...

SPECIALIZED SITE FOR HUMAN HEALTH CARE,
SPECIALLY ON GASTROENTEROLOGY, LIVER AND PANCREAS

బయటి తిళ్లతో జాగ్రత్త..!

బయటకు వెళ్లినప్పుడు, ప్రయాణాల్లో టైం పాస్ కోసం బయటి తిళ్లు తినడం మనలో చాలా మందికి ఉండే అలవాటు. అయితే మనం తీసుకునే ఆహారపదార్ధాలు శుభ్రంగా ఉన్నాయో.. లేదో చూసుకోకపోతే అవి గ్యాస్ట్రైటిస్ కు దారితీస్తాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. 
1. సాధారణంగా రైలు, బస్సు ప్రయాణాల సమయంలో బయటి ఆహారపానీయాలు తీసుకుంటాం. వీటిలో చాలావరకు అపరిశుభ్రమైన వాతావరణంలో తయారుచేయబడతాయి. 
2. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు వెళ్లినప్పుడు విందు భోజనంలో కూడా ఆహారం, పానీయాలు తినడం, తాగడం తప్పనిసరి. ఇక్కడ ఆహారం కూడా ఎంతో కొంత కలుషితం అయ్యే అవకాశం ఉంటుంది. 
3. హోటళ్లలో, హాస్టళ్లలో, మిర్చిబళ్ల దగ్గర తినే ఆహారం ఎక్కువశాతం కలుషితమై ఉంటుంది. ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల కూడా గ్యాస్ట్రైటిస్ రావచ్చు. 
4. ఇంట్లో తాగే నీరు కూడా పంచాయతీ, మున్సిపాలిటీ సప్లై చేసే నీళ్లు ఎంతవరకు శుభ్రంగా ఉంటుందో చెప్పడం కష్టమే. కలుషిత నీరు తాగినా గ్యాస్ట్రైటిస్ వచ్చే ఛాన్సుంది.  
5. గోళ్లల్లో ఉండే మట్టి కూడా తినే ఆహారం ద్వారా పేగుల్లోకి చేరి రోగాలకు దారితీస్తుంది.

వామ్మో కడుపునొప్పి..!

కడుపునొప్పి రాని మనిషంటూ ఉండడు. ఆమాటకొస్తే కడుపులోకి ఆహారం తీసుకునే సమస్త జంతువులు కడుపునొప్పికి మినహాయింపు కాదు. పేగుల లోపల అలజడి కలిగినప్పుడు కడుపు తరుక్కుపోయినట్లు అనిపిస్తుంది. పేగుకు సంబంధించిన వ్యాధులతో పాటు లివర్ మరియి స్ప్లీన్ వ్యాధులు, పాంక్రియాజ్, మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులు , గుండెకు సంబంధించిన వ్యాధులు కూడా పేగుల్లో అలజడికి కారణమౌతాయి.
      తరచూ ఆకలి మందగించడం, వాంతి, వికారం, కడుపులో బరువుగా ఉండటం, కడుపు నొప్పిగా ఉండం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తుంటే.. గ్యాస్ట్రయిటిస్ ఉందేమో పరీక్ష చేయించుకోవడం ఉత్తమం. వాంతి అయినప్పుడు కొద్దిగా నెత్తుటి జీర కనిపించినా, నెత్తురు పడినా అది తప్పకుండా గ్యాస్ట్రయిటిస్ అయ్యే అవకాశం ఉంటుంది. పొట్టలోపల సూక్ష్మజీవుల వల్ల కలిగే ఇన్ఫెక్షన్ ఈ గ్యాస్ట్రయిటిస్ రావడానికి ప్రధాన కారణం. 

