బరువు తగ్గించుకోవాలన్న ఆరాటం ఇటీవల కాలంలో ఎక్కువైంది. సైజు తగ్గించుకోవటం ఒక ఎత్తయితే, బరువు కు కళ్లేం వేయాలన్న ఆరాటం అధికంగాఉంది. ఈ టెన్షన్ లో తిండి మానలేక, బరువు తగ్గలేక ఇబ్బంది పడుతుంటారు. ఇటువంటి వారి కోసం ఒక చిట్కా చెబుతున్నారు వైద్యులు. నీటిని తాగటం పెంచితే ఆటోమేటిక్ గా బరువు తగ్గవచ్చట..! వినటానికి వింతగా ఉన్నా, ఇది నిజం అంటున్నారు. ద జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రైనాలజీ అండ్ మెటబాలజీ అనే వైద్య శాస్త్ర సంచికలో ఈ విషయాన్ని వెల్లడించారు.
వాస్తవానికి మెదడుకి ఆకలి, దాహం మధ్య తేడా పెద్దగా తెలీదు. రెండు విషయాల్లో ఒకే రకమైన సిగ్నల్స్ అందుతాయట. అందుచేత జీర్ణాశయంలో కాస్తంత నీటిని నింపితే కడుపు నిండుతున్నట్లుగా ఉంటుంది. దీంతో తీసుకొనే ఆహారం పరిణామం తగ్గుతుంది. ఆహారం లో ఉండే నీటి విలువతో ఈ తాగునీటి విలువ కలుపుకొంటే కడుపులో పదార్థం పరిణామం పెరుగుతుంది. దీంతో పాటుగా నీటిలో ఉండే లవణాలు ఈ మోతాదు పెంపుకి తోడ్పడుతాయి. పైగా నీటిలో ఎటువంటి క్యాలరీల శక్తి ఉండదు. ఈ క్యాలరీల గోల లేకుండా కడుపుని నింపేసుకొనే చాన్స్ అన్న మాట.
అందుచేత చక్కగా నీటిని తాగటం ద్వారా ఈ పరిస్థితిని అదుపుచేసుకోవచ్చు. ఒక లెక్క ప్రకారం రోజుకి ఒక లీటరున్నర నీటిని ఎక్కువగా తాగితే 17 వేల 400 క్యాలరీలు కరుగుతాయి.అంటే దాదాపు రెండు కిలోల బరువుకి ఎసరు పెట్టవచ్చు. నెల రోజుల క్రమంలో ఈ ఫలితాన్ని చూడవచ్చట. అంత మాత్రాన అదే పనిగా నీటిని తాగేస్తే మాత్రం కొంప కొల్లేరు అవుతుంది సుమా..!
No comments:
Post a Comment