...

SPECIALIZED SITE FOR HUMAN HEALTH CARE,
SPECIALLY ON GASTROENTEROLOGY, LIVER AND PANCREAS

ఎండాకాలంలో ఈ సంగ‌తి గుర్తుంచుకోండి..!

ఎండా కాలం వ‌చ్చిందంటే ఉష్ణోగ్రత‌లు పెరిగిపోతాయి. ఈ సారి సీజ‌న్ లో ఏప్రిల్ నెల‌లోనే ఎండ‌లు మండిపోతున్నాయి. ఎండ‌లు భ‌గ భ‌గ లాడిస్తుంటే బ‌య‌ట తిరిగే వారు అల్లాడిపోతున్నారు.
ఎండ‌లో తిరిగేట‌ప్పుడు ఒక చిన్న జాగ్రత్త ను మిస్ అవుతుంటాం.

కొంత‌మందికి కూల్ వాట‌ర్ తాగే అల‌వాటు ఉంటుంది. ఈ అలవాటు ఉన్న వారు ఎండా కాలంలో కూల్ వాట‌ర్ మ‌రింత‌గా తాగేస్తుంటారు. బాగా ఎండ‌లో తిరిగి వ‌చ్చాక శ‌రీర భాగాల‌న్నీ వేడెక్కి ఉంటాయి. అంత మాత్రాన పూర్తిగా చ‌ల్లగా ఉండే కూల్ వాట‌ర్ తీసుకోవ‌టం స‌రికాదు. అప్పటి దాకా బాగా ఎండ‌గా ఉండ‌టంతో ఒక్క సారిగా కూల్ వాట‌ర్ లోప‌లికి వెళితే శ‌రీరం అంత త్వర‌గా ఎడ్జస్ట్ కావ‌టం క‌ష్టం అవుతుంది. అందుచేత ఒక వేళ ఎండ‌లో తిరిగి వ‌స్తే కాస్సేపు శ‌రీరం స్థిమిత ప‌డే దాకా ఉండి, ఆ త‌ర్వాత చ‌ల్లటి నీరు తీసుకోవచ్చు. బాగా చల్లగా ఉండే కూల్ వాట‌ర్ ప‌దే ప‌దే తాగ‌టం స‌రికాద‌నే చెప్పాలి. అందుచేత కూల్ వాట‌ర్ తీసుకొనేట‌ప్పుడు కాస్త జాగ్రత్త తీసుకోవాలి.
వాస్తవానికి మాన‌వుల్లో ఉష్ణోగ్రత‌లు ఎక్కువ‌గా ఉన్నప్పుడు స‌ర్దుబాటు వ్యవ‌స్థ శ‌రీరంలోప‌లే ఉంటుంది. బ‌య‌ట ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు లోప‌లే దానికి త‌గిన‌ట్లుగా స‌ర్దు బాటు జ‌రిగిపోతుంది. అందుచేత‌నే ఉష్ణోగ్రత ఎంత పెరిగిపోయినా శ‌రీర ఉష్ణోగ్రత మాత్రం స్థిరంగానే ఉంటుంది. అంత మాత్రం చేత మ‌నం .. ఎంత‌టి ఎండ‌ల్లో తిరిగేసినా ఫ‌ర్వాలేదు అనుకోవ‌ద్దు సుమా..! అందుచేత సాధ్యమైనంత వ‌ర‌కు  ఎండ బారిన ప‌డ‌కుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. లేక‌పోతే మాత్రం వ‌డ‌దెబ్బ వంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ప్రయాణంలో స‌మ‌స్య ఉంటే ఇదిగో ప‌రిష్కారం..!

ప్రయాణం చేసేట‌ప్పుడు ఎటువంటి స‌మ‌స్య ఉండ‌కూడ‌ద‌ని, సాఫీగా సాగిపోవాల‌ని కోరుకొంటారు. ప్రయాణంలో ఇబ్బంది ఏర్పడితే మాత్రం చికాకు త‌ప్పదు.

