మానవ శరీరంలో అనేక గ్రంథులు ఉన్నాయి. వీటిలో దేని ప్రాధాన్యం దానిదే. కానీ అతి పెద్ద గ్రంథిగా పేరు తెచ్చుకొన్నది మాత్రం కాలేయం అని చెప్పుకోవాలి. దాదాపు కిలోన్నర బరువు ఉండే ఈ గ్రంథి... అంతర్గత అవయవాల్లో పెద్దదిగా కూడా పేరు గాంచింది. శరీరంలోని కుడి భాగంలో అమరి ఉంటుంది. కాలేయానికి వచ్చే వ్యాధుల్లో తీవ్రమైనదిగా కాలేయ క్యాన్సర్ ని చెబుతారు. ఇది మహిళల్లో కన్నా పురుషుల్లోనే ఎక్కువగా సోకుతున్నట్లు తెలుస్తోంది. పెద్ద వయస్సు వారికి ఈ ముప్పు ఎక్కువ అన్నది కొందరి అభిప్రాయం.
కాలేయంలోనే జనించి విజృంభించే క్యాన్సర్ ను హెపటో సెల్యులార్ కార్సినోమా అని పిలుస్తారు. ఇతర ప్రాంతాల్లో జనించి, కాలేయంలో విస్తరించే క్యాన్సర్ ను మెటా స్టాటిక్ లివర్ క్యాన్సర్ అని అంటారు. సర్వ సాధారణంగా కాలేయంలో సిర్రోసిస్ ఏర్పడి అది ముదిరి క్యాన్సర్ గా రూపాంతరం చెందుతుంది. కాలేయంలోని ఆరోగ్య కణజాలాన్ని తొలగించి అక్కడ అవాంఛనీయ కణజాలం పేరుకొని పోతుంది. ఇది ప్రబలి పోయినప్పుడు కాలేయం పనితీరు దెబ్బ తింటుంది. ఈ దశలో దీన్ని గుర్తించి చికిత్స చేయించక పోతే ముదరిపోయి క్యాన్సర్ గా మారే ప్రమాదం ఉంటుంది. దీనికి తోడు కామెర్లు, మద్యం అలవాటు వంటివి తోడయితే ప్రమాదం మరింత పెరగవచ్చును.
ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. 1. మద్యాన్ని తాగే అలవాటు 2. కాలేయంలో ఆటో ఇమ్యూన్ దశ తలెత్తటం. 3.హెపటైటిస్ బీ లేక హెపటైటిస్ సీ వైరస్ సోకటం. 4. శరీరంలో ఐరన్ శాతం పెరిగిపోవటం. కాలేయానికి క్యాన్సర్ వచ్చినట్లు గుర్తించాకే వెంటనే చికిత్స చేయించాలి. నిపుణులైన జీర్ణ కోశ వ్యాధుల వైద్యుల్ని సంప్రదించాలి. వ్యాధి ఏ దశలో ఉందో తెలుసుకొనే ప్రయత్నం చేయాలి. దీన్ని బట్టి చికిత్స ఏ స్థాయిలో అవసరమో గుర్తిస్తారు. అవసరం అయితే కాలేయానికి కీమో థెరపీ, రేడియో థెరపీలతో పాటు శస్త్ర చికిత్స చేయించాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో సంక్లిష్ట మైన చికిత్స అవసరం ఉంటుంది.
No comments:
Post a Comment