...

SPECIALIZED SITE FOR HUMAN HEALTH CARE,
SPECIALLY ON GASTROENTEROLOGY, LIVER AND PANCREAS

హైద‌రాబాద్‌లో జాతీయ స్థాయి వైద్య విజ్ఞాన సంస్థ

గ‌తంతో పోలిస్తే ఆధునిక కాలంలో కాలేయ వ్యాధులు ఎక్కువ అవుతున్నాయ‌ని సీనియ‌ర్ గ్యాస్ట్రో ఎంట‌రాల‌జిస్టులు ఆందోళ‌న వ్యక్తం చేశారు. అల్సర్ లు, కామెర్లు, సిర్రోసిస్‌, క్యాన్సర్  వంటి వ్యాధులు పెరిగిపోతున్నాయ‌ని వివ‌రించారు. ఆధునిక జీవ‌న శైలితో ఏర్పడే ఒత్తిళ్లు, ఒడిదుడుకుల జీవితంతో పాటు మద్యపానం వంటి చెడు అల‌వాట్లు ఇందుకు కార‌ణం అవుతున్నాయని వివ‌రించారు. జీర్ణకోశ కాలేయ వ్యాధుల‌పై న‌గ‌ర వాసుల‌కు అవ‌గాహ‌న కార్యక్రమం ఏర్పాటైంది. హైద‌రాబాద్ దోమ‌ల్ గుడా లోని సాయివాణి  ఆస్పత్రి ప్రాంగ‌ణంలో జాతీయ స్థాయిలో నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్      గ్యాస్ట్రో ఎంట‌రాల‌జీ అండ్ లివ‌ర్ డిసీజెస్ సంస్థ ఏర్పాటైంది. ఈ సంద‌ర్భంగా ఏర్పాటైన అవ‌గాహ‌న కార్యక్రమంలో జీర్ణ కోశ మ‌రియు కాలేయ వ్యాధులు విజ్రంభిస్తున్న తీరు ని వైద్య నిపుణులు వివ‌రించారు. ఆధునిక జీవ‌న శైలిలో ఒత్తిళ్లు, నిర్ణీత స‌మ‌యానికి ఆహారం తీసుకోక‌పోవ‌టం , ఒకే చోట కూర్చొని ఎక్కువ సేపు ప‌నిచేయ‌టం, హైరానా ప‌డ‌టం ఎక్కువ‌గా జ‌ర‌గుతోంది. దీనికి తోడు పొగ తాగ‌టం, మ‌ద్యం తీసుకోవటం వంటి అల‌వాట్లు ఎక్కువ అవుతున్నాయి. ఈ కార‌ణాల‌తో జీర్ణ కోశ వ్యాధులు, కాలేయ వ్యాధులు ఎక్కువ‌గా విజృంభిస్తున్నాయి. శ‌రీరంలో అత్యంత ఎక్కువ విస్తీర్ణం ఆక్రమించే వ్య‌వ‌స్థ అయిన జీర్ణ వ్యవ‌స్థ కు స‌మ‌స్యలు ఏర్పడితే ఇత‌ర అవ‌య‌వ వ్యవ‌స్థ కూడా పాడ‌య్యే అవ‌కాశాలు ఉన్నాయి. ఇటువంటి రోగాల్ని ముందుగానే గమ‌నించి స‌మ‌ర్థులైన వైద్య నిపుణుల ద‌గ్గర చికిత్స చేయించుకొంటే స‌మ‌స్యల్ని నివారించ‌వ‌చ్చు. 
జాతీయ జీర్ణ కోశ మ‌రియు కాలేయ వ్యాధుల వైద్య విజ్ఞాన సంస్థ వివ‌రాల్ని సంస్థ డైర‌క్టర్ డాక్టర్ ఆర్‌. వి. రాఘ‌వేంద్ర రావు వివ‌రించారు. జీర్ణ కోశ వ్యాధుల్ని గుర్తించేందుకు అవ‌స‌ర‌మైన అత్యాధునిక డ‌యాగ్నస్టిక్ సౌక‌ర్యాలు ఉన్నాయ‌ని చెప్పారు. రోగుల‌కు మెరుగైన చికిత్స అందించేందుకు జాతీయ అంత‌ర్జాతీయ వైద్య సంస్థ ల్లో శిక్షణ పొందిన డాక్టర్ సేతుబాబు, డాక్టర్ డీవీ శ్రీ‌నివాస్‌, డాక్టర్ వాసిఫ్ అలీ, డాక్టర్ ప్రతాప్ రెడ్డి, డాక్టర్ ఆకాష్ చౌదురి అందుబాటులో ఉంటారు. జాతీయ స్థాయిలో పేరు గాంచిన ఈ వైద్య బృందం ఎప్పటిక‌ప్పుడు రోగుల్ని ప‌రీక్షిస్తూ మెరుగైన చికిత్స అందిస్తుంటుంది. 
జీర్ణ కోశ వ్యాధుల చికిత్స కు 24 గంట‌లూ వైద్య సేవ‌లు అందుబాటులో ఉంటాయ‌ని సంస్థ డైర‌క్టర్ డాక్టర్ డీవీ శ్రీ‌నివాస్ వెల్లడించారు. కాలేయ వ్యాధుల‌కు ప్రత్యేక యూనిట్ తో పాటు సుశిక్షితులైన సిబ్బంది తో కూడిన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఉంటుంద‌ని వివ‌రించారు. జీర్ణ కోశ వ్యాధులు, కాలేయ వ్యాధులకు అందుబాటు ధ‌ర‌ల్లో అత్యాధునిక చికిత్సను అందించ‌ట‌మే త‌మ ల‌క్ష్యమ‌ని ఆయ‌న చెప్పారు. 
జీర్ణ కోశ వ్యాధులు, కాలేయ వ్యాధుల‌కు జాతీయ స్థాయి వైద్య విజ్ఞాన సంస్థ ను అందుబాటులోకి తేవ‌టం వెనుక  వైద్య నిపుణులు కృషి ఉంది. ఈ కృషి ఫ‌లితంగా అత్యాధునిక అద్భుత వైద్య సేవ‌లు హైద‌రాబాద్‌లోని సాయివాణి సూప‌ర్ ష్పెషాలిటీ ఆస్పత్రి ప్రాంగ‌ణంలోకి అందుబాటులోకి వ‌చ్చాయి.

