...

SPECIALIZED SITE FOR HUMAN HEALTH CARE,
SPECIALLY ON GASTROENTEROLOGY, LIVER AND PANCREAS

పండ‌గ నాడు హెవీగా తినేస్తున్నారా...! శ‌రీరం పెర‌గ‌టానికి అది కూడా కార‌ణ‌మా..!

శ‌రీరం పెరుగుతోంద‌న్న కంప్ల‌యింట్ ఈమ‌ద్య ఎక్కువ‌గా వినిపిస్తోంది. కుర్చీకు అతుక్కొని పోయి ప‌నిచేసే క‌ల్చ‌ర్ ఎక్కువ‌గా ఉంటుండ‌టంతో  ఈ స‌మ‌స్య అనేక మంది నుంచి వినిపిస్తోంది.

సాధార‌ణంగా శ‌రీరంలో కొవ్వు ఎక్కువ‌గా పేరుకొని పోవ‌టం వ‌ల్ల ఈ స‌మస్య ఏర్ప‌డుతుంది. అందుచేత నిరంత‌ర వ్యాయామం, క్ర‌మ‌బ‌ద్దీక‌రించిన జీవ‌న శైలి తో ఈ స‌మస్య‌ను అధిగ‌మించ‌వ‌చ్చు. కొన్ని సార్లు మాత్రం కాలేయంలో స‌మ‌స్య ఏర్ప‌డితే ఈ ఇబ్బంది ఏర్ప‌డుతుంది. చాలామంది ఈ సంద‌ర్భంలో కూడా కొవ్వు ఏర్ప‌డటమే కార‌ణంగా భావించి బ‌ద్ద‌కించేస్తుంటారు. ఇది మాత్రం స‌రి కాదు. కొన్ని రోజుల‌కు ఈ స‌మ‌స్య ప‌రిష్కారం అయితే స‌రి.. లేదంటే మాత్రం ముందుగానే జాగ్ర‌త్త ప‌డాల్సిందే. అవ‌స‌రమైతే కాలేయ ఫంక్ష‌న్ టెస్ట్ (ఎల్ ఎఫ్ టీ) అనే చిన్న పాటి ప‌రీక్ష చేయించుకోవ‌టం ద్వారా దీన్ని నిర్ధారించుకోవ‌చ్చు. కాలేయంలో స‌మ‌స్య‌ను గుర్తిస్తే మాత్రం దీనికి త‌గిన చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. అందుచేత జాగ్ర‌త్త ప‌డ‌టం ముఖ్యం.

టీచ‌ర్స్ ను అంతా గుర్తుంచుకొనాలి స‌రే, టీచ‌ర్లు గుర్తుంచుకొనాల్సిందేమిటి..!

అంద‌రికీ ఉపాధ్యాయ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు. స‌మాజానికి దిశా నిర్దేశం చేసే మ‌హోన్న‌త వృత్తిలోఉన్న గురువులంద‌రికీ శుభాభివంద‌నాలు.
వృత్తి ప‌ట్ల మ‌మ‌కారం క‌లిగిన వారిగా టీచ‌ర్ల‌ను చెప్పుకోవ‌చ్చు. నూటికి 90శాతం టీచ‌ర్లు శ్ర‌ద్ధా భ‌క్తుల‌తో విధులు నిర్వ‌హిస్తుంటారు. అయితే ఉద‌య‌మే స్కూల్స్ కు, కాలేజీల‌కు టీచ‌ర్లు, లెక్చ‌ర‌ర్లు ప‌రిగెత్తుతూ ఉంటారు. ఉద‌య‌మే ఠంచ‌న్‌గా వెళ్లిపోవాల‌ని, క్లాసులు తీసుకోవాల‌ని ఆరాట‌ప‌డుతుంటారు.

