...

SPECIALIZED SITE FOR HUMAN HEALTH CARE,
SPECIALLY ON GASTROENTEROLOGY, LIVER AND PANCREAS

పెద్దాయ‌న‌కు పెద్ద స‌మ‌స్య వ‌చ్చి ప‌డితే...!


మాన‌వ శ‌రీరంలో అనేక గ్రంథులు ఉన్నాయి. వీటిలో దేని ప్రాధాన్యం దానిదే. కానీ అతి పెద్ద గ్రంథిగా పేరు తెచ్చుకొన్నది మాత్రం కాలేయం అని చెప్పుకోవాలి. దాదాపు కిలోన్నర బ‌రువు ఉండే ఈ గ్రంథి... అంత‌ర్గత అవ‌య‌వాల్లో పెద్దదిగా కూడా పేరు గాంచింది. శ‌రీరంలోని కుడి భాగంలో అమ‌రి ఉంటుంది. కాలేయానికి వ‌చ్చే వ్యాధుల్లో తీవ్రమైన‌దిగా కాలేయ క్యాన్సర్ ని చెబుతారు. ఇది మ‌హిళ‌ల్లో క‌న్నా పురుషుల్లోనే ఎక్కువ‌గా సోకుతున్నట్లు తెలుస్తోంది. పెద్ద వ‌య‌స్సు వారికి ఈ ముప్పు ఎక్కువ అన్నది కొంద‌రి అభిప్రాయం.

కాలేయంలోనే జ‌నించి విజృంభించే క్యాన్సర్ ను హెప‌టో సెల్యులార్ కార్సినోమా అని పిలుస్తారు. ఇత‌ర ప్రాంతాల్లో జ‌నించి, కాలేయంలో విస్తరించే క్యాన్సర్ ను మెటా స్టాటిక్ లివ‌ర్ క్యాన్సర్ అని అంటారు. స‌ర్వ సాధార‌ణంగా కాలేయంలో సిర్రోసిస్ ఏర్పడి అది ముదిరి క్యాన్సర్ గా రూపాంత‌రం చెందుతుంది.  కాలేయంలోని ఆరోగ్య క‌ణ‌జాలాన్ని తొల‌గించి అక్కడ అవాంఛ‌నీయ క‌ణ‌జాలం పేరుకొని పోతుంది. ఇది ప్రబ‌లి పోయిన‌ప్పుడు కాలేయం ప‌నితీరు దెబ్బ తింటుంది. ఈ ద‌శ‌లో దీన్ని గుర్తించి చికిత్స చేయించ‌క పోతే ముద‌రిపోయి క్యాన్సర్ గా మారే ప్రమాదం ఉంటుంది. దీనికి తోడు కామెర్లు, మ‌ద్యం అల‌వాటు వంటివి తోడ‌యితే ప్రమాదం మ‌రింత పెర‌గ‌వ‌చ్చును.
ఇందుకు అనేక కార‌ణాలు ఉన్నాయి. 1. మ‌ద్యాన్ని తాగే అల‌వాటు 2. కాలేయంలో ఆటో ఇమ్యూన్ ద‌శ త‌లెత్తటం. 3.హెప‌టైటిస్ బీ లేక హెప‌టైటిస్ సీ వైర‌స్ సోక‌టం. 4. శ‌రీరంలో ఐర‌న్ శాతం పెరిగిపోవ‌టం. కాలేయానికి క్యాన్సర్ వ‌చ్చినట్లు గుర్తించాకే వెంటనే చికిత్స చేయించాలి. నిపుణులైన జీర్ణ కోశ వ్యాధుల వైద్యుల్ని సంప్రదించాలి. వ్యాధి ఏ ద‌శ‌లో ఉందో తెలుసుకొనే ప్రయ‌త్నం చేయాలి. దీన్ని బ‌ట్టి చికిత్స ఏ స్థాయిలో అవ‌స‌ర‌మో గుర్తిస్తారు. అవ‌స‌రం అయితే కాలేయానికి కీమో థెర‌పీ, రేడియో థెర‌పీల‌తో పాటు శ‌స్త్ర చికిత్స చేయించాల్సి ఉంటుంది. కొన్ని సంద‌ర్భాల్లో సంక్లిష్ట మైన చికిత్స అవ‌స‌రం ఉంటుంది.

"ఢమరుకం" లో అంత సీన్ ఉందా..?