త‌ర‌చు మ‌న ఇంట్లో దొర్లే త‌ప్పులు..!

ఇంట్లో త‌ర‌చు కొన్ని త‌ప్పులు దొర్లుతుంటాయి. వీటిని గ‌మ‌నించుకొని దిద్దుకొంటే మంచిది. లేదంటే ఆ త‌ప్పుల‌కు మ‌న‌మే న‌ష్టపోవాల్సి ఉంటుంది.
ఉదాహ‌ర‌ణ‌కు ఇంట్లో వంట చేసేట‌ప్పుడు ఎంత‌మందికి అవ‌స‌ర‌మో లెక్క వేసుకొని సుమారుగా వంట చేస్తుంటారు. అటువంటప్పుడు ఒక్కోసారి ఆ వంట చేసిన ప‌దార్థాలు మిగిలిపోతుంటాయి. వీటిని ఏం చేయాల‌నేది స‌మ‌స్య గా మారుతుంది. ఒక్కోసారి అనుకోకుండా ఇంటి ద‌గ్గర ఆహారం ఉన్నప్పటికీ, బ‌య‌ట ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. అటువంటి సంద‌ర్భాల్లో ఈ చిక్కుల్ని మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. చాలా మంది దీన్ని ఫ్రిజ్ లో దాచి త‌ర్వాత తీసుకొంటారు.