కొంత‌మందిలో ప్రయాణంలో ఉన్నప్పుడు విరేచ‌నాలు ఎక్కవ అవుతుంటాయి. చాలా సార్లు ఈ విరేచ‌నాల‌కు అప‌రిశుభ్రమైన ఆహారం తిన‌టం లేదా అప‌రిశుభ్రమైన నీటిని తాగ‌టం కార‌ణం అవుతుంది. ప్రయాణంలో ఉన్నప్పుడు అన్ని వేళ‌లా శుభ్రమైన ఆహారం కానీ, శుచి అయిన నీరు కానీ దొర‌క‌దు. అందుచేత దొరికిన ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆహారంతో స‌మ‌స్యలు వ‌చ్చి ప‌డ‌తాయి. దీనికి తోడు ప్రయాణం చేసేట‌ప్పుడు, ఒత్తిడి ఎక్కువ‌గా ఉన్నప్పుడు కూడా విరేచ‌నాల స‌మ‌స్య వెంటాడుతు ఉంటుంది.
గ‌తంతో పోలిస్తే ఇప్పుడు ఈ స‌మ‌స్య కు తేలికైన ప‌రిష్కారం దొర‌కుతోంది. గ‌తంలో యాంటి బ‌యాటిక్స్, ఇత‌ర మందులు వాడాల్సి వ‌చ్చేది. ఇప్పుడు ప్రో బ‌యాటిక్స్ మందుల‌తో తేలిగ్గా ప‌రిష్కారం ల‌భిస్తోంది. ప్రయాణంలో ఉన్నప్పుడు రోజు ఒక మాత్ర వేసుకొన్నా చ‌క్కగా ప‌ని చేస్తుంది. పైగా ఇవి అన్ని మందుల షాపుల్లో దొర‌కుతున్నాయి. ముందుగానే వైద్యుడ్ని సంప్రదించి ఎటువంటి మందులు వేసుకోవాలో తెలుసుకొంటే ప్రయాణాలు సాఫీ గా చేసి రావ‌చ్చు.

అన్ని స‌మ‌స్యల‌కూ *విడ‌గొట్టడ‌మే * ప‌రిష్కార‌మా..! విడ‌గొడితే స‌మ‌స్య తీరిపోతుందా..!

స‌మ‌స్య ఏర్పడిన‌ప్పుడు అది ఎందుకు ఏర్పడింది.. ఎందు వ‌ల‌న ఈ స‌మ‌స్య పెరుగుతోంది... దీనికి మూలం ఏమిటి.. అన్నది ఆలోచించాలి.. అప్పుడు ప‌రిష్కారం సాధ్యం అవుతుంది..!

