...

SPECIALIZED SITE FOR HUMAN HEALTH CARE,
SPECIALLY ON GASTROENTEROLOGY, LIVER AND PANCREAS

ఈరోజు ప్రత్యేక‌త మీకు తెలుసా..!

ఇవాళ ప్రపంచ హెప‌టైటిస్ డే. ప్రపంచాన్ని క‌బ‌ళించి వేస్తున్న ప్రమాద‌క‌ర వ్యాధుల్లో ఒక‌టిగా గుర్తింపు పొందిన హెప‌టైటిస్ పై ఇవాళ అవ‌గాహ‌న తెచ్చుకోవాల్సి ఉంది.
మాన‌వ శ‌రీరంలో కాలేయం ఒక ప్రధాన అవ‌య‌వం. జీర్ణ వ్యవ‌స్థలో ఇది చురుకైన పాత్ర పోషిస్తుంది. ఉద‌ర కోశంలో కుడి వైపు పై భాగంలోఉంటుంది. చూసేందుకు పెద్దదిగా కనిపిస్తూ జీవ‌న క్రియ‌ల్లో ముఖ్య భూమిక పోషించును. చాలామంది ఇది జీర్ణ క్రియ‌లో మాత్రమే ఉప‌క‌రిస్తుంద‌ని భావిస్తారు. కానీ, ప్రోటీన్ సంశ్లేష‌ణ‌, డ్రగ్ మెట‌బాలిజం, శ‌రీర స‌మ‌తుల్యత‌, విస‌ర్జన వంటి అనేక ముఖ్య ప్రక్రియ‌ల్లో ప్రత్యక్షంగా, ప‌రోక్షంగా పాలు పంచుకొంటుంది. ప్రధాన జీవ‌న క్రియ‌ల్లో భూమిక పోషిస్తుండ‌టం వ‌ల్ల కాలేయాన్ని ప్రధాన అవ‌య‌వంగా చెబుతారు.
కాలేయం జీర్ణ వ్యవ‌స్థలో ప్రధానంగా ఉప‌యోగ‌పడుతుంది. కాలేయంలో పైత్యర‌సం త‌యార‌వుతుంది. ఇందులోఎటువంటి ఎంజైమ్ లు ఉండ‌వు. అయిన‌ప్పటికీ ఇందులో ఉండే బైలిరుబిన్‌, బైలివిర్డిన్ అనే వ‌ర్ణక ప‌దార్థాలు ముఖ్యమైన‌వి. ఇవి కాలేయ వాహిక ద్వారా ఆంత్ర మూలంలోకి స్రావితం అవుతాయి. అక్కడ ఆహారంలోని క‌ఠిన‌ ప‌దార్థాల్ని విచ్ఛిన్నం చేయ‌టంలో ఉప‌క‌రిస్తాయి. దీంతో పాటు మ‌లం త‌యార‌య్యే స‌మ‌యంలో పెద్ద పేగు ద్వారా అక్కడ‌కు చేరుకొని .. దానికి ప‌సుపు రంగును క‌లిగిస్తాయి.
శ‌రీరంలో ప్రస‌ర‌ణ వ్యవ‌స్థకు ర‌క్తం మూలం అన్న సంగ‌తి తెలిసిందే. ఎర్ర ర‌క్త క‌ణాలు, తెల్ల ర‌క్త క‌ణాలు అనే రెండు ప్రధాన క‌ణాల స‌మ్మేళ‌న‌మే ర‌క్తం అన‌వ‌చ్చు. ఇందులో అధిక భాగం ఎర్ర ర‌క్త క‌ణాల‌దే. హీమో గ్లోబిన్ అనే వ‌ర్ణకం ఉండుట చేత వీటికి ఎర్ర ర‌క్త క‌ణాలు అనే  పేరు వ‌చ్చింది. ఇవి శాశ్వత కణాలు కానే కావు. ప్రతీ 120 రోజుల‌కు ఒకసారి ఈ ర‌క్త క‌ణాలు శిథిలం అయిపోతాయి. మ‌ళ్లీ కొత్త ర‌క్త క‌ణాలు పుట్టుకొని వ‌స్తాయి. ఈ క్రమంలో ర‌క్త క‌ణాలు శిథిలం అయిపోవ‌టం అనే ప్రక్రియ కాలేయంలో జ‌రుగుతుంది. కాలేయ క‌ణాల వేదిక‌గా  ఈ ఘ‌ట్టం చోటు చేసుకొంటుంది. అయితే ఈ వ్యర్థ ప‌దార్థాలు బ‌య‌ట‌కు వెళ్లకుండా కాలేయంలోనే పోగు ప‌డితే దాన్ని కామెర్లుగా వ్యవ‌హ‌రిస్తారు.

కామెర్లకు చాలా కార‌ణాలు క‌నిపిస్తాయి. ఒక‌రకం కామెర్లకు క‌లుషిత నీరు, కలుషిత ఆహారం కార‌ణాలు కాగా, మ‌రో ర‌కం కామెర్లకు అర‌క్షిత ర‌క్తాన్ని ఎక్కించ‌టం, అర‌క్షిత శృంగారం కార‌ణాలుగా చెబుతారు. ఇందులో రెండో ర‌కం కామెర్లు ప్రమాద‌క‌రం గా గుర్తించుకోవాలి.
కామెర్లను ప్రధానంగా క‌ళ్లు ప‌చ్చ ప‌డ‌టం, మూత్రం ప‌చ్చగా మార‌టంతో గుర్తిస్తారు. దీన్ని నిర్ధారించేందుకు మూత్రం, రక్తం ప‌రీక్షలు అవ‌స‌రం అవుతాయి. ఒక‌సారి కామెర్లు నిర్ధార‌ణ అయ్యాక ఆల‌స్యం చేయ‌కుండా నిపుణుల సాయంతో చికిత్స తీసుకోవాలి. కామెర్లకు నాటు మందులు వాడుతుంటారు. ఇది స‌రి కాదు. శాస్త్రీయ‌మైన చికిత్స త‌ప్పనిస‌రి అని గుర్తించుకోవాలి. మ‌ద్యం తాగ‌టం, క‌లుషిత నీరు వాడ‌టం వంటి అల‌వాట్లకు దూరంగా ఉండాలి. సుర‌క్షిత ర‌క్తం, సుర‌క్షిత శృంగారం ముఖ్యం అని గ‌మ‌నించాలి.

No comments:

Post a Comment