...

SPECIALIZED SITE FOR HUMAN HEALTH CARE,
SPECIALLY ON GASTROENTEROLOGY, LIVER AND PANCREAS

లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్‌..! చిన్న పాటి జాగ్రత్త తీసుకోగ‌ల‌రా..!


లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్‌..!.. నిజంగా చాలా అద్భుత‌మైన ప‌ద బంధం ఇది. జీవితాన్ని అందంగా ఆస్వాదించాల‌న్న ఆకాంక్షను మూడు ప‌దాల్లో చెప్పేశారు. ఆనందంగా ఆస్వాదించాలంటే ఆరోగ్యం ఎంతో ముఖ్యం అన్న సంగ‌తి తెలిసిందే. ఆరోగ్యాన్ని కాపాడుకోడానికి చాలా చాలా నియ‌మాలు, నిబంధ‌న‌లు పాటించాల‌ని చాలామంది అనుకొంటారు. అంత‌టి హ‌డావుడి ప‌క్కన పెడితే చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొంటే చాలా విలువైన ప్రయోజ‌నాలు ద‌క్కించుకోవ‌చ్చు.
ఆహారంలో తాగు నీరు చాలా అవ‌స‌రం అని ఇది వ‌ర‌కే తెలుసుకొన్నాం. కానీ, సుర‌క్షిత తాగునీరు చాలా అవ‌స‌రం. అంటే చాలా ఖ‌రీదైన ప్యూరీ ఫ‌యిర్ల్స్ కొనుక్కొని వాటిలో నీరు పోసి తాగాలని మాత్రం అనుకోవ‌ద్దు. ఫిల్టర్ వాట‌ర్ మాత్రమే సుర‌క్షితం అనుకోవ‌ద్దు. వీట‌న్నింటి క‌న్నా ముఖ్యంగా నీటిని కాచి చ‌ల్లార్చి తాగితే ఎంతో మేలు. ఈ చిన్నపాటి జాగ్రత్త తీసుకొనేందుకు మ‌న మ‌న‌స్సు అంగీక‌రించ‌దు.

నీటితో చాలా సూక్ష్మ జీవులు వ్యాపిస్తాయి. వీటిని వైర‌స్‌, బ్యాక్టీరియా, ప్రోటోజోవ‌న్లు, వ‌ర్మ్ జీవులు అని వ‌ర్గీక‌రించ‌వ‌చ్చు. వీటి ద్వారా వ‌చ్చే వ్యాధుల్ని వాట‌ర్ బార్న్ వ్యాధులు అంటారు. ఉదాహ‌ర‌ణ‌కు నీటిలో సంక్రమిత వైర‌స్ ఉంటే హెప‌టైటిస్ ఎ, హెప‌టైటిస్ ఈ అనే ర‌కపు కామెర్లు సోకుతాయి. డ‌యేరియా అనే ప్రమాద‌క‌ర వ్యాధి కూడా నీటి ద్వారానే సంక్రమిస్తుంది. బ్యాక్టీరియా తో టైఫాయిడ్‌, పారా టైఫాయిడ్‌, క‌ల‌రా వంటి రోగాలు సోకుతాయి. ఇత‌ర సూక్ష్మ జీవుల‌తో  అమీబియాసిస్ వంటి ఇబ్బందులు ఏర్పడుతాయి. వీటిలో కొన్ని ప్రాణాంత‌క వ్యాధులు కూడా..!
ఇన్ని వ్యాధులు సంక్రమించ‌టానికి నీరే కార‌ణం. ముఖ్యంగా ఈ వ‌ర్షాలు ప‌డే స‌మ‌యంలో తాగు నీటి పైప్ లైన్‌లు, మురుగు నీటి పైప్ లైన్ లు క‌లుస్తుంటాయి. మ‌న‌కు తెలియ‌కుండానే మురుగు నీరు, ఈ తాగునీటితో క‌లిసిపోతుంది. అటువంట‌ప్పుడు ఫిల్టర్ లు, ప్యూరిఫ‌యిర్లు ఎంత వ‌ర‌కు శుభ్రప‌రుస్తాయ‌న్నది ఆయా ప‌రికరాల నాణ్యత మీద ఆధార‌ప‌డి ఉంటుంది.