ఆరోగ్యమే మహాభాగ్యం

ప్రస్తుత ప్రపంచంలో అందరికంటే ధనవంతులు ఎక్కువగా డబ్బు సంపాదించేవారు కాదు.. అందరికంటే ఆరోగ్యంగా ఉన్నవారే. కాలుష్యం పెరిగిపోతున్న నేటిరోజుల్లో.. జీవనశైలిలో కూడా విపరీతమైన మార్పులు వస్తున్నాయి. వేగవంతమైన జీవనశైలితో ఆహారపు అలవాట్లు, నిద్ర సమయంలో కూడా తేడాలు ఉంటున్నాయి. ఈ తేడాలు ఓ పరిమితి దాటనంత వరకు ఓకే. కానీ ఏమాత్రం పరిమితి దాటినా మన అలవాట్లే రోగాలకు ఆహ్వానం పలికినట్లవుతుంది.
        ఎలాంటి జీవనశైలి ఉన్నవారికి అయినా సరిపోయే విధంగా ఆహారపు అలవాట్లను మార్చుకోవచ్చు. కానీ అవి తప్పకుండా ఆరోగ్యకరమైన అలవాట్లయి ఉండాలి. మన జీవనశైలిలో చిన్నచిన్న మార్పులు చేసుకోవడం ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఈ విషయంలో మనం డాక్టర్ల సలహాలు తప్పక పాటించాలి. ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ వహించినా.. తర్వాతి కాలంలో అదే పెద్ద జబ్బులకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి మన ఆరోగ్య పరిరక్షణ మన ఆహారపు అలవాట్లలోనే ఉందన్న సంగతి గుర్తుంచుకోవాల్సిన అసరం ఉంది. 

త‌క్కువ ఖ‌ర్చుతో అధునాత‌న వైద్యం సాధ్య‌మేనా..!


అవును.. త‌క్కువ ఖ‌ర్చుతో అధునాత‌న వైద్యం సాధ్య‌మే అని నిరూపించారు డాక్ట‌ర్ రాఘ‌వేంద్రరావు. స‌ర్వేంద్రియాణాం అవ‌యవం ప్రధానం అనుకోవ‌చ్చు. ఎందుకంటే మాన‌వ శ‌రీరంలో అన్ని అవ‌యవాల‌కు ఆయా ప్రాధాన్యత ఉంటుంది. కానీ కొన్ని అవ‌య‌వాల విష‌యంలో మాత్రం ఎక్కువ ప్రధానం అనుకోవాలి. ఎందుకంటే ఈ అవ‌య‌వాలు..త‌మ ప‌నితీరులో విఫ‌లం అయితే, లేదా చెడిపోతే..ఇత‌ర అవ‌య‌వాలు ఏమీ వాటి ప‌నులు చ‌క్కబెట్టలేవు. అటువంటి కీల‌క అవ‌య‌వాల్లో కాలేయం ఒక‌టి. జ‌న‌గామ్ కు చెందిన విజ‌య్ కుమార్ విష‌యంలో అదే జ‌రిగింది. 
 వ‌రంగ‌ల్ జిల్లా జ‌న‌గాం కు చెందిన విజ‌య్ కుమార్ కు కాలేయం చెడిపోయింది. మందులు, శ‌స్త్ర చికిత్సలు కూడా విఫ‌ల‌మైన ద‌శ కు కాలేయం చేరుకొంది. ఈ ద‌శ‌లో నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట‌రాలజీ (సాయివాణి సూప‌ర్ స్పెషాలిటీ ఆసుప‌త్రి)ని సంప్రదించ‌టం జ‌రిగింది. హాస్పిట‌ల్ లోని స‌ర్జిక‌ల్ గ్యాస్ట్రో ఎంట‌రాల‌జిస్టు అండ్ లివ‌ర్ ట్రాన్సుప్లాంట్ స‌ర్జన్ డాక్టర్ ఆర్ వీ రాఘ‌వేంద్రరావు  పేషంట్ ను ప‌రిశీలించి, కాలేయ మార్పిడి ద్వారానే ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంద‌ని నిర్ధారించారు. ద‌క్షిణ కొరియాలో కాలేయ మార్పిడిలో శిక్షణ పొంది, అనేక మందికి విజ‌య‌వంతంగా కాలేయ మార్పిడి చేసిన డాక్టర్ ఆర్ వీ రాఘ‌వేంద్రరావు ఇందుకు గ‌ల మార్గాల్ని అన్వేషించారు. 
ఈలోగా జూన్ 22న జీవ‌న్ ధాన్ ప‌థ‌కం ద్వారా విజ‌య‌వాడ‌లో ఒక యువ‌కుడు బ్రెయిన్ డెడ్ అయిన‌ట్లు స‌మాచారం అందింది. అప్పుడు డాక్టర్ రాఘ‌వేంద్ర రావు బృందం అప్పటిక‌ప్పుడు విజ‌య‌వాడ బ‌య‌లు దేరింది. అక్కడ పిన్నమ‌నేని వైద్య క‌ళాశాల ఆసుప‌త్రి లో బ్రెయిన్ డెడ్ అయిన పి. నాగ‌బాబు నుంచి కాలేయాన్ని శ‌స్త్ర చికిత్స ద్వారా వేరు చేసి, అప్పటిక‌ప్పుడు  విమానంలో   హైద‌రాబాద్‌కు తీసుకొని వ‌చ్చారు. దాన్ని 12 గంట‌ల్లోగా గ్రహీత శ‌రీరంలో అమ‌ర్చాలి. అందుకే ఆ 8-9గంట‌ల పాటు స‌ర్జరీ చేసి ఈ కాలేయాన్ని విజ‌య వంతంగా రోగి శ‌రీరంలో అమ‌ర్చటం జ‌రిగింది.
వారం రోజులు ఐసీయూలో ఉంచి అబ్జర్వ్ చేసిన త‌ర్వాత సాధార‌ణ వార్డుకి మార్చటం జ‌రిగింది. పేషంట్ పూర్తిగా కోలుకోవ‌టంతో డిశ్చార్జ్ చేయాల‌ని నిర్ణయించారు.

