...

SPECIALIZED SITE FOR HUMAN HEALTH CARE,
SPECIALLY ON GASTROENTEROLOGY, LIVER AND PANCREAS

రాత్రి భోజ‌నంలో చిన్న పాటి జాగ్రత్త..!


ఆహారానికి ఆరోగ్యానికి ఎంతో అవినావ భావ సంబంధం ఉంది. ఆహారం బాగుంటే ఆరోగ్యం దానంత‌ట అదే బాగుంటుంది. ముఖ్యంగా రాత్రి భోజ‌నం విష‌యంలో కొద్ది పాటి జాగ్రత్త అవ‌స‌రం. ఎందుకంటే రాత్రి ఆహారం తీసుకొన్న త‌ర్వాత జీర్ణం అయ్యేందుకు ప‌ట్టే స‌మ‌యం దృష్టి పెట్టుకోవాలి. భోజ‌నం లో గ‌ట్టి పాటి ఘ‌నాహారం ఉంటే జీర్ణం అయ్యేందుకు స‌మ‌యం తీసుకొంటుంది. చాలామంది భోజ‌నం తిన్న వెంట‌నే ప‌డుకొనే అల‌వాటు క‌లిగి ఉంటారు. ఇది స‌రి కాదు. ఎందుకంటే ఆహారం తీసుకొన్న త‌ర్వాత 3-4 గంట‌ల పాటు జీర్ణాశ‌యంలోనే ఉంటుంది. ఆ స‌మ‌యంలో ఎంజైమ్ లు స్రవించ‌టం, జీర్ణ ప్రక్రియ ఊపందుకోవ‌టం జ‌రుగుతుంది. కానీ, ఆహారం తీసుకొన్న వెంట‌నే నిద్ర లోకి జారుకొంటే ఈ ప్రక్రియ మంద‌గిస్తుంది. కొద్ది సేపు మెళ‌కువగా ఉండ‌టం ద్వారా జీర్ణ ప్రక్రియ మొద‌లై పోతుంది. ఈ స‌మ‌యంలో కొద్ది దూరం న‌డిస్తే చాలా మంచిద‌ని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కొద్ది పాటి న‌డ‌క ద్వారా జీర్ణ ప్రక్రియ చ‌క్కగా ప్రారంభం అవుతుంది. అందుచేత దీనికి త‌గిన‌ట్లుగా ఆహార వేళ‌లు ప్లాన్ చేసుకొంటే మంచిది. భోజ‌నం తీసుకొన్న త‌ర్వాత కొద్ది పాటి న‌డ‌క‌తో కాసేపు విశ్రాంతి తీసుకొని, ఆ త‌ర్వాత నిద్రకు ఉప‌క్రమించాలి. ఈ స‌మ‌యంలో వేడిగా పాలు తీసుకొనే అల‌వాటు కొంత‌మందికి ఉంటుంది. ఇది ఆమోద‌యోగ్యమే. ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తల‌తో ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌టం మంచి ల‌క్షణం.

అన్నం తిన‌టం అంద‌రికీ తెలుసు..కానీ, ఆరోగ్య క‌రంగా తిన‌టం తెలుసా..!


ఇటువంటి ప్రశ్న అడ‌గ‌టం స‌భ్యత‌గా ఉండ‌దు. ఎందుకంటే చిన్నత‌నం నుంచి అంద‌రికీ అల‌వాటైన ప‌ని గురించి ప్రశ్నించ‌టం త‌ప్పు. అయిన‌ప్పటికీ, ఆరోగ్యక‌రంగా ఆహారాన్ని తీసుకోవ‌టం అన్నది ముఖ్యం. తిన్నామంటే తిన‌టం, తిరిగామంటే తిర‌గ‌టం అన్నది స‌రైన విధానం కాదు. ఆహారం తీసుకొనేట‌ప్పుడు స‌రైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు ఇప్పుడు చూద్దాం..