 అంత‌మాత్రాన ఈ పరికరాల్ని త‌ప్పు ప‌ట్టడం మ‌న ఉద్దేశం కానే కాదు. కానీ, సామాన్యులు సైతం ఈ ప‌రిక‌రాలు లేక‌పోయిన సుర‌క్షిత తాగునీటిని తీసుకోవ‌చ్చు అని చెప్పట‌మే మ‌న ఉద్దేశం. చ‌క్కగా కాచి చ‌ల్లార్చిన నీటిని తీసుకొంటే వాట‌ర్ బార్న్ డిసీజ్‌ల‌కు దూరంగా ఉండ‌వ‌చ్చు. కుటుంబ స‌భ్యులంతా ఆరోగ్యంగా ఉంటే జీవ‌తాన్ని అందంగా ఆస్వాదించ‌వ‌చ్చు. అప్పుడే క‌దా లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్‌..!...!

నీళ్లు ఎక్కువ తాగితే ఏమ‌వుతుంది..!


ఇటీవ‌ల కాలంలో తాగునీటి మీద అవ‌గాహ‌న పెరిగింది.గ‌తంతో పోల్చుకొంటే నీటిని ఎక్కువ‌గా తీసుకోవ‌టం అల‌వాటుగా మార్చుకొంటున్నారు. శ‌రీరానికి నీరు చాలా అత్యవ‌స‌ర అంశం అన‌టంలో ఎటువంటి సందేహం లేదు పైగా వివిధ ర‌కాల జీవ‌న క్రియ‌లు సాఫీగా జ‌ర‌గ‌టానికి తాగునీరు చాలా బాగా ఉప‌యోగ ప‌డుతుంది. అదే స‌మ‌యంలో చాలినంత నీరు ఉంటే జీవ‌నానికి స‌రిపోతుంది. అదే ప‌నిగా నీరు తాగితే మాత్రం ఇబ్బంది త‌ప్పదు.

స‌గ‌టున మాన‌వునికి ఒక రోజుకి మూడు లీట‌ర్ల నీరు స‌రిపోతుంది. నేరుగా తీసుకొనే నీటితో పాటు అడ‌పా ద‌డ‌పా ఆహార ప‌దార్థాల రూపంలో కూడా నీరు అందుతుంది. ఈ మాత్రం నీరు స‌రిపోతుంది. ఇంత‌కు మించితే మాత్రం జీర్ణాశ‌యం, కాలేయం మ‌రియు మూత్ర పిండాల ప‌నితీరు మీద ప్రభావం చూపుతుంది. అక్కడ నీరు ఎక్కువ‌గా పేరుకొని పోతే, ఇత‌ర ప‌దార్థాలు స‌క్రమంగా వినియోగించుకోవటం క‌ష్టత‌రం అవుతుంది. ఉదాహ‌ర‌ణ‌కు జీర్ణాశ‌యాన్ని తీసుకొంటే, క‌డుపులో సగం ఆహారం తీసుకొని, పావు భాగం నీటితో నింపి, పావు భాగాన్ని ఖాళీగా ఉంచుకోమ‌ని చెబుతారు. దీన్ని పాటించ‌కుండా అదే ప‌నిగా నీటితో నింపితే జీర్ణ వ్యవ‌స్థ ప‌నితీరు దెబ్బతింటుంది. దీంతో చిన్న ప్రేగుల మీద కూడా ఒత్తిడి ఏర్పడుతుంది.
ప‌గ‌టి పూట ఎక్కువ‌గా నీరు తీసుకొంటే రాత్రి పూట ఈ నీటి వినియోగం త‌గ్గించుకొంటే స‌రిపోతుంది. దీంతో నీటి వినియోగం స‌మ‌తుల్యంగా ఉంటుంది. ఈ విష‌యాన్ని ఎప్పటిక‌ప్పుడు క‌చ్చితంగా పాటించాల్సిన అవ‌స‌రం లేదు. కానీ, నీటిని స‌రాస‌రిన లెక్కవేసుకొంటే చాలు.

హాయిగా ఫుడ్డు తినండి.. చ‌క్కగా బ‌రువు త‌గ్గండి..!

