...

SPECIALIZED SITE FOR HUMAN HEALTH CARE,
SPECIALLY ON GASTROENTEROLOGY, LIVER AND PANCREAS

చిన్న చిన్న ప‌నులు మ‌రిచిపోకండి..

చిన్న ప‌నుల్ని నిర్ల‌క్ష్యం చేయ‌టం చాలా మంది పెద్ద వాళ్ల లో కూడా చూస్తుంటాం. టైమ్ స‌రిపోక, శ్ర‌ద్ధ పెట్ట‌క అలా ప‌నుల్ని వ‌దిలేస్తుంటాం. ఇటువంటి ప‌నుల్లో గోళ్ల‌ను క‌త్తిరించుకోవ‌టం, శుభ్ర ప‌ర‌చుకోవ‌టం ఒక‌టి. అందునా ఈ శీతాకాలంలో వేగంగా గోళ్లు పెరుగుతుంటాయి. పైగా వీటి మూల‌ల్లోకి నీరు మార్పిడి స‌మ‌స్య ఉంటుంది కాబ‌ట్టి తేలిగ్గా క్రిములు సెటిల్ అవుతుంటాయి కూడా. అందుకే ఈ సీజ‌న్ లోగోళ్ల సంగ‌తి త‌ప్ప‌కుండా ప‌ట్టించుకోవాలి.
గోళ్ల తో లాభం ఏమిటి అని పెద్ద గా ఆలోచించుకోనవ‌స‌రం లేదు. వేళ్ల చివ‌రి భాగాల‌కు ర‌క్ష‌ణ ఇవ్వ‌ట‌మే వీటి ప‌ని. మ‌హా అయితే చిన్న చిన్న వాటిని ప‌ట్టుకోవ‌టానికి కాస్త స‌హ‌క‌రిస్తాయి. అంతే క‌దా అని వ‌దిలేస్తే మాత్రం చికాకు త‌ప్ప‌దు. ఎందుకంటే వీటి మూల‌ల్లో క్రిములు మ‌కాం పెట్ట‌డానికి చాలా అవ‌కాశం ఉంటుంది. అందుక‌ని ఎప్ప‌టిక‌ప్పుడు గోళ్ల ను క‌త్తిరించుకొంటే ప‌ఱ్వాలేదు. లేదంటే అన‌వ‌సరంగా క్రిముల్ని పెంచి పోషించి ఆ త‌ర్వాత అవి తెచ్చి పెట్టే రోగాల‌కు బ‌లి కావ‌ల‌సి ఉంటుంది.

అంతే కాకుండా చేతుల్ని శుభ్రం చేసుకొనేటప్పుడు ఈ గోళ్ల‌కు సంబంధించిన మూల‌ల్ని శుభ్రం చేసుకోవాలి. అంటే చేతికి స‌బ్బు లేక హాండ్ వాష్ ప‌ట్టించాక వాటితో గోళ్ల చివరి భాగాల్ని కూడా తోము కోవాలి. అప్పుడే అక్క‌డ క్రిములు చేర‌కుండా జాగ్ర‌త్త ప‌డ‌వ‌చ్చు. అందుచేత గోళ్లే కదా అని వ‌దిలేయ‌కండి. చిన్న చిన్న ప‌నుల‌తో పెద్ద పెద్ద తంటాలు కొని తెచ్చుకోవ‌ద్దు.
చిన్న పిల్ల‌ల్లో (కొంద‌రు పెద్ద‌ల్లో సైతం) గోళ్ల‌ను కొరికే అల‌వాటు ఉంటుంది. దీన్ని మానిపించ‌టం త‌ప్ప‌నిస‌రి. ఎందుకంటే గోళ్ల‌ను బ‌య‌ట ఉండే ఎముక బాగాలుగా చెప్ప‌వ‌చ్చు. వీటిని ఆశ్ర‌యించుకొని ఉండే ప్ర‌త్యేక ర‌క‌ములైన క్రిముల‌కు శ‌రీరంలో చోటు ఇచ్చిన‌ట్లు అవుతుంది.

