...

SPECIALIZED SITE FOR HUMAN HEALTH CARE,
SPECIALLY ON GASTROENTEROLOGY, LIVER AND PANCREAS

అదే అల‌వాటు ఇప్పుడు కొంప ముంచుతోందా..!

అల‌వాటు అనేది మొద‌ల‌వ్వాలే కానీ, త‌ర్వాత కాలంలో దాన్ని వ‌ద‌లుకోవ‌టం క‌ష్టమే. అల‌వాట్లు అంటే రెండు ర‌కాలు. మంచి ప‌నులు చేయ‌టం ఒక ర‌కం అయితే, చెడు ప‌నుల బాట ప‌ట్టడం మ‌రో ర‌కం. మొద‌టి కేట‌గిరీ తో స‌మ‌స్యలేదు కానీ, రెండో కేట‌గిరీ తో మాత్రం ఇబ్బంది త‌ప్పదు. చెడు అల‌వాట్లు అంటే పొగ తాగ‌టం, మ‌ద్యం తాగ‌టం, గుట్కా వంటి అల‌వాట్లుగా అంతా చెబుతారు. ఇందులో మ‌ద్యం తాగే అల‌వాటు తో వ‌చ్చే అన‌ర్థాలు గ‌త పోస్ట్ లో చూశాం. ముఖ్యంగా కాలేయానికి వ‌చ్చే అన‌ర్థం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

కాలేయం అంటే శ‌రీరంలోని అత్యంత ప్రధాన‌మైన అవ‌య‌వాల్లో ఒక‌టి. ఆహారం జీర్ణం కావ‌టంలో, ర‌క్త ప్రస‌ర‌ణ ప్రక్రియలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. మ‌ద్యం అతిగా సేవించ‌టం తో పాటు, రోజు క్రమం త‌ప్పకుండా మ‌ద్యం తాగ‌టం వ‌ల్ల అనేక అన‌ర్థాలు ఏర్పడుతాయి. మ‌ద్యం తాగ‌టం వ‌ల్ల కొన్ని రాడిక‌ల్స్ త‌యారుఅవుతాయి. ఇవి నేరుగా కాలేయ క‌ణాలు నాశ‌నం చేసి చెడు క‌లిగిస్తాయి. ఈ చెడు ప్రభావాన్ని మూడు ర‌కాలుగా గుర్తించ‌వ‌చ్చు. 1. ఫాటీ క‌ణాలు రూపుదిద్దుకోవటం.. కాలేయం లో కొవ్వుల సంశ్లేష‌ణ నిలిచి పోతుంది. మ‌ద్యం తాగే అల‌వాటుతో కొవ్వు సంబంధిత ప‌దార్థాలు పేరుకుపోయి కాలేయం ప‌ని తీరు లో ఇబ్బంది ఏర్పడుతుంది. దీంతో కాలేయం ఉనికిని కోల్పోతుంది.
2. ఆల్కహాలిక్ హెప‌టైటిస్.. కామెర్లు అనే సాధార‌ణ ప‌దంతో పిల్చుకొన్నప్పటికీ.. మ‌ద్యం తాగే వారికి తలెత్తే కామెర్లు ప్రమాద‌క‌ర‌మైన‌వి. కాలేయం నుంచి విడుద‌ల అయ్యే స్రావ‌కాల ఉత్పత్తి త‌గ్గి పోతుంది. దీంతో కాలేయ విధులు నిలిచిపోతాయి. ఫ‌లితంగా విష ప‌దార్థాలు పేరుకొనే అవ‌కాశం ఉంది.
3. సిర్రోసిస్.. కాలేయం లో అన‌ర్థ కార‌క ప‌దార్థాలు పేరుకొన్నప్పుడు కాలేయ‌వాహిక మూసుకొని పోయే ప‌రిస్థితి ఏర్పడుతుంది. దీంతో సిర్రోసిస్ రూపం దాలుస్తుంది. ఒక్క మాట‌లో చెప్పాలంటే కాలేయం క్రమంగా ప‌ని చేయ‌ని స్థితికి చేరిపోతుంది. అంతిమంగా కాలేయం చెడిపోయింది అని చెప్పాల్సి వ‌స్తుంది.

మొద‌ట‌గా ఫాటీ క‌ణాలు రూపు దిద్దుకొని, త‌ర్వాత కామెర్ల లోకి మారి, చివ‌రగా సిర్రోసిస్ రూపం దాల్చ వ‌చ్చు. ఏ క్రమంలో జ‌రిగినా ఫ‌లితం మాత్రం విషాదాంతం అనుకోవ‌చ్చు. వాస్తవానికి మ‌ద్యం లో ఉండే ఆల్కహాల్ ప‌దార్ధం ఆక్సీక‌ర‌ణ ప్రక్రియ ద్వారా అసిటాల్డిహైడ్ అనే ప‌దార్థంగా మారుస్తుంది. ఇది శ‌రీరంలో విష ప్రభావం చూపే కెమిక‌ల్‌. అందుచేత ఆల్కహాల్ ఎంత మోతాదు లో తీసుకొన్నా కానీ చేటు త‌ప్పద‌ని గుర్తుంచుకోవాలి. ఈ అల‌వాటు ఎప్పటికైనా కొంప ముంచుతుంద‌ని తెలుసుకోవాలి.

No comments:

Post a Comment