బ‌రువు కి ఆహారానికి విడ‌దీయ‌రాని సంబంధం ఉంది. చాలామంది బ‌రువు త‌గ్గాలంటే ఆహారం తినటం త‌గ్గించాల‌ని అనుకొంటారు. ఇందులో కొంత వ‌ర‌కు వాస్తవం ఉంది. ఎక్కువ కొవ్వును మిగిల్చే ఆహారం తీసుకొంటే బ‌రువు పెర‌గ‌టం త‌థ్యం. ఇది స‌హ‌జ సూత్రం. అదే స‌మ‌యంలో ఆహారాన్ని త‌గ్గిస్తే మాత్రం కొంచెం ఇబ్బందే. శ‌రీరానికి అవ‌స‌ర‌మైన పోష‌కాలు అందించే ఆహారం తీసుకొంటూనే కొద్ది పాటి జాగ్రత్తలు తీసుకొంటే మాత్రం నాజూకుగా మారిపోవ‌చ్చు.ఇందుకోసం ఉప‌క‌రించే ఆహారం ఇప్పుడు చూద్దాం..

1.ఆకు కూర‌లు.. ఆకు కూర‌ల‌తో చాలా ఉప‌యోగం ఉంద‌న్న సంగ‌తి తెలిసిందే. వీటిని తీసుకొంటే కొవ్వు బెడ‌ద ఉండ‌దు, కానీ చ‌క్కటి పోష‌కాలు, ల‌వ‌ణాలు అందుతాయి. నడుము భాగంలో కొవ్వు పేరుకొని పోతోంద‌ని బెంగ ప‌డే వారికి ఇది చ‌క్కటి ప‌రిష్కారం. నూనెలో వేయించ‌కుండా, నీటితో ఉడికించుకొని పొడి ఆహారంగా తీసుకొంటే కావాల్సిన ప్రయోజ‌నాలు పొంద‌వ‌చ్చు.
2. పాలు, మ‌జ్జిగ‌.. పెరుగు, మీగ‌డ‌ల‌తో కొవ్వు పెరిగే అవ‌కాశం ఉంది. కానీ, పాలు, ప‌ల్చటి మ‌జ్జిగ‌తో ఈ ఇబ్బంది ఉండ‌దు. పైగా శ‌రీరానికి కావ‌ల్సిన కాల్షియం అందుతుంది. కాల్షియం తో శ‌రీర ప‌టుత్వం సాధ్యం అవుతుంది.
3. గుడ్లు.. గుడ్డు ఎక్కువ‌గా తీసుకొంటే ప్రొటీన్స్ ఎక్కువ‌గా చేర‌తాయి. కండ‌రాలు గట్టి ప‌డేందుకు ఇది చాలా అవ‌స‌రం. విటమిన్ బీ 12, తో పాటు ఎనిమిదిర‌కాల ల‌వ‌ణాలు, కాల్షియం, ఐర‌న్ వంటి పోష‌కాలు ల‌భిస్తాయి. జీవ‌న‌క్రియ‌లు సాఫీ గా జ‌రిగేందుకు అవ‌స‌ర‌మైన అన్ని అంశాలు గుడ్డులో దొర‌కుతాయి.

4. చేప‌లు.. మాంసాహారంలో కోడిమాంసం, మేక మాంసం వంటి వాటిక‌న్నా చేప‌లు మేలు అని చెబుతారు. వీటితో కొవ్వులు క‌ర‌గ‌టంతో పాటు ప్రోటీన్లు స‌మృద్ధిగా ల‌భిస్తాయి. ఒత్తిడి సంబంధిత ర‌సాయ‌నాలు పేరుకోకుండా నిరోధించ‌టం ద్వారా లావు కాకుండా నివారించ‌వ‌చ్చు. చ‌క్కటి ల‌వ‌ణాలు ల‌భించ‌టం మ‌రో ఉప‌యోగ‌క‌ర‌మైన అంశం.
5. గ్రీన్ టీ.. తాజా గ్రీన్ టీ తో ఉత్సాహం క‌లుగుతుంది. మెద‌డు చురుగ్గా ఉండ‌టం ద్వారా అన‌వ‌స‌ర‌పు ర‌సాయ‌నాల స్రావ‌కాన్ని నిరోధించ‌వ‌చ్చు.
శ‌రీరంలో అన‌వ‌స‌ర‌పు నిల్వల్ని తొల‌గించ‌టంలో గ్రీన్ టీ ఉప‌క‌రిస్తుంది.
ఈ ఐదు ర‌కాల ఆహారాన్ని తీసుకోవ‌టం ఎంత ముఖ్యమో, కొవ్వును మిగిల్చే జంక్ ఫుడ్ ల‌కు దూరంగా ఉండ‌టం అంత ప్రధానం. ఐస్ క్రీమ్‌లు, బ‌ర్గర్ల, స్వీట్స్ ను దూరం పెడితే బ‌రువు త‌గ్గటం సాధ్యం అవుతుంది.

