...

SPECIALIZED SITE FOR HUMAN HEALTH CARE,
SPECIALLY ON GASTROENTEROLOGY, LIVER AND PANCREAS

కావ‌లిసిన వారికి కావ‌లిసినంత‌..!


శ‌రీరానికి శ‌క్తి అందాలంటే ఆహారం త‌ప్ప‌నిస‌రి. అయితే ఆహారంలో అన్ని ర‌కాల ప‌దార్థాలు త‌ప్ప‌నిస‌రిగా ఉండాలి. కానీ ద‌క్షిణ భార‌త దేశంలోని సాంప్ర‌దాయిక కుటుంబాల్లో ఉద‌యం ఇడ్లీ, దోశ మ‌ధ్యాహ్నం అన్నం, సాయంత్రం కూడా అన్నం లేదా ఇడ్లీ ల‌తో గ‌డిపేస్తుంటారు. దీంతో చాలా మందిలో ప్రోటీన్ల లోపం ఉన్న‌ట్లు చెబుతున్నారు.

శ‌రీరానికి పిండి ప‌దార్థాలు ఎంత అవ‌స‌ర‌మో, ప్రోటీన్లు కూడా అంతే అవ‌స‌రం. శ‌రీరంలో కండ‌రాల ప‌టిష్ట‌త‌కు, అవ‌య‌వ భాగాల ప‌టిష్ట‌త‌కు ప్రోటీన్లు అవ‌స‌రం అవుతాయి. శ‌రీర బ‌రువుకు త‌గిన‌ట్లుగా ప్రోటీన్లు తీసుకోవ‌టం చాలా అవ‌స‌రం. కానీ మ‌న‌లో చాలా మంది ఈ అంశాన్ని నిర్ల‌క్ష్యం చేస్తుంటారు. దీంతో కొవ్వులు పేరుకొని పోయి ఊబ‌కాయం రావ‌టం, శ‌రీర భాగాలు ప‌టిష్టంగా లేక‌పోవ‌టం సంభవిస్తుంటుంది. ఒక లెక్క ప్ర‌కారం శ‌రీరం ఎంత బ‌రువు అంటే అన్ని గ్రాముల ప్రోటీన్లు ప్ర‌తీ రోజు తీసుకోవాల‌ని చెబుతారు. అంటే ఒక వ్య‌క్తి 60 కిలోల బ‌రువు ఉంటే 60 గ్రాముల ప్రోటీన్లు, లేదంటే క‌నీసం 50 గ్రాముల ప్రోటీన్లు అయినా తీసుకోవాలి.
 మ‌నం తీసుకొనే ఆహారంలో కోడి గుడ్డు లో అత్య‌ధికంగా ప్రోటీన్లు ల‌భిస్తాయి. అందుకే ఎదిగే పిల్ల‌ల‌కు త‌ప్ప‌నిస‌రిగా గుడ్డు ఇవ్వాల‌ని చెబుతారు. పాల‌లో కూడా స‌మృద్ధిగా ప్రోటీన్లు ల‌భిస్తాయి. మాంసం, చేప‌ల్లో చిక్క‌టి ప్రోటీన్లు ఉంటాయి. వీటిని క్ర‌మం త‌ప్ప‌కుండా తీసుకొంటే ప్రోటీన్లు పుష్కలంగా దొర‌కుతాయి. శాకాహారులైతే సోయా, చిక్కుళ్లు, బీన్స్ వంటి పీచు ప‌దార్థాలు ఉండే కూర‌గాయ‌ల్ని అధికంగా తీసుకోవాలి. ప్ర‌తీ రోజు కాక‌పోయినా వారం లో వీటి సంఖ్య అధికంగా ఉండేట్లు చూసుకొంటే మంచిది. 

మ‌న జాగ్ర‌త్తే మ‌నకు శ్రీరామ ర‌క్ష‌..!