 ఇటువంట‌ప్పుడు మ‌ళ్లీ ఉప‌యోగించేట‌ప్పుడు ఆ ఆహారం ఎలా ఉందో గ‌మ‌నించుకొని తీసుకోవాలి. క‌క్కుర్తి ప‌డి ఎలా ఉన్నా లాగించేస్తే ఇబ్బంది త‌ప్పదు. మ‌రి కొంద‌రు మాత్రం ఆహారం మిగిలిపోతోంద‌ని కాస్త ఎక్కువ తినేస్తుంటారు. దీంతో అజీర్ణ స‌మ‌స్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇంట్లో ఉండే మహిళ‌లు ఈ పొదుపు చ‌ర్యలు పాటిస్తుంటారు. మ‌హిళ‌ల్లో శ‌రీరం పెర‌గ‌టానికి ఇది కూడా ఒక కార‌ణంగా గుర్తించారు. అందుచేత ఆహారాన్ని వృధా చేయ‌కూడ‌ద‌నే వాస్తవాన్ని అంతా ఒప్పుకొంటారు. కానీ ఇటువంటి త‌ప్పుల‌తో ఇబ్బంది త‌ప్పద‌ని గుర్తించాలి.

చిన్న చిన్న జాగ్రత్తల‌తో పెద్ద పెద్ద స‌మ‌స్యల్ని త‌ప్పించుకోవ‌చ్చు..!

చిన్న పాటి జాగ్రత్తల‌తో పెద్ద స‌మ‌స్యల్ని తేలిగ్గా త‌ప్పించుకోవ‌చ్చు. అయ్యో ఇది చిన్న విష‌య‌మే క‌దా  అనిపించ‌వ‌చ్చు. కానీ దాని తీవ్రత ఎక్కువ‌గా ఉంటుంది.

ఉదాహ‌ర‌ణ‌కు కామ‌న్ ఏరియాలో ఉన్న డోర్ నాబ్ లు, డోర్ హేండిల్స్ ను అంద‌రూ వాడుతుంటారు. ముఖ్యంగా ఆఫీసులు, హోట‌ల్స్ లో ఉండే వాష్ రూమ్స్ ను అంతా వాడుకొంటారు. అటువంట‌ప్పుడు వారు టాయ్ లెట్స్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేట‌ప్పుడు చేతుల్ని స‌రిగ్గా శుభ్రం చేసుకొని ఉండ‌వ‌చ్చు. లేదా చేసుకోకుండా ఉండ‌వ‌చ్చు. అటువంటి వారు డోర్ నాబ్స్, డోర్ హేండిల్స్ తీసిన‌ప్పుడు ఆ చేతుల్ని ఉండే క్రిములు వాటికి అంటుకొంటాయి. వాటిని మ‌నం వాడుతున్నప్పుడు మ‌న చేతికి అవి అంటుకొంటాయి. అందుచేత చేతిని ఆ క్రిములు ఆశ్రయిస్తాయి. అందుచేత ఆహారం తీసుకొనేట‌ప్పుడు చేతుల్ని సక్రమంగా శుభ్రం చేసుకోక‌పోతే ఆ చేతుల‌తో క్రిములు క‌డుపులోకి ప్రవేశిస్తాయి. క‌డుపులో అవి చేసే దుష్ప్రభావం మొద‌లై పోతుంది. అందుచేత ఆహారం తీసుకొనేట‌ప్పుడు చేతుల్ని శుభ్రం చేసుకోవ‌టం మ‌రిచిపోకూడ‌దు.

ఈ రోజు ప్రత్యేక‌త మీకు తెలుసు క‌దా...!