1. ఆహారం తీసుకొనే ముందు ప్రశాంత‌త అవ‌స‌రం. హ‌డావుడి ప‌డ‌కుండా, నెమ్మదిగా భుజించాలి.దాదాపుగా 20 నిముషాల వ్యవ‌ధిలో ఆహారం తీసుకొంటే మంచిద‌ని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. టీవీ చూస్తూ, సీరియ‌ల్స్, సినిమా్ల్లో లీనం అయి ఆహారం తీసుకోవ‌టం స‌రికాదు. కుటుంబ స‌భ్యుల‌తో కానీ, మిత్రుల‌తో క‌లిసి కానీ ఆనంద‌క‌రంగా ఆహారం తీసుకోవటం ఉత్తమం.
2. ఆహారం తీసుకొనేముందు ఒక గుక్క నీటిని తాగాలి. త‌ర్వాత క‌నీసం రెండుసార్లు అయినా కొద్ది పాటి నీరు తాగాలి. దీని వ‌ల్ల ఆహారం చ‌క్కగా మిశ్రమం అవుతుంది.
3. ఆహారంలో ఒకే ర‌క‌మైన ఫుడ్ మంచిది కాదు. కూర‌లు, ప‌చ్చడి, సాంబారు వంటి వెరైటీలు అనుకోవ‌ద్దు. పిండిప‌దార్థాలు, మాంస‌కృత్తులు, కొవ్వులు ఉండేట్లుగా చూసుకోవాలి. విట‌మిన్స్, ల‌వ‌ణాలు, సూక్ష్మ పోష‌కాలు కూడా త‌ప్పనిసరి.
4. ఒకే ర‌కమైన ఆహారానికి అల‌వాటు ప‌డ‌కూడ‌దు. విభిన్న ర‌కాలు ఆహార ప‌దార్థాల‌తో స‌మ్మిశ్రితంగా భుజించాలి.
5. న‌చ్చిన ఆహారం విప‌రీతంగా తిన‌టం, న‌చ్చక‌పోతే దూరం పెట్టడం అంత మంచిది కాదు. ఆహారాన్ని స‌మతుల్యంగా ఉంచుకోవాలి.

6. ఆహారం లో క‌డుపు నిండ‌టం ముఖ్యం. అంటే క‌డుపులో స‌గం వ‌ర‌కు ఘ‌న ఆహారం, పావు వంతు ద్రవం ఉండాలి. మిగిలిన పావు వంతు ఖాళీగా ఉంటే చ‌క్కగా జీర్ణం అవుతుంది.
7. భోజ‌నంలో పండ్లు, కూర‌గాయ‌లు ఉంచుకొంటే బాగుంటుంది.
8. ఆహారం ఒకే సారి ఎక్కువ‌గా తీసుకోవ‌ద్దు. మితంగా నాలుగైదు విడ‌త‌లుగా తీసుకోవ‌టం మేలు.
9. భోజ‌నం త‌ర్వాత స‌రిప‌డినంత నీరు తీసుకోవాలి.
10. రాత్రి భోజ‌నం త‌ర్వాత క‌నీసం 100 నుంచి 200 అడుగులు న‌డ‌వాలి. క‌నీసం అర‌గంట వ్యవ‌ధి త‌ర్వాతే నిద్రకు ఉప‌క్రమించాలి.

లైఫ్ లో టైమ్ టేబుల్ చాలా ముఖ్యం..


చిన్నప్పుడు స్కూల్ కు వెళ్లేప్పుడు టైమ్ టేబుల్ చెక్ చేసుకోవ‌టం అంద‌రికీ గుర్తుండే ఉంటుంది. టైమ్ టేబుల్ కు అనుగుణంగా బుక్స్ స‌ర్దుకోవ‌టం, హోమ్ వ‌ర్క్ వ‌గైరా పూర్తి చేసుకోవ‌టం అప్పట్లో త‌ప్పనిస‌రి. ఇప్పుడు అదే టైమ్ టేబుల్ ను గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే మ‌న శ‌రీరంలో కూడా అంత‌ర్గత అవ‌య‌వాల‌కు ఒక టైమ్ టేబుల్ ఉంటుంది. ఆయా భాగాల‌న్నీ ఒక టైమ్ ప్రకారం ప‌ని చేస్తాయి. ముఖ్యంగా జీర్ణ వ్యవ‌స్థలో ఇది స్పష్టంగా క‌నిపిస్తుంది.
ఆహారాన్ని తిన‌టం మొద‌లు పెట్టగానే నోటిలో లాలాజ‌లం ఊరుతుంది క‌దా. అప్పటి నుంచి లోప‌ల‌కు ప్రవేశించాక‌, ఒక్కో అవ‌యవాన్ని దాటుకొని వెళ్లేప్పుడు కొన్ని జీవ ర‌సాయ‌న ప్రక్రియ‌లు జ‌రుగుతాయి. ఇవ‌న్నీ ఒక స‌మ‌యానికి జ‌రిగేట్లుగా లోప‌ల బ‌యో వాచ్ అమ‌రి ఉంటుంది. ఆ స‌మ‌యానికి ఆయా అవ‌య‌వం అల‌ర్టు గా ఉంటుంది. ఉద‌యం టిఫిన్ స‌మ‌యం, మ‌ధ్యాహ్నం భోజ‌న స‌మ‌యం, సాయంత్రం స్నాక్స్ టైమ్‌, రాత్రి మ‌ళ్లీ ఆహారం తీసుకొనే స‌మ‌యం ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఆ స‌మ‌యంలో ఆహారం ఆయా అవ‌యవంలో చేరుకొంటే చ‌క్కగా జీర్ణం అవుతుంది. దీని వ‌ల్ల ఫ‌లితం స‌క్రమంగా అందుతుంది.