మీ ఫుడ్ కు ఒక చిక్కుంది.. దానికో లెక్కుంది..!


ఆహారం తీసుకోవ‌టంలో ఒక చిక్కు ఉంది. కానీ దీన్ని ఒక లెక్క ద్వారా ప‌రిష్కరించుకోవ‌చ్చన్న మాట‌. అదేమిటో ఇప్పుడు తెలుసుకొందాం.
శ‌రీరం దైనందిక క్రియ‌లు నెర‌వేర్చుకొనేందుకు శ‌క్తి అవ‌స‌రం. దీన్ని క్యాల‌రీల్లో కొలుస్తారు. ఈ శ‌క్తి వినియోగం అన్నది జీవ‌న శైలి మీద ఆధార ప‌డి ఉంటుంది. శారీర‌క క‌ష్టం చేసేవారి విష‌యంలో ఒక ర‌కంగా ఉంటే, నీడ ప‌ట్టున ఉండి ఉద్యోగాలు చేసే వారికి ఒక ర‌కంగా ఉంటుంది. ప‌ల్లె జీవుల్లో ఆయా వృత్తి వ్యవ‌హారాల మీద ఈ క్యాల‌రీల వినియోగం మారుతూ ఉంటుంది. ప‌ట్టణ, న‌గ‌ర వాసుల విష‌యంలో ఈ క్యాల‌రీల వినియోగం దాదాపుగా ఒకే మాదిరి ఉంటుంది. ఈ వ్యాసంలో మాత్రం ఆహారంలో తాజా పండ్లు, కూర‌గాయ‌ల వినియోగం గురించి చ‌ర్చించుకొందాం..

శ‌రీరానికి అవ‌స‌ర‌మైన ప‌దార్థాల్లో పిండిప‌దార్థాలు, మాంస‌కృత్తులు, కొవ్వులు ముఖ్యమైన‌వి. వీటితో పాటు ల‌వణాలు, విట‌మిన్‌లు, సూక్ష్మ పోష‌కాలు అవ‌స‌రం. అన్నం, పెరుగు వంటి వాటి ద్వారా పిండి ప‌దార్థాలు, కొవ్వులు అందుతుంటాయి. కానీ, ముఖ్యమైన మాంస‌కృత్తులు, ల‌వ‌ణాలు, విట‌మిన్స్ కోసం త‌ప్పనిస‌రిగా కూర‌గాయ‌లు లేదా మాంసాహారం మీద ఆధార ప‌డాలి. పైగా ఈ మాంస‌కృత్తులు(ప్రొటీన్స్) లేక‌పోతే మాత్రం చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. అందుచేత ఆహారంలో కూర‌గాయ‌లు త‌ప్పనిస‌రి. అటు, ల‌వ‌ణాలు, విట‌మిన్స్ కోసం పండ్లు కూడా త‌ప్పనిస‌రి.

పండ్లు, కూర‌గాయ‌లు ఏ మేర‌కు అవ‌స‌రం అనే విష‌యంలో ఒక లెక్క ఉంది. ప‌ట్టణ లేక న‌గ‌ర జీవులు అర గంట కు మించి శారీర‌క శ్రమ ఉండ‌దు అన్న సాదార‌ణ సూత్రం ప్రకారం దీన్ని గ‌ణించ‌వ‌చ్చు. పురుషుల విష‌యంలో పాతికేళ్ల లోపు వ‌య‌సు వారికి 2,600 క్యాల‌రీలు అవ‌స‌రం. అందుచేత రెండు క‌ప్పుల పండ్లు, మూడున్నర క‌ప్పుల కూర‌ అవ‌స‌రం ఉంటాయి. పాతికేళ్లు దాటిన వారికి 2,200 క్యాల‌రీలు అవ‌స‌రం కాబ‌ట్టి రెండు క‌ప్పుల పండ్లు, మూడు క‌ప్పుల కూర అవ‌స‌రం ఉంటుంది. మ‌హిళల విష‌యానికి వ‌స్తే పాతికేళ్ల లోపు వ‌య‌సు వారికి 2,000 క్యాల‌రీలు అవ‌స‌రం. అందుచేత రెండు క‌ప్పుల పండ్లు, రెండున్నర క‌ప్పుల కూర అవ‌స‌రం. పాతిక సంవ‌త్సరాల వ‌య‌సు దాటిన వారికి 1800 క్యాల‌రీలు అవ‌స‌రం. అందుచేత ఒక‌టిన్నర క‌ప్పుల పండ్లు, రెండున్నర క‌ప్పుల కూర అవ‌సరం.
వాస్తవానికి కొద్దో గొప్ప కూర‌లు రోజూ తీసుకొంటారు. కానీ, చాలామంది పండ్లు రోజు తీసుకొనే అల‌వాటు ఉండ‌దు. ఇది చాలా త‌ప్పు. పండ్లు ద్వారా శ‌రీరానికి అవ‌స‌ర‌మైన ల‌వ‌ణాలు, పోష‌కాలు అందుతుంటాయి. అందుచేత పండ్లు రోజూ తీసుకోవ‌టం అల‌వాటు చేసుకోవాలి. దీంతోపాటు కూర కూడా ఎక్కువ తీసుకోవ‌టం ఉత్తమం.

