...

SPECIALIZED SITE FOR HUMAN HEALTH CARE,
SPECIALLY ON GASTROENTEROLOGY, LIVER AND PANCREAS

విభ‌జ‌న స‌మ‌యంలోముంద‌స్తు జాగ్ర‌త్త‌

ఏ ప‌నయినా ఒకేలా చేయ‌టానికి అల‌వాటు ప‌డి ఉంటాం. ఆహారం తీసుకొనే ట‌ప్పుడు కూడా చిన్న‌ప్ప‌టి నుంచి ఉన్న అల‌వాటునే అనుస‌రిస్తాం త‌ప్ప కొత్త‌గా ఆలోచించం.
రెండు   సార్లు ఆహారం తీసుకోవ‌టం మ‌న‌లో చాలా మందికి అల‌వాటు. ఇది స‌రైన‌దే అని అనిపిస్తుంది. ప‌నుల హ‌డావుడిలోనో, వేరే కార‌ణం తోనో ఉద‌యం పూట బ్రేక్ ఫాస్ట్ ను దూరం పెట్టేస్తుంటారు. దీంతో మ‌ధ్యాహ్నానికి ఆక‌లి పెరిగి ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకొంటారు.

ఆ త‌ర్వాత భుక్తాయసంతో వెంట‌నే విశ్రాంతి కి  ప్ర‌య‌త్నిస్తారు. రాత్రి కూడా అదే చేస్తుంటారు. సాయంత్రం ఏమీ తీసుకోకుండా ఖాళీగా ఉండి రాత్రి పూట మాత్రం ఎక్కువ‌గా లాగించేస్తారు. ఆ త‌ర్వాత వెంట‌నే నిద్ర‌కు ఉప‌క్ర‌మిస్తారు.దీంతో శ‌రీరంలో కొవ్వులు పేరుకొని పోతాయి.
ఆహారం తీసుకొనేట‌ప్పుడు విభ‌జ‌న చాలా ముఖ్యం. ఉద‌యాన్నే బ్రేక్ ఫాస్టు చేయ‌టం, త‌ర్వాత రోజూ ఒకే స‌మ‌యానికి లంచ్ తీసుకోవ‌టం మ‌రింత ముఖ్యం. సాయంత్రం స‌మ‌యంలో కొద్ది పాటి స్నాక్స్ తీసుకోవ‌టం ద్వారా నీర‌సం రాకుండా చేయ‌వ‌చ్చు. అప్పుడు సాయంత్రం తేలిక‌పాటి ఆహారాన్ని తీసుకొనేందుకు వీల‌వుతుంది. ఈ ర‌కంగా ఆహారాన్ని విభ‌జించి విడ‌త‌ల వారీగా తీసుకోవ‌టం మంచిది.

ఇప్పుడు స‌డెన్ గా వ‌చ్చి ప‌డిన‌ స‌మ‌స్య ఏమిటి..!

ఇటీవ‌ల కాలంలో కొన్ని రకాల ఆరోగ్య స‌మ‌స్య‌లు పెరుగుతున్నాయి. ప్ర‌ధానంగా పాన్ క్రియాస్ గ్రంథిలో వాపు రావ‌టం, రాళ్లు ఏర్ప‌డ‌టం వంటి స‌మ‌స్య‌ల్ని చెప్ప‌వ‌చ్చు.
వాస్త‌వానికి పాన్ క్రియాస్ అంటే  జీర్ణ వ్య‌వ‌స్థ లో ప్ర‌ధాన అనుబంధ అవ‌యవం. ఆహారాన్ని జీర్ణం చేయటానికి అవ‌స‌ర‌మైన ఎంజైమ్ ల‌తో పాటు, గ్లూకోజ్ ను క్ర‌మ‌బ‌ద్దం చేసే హార్మోన్‌లను పాన్ క్రియాస్ స్ర‌విస్తుంది.  పాన్ క్రియాస్ లో ఏర్ప‌డే ప్ర‌ధాన స‌మ‌స్యల్లో  రాళ్లు ఏర్ప‌డ‌టం ముఖ్య‌మైన‌ది. అవాంఛిత ప‌దార్థాలు పేరుకొని పోయి రాళ్లుగా ఏర్ప‌డుతాయి. దీన్ని క్రానిక్ పాన్ క్రియాటైటిస్ అంటారు.

