...

SPECIALIZED SITE FOR HUMAN HEALTH CARE,
SPECIALLY ON GASTROENTEROLOGY, LIVER AND PANCREAS

ఇప్పుడు ఉన్న ప‌రిస్థితుల్లో కాస్త వేడి త‌గ్గించండి..!

అతి వేడి ఆహారం తిన‌టం, అతి వేడి టీ తాగ‌టం, వేయించిన మాంసాహారం తీసుకోవ‌టం వంటివి త‌గ్గించుకొని దుర‌ల‌వాట్లకు దూరంగా ఉంటూ స‌మ‌తుల్య ఆహారం తీసుకొంటే జీర్ణ వ్య‌వ‌స్థ ఆరోగ్యానికి మంచిది. స‌రైన జీవ‌న శైలి లేక‌పోవ‌టం, దుర‌ల‌వాట్లు, జ‌న్యుప‌ర‌మైన మార్పులు, వంశ‌పారంప‌ర్యంగా వ‌చ్చే జ‌న్యు లోపాలు వంటి కార‌ణాల‌తో డైజ‌స్టివ్ క్యాన్స‌ర్ వంటి రోగాలు రావ‌చ్చు. దీనికి నిర్దిష్టమైన కార‌ణాన్ని చెప్పటం వీలు కాదు. ఆహారం మింగ‌టంలో ఇబ్బంది, ఏమీ తిన‌కుండానే క‌డుపు నిండుగా ఉండ‌టం, కొద్ది పాటి ఆహారం తిన్నా నొప్పి ,అజీర్తి, మ‌లంలో ర‌క్తం వంటి స‌మ‌స్యల‌తో దీన్ని అనుమానించాల్సి ఉంటుంది. అనుమానం ఏర్పడిన‌ప్పుడు ఎక్సురే, ర‌క్త ప‌రీక్షల‌తో పాటు ఎండోస్కోపీ, కొల‌నోస్కోపీ, సీటీ స్కాన్‌; ఎమ్ ఆర్ ఐ స్కాన్  వంటి ప‌రీక్షలు చేయించాల్సి ఉంటుంది.

 డైజ‌స్టివ్ క్యాన్సర్ నిర్ధార‌ణ అయితే కంగారు ప‌డాల్సిన ప‌ని లేదు సుమా..!వ్యాధి తొలిద‌శ‌లో ఎండో స్కోపీ, కొల‌నోస్కోపీ విధానాల‌తో చికిత్స చేయ‌వ‌చ్చు.  త‌ర్వాత ద‌శ‌లో ర్యాడిక‌ల్ ఆప‌రేష‌న్ చేయ‌టం ద్వారా మెరుగైన ఫ‌లితాలు పొందవ‌చ్చు.  వ్యాధి ముదిరినప్పుడు ఆప‌రేష‌న్ తో పాటు కీమో థెర‌పీ, రేడియో థెర‌పీ వంటి విధానాల‌తో నాణ్యమైన శేష జీవితాన్ని అందించ‌వచ్చు.
    ఒక‌ప్పుడు క్యాన్సర్ వ‌చ్చిందంటే మ‌ర‌ణం త‌ప్పద‌న్న భావ‌న ఉండేది.   ఆధునిక వైద్య శాస్త్ర ప‌రిశోధ‌న‌ల‌తో చికిత్స మార్గాలు అందుబాటులోకి వ‌స్తున్నాయి. ప్రతిష్టాత్మక వైద్య సంస్థల్లో ప‌రిశోధ‌న‌లు జ‌రిపిన వైద్యులు ఈ చికిత్స మార్గాల్ని అంది పుచ్చుకొని చికిత్సలు అందించ‌గ‌లుగుతున్నారు.  క్యాన్సర్ మీద అపోహ‌లు తొల‌గించుకొని అవ‌గాహ‌న తెచ్చుకొంటే నాణ్యమైన శేష జీవితం ల‌భిస్తుంది.
దుర‌ల‌వాట్ల‌కు దూరంగా ఉంటూ స‌రైన జీవ‌న విధానాల్ని , ఆహార నియ‌మాల్ని పాటిస్తే వ్యాధుల‌కు దూరంగా ఉండ‌వ‌చ్చు.

