...

SPECIALIZED SITE FOR HUMAN HEALTH CARE,
SPECIALLY ON GASTROENTEROLOGY, LIVER AND PANCREAS

సింగపూర్ అయినా, ఫిలిప్పీన్స్ అయినా...విదేశీ పర్యటనలో విషయం ఉంది సుమా



భారత్ కు కాస్తంత దగ్గరగా ఉండే దేశాలుగా ఆగ్నేయాసియా దేశాల్ని చెప్పవచ్చు. ఇక్కడ వారికి పూర్వం నుంచి భారత్ తో మంచి సంబంధాలు ఉండేవి. అందుకే ఈ దేశాల వారికి భారత్ అంటే అభిమానం. అందుకే అక్కడ నుంచి ఇక్కడకు , ఇక్కడ నుంచి అక్కడకు రాకపోకలు ఎక్కువగా కనిపిస్తు ఉంటాయి.

ఈ మధ్యనే ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా లో ఏర్పాటు చేసిన మొట్టమొదటి ఆగ్నేయాసియా దేశాల గ్యాస్ట్రో మీట్ జరిగింది. అనేక దేశాల నుంచి గ్యాస్ట్రో ఎంటరాలజీ డాక్టర్లు ఈ సదస్సులో పాల్గొవటం జరిగింది. భారత్ నుంచి దీనికి స్పీకర్ గా ఆహ్వానం అందటంతో నేను అక్కడకు వెళ్లటం జరిగింది. కాలేయానికి చేసే ఆపరేషన్లు, ఎదురయ్యే సమస్యల మీద ప్రసంగించటం జరిగింది.

 అనేక దేశాల నుంచి వచ్చిన డాక్టర్లు శ్రద్దగా వినటమే కాకుండా ఇంటరాక్షన్ కూడా బాగా జరిగింది. ముఖ్యంగా జీర్ణకోశ వ్యాధుల చికిత్సకు సంబంధించిన అనేక అంశాలపై చర్చ బాగా జరిగింది. దీంతోపాటు విభిన్న అంశాలపై పరిశోధనలు చేస్తున్న వైద్య నిపుణుల మధ్య పరిచయాలు జరిగాయి.

గతంలో కూడా ఫిలిప్పీన్స్ వెళ్లినప్పటికీ ఈ సారి వాతావరణం బాగుంది. అందుకే సదస్సు తర్వాత మన బారత్ నుంచి వచ్చిన ఇతర డాక్టర్ల తో కలిసి కాస్సేపు సిటీ టూర్ కు వెళ్లి వచ్చాం. అక్కడ ప్రజల స్థితిగతులు, జీవన విధానాలు బాగున్నాయి. మొత్తం మీద సింగపూర్ అయినా, మలేషియా అయినా, ఫిలీప్పిన్స్ అయినా.. ఆగ్నేయాసియా దేశాల్లో భారతీయుల్నిఅభిమానంగా చూస్తారని అర్థం అయింది.

పండుగ స్వీట్లు తీసుకొనే ముందు ఈ విషయం గమనించారా...



రాఖీ పండుగ అందరికీ ఒక మధురానుభూతి. ముఖ్యంగా సోదరీ, సోదరులకు అనుబంధాన్ని పంచే ఒక వేడుక. రక్షణ గురించి గుర్తు చేసే ఒక ఘట్టం. అందుకే దీన్ని అన్ని ప్రాంతాల్లో జరుపుకొంటారు. రాఖీ రోజున సోదరి ఒక రక్షాబంధాన్ని సోదరునికి కడుతుంది. ఆ తర్వాత స్వీట్లు పంచుకొని మధురానుభూతిని పంచుకొంటారు.