 ఇందులో గ్రంథి కుచించుకు పోవ‌టంతో పాటు పని తీరు దెబ్బ తినే అవ‌కాశం ఉంది. మ‌ద్య‌పానం తో పాటు ఇత‌ర కార‌ణాల‌తో కానీ ఈ స్థితి త‌లెత్త‌వ‌చ్చు. క‌డుపు పై భాగంలో తీవ్ర‌మైన నొప్పి ప్ర‌ధాన ల‌క్ష‌ణం. ఈ క‌డుపు నొప్పి వెన్నుపూస‌లోకి చొచ్చుకొని పోతున్న‌ట్లు ఉంటుంది. దీంతోపాటు  వాంతులు, విరోచ‌నంలో చ‌మురు క‌నిపిస్తుంటుంది. కొన్ని సంద‌ర్భాల్లో ర‌క్త‌పు వాంతులు, ప‌సిరిక‌లు ఏర్ప‌డుతాయి.
ఈ ల‌క్ష‌ణాల్ని గుర్తిస్తే వైద్యుల్ని సంప్ర‌దించాలి. స‌రైన రోగ నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేయిస్తే ముందుగానే చికిత్స అందించేందుకు వీల‌వుతుంది. మెడిక‌ల్‌, స‌ర్జిక‌ల్ విధానాల్లో దీనికి చికిత్స అందించేందుకు వీల‌వుతుంది.
పాన్ క్రియాస్ లో స‌మ‌స్య‌లు త‌లెత్త‌కుండా క్ర‌మ‌బ‌ద్ద‌మైన జీవ‌న శైలిని అనుస‌రించాలి.మ‌ద్య‌పానానికి దూరంగా ఉండ‌టం మేలు. ఏ మాత్రం అనుమానం క‌లిగినా వైద్యుల్ని సంప్ర‌దించి చికిత్స చేయించుకోవాలి.

క్యాన్స‌ర్ - అవ‌గాహ‌న‌

ప్ర‌తీ ఏటా ఫిబ్ర‌వ‌రి 4 న ప్ర‌పంచ క్యాన్స‌ర్ రోజు గా జ‌రుపుకొంటారు. ఈ సంద‌ర్భంగా క‌డుపు క్యాన్స‌ర్ కు సంబంధించిన కొన్ని విష‌యాలు తెలుసుకొందాం..
జీర్ణ వ్య‌వ‌స్థ లోని ప్ర‌ధాన భాగాల్లో క‌డుపు ఒక‌టి. ఇక్క‌డ ఆహారం మెత్త‌టి గుజ్జుగా మారి జీర్ణ ప్ర‌క్రియ ఊపందుకొంటుంది. ఇక్క‌డ క్యాన్స‌ర్ ఏర్ప‌డితే దాన్ని జీర్ణ కోశ క్యాన్స‌ర్ ( స్ట‌మ‌క్ క్యాన్స‌ర్ లేక గ్యాస్ట్రిక్ క్యాన్స‌ర్‌) అని పిలుస్తారు. ఇత‌ర భాగాలైన ఆహార వాహిక‌, పేగు, రెక్ట‌మ్‌, కాలేయం, క్లోమం ల‌లో కూడా క్యాన్స‌ర్ ఏర్ప‌డ‌వ‌చ్చు.
క‌డుపు క్యాన్స‌ర్ కు అనేక కార‌ణాలు క‌నిపిస్తున్నాయి. అతి వేడి ఆహారం తిన‌టం, ఉప్పు అధికంగా ఉండే స‌ముద్రపు ఆహారం తిన‌టం, వేపుళ్లు తో కూడిన మాంసాహారం తిన‌టం వంటి వాటి వ‌ల్ల ఈ క్యాన్స‌ర్  త‌లెత్తుతుంటుంది. పొగ తాగ‌టం, మ‌ద్య‌పానం వంటి అల‌వాట్లు ఉంటే ఈ వ్యాధి వ‌చ్చేచాన్సులు ఎక్కువ‌.  హెలికో బ్యాక్ట‌ర్ పైలోరి వంటి సూక్ష్మ క్రిముల ఇన్ ఫెక్ష‌న్ తో క‌డుపు చెడి క్యాన్స‌ర్ కు దారి తీయ‌వ‌చ్చు.