అర‌చేతిలో అన్నీ ఉంటాయా..


అర చేతిలో వైకుంఠం అన్న సామెత మ‌న‌కు అంద‌రికీ తెలిసిందే. అన్నీ అయిపోయిన‌ట్లుగా మాట్లాడే మాట‌ల్ని ఈ సామెత తో పోలుస్తారు. వాస్త‌వానికి అన్ని క‌లిసి ఉంటేనే అమ‌రిక బాగుంటుంది.

రోజూ ఒకే ర‌క‌మైన ఆహారం తీసుకోవ‌టానికి మ‌నం అల‌వాటు ప‌డి ఉంటాం. ద‌క్షిణాదిన ముఖ్యంగా మ‌న తెలుగు వాళ్ల ఆహార‌పు అలవాట్ల‌ను తేలిగ్గా చెప్ప‌వ‌చ్చు. ఉద‌యం టిపిన్ గా ఇడ్లీ లేక దోశ‌, మ‌ధ్యాహ్నం భోజ‌నంగా అన్నం కొద్దిగా కూర‌లు, రాత్రి కూడా అలాగే అన్నం, కొద్దిగా కూర‌లు తీసుకొంటారు. మ‌ధ్యలో తీసుకొనే స్నాక్స్ కూడా శ‌న‌గ‌పిండితో చేసిన స్వీట్లు లేక హాట్లు లాగిస్తుంటారు. దీంతో బ‌ల‌వ‌ర్ధ‌క ఆహారం అంద‌కుండా పోతోంది. ముఖ్యంగా ఈ ర‌క‌మైన ఆహారంలో కార్బొ హైడ్రేట్‌లు, కొవ్వులు దండిగా ఉంటున్నాయి కానీ ప్రొటీన్ల శాతం త‌క్కువ‌గా ఉంటుంది. ఇక‌, విట‌మిన్‌లు, మిన‌ర‌ల్స్ గురించి చెప్ప‌నే అక్క‌ర లేదు. అందుకే ఈ అల‌వాట్ల‌ను కొద్దిగా మార్చుకొనే ప్ర‌య‌త్నం చేయండి. ఆహారంలో అన్ని ఉండేట్లు చూసుకొంటే బాగుంటుంది. ప్రోటీన్లు, విట‌మిన్ ల‌కు ప్రాధాన్యం ఇవ్వండి.

చూస్తూనే ఉండండి..కానీ కాస్త మెల‌కువ‌గా ఉండండి..


