...

SPECIALIZED SITE FOR HUMAN HEALTH CARE,
SPECIALLY ON GASTROENTEROLOGY, LIVER AND PANCREAS

ఆధారాలు దొరికాయి..!


ఆధారం అనే దానికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఏ విష‌యంలో అయినా ఆధారం ఉంటేనే న‌మ్మ గ‌లుగుతాం. లేదంటే ఆ విష‌యాన్ని అక్కడితో వదిలేస్తాం. అందుకే ఆధారానికి గుర్తింపు ఉంటుంది. ముఖ్యంగా శాస్త్రీయ‌మైన అంశాల్ని ఆధారం ఉంటేనే ప‌రిగ‌ణించ‌గ‌లుగుతాం.

రెడ్ మీట్ తినే అల‌వాటుతో అన‌ర్థం ఉంద‌నేది ఎప్పటినుంచో చెబుతున్న విష‌యం. కానీ దీనికి హార్వర్డ్ మెడిక‌ల్ స్కూల్ ప‌రిశోధ‌కులు ఆధారాలు సంపాదించారు. దాదాపు ఒక ల‌క్షా 20వేల మందిలో ప‌రిశోధ‌న‌లు జ‌రిపిన త‌ర్వాత రెడ్ మీట్ ఎక్కువ‌గా తినే వారికి క్యాన్సర్‌, గుండె సంబంధిత రోగాలు ఎక్కువ‌గా వ‌స్తాయ‌ని తేల్చి చెప్పారు. ద బ్రిటీష్ హార్ట్ ఫౌండేష‌న్ ఈ ఆధారాల్ని ధ్రువీక‌రించింది. ఇటువంటి ఆహార‌పు అల‌వాట్లు ఉన్నవారికి మ‌ర‌ణాల రేటు 13 శాతం, గుండె సంబంధిత తీవ్ర రోగాల శాతం 18శాతం, క్యాన్సర్ సోకే చాన్స్ 10 శాతం అధికంగా ఉంటాయ‌ని నిర్ధారించారు. రెడ్ మీట్ లో ఉండే సాచ్యురేటెడ్ కొవ్వులు, అదికంగా ఉండే సోడియం ఇందుకు కార‌ణం అవుతున్నట్లు గుర్తించారు. ఈ విషయాల్ని ఇంట‌ర్నల్ మెడిసిన్ ఆర్కైవ్స్ లో ప్రచురించారు. రెడ్ మీట్ ఎక్కువ‌గా తీసుకొనే అల‌వాటు ఉన్న వారు ఆ అల‌వాటు ని త‌గ్గించుకొంటే మంచిద‌ని సూచించారు. శుభ్రం చేసిన ఇత‌ర మాంసాహారాల్ని అల‌వాటు చేసుకొనేందుకు ప్రయ‌త్నించాల‌ని సూచించారు. కోడి, చేప‌, బీన్స్ వంటి వాటిని ప్రత్యామ్నాయంగా ఎంచుకోవ‌చ్చని చెబుతున్నారు. ఈ స్థాయిలో ఆధారాలు దొరికాక‌, ఆరోగ్యక‌ర‌మైన స‌ల‌హాని పాటించేందుకు ప్రయ‌త్నించాలి.


జ్యూస్ తీసుకొనే ముందు ఈ సంగ‌తి గుర్తు పెట్టుకోండి..!

ఈ మ‌ధ్య కాలంలో ఫ్రూట్ జ్యూస్ తీసుకొన్నాక  కొన్ని ఆరోగ్య ప‌ర‌మైన స‌మ‌స్యలు వ‌చ్చిన‌ట్లు గుర్తించ‌టం జ‌రిగింది. వాస్తవానికి జ్యూస్ ఆరోగ్యానికి ఎంతో మంచిది క‌దా..మరి ఇటువంటి ఇబ్బంది ఎందుకు వ‌స్తోంది అన్న సంగ‌తి ఆరా తీస్తే ఒక ఆసక్తి క‌ర‌మైన విష‌యం బ‌య‌ట ప‌డింది.

