాయతీ, మున్సిపాలిటీ సప్లై చేసే నీళ్లు ఎంతవరకు శుభ్రంగా ఉంటుందో చెప్పడం కష్టమే. కలుషిత నీరు తాగినా గ్యాస్ట్రైటిస్ వచ్చే ఛాన్సుంది.  
5. గోళ్లల్లో ఉండే మట్టి కూడా తినే ఆహారం ద్వారా పేగుల్లోకి చేరి రోగాలకు దారితీస్తుంది.

వామ్మో కడుపునొప్పి..!

కడుపునొప్పి రాని మనిషంటూ ఉండడు. ఆమాటకొస్తే కడుపులోకి ఆహారం తీసుకునే సమస్త జంతువులు కడుపునొప్పికి మినహాయింపు కాదు. పేగుల లోపల అలజడి కలిగినప్పుడు కడుపు తరుక్కుపోయినట్లు అనిపిస్తుంది. పేగుకు సంబంధించిన వ్యాధులతో పాటు లివర్ మరియి స్ప్లీన్ వ్యాధులు, పాంక్రియాజ్, మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులు , గుండెకు సంబంధించిన వ్యాధులు కూడా పేగుల్లో అలజడికి కారణమౌతాయి.
      తరచూ ఆకలి మందగించడం, వాంతి, వికారం, కడుపులో బరువుగా ఉండటం, కడుపు నొప్పిగా ఉండం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తుంటే.. గ్యాస్ట్రయిటిస్ ఉందేమో పరీక్ష చేయించుకోవడం ఉత్తమం. వాంతి అయినప్పుడు కొద్దిగా నెత్తుటి జీర కనిపించినా, నెత్తురు పడినా అది తప్పకుండా గ్యాస్ట్రయిటిస్ అయ్యే అవకాశం ఉంటుంది. పొట్టలోపల సూక్ష్మజీవుల వల్ల కలిగే ఇన్ఫెక్షన్ ఈ గ్యాస్ట్రయిటిస్ రావడానికి ప్రధాన కారణం. 

ఆరోగ్యమే మహాభాగ్యం

ప్రస్తుత ప్రపంచంలో అందరికంటే ధనవంతులు ఎక్కువగా డబ్బు సంపాదించేవారు కాదు.. అందరికంటే ఆరోగ్యంగా ఉన్నవారే. కాలుష్యం పెరిగిపోతున్న నేటిరోజుల్లో.. జీవనశైలిలో కూడా విపరీతమైన మార్పులు వస్తున్నాయి. వేగవంతమైన జీవనశైలితో ఆహారపు అలవాట్లు, నిద్ర సమయంలో కూడా తేడాలు ఉంటున్నాయి. ఈ తేడాలు ఓ పరిమితి దాటనంత వరకు ఓకే. కానీ ఏమాత్రం పరిమితి దాటినా మన అలవాట్లే రోగాలకు ఆహ్వానం పలికినట్లవుతుంది.
        ఎలాంటి జీవనశైలి ఉన్నవారికి అయినా సరిపోయే విధంగా ఆహారపు అలవాట్లను మార్చుకోవచ్చు. కానీ అవి తప్పకుండా ఆరోగ్యకరమైన అలవాట్లయి ఉండాలి. మన జీవనశైలిలో చిన్నచిన్న మార్పులు చేసుకోవడం ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఈ విషయంలో మనం డాక్టర్ల సలహాలు తప్పక పాటించాలి. ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ వహించినా.. తర్వాతి కాలంలో అదే పెద్ద జబ్బులకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి మన ఆరోగ్య పరిరక్షణ మన ఆహారపు అలవాట్లలోనే ఉందన్న సంగతి గుర్తుంచుకోవాల్సిన అసరం ఉంది.