...

SPECIALIZED SITE FOR HUMAN HEALTH CARE,
SPECIALLY ON GASTROENTEROLOGY, LIVER AND PANCREAS

అదే ప‌నిగా బ‌రువు త‌గ్గుతుంటే కాస్త స‌రి చూసుకోండి..!

బ‌రువు త‌గ్గ‌టం, పెర‌గ‌టం ఒక్కోసారి స‌హ‌జ సిద్దంగా జ‌రుగుతుంటాయి. బ‌రువు త‌గ్గితే సాధార‌ణ విష‌య‌మే అనుకోవ‌చ్చు. కానీ దీంతో పాటు ఇత‌ర స‌మ‌స్య‌లు ఉంటే మాత్రం కాస్త ఆలోచించాల్సిందే. ఆక‌లి త‌గ్గుతుండ‌టం, చిరాకు వంటి ల‌క్ష‌ణాలు ఉంటే గ‌మ‌నించుకోవాలి.

ట్యుబ‌ర్ క్యులోసిస్‌, క‌ణితులు పెర‌గ‌టం వంటి కారణాల‌తో కూడా ఒక్కోసారి బ‌రువు త‌గ్గుతుంటారు. మాన‌సిక వ్య‌ధ వెంటాడుతున్నప్పుడు కూడా బ‌రువు త‌గ్గుతుంటారు. అందుచేత బ‌రువు త‌గ్గ‌టాన్ని అత్యంత స‌ర్వ సాధార‌ణ ల‌క్ష‌ణంగా మాత్రం భావించ‌కూడ‌దు. బ‌రువు త‌గ్గటం అన్న‌ది ఇత‌ర ల‌క్ష‌ణాల‌తో కూడి ఉన్న‌ప్పుడు ఎల‌ర్ట్ కావ‌టం మంచిది. వైద్య స‌ల‌హా తీసుకోవ‌టం ఉత్త‌మం. అదే ప‌నిగా నిర్ల‌క్ష్యం చేయ‌టం మంచిది కాదు. చాలా సార్లు అనారోగ్య సంబంధ‌మైన ల‌క్ష‌ణాలు ప్రారంభంలో క‌నిపించిన‌ప్పుడే అల‌ర్ట్ కావ‌టం మంచిది. లేదంటే ఈ ప‌రిస్థితి అన‌ర్థాల‌కు దారి తీస్తుంది.
ఆహారం తీసుకొనేట‌ప్పుడు ఈ సంగ‌తి గుర్తించుకోండి..!
ఆహారం అంద‌రికీ అవ‌స‌రం. స‌క‌ల జీవ‌కోటి ఆహారం తీసుకొనే బతుకుతుంది. మ‌నం తినే ఆహారం చ‌క్క‌గా ఉంటే మ‌న ఆరోగ్యం కూడా చ‌క్క‌గా నిలుస్తుంది. అందుచేత ఆహారం విష‌యంలో కాస్త జాగ్ర‌త్త అవ‌స‌రం.

ఎక్కువ‌గా వేపుళ్లు, నూనెలో అదే ప‌నిగా వేయించిన ఆహారం, ముఖ్యంగా రెడ్ మీట్,  స‌ముద్ర‌పు చేప‌లు, పీత‌లు వంటివి బాగా వేయించుకొని తినే అల‌వాటు కొంత‌మందిలో ఉంటుంది. అప్పుడ‌ప్పుడు అయితే ప‌ర్వాలేదు కానీ క్ర‌మం త‌ప్ప‌కుండా ఇదే ఆహారం తీసుకొంటుంటే మాత్రం మంచిది కాద‌ని చెప్పాలి. ఇటువంటి ఆహారం నుంచి విష ప‌దార్థాలు విడుద‌ల అవుతాయి. ఇవి శ‌రీరంలో పోగు ప‌డిన‌ట్ల‌యితే క‌ణితి మాదిరి త‌యారు అవుతాయి. ఒక వేళ ఆల్క‌హాల్ తీసుకొనే అల‌వాటు ఉంటే ఈ ప్ర‌మాదం మ‌రింత ఎక్కువ అవుతుంది. కొన్ని సార్లు ఇది క్యాన్స‌ర్ కు దారి తీయ‌వ‌చ్చు. అందుచేత ఆహార‌పు అల‌వాట్లలో ఈ జాగ్ర‌త్త పాటించాలి సుమా..!

ర‌క్తం చిందితే ఆందోళ‌న చెందాల్సిందేనా..!

ర‌క్తం అంటే ఎవ‌రికైనా భ‌యం క‌లుగుతుంది. ముఖ్యంగా వాంతి అయిన‌ప్పుడు అందులో ర‌క్తం క‌నిపిస్తే గ‌బుక్కున భ‌యం వేస్తుంది. జీర్ణ వ్య‌వ‌స్థ లోని ఎగువ భాగాలైన ఆహార వాహిక‌, జీర్ణాశ‌యం, పేగుల్లో ఏర్ప‌డే స‌మ‌స్య‌ల కార‌ణంగా ఈ ర‌క్తం ప‌డే అవ‌కాశం ఉంది. కొన్ని సార్లు ఊపిరితిత్తుల్లో ఇన్ ఫెక్ష‌న్ ఉన్నా కూడా ర‌క్తం ప‌డుతుంది.

