...

SPECIALIZED SITE FOR HUMAN HEALTH CARE,
SPECIALLY ON GASTROENTEROLOGY, LIVER AND PANCREAS

తెగ కొనేసే అల‌వాటుందా..! జ‌ర భ‌ద్రం

కొన‌టం అనే అల‌వాటుతో ఒక చిక్కు ఉంది. దీనికి అల‌వాటు ప‌డితే అంత త్వర‌గా వ‌దులుకోలేరు. మిగిలిన విష‌యాల్ని ప‌క్కన పెడితే, మందుల విష‌యంలో మాత్రం దీని గురించి ప‌ట్టించుకోవాలి.

కొంత మంది అనారోగ్యాన్ని పెద్దగా పట్టించుకోరు. ఎటువంటి స‌మ‌స్య వ‌చ్చినా మందుల షాపు మీద పూర్తిగా ఆధార ప‌డ‌తారు. ఎంత పెద్ద సమ‌స్యకు అయినా మందుల షాపు కి వెళ్లి తోచిన మందులు తెచ్చుకొని వాడేస్తుంటారు. మాములు త‌ల‌నొప్పి , సాధార‌ణ జ్వరాల విష‌యంలో అయితే ఇటువంటి అల‌వాటు ఓకే. కానీ, అన్ని స‌మ‌స్యల‌కు ఇదే రూట్ లో వెళ్లటం అంత క‌రెక్ట్ కాదు. దీని వ‌ల‌న రెండు ర‌కాల స‌మ‌స్యలు ఉన్నాయి. స‌రైన చికిత్స అంద‌క పోవ‌టం కార‌ణంగా ఆ వ్యాధి ముదిరి పోవ‌చ్చు. హేండ్ మెడిసిన్స్ తో తాత్కాలికంగా త‌గ్గిన‌ట్లు అనిపించినా త‌ర్వాత కాలంలో రోగం ముదిరే చాన్సు ఉంటుంది. అప్పుడు బాగా ఇబ్బంది ప‌డాల్సి ఉంటుంది. మ‌రో వైపు ఈ టెంప‌ర‌రీ మెడిసిన్స్ ఎక్కువ తీసుకొంటే ఆ మందుల కార‌ణంగా సైడ్ ఎఫెక్ట్ లు వ‌చ్చే చాన్సు ఉంది. ఈ సైడ్ ఎఫెక్ట్ ల‌తో దీర్ఘకాలిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుచేత ఎక్కువ‌గా మందులు కొనేసే అల‌వాటుకి దూరంగా ఉంటే మేలు.

తాగునీటి విష‌యంలో గుర్తుంచుకోవాల్సిన విష‌యాలు..!

తాగునీరు చేసే మేలు అంతా ఇంతా కాదు. జ‌ర్నల్ ఆఫ్ క్లినిక‌ల్ మెట‌బాలిజ‌మ్ చేసిన ఒక అధ్యయ‌నంలో తాగునీటితో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజ‌నాలు ఉన్నాయని తేలింది. బ‌రువు త‌గ్గాల‌నుకొనే వారికి నీరు ఒక మంచి మార్గం చూపుతుంది.

 ప‌రిశుద్ధమైన నీటిని తాగితే మెట‌బాలిక్ రేటు 30 శాతం త‌గ్గుతుంద‌ని ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి. నీరు తీసుకొన్న అర‌గంట దాకా ఈ ప్రభావం ఉంటుంది. అంతే గాకుండా భోజ‌నం తీసుకొనేముందు కొద్దిగా నీరు తీసుకోవ‌చ్చు. మరీ ఎక్కువ తాగ‌టం మంచిది కాదు. కొద్ది గా నీరు తీసుకోవ‌టం తో జీర్ణాశ‌యంలో జీర్ణ ప్రక్రియ‌కు రంగం సిద్దం అవుతుంది. దీంతో ఆహారం చ‌క్కగా జీర్ణం అవుతుంది. అంతే కాదు ఆహారం మితి మీరి తీసుకొనే వారికి నీరు చెక్ చెబుతుంది. క‌డుపులో 50 శాతం ఘ‌న ఆహారం, 25 శాతం నీరు, 25 శాతం ఖాళీ ఉంటే జీర్ణం కావ‌టం తేలిగ్గా ఉంటుంది. అక్కడ ఆహారం చ‌క్కగా క‌ద‌లాడి పూర్తి గా శ‌క్తి శ‌రీరానికి అందుతుంది. దీంతో ఉత్సాహంగా ఉండ‌టానికి వీల‌వుతుంది.

