ఆరోగ్యమే మహా భాగ్యం అంటారుకదా..! అటువంటి ఆరోగ్యానికి ఆహారానికి ఉన్న అనుబంధం అంతా ఇంతా కాదు.ఆహారం తీసుకోవటంలో కొద్ది పాటి మెళకువలు పాటిస్తే ఆరోగ్యాన్ని మహా భాగ్యం గా కాపాడుకోవచ్చు. ఆ మెళకువలు ఇప్పుడు చూద్దాం..
ఆహారం తీసుకోగానే జీర్ణాశయంలో కొన్ని స్రావకాలు ఊరటం మొదలవుతాయి. అందుచేత మొదటగా ఆహారంలోని పదార్థాలు లోపలకు ప్రవేశించగానే .. ఇందుకు సంబంధించిన సిగ్నల్స్ అందిపోతాయి అన్న మాట. దీంతో ఆహారం లోపలకు ప్రవేశిస్తుంది కాబట్టి జీర్ణం చేయటానికి కావలసిన సరంజామా రెడీ అవుతుంది. తీరా చేసి ఆ సమయానికి కొద్ది పాటి చిరుతిళ్లు తినేసి, తర్వాత బై చెప్పేస్తే ఈ ఏర్పాట్లు అన్నీ వృధా అయిపోతాయన్న మాట. ముఖ్యంగా చాలామంది ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లేప్పుడు చాట్ కానీ, స్నాక్స్ కానీ తీసుకొని కడుపుని కాస్తంత ఇబ్బంది పెట్టి ఆ తర్వాత ఇంటికి తాపీగా వెళతారు. ఆ తర్వాత భోజనానికి ఉపక్రమిస్తారు. దీని వల్ల కడుపు కూడా మనమీద విసుక్కొంటుంది. ఈ విసుగుదల తో సరిగ్గా పని చేయటానికి మొండికేస్తుందన్న మాట. అందుచేత భోజనం చేసే సమయం వచ్చినప్పుడు చిరుతిళ్ల వైపు వెళ్ల కుండా ఉండే మేలు. ఈ లోగా ఆకలి అంటూ బెల్స్ మోగుతూ ఉంటాయి కాబట్టి నేరుగా భోజనం చేసేలా ప్లాన్ చేసుకోవాలి.
దీంతో పాటు భోజనంలో కొంత పదార్థం తినేసి టీవీ సీరియల్స్ లో మునిగిపోయి, ఆ తర్వాత వాణిజ్య ప్రకటనలు వచ్చినప్పుడు మిగతా భాగం తినే అలవాటు కొందరికి ఉంటుంది, సారీ చాలామందికే ఉండవచ్చు. కానీ, ఇది కూడా సరికాదు, ఎందుకంటే ఆహారం లోపలకు ప్రవేశించాక అన్నవాహిక, జీర్ణాశయం, కాలేయం, క్లోమం, శేషాంత్రికం, పిత్తాశయం, పెద్ద ప్రేగు వంటి అనేక భాగాలు ఉత్తేజితం అవుతాయి.అక్కడ జీర్ణ ప్రక్రియ ఒక నిర్దిష్ట పద్దతిలో జరుగుతుంది. దీనికి పదే పదే అంతరాయం కలిగించటం సరికాదు. అదే సమయంలో ఒకేసారి ఆహారాన్ని పెద్ద మొత్తంలో తీసుకోవటం కన్నా వాయిదాల పద్దతిలో తినటం మేలు అన్న వాదన ఉంది. దీని వివరాలు త్వరలోనే తెలుసుకొందాం...
నమస్కారమండి.మీరు చెప్పే ఆరోగ్య విషయాలన్నీ చాలా బాగున్నయండి.
ReplyDelete