ఇంత వరకు బాగానే ఉంది. కానీ, స్వీట్ షాపుల్లో స్వీట్లు కొనేటప్పుడు, లేదా సామూహిక వేడుకల్లో స్వీట్లు పంచేటప్పుడు ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. స్వీట్ షాపు యజమాని లేదా ఫంక్షన్ ఇస్తున్న అతిథి చాలా శుభ్రతను పాటిస్తూ ఉండవచ్చు. కానీ అందులో స్వీట్ లు ప్యాక్ చేసి ఇచ్చే వ్యక్తి లేదా ఫంక్షన్ లో స్వీట్లు పంచుతున్న వ్యక్తి అదే వ్యక్తిగత శుభ్రత  ను పాటించక పోవచ్చు. (శుభ్రతను పాటిస్తే అంతా మంచిదే అనుకోండి) అందుచేత ఈ వ్యక్తులు చేతికి ప్లాస్టిక్ తొడుగు వాడుతున్నారో లేదో చూడండి. కొన్ని సందర్బాల్లో ఇది కనిపిస్తుంది,మరికొన్న సందర్బాలలో ఇది కనిపించక పోవచ్చు. అటువంటప్పుడు మాత్రం కచ్చితంగా ఈ గ్లోవ్స్ ను వాడమని చెప్పండి.
చాలావరకు క్రిములు చేతి శుభ్రత పాటించక పోవటం వల్లనే వ్యాపిస్తుంటాయి. తినే  ఆహార పదార్ధాల్ని రక రకాల చేతులతో కలియ బెట్టడం అన్నది అంత మంచిది కాదు. అందుచేత వేదికల మీద లేదా ఫంక్షన్ లు చేసేటప్పుడు స్వీట్లు తీసుకొని వచ్చి నోటిలో కుక్కుతుంటే సున్నితంగా వారించవచ్చు. తప్పేమీ కాదు, తప్పనిసరి అయితే కొద్ది గా తీసుకొని ఆ సందర్భాన్ని దాటించవచ్చ. అంతే కానీ మొహమాటానికి పోయి మొత్తానికి సమస్యల తెచ్చుకోవద్దు.
అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు

వీకెండ్స్ లో చిన్నపాటి జాగ్రత్త తీసుకొంటే ఫుల్ హ్యాపీస్...



చిన్న పాటి జాగ్రత్తలు ఇచ్చే ఫలితాలు చాలా బాగుంటాయి. కానీ చిన్న విషయమే కదా అని మనం నిర్లక్ష్యం చేస్తుంటాం. కానీ దీని ప్రభావం మాత్రం ఎక్కువగా కనిపిస్తుంటుంది. దీన్ని అంచనా వేయటంలో మనం పొరపాటు పడుతుంటాం. దీన్ని గమనించుకోవలసిన అవసరం ఉంది.

వీకెండ్ లో చాలా మంది బయటకు వెళ్లాలని కోరుకొంటాం. సాధారణంగా ఫుడ్ కూడా బయటే తీసుకొని ఇంటికి వెళుతుంటాం. అటువంటప్పుడు ఆహారం తీసుకొనే టప్పుడు ముందుగా చేతుల్ని శుభ్రం చేసుకోవటం మరిచిపోవద్దు. అక్కడ ఉండే సోప్ బాగోలేదనో, లేదా ఈ ఒక్కసారి ఏం చేస్తాం లే అనో వదిలేస్తుంటాం. కానీ హ్యాండ్ వాష్ అన్నది ఒక మంచి అలవాటు మాత్రమే కాదు. వందలాది క్రిముల్ని దూరం చేసే చిన్న టెక్నిక్ అందుకని మనం కాస్త కేర్ ఫుల్ గా ఉంటే బాగుంటుంది కదా..