టీ తాగితే క్యాన్సర్ వ‌స్తుందా..! కొట్టి పారేయ‌వ‌ద్దు సుమా..!

టీ తాగ‌టం అన్నది ఈ రోజుల్లో అంద‌రికీ ఉన్న అలవాటు. ఇదేమి చెడ్డ అల‌వాటు కానేకాదు. ఉద‌యం లేచిన త‌ర్వాత వేడి టీ తో గుడ్ మార్నింగ్ చెప్పుకోవ‌టం ఒక ఆహ్లాద‌క‌ర‌మైన అనుభూతి. అందుచేత రోజుకి 2,3 సార్లు టీ తాగ‌టం లో త‌ప్పేమీ లేదు. దీని వ‌ల్ల నాడీ వ్యవ‌స్థ లో చురుకుద‌నం పుడుతుంది. అందుచేత ఫ్రెష్ ఐడియాల కోసం కొంత మంది టీ ల‌ను ఆశ్రయిస్తారు. కానీ, అదే ప‌నిగా టీలు తాగ‌టం మాత్రం మంచిది కాదు. దీని వ‌ల‌న శ‌రీరం టీ కి అల‌వాటు ప‌డితే కష్టం. కొంత మంది వేళ‌కు టీ తాగ‌క‌పోతే త‌ల‌పోటు వ‌స్తుంద‌ని చెబుతారు. అంత‌కు మించి టీ లు ఎక్కువ తాగ‌టం వ‌ల‌న ఎసిడిటీ వంటి స‌మ‌స్యలు వ‌స్తాయి. కొంత‌మంది భోజ‌నం తినే స‌మ‌యంలో టీల‌ను ఎక్కువ తాగుతారు. వాస్తవానికి ఆ స‌మ‌యానికి భోజ‌నం తింటార‌న్న ఉద్దేశంలో శ‌రీరంలోని గ్రంథులు యాక్టివ్ అయిపోయి ఉంటాయి. అందుచేత ఆయా ఎంజైమ్ లు బ‌య‌ట‌కు వ‌స్తాయి. కానీ టీ ను తాగ‌టంతో ఈ ఎంజైమ్ లు, టీ తో క‌ల‌గ‌లిసి వేరే ఉత్పన్నకాలుగా మార‌తాయి.

అయితే కొంత‌మందికి వేడి వేడిగా ఉండే టీ తాగ‌టం అల‌వాటు. ఎంత వేడి టీ తాగితే అంత గొప్ప అనుకొంటారు. కానీ, ఇంత‌టి వేడి టీ తాగ‌టం వ‌ల‌న గొంతులోప‌ల‌కు దిగేట‌ప్పుడు ఆహార వాహిక లోని మ్యూక‌స్ పొర‌ల్ని ఇబ్బంది పెడ‌తాయి. దీని వ‌ల‌న అక్కడ క‌ణ జాలం ఈ వేడికి క‌రిగి పోయి ఇత‌ర ప‌దార్థాలుగా మారుతుంది. కొన్ని సార్లు ఈ అవాంచ‌నీయ ప‌దార్థం ఎక్కువ‌గా పోగుప‌డి క‌ణితిగా మారుతుంది. కొంత‌మందిలో ఈ క‌ణితి క్యాన్సర్ గా మారిన సంద‌ర్భాలు ఉన్నాయి. అందుచేతే వేడి వేడి టీలు అదే ప‌నిగా తాగ‌టం మంచిది కాదు. రోజుకి 2,3 సార్లు చ‌క్కగా టీ తాగి ఆ టేస్ట్ ను ఎంజాయ్ చేయ‌వ‌చ్చు. దీనికి మిరియాల టీ, అల్లం టీ, గ్రీన్ టీ వంటి ప్రత్యామ్నాయాలు కూడా ఉన్నాయి

అంతా హైద‌రాబాద్ చుట్టూ ... ఎందుచేత !