విభ‌జ‌న స‌మ‌యంలోముంద‌స్తు జాగ్ర‌త్త‌

ఏ ప‌నయినా ఒకేలా చేయ‌టానికి అల‌వాటు ప‌డి ఉంటాం. ఆహారం తీసుకొనే ట‌ప్పుడు కూడా చిన్న‌ప్ప‌టి నుంచి ఉన్న అల‌వాటునే అనుస‌రిస్తాం త‌ప్ప కొత్త‌గా ఆలోచించం.
రెండు   సార్లు ఆహారం తీసుకోవ‌టం మ‌న‌లో చాలా మందికి అల‌వాటు. ఇది స‌రైన‌దే అని అనిపిస్తుంది. ప‌నుల హ‌డావుడిలోనో, వేరే కార‌ణం తోనో ఉద‌యం పూట బ్రేక్ ఫాస్ట్ ను దూరం పెట్టేస్తుంటారు. దీంతో మ‌ధ్యాహ్నానికి ఆక‌లి పెరిగి ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకొంటారు.

ఆ త‌ర్వాత భుక్తాయసంతో వెంట‌నే విశ్రాంతి కి  ప్ర‌య‌త్నిస్తారు. రాత్రి కూడా అదే చేస్తుంటారు. సాయంత్రం ఏమీ తీసుకోకుండా ఖాళీగా ఉండి రాత్రి పూట మాత్రం ఎక్కువ‌గా లాగించేస్తారు. ఆ త‌ర్వాత వెంట‌నే నిద్ర‌కు ఉప‌క్ర‌మిస్తారు.దీంతో శ‌రీరంలో కొవ్వులు పేరుకొని పోతాయి.
ఆహారం తీసుకొనేట‌ప్పుడు విభ‌జ‌న చాలా ముఖ్యం. ఉద‌యాన్నే బ్రేక్ ఫాస్టు చేయ‌టం, త‌ర్వాత రోజూ ఒకే స‌మ‌యానికి లంచ్ తీసుకోవ‌టం మ‌రింత ముఖ్యం. సాయంత్రం స‌మ‌యంలో కొద్ది పాటి స్నాక్స్ తీసుకోవ‌టం ద్వారా నీర‌సం రాకుండా చేయ‌వ‌చ్చు. అప్పుడు సాయంత్రం తేలిక‌పాటి ఆహారాన్ని తీసుకొనేందుకు వీల‌వుతుంది. ఈ ర‌కంగా ఆహారాన్ని విభ‌జించి విడ‌త‌ల వారీగా తీసుకోవ‌టం మంచిది.

ఇప్పుడు స‌డెన్ గా వ‌చ్చి ప‌డిన‌ స‌మ‌స్య ఏమిటి..!

ఇటీవ‌ల కాలంలో కొన్ని రకాల ఆరోగ్య స‌మ‌స్య‌లు పెరుగుతున్నాయి. ప్ర‌ధానంగా పాన్ క్రియాస్ గ్రంథిలో వాపు రావ‌టం, రాళ్లు ఏర్ప‌డ‌టం వంటి స‌మ‌స్య‌ల్ని చెప్ప‌వ‌చ్చు.
వాస్త‌వానికి పాన్ క్రియాస్ అంటే  జీర్ణ వ్య‌వ‌స్థ లో ప్ర‌ధాన అనుబంధ అవ‌యవం. ఆహారాన్ని జీర్ణం చేయటానికి అవ‌స‌ర‌మైన ఎంజైమ్ ల‌తో పాటు, గ్లూకోజ్ ను క్ర‌మ‌బ‌ద్దం చేసే హార్మోన్‌లను పాన్ క్రియాస్ స్ర‌విస్తుంది.  పాన్ క్రియాస్ లో ఏర్ప‌డే ప్ర‌ధాన స‌మ‌స్యల్లో  రాళ్లు ఏర్ప‌డ‌టం ముఖ్య‌మైన‌ది. అవాంఛిత ప‌దార్థాలు పేరుకొని పోయి రాళ్లుగా ఏర్ప‌డుతాయి. దీన్ని క్రానిక్ పాన్ క్రియాటైటిస్ అంటారు.