కానీ ఈ హ‌డావుడిలో ఉద‌య‌మే బ్రేక్ ఫాస్ట్ చేయ‌టాన్ని కొంద‌రు ప‌క్క‌న పెట్టేస్తుంటారు. ఇది మంచిది కాదు. రాత్రి ఎప్పుడో తీసుకొన్న ఆహారం నుంచి విడుద‌లైన శ‌క్తి ఉద‌యానికి స‌రిపోతుంది. ఆ త‌ర్వాత చ‌క్క‌గా ప‌నిచేసేందుకు శ‌క్తి అవ‌స‌రం అవుతుంటుంది. ఈ శ‌క్తి విడుద‌ల కావాలంటే ఉద‌య‌మే ఆహారం త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాలి. అందుచేత బ్రేక్ ఫాస్టు త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాలి. చ‌క్క‌టి ఆహార‌పు అల‌వాట్ల‌ను కొన‌సాగించాలి. అందుకే ఆద‌ర్శ‌నీయ‌మైన టీచ‌ర్ల‌ను అంద‌రూ అభినందిద్దాం.

త‌రుచు క‌డుపు నొప్పి వ‌స్తోందా..!


సాధార‌ణంగా క‌డుపు నొప్పి అనే స‌మ‌స్య ను ప్ర‌తీ ఒక్క‌రూ ఎప్పుడో ఒక‌ప్పుడు అనుభ‌వించే ఉంటారు. చాలా సార్లు అజీర్ణం, అతి సారం వంటి స‌మ‌స్య‌ల‌తో ఇది ఏర్పడుతుంది. చాలా సంద‌ర్భాల్లో క‌డుపు నొప్పి దానంత‌ట అదే త‌గ్గిపోతుంది. ఇంట్లో వాడే చిట్కాల‌తో ఈ నొప్పి కి అడ్డుక‌ట్ట వేయ‌టానికి వీల‌వుతుంది. కానీ ఈ నొప్పి ని పూర్తిగా అశ్ర‌ద్ధ చేయ‌టం మాత్రం కూడ‌దు.

కొన్ని సార్లు క‌డుపు నొప్పితో పాటు విరేచ‌నాలు ఉంటాయి. అందులో రంగు క‌నిపించ‌వ‌చ్చు. అటువంట‌ప్పుడు ఈ నొప్పి విష‌యంలో జాగ్ర‌త్త ప‌డాల్సి ఉంటుంది. ఇన్ ఫ్ల‌మేట‌రీ బౌల్ డిసీజ్ లో ఈ రెండు ల‌క్ష‌ణాలు ప్ర‌ధాన‌మైన‌వి. అంటే వీటితో పాటు బ‌రువు త‌గ్గ‌టం, చిరాకు, వంటి ల‌క్ష‌ణాలు ఉంటుంటాయి. అటువంట‌ప్పుడు మాత్రం నిర్ల‌క్ష్యం చేయ‌టం మంచిది కాదు. త‌గిన వైద్య ప‌రీక్ష‌లు చేయించుకొంటే ప్రారంభ ద‌శ‌లోనే గుర్తించేందుకు వీల‌వుతుంది. వ్యాధి ముదిరితే మాత్రం శ‌స్త్ర చికిత్స చేయాల్సి ఉంటుంది. గ‌తంలో ఇది సంక్లిష్టంగా ఉండేది. ఇప్పుడు కాలంలో మాత్రం స‌శాస్త్రీయంగా, సాఫీగా చేసేందుకు వీలవుతోంది. పేగుల్లో పూర్తిగా స‌మ‌స్య ఏర్ప‌డిన ప్రాంతాన్ని గుర్తిస్తారు. దీన్ని క‌త్తిరించి ఆ భాగాన్ని తీసివేసి పేగుల్ని జ‌త చేసేస్తారు. ఆ త‌ర్వాత నుంచి జీర్ణ ప్ర‌క్రియ సాఫీగా జ‌రిగిపోతుంది. అందుచేత స‌మ‌స్య పదే ప‌దే త‌లెత్తుతున్న‌ప్ప‌డు నిర్ల‌క్ష్యం వ‌హించ‌కుండా ఉంటే బాగుంటుంది.