ఇటీవ‌ల కాలంలో కాలేయ క్యాన్సర్ వ్యాధి గురించి త‌ర‌చు వింటున్నాం. కాలేయానికి సోకే తీవ్రమైన వ్యాదుల్లో క్యాన్సర్ ఒక‌టి. ఒక‌ప్పుడు క్యాన్సర్ వ‌స్తే చికిత్స అసాద్యం అనుకొనే వారు. కానీ ఆధునిక ప‌రిశోధ‌న‌ల‌తో క్యాన్సర్ కు చికిత్స ల‌భిస్తోంది. ఇందులో ముఖ్యమైన‌ది రేడియో ఫ్రీక్వన్సీ అబ్లేష‌న్ (ఆర్‌.ఎఫ్‌.ఎ.). ఇందులో భాగంగా విద్యుత్ శ‌క్తి ద్వారా వేడిని ర‌గులుస్తారు. ఈ వేడి తో కాలేయంలోని క్యాన్సర్ క‌ణితిని విడ‌గొట్టడం జ‌రుగుతుంది. అక్కడ ఉన్న రోగ కార‌క క‌ణ‌జాలాన్ని విచ్చిన్నం చేసే విధాన‌మే ఈ ఆర్‌.ఎఫ్‌.ఎ. గ‌తంలో ఈ విధానంపై కొన్ని అపోహ‌లు ఉండేవి. అన్ని ర‌కాల క్యాన్సర్ ల‌కు ఈ విడ‌గొట్టే ఆర్.ఎఫ్‌.ఎ. విధాన‌మే ప‌రిష్కార‌మా.. అన్న ప్రశ్న త‌లెత్తేది. అన్నింటికీ ఇది ప‌రిష్కారం అని చెప్పలేం కానీ చాలా ర‌కాల కాలేయ క్యాన్సర్ ల‌కు ఇది స‌మ‌ర్థమైన ప‌రిష్కారం అని చెప్పుకోవ‌చ్చు. నిపుణులైన వైద్యుల ప‌ర్యవేక్షణ‌లో చేసే ఆర్‌.ఎఫ్‌.ఎ. స‌ర్జరీ తో చాలా వ‌ర‌కు సైడ్ ఎఫెక్టులు లేకుండా ప‌రిష్కారం సాధించుకోవ‌చ్చు. క్యాన్సర్ ను గుర్తించిన వెంట‌నే చికిత్స చేయించుకోవ‌టం ముఖ్యం అని గుర్తించుకోవాలి. ఒకే సారి పూర్తిగా నివార‌ణ కాక‌పోతే కొన్ని సిట్టింగ్ ల ద్వారా ప‌రిష్కారాన్ని సాధించ‌వ‌చ్చు. మ‌రికొన్ని సార్లు ఆప‌రేష‌న్ తో పాటు ఇత‌ర ర‌కాల థెరపీల‌ను వినియోగించాల్సి ఉంటుంది.

నాటు ప‌ద్దతి ఎప్పటికైనా స‌మ‌స్యే..!


ఏ విష‌యం అయినా శాస్త్రీయంగా ఆలోచిస్తే చ‌క్కటి ప‌రిష్కారం దొర‌కుతుంది. నాటు ప‌ద్దతిలో ఎదుర్కొంటే మాత్రం ఇబ్బంది త‌ప్పదు.

జీర్ణ వ్యవ‌స్థ లో ఇబ్బంది పెట్టే కామెర్లు వంటి వ్యాధుల‌కు కొంత మంది వైద్యం చేయించుకొనేందుకు ఇష్టం చూప‌రు. నాటు ప‌ద్దతిలో మూలిక‌లు, చెక్క మందును వాడేందుకు ఆస‌క్తి చూపుతారు. దీని కార‌ణంగానే కామెర్లు న‌యం అవుతాయని న‌మ్ముతారు. వాస్తవానికి కొన్ని ర‌కాల కామెర్లు వాటంత‌ట అవే త‌గ్గిపోతాయి. మందులు వాడినా, వాడ‌క‌పోయినా త‌గ్గిపోతాయి. ఇటువంట‌ప్పుడు మూలిక‌లు, చెక్క మందులు వంటివి వాడిన‌ప్పుడు స‌హ‌జంగా ఉండే శ‌రీర వ్యాధి నిరోధ‌క శ‌క్తితో నివార‌ణ అయిపోతుంది. కానీ వీటి వ‌ల‌న‌నే కామెర్లు త‌గ్గాయ‌ని భావిస్తారు. దీని గురించి ప్రచారం చేస్తుంటారు. కానీ, మిగిలిన ర‌కాల కామెర్లు సోకిన‌ప్పుడు క‌చ్చితంగా చికిత్స అవ‌స‌రం అవుతుంది. అటువంటి సంద‌ర్భాల్లో ఈ నాటు ప‌ద్దతి అవ‌లంబించ‌టం వ‌ల‌న వ్యాధి ముదిరిపోతుంది. అంతిమంగా నివార‌ణ క‌ష్టత‌రం అవుతుంది. అందుచేత కామెర్లు వ‌చ్చిన‌ప్పుడు స‌రైన వైద్యుని సంప్రదించి చికిత్స చేయించుకోవ‌టం మంచిది.

ఉగాది విశిష్టత తెలుసుకోవాల్సిందే..!