 ఇందులో గ్రంథి కుచించుకు పోవ‌టంతో పాటు పని తీరు దెబ్బ తినే అవ‌కాశం ఉంది. మ‌ద్య‌పానం తో పాటు ఇత‌ర కార‌ణాల‌తో కానీ ఈ స్థితి త‌లెత్త‌వ‌చ్చు. క‌డుపు పై భాగంలో తీవ్ర‌మైన నొప్పి ప్ర‌ధాన ల‌క్ష‌ణం. ఈ క‌డుపు నొప్పి వెన్నుపూస‌లోకి చొచ్చుకొని పోతున్న‌ట్లు ఉంటుంది. దీంతోపాటు  వాంతులు, విరోచ‌నంలో చ‌మురు క‌నిపిస్తుంటుంది. కొన్ని సంద‌ర్భాల్లో ర‌క్త‌పు వాంతులు, ప‌సిరిక‌లు ఏర్ప‌డుతాయి.
ఈ ల‌క్ష‌ణాల్ని గుర్తిస్తే వైద్యుల్ని సంప్ర‌దించాలి. స‌రైన రోగ నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేయిస్తే ముందుగానే చికిత్స అందించేందుకు వీల‌వుతుంది. మెడిక‌ల్‌, స‌ర్జిక‌ల్ విధానాల్లో దీనికి చికిత్స అందించేందుకు వీల‌వుతుంది.
పాన్ క్రియాస్ లో స‌మ‌స్య‌లు త‌లెత్త‌కుండా క్ర‌మ‌బ‌ద్ద‌మైన జీవ‌న శైలిని అనుస‌రించాలి.మ‌ద్య‌పానానికి దూరంగా ఉండ‌టం మేలు. ఏ మాత్రం అనుమానం క‌లిగినా వైద్యుల్ని సంప్ర‌దించి చికిత్స చేయించుకోవాలి.

క్యాన్స‌ర్ - అవ‌గాహ‌న‌

ప్ర‌తీ ఏటా ఫిబ్ర‌వ‌రి 4 న ప్ర‌పంచ క్యాన్స‌ర్ రోజు గా జ‌రుపుకొంటారు. ఈ సంద‌ర్భంగా క‌డుపు క్యాన్స‌ర్ కు సంబంధించిన కొన్ని విష‌యాలు తెలుసుకొందాం..
జీర్ణ వ్య‌వ‌స్థ లోని ప్ర‌ధాన భాగాల్లో క‌డుపు ఒక‌టి. ఇక్క‌డ ఆహారం మెత్త‌టి గుజ్జుగా మారి జీర్ణ ప్ర‌క్రియ ఊపందుకొంటుంది. ఇక్క‌డ క్యాన్స‌ర్ ఏర్ప‌డితే దాన్ని జీర్ణ కోశ క్యాన్స‌ర్ ( స్ట‌మ‌క్ క్యాన్స‌ర్ లేక గ్యాస్ట్రిక్ క్యాన్స‌ర్‌) అని పిలుస్తారు. ఇత‌ర భాగాలైన ఆహార వాహిక‌, పేగు, రెక్ట‌మ్‌, కాలేయం, క్లోమం ల‌లో కూడా క్యాన్స‌ర్ ఏర్ప‌డ‌వ‌చ్చు.
క‌డుపు క్యాన్స‌ర్ కు అనేక కార‌ణాలు క‌నిపిస్తున్నాయి. అతి వేడి ఆహారం తిన‌టం, ఉప్పు అధికంగా ఉండే స‌ముద్రపు ఆహారం తిన‌టం, వేపుళ్లు తో కూడిన మాంసాహారం తిన‌టం వంటి వాటి వ‌ల్ల ఈ క్యాన్స‌ర్  త‌లెత్తుతుంటుంది. పొగ తాగ‌టం, మ‌ద్య‌పానం వంటి అల‌వాట్లు ఉంటే ఈ వ్యాధి వ‌చ్చేచాన్సులు ఎక్కువ‌.  హెలికో బ్యాక్ట‌ర్ పైలోరి వంటి సూక్ష్మ క్రిముల ఇన్ ఫెక్ష‌న్ తో క‌డుపు చెడి క్యాన్స‌ర్ కు దారి తీయ‌వ‌చ్చు.