ఇప్ప‌టికైనా రూటు మార్చుకోండి..!

ఒక ప‌ద్ద‌తికి అల‌వాటు ప‌డితే అంతా అదే మార్గంలో వెళ‌తారు. కానీ ఆ రూట్ లో వెళ్లేట‌ప్పుడు స‌మ‌స్య ఎదుర‌వుతుంద‌ని తెలిస్తే, రూటు మార్చుకోవ‌టం మేలు.

చేతులు శుభ్ర ప‌రుచుకొనేందుకు స‌బ్బును వాడ‌టం ఎప్ప‌టినుంచో అల‌వాటైన విష‌యం. ఇంట్లో ఉన్న‌ప్పుడు కుటుంబ స‌భ్యుల‌తో ఈ అల‌వాటును కొన‌సాగించ‌టం కొంత వ‌ర‌కు ప‌ర్వాలేదు. పూర్తిగా మంచిద‌ని చెప్ప‌లేం. కానీ బ‌హిరంగ ప్ర‌దేశాల్లో అంటే ఆఫీసుల్లో, హోట‌ల్స్ లో మాత్రం స‌బ్బు వాడ‌కం అంత స‌రి కాదు. కొంత మంది టాయిలెట్ కు వెళ్లి వ‌చ్చాక ఈ స‌బ్బును ఉప‌యోగించార‌నుకొందాం.  ఆ త‌ర్వాత ఆ స‌బ్బుతో మ‌నం చేతులు రుద్దుకొని, ఆహారం తీసుకోవ‌టం మొద‌లెడితే స‌బ్బును ఆశ్ర‌యించిన క్రిములు మ‌న చేతి ద్వారా మ‌న శ‌రీరంలోకి వెళ్లే అవ‌కాశం ఉంటుంది. అంతే కాకుండా వాష్ బేసిన్ ద‌గ్గ‌ర కొంత మేర నీరు నిల్వ ఉండే చాన్సు ఉంది. అక్క‌డ నీళ్ల‌లో స‌బ్బును ఉంచితే మాత్రం అది వ్యాధుల వ్యాప్తికి దారి తీస్తుంది. అందుచేత లిక్విడ్ హేండ్ వాష్ వాడుకోవ‌టం ఉత్త‌మం. అందుచేత ఆఫీసులు, హోట‌ల్స్ లో దీన్ని ఉప‌యోగించుకోవాలి. లేని ప‌క్షంలో సొంతంగా ఒక వాష్ బాటిల్ కూడా ఉంచుకోవ‌టం మేలు. అప్పుడు ఆయా ప్ర‌దేశాల్లో మ‌నం వీటిని వాడుకోవ‌చ్చు.

ఇలాంటి స‌మ‌యంలో రాళ్లు ప‌డితే..!

రాళ్ల గురించి ఆలోచిస్తే కాస్తంత జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే. ఇవి తెచ్చి పెట్టే చేటు ప‌రిణామాలు అటువంటివి.
శ‌రీరంలో రాళ్లు పేరుకోవ‌టం అన్న మాట విన‌గానే చాలా మందికి కిడ్నీల్లో రాళ్ల గురించి గుర్తుకొని వ‌స్తుంది. అందుచేత ఇత‌ర శ‌రీర భాగాల గురించి పెద్ద‌గా ఆలోచ‌న రాదు. కానీ కాలేయం నుంచి పైత్య ర‌సాన్ని గ్ర‌హించే  పైత్య ర‌స వాహిక (బైల్ డ‌క్ట్ ), పిత్తాశ‌యం (గాల్ బ్లాడ‌ర్‌) వంటి భాగాల్లో రాళ్లు పేరుకొన వ‌చ్చు.