ఢ‌మ‌రుకం గురించి విన్నప్పుడు భ‌లే ఆశ్చర్యం వేస్తుంది. ఇంత‌టి శ‌క్తి మంత‌మైన‌దా అనిపిస్తుంది కూడా..! అస‌లు డ‌మ‌రుకం అన్న ప‌ద‌మే చ‌క్కటి ఉత్సాహ‌క‌రంగా ఉంటుంది. శ‌క్తి సామ‌ర్థ్యాల‌కు గుర్తుగా దీన్ని జ్ఞప్తికి ఉంచుకోవ‌చ్చును. ఎందుకంటే శ‌క్తినంత‌టినీ ఒక్క చోట‌కు చేర్చితే త‌ప్ప  ఢ‌మ‌రుకం ప్రజ్ఞ మ‌న‌కు అర్థం కాదు. శ‌రీరంలో కూడా ఇదే ప‌రిస్థితి క‌నిపిస్తుంది. శ‌రీరంలో డ‌మ‌రుకం అని చెప్పదగిన కాలేయానికి ఉన్న శ‌క్తి అంతా ఇంతా కాదు. ఎందుచేత‌నంటే శ‌క్తిని సంశ్లేషించి, శ‌రీర బాగాల‌కు అందించ‌టంలో ఇది చాలా ప్రధానం. ఇక్కడ నుంచి అనేక భాగాల‌కు శ‌క్తి నేరుగా అందించ‌టానికి వీల‌వుతుంది. అంతేగాకుండా నిల్వ శ‌క్తి కార‌కాల్ని కూడా రూపొందిస్తుంది. అవ‌స‌రమైన‌ప్పుడు ఒక్కసారిగా శ‌క్తి వివిధ రూపాల్లో అందించ గ‌లుగుతుంది కాబ‌ట్టే కాలేయాన్ని డ‌మ‌రుకంతో పోలుస్తారు. 

మాన‌వ శ‌రీరంలో కాలేయం ఒక ప్రధాన‌మైన గ్రంథి. ఆహారంలోని ముఖ్య ప‌దార్థాల సంశ్లేష‌ణ‌లో కీల‌క పాత్ర పోషించును. ఇది అతి బ‌రువైన గ్రంథిగా పేరు తెచ్చుకొంది. దీనికి ఉన్న మ‌రో విశేషం ఏమిటంటే.. శ‌రీరంలోప‌లి అవ‌యవాల్లో కాలేయం మాత్రం పున‌రుజ్జీవం (రీజ‌న‌రేష‌న్) పొందే శ‌క్తిని క‌లిగి ఉంటుంది. దాదాపు నాలుగో వంతు కాలేయానికి కూడా పూర్తిగా పున‌ర్ నిర్మించుకోగ‌ల స‌త్తా ఉంటుంది. కాలేయ క‌ణాలు మ‌ళ్లీ క‌ణ‌చ‌క్రం లోకి ప్రవేశించ‌టం ద్వారా ఇది సాధ్యం అవుతుంది. అందుచేత‌నే కాలేయం పాడైన‌ప్పుడు స‌రైన వైద్యుల ద‌గ్గర చికిత్స తీసుకోవాలి. అప్పుడు సక్రమ‌మైన ప‌ద్దతిలో శ‌స్త్ర చికిత్స చేయించటానికి వీల‌వుతుంది. దీని ఫ‌లితంగా కాలేయం నుంచి పూర్తి శాతం ప‌నిత‌నాన్ని ఆశించ‌గ‌లుగుతాం. శ‌రీరానికి కావ‌లిసిన శ‌క్తిని అందించ‌గ‌లుగుతుంది. డ‌మ‌రుకం మాదిరిగా ఒక్కసారిగా ప‌ని త‌నాన్ని చూప‌గలుగుతుంది. కాలేయం కు మాత్రమే ఉన్న ఈ అద్భుత శ‌క్తి గురించి తెలుసుకొంటే మాత్రం భ‌లే ఆశ్చర్యంగా ఉంటుంది క‌దా..!

రోజూ చేసే పని ఒక్క సారిగా ఆపేస్తే ఏమవుతుంది?


విన‌టానికి గ‌మ్మతుగా ఉన్నా ఈ విష‌యం ఆలోచించి తీరాల్సిందే. రోజూ అల‌వాటుగా చేసే ప‌నికి శ‌రీరం అల‌వాటు ప‌డిపోయి ఉంటుంది. అది మంచి ప‌ని అయినా, చెడ్డ ప‌ని అయినా బాడీ - ఫిక్స్ అయిపోయి ఉంటుంది. అటువంటి ప‌నిని స‌డెన్ గా వ‌దిలేస్తే శ‌రీరం అంతా వేగంగా ఆ అల‌వాటుని వ‌దిలేసుకోలేదు.