ఈ సీజన్ లో ఈ జాగ్రత్త తీసుకోండి



వానలు కురుస్తున్నప్పుడు కొత్త నీరు వచ్చి చేరటం సహజం. ఈ సీజన్ లో కొన్ని రకాల సమస్యల్ని చూసుకోవాలి. లేదంటే చిన్న ఇబ్బందులే పెద్ద సమస్యలకు దారి తీస్తాయి. అటువంటి వాటిలో తాగునీటి విషయం ఒకటి. తాగునీరు తాగటం అందరికీ తప్పనిసరి. కానీ ఈ నీరు పరిశుభ్రంగా ఉందో లేదో చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మన పల్లెల్లో, పట్టణాల్లో  తాగునీరు సరఫరా చేసే పైప్ లైన్లు, మురుగు నీటిని తీసుకొని వెళ్లే పైప్ లైన్లు పక్క పక్కనే ప్రవహిస్తుంటాయి. స్నేహితుల మాదిరిగా ఒక్కోసారి పలకరించుకొంటూ ఉంటాయి. అటువంటప్పుడు పారిశుద్య గొట్టాల్లోని మురుగు నీరు .. తాగునీటిలో కలిసిపోయే అవకాశం ఉంది. అప్పుడు తాగునీరు కలుషితం అయిపోతుంది. కొన్ని సందర్బాల్లో ఈ విషయం బయట పడినా, చాలా సార్లు ఇది బయట పడదు. అటువంటప్పుడు కలుషిత నీటిని తాగిన వారంతా ఇబ్బంది పడతారు.
కలుషిత నీటితో డయేరియా వంటి ప్రమాదకరమైన వ్యాధులు వస్తుంటాయి. దీంతో పాటు కామెర్లు, కలరా వంటి రోగాలు వచ్చే అవకాశం ఎక్కువ. వందలాది వ్యాధి కారక క్రిములు తాగునీటితోనే వ్యాపిస్తాయని అంచనా. అటువంటప్పుడు ఈ రోగ కారక క్రిములు తేలిగ్గా వచ్చి పడతాయి. వీటితో ప్రమాదకరమైన వ్యాధులు వస్తుంటాయి. అందుచేత ఈ వ్యాధుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

ఈ సీజన్ లో శుద్ది చేసిన నీటినే తీసుకోవాలి. తాగునీటిని కాచిచల్లార్చాక తాగటం ఉత్తమం. లేదా నాణ్యత కలిగిన ఫిల్టర్ లో వడపోసి తీసుకోవాలి.  ఈ జాగ్రత్త తీసుకొంటే క్లీన్ వాటర్ ను పొందగలం. అప్పుడు ఈ సీజన్ లో క్లీన్ గా ఉండగలం.

ఎర్రగా నాజూగ్గా ఉంటే సరిపోతుందా..అసలు సంగతేమిటి..!

ఎర్రగా నాజూగ్గా ఉండటం మీద మొదటినుంచి అంచనాలు ఉంటాయి. ఎందుకంటే ఎరుపు ఎప్పుడూ ఆకర్షణీయం కాబట్టి అందరి దృష్టి అటు పడుతుంది. అంత మాత్రం చేత ఎరుపును తక్కువగా చెప్పవద్దు సుమా..అంత ఎందుకు శరీరంలో ఉండే కాలేయం కూడా ఎర్రగా, నవ నవలాడుతూ ఉంటుంది. కానీ ఇది చాలా కీలక పాత్ర పోషిస్తుంది.

ఇక శరీరంలోని గ్రంథుల్లో పెద్దదిగా కాలేయాన్ని చెబుతారు. దీని నుంచి ఎటువంటి ఎంజైమ్‌ లు విడుదల కావు. అంతమాత్రం చేత దీని ప్రాధాన్యం కొట్టిపారేయకూడదు సుమా..

మాన‌వ శ‌రీరంలో కాలేయం ఒక ప్రధాన అవ‌య‌వం. కాలేయం జీర్ణ వ్యవ‌స్థలో ప్రధానంగా ఉప‌యోగ‌పడుతుంది. కాలేయంలో పైత్యర‌సం త‌యార‌వుతుంది. ఇందులో ఉండే బైలిరుబిన్‌, బైలివిర్డిన్ అనే వ‌ర్ణక ప‌దార్థాలు ముఖ్యమైన‌వి. ఇవి కాలేయ వాహిక ద్వారా పేగు లో స్రావితం అవుతాయి. అక్కడ ఆహారంలోని క‌ఠిన‌ ప‌దార్థాల్ని విచ్ఛిన్నం చేయ‌టంలో ఉప‌క‌రిస్తాయి. ముఖ్యంగా కొవ్వు పదార్థాల్ని విడగ్గొట్టి తేలిగ్గా జీర్ణం చేయటంలో ఉపకరిస్తుంది. దీంతో పాటు మ‌లం త‌యార‌య్యే స‌మ‌యంలో పెద్ద పేగు ద్వారా అక్కడ‌కు చేరుకొని .. దానికి ప‌సుపు రంగును క‌లిగిస్తాయి.
చాలామంది ఇది జీర్ణ క్రియ‌లో మాత్రమే ఉప‌క‌రిస్తుంద‌ని భావిస్తారు. కానీ, ప్రోటీన్ సంశ్లేష‌ణ‌, డ్రగ్ మెట‌బాలిజం, శ‌రీర స‌మ‌తుల్యత‌, విస‌ర్జన వంటి అనేక ముఖ్య ప్రక్రియ‌ల్లో ప్రత్యక్షంగా, ప‌రోక్షంగా పాలు పంచుకొంటుంది. ప్రధాన జీవ‌న క్రియ‌ల్లో భూమిక పోషిస్తుండ‌టం వ‌ల్ల కాలేయాన్ని ప్రధాన అవ‌య‌వంగా చెబుతారు. అందుచేత శరీరంలో అనేక జీవన ప్రక్రియల్లో చురుగ్గా వ్యవహరించే కాలేయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవటం అవసరం.