కుటుంబంలో ఇత‌రుల‌కు చిన్న వ‌య‌స్సులోనే క్యాన్స‌ర్ ఉన్న‌ప్పుడు కుటుంబ స‌భ్యుల‌కు వ‌చ్చేచాన్సు ఉంటుంది. పొగ తాగ‌టం, మ‌ద్య‌పానం వంటి దుర‌ల వాట్లు ఉంటే క్యాన్స‌ర్ కు దారి తీయ‌వ‌చ్చు. స్త్రీల‌తో పోలిస్తే పురుషుల‌కు ఎక్కువ అవ‌కాశం .  ఆధునిక జీవ‌న శైలితో జంక్ ఫుడ్ ఎక్కువ‌గా తింటూ వ్యాయామానికి దూరంగా ఉంటే జీర్ణ కోశ స‌మ‌స్య‌లు తలెత్తి క్యాన్స‌ర్ కు దారి తీయ‌వ‌చ్చు.
ఆహారం మింగ‌టంలో ఇబ్బంది, ఏమీ తిన‌కుండానే క‌డుపు నిండుగా ఉండ‌టం,  కొద్ది పాటి ఆహారం తిన్నా కానీ నొప్పి,  అజీర్తిగా ఉండ‌టం గ‌మ‌నించ‌వ‌చ్చు. క‌డుపులో ఎగువ భాగం, మ‌ధ్య భాగం మ‌ధ్య‌లో గ‌డ‌బిడ‌గా ఉండి అప్పుడప్పుడు నొప్పి వ‌స్తుంటుంది. మ‌లంలో ర‌క్తం ప‌డుతుంటుంది. ఇది న‌ల్ల‌గా కానీ, ఎర్ర‌గా కానీ ఉండ‌వ‌చ్చు.  చేతితో త‌డిమి చూసిన‌ప్పుడు క‌ణితులు త‌గ‌ల‌వ‌చ్చు. నీర‌సం, నిస్త్రాణ పెరిగిపోతాయి ఈ ల‌క్ష‌ణాల‌తో పాటు కొన్నిసార్లు కామెర్లు, కాలేయ‌వాహిక ఇన్ ఫెక్ష‌న్ వంటివి కలిసి క‌నిపిస్తుంటాయి.
జీర్ణ వ్య‌వ‌స్థ లో స‌మ‌స్య ఏర్ప‌డిన‌ప్పుడు ఎండో స్కోపీ ప‌రీక్ష ద్వారా నిర్ధార‌ణ చేస్తుంటారు. ఎక్సురే, ర‌క్త ప‌రీక్ష, బ‌యాప్సీ అవ‌స‌రం అవుతుంటుంది. అల్ట్రా సౌండ్ స్కానింగ్‌, సీటీ స్కాన్ ల ద్వారా క్యాన్స‌ర్ ఏ ద‌శ‌లో ఉన్న‌దీ తెలుసుకొనేందుకు వీల‌వుతుంది.
తొలి ద‌శ‌లో చికిత్స‌కు ఎండో స్కోపీ విధానాల్నిఅవ‌లంబిస్తారు. దీని ద్వారా క‌ణితిని తొల‌గించి చికిత్స చేసేందుకు వీల‌వుతుంది. వ్యాధి ముదిరితే ర్యాడిక‌ల్ ఆప‌రేష‌న్ చేయించాల్సి ఉంటుంది. త‌ర్వాత ద‌శ‌లో  కీమో థెర‌పీ, రేడియో థెర‌పీ అవ‌స‌రం అవుతుంటాయి.
స‌రైన జీవ‌న శైలిని పాటించ‌టం, పోష‌కాహారం తీసుకొంటూ వ్యాయామం చేస్తుండ‌టం మంచిది. దుర‌ల వాట్ల‌కు దూరంగా ఉంటే క్యాన్స‌ర్ కు దూరంగా ఉండ‌వ‌చ్చు. 

ఇంత జ‌రుగుతున్నా చిన్న జాగ్ర‌త్త తీసుకోలేరా..!

