...

SPECIALIZED SITE FOR HUMAN HEALTH CARE,
SPECIALLY ON GASTROENTEROLOGY, LIVER AND PANCREAS

కొత్త సంవ‌త్స‌రంలో ఇంటి ఇల్లాలు ఒక కొత్త నిర్ణ‌యం తీసుకొంటే బాగుంటుందేమో..!

ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. ఎందుకంటే ఇంటిల్లిపాది చ‌ల్ల‌గా ఉండాలని, వాళ్ల జీవితంలో వెలుగు నిండాల‌ని అనుక్ష‌ణం కోరుకొనేది ఇల్లాలే. కొవ్వొత్తి తాను క‌రిగిపోతూ గ‌దంతా వెలుగులు ప‌రుస్తుంది. ఇంట్లో ఇల్లాలు కూడా అలాగే తాప‌త్ర‌య ప‌డుతుంది. భ‌ర్త, పిల్ల‌లు, పెద్ద‌లు అంతా ఆరోగ్యంగా ఉండాల‌ని, ఆనందంగా ఉండాల‌ని కోరుకొంటూ ఉంటారు. ఈ హ‌డావుడిలో త‌మ ఆరోగ్యం సంగ‌తి ప‌ట్టించుకోకుండా వ‌దిలేస్తుంటారు.
ఈ కోణంలో ఆలోచిస్తే ఒక అంశాన్ని గుర్తు చేసుకొందాం. ప్ర‌తీ రోజూ రాత్రి 8,9 గంట‌ల‌కు భోజ‌నం చేసి కొద్ది సేప‌టి త‌ర్వాత నిద్రించ‌టం చాలా ఇళ్ల‌లో జ‌రిగేదే. ఉద‌యం నిద్ర లేచిన ద‌గ్గ‌ర నుంచి కుటుంబ స‌భ్యుల బాధ్య‌త‌లు తీర్చ‌టంలో ప‌రిగెత్తుతుంటారు. పిల్ల‌ల‌ను స్కూల్స్ లేక కాలేజీల‌కు పంపించాలంటే వాళ్ల‌కు కావ‌ల్సిన‌వ‌న్నీ సర్దిపెట్టి, లంచ్ బాక్సులు స‌ర్ది పంపించాలి. ఆ త‌ర్వాత భ‌ర్త లేక కుటుంబ స‌భ్యులు ఆఫీసుల‌కు లేక వ్యాపారాల‌కు వెళ్లాలంటే వాళ్ల‌కు కావ‌ల్సిన‌వి అమ‌ర్చి పెట్టాలి.

ఈ హ‌డావుడిలో బ్రేక్ ఫాస్టు మానేస్తుంటారు. పైగా ఇంటినిండా పని ఉంది కదా అని కొంద‌రు, పిల్ల‌లు కుటుంబ స‌భ్యులు హ‌డావుడి ప‌డుతుంటే బాగోద‌ని మ‌రి కొంద‌రు, ఇత‌ర కార‌ణాల‌తో మ‌రి కొంద‌రు మానేస్తుంటారు. న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లో దాదాపుగా ఇటువంటి ముఖ‌చిత్రాన్ని మ‌నం చూస్తుంటాం. అదే వ‌ర్కింగ్ ఉమెన్ అయితే ఈ క‌ష్టాలు రెట్టింపు అని వేరే చెప్ప న‌క్క‌ర లేదు.  ఆ త‌ర్వాత ఇల్లు స‌ర్దుకొని ఒక రూపంలో అమ‌ర్చుకొనే స‌రికి 10,11 అవుతుంది. అప్పుడు కాస్తంత ఆహారం తీసుకొంటారు త‌ప్పితే అప్ప‌టి దాకా ఏమీ తీసుకోకుండానే ప‌రుగులు తీస్తుంటారు. అంటే రాత్రి 10 నుంచి ఉద‌యం 10 దాకా .. దాదాపు స‌గం రోజు పాటు ఏమాత్రం ఆహారం తీసుకోవ‌టం లేదు. కానీ ఆ త‌ర్వాత స‌గంలో మాత్రమే ఆహారం తీసుకొంటారు. ఇది ఇల్లాలి ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. అందుచేత ఉద‌యం పూట కాస్తంత బ్రేక్ ఫాస్టు చేయ‌టం అన్న‌ది మంచి అల‌వాటు. దీంతో శ‌రీరానికి కావ‌ల‌సిన గ్లూకోజ్ అందుతుంది. ఆ త‌ర్వాత లంచ్‌, స్నాక్స్, డిన్న‌ర్ వంటివి ప్లాన్ చేసుకోవ‌చ్చు. ఇల్లాలు ఆరోగ్యంగా ఉంటేనే క‌దా, ఇల్లంతా మ‌రింత ప్ర‌కాశ‌వంతంగా ఆరోగ్యంగా ఉండేది.
పాఠ‌కులు అంద‌రికీ తెలుగు వారి కొత్త సంవ‌త్స‌రం యుగాది శుభాకాంక్ష‌లు.

No comments:

Post a Comment