స‌క్ర‌మంగా లేని ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న శైలి స‌రిగ్గా లేక పోవటం వంటి కార‌ణాలతో ఈ ప‌రిస్థితి త‌లెత్త‌వ‌చ్చు. విప‌రీతంగా క‌డుపు నొప్పి రావటం వంటి ల‌క్ష‌ణాల‌తో దీన్ని అనుమానించాల్సి వ‌స్తుంది. శ‌రీరంలో నొప్పి వ‌చ్చే ప్ర‌దేశాన్ని బ‌ట్టి గుర్తించ వ‌చ్చు. స్కానింగ్ ద్వారా దీన్ని నిర్ధారిస్తారు. మొద‌టి ద‌శ‌లోనే రాళ్ల‌ను గుర్తిస్తే మందులు వాడ‌టంతో చికిత్స చేయ‌వ‌చ్చు. రాళ్లు ఎక్కువ‌గా పేరుకొంటే మాత్రం ఆప‌రేష‌న్ అవ‌స‌రం అవుతుంది. ఒక‌ప్ప‌టి కాలంతో పోలిస్తే మాత్రం ఈ ఆప‌రేష‌న్ చాలా తేలిక గా ఉంటున్నాయి. లాప‌రోస్కోపిక్ విధానాల‌తో పెద్ద‌గా గాటు పెట్టాల్సిన అవ‌స‌రం లేకుండా త్వ‌రిత గ‌తిన ఆప‌రేష‌న్ చేయ‌టానికి వీలవుతోంది. పూర్తి సుర‌క్షితంగా, సునిశితంగా ఆప‌రేష‌న్ చేసేందుకు వీల‌వుతుంది. ఒక రోజు త‌ర్వాత పేషంట్ ను ఇంటికి పంపించేందుకు వీలవుతుంది. అందుచేత శ‌రీరంలోని జీర్ణ అవ‌య‌వాల్లో రాళ్లు ప‌డితే కంగారు ప‌డ‌కుండా నిపుణులైన వైద్యుల‌తో చికిత్స తీసుకోవాలి.

అంతా మీ చేతిలో ఉంది..!

ఏదో అనుకొంటాం కానీ చేతికి చాలా ప్రాధాన్యం ఉంది. ఎందుకంటే ఈ చేతిని ఉప‌యోగించుకొనే తీరు ముఖ్యం.
ప్రతీ ఇంట్లో ఉమ్మడి వ‌స్తువుల్ని అంతా తాకాల్సిందే. ముఖ్యంగా డోర్ నాబ్స్ కానీ, టాప్స్ కానీ ఉప‌యోగించేట‌ప్పుడు వాటిని ప‌దే ప‌దే తాకాల్సి ఉంటుంది. అయితే ఇంట్లో అయితే కేవ‌లం కుటుంబ స‌భ్యులు మాత్రమే ఉప‌యోగిస్తుంటారు. ఆఫీసులు కానీ, షాపింగ్ మాల్స్ లో కానీ చూసుకొన్నట్లయితే వీట‌ని అంతా ఉప‌యోగిస్తుంటారు.

