శని వారం అంటే చాలా
మందికి హుషారు వచ్చేస్తుంది. వీకెండ్ కాబట్టి ఆ మాత్రం జోష్ తప్పనిసరి. అంతే
కాదు. మర్నాడు ఆదివారం కాబట్టి ఉదయమే లేచి ఉరుకులు, పరుగులతో ఆఫీసులకు, వ్యాపారాలకు
పరుగులు పెట్టనక్కర లేదు. అందుకే శనివారం రాత్రి ఎంత ఆలస్యంగా పడుకొన్నా ఫర్వాలేదు
అన్న ఫీలింగ్ ఉంటుంది. ఇంత వరకు మామూలు వ్యక్తుల షెడ్యూల్.
మరి మాడర్న్ మహా
రాజుల షెడ్యూల్ ఏమిటంటారా.. ఈ మద్య కాలంలో యువత కానీ, పెద్ద వయస్సు కానీ ఆల్కహాల్
తాగటానికి అలవాటు పడుతున్నారు. ఆధునిక జీవన శైలిలో భాగంగా మందుకొట్టడం అన్నది
ఫ్యాషన్ అయిపోయింది. మద్యం తాగని వాడు దున్నపోతై పుట్టున్.... అని ఏ కవి
చెప్పలేదు కానీ, మాడర్న్ సొసైటీ లో మందు కొట్టని వాడిని అమాయక చక్రవర్తి గా చూస్తున్నారు.
దీంతో కావాలని ఈ అలవాటు చేసుకొనే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది.
వాస్తవానికి
మద్యపానం వలన అనేక రోగాలు ప్రబలుతున్నాయి. ముఖ్యంగా కాలేయ సమస్యల్లో అనేక
ఇబ్బందులకు మద్యం తాగటం కారణంగా నిలుస్తోంది. కాలేయంలో ఈ ఆల్కహాల్ చేసే డ్యామేజ్
అంతా ఇంతా కాదు. ఆల్కహాల్ కడుపులో చేరాక విష
పదార్థాలుగా మారుతుంది. ఈ విష పదార్థాలు కాలేయంలో మకాం చేసి అక్కడ ఉండే సజీవ
కణజాలాన్ని తినేసి సిర్రోసిస్, కొన్ని సార్లు క్యాన్సర్ కు దారి తీస్తున్నాయి.
అందుచేత శనివారం
అనగానే ఎక్కడ పార్టీ ఉందో వెదక్కొని, అక్కడకు వెళ్లిపోయి మరీ మందు కొట్టే అలవాటు
ఉంటే దాన్ని వదిలించుకోవటం మేలు. కొంత వరకు ఆల్కహాల్ తాగినా పర్వాలేదు అని చెబుతున్నారు
కానీ ఇది ఎంత వరకు ఫర్వాలేదు అన్న దానిపై స్పష్టత లేదు. అందుచేత సాధ్యమైనంత వరకు ఈ
అలవాటుని వదిలేసుకోవటం మేలు. ఇప్పటిదాకా ఆల్కహాల్ ముట్టని గుడ్ బాయ్స్ అయితే అదే
గుడ్ బాయ్స్ గా కంటిన్యూ అయిపోండి.
No comments:
Post a Comment