ఈ సంద‌ర్బంగా నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట‌రాలజీ (సాయివాణి సూప‌ర్ స్పెషాలిటీ ఆసుప‌త్రి) డైర‌క్టర్ రాఘవేంద్రరావు పాత్రికేయుల‌తో మాట్లాడుతూ.. త‌క్కువ ఖ‌ర్చుతో మెరుగైన చికిత్స అందించ‌టం ల‌క్ష్యంగా త‌మ సంస్థ ప‌నిచేస్తోందని వివ‌రించారు. అధునాతన టెక్నాల‌జీ ఉప‌యోగించి, నిపుణులైన వైద్యుల‌తో సంక్లిష్టమైన ఆప‌రేష‌న్ లు సైతం విజ‌య‌వంతంగా చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కాలేయ మార్పిడి ఆప‌రేష‌న్ కు ఇత‌ర కార్పొరేట్ సంస్థల‌తో పోలిస్తే స‌గం ధ‌ర‌కే తాము చేయ‌గ‌లిగామ‌ని వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా పేషంట్ విజ‌య్ కుమార్ మాట్లాడుతూ.. త‌మ‌కు చికిత్స అందించిన డాక్టర్ రాఘ‌వేంద్రరావు, బృందానికి కృత‌జ్ఞత‌లు తెలిపారు.

ఎండ‌లు పెరిగాయిగా .. ఈ సంగ‌తి మ‌రిచిపోకండి..!