క్యాలండ‌ర్ లో కొన్ని రోజుల‌కు ఒక్కో ప్రత్యేక‌త ఉంటుంది. ఆయా రోజుల్లో ఆయా ప్రత్యేక‌త‌ల‌ను గుర్తు చేసుకొనే వెసులుబాటు క‌లుగుతుంది. ఈ సంద‌ర్భంగా ఇవ్వాల్టి ప్రత్యేక‌త‌ను మీకు గుర్తు చేస్తున్నాం.
ప్రతీ ఏటా జూలై ఒక‌టో తేదీన డాక్టర్స్ డే గా పాటిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా మీకు డాక్టర్స్ క‌మ్యూనిటీ త‌ర‌పున శుభాకాంక్షలు..

ప్రముఖ వైద్యులు డాక్టర్ బిద‌న్ చంద్ర రాయ్ జ‌యంతి మ‌రియు వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఈ రోజున డాక్టర్స్ డే గా పాటిస్తున్నాం. వైద్యుల్లో దృవ తార‌గా డాక్టర్ రాయ్ ను చెబుతారు. భార‌త్ లో ఇండియ‌న్ మెడిక‌ల్ అసోసియేష‌న్ స్థాపించి వైద్యుల స‌మైక్యత కోసం కృషి చేశారు. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు. స్వాతంత్ర్యం త‌ర్వాత ప‌శ్చిమ బెంగాల్ కు ముఖ్యమంత్రిగా వ్యవ‌హ‌రించారు. ఆయ‌న సేవ‌ల‌కు గాను కేంద్ర ప్రభుత్వం భార‌త ర‌త్న తో స‌త్కరించింది.
డాక్టర్స్ డే సంద‌ర్భంగా ఒక ముఖ్య విష‌యాన్ని గుర్తు చేసుకొందాం..స‌మాజంలో క‌నిపించే వ్యాధుల్లో మూడు నుంచి నాలుగో వంతు దాకా వ్యాధుల్ని ముందుగానే నివారించ‌వ‌చ్చు. మాన‌వ చ‌ర్యల కార‌ణంగా ఈ రోగాలు పెచ్చు మీరుతున్నాయి. పొగ తాగటం, మ‌ద్యం తీసుకోవ‌టం, గుట్కాలు న‌మ‌ల‌టం వంటి చెడు అల‌వాట్లకు దూరంగా ఉండాలి. ఆహార‌పు అల‌వాట్లు క్రమ‌బ‌ద్దీక‌రించుకోవాలి. త‌గిన వ్యాయామం, స‌రిప‌డ విశ్రాంతి, ఆందోళ‌న‌లు లేని జీవ‌నాన్ని అల‌వర్చు కోవాలి. స‌మాజ‌మంతా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాల‌ని కోరుకొంటూ.. మ‌రోసారి డాక్టర్స్ డే శుభాకాంక్షలు....

ఈ సీజ‌న్ లో ఈ సంగ‌తి మ‌రిచిపోవ‌ద్దు సుమా..!

జూలై నెల వ‌చ్చేసిందంటే రుతుప‌వ‌నాలు ప్రవేశిస్తుంటాయి. ఈ స‌మ‌యంలో దేశ వ్యాప్తంగా వ‌ర్షాలు ప‌డుతుండ‌టం స‌హ‌జం. వాన‌లు ప‌డేట‌ప్పుడు దీనికి అనుగుణంగా కొన్ని స‌మ‌స్యలు పుట్టుకొస్తాయి.
వానా కాలంలో తాగునీటితో పాటు క‌లుషిత నీరు కలిసిపోయే అవ‌కాశం ఉంటుంది. అటువంటప్పుడు క‌లుషిత నీటిలోఉండే క్రిములు శ‌రీరంలోకి ప్రవేశిస్తాయి. చాలా జీర్ణ కోశ వ్యాధుల‌కు క‌లుషిత నీరు కార‌ణం కావ‌చ్చు. ముఖ్యంగా కామెర్లు సోకేందుకు ఎక్కువ‌గా చాన్సు ఉండే సీజ‌న్ ఇది. క‌లుషిత నీరు ద్వారా హెప‌టైటిస్ ఏ, హెప‌టైటిస్ ఈ సంక్రమిస్తాయి. ఇది మొద‌ల‌య్యాకే వెంట‌నే బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు లేదా కొద్ది పాటి స‌మ‌యం తీసుకోవ‌చ్చు. కానీ అన‌ర్థం మాత్రం ఒకేలా ఉంటుంది.