జాగ్ర‌త్త ను మించిన త‌రుణోపాయం ఎప్పుడూ ఉండ‌దు. ముఖ్యంగా సామాజిక అంశాల్లో చిన్న పాటి జాగ్ర‌త్త‌లు కూడా భ‌లే ఉప‌యోగ ప‌డ‌తాయి.
హైద‌రాబాద్‌లో ప్ర‌స్తుతం స్వైన్ ఫ్లూ గురించి చ‌ర్చ బాగా జ‌రుగుతోంది. వంద‌ల సంఖ్య‌లో కేసులు న‌మోదు కావ‌టం, వేల సంఖ్యలో అనుమానాస్ప‌ద కేసులు ఉండ‌టంతో ఇది క‌ల‌క‌లం రేపుతోంది.
స్వైన్ ఫ్లూ అనేది వైర‌స్ ద్వారా వ‌చ్చే రోగం. ఇది అంటు వ్యాధి. ప్రధానంగా పందులు సంచ‌రించే చోట‌, వాటి నుంచి మ‌నుషులు సంక్ర‌మిస్తుంది. కానీ,  స్వైన్ ఫ్లూ సోకిన రోగి ద‌గ్గినా, తుమ్మినా .. వాటి నుంచి ఈ వైర‌స్ ఇత‌రుల‌కు వ్యాపిస్తుంది. అందుచేత ఈ వైర‌స్ సోకకుండా జాగ్ర‌త్త ప‌డ‌టం మంచిది. అయితే దీని నివార‌ణ కోసం చాలా మంది ర‌క ర‌కాల మాస్క్ లు ముక్కుకు ధ‌రించి తిరిగేస్తున్నారు. నాణ్య‌త క‌లిగిన మాస్క్ లు అయితే బాగా ప‌నిచేస్తాయి. దీన్ని ఎప్ప‌టిక‌ప్పుడు మార్చేయ‌టం మేలు. లేనిపక్షంలో చేతి రుమాలును 4 మ‌డ‌త‌లుగా వేసుకొని ధ‌రించ‌వ‌చ్చు.
అంత‌కు మించి వ్య‌క్తిగ‌త ప‌రిశుభ్ర‌త పాటించ‌టం చాలా ముఖ్యం. రోజుకి నాలుగైదు సార్లు చేతిని స‌బ్బుతో క‌డుక్కోండి. వ్యాధి కార‌క ప్ర‌దేశాలు,అంద‌రు వాడే బ‌ట‌న్స్ మీద ఎక్కువ వేళ్ల‌ను ఉప‌యోగించ‌కండి. అప‌రిశుభ్ర ప్రాంతాల్లో ఆహారం తీసుకోవ‌డాన్ని సాధ్య‌మైనంత దూరం పెట్టండి. సామాజిక శుభ్ర‌త, ప‌రిస‌రాల ప‌రిశుభ్ర‌త‌కు ప్రాధాన్యం ఇవ్వండి.
స్వైన్ ఫ్లూ కు ప్ర‌స్తుతం టీకాలు దొర‌కుతున్నాయి. ఇది అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన వ్యాధి మాత్రం కాదు. అవ‌గాహ‌న క‌లిగి ఉండే స‌రిపోతుంది.

ఈ రోజు ప్రాధాన్యం మీకు తెలుసు క‌దా..!

