లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్..!.. నిజంగా చాలా అద్భుతమైన పద బంధం ఇది. జీవితాన్ని అందంగా ఆస్వాదించాలన్న ఆకాంక్షను మూడు పదాల్లో చెప్పేశారు. ఆనందంగా ఆస్వాదించాలంటే ఆరోగ్యం ఎంతో ముఖ్యం అన్న సంగతి తెలిసిందే. ఆరోగ్యాన్ని కాపాడుకోడానికి చాలా చాలా నియమాలు, నిబంధనలు పాటించాలని చాలామంది అనుకొంటారు. అంతటి హడావుడి పక్కన పెడితే చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొంటే చాలా విలువైన ప్రయోజనాలు దక్కించుకోవచ్చు.
ఆహారంలో తాగు నీరు చాలా అవసరం అని ఇది వరకే తెలుసుకొన్నాం. కానీ, సురక్షిత తాగునీరు చాలా అవసరం. అంటే చాలా ఖరీదైన ప్యూరీ ఫయిర్ల్స్ కొనుక్కొని వాటిలో నీరు పోసి తాగాలని మాత్రం అనుకోవద్దు. ఫిల్టర్ వాటర్ మాత్రమే సురక్షితం అనుకోవద్దు. వీటన్నింటి కన్నా ముఖ్యంగా నీటిని కాచి చల్లార్చి తాగితే ఎంతో మేలు. ఈ చిన్నపాటి జాగ్రత్త తీసుకొనేందుకు మన మనస్సు అంగీకరించదు.
నీటితో చాలా సూక్ష్మ జీవులు వ్యాపిస్తాయి. వీటిని వైరస్, బ్యాక్టీరియా, ప్రోటోజోవన్లు, వర్మ్ జీవులు అని వర్గీకరించవచ్చు. వీటి ద్వారా వచ్చే వ్యాధుల్ని వాటర్ బార్న్ వ్యాధులు అంటారు. ఉదాహరణకు నీటిలో సంక్రమిత వైరస్ ఉంటే హెపటైటిస్ ఎ, హెపటైటిస్ ఈ అనే రకపు కామెర్లు సోకుతాయి. డయేరియా అనే ప్రమాదకర వ్యాధి కూడా నీటి ద్వారానే సంక్రమిస్తుంది. బ్యాక్టీరియా తో టైఫాయిడ్, పారా టైఫాయిడ్, కలరా వంటి రోగాలు సోకుతాయి. ఇతర సూక్ష్మ జీవులతో అమీబియాసిస్ వంటి ఇబ్బందులు ఏర్పడుతాయి. వీటిలో కొన్ని ప్రాణాంతక వ్యాధులు కూడా..!
ఇన్ని వ్యాధులు సంక్రమించటానికి నీరే కారణం. ముఖ్యంగా ఈ వర్షాలు పడే సమయంలో తాగు నీటి పైప్ లైన్‌లు, మురుగు నీటి పైప్ లైన్ లు కలుస్తుంటాయి. మనకు తెలియకుండానే మురుగు నీరు, ఈ తాగునీటితో కలిసిపోతుంది. అటువంటప్పుడు ఫిల్టర్ లు, ప్యూరిఫయిర్లు ఎంత వరకు శుభ్రపరుస్తాయన్నది ఆయా పరికరాల నాణ్యత మీద ఆధారపడి ఉంటుంది.
అంతమాత్రాన ఈ పరికరాల్ని తప్పు పట్టడం మన ఉద్దేశం కానే కాదు. కానీ, సామాన్యులు సైతం ఈ పరికరాలు లేకపోయిన సురక్షిత తాగునీటిని తీసుకోవచ్చు అని చెప్పటమే మన ఉద్దేశం. చక్కగా కాచి చల్లార్చిన నీటిని తీసుకొంటే వాటర్ బార్న్ డిసీజ్‌లకు దూరంగా ఉండవచ్చు. కుటుంబ సభ్యులంతా ఆరోగ్యంగా ఉంటే జీవతాన్ని అందంగా ఆస్వాదించవచ్చు. అప్పుడే కదా లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్..!...!
No comments:
Post a Comment