చూసేందుకు క‌ళ్లు ఉన్నాయి కాబ‌ట్టి వాటికి ప‌ని చెప్పిచూస్తూనే ఉంటాం కానీ కొన్ని సార్లు మాత్రం మెల‌కువ ఉండాలి. అంతెందుకు, టెలివిజ‌న్ చూడ‌టం అన్న‌ది అంద‌రికీ త‌ప్ప‌నిస‌రి అల‌వాటు. ఒక ఇంట్లో త‌ప్ప‌నిస‌రిగా ఉండాల్సిన జాబితాలో టెలివిజ‌న్ ఎప్పుడో చేరిపోయింది. ఇప్పుడు తాజాగా కంప్యూట‌ర్, దానికి ఇంట‌ర్ నెట్ క‌నెక్ష‌న్ తోడ‌య్యాయి. మ‌రి వీటిని చూస్తూనే మిగిలిన ప‌నులు చేసుకోవ‌టం అల‌వాటైంది.
ముఖ్యంగా పిల్ల‌లు బాగా టీవీల‌కు, కంప్యూట‌ర్ ల‌కు అల‌వాటు ప‌డుతున్నారు. పెద్ద‌ల్లో కూడా చాలామంది టీవీ చూస్తూ ప‌నులు చేసుకోవ‌టం అల‌వాటు చేసుకొంటున్నారు. దీని కార‌ణంగా లాభాలు ఎన్ని ఉన్నాయి అనే దానికి జ‌వాబు కష్టం కానీ, అనర్థాలు మాత్రం అధికంగా ఉన్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. టీవీ చూస్తూ టిఫిన్‌, భోజ‌నం చేసే అల‌వాటు చాలా మందికి ఉంది. దీంతో ఎంత వ‌డ్డించుకొంటున్నారో, ఎంత తింటున్నారో తెలియ‌టం లేదు. దీని కార‌ణంగా డైనింగ్‌టేబుల్ మీద ఎక్కువ‌గా ఉండే అన్నం, స్వీట్లు, హాట్లు, పెరుగు వంటివి లాగించేయటం జ‌రుగుతోంది. ఫ‌లితంగా శ‌రీరంలో కార్బొ హైడ్రేట్ లు, అంత‌కుమించి కొవ్వులు పేరుకొనిపోతున్నాయి. అదే స‌మ‌యంలో భోజ‌నం త‌ర్వాత కొద్ది పాటి వ్యాయామం కూడాలేకుండాకూర్చొని టీవీల‌కు అతుక్కొని పోతున్నారు. దీంతో క‌ద‌లిక పోవ‌టంతో జీర్ణ ప్ర‌క్రియ‌లో ఇబ్బందులు ఏర్ప‌డుతున్నాయి. అదే స‌మ‌యంలో కొవ్వులు ఎక్క‌డిక‌క్క‌డ పేరుకొని పోతున్నాయి. మ‌ధ్యాహ్న స‌మ‌యంలో భోజ‌నం త‌ర్వాత సోఫాలో కూల‌బ‌డి కాల‌క్షేపం చేయ‌టం, రాత్రి భోజ‌నం తర్వాత నిద్ర వ‌చ్చే వ‌ర‌కు టీవీలు, కంప్యూట‌ర్ లుచూడ‌టంతో ఒబేసిటీ స‌మ‌స్య కూడా వ‌చ్చి ప‌డుతోంది.

ఈ అల‌వాట్ల‌ను ఎంత త్వ‌రగా వ‌దిలించుకొంటే అంత మంచిది. టీవీ చూడ‌టం త‌ప్ప‌నిస‌రి అయితే భోజ‌నం ముందే వ‌డ్డించుకోండి. ఆహారం తీసుకొన్న త‌ర్వాత త‌ప్ప‌నిస‌రిగా కొద్ది దూరం అయినా న‌డ‌వ‌టం లేదా క‌ద‌ల‌టం చేయాలి. దీంతో ఆహారం స‌రిగ్గా వంట ప‌డుతుంది. ఎక్కువ‌గా కొవ్వులు, పిండి ప‌దార్థాల జోలికి పోకుండా ఉండ‌గలుగుతారు. అదేస‌మ‌యంలో కూర‌గాయ‌లు, పండ్ల శాతం పెంచండి. మంచి ఆహారం వంట బడుతుంది.

ఐస్ క్రీమ్ - 2 తో ఇబ్బంది ఏమిటి..

ఐస్ క్రీమ్ అన‌గానే అంద‌రికీ క‌ళ్ల ముందు క‌ళ క‌ళ లాడే ఐస్ క్రీమ్ లు క‌ద‌లాడుతాయి. వాటిని ఊహించుకొంటే భ‌లే ఉంటుంది క‌దా..అందుకే ఐస్ క్రీమ్ అనే ప‌దం కూడా ఇంగ్లీషు ప‌దం అయిన‌ప్పటికీ తెలుగులో కూడా బాగా పాపుల‌ర్ అయింది. చాలా సంద‌ర్భాల్లో దీన్ని వాడుతున్నారు.