జాగ్ర‌త్త అనేది చిన్న ప‌ద‌మే కావ‌చ్చు కానీ జాగ్ర‌త్త‌లు పాటిస్తే జీవితంలో స‌మ‌స్య‌ల‌కు దూరంగా ఉండ‌వ‌చ్చు.
ఆరోగ్య సంబంధిత అంశాల్లో టీకాలు అనేవి ముందు జాగ్ర‌త్త‌కు నిద‌ర్శ‌నాలు. టీకాలు వేయించ‌టం విష‌యంలో చాలా మంది నిర్ల‌క్ష్యం వ‌హిస్తుంటారు. ఇది చాలా త‌ప్పు. క్ర‌మం త‌ప్పకుండా షెడ్యూల్ ప్ర‌కారం టీకాలు వేయించాలి. ముఖ్యంగా గ‌ర్భ‌వ‌తులు కొన్ని టీకాలు తీసుకోవ‌చ్చు. కొన్ని టీకాలు తీసుకోకూడ‌దు. అందుచేత గైన‌కాల‌జిస్టు ప‌ర్య‌వేక్ష‌ణ‌లో సంబంధిత టీకాలు వేయించుకోవాలి. బిడ్డ పుట్టిన త‌ర్వాత పెరిగి పెద్దయ్యే వ‌ర‌కు షెడ్యూల్ ప్ర‌కారం టీకాలు వేయించాలి. దీంతో ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉంటారు.

టీకాలు వేయించిన‌ప్పుడు సంబంధిత రోగాల‌కు సంబంధించిన అవ‌శేషాల్ని శ‌రీరంలో ప్ర‌వేశ‌పెట్ట‌డం జ‌రుగుతుంది. అప్పుడు దీనికి ప్ర‌తి క్రియ‌గా శ‌రీరం వ్యాధి నిరోధ‌క శ‌క్తిని స‌మ‌కూర్చుకోగ‌లుగుతుంది. అప్పుడు శ‌రీరం లో ఈ వ్యాధి నిరోధ‌క శ‌క్తి ఉత్తేజిత‌మై నిజ‌మైన వ్యాధుల‌కు సంబంధించిన క్రిములు ప్ర‌వేశించిన‌ప్పుడు ధీటుగా జ‌వాబివ్వ‌గ‌లుగుతుంది. ఫ‌లితంగా శ‌రీరానికి వ్యాధులు త‌ట్టుకోగ‌లిగే శ‌క్తి స‌మ‌కూరుతుంది. అందుచేత త‌ల్లిదండ్రులు బిజీ షెడ్యూల్ లో ప‌డిపోయినా పిల్ల‌ల ఆరోగ్యాన్ని మ‌రిచిపోవ‌ద్దు. పిల్ల‌ల‌కు ఇప్పించాల్సిన టీకాల్ని స‌రైన స‌మ‌యంలో ఇప్పించాలి.

ఒక్క రోజులో ఏమ‌వుతుంది..!

ఒక్క రోజు లో ఏమి మార్పు వ‌స్తుంది.. రెండు రోజుల్లో ఏమి మార్పు వ‌స్తుంది.. అని చాలామంది ఆరోగ్య అల‌వాట్ల లో నిర్ల‌క్ష్యం వ‌హిస్తుంటారు.
ఆధునిక కాలంలో చాలా అన‌ర్థాల‌కు ఆహార‌పు అల‌వాట్లే కార‌ణం అనుకోవాలి. మోడ‌ర్న్ లైఫ్ పేరుతో చాలామంది జంక్ ఫుడ్ ను ప్రిఫ‌ర్ చేస్తుంటారు. ఎప్పుడో ఒక‌ప్పుడు అయితే ఫ‌ర్వాలేదు కానీ అదే ప‌ని గా జంక్ ఫుడ్ కు అల‌వాటు ప‌డితే అన‌ర్థం త‌ప్ప‌దు. దీని కార‌ణంగా ఆయిల్ నిల్వ‌లు పేరుకొని పోతాయి. దీని కార‌ణంగా శ‌రీరంలో స‌హ‌జంగా జ‌రిగే ప్ర‌క్రియ‌ల‌కు ఆటంకం క‌లుగుతుంది.