కుటుంబంలో ఇత‌రుల‌కు చిన్న వ‌య‌స్సులోనే క్యాన్స‌ర్ ఉన్న‌ప్పుడు కుటుంబ స‌భ్యుల‌కు వ‌చ్చేచాన్సు ఉంటుంది. పొగ తాగ‌టం, మ‌ద్య‌పానం వంటి దుర‌ల వాట్లు ఉంటే క్యాన్స‌ర్ కు దారి తీయ‌వ‌చ్చు. స్త్రీల‌తో పోలిస్తే పురుషుల‌కు ఎక్కువ అవ‌కాశం .  ఆధునిక జీవ‌న శైలితో జంక్ ఫుడ్ ఎక్కువ‌గా తింటూ వ్యాయామానికి దూరంగా ఉంటే జీర్ణ కోశ స‌మ‌స్య‌లు తలెత్తి క్యాన్స‌ర్ కు దారి తీయ‌వ‌చ్చు.
ఆహారం మింగ‌టంలో ఇబ్బంది, ఏమీ తిన‌కుండానే క‌డుపు నిండుగా ఉండ‌టం,  కొద్ది పాటి ఆహారం తిన్నా కానీ నొప్పి,  అజీర్తిగా ఉండ‌టం గ‌మ‌నించ‌వ‌చ్చు. క‌డుపులో ఎగువ భాగం, మ‌ధ్య భాగం మ‌ధ్య‌లో గ‌డ‌బిడ‌గా ఉండి అప్పుడప్పుడు నొప్పి వ‌స్తుంటుంది. మ‌లంలో ర‌క్తం ప‌డుతుంటుంది. ఇది న‌ల్ల‌గా కానీ, ఎర్ర‌గా కానీ ఉండ‌వ‌చ్చు.  చేతితో త‌డిమి చూసిన‌ప్పుడు క‌ణితులు త‌గ‌ల‌వ‌చ్చు. నీర‌సం, నిస్త్రాణ పెరిగిపోతాయి ఈ ల‌క్ష‌ణాల‌తో పాటు కొన్నిసార్లు కామెర్లు, కాలేయ‌వాహిక ఇన్ ఫెక్ష‌న్ వంటివి కలిసి క‌నిపిస్తుంటాయి.
జీర్ణ వ్య‌వ‌స్థ లో స‌మ‌స్య ఏర్ప‌డిన‌ప్పుడు ఎండో స్కోపీ ప‌రీక్ష ద్వారా నిర్ధార‌ణ చేస్తుంటారు. ఎక్సురే, ర‌క్త ప‌రీక్ష, బ‌యాప్సీ అవ‌స‌రం అవుతుంటుంది. అల్ట్రా సౌండ్ స్కానింగ్‌, సీటీ స్కాన్ ల ద్వారా క్యాన్స‌ర్ ఏ ద‌శ‌లో ఉన్న‌దీ తెలుసుకొనేందుకు వీల‌వుతుంది.
తొలి ద‌శ‌లో చికిత్స‌కు ఎండో స్కోపీ విధానాల్నిఅవ‌లంబిస్తారు. దీని ద్వారా క‌ణితిని తొల‌గించి చికిత్స చేసేందుకు వీల‌వుతుంది. వ్యాధి ముదిరితే ర్యాడిక‌ల్ ఆప‌రేష‌న్ చేయించాల్సి ఉంటుంది. త‌ర్వాత ద‌శ‌లో  కీమో థెర‌పీ, రేడియో థెర‌పీ అవ‌స‌రం అవుతుంటాయి.
స‌రైన జీవ‌న శైలిని పాటించ‌టం, పోష‌కాహారం తీసుకొంటూ వ్యాయామం చేస్తుండ‌టం మంచిది. దుర‌ల వాట్ల‌కు దూరంగా ఉంటే క్యాన్స‌ర్ కు దూరంగా ఉండ‌వ‌చ్చు. 