దురలవాట్లకు దూరంగా ఉండటం, ముఖ్యంగా మద్యపానానికి దూరంగా ఉండటం ముఖ్యం. ఆరోగ్యకరమైన అలవాట్లు, పోషకాహారాన్ని నిర్దిష్ట వేళల్లో తీసుకోవటం, సురక్షిత తాగునీటిని ఉపయోగించటం వంటి అలవాట్లతో కాలేయాన్ని పదలి పరుచుకోవచ్చు. కాలేయ ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందని గుర్తించుకోవాలి.


ఈ శని, ఆది వారం రోజుల్లో ఇది గుర్తు పెట్టుకోండి..

శని వారం అంటే చాలా మందికి హుషారు వచ్చేస్తుంది. వీకెండ్‌ కాబట్టి ఆ మాత్రం జోష్‌ తప్పనిసరి. అంతే కాదు. మర్నాడు ఆదివారం కాబట్టి ఉదయమే లేచి ఉరుకులు, పరుగులతో ఆఫీసులకు, వ్యాపారాలకు పరుగులు పెట్టనక్కర లేదు. అందుకే శనివారం రాత్రి ఎంత ఆలస్యంగా పడుకొన్నా ఫర్వాలేదు అన్న ఫీలింగ్‌ ఉంటుంది. ఇంత వరకు మామూలు వ్యక్తుల షెడ్యూల్‌.
మరి మాడర్న్ మహా రాజుల షెడ్యూల్‌ ఏమిటంటారా.. ఈ మద్య కాలంలో యువత కానీ, పెద్ద వయస్సు కానీ ఆల్కహాల్‌ తాగటానికి అలవాటు పడుతున్నారు. ఆధునిక జీవన శైలిలో భాగంగా మందుకొట్టడం అన్నది ఫ్యాషన్‌ అయిపోయింది. మద్యం తాగని వాడు దున్నపోతై పుట్టున్‌.... అని ఏ కవి చెప్పలేదు కానీ, మాడర్న్ సొసైటీ లో మందు కొట్టని వాడిని అమాయక చక్రవర్తి గా చూస్తున్నారు. దీంతో కావాలని ఈ అలవాటు చేసుకొనే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది.

వాస్తవానికి మద్యపానం వలన అనేక రోగాలు ప్రబలుతున్నాయి. ముఖ్యంగా కాలేయ సమస్యల్లో అనేక ఇబ్బందులకు మద్యం తాగటం కారణంగా నిలుస్తోంది. కాలేయంలో ఈ ఆల్కహాల్‌ చేసే డ్యామేజ్‌ అంతా ఇంతా కాదు. ఆల్కహాల్‌ కడుపులో  చేరాక విష పదార్థాలుగా మారుతుంది. ఈ విష పదార్థాలు కాలేయంలో మకాం చేసి అక్కడ ఉండే సజీవ కణజాలాన్ని తినేసి సిర్రోసిస్‌, కొన్ని సార్లు క్యాన్సర్‌ కు దారి తీస్తున్నాయి.