ఫ్రూట్ జ్యూస్ కు ఆర్డర్ ఇచ్చాక అందులో ఏ ఏ కాంపొనెంట్స్ క‌లుపుతారో గ‌మ‌నించండి. అడిగిన ఫ్రూట్ ను తీసుకొని గ్రైండ్ చేస్తారు. త‌ర్వాత చ‌క్కెర లేదా సాల్ట్ కలుపుతారు. చ‌ల్లగా ఉంటుందంటూ ఐస్ క‌లుపుతారు. స‌రిగ్గా ఇక్కడే తేడా జ‌రిగిపోతోంది. పండు స‌హ‌జ‌సిద్దమైన ఆహారం. చ‌క్కెర ఎటూ ఫ్యాక్టరీ నుంచి వ‌చ్చిన‌దే. కానీ ఐస్ ను జ్యూస్ స్టాల్ య‌జ‌మాని బ‌య‌ట నుంచి తెప్పిస్తాడు. సాధార‌ణంగా ఈ ఐస్ ల త‌యారీకి కలుషిత నీటిని వాడుతున్నట్లు తెలుస్తోంది. పెద్ద ఎత్తున బ‌ల్క్ గా ఐస్ ను త‌యారుచేసే సంస్థలు స్థానికంగా దొరికే నీటిని వాడేస్తున్నారు. ఇందులో క‌లుషిత నీటిని వాడటంతో అందులోఉండే సూక్ష్మ క్రిములు ఈ ఐస్ లోకి సుర‌క్షితంగా చేరిపోతున్నాయి. పైగా కొన్ని ర‌కాల సూక్ష్మ క్రిములకు చ‌ల్లటి ప్రదేశంలో బాగా వ్రద్ది చెందుతాయి.దీంతో ఈ క్రిములు శ‌రీరంలోకి ప్రవేశించి వ్యాధుల్ని తెచ్చిపెడుతున్నాయి. అందుచేత జ్యూస్ లు తీసుకొనే ముందు సాధ్యమైనంత వ‌ర‌కు ఐస్ వ‌ద్దని చెప్పటం మేలు. మొహ‌మాటానికి పోయి అన‌ర్థం తెచ్చుకోవ‌టం మంచిది కాదు క‌దా..!

ఆప‌రేష‌న్ తో అన‌ర్థం ముంచుకొస్తుందా..!

ఆప‌రేష‌న్ అనేది ఆధునిక వైద్య శాస్త్రంలో ముఖ్యమైన చికిత్స విధానం. నిపుణులైన స‌ర్జన్ లు సునిశితంగా చేసే శస్త్ర చికిత్సల ద్వారా ఎన్నో దీర్ఘ కాలిక వ్యాధుల్నిన‌యం చేస్తున్నారు. అయితే క్యాన్సర్ కు కూడా అనేక సంద‌ర్భాల్లో ఆప‌రేష‌న్ అవ‌స‌రం అవుతుంది. కానీ, క్యాన్సర్ కు ఆప‌రేష‌న్ చేస్తే వ్యాధి కార‌క క‌ణ‌జాలం ప‌గిలిపోయి ఇత‌ర‌భాగాల‌కు వ్యాపిస్తాయని, అందుచేత ఆప‌రేష‌న్ చేయ‌కూడ‌ద‌న్న అపోహ ఉంది.
ఇది ఏమాత్రం స‌రి కాదు.  నిపుణులైన స‌ర్జన్ ను సంప్రదించి క్యాన్సర్ కు ఆప‌రేష‌న్ చేయించుకొంటే ఇటువంటి ప‌రిస్థితి త‌లెత్తదు. ముఖ్యంగా క‌డుపు క్యాన్సర్ విష‌యంలో ఉత్తమ చికిత్స విధానాల్లో ఆప‌రేష‌న్ కూడా ఒక‌టి. ఈ ఆప‌రేష‌న్ ద్వారా ప్రాథ‌మిక ద‌శ‌లో ఉండే క్యాన్సర్ ను న‌యం చేయ‌టానికి వీల‌వుతుంది.దీని ద్వారా క్యాన్సర్ కార‌క క‌ణ జాలం ఇత‌ర ప్రాంతాల‌కు వ్యాపించ‌టం జ‌ర‌గ‌దు.  క్యాన్సర్ అంటేనే అవాంఛ‌నీయ క‌ణ‌జాలం పేరుకొని పోవ‌టం అని చెబుతారు. దీన్ని ముందుగానే ప‌సిగ‌ట్టి అడ్డు క‌ట్ట వేయ‌క‌పోతే ఈ క‌ణ‌జాలం విస్తారంగా పెరిగిపోతుంది. అప్పుడు దీన్ని నివారణ చాలా క‌ష్టంగా మారుతుంది. అందుచేత ముందుగానే దీనికి ఆప‌రేష‌న్ ద్వారా అడ్డుక‌ట్ట వేయ‌టానికి వీల‌వుతుంది.

