ఎర్రగా
నాజూగ్గా ఉండటం మీద మొదటినుంచి అంచనాలు ఉంటాయి. ఎందుకంటే ఎరుపు ఎప్పుడూ ఆకర్షణీయం
కాబట్టి అందరి దృష్టి అటు పడుతుంది. అంత మాత్రం చేత ఎరుపును తక్కువగా చెప్పవద్దు
సుమా..అంత ఎందుకు శరీరంలో ఉండే కాలేయం కూడా ఎర్రగా, నవ నవలాడుతూ ఉంటుంది. కానీ ఇది
చాలా కీలక పాత్ర పోషిస్తుంది.
ఇక శరీరంలోని గ్రంథుల్లో
పెద్దదిగా కాలేయాన్ని చెబుతారు. దీని నుంచి ఎటువంటి ఎంజైమ్ లు విడుదల కావు.
అంతమాత్రం చేత దీని ప్రాధాన్యం కొట్టిపారేయకూడదు సుమా..
మానవ శరీరంలో కాలేయం ఒక ప్రధాన అవయవం. కాలేయం
జీర్ణ వ్యవస్థలో ప్రధానంగా ఉపయోగపడుతుంది. కాలేయంలో పైత్యరసం తయారవుతుంది.
ఇందులో ఉండే బైలిరుబిన్, బైలివిర్డిన్ అనే వర్ణక పదార్థాలు ముఖ్యమైనవి. ఇవి కాలేయ
వాహిక ద్వారా పేగు లో స్రావితం అవుతాయి. అక్కడ ఆహారంలోని కఠిన పదార్థాల్ని
విచ్ఛిన్నం చేయటంలో ఉపకరిస్తాయి. ముఖ్యంగా కొవ్వు
పదార్థాల్ని విడగ్గొట్టి తేలిగ్గా జీర్ణం చేయటంలో ఉపకరిస్తుంది. దీంతో పాటు మలం తయారయ్యే సమయంలో పెద్ద పేగు ద్వారా అక్కడకు
చేరుకొని .. దానికి పసుపు రంగును కలిగిస్తాయి.
చాలామంది ఇది జీర్ణ క్రియలో మాత్రమే ఉపకరిస్తుందని
భావిస్తారు. కానీ, ప్రోటీన్ సంశ్లేషణ, డ్రగ్ మెటబాలిజం, శరీర సమతుల్యత, విసర్జన వంటి అనేక
ముఖ్య ప్రక్రియల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాలు పంచుకొంటుంది. ప్రధాన జీవన
క్రియల్లో భూమిక పోషిస్తుండటం వల్ల కాలేయాన్ని ప్రధాన అవయవంగా చెబుతారు. అందుచేత శరీరంలో అనేక జీవన ప్రక్రియల్లో
చురుగ్గా వ్యవహరించే కాలేయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవటం అవసరం.
దురలవాట్లకు దూరంగా ఉండటం,
ముఖ్యంగా మద్యపానానికి దూరంగా ఉండటం ముఖ్యం. ఆరోగ్యకరమైన అలవాట్లు, పోషకాహారాన్ని
నిర్దిష్ట వేళల్లో తీసుకోవటం, సురక్షిత తాగునీటిని ఉపయోగించటం వంటి అలవాట్లతో
కాలేయాన్ని పదలి పరుచుకోవచ్చు. కాలేయ ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందని
గుర్తించుకోవాలి.
No comments:
Post a Comment