ఐస్ క్రీమ్ ను పెద్దల కన్నా పిల్లలు ఎక్కువ‌గా ఇష్టప‌డ‌తారు. న‌చ్చితే 2,3 లాగించేస్తారు. సాలిడ్ ఫుడ్ విష‌యంలో అడ్డు చెప్పే త‌ల్లిదండ్రులు కూడా ఐస్ క్రీమ్ విష‌యంలో పెద్ద గా అడ్డు చెప్పరు. పోనీలే అని వ‌దిలేస్తుంటారు. చ‌ల్లటి ఐస్ క్రీమ్ అప్పుడ‌ప్పుడు తిన‌టంలో త‌ప్పు లేదు. కాల్షియం, పాలు వంటివి ఉంటాయి కాబ‌ట్టి రుచిని ఇష్టప‌డ‌తారు కాబ‌ట్టి ఊరుకోవ‌చ్చు.
కానీ 2,3 ఐస్ క్రీమ్ లు లాగిస్తుంటే మాత్రం ఆలోచించాల్సిందే. ఎందుకంటే ఐస్ క్రీమ్ తో కొన్ని అన‌ర్థాలు కూడా ఉన్నాయి. ఒక క‌ప్పుడు ఐస్ క్రీమ్ లో 10 గ్రాముల దాకా కొవ్వు ప‌దార్థాలు ఉంటాయి. వీటిని ప‌దే ప‌దే లాగిస్తుంటే ఇవి శ‌రీరంలో పోగు ప‌డ‌తాయి. దీంతో ఊబ‌కాయం వ‌చ్చేస్తుంది. దీంతో పాటు అనేక స‌మ‌స్యలు వ‌స్తాయి. గుండె సంబంధిత స‌మస్యలు, ఆయాసం ఒక‌టేమిటి..బోలెడ‌న్ని స‌మ‌స్యలు ఉంటాయి. బొద్దుగా ఉండే పిల్లలు చాలా వ‌ర‌కు ఐస్ క్రీమ్ లు లాగిస్తారంటే అతిశ‌యోక్తి కాదు. తీపి కోసం సుగ‌ర్స్ ద‌ట్టిస్తారు. ముఖ్యంగా కృత్రిమ సుగ‌ర్స్ బాగా వేస్తుంటారు. ఇవి ఆరోగ్యానికి అంత మంచివి కాదు. అంతే కాకుండా రుచి కోసం వాడే కెమిక‌ల్స్ తో కూడా స‌మ‌స్యలు ఉంటాయి.
మొత్తం మీద ముందే చెప్పిన‌ట్లుగా అప్పుడప్పుడు ఒక ఐస్ క్రీమ్ లాగించ‌టం త‌ప్పు కాదు కానీ, అదే ప‌నిగా 2,3 ఐస్ క్రీమ్ లు లాగించ‌టం అంత మంచిది కాద‌నుకోవ‌చ్చు.

వాయిదా ప‌ద్ద‌తుంది దేనికైనా..


మ‌న‌లో చాలామంది వాయిదా వేసే ప‌నుల్లో వాకింగ్ ఒక‌టి. న‌గ‌ర జీవ‌నానికి అల‌వాటు ప‌డిపోయిన వాళ్లలో శారీర‌క వ్యాయామం త‌గ్గిపోతోంద‌ని మెడిక‌ల్ సైన్స్ చెబుతోంది. అందుచేత ప్ర‌తీ రోజు తేలికైన వ్యాయామం త‌ప్ప‌నిస‌రి అని గుర్తించుకోవాలి. ఇందులో తేలిక అయిన‌ది వాకింగ్ అనుకోవ‌చ్చు. ప్ర‌తీ రోజు 20 నుంచి 30 నిముషాల పాటు న‌డ‌వ‌టంతో ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి.