అందుచేత శనివారం అనగానే ఎక్కడ పార్టీ ఉందో వెదక్కొని, అక్కడకు వెళ్లిపోయి మరీ మందు కొట్టే అలవాటు ఉంటే దాన్ని వదిలించుకోవటం మేలు. కొంత వరకు ఆల్కహాల్‌ తాగినా పర్వాలేదు అని చెబుతున్నారు కానీ ఇది ఎంత వరకు ఫర్వాలేదు అన్న దానిపై స్పష్టత లేదు. అందుచేత సాధ్యమైనంత వరకు ఈ అలవాటుని వదిలేసుకోవటం మేలు. ఇప్పటిదాకా ఆల్కహాల్ ముట్టని గుడ్‌ బాయ్స్ అయితే అదే గుడ్ బాయ్స్ గా కంటిన్యూ అయిపోండి.

ప్రత్యేక ప్రతిపత్తి (స్పెషల్‌ స్టేటస్‌) ఎందుకు..

ప్రత్యేక ప్రతిపత్తి కల్పించాలంటే కచ్చితంగా ఆ ప్రత్యేకత ఏమిటో తెలుసుకోవాలి. అప్పుడే దాని మీద అభిప్రాయం వెలిబుచ్చటానికి వీలవుతుంది.

శరీరంలో పాన్‌ క్రియాస్‌ (తెలుగులో క్లోమం అంటారు) గ్రంథికి ఈ విధమైన ప్రాధాన్యం ఉంది. శరీరంలో కొన్ని గ్రంథులు జీర్ణ క్రియకు అవసరమైన ఎంజైమ్‌ లను స్రవిస్తాయి. వీటిని నాళ గ్రంథులు అంటారు. అంటే ఈ గ్రంథికి ఉండే నాళం ద్వారా ఆయా ఎంజైమ్‌ లు విడుదల అవుతాయి. జీర్ణ క్రియ లో పాల్గొంటాయి. మరికొన్ని గ్రంథులు కేవలం హార్మోన్‌ లను స్రవిస్తాయి. ఇవి వినాళ గ్రంథులు. అంటే ఎటువంటి నాళాన్ని కలిగి ఉండవు. వీటి నుంచి ఉత్పత్తి అయ్యే హార్మోన్‌ లు నేరుగా రక్తంలో కలిసిపోయి ఆయా భాగాలకు చేరుకొంటాయి. అయితే పాన్‌ క్రియాస్‌ మాత్రం అటు నాళ గ్రంథిగా, ఇటు వినాళ గ్రంథిగా పనిచేస్తుంది. జీర్ణాశ‌యంలో ఎగువ భాగంలో దీన్ని గ‌మ‌నించ‌వ‌చ్చు. పాన్ క్రియాస్ లో ముఖ్యంగా రెండు విభాగాలు ఉంటాయి. మొద‌టి విభాగం ఎంజైమ్ ల‌ను ఉత్పత్తి చేసి చిన్న పేగు లో ఆహారాన్నిజీర్ణం చేయ‌టానికి ప‌ని చేస్తుంది. దీన్ని ఎక్సో క్రైన్ ప్యాన్ క్రియాస్ అంటారు. ఇందులో ముఖ్యమైన ఎంజైమ్ లు అమైలేజ్‌- పిండి ప‌దార్థాల్ని, లైపేజ్‌-కొవ్వు ప‌దార్థాల్ని, ట్రిప్సిన్‌- మాంస‌కృత్తుల్ని జీర్ణం చేస్తాయి. ఒక మాట‌లో చెప్పాలంటే ఆహారంలోని అన్ని ప్రధాన ప‌దార్థాల్ని పాన్ క్రియాటిక్ జ్యూసెస్ జీర్ణం చేస్తాయి. ఇది కాకుండా పాన్ క్రియాస్ లోని రెండో విభాగాన్ని ఎండో క్రైన్ పాన్ క్రియాస్ అంటారు. ఈ విభాగం అనేక ర‌కాల హార్మోన్ ల‌ను ఉత్పత్తి చేయ‌టం ద్వారా శ‌రీరంలోని గ్లూకోజ్ స్థాయిని నియంత్రిస్తుంది. ఈ విభాగంలోని ఇబ్బందులే డ‌యాబెటిస్ (మ‌ధుమేహం)కు దారి తీయ‌వ‌చ్చు. 

అందుచేత పాన్‌ క్రియాస్‌ కు ప్రత్యేక ప్రతిపత్తి ఉంటుందని అర్థం చేసుకోవాలి. ఈ విధమైన ప్రత్యేకత ఏ ఇతర భాగానికి లేదని గుర్తెరగాలి.