ఉగాది అన‌గానే అంద‌రికీ గుర్తుకొని వ‌చ్చేది ఉగాది ప‌చ్చడి. ఆ రోజున త‌ప్పనిస‌రిగా ప‌చ్చడి తిన‌టం తెలుగు వారి సాంప్రదాయం. దీన్నే క‌న్నడంలో బేవు బెళ్ల అని పిలుస్తారు.

ఉగాది ప‌చ్చడిలో చేదు, తీపి, కారం, పులుపు, ఉప్పు, వ‌గ‌రు అనే ఆరు ర‌కాల రుచులు ఉంటాయి. ఇందుకోసం వేప పూవు, బెల్లం, మిర్చి, ఉప్పు, చింత‌పండు, మామిడి కాయ ఉప‌యోగిస్తారు. ఈ ఆరు ర‌కాల ప‌దార్థాల్లోనూ ఔష‌ధ గుణాలు ఉన్నాయి. వీటిని త‌గినంత‌గా జోడించి త‌యారు చేసిన ప‌చ్చడి తిన‌టం ద్వారా వీటిలోని ఔష‌ధ గుణాలు శ‌రీరానికి అందుతాయి. ముఖ్యంగా చేదు, వ‌గ‌రు వంటి రుచుల్ని విడిగా తినేందుకు జ‌నం ఇష్ట ప‌డ‌రు. తీపి, కారం, ఉప్పు ఎక్కువ‌గా లాగిస్తుంటారు. వీటిని ఎక్కువ‌గా తిన‌టం తో ఎంత‌టి స‌మ‌స్యో, చేదు వ‌గ‌రు ని వ‌దిలేయటం అటువంఇ స‌మ‌స్యకు దారి తీస్తుంది. అందుచేత ఇటువంటి సంద‌ర్భాల్లో ఆయా రుచుల్ని ప‌రిచ‌యం చేసేందుకు పెద్దలు ఈ సాంప్రదాయాన్ని పెట్టినట్లు తెలుస్తోంది. అలాగ‌ని ఈ ప‌చ్చడిని విప‌రీతంగా తింటే మాత్రం చేటు త‌ప్పదు సుమా..!

పెద్ద గ్రంథిలో పెద్ద స‌మ‌స్య వ‌చ్చినా బెంగ ప‌డ‌వ‌ద్దు సుమా..!

మాన‌వ శ‌రీరంలోని అతి పెద్ద గ్రంథిగా కాలేయాన్ని చెబుతారు. దీనికి వ‌చ్చే అనేక స‌మ‌స్యల్లో తీవ్రమైన‌ది మాత్రం కాలేయ క్యాన్సర్ . స‌హ‌జంగానే క్యాన్సర్ అంటేనే చాలా మంది భ‌య‌ప‌డిపోతుంటారు. క్యాన్సర్ అనేది ప్రమాద‌క‌ర‌మైన వ్యాధి అన‌టంలో సందేహం లేదు. అంత మాత్రాన క్యాన్సర్ వ‌స్తే చికిత్స లేదు అని అనుకోవాల్సిన అవ‌స‌రం లేదు. ముఖ్యంగా కాలేయ క్యాన్సర్ విష‌యంలో అప్పుడు అధునాతన చికిత్సలు అందుబాటులోకి వ‌చ్చాయి.

స‌హ‌జంగా క్యాన్సర్ వ్యాధి నిర్ధార‌ణ‌లో ఏ ద‌శ‌లో ఉంద‌న్నది ప్రధానం. క్యాన్సర్ వ్యాధి విస్తర‌ణ ను 4ద‌శ‌లుగా చెబుతారు. మొద‌టి ద‌శలో క్యాన్సర్ ఉంటే ఆప‌రేష‌న్ చేయ‌టం ద్వారా వ్యాధిని నిర్మూలించ‌వ‌చ్చు. రెండు, మూడు ద‌శ‌ల్లో ఉంటే మాత్రం ఆప‌రేష‌న్ తో పాటు కీమో థెర‌పీ, రేడియో థెర‌పీ అవ‌స‌రం అవుతాయి. నాలుగో ద‌శ లో మాత్రం రోగి శేష జీవితం సాఫీగా జ‌రిగేపోయేట్లుగా చేయ‌టానికి వీల‌వుతుంది. కాలేయ క్యాన్సర్ కు ఇత‌మిత్థమైన కార‌ణం అంటూ లేదు. కానీ దుర‌ల‌వాట్ల తో స‌మ‌స్య ఉంటుంది కాబ‌ట్టి మ‌ద్యం తాగే అల‌వాటుకి దూరంగా ఉండ‌టం, హెప‌టైటిస్ రాకుండా జాగ్రత్త ప‌డ‌టం వంటివి చూసుకోవాలి.