మ‌ల మూత్ర విస‌ర్జన త‌ర్వాత లేదా రొంప‌తో బాధ ప‌డేట‌ప్పుడు ముక్కును ప‌దే ప‌దే చేతితో తుడుచుకొన్నప్పుడు చేతికి ఆ క్రిములు అంటుతాయి. ఈ క్రిములు వ్యాధుల్ని వ్యాపింప చేసే ల‌క్షణాల‌తో ఉంటాయి. ఈ చేతుల‌తో డోర్ నాబ్స్ కానీ, టాప్స్ కానీ ఉప‌యోగించిన‌ప్పుడు ఆ క్రిములు ఆయా వస్తువుల్ని ఆశ్రయిస్తాయి. దీంతో త‌ర్వాత కాలంలో ఆ వ‌స్తువుల్ని ఇత‌రులు వాడిన‌ప్పుడు వారి చేతుల మీద‌కు చేరి త‌ర్వాత ఆహారం తీసుకొనేట‌ప్పుడు ఆ చేతుల గుండా శరీరంలోకి ప్రవేశిస్తాయి.
సాధ్యమైనంత వ‌ర‌కు డోర్ నాబ్స్, టాప్స్ సైజుల్ని జాగ్రత్తగా ఎంచుకోవ‌టం మేలు. బ‌హిరంగ ప్రదేశాల్లో వీటిని వాడేట‌ప్పుడు త‌గిన జాగ్రత్త తీసుకోవాలి. ఆహారం తినేట‌ప్పుడు మాత్రం త‌ప్పనిస‌రిగా చేతుల్ని స‌బ్బు నీటితో క‌డుగుకోవ‌టం మ‌రిచిపోవ‌ద్దు. ఇది త‌ప్పనిస‌రిగా చేసుకోవాల్సిన అల‌వాటు.

ఒక వైపు పాడైపోతుంటే - ఈ పాపం ఎవ‌రిది..!

స‌హ‌జంగా ఏదైనా త‌ప్పు జ‌రిగిపోయాక‌, ఈ త‌ప్పు ఎందుకు జ‌రిగింది అనే దానిపై చ‌ర్చ న‌డుస్తుంది. ఇప్పుడు కూడా దీన్ని గుర్తు చేసుకొంటున్నాం.
ఇటీవ‌ల కాలంలో కాలేయ స‌మ‌స్యలు ఎక్కువ‌గా బ‌య‌ట ప‌డుతున్నాయి. 40 సంవ‌త్సరాలు దాటిన వారిలో ఇటువంటివి గ‌మ‌నిస్తున్నాం.. ఇన్ ఫ్లమేష‌న్‌, సిర్రోసిస్‌, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక స‌మ‌స్యలు క‌నిపిస్తున్నాయి. మాన‌వ శ‌రీరంలో అతి పెద్ద గ్రంథి గా దీన్ని చెప్పవ‌చ్చు. ఇందులో స‌మ‌స్యలకు అనేక కార‌ణాలు క‌నిపిస్తాయి.

 కానీ మ‌ద్య పానం ముఖ్యమైన‌దిగా క‌నిపిస్తోంది. ఆల్కహాల్ తాగే అల‌వాటు ఇటీవ‌ల కాలంలో పెద్ద ఎత్తున పెరుగుతోంది. శ్రామిక వ‌ర్గాలు త‌మ శ్రమ‌ను మ‌రిచిపోయేందుకు ఇదొక్కటే ఏకైక మార్గం అన్నట్లుగా వ్యవ‌హ‌రిస్తోంది. ఉద్యోగ వ‌ర్గాల్లో ఇది త‌ప్పనిస‌రి అల‌వాటుగా మారుతున్న ధోర‌ణి క‌నిపిస్తోంది. ఆల్కహాల్ తాగ‌టం తో అందులోని కెమిక‌ల్స్ శ‌రీరంలోప‌ల‌కు ప్రవేశించి విష పదార్థాలుగా మార‌తాయి. ఈ విష ప‌దార్థాలు కాలేయంలో పోగు ప‌డి వినాశ‌నం సృష్టిస్తున్నాయి. దీంతో అనేక స‌మ‌స్యలు ఉద్భవిస్తున్నాయి. ఇంత‌టి అనారోగ్యాన్ని తెచ్చుపెట్టుకొంటున్నది స్వయంగా ఆయా వ్యక్తులే. దీన్ని గుర్తించుకోవాలి. మ‌ద్య పానం అలవాటు ను పూర్తిగా వ‌దులుకోవటం అత్యుత్తమ ఆరోగ్య అల‌వాటు గా గుర్తించుకోవాలి.