 కాలేయంలో తిష్ట వేసిన క్రిములు అక్కడి జీవ‌న క్రియ‌ల‌కు ఇబ్బంది క‌లిగిస్తాయి. దీంతో శ‌రీరంలో వ‌ర్ణకాలు ప‌చ్చగా మారుతాయి.అందుకే దీన్ని పచ్చ కామెర్లు గా పిలుస్తారు. కొన్ని ప్రాంతంలో దీన్ని ప‌సిరిక‌లుగా చెబుతారు. కామెర్లు లేక ప‌సిరిక‌లకు ఆధునిక వైద్యంలో మెరుగైన చికిత్స అందుబాటులో ఉంద‌ని గుర్తించుకోవాలి. నాటు మందుల‌తో స‌రిపెట్టుకొనే కంటే శాస్త్రీయ‌మైన చికిత్స తీసుకోవ‌టం మేల‌ని తెలుసుకోవాలి.
ఎప్పుడైనా వ్యాధి వ‌చ్చాక చికిత్స తీసుకొనే క‌న్నా, వ్యాధి రాకుండా జాగ్రత్త ప‌డ‌టం మేలు. అందుకే ఇటువంటి రోగాలు రాకుండా సుర‌క్షిత తాగునీటిని తీసుకోవాలి. అన్ని వేళ‌లా కాచి చ‌ల్లార్చిన నీటిని తాగ‌టం ఉత్తమ‌మైన ప‌ద్దతి. లేదంటే ఫిల్టర్ ద్వారా క్రిముల్ని దూరం పెట్టవ‌చ్చు. ఇటువంటి తేలిక‌పాటి జాగ్రత్తల‌తో ఎన్నో ప్రమాద క‌ర‌మైన వ్యాధుల్ని నివారించుకోవ‌చ్చు.

ఫుడ్ విష‌యంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..!

ఫుడ్ తీసుకొనేట‌ప్పుడు అంద‌రూ జాగ్రత్తగా ఉండాల్సిందే. కడుపులో అన్నింటినీ కుక్కేసుకొని త‌ర్వాత బాధ ప‌డేకంటే ముందుగానే జాగ్రత్త తీసుకోవ‌టం మేలు.