పెళ్లికి హాజ‌రైతే ఈ విష‌యం మ‌రిచిపోకండి..!

ఈ మూడు రోజులు వ‌రుస పెళ్లిళ్లు కావ‌టంతో రాష్ట్రమంతా సంద‌డి నెల‌కొంది. స‌న్నిహితులు, స్నేహితులు, బంధువుల ఇంట్లో పెళ్లి జ‌రిగితే వెళ్లక త‌ప్పని పరిస్థితి. పెళ్లికి హాజ‌రు అయితే అక్కడ విందు భోజ‌నం చేయాల్సి ఉంటుంది. అటువంట‌ప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకోవ‌టం మేలు.

పెళ్లి లో సామూహిక భోజ‌నాలు చేసేట‌ప్పుడు ర‌క ర‌కాల కూర‌ల‌తో భోజ‌నం త‌యారు చేస్తారు. తెలిసిన వారి ఫంక్షన్లు క‌దా అని చెప్పి ఒకే రోజు నాలుగైదు కార్యక్రమాల‌కు వెళ్లాల్సి ఉంటుంది. అటువంట‌ప్పుడు మొహ‌మాటానికి పోయి ప్రతీ చోట ఫుడ్ తీసుకోవ‌టం మంచిది కాదు. ఒకటి, రెండు సార్లు విందు భోజ‌నం భారీగా తినవ‌చ్చు కానీ, మూడు రోజుల పాటు వ‌రుస‌గా భారీ ఫుడ్ తిన‌టం స‌రికాదు. ముఖ్యంగా నాన్ వెజ్‌, ఆయిల్ ఫుడ్ ఎక్కువ‌గా తీసుకొంటే జీర్ణ కోశ ప‌రంగా స‌మ‌స్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతే గాకుండా సామూహిక భోజ‌నాల్లో శుభ్రత పాటించే చాన్స్ త‌క్కువ ఉంటుంది. ఈ విష‌యాన్ని కూడా దృష్టి లో ఉంచుకొని ఆరోగ్యాన్ని కాపాడుకొంటూ విందు, వినోదాల్ని సాగించ‌టం మేలు. ఇటీవ‌ల కాలంలో ఫంక్షన్ అంటే మ‌ద్యం త‌ప్పనిస‌రి అవుతోంది. ఫ్రెండ్స్ ముందు గొప్పలు పోయేందుకు పీక‌ల దాకా తాగేయ‌టం వ‌ల‌న అంతిమంగా ఆరోగ్యానికి న‌ష్టం అని గుర్తుంచుకోవాలి. ఫ్రెండ్స్ రెచ్చ గొట్టినా స‌రే, మ‌న లిమిట్ ఏమిటో మ‌నం తెలుసుకొని వ్యవ‌హ‌రించాలి.

పెళ్లిళ్లలో పప్పు అన్నం తింటే అన‌ర్థమా..!

పెళ్లంటేనే పప్పు అన్నం అన్న మాట వినిపిస్తుంది. పెళ్లి లో క‌చ్చితంగా పప్పు వండి వ‌డ్డిస్తారు. అయితే దెబ్బలు త‌గిలిన వారు, గాయాల‌తో బాధ ప‌డుతున్నవారు, ఆప‌రేష‌న్ చేయించుకొని కుట్లు వేయించుకొన్న వారు మాత్రం ప‌ప్పు  అన్నం తిన‌టానికి కొంత వెనుకాడ‌తారు. ఎందుచేత‌నంటే ప‌ప్పు అన్నం తింటే గాయాలకు చీము ప‌డుతుంద‌ని న‌మ్ముతారు. చాలా మంది పప్పు తింటూంటే వారిస్తారు కూడా. ఈ న‌మ్మకం చాలా త‌ప్పు. ప‌ప్పు కు చీము కి ఏమాత్రం సంబంధం లేదు.