బ‌రువు త‌గ్గించుకొనేందుకు ఒక చిట్టి చిట్కా..!


బ‌రువు త‌గ్గించుకోవాల‌న్న ఆరాటం ఇటీవ‌ల కాలంలో ఎక్కువైంది. సైజు త‌గ్గించుకోవ‌టం ఒక ఎత్తయితే, బ‌రువు కు క‌ళ్లేం వేయాల‌న్న ఆరాటం అధికంగాఉంది. ఈ టెన్షన్ లో తిండి మానలేక‌, బ‌రువు త‌గ్గలేక ఇబ్బంది ప‌డుతుంటారు. ఇటువంటి వారి కోసం ఒక చిట్కా చెబుతున్నారు వైద్యులు. నీటిని తాగ‌టం పెంచితే ఆటోమేటిక్ గా బ‌రువు త‌గ్గవ‌చ్చట‌..! విన‌టానికి వింత‌గా ఉన్నా, ఇది నిజం అంటున్నారు. ద జ‌ర్నల్ ఆఫ్ క్లినిక‌ల్ ఎండోక్రైనాల‌జీ అండ్ మెట‌బాల‌జీ అనే వైద్య శాస్త్ర సంచిక‌లో ఈ విష‌యాన్ని వెల్లడించారు.

వాస్తవానికి మెద‌డుకి ఆక‌లి, దాహం మధ్య తేడా పెద్దగా తెలీదు. రెండు విష‌యాల్లో ఒకే ర‌కమైన సిగ్నల్స్ అందుతాయ‌ట‌. అందుచేత జీర్ణాశ‌యంలో కాస్తంత నీటిని నింపితే క‌డుపు నిండుతున్నట్లుగా ఉంటుంది. దీంతో తీసుకొనే ఆహారం ప‌రిణామం త‌గ్గుతుంది. ఆహారం లో ఉండే నీటి విలువ‌తో ఈ తాగునీటి విలువ క‌లుపుకొంటే క‌డుపులో ప‌దార్థం ప‌రిణామం పెరుగుతుంది. దీంతో పాటుగా నీటిలో ఉండే ల‌వ‌ణాలు ఈ మోతాదు పెంపుకి తోడ్పడుతాయి. పైగా నీటిలో ఎటువంటి క్యాల‌రీల శ‌క్తి ఉండ‌దు. ఈ క్యాల‌రీల గోల లేకుండా క‌డుపుని నింపేసుకొనే చాన్స్ అన్న మాట‌.

అందుచేత చ‌క్కగా నీటిని తాగ‌టం ద్వారా ఈ ప‌రిస్థితిని అదుపుచేసుకోవ‌చ్చు. ఒక లెక్క ప్రకారం రోజుకి ఒక లీట‌రున్నర నీటిని ఎక్కువ‌గా తాగితే 17 వేల 400 క్యాల‌రీలు క‌రుగుతాయి.అంటే దాదాపు రెండు కిలోల బ‌రువుకి ఎస‌రు పెట్టవ‌చ్చు. నెల రోజుల క్రమంలో ఈ ఫ‌లితాన్ని చూడ‌వ‌చ్చట‌. అంత మాత్రాన అదే ప‌నిగా నీటిని తాగేస్తే మాత్రం కొంప కొల్లేరు అవుతుంది సుమా..!

ఆహారంలో పంచామృతం..


