...

SPECIALIZED SITE FOR HUMAN HEALTH CARE,
SPECIALLY ON GASTROENTEROLOGY, LIVER AND PANCREAS

అనుకోని ప్రమాదం ఎదురైతే..!

ప్రమాదం అంటేనే అనుకోకుండా జ‌రిగేది అని అర్థం. అటువంట‌ప్పుడు అనుకోకుండా ఏర్పడే పెద్ద వ్యాధిని ప్రమాద‌వ‌శాత్తు ఏర్పడిన‌ట్లే గుర్తించాలి. ఒక్క సారిగా బ‌య‌ట ప‌డే తీవ్ర మైన వ్యాధుల్లో క్యాన్సర్ ఒక‌టి అనుకోవాలి.
క్యాన్సర్ అంటే చాలా మంది ఏదేదో ఊహించుకొంటారు. సూటిగా చెప్పాలంటే శ‌రీర భాగాల్లో ఆయా భాగాల‌కు సంబంధించిన క‌ణ‌జాలం ఉంటుంది. కొన్ని సార్లు ఆయా భాగాల‌కు సంబంధం లేని క‌ణ‌జాలం పోగుప‌డుతుంది. ఇది అక్కడ స్థిర‌ప‌డి క్రమంగా విస్తరిస్తూ పోతుంది. ఈ విస్తర‌ణ కార‌ణంగా అవాంఛిత క‌ణ‌జాలం ఇత‌ర క‌ణ‌జాలాల మీద దాడి చేసి ఆ ప్రాంతాన్ని ఆక్రమిస్తుంది. ఇదే క్యాన్సర్ గా రూపాంత‌రం చెందుతుంది.
క్యాన్సర్ అంటే అది తీర‌ని వ్యాధి అన్న అపోహ ఉంది. ఇది వాస్తవం కాదు. ప్రాథ‌మిక ద‌శ‌లో క్యాన్సర్ ను గుర్తిస్తే చికిత్స ల‌భిస్తుంది. సాదార‌ణంగా క్యాన్సర్ సోకిన భాగాన్ని బ‌ట్టి ఆయా పేర్లతో వ్యవ‌హ‌రిస్తారు. క‌డుపులో క్యాన్సర్ ఏర్పడితే క‌డుపు క్యాన్సర్ అని, కాలేయంలో క్యాన్సర్ ఏర్పడితే కాలేయ క్యాన్సర్ అని, క్లోమంలో క్యాన్సర్ ఏర్పడితే క్లోమ క్యాన్సర్ అనీ, పేగులో ఏర్పడితే పేగు క్యాన్సర్ అని చెబుతారు.
సాధార‌ణంగా క్యాన్సర్ విస్తర‌ణ నాలుగు ద‌శ‌లుగా చెబుతారు. మొద‌టి ద‌శ‌లో క్యాన్సర్ కు ఆప‌రేష‌న్ అనేది ఉత్తమ‌మైన విధానం. 2,3 ద‌శ‌ల్లోకి వెళ్లిపోతే మాత్రం ఆప‌రేష‌న్ తో పాటు కీమో థెర‌పీ( ర‌సాయ‌నాల్ని నేరుగా క్యాన్సర్ క‌ణ‌జాలం మీద‌కు పంపించ‌టం అన్న మాట‌), రేడియో థెర‌పీ ( రేడియో ధార్మికత ప్రభావం గ‌ల కిర‌ణాల్ని క్యాన్సర్ క‌ణ‌జాలం మీద‌కు పంపించ‌టం అన్న మాట‌) వంటి విధానాల్ని అనుస‌రించాల్సి ఉంటుంది. క్యాన్సర్ నాలుగో ద‌శ‌కు చేరితే మాత్రం వ్యాధి బాగా ముదిరిన‌ట్లు చెబుతారు. ఈ స‌మ‌యంలో చికిత్స ద్వారా శేష జీవితాన్ని నాణ్యత‌గా ఉండేట్లు చేయ‌వ‌చ్చు. ఆధునిక వైద్య విధానంలో క్యాన్సర్ ను తీవ్ర మైన వ్యాధిగా ప‌రిగ‌ణిస్తారు. అంతే త‌ప్ప తీవ్రాతి తీవ్రమైన వ్యాధిగా చెప్పటం, క్యాన్సర్ రోగుల్ని, సంబంధిత కుటుంబ సభ్యుల్ని భ‌య పెట్టడం స‌రి కాదు. క్యాన్సర్ కు కూడా చ‌క్కటి మందులు, మెరుగైన వైద్య చికిత్స విధానాలు అందుబాటులో ఉన్నాయని గుర్తించుకోవాలి. అనుకోని ప్రమాదం ఏర్పడిన‌ప్పుడు గుండె నిబ్బరంతో వ్యవ‌హరిస్తే మంచి ఫ‌లితాలు పొంద‌వ‌చ్చు.

No comments:

Post a Comment