దీంతో ర‌క్త ప్ర‌సర‌ణ సాఫీగా జ‌రుగుతుంది. అందుచేత గుండె, ఊపిరితిత్తులు స‌జావుగా ప‌నిచేస్తాయి. అంతే గాకుండా కొవ్వులు బాగా క‌రుగుతాయి. వీటితో వ‌చ్చే అనేకానేక స‌మ‌స్య‌లు నివారించ‌టానికి వీల‌వుతుంది. ర‌క్త పోటు, మ‌ధుమేహం వంటి దీర్ఘ కాలిక స‌మ‌స్య‌లు ఉన్న వారు త‌ప్పనిస‌రిగా వ్యాయామం చేయాల్సిందే. అప్పుడే మందులు స‌జావుగా ప‌ని చేస్తాయి. దీంతో పాటు ఎముక‌ల ప‌టిష్ట‌త‌కు, బ్యాలెన్సింగ్ కు న‌డ‌గ చాలా మంచిది. కండ‌రాలు ప‌టిష్ట‌త‌కు, జీర్ణ ప్ర‌క్రియ ప‌టిష్ట‌త‌కు ఇది ఉప‌యోగ ప‌డుతుంది.
ఇంకెందుకు ఆల‌స్యం. వాయిదాలు మానేసి న‌డ‌క‌కు జై కొడ‌దామా..

నిద్ర- అవగాహన



మానవ జీవితానికి దేవుడు అన్నీ కరెక్ట్ గానే సమకూరుస్తాడు. కానీ దాన్ని వినియోగించుకోవటంలోనే పొరపాట్లు జరుగుతున్నాయి. దీంతో అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవటం జరుగుతోంది. ఆహారంతో పాటు నిద్ర కూడా ముఖ్య పాత్ర పోషిస్తుందని గుర్తించుకోవాలి.
రోజంతా పని చేస్తూ పోతుంటే శరీరం తప్పకుండా అలసి పోతుంది. అలసిన శరీరానికి తగిన విశ్రాంతి అవసరం. ఆ విశ్రాంతి నిద్రలోనే లభిస్తుంది. అందుచేత ప్రతీ రోజు 7,8 గంటల నిద్ర అవసరం అని చెబుతారు. ఉరుకులు, పరుగుల జీవితంలో కొంత మంది నిద్రను నిర్లక్ష్యం చేస్తుంటారు. 4,5 గంటల నిద్రతోనే సరిపెట్టుకొనేవారు కూడా కనిపిస్తున్నారు ఈ మధ్యన. దీంతో శరీరం లోని వివిధ అవయవాలకు తగినంత విశ్రాంతి దొరకటం లేదు. దీంతో అనేక అవయవాలు ఇబ్బంది పడుతుంటాయి. ముఖ్యంగా రక్త నాళాలు, గుండె నిరంతరాయంగా పనిచేస్తుంటాయి. కానీ నిద్రలో ఈ భాగాల్ని ప్రశాంతంగా పనిచేసుకొంటాయి. అప్పుడు తగిన విశ్రాంతి దొరుకుతుంది. లేదంటే ఈ భాగాలపై ఒత్తిడి పెరుగుతుంది. హై బీపీ, గుండె సమస్యలు, వీటితో ముడి పడి ఉన్న స్ట్రోక్‌ సమస్యలు, కిడ్నీ సమస్యలు వచ్చి పడతాయి. అందుచేత తగినంత నిద్ర తప్పనిసరి అని గుర్తించుకోవాలి. దీంతో పాటు మెదడు మీద కూడా ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే తగినంత విశ్రాంతి లేకపోతే మెదడు చురుగ్గా ఆలచించలుద. అప్పుడు రక్తపోటు పెరిగి ఒత్తిడి కారక హార్మోన్‌ లు విడుదల అవుతాయి. వీటితో మెదడు పనితీరు గజిబిజిగా మారుతుంది. సరిగ్గా సమాచారం తీసుకోవటంతో, ఆదేశాల ఇవ్వటంలో ఇబ్బంది తలెత్తుతుంది. వీటితో పీరియోడాంటైటిస్‌, అథెరో స్క్లీరోసిస్‌, రుమటాయిడ్‌ ఆర్థరాయిటిస్‌ వంటి క్రానిక్‌ ఇన్‌ ఫ్లమేషన్‌ సమస్యలు చోటు చేసుకొంటాయి. అటు మానసికంగా కూడా జ్నాపక శక్తి, నిర్ణయాలు తీసుకోవటంలో సామర్థ్యం మెరుగుపడాలంటే నిద్ర తప్పనిసరి. అందుచేత తగిన వేళల్లో నియమిత సమయం ప్రకారం నిద్ర పోవాల్సిందే. ఎక్కువ ఒత్తిడితో పనిచేసే వారికి మద్యాహ్నం ఒక అరగంట సేపు విశ్రాంతి తీసుకొంటే మిగిలిన సమయం మరింత ఉత్సాహంగా పనిచేయగలుగుతారు.


