...

SPECIALIZED SITE FOR HUMAN HEALTH CARE,
SPECIALLY ON GASTROENTEROLOGY, LIVER AND PANCREAS

ఆడ‌వాళ్లు ఉద‌యం పూట చిరాకుగా ఉంటారా..ఎందుకు..!


ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. మ‌రి అటువంటి ఇల్లాలు ఆనందంగా ఉంటే, ఇల్లంతా ఆనందంగా ఉంటుంది. కుటుంబ స‌భ్యుల‌కు ఇల్లాలే ఆయువు ప‌ట్టు. ఆమె ప్రవ‌ర్తన, ప‌ని తీరుని బ‌ట్టి ఇల్లంతా న‌డుచుకొంటుంది. ఇది మ‌హిళ‌ల్ని పొగిడేందుకు చెప్పడం లేదు. ప్రతీ ఇంట్లో మ‌నం చూసే విష‌యాలే. అయితే, చాలా సంద‌ర్భాల్లో మ‌హిళ‌లు ఉద‌యం పూట చిరాకుగా ఉంటార‌న్న మాట వినిపిస్తోంది. ముఖ్యంగా పిల్లలు ఉన్న ఇంట్లో ఈ ప‌రిస్థితిని గ‌మ‌నించ‌వ‌చ్చు.

మ‌హిళ‌లు ఉద‌యం పూట చాలా బిజీ. నిద్ర లేవ‌గానే ఇంటి శుభ్రత‌ను ప‌ట్టించుకోవాలి. బెడ్ రూమ్ ద‌గ్గర నుంచి, వంటిల్లు, హాల్‌, పూజ గ‌ది అన్ని శుభ్రంగా ఉంచేట్లుగా చూసుకోంటారు. భ‌ర్తను, పిల్లల్ని రెడీ చేయ‌టం ఒక ప్రహ‌స‌న‌మే. బెడ్ కాఫీ లేదా టీ రెడీ చేయ‌టం, బ్రేక్ ఫాస్ట్ కు టిఫిన్ త‌యారు చేయ‌టం, ఆఫీసులు, స్కూలుకు కావ‌ల్సినివ‌న్నీ సిద్దంగా ఉంచ‌టం, ఆ త‌ర్వాత లంచ్ బాక్స్ త‌యారు చేసి కుటుంబ స‌భ్యుల్ని సాగ‌నంప‌టంతో సరిపోతుంది. అదే వ‌ర్కింగ్ వుమెన్ అయితే డ‌బుల్ ఢ‌మాకా క‌ష్టాలు ఉంటాయి. గ‌బ గ‌బా తాను కూడా రెడీ అయిపోయి, వ‌స్తువులు రెడీ చేసుకొని ఆఫీసుకు పరిగెత్తాల్సి ఉంటుంది. ఇక‌, ప‌ల్లెటూర్లో అయితే ప‌నులు మార‌తాయి త‌ప్పితే ఈ ప‌నుల‌న్నీ త‌ప్పవు.