చిన్న స‌మ‌స్యను తేలిగ్గా తీసుకోవ‌ద్దు. కొన్ని సార్లు పెద్ద ఇబ్బందిని తెచ్చి పెడ‌తాయి. ఉదాహ‌ర‌ణ‌కు..!

చాలా మంది చిన్న చిన్న స‌మ‌స్యల‌ను తేలిగ్గా తీసుకొంటారు. అవి పెద్ద ఇబ్బందిగా మారిన‌ప్పుడు మాత్రం అయ్యో, ముందుగానే  మేలుకోలేక పోయామే అని బాధ ప‌డ‌తారు. ఉదాహ‌ర‌ణ‌కు క‌డుపులో నొప్పి వ‌స్తుంటే ఏదో చిన్న విష‌య‌మే క‌దా అని వ‌దిలేస్తుంటారు. అస‌లు ఈ నొప్పి ఎందుకు వ‌స్తోందో తెలుసుకొని దానికి చికిత్స తీసుకోవాలి. ఈ మ‌ధ్య కాలంలో చిన్న పిల్లల్లో.. ముఖ్యంగా కోస్తా ప్రాంతానికి చెందిన పిల్లల్లో ఈ నొప్పి క‌నిపిస్తోంది. ఇటువంటి కేసుల్ని చూసిన‌ప్పుడు చాలా మందిలో క్లోమం (పాన్ క్రియాస్‌) లో రాళ్లు ఏర్పడిన‌ట్లు నిర్ధార‌ణ అయింది. ఈ రాళ్లను ముందుగానే గుర్తిస్తే చికిత్స తేలిక అవుతుంది.

పెద్దల్లో ముఖ్యంగా ఆల్కహాల్ తాగే అల‌వాటు ఉన్నవారిలో ఇటువంటి స‌మ‌స్య ఏర్పడుతూ ఉంటుంది. కానీ ఈ మ‌ధ్య కాలంలో పిల్లల్లో కూడా ఇది త‌లెత్తుతోంది. క్లోమంలో రాళ్లను గుర్తిస్తే ఇప్పుడు అధునాతన చికిత్స లు అందుబాటులోకి వ‌చ్చాయి. లిథో ట్రిప్సి విధానాలు, అవ‌స‌ర‌మైతే ఎల్ పీ జీ ఆప‌రేష‌న్ ద్వారా ఈ స‌మ‌స్యను అధిగ‌మించ‌వ‌చ్చు. నిపుణులైన వైద్యులు అధునాతన టెక్నాలజీతో తేలిగ్గా ఇటువంటి చికిత్స లు చేయ‌గ‌లుగుతున్నారు.

అనుకోని ప్రమాదం ఎదురైతే..!