ఉదాహ‌ర‌ణ‌కు రోజూ విప‌రీతంగా మ‌ద్యం తాగే వ్యక్తి లో ఇటువంటి స‌మ‌స్య త‌లెత్తుతుంది. చాలా కాలం మ‌ద్యం తాగే వారిలో ఆల్కహాలిక్ అంత్య ఉత్పన్నాల‌కు శ‌రీరం అల‌వాటు ప‌డిపోయి ఉంటుంది. అటువంటి అంత్య ఉత్పన్నాలు ఒక్కసారిగా ఆగిపోతే శ‌రీరంలో రివ‌ర్స్ చ‌ర్యలు మొద‌ల‌వుతాయి. ఆల్కహాలిక్ అంత్య ఉత్పన్నాల‌ను పోలిన క‌ణజాలాన్ని శ‌రీరం రూపొందిస్తుంది. ఈ ప‌దార్థంతో కొత్త ర‌కం స‌మ‌స్యలు పుట్టుకొని వ‌స్తాయి. అందుచేత రోజూ విప‌రీతంగా మ‌ద్యం తాగే అల‌వాటు ఉన్న వారు ఒక్కసారిగా బ్రేక్ వేయ‌కుండా కొంచెం క్రమంగా ఈ అలవాటునుంచి బ‌య‌ట ప‌డ‌టం మంచిది. ఏది ఏమైనా ఈ అల‌వాటుని పూర్తిగా వ‌దులుకోవ‌టమే ఉత్తమం అని గుర్తుంచుకోవాలి.

మ‌ద్యం తాగే వారిలో ఉన్న మ‌రో అపోహ ఏమిటంటే త‌క్కువ మోతాదులో తాగుతున్నాను కాబ‌ట్టి పెద్దగా ప్రమాదం ఉండ‌ద‌ని వాదిస్తుంటారు. ఇది స‌రి కాదు. ఎందుచేత‌నంటే మ‌ద్యం తాగేందుకు ఇంత ప‌రిమితి ఉంది అన్న నిర్ధార‌ణ ఏమాత్రం లేదు అన‌వ‌స‌రంగా అటువంటి ప్రమాణాలు పెట్టుకోక‌పోవటం మేలు. ఎంత మోతాదులో తీసుకొన్నా జ‌ర‌గాల్సిన అన‌ర్థం జ‌రుగుతుంద‌ని గుర్తుంచుకోవాలి. పైగా అప్పుడ‌ప్పుడు తాగినా కూడా ఆల్కహాలిక్ విష ప‌దార్థాలు చెడు ప్రభావ‌మే చూపుతాయని గుర్తెర‌గాలి.

ఒక్క సారిగా పెద్ద శిక్ష సరైనదేనా..


త‌ప్పు జ‌రిగితే శిక్ష ప‌డాల్సిందే. ఈ మాట ఎవ‌రూ కాద‌న‌రు. కానీ శిక్ష దాకా వ‌చ్చే దాకా ప‌రిస్థితి తెచ్చుకోవ‌టం మాత్రం స‌రికాదు. ఇందుకు ఆరోగ్యం కూడా మిన‌హాయింపు కాదు. ఆరోగ్య విష‌యంలో కూడా ఈ అంశాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాలి.

మాన‌వ శ‌రీరంలో కాలేయం ఒక ముఖ్యమైన అవ‌యవం. జీర్ణక్రియ‌లో దోహ‌ద ప‌డ‌టంతో పాటు, ర‌క్తం పున‌ర్ నిర్మాణంలో కీల‌క పాత్ర వ‌హిస్తుంది. ప్రోటీన్ ల సంశ్లేష‌ణ‌లో ఉప‌క‌రిస్తుంది. కానీ, మ‌ద్యం తాగే అల‌వాటు ఉన్న వారిలో ఈ ముఖ్యమైన అవ‌య‌వం పాడై పోతుంది. మొద‌ట్లో ఇది కొద్ది గా మొద‌ల‌వుతుంది. రోజూ కొంచెం తాగుతున్నాం క‌దా, అప్పుడ‌ప్పుడు తాగుతున్నాం క‌దా అని కొంద‌రు భావిస్తారు. కానీ ఆల్కహాల్ శ‌రీరంలోకి ప్రవేశించాక అది అసిటాల్డిహైడ్ అనే విష ప‌దార్థ రూపంలో కి మారిపోతుంది. అటువంట‌ప్పుడు కాలేయ క‌ణాల్ని ఈ విషం నాశ‌నం చేస్తుంది. మొద‌ట్లో ఇది కొంచెంగా ప్రారంభం అవుతుంది. అటువంట‌ప్పుడే గుర్తించి చికిత్స చేయించుకోవాలి. చికిత్స తో పాటు మ‌ద్యం తాగే అల‌వాటు వెంట‌నే మానుకోవాలి. అప్పుడే మందులు స‌క్రమంగా ప‌ని చేయ‌గ‌లుగుతాయి. లేదంటే కాలేయం క‌ణాలు పాడ‌వ‌టం మొద‌లైతే, క్రమంగా కొంత భాగం కాలేయం నిర్వీర్యం కావ‌చ్చు. ఈ స్థితిని సిర్రోసిస్ అని పిలుస్తారు.ఈ ద‌శ‌కు కాలేయం చేరుకొంటే చికిత్స చాలా క‌ష్టం. శ‌స్త్ర చికిత్స మార్గాల్ని అనుస‌రించాల్సి ఉంటుంది. నిపుణులైన వైద్యులు మాత్రమే ఈ ఆప‌రేష‌న్ లు చేయ‌గ‌లుగుతారు. పరిస్థితి అంత దాకావ‌స్తే మాత్రం క‌ఠిన శిక్షగానే భావించాలి. అంత దాకా తెచ్చుకోకుండా జాగ్రత్త ప‌డ‌టం మేలు.