చివరగా ఒక ముఖ్యమైన విషయం. నిద్ర తక్కువైతే తక్కువ సమస్యలు కానీ నిద్ర ఎక్కువైతే మాత్రం ఎక్కువ సమస్యలు. శారీరకంగా మానసికంగా కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి. దీన్ని గమనించుకొని మత్తు వదలి మెలగాల్సి ఉంటుంది.

ఆదివారం సెలవు కదా..అని మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకొంటున్నారా..!





ఆదివారం అంటే చాలా మందికి  ఆనందమే. చాలా మందికి సెలవు ఉంటుంది కాబట్టి పిల్లలకు ఎలాగూ స్కూల్ హాలీడే. పెద్దలకు ఆఫీసులకు, వ్యాపారాలకు సెలవు ఉంటుంది కాబట్టి వీకెండ్‌ ను ఎలా ఎంజాయ్‌ చేయాలా అని ఇప్పటికే ప్లాన్‌ చేసేసుకొంటారు. చాలా సందర్భాల్లో కుటుంబంతో కలిసి భోజనానికి బయటకు వెళ్లడానికి చాలామంది ఆదివారం ను ఎంచుకొంటారు. కుటుంబంతో కలిసి బయట తిరిగి రావటం అన్నది చాలా అవసరం కూడా. వారమంతా దైనందిక పనులతో అలసిపోయిన వారికి ఇది మంచి రీచార్జ్ అవుతుంది.
బయట భోజనం చేసేటప్పుడు ఒక చిన్న జాగ్రత్త తీసుకోవటం మంచిది. ఇప్పుడు చాలామంది హెల్త్ అవేర్‌నెస్‌ పెంచుకొంటున్నారు. అందుచేత ఇంటి దగ్గర లేక ఆఫీసులో భోజనం చేసేటప్పుడు హ్యాండ్‌ వాష్‌ చేయటం అలవాటు చేసుకొంటున్నారు. (ఒక వేళ మీకు కనుక ఆ అలవాటు లేకపోతే మాత్రం తప్పనిసరిగా దీన్ని అలవాటు చేసుకోండి. మేం స్పూన్‌ తో ఫుడ్‌ తింటాం కదా అని సెటైర్లు మాత్రం వేయకండి. జస్ట్ ఆ స్పూన్‌ ఎంత శుభ్రంగా ఉందో చెక్‌ చేసుకోండి చాలు) కానీ బయటకు వెళ్లినప్పుడు మాత్రం అన్ని సార్లు ఇది కుదరక పోవచ్చు. 

కొన్ని చోట్ల లిక్విడ్‌ హ్యాండ్‌ వాష్‌ పెడుతున్నారు కాబట్టి దీన్ని వాడటానికి మొహమాట పడవద్దు. అప్పటిదాకా బయట తిరిగి ఆ చేతులతోనే తినటానికి రెడీ కావద్దు. కనీసం వాష్‌ లిక్విడ్‌ చిన్నబాటిల్స్ దొరకతున్నాయి కాబట్టి వాటిని అయినా వెంట తీసుకెళ్తే అయిపోతుంది. దీన్ని వాడటం మంచిది అన్న మాట తెలిసిందే కదా. మొహమాటంతో కమిట్‌ అయ్యేకంటే ఇది బెటర్‌ అనిపిస్తుంది. అక్కడ స్పూన్ లు, ఫోర్క్ లు క్లీన్ గా ఉంటాయని నమ్ముతాం కాబట్టి వాటిని వాడుకొన్నా ఫర్వాలేదు.
చిన్న జాగ్రత్త బోలెడు మేలు చేస్తుందని మరవకండి సుమా..!