ఆహారంలో ఐదు ర‌కాల అమృతాలు ఉన్నాయి. అవి మీకు తెలుసా..ఆహారం చ‌క్కగా జీర్ణం అయి, శ‌రీరంలో చ‌క్కగా శ‌క్తి క‌లిసి పోతే అది అమృత‌మే అవుతుంది క‌దా..దీన్ని బ‌ట్టి చూస్తే ఐదు ర‌కాల ఆహారాలు తేలిగ్గా జీర్ణం అవుతాయ‌ని గుర్తించారు. అవేమిటో ఇప్పుడు చూద్దాం..

1. అన్నం.. చూడ‌టానికి సాదా సీదాగా ఉన్నా అన్నం .. తేలిగ్గా జీర్ణం అయ్యే ఆహారం. కూర‌లు, సాంబారు వంటివే గాకుండా పాలు, పెరుగు వంటి వాటితో క‌లుపుకొని అన్నం తింటూ ఉంటారు. అయితే ఏ ప‌దార్థంతో క‌లిపినా కానీ, అన్నం స్వభావ రీత్యా తేలిగ్గా జీర్ణం అయ్యే ల‌క్షణం క‌లిగి ఉంటుంది. అందుకే అన్నం ప‌ర‌బ్రహ్మ స్వరూపం అన్న సూక్తి జ‌నించి ఉంటుంది. అన్నం ద్వారా ఎక్కువ‌గా పోష‌క ప‌దార్థాలు శ‌రీరానికి స‌మ‌కూర‌తాయి.

2. చికెన్.. మాంసాహారంలో చికెన్ త్వర‌గా జీర్ణం అయ్యే ల‌క్షణం క‌లిగి ఉంటుంది. మ‌ట‌న్‌, చేప‌లు, పీత‌లు వంటి వాటికి గ‌ట్టి జీర్ణ స్వభావం ఉంటుంది. చికెన్ ను తేలిగ్గా జీర్ణించుకోవ‌చ్చు. పైగా భార‌త్ వంటి దేశాల్లో ఇది కామ‌న్ గా ఉండే నాన్ వెజ్ డిష్‌. ప‌ల్లెల్లో, ప‌ట్టణాల్లో కూడా విరివిగా దొరికే మాంసాహారం ఇది.

3. సూప్‌.. బోజ‌నంలో చారు, ర‌సం వంటివి జోడించుకోవ‌టం ఎప్పటినుంచో ఉన్న అల‌వాటు. ఆహారానికి మొద‌ట‌గా కొంచెం సూప్ తీసుకోవ‌టం మోడ‌ర్న్ మెనూ లో త‌ప్పనిస‌రి. రుచిగా ఉండ‌టంతో పాటు ఇందులో ఇంకో ప‌ర‌మార్థం కూడా ఉంది. కొంచెం కారం, కొంచెం ఉప్పగా ఉండే సూప్ తీసుకోవ‌టంతో నాలుక మీద ఉండే రుచిమొగ్గలు క్రియాశీల‌కంగా మార‌తాయి. దీంతో త‌ర్వాత తీసుకొనే ఆహారంలోని అన్ని రుచులు చ‌క్కగా తెలుస్తాయి. ఫ‌లితంగా అన్ని రుచుల్ని ఆస్వాదించేందుకు వీల‌వుతుంది.

4. పండ్లు.. ఆహారంలో పండ్లు, పండ్ల ముక్కలు వంటివి జోడిస్తే చ‌క్కగా జీర్నం అవుతాయి. అంతే గాకుండా పండ్లను తీసుకొంటే జీర్ణాశ‌యం శుభ్ర ప‌ర‌చుకొనేందుకు వీల‌వుతుంది. పండ్ల లో ఉంటే కొన్ని ర‌కాల జీవ ర‌సాయ‌నాలు యాక్టివేట‌ర్స్ గా ఉప‌క‌రిస్తాయి. పండ్లను స‌లాడ్ గా, పండ్ల ర‌సాలుగా, చిన్న ముక్కలుగా తీసుకొనే అల‌వాటు ఉన్నది.

5. ఆకు కూర‌లు... ఆకు కూర‌లు, ఆకుల‌తో కూడిన క్యాబేజీ వంటివి పోష‌క విలువ‌లు క‌లిగి ఉంటాయి. అంతేగాకుండా త్వర‌గా ప‌చ‌నం అవుతాయి. ఈ ఆకు కూర‌ల‌ను జోడించ‌టంతో ఆహారం చ‌క్కటి పోష‌క స‌మ‌తుల్యత క‌లిగి ఉంటుంది.