కొంచెం నిర్లక్ష్యం కొంప ముంచుతోందా..!


నిర్లక్ష్యం మానవ స‌హ‌జం. కానీ, ఇది హ‌ద్దు దాటితే మాత్రం అన‌ర్థం త‌ప్పదు. ముఖ్యమైన విష‌యాల్లో నిర్లక్ష్యం వ‌హిస్తే మాత్రం ఇబ్బందే. అటువంటి ముఖ్యమైన అంశాల్లో ఆరోగ్యం కూడా ఒక‌టి. ఆరోగ్య స‌మ‌స్యల‌పై నిర్లక్ష్యం వ‌హిస్తే ఇబ్బంది ప‌డ‌క త‌ప్పదు.

ఇటీవ‌ల కాలంలో మాన‌వ జీవ‌న శైలి మారిపోయింది. గ‌తంలో వ్యవ‌సాయం, వృత్తి ప‌నులు ముఖ్య ఉపాధి మార్గాలుగా ఉండేవి. అప్పట్లో శారీర‌క శ్రమ ఎక్కువ‌గా ఉండేది. ఇప్పుడు మాత్రం సీటును అతుక్కొని పని చేయాల్సిన ఉద్యోగాలే ఎక్కువ‌గా ఉపాధి మార్గాలు. న‌గ‌రాలు, ప‌ట్టణాల్లో ఎక్కువ మంది ఇటువంటి వారే క‌నిపిస్తున్నారు. ఈ త‌ర‌హా ఉద్యోగుల్లో జీర్ణక్రియకు సంబంధించిన స‌మ‌స్యలు క‌నిపిస్తున్నాయి. వాటిని వివ‌రంగా చ‌ర్చించుకోవ‌చ్చు. కానీ, ఇక్కడ ఒక స‌మ‌స్య ముఖ్యమైన‌ది. విరేచ‌నంలో ర‌క్తం ప‌డుట అప్పుడప్పుడు కొంద‌రిలో త‌లెత్తుతుంది. వాస్తవానికి జీర్ణ క్రియ లో స‌మ‌స్య త‌లెత్తితే ఏదో ఒక అవ‌యవంలో ఇబ్బంది ఏర్పడుతుంది. ఇందులో ఆహార వాహిక‌, జీర్ణాశ‌యం, ఆంత్ర మూలం, శేషాంత్రికం అనే చిన్న పేగు, పెద్ద పేగు, మ‌లాశ‌యం అనే భాగాల‌తో పాటు కాలేయం, క్లోమం అనే గ్రంథులు, పిత్తాశ‌యం, ఉండూకం అనే చిన్న పాటి సంచీ భాగాలు ఇమిడి ఉంటాయి. వీటిలో ఎక్కడైన స‌మ‌స్య ఏర్పడితే వాటికి అనుసంధానంగా ఉండే ర‌క్త కేశ నాళికలు చిట్లుతాయి. అప్పుడు ర‌క్తం ఆహార వాహిక లోకి విడుద‌ల అవుతుంది. ఈ ర‌క్తం దిగువ‌కు అంటే మ‌లం ద‌గ్గర‌కు చేరి బ‌య‌ట‌కు విస‌ర్జితం అవుతుంది.