ఏ అంశం మీద‌నైనా అవ‌గాహ‌న పెంచుకోవ‌టం చాలా అవ‌స‌రం. ఆరోగ్య విష‌యాల్లో ఇది చాలా వాస్త‌వం. అందుకే అవ‌గాహ‌న కోసం ఇటువంటి ఆర్టిక‌ల్స్ ఎక్కువ‌గా రాయ‌టం జ‌రుగుతోంది.
ఫిబ్ర‌వ‌రి 4 న ప్ర‌పంచ క్యాన్స‌ర్ అవ‌గాహ‌న రోజుగా పాటిస్తున్నాం. ఆక‌స్మిక మ‌ర‌ణాల‌కు దారి తీస్తున్న క్యాన్స‌ర్ నుంచి మాన‌వాళిని సంర‌క్షించేందుకు, క్యాన్స‌ర్ ముప్పును సాధ్య‌మైనంత త‌గ్గించేందుకు చేస్తున్న కృషిలో భాగంగా దీన్ని పాటించ‌టం జ‌రుగుతోంది. దీన్ని మొద‌ట‌గా యూనియ‌న్ ఫ‌ర్ ఇంట‌ర్నేష‌న‌ల్ క్యాన్స‌ర్ కంట్రోల్ సంస్థ దీనికి నాంది ప‌లికింది. 2008 లో దీనికి పూర్తి స్థాయిలో సాధికార‌త ఏర్ప‌డింది. అప్ప‌టి నుంచి క్యాన్స‌ర్ అవ‌గాహ‌న రోజును పాటించ‌టం జ‌రుగుతోంది. 2020 నాటిక‌ల్లా సాధ్య‌మైనంత వ‌ర‌కు క్యాన్స‌ర్ మ‌ర‌ణాలు, క్యాన్స‌ర్ ప్రాణాంత‌క ప‌రిస్థితుల్ని త‌గ్గించే ల‌క్ష్యంతో దీన్ని పాటిస్తున్నారు.

క్యాన్స‌ర్ అంటే శ‌రీరంలోని ఏదైనా భాగంలో పెరిగిపోతున్న అవాంఛిత క‌ణ‌జాలం అన్న మాట‌. అంటే శ‌రీరంలో ఉండే స‌జీవ క‌ణ‌జాలాన్ని క్ర‌మంగా నాశ‌నంచేస్తూ ఆ ప్రాంతంలో ఈ క‌ణ‌జాలం తిష్ట వేస్తుంది. క్ర‌మంగా ఇది క‌ణితి గా మారి ఆ అవ‌య‌వాన్ని క‌బ‌ళించి వేస్తుంది. ఫ‌లితంగా అత్యంత ప్ర‌మాద‌కారిగా మారుతుంది. ఇది ఎముక‌లు, చ‌ర్మం, మూత్ర పిండాలు, గొంతు వంటి భాగాల‌తో పాటు జీర్ణ వ్య‌వ‌స్థ‌లోని ఆహార వాహిక‌, క‌డుపు, పేగులు, కాలేయం, క్లోమం వంటి భాగాల్లో ఏర్ప‌డుతుంటుంది.
జీర్ణ వ్య‌వ‌స్థ‌లో ఏర్ప‌డే క్యాన్స‌ర్ ల‌కు నిర్దిష్టంగా కార‌ణం చెప్ప‌లేం. దుర‌ల‌వాట్లు, ఇత‌ర వ్యాధులు ముద‌ర‌టం, జ‌న్యు ప‌రంగా లోపాలు, ఇత‌ర కార‌ణాల‌తో త‌లెత్తుతుంటుంది. దీనికి ల‌క్ష‌ణాలు కూడా ర‌క ర‌కాలుగా ఉంటాయి. ఆక‌లి లేక‌పోవ‌టం, బ‌రువు త‌గ్గ‌టం, నీర‌సం, చేతికి ఎత్తుగా త‌గ‌ల‌టం వంటి వాటితో పాటు గుర్తించాల్సిన సంకేతాలు ఉంటాయి. ఈ క్యాన్స‌ర్ ల‌ను స్కానింగ్‌,ఎక్సురే, బ‌యాప్సీవంటి ప‌రీక్ష‌ల తో గుర్తిస్తారు.
క్యాన్స‌ర్ నిర్ధార‌ణ అయితే చికిత్స వేగంగా ప్రారంభించాల్సి ఉంటుంది. జీర్ణ వ్య‌వ‌స్థ‌లోని క్యాన్స‌ర్ ల‌కు ర్యాడిక‌ల్ ఆప‌రేష‌న్ అవ‌స‌రం అవుతుంది. అంటే స్ప‌ష్టంగా క్యాన్స‌ర్ నిర్ధార‌ణ అయిన భాగాన్ని గుర్తించి అక్క‌డి క్యాన్స‌ర్ క‌ణితిని పూర్తిగా తొల‌గించాలి. ముదిరిన ద‌శ‌లో ఆప‌రేష‌న్ తో పాటు కీమో థెర‌పీ, రేడియో థెర‌పీ వంటి చికిత్స‌లు అవ‌స‌రం అవుతుంటాయి.
ఆధునిక వైద్య శాస్త్రం ద్వారా క్యాన్స‌ర్ కు మందులు ల‌భ్యం అవుతున్నాయి. ఇది ప్రాణాంత‌కం అనో, క్యాన్స‌ర్ వ‌స్తే మ‌ర‌ణం ఖాయం అనో భ‌య‌ప‌డాల్సిన ప‌ని లేదు. చాలా వ‌ర‌కు క్యాన్స‌ర్ కేసులు ఆప‌రేష‌న్ త‌ర్వాత న‌యం అవుతున్నాయి. మరీ ముదిరి పోయిన కేసు్లో కూడానాణ్య‌మైన శేష జీవితాన్ని ఇచ్చేందుకు వీల‌వుతుంది. అందుచేత క్యాన్స‌ర్ మీద అంద‌రూ అవ‌గాహ‌న పెంచుకోవ‌టం అవ‌స‌రం.