ఆహారం తీసుకోవ‌టంలో మెళ‌కువ‌లు అవ‌స‌ర‌మా..!


ఆరోగ్యమే మ‌హా భాగ్యం అంటారుక‌దా..! అటువంటి ఆరోగ్యానికి ఆహారానికి ఉన్న అనుబంధం అంతా ఇంతా కాదు.ఆహారం తీసుకోవ‌టంలో కొద్ది పాటి మెళ‌కువ‌లు పాటిస్తే ఆరోగ్యాన్ని మ‌హా భాగ్యం గా కాపాడుకోవ‌చ్చు. ఆ మెళ‌కువలు ఇప్పుడు చూద్దాం..

ఆహారం తీసుకోగానే జీర్ణాశ‌యంలో కొన్ని స్రావ‌కాలు ఊర‌టం మొద‌ల‌వుతాయి. అందుచేత మొద‌ట‌గా ఆహారంలోని ప‌దార్థాలు లోప‌ల‌కు ప్రవేశించ‌గానే .. ఇందుకు సంబంధించిన సిగ్నల్స్ అందిపోతాయి అన్న మాట‌. దీంతో ఆహారం లోప‌ల‌కు ప్రవేశిస్తుంది కాబ‌ట్టి జీర్ణం చేయ‌టానికి కావ‌ల‌సిన స‌రంజామా రెడీ అవుతుంది. తీరా చేసి ఆ స‌మ‌యానికి కొద్ది పాటి చిరుతిళ్లు తినేసి, త‌ర్వాత బై చెప్పేస్తే ఈ ఏర్పాట్లు అన్నీ వృధా అయిపోతాయ‌న్న మాట‌. ముఖ్యంగా చాలామంది ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లేప్పుడు చాట్ కానీ, స్నాక్స్ కానీ తీసుకొని క‌డుపుని కాస్తంత ఇబ్బంది పెట్టి ఆ త‌ర్వాత ఇంటికి తాపీగా వెళ‌తారు. ఆ త‌ర్వాత భోజ‌నానికి ఉప‌క్రమిస్తారు. దీని వ‌ల్ల క‌డుపు కూడా మ‌నమీద విసుక్కొంటుంది. ఈ విసుగుద‌ల తో స‌రిగ్గా ప‌ని చేయ‌టానికి మొండికేస్తుంద‌న్న మాట‌. అందుచేత భోజ‌నం చేసే స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు చిరుతిళ్ల వైపు వెళ్ల కుండా ఉండే మేలు. ఈ లోగా ఆక‌లి అంటూ బెల్స్ మోగుతూ ఉంటాయి కాబ‌ట్టి నేరుగా భోజ‌నం చేసేలా ప్లాన్ చేసుకోవాలి.

దీంతో పాటు భోజ‌నంలో కొంత ప‌దార్థం తినేసి టీవీ సీరియ‌ల్స్ లో మునిగిపోయి, ఆ త‌ర్వాత వాణిజ్య ప్రక‌ట‌న‌లు వ‌చ్చినప్పుడు మిగతా భాగం తినే అల‌వాటు కొంద‌రికి ఉంటుంది, సారీ చాలామందికే ఉండ‌వ‌చ్చు. కానీ, ఇది కూడా స‌రికాదు, ఎందుకంటే ఆహారం లోప‌ల‌కు ప్రవేశించాక అన్నవాహిక‌, జీర్ణాశ‌యం, కాలేయం, క్లోమం, శేషాంత్రికం, పిత్తాశ‌యం, పెద్ద ప్రేగు వంటి అనేక భాగాలు ఉత్తేజితం అవుతాయి.అక్కడ జీర్ణ ప్రక్రియ ఒక నిర్దిష్ట ప‌ద్దతిలో జ‌రుగుతుంది. దీనికి ప‌దే ప‌దే అంత‌రాయం క‌లిగించ‌టం స‌రికాదు. అదే స‌మ‌యంలో ఒకేసారి ఆహారాన్ని పెద్ద మొత్తంలో తీసుకోవ‌టం క‌న్నా వాయిదాల ప‌ద్దతిలో తిన‌టం మేలు అన్న వాద‌న ఉంది. దీని వివ‌రాలు త్వర‌లోనే తెలుసుకొందాం...