సాధార‌ణంగా పైల్స్ స‌మస్య తో బాధ ప‌డే వారికి ఇది క‌నిపిస్తుంది. అంత మాత్రాన అన్ని స‌మ‌స్యల్నీ ఆ గాట‌న క‌ట్టేయ‌లేం.  కానీ, ర‌క్తం ప‌డ‌టానికి అనేక కార‌ణాలు ఉన్నాయి. పేగు లో అల్సర్స్ ఏర్పడ‌టం, పేగు క్యాన్సర్, జీర్ణ కోశ సంబంధిత ఇన్ ఫెక్షన్ లు వంటి కార‌ణాలు ఉంటాయి. వీటిలో ఏ కార‌ణంతో స‌మ‌స్య ఏర్పడిందో తెలుసుకొని చికిత్స చేయించుకోవాలి. లేదంటే ఈ స‌మ‌స్య ముదిరిపోయి స‌మ‌స్య తీవ్రం అవుతుంది. అందుచేత ఆరోగ్య  స‌మ‌స్యలు త‌లెత్తిన‌ప్పుడు స‌రైన వైద్యుల్ని సంప్ర దించి శాస్త్రీయ‌మైన చికిత్స తీసుకోవాలి. నిర్లక్ష్యం వ‌హిస్తే మాత్రం చేతులారా కొంప ముంచుకొన్నట్లవుతుంది.
డ‌మ‌రుకం ఎందుకు ఆగిపోతోందంటే..!
డ‌మ‌రుకం అన్న ప‌దం వింటేనే శ‌క్తి జ‌నిస్తుంది. స‌మాజంలో శ‌క్తిని జ్వలింప చేసేందుకు పూర్వకాలంలో డ‌మ‌రుకాన్ని వాడే వారు. డ‌మ‌రుకం మోగుతుంటే ఆ చుట్టుప‌క్కల అంద‌రిలో ఉత్తేజం క‌లుగుతుంది. డ‌మ‌రుకం అనేది శ‌క్తి కి కేంద్ర బిందువు అని కూడా అనుకోవ‌చ్చు.

స‌రిగ్గా శ‌రీరంలో కూడా ఇటువంటి శ‌క్తిని అందించే అవ‌య‌వం ఒక‌టి ఉంది. అదే కాలేయం. శ‌రీరంలోని అన్ని భాగాల‌కు శ‌క్తిని ప్రస‌రింప చేయ‌టంలో కాలేయం ముఖ్య పాత్ర వ‌హిస్తుంది. అటువంటి ముఖ్యమైన భాగాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఈ పాయింట్ అర్థం కావాలంటే ఎటువంటి ప‌నుల వ‌ల్ల కాలేయం చెడిపోతుందో తెలుసుకోవాలి. మ‌ద్యం కాలేయానికి ప్రధాన శ‌త్రువు. ఆల్కహాల్ తీసుకోవ‌టం వ‌ల‌న కాలేయ క‌ణాలు పాడై పోతాయి. క‌లుషిత నీటిని తాగ‌టం, సుర‌క్షితం కాని ర‌క్తాన్ని తీసుకోవటం వంటివి కూడా ఇందుకు కార‌ణం అనుకోవ‌చ్చు. వీటి వ‌ల‌న వ్యాధి కార‌క వైర‌స్ లు ఒక‌రి నుంచి ఒక‌రికి వ్యాపిస్తాయి. ఈ వైర‌స్ లు శ‌రీరంలోకి చేరాక కాలేయ క‌ణాల మీద దాడి చేస్తాయి.
కాలేయానికి జ‌రిగే అన‌ర్థాన్ని నాలుగు ద‌శ‌ల్లో చెబుతారు. కాలేయ ఇన్ ప్లమేష‌న్‌, ఫైబ్రోసిస్‌, సిర్రోసిస్‌, క్యాన్సర్‌. మొద‌టి రెండు ద‌శ‌ల్లో కాలేయం ప‌ని తీరు కొద్దిగా ఇబ్బందిక‌రంగా మారుతుంది. అటువంట‌ప్పుడు మందుల‌తో చికిత్స చేయ‌టం సాధ్యం అవుతుంది. కానీ సిర్రోసిస్ ద‌శ‌కు, క్యాన్సర్ ద‌శ‌కు చేరితే మాత్రం కాలేయం రూపం మారిపోతుంది.ఇటువంటి ద‌శ‌లో మందుల క‌న్నా కీమో థెర‌పీ, రేడియో థెర‌పీ వంటి చికిత్స  ల‌తో పాటు శ‌స్త్ర చికిత్స అవస‌రం అవుతుంది. వ్యాధి ముదిరిపోతే కాలేయాన్ని మార్చాల్సి ఉంటుంది. (దీని వివ‌రాలు త‌ర్వాత పోస్ట్ లో చూద్దాం..)రోగం ముద‌ర‌క ముందే నిపుణులైన వైద్యుల్ని సంప్రదిస్తే ప్రమాద తీవ్రత‌ను తగ్గించుకోవ‌చ్చు. ఇటువంటి జాగ్రత్తలు తీసుకొంటే శ‌రీరంలో డ‌మ‌రుకం అన‌ద‌గ్గ ప‌వ‌ర్ హౌస్ కాలేయాన్ని ఆగ‌కుండా ప‌ని చేయించుకోవ‌చ్చు.