ఉద్యోగం, వ్యాపారం, ఇత‌ర ప‌నుల్లో ప‌డిన వారు ఈ స‌మ‌య పాల‌న ప‌ట్టించుకోరు. ముఖ్యంగా మ‌హిళ‌లు ఇంట్లో ఒంట‌రిగా ఉన్నప్పుడు ర‌క ర‌కాల స‌మ‌యాల్లో ఆహారం తీసుకొంటారు. దీని వ‌ల్ల ఈ బ‌యో వాచ్ స‌మ‌య పాల‌న పాడ‌వుతుంది. అటువంటి స‌మ‌యాల్లో శ‌రీరంలో జీవ ర‌సాయ‌న ప్రక్రియ‌ల‌కు ఇబ్బంది ఏర్పడుతుంది. ఈ ఇబ్బంది ని త‌ప్పించుకోవాలంటే సాధ్యమైనంత వ‌ర‌కు ఒకే స‌మ‌యంలో ఆహారం తీసుకొనే అల‌వాటు చేసుకోవటం మేలు.

ఆహార‌మే మ‌హాభాగ్యం


సామెత కొద్దిగా మారిన‌ట్లు అనిపిస్తోంది క‌దా..! ఆరోగ్యమే మ‌హా భాగ్యం అంటారు క‌దా, కానీ, ఈ ట్విస్ట్ ఏమిటి అనుకొంటున్నారా.. దీనికి ఒక కార‌ణం ఉంది. ఆరోగ్యానికి మూలం ఆహారం అన్న మాట‌. క‌లుషిత ఆహారంతో దాదాపు 35 శాతం దాకా క్రిములు వ్యాపిస్తాయ‌ట‌. ఆహారం జాగ్రత్తగా తీసుకొంటే ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ముఖ్యంగా వ‌ర్షాకాలం వ‌చ్చిందంటే ఆహారపు అల‌వాట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే వానలు ప‌డినప్పుడు సూక్ష్మక్రిములు ఎక్కువ‌గా వ్యాపిస్తాయి. వీటిని గుర్తించి ఆహారంలో మ‌లిన ప‌దార్థాలు లేకుండా చూసుకోవాలి. సాధ్యమైనంత వ‌ర‌కు బ‌య‌ట ఆహారం తీసుకోకుండా ఉంటే మేలు. ఇది అన్ని వేళ‌లా సాధ్యం కాదు, కాబ‌ట్టి బ‌య‌ట ఆహారం తీసుకొనేట‌ప్పుడు న‌మ్మక‌మైన చోట మాత్రమే తీసుకోవాలి. రోడ్ వెంబ‌డి ఉండే చాట్ బండ్ల ద‌గ్గర చాట్ లాగించేసే అల‌వాటు ఉంటే కాస్తజాగ్రత్త  తీసుకోవాలి. రోడ్ వెంట ఉండే సూక్ష్మక్రిములు ఈ ఆహారాన్ని ఆశిస్తాయి. దీంతో ఇబ్బంది త‌ప్పదు. ఆహారంతో పాటు తాగునీరు కూడా ముఖ్యమే. తాగునీరు లో మురికి నీరు క‌లిసిపోతే, క్రిములు వ్యాపించ‌టం త‌థ్యం. అందుకే తాగునీరు విష‌యంలో కూడా జాగ్రత్త త‌ప్పనిస‌రి...

మీ ఆరోగ్యం మీ చేతుల్లో...!


