ఇష్ట పడి ఏ పని చేసినా ఆనందంగానే ఉంటుంది. అది కష్టపడే పని అయినప్పటికీ..! ఇదే సూత్రాన్ని ఆరోగ్యానికి వర్తింపచేయవచ్చు. అంటే శరీరం ఆరోగ్యంగా ఉంటే ఆ ఆనందమే వేరు. ఆరోగ్యంగా ఉంచుకోవటంలో శారీరక వ్యాయామం కూడా ముఖ్యమే. పూర్వ కాలంలో జీవన శైలిలోనే వ్యాయామం ఇమిడిఉండేది. దీంతో అప్పటితరం వారు నూరేళ్లు, అంతకు మించి జీవించిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పటి తరానికి 60, 70 ఏళ్లు బతకటమే గొప్పగా మారుతోంది. ఇందుకు కారణం చాలా సింపుల్.. శారీరక వ్యాయామం లేకపోవటం, మానసిక ఆందోళన పెరిగిపోవటం. ఈ రెంటిని పరిష్కరించుకొంటే ఆనందంగా కలకాలం జీవించటం సాధ్యమే.
ఆధునిక జీవన శైలిలో సీటుకి అతుక్కొని గంటల తరబడి పని చేయాల్సి వస్తోంది. దీంతో ఊబకాయం, బరువు పెరగటం అన్నది సర్వ సాధారణంగా మారిపోయింది. ఇటువంటి జీవన శైలి వల్ల అనేక అనర్థాలు ఉన్నాయి. రక్తనాళాల్లో కొవు పేరుకోవటం, గుండె సంబంధిత వ్యాదులు, కొలన్ కేన్సర్, షుగర్, బీపీ, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. వీటి ప్రభావంతో ఆయుష్సు చాలా త్వరగా కరిగిపోతుందని వేరే చెప్పనక్కర లేదు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ఐదంటే ఐదు చిన్న పాటి పరిష్కారాలు చూద్దాం..
1. ఆఫీసులో పని చేసుకొంటేనే మధ్య మధ్యలో లేచి నడవటం. లేదంటే వీలుంటే ఆఫీసుకి నడిచి వెళ్లటానికి ప్రయత్నించవచ్చు. ఉదయం, సాయంత్రం వాకింగ్ లేదా జాగింగ్ కు వెళ్లటం చాలా ఉత్తమం. ఇది సాధ్యం కాకపోతే వీధి చివర షాపుకి లేదా ఆఫీసు ఆవరణ దాటి వెళ్లటం వంటివి చేయాలి. ఇదేదో ఈసురోమని నీరసంగా కాళ్లీడ్చుకొంటూ వెళ్లకుండా చక చకా వెళ్లేందుకు ప్రయత్నించాలి.
2. ఇంటి పనిలో భాగస్వామ్యం తీసుకోవటం.. ఇంటి పనిలో చాలా వ్యాయామం ఇమిడి ఉంటుంది. ఉదయం ఇల్లు శుభ్రం చేయటం, వంట కు సిద్దం చేసుకోవటం, ఇల్లు సర్దు కోవటం, దుస్తులు రెడీ చేసుకోవటం... ఒకటేమిటి, భార్యా భర్త ఇద్దరూ కలిసి కట్టుగా పని చక్క బెట్టుకొంటే చాలా వ్యాయామం జరుగుతుంది. పైగా ఆడుతు పాడుతూ పనిచేస్తుంటే.... అన్న మాట ను రుజువు చేసుకోవచ్చు.
3. వారాంతపు శెలవుల్ని ఆరోగ్యం కోసం కేటాయించండి. ఆరోజున సైక్లింగ్ చేయటం, స్విమ్మింగ్ చేయటం వంటి పనులు పెట్టుకోవచ్చు. లేదా వారానికి రెండు రోజులు లిఫ్ట్ ఉపయోగించకుండా మెట్లదారిని ఉపయోగించుకోవచ్చు. ఇంట్లోనే స్కిప్పింగ్ చేయటం వంటివి చేయగలిగితే భేష్..!
4. ఆట పాటల్ని మించిన వ్యాయామం ఉండదు. టెన్నిస్, షటిల్, స్కిప్పింగ్ వంటి వాటిలో పార్టిసిపేట్ చేయవచ్చు. సరదాగా డాన్స్ క్లాస్ లకు అటెండ్ అయినా సరిపోతుంది.
5. ఒంటరిగా వ్యాయామం కుదరదు అనుకొంటే ఇద్దరు, ముగ్గురు కలిపి సామూహికంగా చేసుకోవచ్చు. ఆరోగ్యం మీద కలిసి వచ్చే మిత్రులతో కలిసి యాక్టివిటీస్ కలుపుకోవచ్చు. కుటుంబ సభ్యులు కలిసి వాకింగ్‌కు వెళ్లటం అన్నది ఆరోగ్యకరం.
- ఇవి కొన్ని మార్గాలు మాత్రమే. మొత్తం మీద శరీరానికి చెమట పట్లే విధంగా ఏ రూపంలో కష్టపడినా బాగుంటుంది. దీని వల్ల శరీరంలో చురుగ్గా రక్త ప్రసరణ జరిగి అన్ని అవయవాలు చైతన్య వంతం అవుతాయి. వీటి ప్రభావంతో చక చకా పనిచేయగలుగుతాం. అప్పుడు ఆనందంగా కలకాలం జీవించడం సాధ్యం అవుతుంది. శతమానం భవతి అన్న సూక్తిని నిజం చేయవచ్చు.