జీర్ణ వ్య‌వ‌స్థ లో స‌మ‌స్య కార‌ణంగా ర‌క్తపు వాంతులు కావ‌టానికి అనేక కార‌ణాలు క‌నిపిస్తాయి. విప‌రీత‌మైన క‌డుపు నొప్పి ఉండి త‌ర్వాత వాంతులు అయితే అల్స‌ర్ గా భావించాలి. అదే వాంతిలో ర‌క్తం, ఆహారం క‌లిసి ప‌డుతుంటే క్యాన్స‌ర్ గా అనుమానించాలి. కాలేయం పాడైతే మాత్రం ర‌క్త‌పు వాంతుల‌తో పాటు కామెర్లు కూడా ఉండ‌వ‌చ్చు. ర‌క్తపు వాంతులు అయినంత మాత్రాన కంగారు ప‌డాల్సిన ప‌ని లేదు. ముఖ్యంగా రోగికి ఈ విష‌యంలో ధైర్యం చెప్పాలి. ఆధునిక వైద్య శాస్త్రంలో చ‌క్క‌ని వ్యాధి నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు, చికిత్స‌లు దొరుకుతున్నాయి. ఈ స‌మ‌స్య‌కు కూడా వ్యాధి నిర్ధార‌ణ ద్వారా చికిత్స‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. మందుల‌తో త‌గ్గితే స‌రే లేదంటే ఎండోస్కోపీ విధానంలో ఆప‌రేష‌న్ కూడా చేయాల్సి రావ‌చ్చు. నిపుణులైన వైద్యుల్ని సంప్ర‌దిస్తే మెరుగైన చికిత్స తీసుకోవ‌చ్చు.

శ‌రీరంలో ఒక భాగం తీసేసినా ఫ‌ర్వాలేదు..!

శరీరంలోని భాగాలన్నింటికీ నిర్దిష్ట‌మైన విధి, నిర్దిష్ట‌మైన స‌మ‌న్వయం ఉంటుంది. ఒక భాగం నుంచి వేరొక భాగానికి స‌మ‌న్వ‌యం ఉంటుంది. ఇదే క్ర‌మంలో కాలేయం నుంచి విడుద‌ల అయ్యే పైత్య ర‌సాన్ని తాత్కాలికంగా నిల్వ చేసేందుకు గాల్ బ్లాడ‌ర్ అనే చిన్న సంచీ వంటి భాగం ఉంటుంది. పైత్య ర‌సం ఇందులో తాత్కాలికంగా నిల్వ ఉండి, అవ‌స‌రం అయిన‌ప్పుడు పేగు లోకి స్రావితం అవుతుంది. అయితే స‌రైన ఆహార‌పు అలవాట్లు లేక‌పోయినా, ఆల్క‌హాల్ అల‌వాటు ఉన్నా..ఈ గాల్ బ్లాడ‌ర్ లోకి రాళ్లు చేర‌తాయి. దీని కార‌ణంగా తీవ్రమైన క‌డుపు నొప్పి వ‌స్తుంటుంది.

ఈ నొప్పి తో బాధ‌పడుతుండే వారికి డ‌యాగ్న‌సిస్ టెస్టు ల ద్వారా స‌మ‌స్య‌ను నిర్ధార‌ణ చేస్తారు. అటువంట‌ప్పుడు మందుల‌తో లేదా అవ‌స‌రాన్ని బ‌ట్టి ఆప‌రేష‌న్ ద్వారా ఈ రాళ్ల‌ను తొల‌గించాల్సి ఉంటుంది. ఒక్కో సారి రాళ్లు ఎక్కువ‌గా ఉంటే మాత్రం మొత్తం గాల్ బ్లాడ‌ర్ ను తొల‌గించాల్సి ఉంటుంది. అయితే ఈ గాల్ బ్లాడ‌ర్ తొల‌గించినంత మాత్రాన కంగారు ప‌డాల్సిందేమీ లేదు. ఎందుకంటే పైత్య ర‌సం విడుద‌ల‌లో కానీ, స‌ర‌ఫ‌రాలో కానీ పెద్ద‌గా ఇబ్బంది ఏర్ప‌డ‌దు. త్వ‌ర‌గానే శ‌రీరంలో ఈ స‌ర్దుబాటును ఇమిడ్చుకొంటుంది. అందుచేత నిపుణులైన స‌ర్జ‌న్ గాల్ బ్లాడ‌ర్ తొల‌గించినా కానీ కంగారు ప‌డాల్సిన అవ‌స‌రం లేదు.