ప్రత్యేక ప్రతిపత్తి కల్పించాలంటే
కచ్చితంగా ఆ ప్రత్యేకత ఏమిటో తెలుసుకోవాలి. అప్పుడే దాని మీద అభిప్రాయం
వెలిబుచ్చటానికి వీలవుతుంది.
శరీరంలో పాన్ క్రియాస్
(తెలుగులో క్లోమం అంటారు) గ్రంథికి ఈ విధమైన ప్రాధాన్యం ఉంది. శరీరంలో కొన్ని
గ్రంథులు జీర్ణ క్రియకు అవసరమైన ఎంజైమ్ లను స్రవిస్తాయి. వీటిని నాళ గ్రంథులు
అంటారు. అంటే ఈ గ్రంథికి ఉండే నాళం ద్వారా ఆయా ఎంజైమ్ లు విడుదల అవుతాయి. జీర్ణ
క్రియ లో పాల్గొంటాయి. మరికొన్ని గ్రంథులు కేవలం హార్మోన్ లను స్రవిస్తాయి. ఇవి
వినాళ గ్రంథులు. అంటే ఎటువంటి నాళాన్ని కలిగి ఉండవు. వీటి నుంచి ఉత్పత్తి అయ్యే
హార్మోన్ లు నేరుగా రక్తంలో కలిసిపోయి ఆయా భాగాలకు చేరుకొంటాయి. అయితే పాన్ క్రియాస్
మాత్రం అటు నాళ గ్రంథిగా, ఇటు వినాళ గ్రంథిగా పనిచేస్తుంది. జీర్ణాశయంలో
ఎగువ భాగంలో దీన్ని గమనించవచ్చు. పాన్ క్రియాస్ లో ముఖ్యంగా రెండు విభాగాలు
ఉంటాయి. మొదటి విభాగం ఎంజైమ్ లను ఉత్పత్తి చేసి చిన్న పేగు లో ఆహారాన్నిజీర్ణం
చేయటానికి పని చేస్తుంది. దీన్ని ఎక్సో క్రైన్ ప్యాన్ క్రియాస్ అంటారు. ఇందులో
ముఖ్యమైన ఎంజైమ్ లు అమైలేజ్- పిండి పదార్థాల్ని, లైపేజ్-కొవ్వు
పదార్థాల్ని, ట్రిప్సిన్- మాంసకృత్తుల్ని జీర్ణం
చేస్తాయి. ఒక మాటలో చెప్పాలంటే ఆహారంలోని అన్ని ప్రధాన పదార్థాల్ని పాన్
క్రియాటిక్ జ్యూసెస్ జీర్ణం చేస్తాయి. ఇది కాకుండా పాన్ క్రియాస్ లోని రెండో
విభాగాన్ని ఎండో క్రైన్ పాన్ క్రియాస్ అంటారు. ఈ విభాగం అనేక రకాల హార్మోన్ లను
ఉత్పత్తి చేయటం ద్వారా శరీరంలోని గ్లూకోజ్ స్థాయిని నియంత్రిస్తుంది. ఈ
విభాగంలోని ఇబ్బందులే డయాబెటిస్ (మధుమేహం)కు దారి తీయవచ్చు.
అందుచేత పాన్
క్రియాస్ కు ప్రత్యేక ప్రతిపత్తి ఉంటుందని అర్థం చేసుకోవాలి. ఈ విధమైన ప్రత్యేకత
ఏ ఇతర భాగానికి లేదని గుర్తెరగాలి.