ఆరోగ్యమే మ‌హా భాగ్యం అంటారు. అటువంటి ఆరోగ్యం మ‌న చేతుల్లోనే ఉందంటే న‌మ్మగ‌ల‌రా..! అచ్చంగా ఇది నిజం. ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌టానికి చేతులే చ‌క్కటి మార్గం. ఎందుకంటే ఆరోగ్యాన్ని కాపాడేది చేతులే. ఆహారాన్ని తీసుకోటానికి, ఇత‌రుల‌తో చేతులు క‌లుపుకోవ‌టానికి, విస‌ర్జన స‌మ‌యంలోనూ అర‌చేతులు వాడుకొంటాం. ఆహారాన్ని తీసుకొనేట‌ప్పుడు అర చేతుల‌పై ఉండే సూక్ష్మజీవులు కూడా లోప‌ల‌కు వెళ్లిపోతాయి. ఆహారం చేసే మేలు మాట దేవుడెరుగు కానీ, ఈ సూక్ష్మ జీవులు చేసే హాని మాత్రం ఎక్కువే. ఈ సూక్ష్మ జీవులు ఒక‌రి నుంచి ఒక‌రికి వేగంగా వ్యాపిస్తాయి. సెంట‌ర్ ఫ‌ర్ డీసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప‌రిశోధ‌న‌ల ప్రకారం వ్యాధికార‌క సూక్ష్మ జీవుల వ్యాప్తిని నిరోధించ‌టంలో చేతుల శుభ్రత కీల‌క పాత్ర పోషిస్తుంది. ఆట‌ల‌మ్మ, క్షయ, కామెర్లు వంటి ఎయిర్ బోర్న్ వ్యాధుల వ్యాప్తి ఇది ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల్సిన అంశం.

చేతులు శుభ్రప‌ర‌చుకోవ‌టంలో అనేక ప‌ద్దతులు ఉన్నాయి. ఇవన్నీ చాలా చాలా సాధార‌ణ‌మైన ప‌ద్దతులు. స‌బ్బుతో నీరు ఉప‌యోగించుకొని క‌డుక్కోవ‌టం ఉత్తమ‌మైన ప‌ద్దతి. చేతులకు స‌బ్బు ప‌ట్టించి 20 సెక‌న్లుఆహారం తీసుకొనేముందు, మ‌ల విస‌ర్జన త‌ర్వాత చేతుల్ని శుభ్రం చేసుకొంటే చాలా వ్యాధికార‌కాల వ్యాప్తిని నిరోధించ‌వ‌చ్చు. కొన్నిసార్లు నేరుగా వేడినీటితో చేతుల్ని క‌డుక్కోవ‌చ్చు. స‌బ్సు సాలిడి కానీ, లిక్విడ్ కానీ ఉప‌యోగించుకోవ‌చ్చు. ఇటీవ‌ల కాలంలో హ్యాండ్ వాష్ వాడకం పెరిగింది. ఇది కూడా అభిల‌ష‌ణీయ‌మే. చేతులు శుభ్రంగా నీటితో క‌డుక్కోవ‌టం ఎంత ముఖ్యమో, ఆ త‌ర్వాత చేతుల్ని తుడుచుకొని పొడిగా ఉంచుకోవ‌టం కూడా అంతే ముఖ్యం.
సాధార‌ణ పౌరుల‌కు చేతుల శుభ్రత అవ‌స‌రం. కానీ, చేత్తో లేబ‌ర్ ప‌ని చేసే కార్మిక సోద‌రులు, మెకానిక్ లు, వ‌ర్కర్లు వంటి వారికి ఇది మ‌రింత అవ‌స‌రం. అప‌రిశుభ్ర ప‌రిస్థితుల్లో పని చేసే వారంతా గుర్తుంచుకోవ‌ల‌సిన విష‌యం. ఎక్కువ మంది ఒకే కంప్యూట‌ర్ మీద ప‌నిచేసే ప‌రిస్థితి ఉంటే కీ బోర్డ్ మీద ఉండే సూక్ష్మి క్రిములు చేతి వేళ్లకు అంటుకొంటాయి. వీటి ద్వారా క్రిములు శ‌రీరంలోకి వ్యాపిస్తాయి. ఈ పరిస్థితుల దృష్ట్యా ఆఫీసులోనే లంచ్ చేసే సిబ్బంది ద‌గ్గర హ్యాండ్ వాష్ ఉంచుకోవ‌టం మేలు. హోట‌ల్స్ లో భోజ‌నానికి వెళ్లినప్పుడు అక్కడ మ‌రింత శుభ్రత పాటించాల్సి ఉంటుంది.

కాలేయ సంర‌క్షణ మీ చేతుల్లో...!