దీనికి తోడు ఆల్క‌హాల్ తీసుకొనే అల‌వాటు పెరుగుతోంది. ఆధునిక స‌మాజంలో ఉంటున్నాము అంటే ఆల్క‌హాల్ తీసుకోవాల్సిందే అన్న ధోర‌ణి క‌నిపిస్తోంది. ఇది ఏ మాత్రం స‌రి కాదు. ఒక్క రోజులో ఏమ‌వుతుంది, ప‌ర్వాలేదు తీసుకోవ‌చ్చు. అన్న కామెంట్స్ వినిపిస్తుంటాయి. కానీ చాలాసార్లు మాత్రం ఒక్క సారి అల‌వాటు ప‌డిన త‌ర్వాత ఆ అల‌వాటు రెగ్యుల‌ర్ గా మారుతుంది. అప్పుడు ఆల్క‌హాల్ కు బానిల అయ్యే ప‌రిస్థితి క‌నిపిస్తుంది. దీంతో స‌మ‌స్య‌లు ఎక్కువ అవుతాయి.
అందుచేత మంచి అల‌వాట్లు ఎప్పటినుంచైనా మొద‌లెట్ట‌వ‌చ్చు. చెడు అల‌వాట్లు మాత్రం ఏ ఒక్క రోజు ద‌గ్గ‌ర‌కు రానీయ‌కుండా ఉండాలి.

చిన్న పిల్ల‌ల్లో ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే జాగ్ర‌త్త ప‌డండి..!

చిన్న పిల్ల‌ల్లో త‌రుచూ క‌డుపు నొప్పి అంటూ ఉంటే కాస్త ఆలోచించాల్సిందే. ముఖ్యంగా కోస్తా ప్రాంతంలో ఉండే ఉప్పు నీటి గాలి త‌గిలే స‌ముద్ర తీర ప్రాంతాల్లో ట్రాపిక‌ల్  పాన్ క్రియాటైటిస్ అనే వ్యాధిని గ‌మ‌నించ‌డం జ‌రుగుతోంది.

శ‌రీరంలో జీర్ణ క్రియ‌కు స‌హ‌క‌రించే ఎంజైమ్ ల‌ను స్ర‌వించే పాన్ క్రియాటైటిస్ లో అడ్డంకి ఏర్ప‌డితే దాన్ని పాన్ క్రియాటైటిస్ గా అభివ‌ర్ణిస్తారు. ఇది ఎక్యూట్ పాన్ క్రియాటైటిస్ అని, క్రానిక్ పాన్ క్రియాటైటిస్ అని రెండు ర‌కాలు. సాగ‌ర ప్రాంతంలో ఉండే చిన్నారుల్లో ప్ర‌త్యేక ర‌క‌మైన పాన్ క్రియాటైటిస్ బ‌య‌ట ప‌డుతుంటుంది. తీవ్ర‌మైన నొప్పి దీని ప్రాథ‌మిక ల‌క్ష‌ణం అనుకోవ‌చ్చు. దీంతో పాటు జీర్ణంలో ఇబ్బంది, విరోచ‌నంలో ఇబ్బందిని గ‌మ‌నించ‌వ‌చ్చు. వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు, పుట్టుక‌తో వ‌చ్చే లోపాలు దీనికి కార‌ణంగా చెప్ప‌వ‌చ్చు. వైద్య ప‌రీక్ష‌ల‌తో దీన్ని నిర్ధారిస్తారు. ముందుగానే దీన్ని గ‌మ‌నిస్తే చికిత్స సుల‌భం అవుతుంది. స‌ర్జిక‌ల్ విధానాల‌తో చిన్నారుల‌కు స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తే వాళ్లు పెద్ద వార‌య్యాక కూడా ఇబ్బంది లేకుండా జీవించ‌టం సాధ్యం అవుతుంది. అందుచేత ఈ ల‌క్ష‌ణాలు ఉంటే, ముఖ్యంగా కోస్తా తీర ప్రాంతంలోని చిన్నారుల్లో ఈ ల‌క్ష‌ణాలు ఉంటే ముందుగానే వైద్యుల్ని సంప్ర‌దించాలి.