...

SPECIALIZED SITE FOR HUMAN HEALTH CARE,
SPECIALLY ON GASTROENTEROLOGY, LIVER AND PANCREAS

ఈ సీజన్ లో ఈ జాగ్రత్త తీసుకోండి



వానలు కురుస్తున్నప్పుడు కొత్త నీరు వచ్చి చేరటం సహజం. ఈ సీజన్ లో కొన్ని రకాల సమస్యల్ని చూసుకోవాలి. లేదంటే చిన్న ఇబ్బందులే పెద్ద సమస్యలకు దారి తీస్తాయి. అటువంటి వాటిలో తాగునీటి విషయం ఒకటి. తాగునీరు తాగటం అందరికీ తప్పనిసరి. కానీ ఈ నీరు పరిశుభ్రంగా ఉందో లేదో చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మన పల్లెల్లో, పట్టణాల్లో  తాగునీరు సరఫరా చేసే పైప్ లైన్లు, మురుగు నీటిని తీసుకొని వెళ్లే పైప్ లైన్లు పక్క పక్కనే ప్రవహిస్తుంటాయి. స్నేహితుల మాదిరిగా ఒక్కోసారి పలకరించుకొంటూ ఉంటాయి. అటువంటప్పుడు పారిశుద్య గొట్టాల్లోని మురుగు నీరు .. తాగునీటిలో కలిసిపోయే అవకాశం ఉంది. అప్పుడు తాగునీరు కలుషితం అయిపోతుంది. కొన్ని సందర్బాల్లో ఈ విషయం బయట పడినా, చాలా సార్లు ఇది బయట పడదు. అటువంటప్పుడు కలుషిత నీటిని తాగిన వారంతా ఇబ్బంది పడతారు.
కలుషిత నీటితో డయేరియా వంటి ప్రమాదకరమైన వ్యాధులు వస్తుంటాయి. దీంతో పాటు కామెర్లు, కలరా వంటి రోగాలు వచ్చే అవకాశం ఎక్కువ. వందలాది వ్యాధి కారక క్రిములు తాగునీటితోనే వ్యాపిస్తాయని అంచనా. అటువంటప్పుడు ఈ రోగ కారక క్రిములు తేలిగ్గా వచ్చి పడతాయి. వీటితో ప్రమాదకరమైన వ్యాధులు వస్తుంటాయి. అందుచేత ఈ వ్యాధుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

ఈ సీజన్ లో శుద్ది చేసిన నీటినే తీసుకోవాలి. తాగునీటిని కాచిచల్లార్చాక తాగటం ఉత్తమం. లేదా నాణ్యత కలిగిన ఫిల్టర్ లో వడపోసి తీసుకోవాలి.  ఈ జాగ్రత్త తీసుకొంటే క్లీన్ వాటర్ ను పొందగలం. అప్పుడు ఈ సీజన్ లో క్లీన్ గా ఉండగలం.

ఎర్రగా నాజూగ్గా ఉంటే సరిపోతుందా..అసలు సంగతేమిటి..!

ఎర్రగా నాజూగ్గా ఉండటం మీద మొదటినుంచి అంచనాలు ఉంటాయి. ఎందుకంటే ఎరుపు ఎప్పుడూ ఆకర్షణీయం కాబట్టి అందరి దృష్టి అటు పడుతుంది. అంత మాత్రం చేత ఎరుపును తక్కువగా చెప్పవద్దు సుమా..అంత ఎందుకు శరీరంలో ఉండే కాలేయం కూడా ఎర్రగా, నవ నవలాడుతూ ఉంటుంది. కానీ ఇది చాలా కీలక పాత్ర పోషిస్తుంది.

ఇక శరీరంలోని గ్రంథుల్లో పెద్దదిగా కాలేయాన్ని చెబుతారు. దీని నుంచి ఎటువంటి ఎంజైమ్‌ లు విడుదల కావు. అంతమాత్రం చేత దీని ప్రాధాన్యం కొట్టిపారేయకూడదు సుమా..