వేస‌వి వ‌చ్చేసింది. ఎండ‌లు మండుతున్నాయి. ఎండ‌ల్లో తిర‌గ‌క త‌ప్ప‌దు క‌దా. కానీ బాగా ఎండ‌ల్లో తిరిగిన‌ప్పుడు చాలా మంది చేసే చిన్న పొర‌పాటు ఏమిటంటే.. చ‌ల్ల‌ద‌నం కోసం వెంట‌నే బాగా కూల్ గాఉండే వాట‌ర్ తాగేస్తారు. అప్పుడ‌ప్పుడ చ‌ల్ల‌టి నీరు తీసుకోవ‌టం వేరు.కానీ, బ‌య‌ట ఎండ‌లో బాగా తిరిగిన‌ప్పుడు శ‌రీరంలో ద్ర‌వ‌ణ స్థితి త‌గ్గి ఉంటుంది. అప్పుడు బాగా కూల్ వాట‌ర్ తాగితే అది మామూలు స్థితికి రావ‌టానికి బాగా స‌మ‌యం తీసుకొంటుంది. అందుకే బ‌య‌ట బాగా ఎండ‌లో తిరిగి వ‌చ్చిన‌ప్పుడు మామూలు నీరు తీసుకోవ‌టం మంచిది. నీళ్లు ఎక్కువ తాగ‌టం అన్న‌ది మంచిదే. చ‌ల్ల‌టి నీరు తీసుకోవ‌చ్చు. కానీ ఈ రెండు సూత్రాలు బాగా ఎక్కువైతే మాత్రం మంచిది కాదు. అదే ప‌నిగా నీటిని లీట‌ర్ల కొద్దీ ప‌ట్టించ‌టం కూడా మంచిది కాదు. నియ‌మితంగా కావ‌ల‌సిన నీరు తాగితే స‌రిపోతుంది. ఐస్ గ‌డ్డ‌లుఉన్న నీటిని తాగ‌టం, రోజంతా కూల్ వాట‌ర్ తాగుతూనే గ‌డ‌ప‌టం అంత మంచిది కాద‌ని గుర్తించుకోవాలి. 

క్యాన్స‌ర్ అంటే భ‌య‌మేలా..!


క్యాన్స‌ర్ అంటే చాలా మందికి భ‌యం. దీనికి మందు లేద‌ని అనుకొంటారు. కానీ ఇది అపోహ‌. క్యాన్స‌ర్ అనేది ప్ర‌మాద‌క‌రం అనటంలో సందేహం లేదు. క్యాన్స‌ర్ ముదిరిపోతే కాపాడటం క‌ష్టం అనేది అంతే వాస్త‌వం. అయితే ఆధునిక వైద్య ప‌రిశోధ‌న‌ల పుణ్య‌మా అని క్యాన్స‌ర్ పై ప‌రిశోధ‌న‌లు బాగా పెరిగాయి. దీంతో చాలా వ‌ర‌కు క్యాన్స‌ర్ కేసుల్లో చికిత్స‌లు సాధ్యం అవుతున్నాయి.

జీర్ణ వ్య‌వ‌స్థ‌లోని అనేక భాగాల్లో క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయి. ఆహార వాహిక‌, జీర్ణాశ‌యం, చిన్న పేగు, పెద్ద పేగు, రెక్ట‌మ్ ల‌తో పాటు కాలేయం, క్లోమం అనే అనుబంధ గ్రంథుల్లో క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయి. వీటిలో ప్రాథ‌మిక క్యాన్స‌ర్ అంటే అక్క‌డే పుట్టి, అక్క‌డే విస్త‌రించే క్యాన్స‌ర్ లేదా ద్వితీయ క్యాన్స‌ర్ అంటే వేరే చోట పుట్టి ఇక్క‌డ‌కు వ‌చ్చి తిష్ట వేసే క్యాన్స‌ర్ లు ఉన్నాయి. అయితే ఈ క్యాన్స‌ర్ ల‌ను ఫ‌లానా ల‌క్ష‌ణాల‌తో గుర్తించ‌టం క‌ష్టం. సాధార‌ణంగా ఉండే లక్ష‌ణాలే క‌నిపిస్తాయి. కానీ రోగ నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల‌తో గుర్తించ‌వ‌చ్చు.

అయితే క్యాన్స‌ర్ నిర్ధార‌ణ అయితే మాత్రం భ‌య ప‌డిపోవాల్సిన అవ‌స‌రం లేదు. నిపుణులైన వైద్యుల్ని సంప్ర‌దిస్తే చికిత్స అందించేందుకు వీల‌వుతుంది. ఇటీవ‌ల కాలంలో ఆధునిక ప‌రిశోధ‌న‌లు, టెక్నాల‌జీ సాయంతో మెరుగైన చికిత్స‌ను స‌మ‌ర్థ‌వంతంగా అందించేందుకు వీల‌వుతోంది. దీంతో క్యాన్స‌ర్ ను అదుపు చేయ‌టం వీల‌వుతోంది. మ‌రీ ముదిరిపోయిన కేసుల్లో నాణ్య‌మైన శేష జీవితాన్ని అందించ‌టం జ‌రుగుతోంది. 