హైద‌రాబాద్ రాష్ట్రానికి రాజ‌ధాని. అందుచేత ఎక్కువ మందికి హైద‌రాబాద్ తో అనుబంధం ఉంటుంది. ఏ అవ‌స‌రం వ‌చ్చినా హైద‌రాబాద్ కు వ‌చ్చే అల‌వాటు ఉంటుంది. ఏ రాష్ట్రంలో అయినా ఇది స‌ర్వ సాధార‌ణం.
ముఖ్యంగా హైద‌రాబాద్ ఇప్పుడు ఆరోగ్య రాజ‌ధాని గా మారుతోంది. అన్ని స్పెష‌లైజేష‌న్ ల‌లో చ‌క్కటి చికిత్స ల‌భిస్తోంది. వ్యాధి నిర్ధార‌ణ‌కు ఆధునిక ప‌రికరాలు అందుబాటులోకి వచ్చాయి. అంత‌ర్జాతీయ స్థాయి ప‌రిశోధ‌న‌ల వివ‌రాలు అందిపుచ్చుకోగ‌లుగుతున్నారు.

 ఒక‌ప్పుడు ఇన్ని స్పెష‌లైజేష‌న్ లు ఉండేవి కావు. కిడ్నీ మార్పిడి చేస్తే అద్భుతంగా చెప్పుకొనేవారు. ఇప్పుడు కాలేయ మార్పిడి ఆప‌రేష‌న్ లు కూడా చేయ‌టం సాధ్యం అవుతోంది. కాలేయ మార్పిడి అన్నది నిపుణులైన వైద్యులు మాత్ర మే చేయ‌గ‌లుగుతారు. ముఖ్యంగా అందుకు అవ‌స‌ర‌మైన సౌక‌ర్యాలు క‌లిగిన ఆప‌రేష‌న్ థియోట‌ర్  ఉండాలి. ముఖ్యంగా చీఫ్ సర్జన్ కు స‌హ‌క‌రించే ఇత‌ర వైద్య నిపుణులు కూడా అందుబాటులో ఉండాలి. అప్పుడే కాలేయ మార్పిడి ఆప‌రేష‌న్ చేయ‌టానికి వీల‌వుతుంది. కొన్ని సంవ‌త్సరాలుగా కాలేయ‌మార్పిడి చేయించుకొంటున్న రోగులు ఇక్కడ ఎక్కువ‌గా ఉంటున్నారు. ఆప‌రేష‌న్ త‌ర్వాత స‌ర్జన్ గా వాళ్లతో మాట్లాడిన‌ప్పుడు ఇంత‌టి మెరుగైన చికిత్సలు హైద‌రాబాద్ లో ల‌భించ‌టం చాలా సంతోషంగా ఉంద‌ని చెబుతున్నారు. అందుకే ఇది ఆరోగ్య రాజ‌ధాని అనుకోవ‌టంలో త‌ప్పులేదు. ఇక్కడి వైద్యులు చికిత్స తో పాటు అభిమానాన్ని, ఆప్యాయ‌త‌ను అందిస్తార‌ని ఒక పేషంట్ అన్నప్పుడు చాలా సంతోషం క‌లిగింది. అందుకే ఎక్కడెక్కడ నుంచో రోగులు హైద‌రాబాద్ చుట్టు తిరుగుతున్నారు.

ఢిల్లీ లో ప‌ల్స్ ఏమిటి.. ఏం చేయ‌బోతున్నారు..!

ఢిల్లీ అంటే దేశానికి అంత‌టికీ రాజ‌ధాని. అక్కడ జ‌రిగే యాక్టివిటీస్ గురించి అంద‌రికీ బాగా ఆసక్తి ఉంటుంది. స‌రి క‌దా, అన్ని రాష్ట్రాల ప్రజ‌ల‌కు అనుబంధం ఉంటుంది. అందుకే ఢిల్లీ ప‌ల్స్ కు అంత‌టి ప్రాధాన్యం ఉంటుంది.
అస‌లు ప‌ల్స్ అంటే వైద్య విద్యార్థుల క‌ల‌యిక అని అర్థం. ఢిల్లీ లో ఉండే అఖిల భార‌త వైద్య విజ్ఞాన సంస్థ దీన్ని నిర్వహిస్తుంది. దేశ వ్యాప్తంగా మెడిక‌ల్ కాలేజీలు ఉన్నప్పటికీ, ఎయిమ్స్, ల‌క్నో లో ఉండే సంజ‌య్ గాంధీ పోస్టు గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ (ఎస్‌జిపిజిఐ), జిప్‌మ‌ర్ వంటి సంస్థలు చాలా ప్రతిష్టాత్మక‌మైన‌వి. అక్కడ చ‌దువుకొన్న వైద్య శాస్త్ర వేత్తల‌కు ఆయా స‌బ్జెక్టు ల్లో గట్టి ప‌ట్టు దొర‌కుతుంది. ఆయా స‌బ్జెక్టుల్లో నిష్ణాతులుగా త‌యారు చేయ‌టానికి ఈ సంస్థలు అంత‌ర్జాతీయంగా పేరు గ‌డించాయి.