కొన్ని కొన్ని విష‌యాల్ని వ‌దిలేస్తే ప్ర‌మాదం సుమా.. ముందు జాగ్ర‌త్తే శ్రీరామ ర‌క్ష‌..!

చిన్న చిన్న విష‌యాల్ని నిర్ల‌క్ష్యం చేయటం చాలా మందికి అల‌వాటు. ఆరోగ్యం విష‌యంలో చాలా మంది ఈ పని చేస్తుంటారు. రోగ ల‌క్ష‌ణాలు బ‌య‌ట ప‌డిన‌ప్ప‌టికీ వాటికి త‌గిన వైద్యం చేయించుకోకుండా నాన్చుతుంటారు. త‌ర్వాత కాలంలో అవి పెద్ద విష‌యాలుగా మారుతుంటాయి.
మొన్నీ మధ్య‌న మా హాస్పిట‌ల్ లో ఒక కేసు తీసుకోవ‌టం జ‌రిగింది. పేషంట్ (పేరు వ‌ద్దులెండి) ఒక మ‌ధ్య వ‌య‌స్కుడు. ఆయ‌న మీదనే ఆయ‌న కుటుంబం ఆధార ప‌డి ఉంటుంది. ఆయ‌న‌కు త‌ర‌చు క‌డుపు నొప్పి వ‌స్తు ఉండేది. దానికి స్థానికంగా దొరికే మందులు వేసుకొంటూ ఉండేవాడు. అప్ప‌టిక‌ప్పుడు త‌గ్గిపోతుండ‌టంతో బండి న‌డిపించేశాడు. త‌ర్వాత కాలంలో క‌డుపు ద‌గ్గ‌ర వాపు క‌నిపించ సాగింది. ఈ లోగా కామెర్లు కూడా తోడ‌య్యాయి. అప్పుడు వైద్యుల్ని సంప్ర‌దించాడు. స్థానిక వైద్యులు దాని తీవ్ర‌త‌ను గ‌మ‌నించి నా ద‌గ్గ‌ర‌కు పంపించారు. కాలేయం లో ప‌రీక్ష‌లు చేయిస్తే క‌ణితి ఉన్న‌ట్లు తేలింది.


