ఇటీవల కాలంలో పాన్ క్రియాస్ సమస్యలు పెరుగుతున్నాయి. మారుతున్న జీవన శైలితో పాటు మద్య పానం వంటి అలవాట్లే ఇందుకు కారణం. పాన్ క్రియాస్ గ్రంథిలో సమస్యలు ఏర్పడితే ఇతర రకాల ఇబ్బందులు తలెత్తుతాయి.
పాన్ క్రియాస్ అనేది జీర్ణ వ్యవస్థ లో ప్రధాన అనుబంధ అవయవం. ఆహారాన్ని జీర్ణం చేయటానికి అవసరమైన ఎంజైమ్ లతో పాటు, గ్లూకోజ్ ను క్రమబద్దం చేసే హార్మోన్‌లను ఇది స్రవిస్తుంది.
పాన్ క్రియాస్ లో ఏర్పడే ప్రధాన సమస్యల్లో వాపు ఏర్పడటం ( అక్యూట్ పాన్ క్రియాటైటిస్ ), రాళ్లు ఏర్పడటం (క్రానిక్ పాన్ క్రియాటైటిస్) ముఖ్యమైనవి. కడుపు పై భాగంలో తీవ్రమైన నొప్పి ప్రధాన లక్షణం. ఈ కడుపు నొప్పి వెన్నుపూసలోకి చొచ్చుకొని పోతున్నట్లు ఉంటుంది. దీంతోపాటు వాంతులు, విరోచనంలో చమురు కనిపిస్తుంటుంది. కొన్ని సందర్భాల్లో రక్తపు వాంతులు, పసిరికలు ఏర్పడుతాయి. బరువు తగ్గటం, డయాబెటిస్ ముదరటాన్ని గమనించవచ్చు. ఈ వ్యాదుల్ని నిర్ధారించటానికి రక్తపు పరీక్షలతో పాటు అల్ట్రా సౌండ్ పరీక్షలు చేయించాలి. సీటీ స్కాన్, ఎమ్ ఆర్ సీ పీ, ఈ ఆర్ సీ పీ పరీక్షలతో నిర్ధారించవచ్చు.
సమస్య తీవ్రత ను బట్టి చికిత్స ఉంటుంది. మందులతో తగ్గించ లేని పరిస్థితి ఉన్నప్పుడు ఎండో స్కోపీ విధానాలతో రాళ్లను కరిగించాలి (ఎండోస్కోపిక్ లిథోట్రిప్సీ). పాన్ క్రియాస్ నాళంలో స్టెంట్ లు అమర్చటం ద్వారా కూడా పరిష్కారం లభిస్తుంది.ఈ విధానాల్లో పరిష్కార దొరకనప్పుడు ఆపరేషన్ అవసరం. దీంతోపాటుగా రక్తపు వాంతులు, పసిరికలు ముదరటం, నీటి బుడగలు ఏర్పడటం వంటివి జరిగితే ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. కొన్ని సందర్బాల్లో పాన్ క్రియాస్ క్యాన్సర్ సంభవిస్తే ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. పాన్‌క్రియాస్ లో కణితులు ఏర్పడి క్యాన్సర్ కు దారి తీస్తుంది.
పాన్ క్రియాస్ లో సమస్యలు తలెత్తకుండా క్రమబద్దమైన జీవన శైలిని అనుసరించాలి.మద్యపానానికి దూరంగా ఉండటం మేలు.
No comments:
Post a Comment