నిర్లక్ష్యం మానవ సహజం. కానీ, ఇది హద్దు దాటితే మాత్రం అనర్థం తప్పదు. ముఖ్యమైన విషయాల్లో నిర్లక్ష్యం వహిస్తే మాత్రం ఇబ్బందే. అటువంటి ముఖ్యమైన అంశాల్లో ఆరోగ్యం కూడా ఒకటి. ఆరోగ్య సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తే ఇబ్బంది పడక తప్పదు.
ఇటీవల కాలంలో మానవ జీవన శైలి మారిపోయింది. గతంలో వ్యవసాయం, వృత్తి పనులు ముఖ్య ఉపాధి మార్గాలుగా ఉండేవి. అప్పట్లో శారీరక శ్రమ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు మాత్రం సీటును అతుక్కొని పని చేయాల్సిన ఉద్యోగాలే ఎక్కువగా ఉపాధి మార్గాలు. నగరాలు, పట్టణాల్లో ఎక్కువ మంది ఇటువంటి వారే కనిపిస్తున్నారు. ఈ తరహా ఉద్యోగుల్లో జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు కనిపిస్తున్నాయి. వాటిని వివరంగా చర్చించుకోవచ్చు. కానీ, ఇక్కడ ఒక సమస్య ముఖ్యమైనది. విరేచనంలో రక్తం పడుట అప్పుడప్పుడు కొందరిలో తలెత్తుతుంది. వాస్తవానికి జీర్ణ క్రియ లో సమస్య తలెత్తితే ఏదో ఒక అవయవంలో ఇబ్బంది ఏర్పడుతుంది. ఇందులో ఆహార వాహిక, జీర్ణాశయం, ఆంత్ర మూలం, శేషాంత్రికం అనే చిన్న పేగు, పెద్ద పేగు, మలాశయం అనే భాగాలతో పాటు కాలేయం, క్లోమం అనే గ్రంథులు, పిత్తాశయం, ఉండూకం అనే చిన్న పాటి సంచీ భాగాలు ఇమిడి ఉంటాయి. వీటిలో ఎక్కడైన సమస్య ఏర్పడితే వాటికి అనుసంధానంగా ఉండే రక్త కేశ నాళికలు చిట్లుతాయి. అప్పుడు రక్తం ఆహార వాహిక లోకి విడుదల అవుతుంది. ఈ రక్తం దిగువకు అంటే మలం దగ్గరకు చేరి బయటకు విసర్జితం అవుతుంది.
సాధారణంగా పైల్స్ సమస్య తో బాధ పడే వారికి ఇది కనిపిస్తుంది. అంత మాత్రాన అన్ని సమస్యల్నీ ఆ గాటన కట్టేయలేం. కానీ, రక్తం పడటానికి అనేక కారణాలు ఉన్నాయి. పేగు లో అల్సర్స్ ఏర్పడటం, పేగు క్యాన్సర్, జీర్ణ కోశ సంబంధిత ఇన్ ఫెక్షన్ లు వంటి కారణాలు ఉంటాయి. వీటిలో ఏ కారణంతో సమస్య ఏర్పడిందో తెలుసుకొని చికిత్స చేయించుకోవాలి. లేదంటే ఈ సమస్య ముదిరిపోయి సమస్య తీవ్రం అవుతుంది. అందుచేత ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు సరైన వైద్యుల్ని సంప్ర దించి శాస్త్రీయమైన చికిత్స తీసుకోవాలి. నిర్లక్ష్యం వహిస్తే మాత్రం చేతులారా కొంప ముంచుకొన్నట్లవుతుంది.
No comments:
Post a Comment