 ఎస్‌జిపిజిఐ లో గ్యాస్ట్రో ఎంట‌రాల‌జిస్ట్ గా ప‌రిశోధ‌న‌లు చేసిన‌ప్పుడు వైద్య వృత్తిని త‌పస్సు లా భావించాల‌ని అర్థం అయింది. ఒక రుషి మాదిరిగా అధ్యయ‌నం చేస్తేనే వైద్య వృత్తి లో ప‌ట్టు సాధించ‌వ‌చ్చని అర్థం అయింది. అందుకే తోటి మెడికోల‌ను క‌లిసిన‌ప్పుడు వారి అధ్యయ‌న రీతులు తెలిసేవి. స‌రిగ్గా ఈ క‌ల‌యిక దిశ‌గానే ప్రతీ ఏటా  వైద్య విద్యార్థుల‌కు ఢిల్లీ లో ప‌ల్స్ పేరుతో ఒక స‌మ్మేళ‌నం నిర్వహిస్తారు. భార‌త్ నుంచే గాకుండా అనేక ద‌క్షిణాసియా దేశాల నుంచి వైద్య విద్యార్థులు, ప‌రిశోధ‌కులు ఇక్కడ‌కు హాజ‌ర‌వుతుంటారు.
ఇటు వైద్య వృత్తి లో ఉన్న వారు కూడా ఎప్పటిక‌ప్పుడు అప్ డేట్ విజ్ఞానం తెలుసుకొంటూ ఉండాలి. ప్రపంచ వ్యాప్తంగా   వైద్య రంగంలో జ‌రిగే ప‌రిశోధ‌న‌ల వివ‌రాలు ఎప్పటిక‌ప్పుడు తెలుసుకొంటూ ఉండాలి. అందుకే వృత్తి ప‌ర‌మైన స‌ద‌స్సులు జ‌రుగుతు ఉంటాయి. దేశ వ్యాప్తంగా ఉండే జీర్ణ కోశ వ్యాధుల నిపుణుల‌కు జాతీయ స‌ర్జిక‌ల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టుల అసోసియేష‌న్ ఉంది. దీనికి జాతీయ ఎగ్జిక్యూటివ్ మెంబ‌ర్ గా అనేక సెమినార్ లు నిర్వహించిన‌ప్పుడు అంత‌ర్జాతీయ ప‌రిశోధ‌న‌ల వివ‌రాలు చెప్పటానికి ప్రాధాన్యం ఇస్తుంటాను. త్రివేండ్రం, బెంగ‌ళూరు, గౌహ‌తి వంటి చోట్ల ఈ మ‌ధ్య కాలంలో అక్కడ స‌ర్జన్ ల‌కు శిక్షణ ఇచ్చిన‌ప్పుడు ఎన్నో అంశాలు ప్రస్తావ‌న‌కు వ‌చ్చాయి. ఒక‌ప్పటితో పోల్చిన‌ప్పుడు అంత‌ర్జాతీయ స్థాయిలో జీర్ణ కోశం, కాలేయం, క్లోమం వంటి అంత‌రాంగాల చికిత్సలో అద్భుత‌మైన ఫ‌లితాలు వ‌స్తున్నాయి. వీటిని తెలుసుకొని అవ‌గాహ‌న‌తో మెలిగితే దీర్ఘకాలిక రోగాలు కూడా న‌యం అవుతాయి. పెద్ద రోగం ఉంద‌ని తెలిసిన‌ప్పుడు కంగారు ప‌డ‌కుండా మెరుగైన చికిత్సలు మ‌న భార‌త్ లో, మ‌న హైద‌రాబాద్ లో అందుబాటులో ఉన్నాయని చెప్పట‌మే నా ఉద్దేశం సుమా..అంత‌కు మించి ఢిల్లీ ప‌ల్స్ గురించి నేను వివ‌రాలు అందించ‌టం లేదు.

డాష్ అంటే ఏమిటో తెలుసా..!