-) కాలేయ వ్యాధుల‌కు సంబంధించిన అవ‌గాహ‌న అంద‌రికీ త‌ప్పనిస‌రి. ముఖ్యంగా ప్రమాద‌క‌ర‌మైన సిర్రోసిస్
గురించి అంద‌రూ తెలుసుకోవ‌టం మేలు.
-) ఈ వ్యాధి సోకిన‌ప్పుడు కాలేయం ప‌రిణామం కుచించుకొని పోతుంది. 
-) ఇటువంటి సంద‌ర్భాల్లో కాలేయం సాధార‌ణ స్థితికి చేర‌టం సాధ్యం కాదు.
-) కాలేయ మార్పిడి మాత్ర మే దీనికి ప‌రిష్కారం. భార‌త దేశంలో కాలేయ మార్పిడి కొన్ని చోట్ల జ‌రుగుతున్న‌ప్ప‌టికీ,
సామాన్యుల‌కు అందుబాటులో లేదు. ఈ శ‌స్త్ర చికిత్సకు, మందుల‌కు చాలా ఖ‌ర్చు కావ‌ట‌మే దీనికి కార‌ణం.
-) వ్యాధి నివార‌ణ క‌న్నా వ్యాధి నిరోధ చ‌ర్యల‌పై దృష్టి పెట్టాల్సి ఉంది.
-) కొన్ని సార్లు ఈ వ్యాధి క్యాన్సర్ కు దారి తీయ‌వ‌చ్చు.
ఈ వ్యాధికి నాలుగు కార‌ణాల్ని గుర్తించ‌వ‌చ్చు.
1) మ‌ద్యపానం - మ‌ద్యం ద్వారా కాలేయం ఎక్కువ‌గా పాడ‌వుతుంది. మ‌ద్యపానాన్ని పూర్తిగా మానివేయ‌టం 
ఉత్తమ ప‌రిష్కారం. లేదంటే వారానికి 10 ఔన్సుల‌కు దీన్ని ప‌రిమితం చేయాలి. అది కూడా ఒకే సారి కాకుండా
కొద్ది కొద్దిగా అనేక  సార్లు తీసుకోవ‌చ్చు.
2) హెప‌టైటిస్ బీ వైర‌స్‌... దీన్ని హెచ్ బీ వీ అని పిలుస్తారు. ఈ వైర‌స్ వ్యాప్తి తో సిర్రోసిస్ సంక్రమిస్తుంది. చిన్నత‌నంలోనే టీకా వేయిస్తే దీన్ని నిరోధించ‌వ‌చ్చు. వ్యాధి ముదిరిన‌ప్పుడు మందుల‌తో నివారించ‌వ‌చ్చు.అర‌క్షిత ర‌క్త మార్పిడి ద్వారా కూడా వ్యాధి సోక‌వ‌చ్చు. సుర‌క్షిత ర‌క్తాన్ని మాత్రమే స్వీక‌రించ‌టం మేలు.
3) హెప‌టైటిస్ సీ వైర‌స్‌.. దీన్ని హెచ్‌సీవీ అని పిలుస్తారు. కొన్ని మందుల ద్వారా  ఈ వైర‌స్ వ్యాప్తిని నియంత్రించ వ‌చ్చు. 
బీ, సీ ర‌కం వైరస్ ల వ్యాప్తికి ర‌క్తం మార్పిడి ఒక వాహ‌కం. అందుచేత ర‌క్తం స్వీక‌రించేట‌ప్పుడు ఈ వైర‌స్ లేన‌ట్లుగా నిర్ధారించ‌వ‌చ్చు.
4) కొవ్వు కార‌కాలు.. రానున్న రెండు ద‌శాబ్దాల్లో ఇది స‌ర్వ సాధార‌ణం కానుంది. ఎంత ఆహారం తీసుకొంటున్నారు, ఎంత వ్యాయామం చేస్తున్నారు అనే దానిపై ఇది ఆధార ప‌డి ఉంటుంది. మ‌నిషి ఎత్తు కి  త‌గిన‌ట్లుగా బరువు ఉండేట్లు చూసుకోవాలి. వ్యాయామం చేయ‌టం, మ‌ద్యాపానానికి దూరంగా ఉండ‌టం ద్వారా కాలేయంలో కొవ్వు చేర‌కుండా నివారించ‌వ‌చ్చు.
ఈ విధ‌మైన జాగ్రత్తలు తీసుకోవ‌టం ద్వారా 95 శాతం కాలేయ వ్యాధుల‌ను నివారించ‌వ‌చ్చు. లేనిప‌క్షంలో కాలేయ మార్పిడి అవ‌స‌రం అవుతుంది.

స్వాగ‌తం..


అచ్చ తెలుగులో ఆరోగ్య అంశాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించ‌ట‌మే మా ఉద్దేశం. ఇందుకోసం ఈ బ్లాగ్ ను ప్రారంభించా.. బ్లాగ్ కు స్వాగ‌తం...