" బ‌స్ స్టాప్ " లో అలా చూపించ‌టం స‌రైన‌దేనా..!


ఇప్పుడు చ‌ర్చ బ‌స్ స్టాప్ వైపు మ‌ళ్లింది. బ‌స్ స్టాప్ అంటే అంద‌రికీ తెలిసిందే. బ‌స్ లు అక్కడ ఆగుతాయి కాబ‌ట్టి వాటిలో ప్రయాణం చేయ‌ద‌ల‌చుకొన్న వారు అక్కడ వేచి ఉంటారు. అందుచేత బ‌స్ స్టాప్ అంటే జ‌నం కొంత సేపు వేచి ఉండే ప్రదేశం గా రూఢి అయింది. అటువంటి చోట ఎటువంటివి చూపించాలి అనేదానిపై వివాదం ఉండ‌వ‌చ్చు గాక‌, కానీ ఇప్పుడు ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌టం పై ప్రచారం చేయ‌టం స‌రైన‌దే అనుకోవాలి.

ఈమ‌ధ్య వ్యక్తిగ‌త శుభ్రత మీద ప్రచారం జ‌రుగుతోంది. ముఖ్యంగా చేతులు శుభ్రం చేసుకోవ‌టం మీద అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ప్రయ‌త్నిస్తున్నారు. హ్యాండ్స్ వాష్ అన్నది ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రచారాంశం. భోజ‌నం చేసే ముందు, టాయ్ లెట్ కి వెళ్లి వ‌చ్చాక ముఖ్యంగా చేతులు శుభ్రం చేసుకోవ‌టం ముఖ్యం. గోరువెచ్చని నీటితో స‌బ్బు ఉప‌యోగించి చేతులు శుభ్రం చేసుకోవాలి. దీని వల్ల వేలాది క్రిముల్ని నివారించిన వాళ్లం అవుతాం. చాలా వ‌ర‌కు జీర్ణ కోశ వ్యాధులు ఈ రూపంలో ప్రవేశిస్తాయ‌ని తెలుస్తోంది. హెప‌టైటిస్ ఏ, ఈ వంటి ర‌కాల వ్యాప్తికి ఇటువంటి క్రిములే కార‌ణం అవుతాయి. అంటు వ్యాధుల నివార‌ణ‌లో ఈ శుభ్రత చాలా ముఖ్యం.

ఇంత ముఖ్యమైన అంశాన్ని బ‌స్ స్టాప్ ల్లో హోర్డింగ్ లు, పోస్టర్ ల రూపంలో ప్రచారం చేయ‌టం మంచిదే. ఇటువంటి ప్రచారం వ‌ల్ల ప్రజ‌ల‌కు అనేక విష‌యాలు తెలిసి వ‌స్తాయి. అందుచేత బ‌స్ స్టాప్ లో అలా చూపించ‌టం స‌రైన‌దే అనుకోవ‌చ్చు.

నాటు రూటు ఎంత వ‌ర‌కు సేఫ్‌..!


ఆలోచించండి.. నాటు మార్గంలో వెళితే ఎంత వ‌ర‌కు సుర‌క్షితం. ఎవ‌రో ఏదో చెప్పార‌ని న‌మ్మేసి ముందుకు వెళ్లిపోతే, ఫ‌లితం ఆశాజ‌న‌కంగా ఉండ‌దు. ఒక్కోసారి ఇది విక‌టించే అవ‌కాశం ఉంటుంది. దీనికి ఎన్నో ఉదాహ‌ర‌ణ‌లు క‌నిపిస్తాయి. కామెర్లు విష‌య‌మే తీసుకొంటే.. కామెర్లకు ఎన్నో కార‌ణాలు ఉంటాయి. ఆ విష‌యం తెలుసుకోకుండా కేవ‌లం చెట్టు మందు తింటేనో, నాటు మందు తీసుకొంటేనో త‌గ్గిపోతుంది అనుకొంటే .. అంత‌కు మించిన భ్రమ మ‌రొక‌టి ఉండ‌దు.