ప్రమాదం అంటేనే అనుకోకుండా జ‌రిగేది అని అర్థం. అటువంట‌ప్పుడు అనుకోకుండా ఏర్పడే పెద్ద వ్యాధిని ప్రమాద‌వ‌శాత్తు ఏర్పడిన‌ట్లే గుర్తించాలి. ఒక్క సారిగా బ‌య‌ట ప‌డే తీవ్ర మైన వ్యాధుల్లో క్యాన్సర్ ఒక‌టి అనుకోవాలి.
క్యాన్సర్ అంటే చాలా మంది ఏదేదో ఊహించుకొంటారు. సూటిగా చెప్పాలంటే శ‌రీర భాగాల్లో ఆయా భాగాల‌కు సంబంధించిన క‌ణ‌జాలం ఉంటుంది. కొన్ని సార్లు ఆయా భాగాల‌కు సంబంధం లేని క‌ణ‌జాలం పోగుప‌డుతుంది. ఇది అక్కడ స్థిర‌ప‌డి క్రమంగా విస్తరిస్తూ పోతుంది. ఈ విస్తర‌ణ కార‌ణంగా అవాంఛిత క‌ణ‌జాలం ఇత‌ర క‌ణ‌జాలాల మీద దాడి చేసి ఆ ప్రాంతాన్ని ఆక్రమిస్తుంది. ఇదే క్యాన్సర్ గా రూపాంత‌రం చెందుతుంది.
క్యాన్సర్ అంటే అది తీర‌ని వ్యాధి అన్న అపోహ ఉంది. ఇది వాస్తవం కాదు. ప్రాథ‌మిక ద‌శ‌లో క్యాన్సర్ ను గుర్తిస్తే చికిత్స ల‌భిస్తుంది. సాదార‌ణంగా క్యాన్సర్ సోకిన భాగాన్ని బ‌ట్టి ఆయా పేర్లతో వ్యవ‌హ‌రిస్తారు. క‌డుపులో క్యాన్సర్ ఏర్పడితే క‌డుపు క్యాన్సర్ అని, కాలేయంలో క్యాన్సర్ ఏర్పడితే కాలేయ క్యాన్సర్ అని, క్లోమంలో క్యాన్సర్ ఏర్పడితే క్లోమ క్యాన్సర్ అనీ, పేగులో ఏర్పడితే పేగు క్యాన్సర్ అని చెబుతారు.
సాధార‌ణంగా క్యాన్సర్ విస్తర‌ణ నాలుగు ద‌శ‌లుగా చెబుతారు. మొద‌టి ద‌శ‌లో క్యాన్సర్ కు ఆప‌రేష‌న్ అనేది ఉత్తమ‌మైన విధానం. 2,3 ద‌శ‌ల్లోకి వెళ్లిపోతే మాత్రం ఆప‌రేష‌న్ తో పాటు కీమో థెర‌పీ( ర‌సాయ‌నాల్ని నేరుగా క్యాన్సర్ క‌ణ‌జాలం మీద‌కు పంపించ‌టం అన్న మాట‌), రేడియో థెర‌పీ ( రేడియో ధార్మికత ప్రభావం గ‌ల కిర‌ణాల్ని క్యాన్సర్ క‌ణ‌జాలం మీద‌కు పంపించ‌టం అన్న మాట‌) వంటి విధానాల్ని అనుస‌రించాల్సి ఉంటుంది. క్యాన్సర్ నాలుగో ద‌శ‌కు చేరితే మాత్రం వ్యాధి బాగా ముదిరిన‌ట్లు చెబుతారు. ఈ స‌మ‌యంలో చికిత్స ద్వారా శేష జీవితాన్ని నాణ్యత‌గా ఉండేట్లు చేయ‌వ‌చ్చు. ఆధునిక వైద్య విధానంలో క్యాన్సర్ ను తీవ్ర మైన వ్యాధిగా ప‌రిగ‌ణిస్తారు. అంతే త‌ప్ప తీవ్రాతి తీవ్రమైన వ్యాధిగా చెప్పటం, క్యాన్సర్ రోగుల్ని, సంబంధిత కుటుంబ సభ్యుల్ని భ‌య పెట్టడం స‌రి కాదు. క్యాన్సర్ కు కూడా చ‌క్కటి మందులు, మెరుగైన వైద్య చికిత్స విధానాలు అందుబాటులో ఉన్నాయని గుర్తించుకోవాలి. అనుకోని ప్రమాదం ఏర్పడిన‌ప్పుడు గుండె నిబ్బరంతో వ్యవ‌హరిస్తే మంచి ఫ‌లితాలు పొంద‌వ‌చ్చు.