పప్పు అంటే ప్రోటీన్స్ ఎక్కువ‌గా ఉండే బ‌ల‌వ‌ర్థక ఆహారం. దీన్ని తిన‌టం వ‌లన శ‌రీరంలో కండ‌రాలు ప‌టిష్టం అవుతాయి. దీని కార‌ణంగా శ‌రీరం దృఢ‌ప‌డి చ‌క్కగా పుంజుకొంటుంది. ఒక వేళ గాయాలు త‌గిలినా, ఆప‌రేషన్ చేయించుకొని కుట్లు వేయించుకొన్నా కూడా ప‌ప్పు తో బాధ‌లు న‌యం అవుతాయి. గాయాలు మాన‌టానికి, కుట్లు చేసిన గాయాలు మాన‌టానికి కూడా పప్పులు ఉప‌యోగ ప‌డ‌తాయి, త‌ప్పితే ఎటువంటి అన‌ర్థం ఉండ‌దు. చీము ఏర్పడటానికి ఇత‌రమైన కార‌ణాలు ఉంటాయి. శుభ్రత పాటించ‌క పోవ‌టం, సూక్ష్మ జీవులు సంక్రమించ‌టం, మురికి నీరు లేక అప‌రిశుభ్రమైన వ‌స్త్రాలు త‌గిలిన‌ప్పుడు ఇన్ ఫెక్షన్ ఏర్పడుతుంది. దీంతో చీము ఏర్పడుతుంది. కేవ‌లం పప్పు ప‌చ్చగా ఉండ‌టం, చీము ప‌చ్చగా ఉండ‌టంతో ఈ విధంగా అపార్థం చేసుకొంటారు. దీనికి ఎటువంటి శాస్త్రీయ‌మైన నిర్ధార‌ణ లేదు. పెళ్లిలోనే కాదు ఎక్కడ  పప్పు అన్నం తిన్నా ఏమాత్రం అన‌ర్థం ఉండ‌దు సుమా...!

ప్రవాస భార‌తీయుల కుటుంబాల్లో త‌ర‌చు వ‌స్తున్న స‌మ‌స్యలు..!

ప్రవాస భార‌తీయుల కుటుంబాల్లో అక్కడి ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా కొన్ని స‌మ‌స్యలు ఎదుర‌వుతుంటాయి. ఇటువంటి స‌మ‌స్యలు ఇక్కడ పెద్దగా క‌నిపించ‌క పోయినా విదేశీ గ‌డ్డ మీద ఎక్కువ‌గా చూడ‌గ‌లుగుతాం. పేగుకి సంబంధించినంత వ‌ర‌కు అల్సరేటివ్ కొలిటిస్‌, కౌన్స్ డిసీజ్ ను ఎక్కువ‌గా గ‌మ‌నించ‌గ‌లుగుతాం. మొద‌టగా అల్సరేటివ్ కొలిటిస్ గురించి చూద్దాం. దీనికి నిర్దిష్టమైన కార‌ణం లేక‌పోయినా ఆహార‌పు అల‌వాట్లు ప్రభావితం చేస్తాయని చెప్పవ‌చ్చు. దీనికి మానసిక ఒత్తిడి తోడైతే స‌మ‌స్య తీవ్రత ఎక్కువ‌గా ఉంటుంది. అన్ని వ‌య‌స్సుల వారికి ఈ వ్యాధి వ‌స్తున్నప్పటికీ ముఖ్యంగా 15 నుంచి 30 సంవ‌త్సరాల మ‌ధ్య వ‌య‌స్సు వారిలో ఇది తీవ్రంగా ఉంటుంది. క‌డుపులో ఒక్కసారిగా నొప్పి మొద‌లై చెల‌రేగిపోతుంది. క‌డుపులో శ‌బ్దాలు రావ‌టం ద్వారా గుర్తించ‌వ‌చ్చు. మ‌లంలో ర‌క్తం, చీము ప‌డుతుండ‌వ‌చ్చు. దీనికి డ‌యేరియా కూడా తోడు కావ‌చ్చును. బ‌రువు త‌గ్గటం,పిల్లల్లో ఎదుగుద‌ల లోపించ‌టం వంటివి గ‌మ‌నించ‌ద‌గును. నీరు ఎక్కువ తాగ‌టం, బ‌ల‌వ‌ర్థక‌ ప‌దార్థాలు తీసుకోవ‌టం, జంక్ ఫుడ్ కు దూరంగా ఉండ‌టం వంటి జాగ్రత్తల‌తో ఈ ప్రమాదాన్ని నివారించ‌వ‌చ్చు.
ఇక క్రోన్స్ డిసీజ్ విష‌యం చూస్తే.. ఇది ఆహార వాహిక‌లో ఎక్కడైనా త‌లెత్తవ‌చ్చు. శ‌రీరంలో వ్యాధి నిరోధ‌క శ‌క్తి త‌గ్గిన‌ప్పుడు, ఆహార‌పు అల‌వాట్లలో తేడా తోడైన‌ప్పుడు దీన్ని గ‌మ‌నించ‌వ‌చ్చు. పేగుల్లో ఎక్కువ‌గా దీన్ని చెప్పద‌గును.  అన్ని వ‌య‌స్సుల వారిలో ఇది క‌నిపించినా ముఖ్యంగా 15 నుంచి 35 సంవ‌త్సరాల వ‌య‌స్సు వారికి ఎక్కువ‌గా ఈ వ్యాధి క‌నిపిస్తుంది. క‌డుపు నొప్పి తీవ్రంగా ఉండ‌టం ప్రధాన ల‌క్షణం. దీంతో పాటు జ్వరం, ఆక‌లి త‌గ్గటం, టాయ్ లెట్ కు వెళ్లినప్పుడు నొప్పి రావ‌టం, బ‌రువు త‌గ్గటం వంటి ల‌క్షణాలు క‌నిపిస్తాయి. నీరు ఎక్కువ తాగ‌టం, బ‌ల‌వ‌ర్థక‌ ప‌దార్థాలు తీసుకోవ‌టం, జంక్ ఫుడ్ కు దూరంగా ఉండ‌టం వంటి జాగ్రత్తల‌తో ఈ ప్రమాదాన్ని నివారించ‌వ‌చ్చు.