పై ఫోటో లో ఉన్న‌ట్లుగా కాలేయం అంటే దాదాపు 10 సెంటీ మీట‌ర్ల నిడివి ఉండి, 2 కిలోల దాకా బ‌రువు ఉండే ఒక త‌మ్మె వంటి గ్రంథి. ఇందులో క‌ణితుల్ని అప్పుడ‌ప్పుడు చూస్తుంటాం. కానీ ఈయ‌న కాలేయంలో సుమారు 5 కిలోల క‌ణితి పేరుకొని పోయింది.(దిగువ ఫోటోలో మ‌నం చూడ‌వ‌చ్చు) కాలేయంలోప‌ల పేరుకొని పోయిన క‌ణితి ప్ర‌మాద‌క‌రంగా మారిపోయింది. అక్క‌డ నుంచి దాన్ని తొల‌గించ‌క పోతే ఆయ‌న‌కు ప్ర‌మాదం ఏర్ప‌డుతుంది. అలాగ‌ని తొంద‌ర‌ప‌డి తొల‌గించే ప‌రిస్థితి కూడా కాదు. అందుకే ఆయ‌న‌కు హెప‌టెక్ట‌మీ ఆప‌రేష‌న్ చేయాల‌ని నిర్ణ‌యించాం. దాదాపు 3 గంట‌ల పాటు సంక్లిష్ట‌మైన ఆప‌రేష‌న్ చేసి క‌ణితిని తొల‌గించ‌టం జ‌రిగింది. దీంతో ఆయ‌న‌కు పెద్ద ప్ర‌మాదం త‌ప్పింది.
ఈ కేసు విష‌యంలో కూడా ముందు జాగ్ర‌త్త యొక్క ప్రాధాన్యం తెలిసి వ‌చ్చింది. క‌ణితి ప్రారంభ కాలంలోనే గ‌మ‌నించి ఉంటే ఇంత‌టి రిస్క్ తో ఆప‌రేష‌న్ చేయాల్సిన అవ‌స‌రం ఉండేది కాదు. అదే స‌మ‌యంలో కనీసం అప్పుడైనా గుర్తించాం కాబ‌ట్టి స‌రిపోయింది లేక‌పోతే చాలా చాలా ఇబ్బంది ఏర్ప‌డేది.

చిన్న చిన్న ప‌నులు మ‌రిచిపోకండి..

చిన్న ప‌నుల్ని నిర్ల‌క్ష్యం చేయ‌టం చాలా మంది పెద్ద వాళ్ల లో కూడా చూస్తుంటాం. టైమ్ స‌రిపోక, శ్ర‌ద్ధ పెట్ట‌క అలా ప‌నుల్ని వ‌దిలేస్తుంటాం. ఇటువంటి ప‌నుల్లో గోళ్ల‌ను క‌త్తిరించుకోవ‌టం, శుభ్ర ప‌ర‌చుకోవ‌టం ఒక‌టి. అందునా ఈ శీతాకాలంలో వేగంగా గోళ్లు పెరుగుతుంటాయి. పైగా వీటి మూల‌ల్లోకి నీరు మార్పిడి స‌మ‌స్య ఉంటుంది కాబ‌ట్టి తేలిగ్గా క్రిములు సెటిల్ అవుతుంటాయి కూడా. అందుకే ఈ సీజ‌న్ లోగోళ్ల సంగ‌తి త‌ప్ప‌కుండా ప‌ట్టించుకోవాలి.
గోళ్ల తో లాభం ఏమిటి అని పెద్ద గా ఆలోచించుకోనవ‌స‌రం లేదు. వేళ్ల చివ‌రి భాగాల‌కు ర‌క్ష‌ణ ఇవ్వ‌ట‌మే వీటి ప‌ని. మ‌హా అయితే చిన్న చిన్న వాటిని ప‌ట్టుకోవ‌టానికి కాస్త స‌హ‌క‌రిస్తాయి. అంతే క‌దా అని వ‌దిలేస్తే మాత్రం చికాకు త‌ప్ప‌దు. ఎందుకంటే వీటి మూల‌ల్లో క్రిములు మ‌కాం పెట్ట‌డానికి చాలా అవ‌కాశం ఉంటుంది. అందుక‌ని ఎప్ప‌టిక‌ప్పుడు గోళ్ల ను క‌త్తిరించుకొంటే ప‌ఱ్వాలేదు. లేదంటే అన‌వ‌సరంగా క్రిముల్ని పెంచి పోషించి ఆ త‌ర్వాత అవి తెచ్చి పెట్టే రోగాల‌కు బ‌లి కావ‌ల‌సి ఉంటుంది.