ముఖ్యంగా రిఫ్లెక్స్ స‌మ‌స్య ఉన్న వారు ఈ విష‌యంలో జాగ్రత్తగా ఉండాలి. ఆహారం తినేట‌ప్పుడు మనం నెమ్మదిగా న‌మిలి మింగుతుంటాం. అప్పుడు ఆహార‌పు ముద్దలు ... ఆహార వాహిక‌లోకి జార‌తాయి. అక్కడ ఉండే కండ‌రాలు నిర్దిష్టమైన చ‌ల‌నాలు చూపుతాయి. అంటే సంకోచ వ్యాకోచాల‌కు లోన‌వుతాయన్న మాట. అప్పుడు ఆహార‌పు ముద్ద నెమ్మదిగా కింద‌కు జారిపోయి జీర్ణాశ‌యంలోకి ప్రవేశిస్తుంది. ఈ కండ‌ర సంకోచాలు ఒకే వైపుకి ఉండ‌టం వ‌ల‌న ఆహారం కింద‌కు వెళుతుంది త‌ప్పితే మ‌ళ్లీ తిరిగి వెన‌క్కి రావ‌టం జ‌ర‌గ‌దు. కానీ రిఫ్లెక్స్ స‌మ‌స్య ఉన్న వారికి మాత్రం ఈ కండ‌ర చ‌ల‌నాల్లో స‌మ‌స్య ఉండ‌టంతో ఆహారం వెన‌క్కి వ‌స్తుంటుంది. అంటే ఆహారం తిన్న త‌ర్వాత కొంత‌మందిలో తేన్పులు రావ‌టం, కొంత మందిలో గ్యాస్ రావ‌టం, మరికొంద‌రిలో ఆహార‌పు ముద్దలు వెనక్కి రావటం జ‌రుగుతుంటాయి.
ఇటువంటి స‌మ‌స్య ఉన్న వారు ఆహారం విష‌యంలో జాగ్రత్తలు తీసుకోవాలి. బాగా వేడెక్కించిన వేపుడుల‌కు దూరంగా ఉండాలి. కాఫీ, టీలు ఎక్కువ‌గా తాగ‌టం మంచిది కాదు. క్రమం త‌ప్పకుండా వ్యాయామం చేస్తుండాలి. రాత్రి భోజ‌నం త‌ర్వాత వెంట‌నే నిద్రకు ఉప‌క్రమించ‌రాదు. బోజ‌నం త‌ర్వాత 2 లేక 3 గంట‌ల పాటు విరామం ఉండాలి. ప‌డుకొనేట‌ప్పుడు మిగ‌తా శ‌రీర భాగాల‌తో పోలిస్తే త‌ల భాగం ప10 డిగ్రీల ఎత్తు ఉండేట్లు జాగ్రత్త తీసుకోవాలి. ఇటువంటి నియ‌మాలు అంద‌రికీ మంచిదే అని గుర్తుంచుకోవాలి.

ఈ కాలం యువ‌తలో ఈ ల‌క్షణం ఉంటే జాగ్రత్త..!

యువ‌త ఈ మ‌ధ్య కాలంలో ఫ్రెండ్స్ మోజులో ప‌డుతున్నారు. స్నేహితులు చెప్పిన‌ది విన‌టం, వాళ్లు చేసేది చేయ‌టం వంటివి చేస్తున్నారు. దీంతో కొన్ని సార్లు మంచి, కొన్ని సార్లు చెడు జ‌రుగుతున్నాయి.

దుర‌ల‌వాట్లలో ఇటీవ‌ల కాలంలో గుట్కా న‌మ‌లటం ఎక్కువ అయింది. ప‌ల్లెటూర్లలో పొగాకు ను ముక్కలు చేసుకొని న‌మిలేవారు. అది ప‌ల్లె వాసుల అల‌వాటు గా ఉండేది. ఇప్పుడు గుట్కా న‌మ‌ల‌టం మాత్రం ఫ్యాష‌న్ అయిపోయింది. ర‌క ర‌కాల పేర్లతో దొరుకుతున్న ఈ పొగాకు ఉత్పత్తి... ప్రమాద‌క‌ర‌మైన‌దిగా గుర్తుంచుకోవాలి. అందుకే ఈ ప్యాకెట్ ల పైన కూడా ప్రభుత్వ సూచ‌న మేర‌కు హెచ్చరిక లు ముద్రిస్తున్నారు. ఇటువంటి ఉత్పత్తుల‌ను క్రమం త‌ప్పకుండా న‌ములుతుండ‌టం వ‌ల‌న నోటిలో పుండ్లు ఏర్పడుతున్నాయి. ఇవి క్రమేణా అల్సర్ లుగా ఏర్పడుతున్నాయి. ఇవి ముదిరి క్యాన్సర్ కు దారి తీసిన సంద‌ర్భాలు ఉన్నాయి. కొంత మంది ఈ అల‌వాటు తో ప్రాణాలు పోగొట్లుకొన్నట్లు గుర్తించారు. మొద‌ట్లో ఆస‌క్తి క‌రంగా అనిపించిన ఈ అల‌వాటు త‌ర్వాత కాలంలో విడ‌దీయ‌రాని అల‌వాటు అయిపోతోంది.