ఇన్ని ప‌నుల మ‌ధ్య స‌తమ‌తం అవుతున్న మ‌హిళ‌లు చాలా సార్లు చికాకు ప‌డుతుంటారు. ప‌నుల్లో ఉండ‌గా అడ్డు త‌గిలితే గ‌య్ మంటారు అని మ‌హిళా ద్వేషులు అంటుంటారు.ఇటువంటి కామెంట్లు త‌ప్పు కాబ‌ట్టి చికాకు కి కార‌ణం ఏమిటో క‌నుక్కొందాం.
వాస్తవానికి మ‌నం అంద‌రూ రాత్రి 8-9 గం.ల‌కు డిన్నర్ చేస్తుంటాం. త‌ర్వాత నిద్ర పోయి ఉద‌యం నిద్ర లేచి ఉరుకులు, ప‌రుగులు జీవితం మొద‌లెడ‌తాం. మ‌హిళ‌లు అయితే ర‌న్నింగ్ రేస్‌, హై జంప్ లు, లాంగ్ జంప్ లు చేసుకొంటూ కొన్ని సార్లు భ‌ర‌త నాట్యం, క‌రాటే లు కూడా చేసేస్తారు. త‌ర్వాత కుటుంబ స‌భ్యుల్ని బ‌య‌ట‌కు పంపించాక 10-11 గంట‌ల‌కు కాస్తంత ఎంగిలి ప‌డ‌తారు. అప్పటి దాకా తిండి ఏమాత్రం తిన‌రు. ఇదే పెద్ద త‌ప్పు. అస‌లు అన‌ర్థాల‌కు ఇదే కార‌ణం. రాత్రి చేసిన భోజ‌నం లేదా ఫ‌ల‌హారం నుంచి ఉద‌యం మ‌ళ్లీ తినేదాకా దాదాపు 10-12 గంట‌లు గ్యాప్ వ‌చ్చేస్తుంది. అంటే స‌గం రోజు ఖాళీ క‌డుపుతో ఉండి, స‌గం రోజు మొత్తం తిండికి కేటాయిస్తారు. దీంతో ఉద‌యం పూట శ‌రీరానికి కావ‌ల‌సిన శ‌క్తి అంద‌టం లేదు. శ‌క్తి లేక పోవ‌టంతో మెద‌డు ప‌ని చేయ‌టంలో ఇబ్బంది ఏర్పడుతుంది. దీంతో చిరాకులు, ఒత్తిళ్లు ఉంటాయి. ఫ‌లితంగా అల‌స‌ట‌, కోపం కలుగుతుంది. దీన్ని నివారించాలంటే చిన్న పాటి జాగ్రత్త తీసుకొంటే స‌రిపోతుంది. ఉద‌యాన్నే శ‌రీరానికి కావ‌ల‌సిన గ్లూకోజ్ అందించే పాలు, బిస్కట్ తీసుకోవ‌చ్చు. లేదా పండ్ల ముక్కలు నోటిలో వేసుకొన్నా భేష్... అస‌లు ఉద‌యం కొద్ది సేప‌టి త‌ర్వాత బ్రేక్ ఫాస్ట్ చేసేస్తే అన్ని స‌మ‌స్యలు పరిష్కారం అవుతాయి. లేదంటే మ‌హిళ‌ళే కాదు, పురుషుల‌కు కూడా ఉద‌యం పూట చిరాకు త‌ప్పదు.

5 comments:

  1. చాలా సరిగా చెప్పారు!

    ReplyDelete
  2. ప‌నుల్లో ఉండ‌గా అడ్డు త‌గిలితే గ‌య్ మంటారు అని మ‌హిళా ద్వేషులు అంటుంటారు.

    ఈమాత్రానికే వారిని మహిళా ద్వేషులు అనడం భావ్యమా అండి? ఏదైతేనేనుంది. మంచి సమాచారాన్నందిచారు. ధన్యవాదాలు.

    ReplyDelete
  3. డాక్టర్ గారూ
    ఉదయాన్నే లేచి తినటం ,తింటూ నిద్రపోయే జనాలలోనూ గాస్ట్రిక్ ప్రాబ్లెమ్స్ ఎక్కువవుతున్నాయి ఇప్పుడు. కారణం ఇంకొంచెం లోతుగా పరిశీలిస్తారా ?

    ReplyDelete
  4. చక్కగా చెప్పారు. అందరకి వర్తించే విషయం. థాంక్ యు వేరి మచ్ !!

    ReplyDelete
  5. ఆడ‌వాళ్లు అంత మాదిరి క‌డుపు మాడ్చుకొని ప‌ని చేస్తున్నారు కాబ‌ట్టే మ‌గాళ్లు .. రాజ్యమేలుతున్నారు. మమ్మల్ని గుర్తించినందుకు డాక్టర్ గారికి ధ‌న్యవాదాలు.. మ‌హిళ‌లు ఎదుర్కొనే ఆరోగ్య స‌మ‌స్యల‌కు, వాళ్ల జీవ‌న అల‌వాట్లకు ఉండే సంబంధాలు, స‌మస్యల్ని వివ‌రించండి

    ReplyDelete