అంతే కాకుండా చేతుల్ని శుభ్రం చేసుకొనేటప్పుడు ఈ గోళ్ల‌కు సంబంధించిన మూల‌ల్ని శుభ్రం చేసుకోవాలి. అంటే చేతికి స‌బ్బు లేక హాండ్ వాష్ ప‌ట్టించాక వాటితో గోళ్ల చివరి భాగాల్ని కూడా తోము కోవాలి. అప్పుడే అక్క‌డ క్రిములు చేర‌కుండా జాగ్ర‌త్త ప‌డ‌వ‌చ్చు. అందుచేత గోళ్లే కదా అని వ‌దిలేయ‌కండి. చిన్న చిన్న ప‌నుల‌తో పెద్ద పెద్ద తంటాలు కొని తెచ్చుకోవ‌ద్దు.
చిన్న పిల్ల‌ల్లో (కొంద‌రు పెద్ద‌ల్లో సైతం) గోళ్ల‌ను కొరికే అల‌వాటు ఉంటుంది. దీన్ని మానిపించ‌టం త‌ప్ప‌నిస‌రి. ఎందుకంటే గోళ్ల‌ను బ‌య‌ట ఉండే ఎముక బాగాలుగా చెప్ప‌వ‌చ్చు. వీటిని ఆశ్ర‌యించుకొని ఉండే ప్ర‌త్యేక ర‌క‌ములైన క్రిముల‌కు శ‌రీరంలో చోటు ఇచ్చిన‌ట్లు అవుతుంది.

అర‌చేతిలో అన్నీ ఉంటాయా..


అర చేతిలో వైకుంఠం అన్న సామెత మ‌న‌కు అంద‌రికీ తెలిసిందే. అన్నీ అయిపోయిన‌ట్లుగా మాట్లాడే మాట‌ల్ని ఈ సామెత తో పోలుస్తారు. వాస్త‌వానికి అన్ని క‌లిసి ఉంటేనే అమ‌రిక బాగుంటుంది.

రోజూ ఒకే ర‌క‌మైన ఆహారం తీసుకోవ‌టానికి మ‌నం అల‌వాటు ప‌డి ఉంటాం. ద‌క్షిణాదిన ముఖ్యంగా మ‌న తెలుగు వాళ్ల ఆహార‌పు అలవాట్ల‌ను తేలిగ్గా చెప్ప‌వ‌చ్చు. ఉద‌యం టిపిన్ గా ఇడ్లీ లేక దోశ‌, మ‌ధ్యాహ్నం భోజ‌నంగా అన్నం కొద్దిగా కూర‌లు, రాత్రి కూడా అలాగే అన్నం, కొద్దిగా కూర‌లు తీసుకొంటారు. మ‌ధ్యలో తీసుకొనే స్నాక్స్ కూడా శ‌న‌గ‌పిండితో చేసిన స్వీట్లు లేక హాట్లు లాగిస్తుంటారు. దీంతో బ‌ల‌వ‌ర్ధ‌క ఆహారం అంద‌కుండా పోతోంది. ముఖ్యంగా ఈ ర‌క‌మైన ఆహారంలో కార్బొ హైడ్రేట్‌లు, కొవ్వులు దండిగా ఉంటున్నాయి కానీ ప్రొటీన్ల శాతం త‌క్కువ‌గా ఉంటుంది. ఇక‌, విట‌మిన్‌లు, మిన‌ర‌ల్స్ గురించి చెప్ప‌నే అక్క‌ర లేదు. అందుకే ఈ అల‌వాట్ల‌ను కొద్దిగా మార్చుకొనే ప్ర‌య‌త్నం చేయండి. ఆహారంలో అన్ని ఉండేట్లు చూసుకొంటే బాగుంటుంది. ప్రోటీన్లు, విట‌మిన్ ల‌కు ప్రాధాన్యం ఇవ్వండి.

చూస్తూనే ఉండండి..కానీ కాస్త మెల‌కువ‌గా ఉండండి..


