ఆహారం తీసుకోవటంలో ఒక చిక్కు ఉంది. కానీ దీన్ని ఒక లెక్క ద్వారా పరిష్కరించుకోవచ్చన్న మాట. అదేమిటో ఇప్పుడు తెలుసుకొందాం.
శరీరం దైనందిక క్రియలు నెరవేర్చుకొనేందుకు శక్తి అవసరం. దీన్ని క్యాలరీల్లో కొలుస్తారు. ఈ శక్తి వినియోగం అన్నది జీవన శైలి మీద ఆధార పడి ఉంటుంది. శారీరక కష్టం చేసేవారి విషయంలో ఒక రకంగా ఉంటే, నీడ పట్టున ఉండి ఉద్యోగాలు చేసే వారికి ఒక రకంగా ఉంటుంది. పల్లె జీవుల్లో ఆయా వృత్తి వ్యవహారాల మీద ఈ క్యాలరీల వినియోగం మారుతూ ఉంటుంది. పట్టణ, నగర వాసుల విషయంలో ఈ క్యాలరీల వినియోగం దాదాపుగా ఒకే మాదిరి ఉంటుంది. ఈ వ్యాసంలో మాత్రం ఆహారంలో తాజా పండ్లు, కూరగాయల వినియోగం గురించి చర్చించుకొందాం..
శరీరానికి అవసరమైన పదార్థాల్లో పిండిపదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వులు ముఖ్యమైనవి. వీటితో పాటు లవణాలు, విటమిన్‌లు, సూక్ష్మ పోషకాలు అవసరం. అన్నం, పెరుగు వంటి వాటి ద్వారా పిండి పదార్థాలు, కొవ్వులు అందుతుంటాయి. కానీ, ముఖ్యమైన మాంసకృత్తులు, లవణాలు, విటమిన్స్ కోసం తప్పనిసరిగా కూరగాయలు లేదా మాంసాహారం మీద ఆధార పడాలి. పైగా ఈ మాంసకృత్తులు(ప్రొటీన్స్) లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. అందుచేత ఆహారంలో కూరగాయలు తప్పనిసరి. అటు, లవణాలు, విటమిన్స్ కోసం పండ్లు కూడా తప్పనిసరి.
పండ్లు, కూరగాయలు ఏ మేరకు అవసరం అనే విషయంలో ఒక లెక్క ఉంది. పట్టణ లేక నగర జీవులు అర గంట కు మించి శారీరక శ్రమ ఉండదు అన్న సాదారణ సూత్రం ప్రకారం దీన్ని గణించవచ్చు. పురుషుల విషయంలో పాతికేళ్ల లోపు వయసు వారికి 2,600 క్యాలరీలు అవసరం. అందుచేత రెండు కప్పుల పండ్లు, మూడున్నర కప్పుల కూర అవసరం ఉంటాయి. పాతికేళ్లు దాటిన వారికి 2,200 క్యాలరీలు అవసరం కాబట్టి రెండు కప్పుల పండ్లు, మూడు కప్పుల కూర అవసరం ఉంటుంది. మహిళల విషయానికి వస్తే పాతికేళ్ల లోపు వయసు వారికి 2,000 క్యాలరీలు అవసరం. అందుచేత రెండు కప్పుల పండ్లు, రెండున్నర కప్పుల కూర అవసరం. పాతిక సంవత్సరాల వయసు దాటిన వారికి 1800 క్యాలరీలు అవసరం. అందుచేత ఒకటిన్నర కప్పుల పండ్లు, రెండున్నర కప్పుల కూర అవసరం.
వాస్తవానికి కొద్దో గొప్ప కూరలు రోజూ తీసుకొంటారు. కానీ, చాలామంది పండ్లు రోజు తీసుకొనే అలవాటు ఉండదు. ఇది చాలా తప్పు. పండ్లు ద్వారా శరీరానికి అవసరమైన లవణాలు, పోషకాలు అందుతుంటాయి. అందుచేత పండ్లు రోజూ తీసుకోవటం అలవాటు చేసుకోవాలి. దీంతోపాటు కూర కూడా ఎక్కువ తీసుకోవటం ఉత్తమం.