కామెర్లు అనేది నాలుగైదు ర‌కాల వైర‌స్ ల వ‌చ్చే వ్యాధి. ఇందులో కొన్ని ప్రమాద‌క‌రం కాగా, మ‌రి కొన్ని అంత ప్రమాదం లేనివి ఉంటాయి. ఏవి ప్రమాద క‌రం అనేది స‌రైన డ‌యాగ్నస్టిక్ ప‌రీక్షల ద్వారానే తేలుతుంది. హెప‌టైటిస్ ఏ, ఈ వంటి వ్యాధులు అంత ప్రమాదం కాద‌నే చెప్పుకోవ‌చ్చు. 70 శాతం దాకా కామెర్లు ఈ ర‌కానికి చెందిన‌వే ఉంటాయి. చాలా సార్లు ఈ ర‌క‌పు కామెర్లు మందులు ఏమీ తీసుకోకుండానే త‌గ్గిపోతాయి. శ‌రీరానికి స‌హ‌జంగా ఉండే వ్యాధి నిరోధ‌క శ‌క్తితో ఈ కామెర్లు దూరం అవుతాయి. అటువంట‌ప్పుడు ఎవ‌రైనా చెట్టు మందు లేక నాటు మందు లేక ప‌స‌ర మందు తీసుకొన్నార‌నుకొందాం. అప్పుడు స‌హ‌జంగానే కామెర్లు త‌గ్గిపోతాయి, తీరాచూస్తే ఈ ర‌క‌పు మందుతో వ్యాధి నివార‌ణ అయిపోయింద‌ని భావిస్తారు. అస‌లు విష‌యం ఏమిటంటే శ‌రీర ధ‌ర్మం తోటే ఆ వ్యాధులు త‌గ్గిపోయాయ‌న్న మాట‌.

అస‌లు ముప్పు మాత్రం హెప‌టైటిస్ బీ, సీ వంటి రకాల‌తో పొంచి ఉంటుంది. ఈ ర‌క‌పు కామెర్లు సోకిన‌ప్పుడు క‌చ్చితంగా వ్యాధి నిర్దార‌ణ ప‌రీక్షలు చేయించుకోవాలి. ఆ త‌ర్వాత నిపుణులైన వైద్యుల్ని సంప్రదించాలి. సుశిక్షితులైన డాక్టర్ చేత వైద్యం చేయించుకోవాలి. స‌రైన మందులు తీసుకొంటేనే వ్యాధి నివార‌ణ అవుతుంది. ఇందుకు బ‌దులు నాటు వైద్యాన్ని ఆశ్రయిస్తే... రోగం ముదిరిపోతుంది. అప్పుడు అస‌లు డాక్టర్ ను సంప్రదిస్తే మాత్రం ఎవ‌రూ ఏమీ చేయ‌లేని పరిస్థితి ఉంటుంది. కొన్ని సార్లు ముదిరిపోయి రోగి చ‌నిపోయే ప‌రిస్థితి కూడా ఏర్పడుతుంది. అందుచేత ఎవ‌రో చెప్పార‌ని చెప్పి నాటు వైద్యాన్ని ఆశ్రయిస్తే మాత్రం ఫ‌లితం విక‌టిస్తుంటుంది.

శ‌ని, ఆది వారాల్లో ఎందుకు రెచ్చిపోతున్నారు.. ఈ సంగ‌తి గుర్తించుకొంటే మేలు..!

శ‌ని, ఆది వారాలు వ‌చ్చాయంటే ఉద్యోగుల‌కు ఊర‌ట అనుకోవ‌చ్చు. వారం మొత్తం క‌ష్టప‌డి ప‌నిచేస్తే వీకెండ్స్ లో హాయిగా గ‌డ‌ప‌టం అన్నది పాశ్యాత్య దేశాల నుంచి దిగుమ‌తి అయిన అల‌వాటు. అంత వ‌ర‌కు బాగానే ఉంది కానీ, హాయిగా గ‌డ‌ప‌టం ఎలా అన్న చోటే అస‌లు చిక్కంతా..! విదేశాల్లో చ‌లి ఎక్కువ‌గా ఉంటుంది కాబ‌ట్టి అక్కడి అల‌వాట్లు అక్కడివి. వాటిని మ‌నం అనుక‌రించాల్సిన అవ‌స‌రం లేదు. ఇటీవ‌ల ఒక అద్యయ‌నం ప్రకారం మ‌న రాష్ట్రంలో శ‌ని, ఆది వారాల్లో మ‌ద్యం విప‌రీతంగా అమ్ముడ‌వుతోంద‌ని తెలిసింది. వీకెండ్ పేరుతో మ‌న ప్రజానీకం పీపాల కొద్దీ తాగేస్తోంద‌న్న మాట‌. మ‌ద్యం తో వ‌చ్చే అన‌ర్థాల గురించి తెలుసుకొంటే భ‌లే విష‌యాలు బ‌య‌ట ప‌డ‌తాయి. నోటిలో మ‌ద్యం ప్రవేశించిన చోట నుంచి అంతిమంగా ప‌దార్థాలు బ‌య‌ట‌కు వెళ్లే దాకా న‌ష్టం చేస్తూనే ఉంటుంది.

