...

SPECIALIZED SITE FOR HUMAN HEALTH CARE,
SPECIALLY ON GASTROENTEROLOGY, LIVER AND PANCREAS

పెళ్లిళ్లలో పప్పు అన్నం తింటే అన‌ర్థమా..!

పెళ్లంటేనే పప్పు అన్నం అన్న మాట వినిపిస్తుంది. పెళ్లి లో క‌చ్చితంగా పప్పు వండి వ‌డ్డిస్తారు. అయితే దెబ్బలు త‌గిలిన వారు, గాయాల‌తో బాధ ప‌డుతున్నవారు, ఆప‌రేష‌న్ చేయించుకొని కుట్లు వేయించుకొన్న వారు మాత్రం ప‌ప్పు  అన్నం తిన‌టానికి కొంత వెనుకాడ‌తారు. ఎందుచేత‌నంటే ప‌ప్పు అన్నం తింటే గాయాలకు చీము ప‌డుతుంద‌ని న‌మ్ముతారు. చాలా మంది పప్పు తింటూంటే వారిస్తారు కూడా. ఈ న‌మ్మకం చాలా త‌ప్పు. ప‌ప్పు కు చీము కి ఏమాత్రం సంబంధం లేదు.

పప్పు అంటే ప్రోటీన్స్ ఎక్కువ‌గా ఉండే బ‌ల‌వ‌ర్థక ఆహారం. దీన్ని తిన‌టం వ‌లన శ‌రీరంలో కండ‌రాలు ప‌టిష్టం అవుతాయి. దీని కార‌ణంగా శ‌రీరం దృఢ‌ప‌డి చ‌క్కగా పుంజుకొంటుంది. ఒక వేళ గాయాలు త‌గిలినా, ఆప‌రేషన్ చేయించుకొని కుట్లు వేయించుకొన్నా కూడా ప‌ప్పు తో బాధ‌లు న‌యం అవుతాయి. గాయాలు మాన‌టానికి, కుట్లు చేసిన గాయాలు మాన‌టానికి కూడా పప్పులు ఉప‌యోగ ప‌డ‌తాయి, త‌ప్పితే ఎటువంటి అన‌ర్థం ఉండ‌దు. చీము ఏర్పడటానికి ఇత‌రమైన కార‌ణాలు ఉంటాయి. శుభ్రత పాటించ‌క పోవ‌టం, సూక్ష్మ జీవులు సంక్రమించ‌టం, మురికి నీరు లేక అప‌రిశుభ్రమైన వ‌స్త్రాలు త‌గిలిన‌ప్పుడు ఇన్ ఫెక్షన్ ఏర్పడుతుంది. దీంతో చీము ఏర్పడుతుంది. కేవ‌లం పప్పు ప‌చ్చగా ఉండ‌టం, చీము ప‌చ్చగా ఉండ‌టంతో ఈ విధంగా అపార్థం చేసుకొంటారు. దీనికి ఎటువంటి శాస్త్రీయ‌మైన నిర్ధార‌ణ లేదు. పెళ్లిలోనే కాదు ఎక్కడ  పప్పు అన్నం తిన్నా ఏమాత్రం అన‌ర్థం ఉండ‌దు సుమా...!

No comments:

Post a Comment