అరచేతిలో టెక్నాలజీ..అద్భుతమైన ఫలితాలు






కాలం మారిపోతోంది. కాలంతో పాటు అన్నీ మారిపోతున్నాయి. ముఖ్యంగా ఆదునిక పరికరాలు అందుబాటులోకి వచ్చాక వాటి ఉపయోగాన్ని అందిపుచ్చుకోవటం తప్పనిసరి అవుతోంది. ముఖ్యంగా టెక్నాలజీ సమకూర్చే ఫలితాలు చాలా కనిపిస్తున్నాయి. వైద్య శాస్త్రంలో రోగాల్ని నిర్ధారించటంలో, చికిత్సలో టెక్నాలజీ పాత్ర పెరుగుతోంది.
ఈ మద్య కాలంలో ఎండోస్కోపిక్‌ అల్ట్రా సౌండ్‌ అనే పరికరం అందుబాటులోకి వచ్చింది. గతంలో శరీరం లోపల అవయవాల పరిస్తితిని పరిశీలించేందుకు ఎండోస్కోప్‌ వాడుతూ ఉండేవాళ్లం. అల్ట్రాసౌండ్ టెక్నాలజీ కూడా ఈ దిశగా ఉపయోగ పడుతుండేది. ఇప్పుడు ఈ రెంటినీ మేళవించి రూపొందించిందే ఎండోస్కోపిక్‌ అల్ట్రా సౌండ్‌.
దీంతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా జీర్ణ కోశ వ్యాధుల నిర్ధారణ చికిత్సలో ఇది బాగా ఉపయోగ పడుతుంది. ఆహార వాహిక, జీర్ణకోశం, పేగులు, పాన్‌ క్రియాస్‌, రెక్టమ్‌ వంటి భాగాల్లో క్యాన్సర్ సోకుతూ ఉంటుంది. ఇధి ఏ స్టేజ్‌ లో ఉన్నదో తెలిస్తే చికిత్స తేలిక అవుతుంది. క్యాన్సర్‌ స్టేజ్‌ నిర్ధారణ కు ఈ పరికరం ఉపయోగ పడుతుంది. ముఖ్యంగా పాన్‌ క్రియాస్‌ లో ఏర్పడే రోగ పూరిత సిస్ట్ లు, వాపులు వంటివి సునిశితంగా పరిశీలించేందుకు ఇది సహకరిస్తుంది. కాలేయం నుంచి స్రావకాల్ని తాత్కాలికంగా నిల్వ చేసే గాల్‌ బ్లాడర్‌, బైల్ గొట్టాల్లో రాళ్లు, కణితులు ఏర్పడి ఇబ్బంది కలిగిస్తాయి. కాలేయంలో కూడా కణితులు చోటు చేసుకొంటాయి. ఇవి ఎక్కడ ఏర్పడ్డాయి, ఎంత సైజ్‌ లో ఉన్నాయి, వాటి నేచర్‌ ఏమిటి వంటి అంశాల్ని దీని ద్వారా తెలుసుకోవచ్చు. తొలి దశలో ఉండే గ్యాస్ట్రిక్‌ క్యాన్సర్‌, పాన్‌ క్రియాస్‌ లో వచ్చే నీటిబుగ్గలు, కొన్ని రకాల గాల్‌ బ్లాడర్‌ ఇన్‌ ఫెక్షన్‌ లు ఆపరేషన్‌ అవసరం లేకుండానే చికిత్స చేయటానికి వీలవుతుంది.
ఈ విశిష్ట పరికరం ఇప్పుడు హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ అండ్‌ లివర్‌ డిసీజెస్‌ లో అందుబాటులోకి వచ్చింది. దీని సేవల్ని పొందేందుకు వీలవుతోందని గుర్తించుకోవచ్చు. ఇది ప్రజల అవగాహన కోసం చేసే ప్రయత్నం మాత్రమే.