1.మ‌ద్య తాగ‌టం మొద‌లెట్టగానే విష ప‌దార్థాలు నోరంతా వ్యాపిస్తాయి. ఫలితంగా నోటి క్యాన్సర్ కు దారి తీయ‌వ‌చ్చు. పొగ తాగే అల‌వాటు త‌ర్వాత ఎక్కువ నోటి క్యాన్సర్ మ‌ద్యం తో వ‌స్తుంద‌ని తేలింది. ఒక వేళ ఈ రెండు అల‌వాట్లు ఉంటే మాత్రం నోటి క్యాన్సర్ అవ‌కాశాలు బాగా విప‌రీతం అనుకోవ‌చ్చు. కొంత‌మందిలో చిగుళ్ల స‌మ‌స్యల‌కు దారి తీయ‌వ‌చ్చు.
2. గొంతు నొప్పి... మ‌ద్యం గొంతు లో ప్రవేశించాక స్వర పేటిక ద్వారా లోప‌ల‌కు వెళుతుంది. ఆ స‌మ‌యంలో ఆక్కడ ఉండే స్రావాల మీద ప్రభావం చూపుతుంది. కొన్ని సార్లు శ్వాస నాళాల్ని కూడా ఇబ్బంది పెట్టవ‌చ్చు.
3. క‌డుపులోకి మ‌ద్యం దిగాక అది అక్కడ కొంత సేపు ఉంటుంది. దీని వ‌ల్ల జీర్ణాశ‌యానికి లోప‌ల ఉండే స్రావ‌కాల పొర ను దెబ్బ తీయ‌వ‌చ్చు. దీంతో గ్యాస్ట్రిటిస్ అనే స‌మ‌స్య త‌లెత్తవ‌చ్చు.
4. కొన్ని అధ్యయ‌నాల ప్రకారం క‌డుపు క్యాన్సర్, ప్రేగు క్యాన్సర్  కు మ‌ద్యపానం ఒక కార‌ణం అని చెబుతారు.

5. మ‌ద్యం క‌డుపులో ఉండ‌టం తో ఆక‌లి మీద ప్రభావం చూపుతుంది. దీంతో అన్ని ర‌కాల పోష‌కాల్ని తీసుకోవ‌టం త‌గ్గిపోతుంది. ఇది అంతిమంగా అనారోగ్యానికి దారి తీస్తుంది.
6. జీర్ణ వ్యవ‌స్థకు అనుబంధంగా ఉండే కాలేయం, క్లోమం మీద మ‌ద్యం విప‌రీత‌మైన దుష్ప్రభావాలు చూపుతుంది. ఈ వివ‌రాలు చ‌ర్చించాం.
7. కొన్ని విష పదార్ధాలు పేగుల ద్వారా శ‌రీర భాగాల‌కు చేరే అవ‌కాశం ఏర్పడుతుంది. దీన్ని సాంకేతికంగా లీకీ గ‌ట్ సిండ్రోమ్ అంటారు. దీంతో తీవ్ర అనారోగ్యం ఏర్పడ‌వ‌చ్చు.
8. మ‌ద్యం తాగ‌టంతో విరోచ‌నాలు, వాంతులు వంటి సాధార‌ణ అనారోగ్యం తలెత్తవ‌చ్చు.
   మ‌ద్యం తాగే అల‌వాటు తో నాడీ వ్యవ‌స్థ లో ఇబ్బంది ఏర్పడి ప్రవ‌ర్తన మారిపోతుంద‌న్న సంగ‌తి తెలిసిందే. దీని వ‌ల్ల త‌లెత్తే ఇబ్బందులు తెలిసిన‌వే. ఇన్ని స‌మ‌స్యలు ఉన్నాయి కాబ‌ట్టే మ‌ద్యం తాగేందుకు పూర్తిగా దూరంగా ఉండ‌టం మేలు. వీక్ డేస్, వీకెండ్ అన్న తేడా లేకుండా పూర్తిగా దూరం పెట్టడ‌మే ఉత్తమం.