మీ ఆరోగ్యం మీ చేతుల్లో..!

విన‌టానికి అతి శ‌యోక్తి గా ఉన్నా ఇది నిజం. ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌టం చాలా వ‌ర‌కు మ‌న చేతుల్లోనే ఉంటుంది. చిన్న పాటి విష‌యాల్లో జాగ్ర‌త్త తీసుకోవ‌టం, ఆరోగ్యం ప‌ట్ల అవ‌గాహ‌న క‌లిగి ఉండ‌టం ముఖ్యం అన్న మాట‌.
ఇవాళ వ‌ర‌ల్డ్ హెల్త్ డే. ఈ సంద‌ర్భంగా ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలనుకొనే వారంద‌రికీ శుభాకాంక్ష‌లు. 

ఇవాళ ఏడో తేదీ కాబ‌ట్టి ఏడు ముఖ్య విష‌యాల్ని మ‌న‌నం చేసుకొందాం.
1. చేతుల శుభ్ర‌త చాలా ముఖ్యం. ఆహారం తిన‌టం ద‌గ్గ‌ర నుంచి ర‌క ర‌కాల ప‌నుల‌కు ఉప‌యోగిస్తాం. వీటిని త‌ర‌చుగా స‌బ్బు నీటితో శుభ్రం చేసుకొంటే వేలాదిక్రిముల‌ను దూరం పెట్ట‌వ‌చ్చు. ముఖ్యంగా ఆహారం తీసుకొనే ముందు, మ‌ల మూత్ర విస‌ర్జ‌న త‌ర్వాత మ‌రిచిపోకుండా చేతుల్ని శుభ్రం చేసుకోవాలి.
2. గోళ్ల‌ను క‌త్తిరించుకోవ‌టం చాలా ముఖ్యం. లేదంటే క్రిములు అక్క‌డ స్థిర‌ప‌డి, ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి.
3. ఆహారం తీసుకొనేందుకు స‌మ‌య పాల‌న పాటించాలి. అంటే ఉద‌యం టిఫిన్ తీసుకొనేందుకు, మ‌ధ్యాహ్నం మ‌రియు రాత్రి ఆహారం తీసుకొనేందుకు ఒకే ర‌క‌మైన స‌మ‌యాన్ని అనుస‌రించాలి.
4. ఆహారం స‌మ‌తుల్యంగా ఉండేలా చూసుకోవాలి. అంటే కేవ‌లం పిండి ప‌దార్థాలు,కొవ్వులేకాకుండా ప్రోటీన్స్ మ‌రియు విట‌మిన్స్ ఉండేట్లు జాగ్ర‌త్త తీసుకోవాలి.
5. ప‌ని ఒత్తిడిలో కొంత మంది విరేచ‌నాన్ని వాయిదా వేస్తుంటారు. ఇది మంచిది కాదు, స‌కాలంలో తిన‌టం, స‌క్ర‌మంగా వ్య‌ర్థాల్ని బ‌య‌ట‌కు పంపించండం చాలా ముఖ్యం.
6. ఆహారం తిన్న త‌ర్వాత వెంట‌నే నిద్ర‌కు ఉప‌క్ర‌మించ‌టం మంచిది కాదు. తేలిక‌పాటి క‌ద‌లిక‌ల‌తో ఆహారం స‌క్ర‌మంగా జీర్ణం అవుతుంది,కొవ్వులు పేరుకోకుండా ఉంటాయి.

7. ఆహారంతో పాటు త‌గినంత ప‌రిణామంలో నీరు తాగుతూ  ఉండాలి. మిగిలిన వేళ‌ల్లో కూడా నీరు తాగ‌టం మంచిది.