విదేశాల్లో తెలుగు వారి ఇబ్బందుల‌కు ఇదేనా కార‌ణం..!

దేశ విదేశాల్లో తెలుగు వారు అనేక మంది ఉన్నారు. ఇప్పుడు ఖండాంత‌రాల్ని దాటి ఉద్యోగ‌, వ్యాపారాలు చేస్తున్నారు. దీంతో కుటుంబాల‌తో స‌హా అక్కడ ఉండాల్సి వ‌స్తోంది. ఈ క్రమంలో ఆరోగ్యం, ఆహారం విష‌యంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నట్లు గుర్తించారు.

ఇప్పటి దాకా మ‌న ప్రాంతానికి త‌గిన‌ట్లుగా ఆహార‌పు అల‌వాట్లు ఉంటాయి. అంటే ఉద‌యం బ్రేక్ ఫాస్ట్ గా ఇడ్లీ, దోశ వంటి టిఫిన్లు తీసుకొంటే మ‌ధ్యాహ్నం, రాత్రి స‌మ‌యాల్లో భోజ‌నం తిన‌టం అల‌వాటు. దీంతో ఏ స్థాయిలో కార్బొహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు వంటివి అందుతాయో శ‌రీరానికి అల‌వాటు ప‌డి ఉంటుంది. కానీ విదేశాల‌కు వెళ్లాక అక్కడి స‌మయాల‌కు అనుగుణంగా ఆహార‌పు అల‌వాట్లను మార్చుకోవాల్సి ఉంటుంది. అమెరికా, బ్రిట‌న్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో మ‌న‌దేశపు ఆహారం భేషుగ్గా దొర‌కుతోంది. దీంతో కొన్ని రోజుల వ్యవ‌ధిలోనే ఒరిజిన‌ల్ అల‌వాట్లకు త‌గిన‌ట్లుగా ఆహారం తీసుకోగ‌లుగుతున్నారు. అన్ని ప్రాంతాల్లో ఇది సాధ్యం కాదు కాబట్టి అక్కడి ఆహారాన్ని తీసుకొనేట‌ప్పుడు క్యాల‌రీల రీత్యా ఆరోగ్యక‌ర‌మైన ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. దీని కార‌ణంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌చ్చు. లేదంటే ఆరోగ్య క‌ర‌మైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.