చూసేందుకు క‌ళ్లు ఉన్నాయి కాబ‌ట్టి వాటికి ప‌ని చెప్పిచూస్తూనే ఉంటాం కానీ కొన్ని సార్లు మాత్రం మెల‌కువ ఉండాలి. అంతెందుకు, టెలివిజ‌న్ చూడ‌టం అన్న‌ది అంద‌రికీ త‌ప్ప‌నిస‌రి అల‌వాటు. ఒక ఇంట్లో త‌ప్ప‌నిస‌రిగా ఉండాల్సిన జాబితాలో టెలివిజ‌న్ ఎప్పుడో చేరిపోయింది. ఇప్పుడు తాజాగా కంప్యూట‌ర్, దానికి ఇంట‌ర్ నెట్ క‌నెక్ష‌న్ తోడ‌య్యాయి. మ‌రి వీటిని చూస్తూనే మిగిలిన ప‌నులు చేసుకోవ‌టం అల‌వాటైంది.
ముఖ్యంగా పిల్ల‌లు బాగా టీవీల‌కు, కంప్యూట‌ర్ ల‌కు అల‌వాటు ప‌డుతున్నారు. పెద్ద‌ల్లో కూడా చాలామంది టీవీ చూస్తూ ప‌నులు చేసుకోవ‌టం అల‌వాటు చేసుకొంటున్నారు. దీని కార‌ణంగా లాభాలు ఎన్ని ఉన్నాయి అనే దానికి జ‌వాబు కష్టం కానీ, అనర్థాలు మాత్రం అధికంగా ఉన్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. టీవీ చూస్తూ టిఫిన్‌, భోజ‌నం చేసే అల‌వాటు చాలా మందికి ఉంది. దీంతో ఎంత వ‌డ్డించుకొంటున్నారో, ఎంత తింటున్నారో తెలియ‌టం లేదు. దీని కార‌ణంగా డైనింగ్‌టేబుల్ మీద ఎక్కువ‌గా ఉండే అన్నం, స్వీట్లు, హాట్లు, పెరుగు వంటివి లాగించేయటం జ‌రుగుతోంది. ఫ‌లితంగా శ‌రీరంలో కార్బొ హైడ్రేట్ లు, అంత‌కుమించి కొవ్వులు పేరుకొనిపోతున్నాయి. అదే స‌మ‌యంలో భోజ‌నం త‌ర్వాత కొద్ది పాటి వ్యాయామం కూడాలేకుండాకూర్చొని టీవీల‌కు అతుక్కొని పోతున్నారు. దీంతో క‌ద‌లిక పోవ‌టంతో జీర్ణ ప్ర‌క్రియ‌లో ఇబ్బందులు ఏర్ప‌డుతున్నాయి. అదే స‌మ‌యంలో కొవ్వులు ఎక్క‌డిక‌క్క‌డ పేరుకొని పోతున్నాయి. మ‌ధ్యాహ్న స‌మ‌యంలో భోజ‌నం త‌ర్వాత సోఫాలో కూల‌బ‌డి కాల‌క్షేపం చేయ‌టం, రాత్రి భోజ‌నం తర్వాత నిద్ర వ‌చ్చే వ‌ర‌కు టీవీలు, కంప్యూట‌ర్ లుచూడ‌టంతో ఒబేసిటీ స‌మ‌స్య కూడా వ‌చ్చి ప‌డుతోంది.

ఈ అల‌వాట్ల‌ను ఎంత త్వ‌రగా వ‌దిలించుకొంటే అంత మంచిది. టీవీ చూడ‌టం త‌ప్ప‌నిస‌రి అయితే భోజ‌నం ముందే వ‌డ్డించుకోండి. ఆహారం తీసుకొన్న త‌ర్వాత త‌ప్ప‌నిస‌రిగా కొద్ది దూరం అయినా న‌డ‌వ‌టం లేదా క‌ద‌ల‌టం చేయాలి. దీంతో ఆహారం స‌రిగ్గా వంట ప‌డుతుంది. ఎక్కువ‌గా కొవ్వులు, పిండి ప‌దార్థాల జోలికి పోకుండా ఉండ‌గలుగుతారు. అదేస‌మ‌యంలో కూర‌గాయ‌లు, పండ్ల శాతం పెంచండి. మంచి ఆహారం వంట బడుతుంది.