 వైద్య ప‌రిభాష‌లో  డాష్ అంటే వేరే అర్థం ఉంది.
డ‌యిట‌రీ అప్రోచ్ టూ స్టాప్ హైప‌ర్ టెన్షన్ (Dietary Approaches to Stop Hypertension (DASH))అన్న మాట‌. అంటే హైప‌ర్ టెన్షన్ స‌మ‌స్యను అధిగ‌మించాలంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలి అనే దానిపై అనేక అధ్యయ‌నాలు జ‌రుగుతున్నాయి. అనారోగ్యానికి దారి తీసే ఆహారాన్ని ప‌క్కన పెట్టేసి చ‌క్కటి ఆరోగ్యాన్ని పెంచే ఆహారాన్ని ప్రోత్సహించ‌టం అన్న మాట‌. ఇందులో పండ్లు, తాజా కూర‌లు, ప‌ప్పు ధాన్యాలు, గుడ్లు వంటివి ఉంటాయి. వీటిలో పొటాషియం, కాల్షియం, పీచు, ప్రోటీన్సు ఎక్కువ‌గా ఉంటాయి. అంతే గాకుండా సోడియం, చ‌క్కెర‌, కొవ్వుల శాతం త‌క్కువ‌గా ఉంటాయి. ప‌ప్పు ధాన్యాలు 7-8 మోతాదులు, కూర‌లు 4-5 మోతాదులు, పండ్ల ముక్కలు 4-5 మోతాదులు ఉంటే మేలు. తాజా ఫుడ్స్ కు ప్రాధాన్యం ఇస్తే మేలు. దీంతో పాటు సోడియం లేక సాల్ట్ ఒక టీ స్పూన్ మించ‌కుండా చూసుకోవాలి. జంక్ పుడ్‌, ఎక్కువ కొవ్వులు ఉండే ఆహారాన్ని తీసుకోవాల‌ని సూచిస్తున్నారు. అయితే ఆహారపు అల‌వాట్లను ఒక్కసారి మార్చుకోవ‌టం మంచిది కాదు. నెమ్మదిగా షెడ్యూల్ ప్రకారం మార్చుకోవ‌టం ఉత్తమం.

స‌మైక్యంగా ఉంచ‌టం సాధ్యమేనా..! లాభ న‌ష్టాలు ఏమిటి..!

క‌లిపి ఉంటే స‌మైక్యం అని, విడివిడిగా ఉంచితే ప్రత్యేకం అని సూటిగా చెప్పుకోవ‌చ్చు. అందుకే స‌మైక్యం మేలా, ప్రత్యేకం మేలా అన్న దానిపై చ‌ర్చలు జ‌రుగుతుంటాయి. ఈ రెంటిని విడ‌దీసి చూడ‌లేం. అలాగ‌ని క‌లిపేసి ఆలోచించ‌లేం. దేని ప్రత్యేక‌త దానిదే.

మ‌నం రోజు తీసుకొనే ఆహారం విష‌యంలో కూడా ఈ కోణాన్ని ఆలోచించాలి. ఆహారంలో ప్రధానంగా కార్బొహైడ్రేట్‌లు, ప్రోటీన్‌లు, కొవ్వు ప‌దార్థాలు ప్రధానంగా ఉంటాయి. వీటితో పాటు విటమిన్ లు, ల‌వ‌ణాలు, పోష‌కాలు, నీరు మొ. కూడా ఉంటాయి. ప్రధానంగా ఉండే కార్బొహైడ్రేట్‌లు, ప్రోటీన్ లు, కొవ్వులు వంటివి ఏ శాతంలో ఉండాలి అనేది నిర్ధిష్టంగా ఉంటుంది. ఉదాహ‌ర‌ణ‌కు రోజుకి 2000 క్యాల‌రీల శ‌క్తి అవ‌స‌రం అనుకొందాం. ఇందులో కార్బొహైడ్రేట్ లు-225 గ్రా.లు, ప్రోటీన్ లు - 150 గ్రా.లు, కొవ్వులు-55 గ్రా.లు తీసుకొంటే మేలుగా ఉంటుంది. అంటే కార్బొహైడ్రేట్ లు-900 క్యాల‌రీలు, ప్రోటీన్ లు - 600 క్యాల‌రీలు, కొవ్వులు- 500 క్యాల‌రీల శ‌క్తిని ఉత్పత్తి చేయాల‌న్న మాట‌. అందుచేత ఈ అంశాల‌న్నీ ఉండే మాదిరిగా స‌మ‌గ్రమైన ఆహారం తీసుకోవాలి. ఆహార సంబంధిత ప‌దార్థాల్ని స‌మైక్యంగా తీసుకోవ‌చ్చు. లేదా విడి విడిగా అయినా తీసుకోవ‌చ్చు. కానీ మొత్తం మీద స‌మ‌గ్ర ఆహారం తీసుకోవ‌ట‌మే ప్రధానం.