మాన‌వ శ‌రీరంలో కాలేయం ఒక ప్రధాన అవ‌య‌వం. కాలేయం జీర్ణ వ్యవ‌స్థలో ప్రధానంగా ఉప‌యోగ‌పడుతుంది. కాలేయంలో పైత్యర‌సం త‌యార‌వుతుంది. ఇందులో ఉండే బైలిరుబిన్‌, బైలివిర్డిన్ అనే వ‌ర్ణక ప‌దార్థాలు ముఖ్యమైన‌వి. ఇవి కాలేయ వాహిక ద్వారా పేగు లో స్రావితం అవుతాయి. అక్కడ ఆహారంలోని క‌ఠిన‌ ప‌దార్థాల్ని విచ్ఛిన్నం చేయ‌టంలో ఉప‌క‌రిస్తాయి. ముఖ్యంగా కొవ్వు పదార్థాల్ని విడగ్గొట్టి తేలిగ్గా జీర్ణం చేయటంలో ఉపకరిస్తుంది. దీంతో పాటు మ‌లం త‌యార‌య్యే స‌మ‌యంలో పెద్ద పేగు ద్వారా అక్కడ‌కు చేరుకొని .. దానికి ప‌సుపు రంగును క‌లిగిస్తాయి.
చాలామంది ఇది జీర్ణ క్రియ‌లో మాత్రమే ఉప‌క‌రిస్తుంద‌ని భావిస్తారు. కానీ, ప్రోటీన్ సంశ్లేష‌ణ‌, డ్రగ్ మెట‌బాలిజం, శ‌రీర స‌మ‌తుల్యత‌, విస‌ర్జన వంటి అనేక ముఖ్య ప్రక్రియ‌ల్లో ప్రత్యక్షంగా, ప‌రోక్షంగా పాలు పంచుకొంటుంది. ప్రధాన జీవ‌న క్రియ‌ల్లో భూమిక పోషిస్తుండ‌టం వ‌ల్ల కాలేయాన్ని ప్రధాన అవ‌య‌వంగా చెబుతారు. అందుచేత శరీరంలో అనేక జీవన ప్రక్రియల్లో చురుగ్గా వ్యవహరించే కాలేయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవటం అవసరం.

దురలవాట్లకు దూరంగా ఉండటం, ముఖ్యంగా మద్యపానానికి దూరంగా ఉండటం ముఖ్యం. ఆరోగ్యకరమైన అలవాట్లు, పోషకాహారాన్ని నిర్దిష్ట వేళల్లో తీసుకోవటం, సురక్షిత తాగునీటిని ఉపయోగించటం వంటి అలవాట్లతో కాలేయాన్ని పదలి పరుచుకోవచ్చు. కాలేయ ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందని గుర్తించుకోవాలి.


ఈ శని, ఆది వారం రోజుల్లో ఇది గుర్తు పెట్టుకోండి..

శని వారం అంటే చాలా మందికి హుషారు వచ్చేస్తుంది. వీకెండ్‌ కాబట్టి ఆ మాత్రం జోష్‌ తప్పనిసరి. అంతే కాదు. మర్నాడు ఆదివారం కాబట్టి ఉదయమే లేచి ఉరుకులు, పరుగులతో ఆఫీసులకు, వ్యాపారాలకు పరుగులు పెట్టనక్కర లేదు. అందుకే శనివారం రాత్రి ఎంత ఆలస్యంగా పడుకొన్నా ఫర్వాలేదు అన్న ఫీలింగ్‌ ఉంటుంది. ఇంత వరకు మామూలు వ్యక్తుల షెడ్యూల్‌.
మరి మాడర్న్ మహా రాజుల షెడ్యూల్‌ ఏమిటంటారా.. ఈ మద్య కాలంలో యువత కానీ, పెద్ద వయస్సు కానీ ఆల్కహాల్‌ తాగటానికి అలవాటు పడుతున్నారు. ఆధునిక జీవన శైలిలో భాగంగా మందుకొట్టడం అన్నది ఫ్యాషన్‌ అయిపోయింది. మద్యం తాగని వాడు దున్నపోతై పుట్టున్‌.... అని ఏ కవి చెప్పలేదు కానీ, మాడర్న్ సొసైటీ లో మందు కొట్టని వాడిని అమాయక చక్రవర్తి గా చూస్తున్నారు. దీంతో కావాలని ఈ అలవాటు చేసుకొనే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది.

వాస్తవానికి మద్యపానం వలన అనేక రోగాలు ప్రబలుతున్నాయి. ముఖ్యంగా కాలేయ సమస్యల్లో అనేక ఇబ్బందులకు మద్యం తాగటం కారణంగా నిలుస్తోంది. కాలేయంలో ఈ ఆల్కహాల్‌ చేసే డ్యామేజ్‌ అంతా ఇంతా కాదు. ఆల్కహాల్‌ కడుపులో  చేరాక విష పదార్థాలుగా మారుతుంది. ఈ విష పదార్థాలు కాలేయంలో మకాం చేసి అక్కడ ఉండే సజీవ కణజాలాన్ని తినేసి సిర్రోసిస్‌, కొన్ని సార్లు క్యాన్సర్‌ కు దారి తీస్తున్నాయి.

అందుచేత శనివారం అనగానే ఎక్కడ పార్టీ ఉందో వెదక్కొని, అక్కడకు వెళ్లిపోయి మరీ మందు కొట్టే అలవాటు ఉంటే దాన్ని వదిలించుకోవటం మేలు. కొంత వరకు ఆల్కహాల్‌ తాగినా పర్వాలేదు అని చెబుతున్నారు కానీ ఇది ఎంత వరకు ఫర్వాలేదు అన్న దానిపై స్పష్టత లేదు. అందుచేత సాధ్యమైనంత వరకు ఈ అలవాటుని వదిలేసుకోవటం మేలు. ఇప్పటిదాకా ఆల్కహాల్ ముట్టని గుడ్‌ బాయ్స్ అయితే అదే గుడ్ బాయ్స్ గా కంటిన్యూ అయిపోండి.