ఇంత జ‌రుగుతున్నా చిన్న జాగ్ర‌త్త తీసుకోలేరా..!

జాగ్ర‌త్త అనేది చిన్న ప‌ద‌మే కావ‌చ్చు కానీ జాగ్ర‌త్త‌లు పాటిస్తే జీవితంలో స‌మ‌స్య‌ల‌కు దూరంగా ఉండ‌వ‌చ్చు.
ఆరోగ్య సంబంధిత అంశాల్లో టీకాలు అనేవి ముందు జాగ్ర‌త్త‌కు నిద‌ర్శ‌నాలు. టీకాలు వేయించ‌టం విష‌యంలో చాలా మంది నిర్ల‌క్ష్యం వ‌హిస్తుంటారు. ఇది చాలా త‌ప్పు. క్ర‌మం త‌ప్పకుండా షెడ్యూల్ ప్ర‌కారం టీకాలు వేయించాలి. ముఖ్యంగా గ‌ర్భ‌వ‌తులు కొన్ని టీకాలు తీసుకోవ‌చ్చు. కొన్ని టీకాలు తీసుకోకూడ‌దు. అందుచేత గైన‌కాల‌జిస్టు ప‌ర్య‌వేక్ష‌ణ‌లో సంబంధిత టీకాలు వేయించుకోవాలి. బిడ్డ పుట్టిన త‌ర్వాత పెరిగి పెద్దయ్యే వ‌ర‌కు షెడ్యూల్ ప్ర‌కారం టీకాలు వేయించాలి. దీంతో ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉంటారు.

టీకాలు వేయించిన‌ప్పుడు సంబంధిత రోగాల‌కు సంబంధించిన అవ‌శేషాల్ని శ‌రీరంలో ప్ర‌వేశ‌పెట్ట‌డం జ‌రుగుతుంది. అప్పుడు దీనికి ప్ర‌తి క్రియ‌గా శ‌రీరం వ్యాధి నిరోధ‌క శ‌క్తిని స‌మ‌కూర్చుకోగ‌లుగుతుంది. అప్పుడు శ‌రీరం లో ఈ వ్యాధి నిరోధ‌క శ‌క్తి ఉత్తేజిత‌మై నిజ‌మైన వ్యాధుల‌కు సంబంధించిన క్రిములు ప్ర‌వేశించిన‌ప్పుడు ధీటుగా జ‌వాబివ్వ‌గ‌లుగుతుంది. ఫ‌లితంగా శ‌రీరానికి వ్యాధులు త‌ట్టుకోగ‌లిగే శ‌క్తి స‌మ‌కూరుతుంది. అందుచేత త‌ల్లిదండ్రులు బిజీ షెడ్యూల్ లో ప‌డిపోయినా పిల్ల‌ల ఆరోగ్యాన్ని మ‌రిచిపోవ‌ద్దు. పిల్ల‌ల‌కు ఇప్పించాల్సిన టీకాల్ని స‌రైన స‌మ‌యంలో ఇప్పించాలి.