శరీరానికి శక్తి అందాలంటే ఆహారం తప్పనిసరి. అయితే ఆహారంలో అన్ని రకాల పదార్థాలు తప్పనిసరిగా ఉండాలి. కానీ దక్షిణ భారత దేశంలోని సాంప్రదాయిక కుటుంబాల్లో ఉదయం ఇడ్లీ, దోశ మధ్యాహ్నం అన్నం, సాయంత్రం కూడా అన్నం లేదా ఇడ్లీ లతో గడిపేస్తుంటారు. దీంతో చాలా మందిలో ప్రోటీన్ల లోపం ఉన్నట్లు చెబుతున్నారు.
శరీరానికి పిండి పదార్థాలు ఎంత అవసరమో, ప్రోటీన్లు కూడా అంతే అవసరం. శరీరంలో కండరాల పటిష్టతకు, అవయవ భాగాల పటిష్టతకు ప్రోటీన్లు అవసరం అవుతాయి. శరీర బరువుకు తగినట్లుగా ప్రోటీన్లు తీసుకోవటం చాలా అవసరం. కానీ మనలో చాలా మంది ఈ అంశాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. దీంతో కొవ్వులు పేరుకొని పోయి ఊబకాయం రావటం, శరీర భాగాలు పటిష్టంగా లేకపోవటం సంభవిస్తుంటుంది. ఒక లెక్క ప్రకారం శరీరం ఎంత బరువు అంటే అన్ని గ్రాముల ప్రోటీన్లు ప్రతీ రోజు తీసుకోవాలని చెబుతారు. అంటే ఒక వ్యక్తి 60 కిలోల బరువు ఉంటే 60 గ్రాముల ప్రోటీన్లు, లేదంటే కనీసం 50 గ్రాముల ప్రోటీన్లు అయినా తీసుకోవాలి.
మనం తీసుకొనే ఆహారంలో కోడి గుడ్డు లో అత్యధికంగా ప్రోటీన్లు లభిస్తాయి. అందుకే ఎదిగే పిల్లలకు తప్పనిసరిగా గుడ్డు ఇవ్వాలని చెబుతారు. పాలలో కూడా సమృద్ధిగా ప్రోటీన్లు లభిస్తాయి. మాంసం, చేపల్లో చిక్కటి ప్రోటీన్లు ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకొంటే ప్రోటీన్లు పుష్కలంగా దొరకుతాయి. శాకాహారులైతే సోయా, చిక్కుళ్లు, బీన్స్ వంటి పీచు పదార్థాలు ఉండే కూరగాయల్ని అధికంగా తీసుకోవాలి. ప్రతీ రోజు కాకపోయినా వారం లో వీటి సంఖ్య అధికంగా ఉండేట్లు చూసుకొంటే మంచిది.
No comments:
Post a Comment