...

SPECIALIZED SITE FOR HUMAN HEALTH CARE,
SPECIALLY ON GASTROENTEROLOGY, LIVER AND PANCREAS

అర‌గంట స‌మ‌యం అంత విలువైన‌దా..!

అర‌గంట అంటే చాలా చిన్నదిగా అనిపిస్తుంది. కానీ, ఈ అర‌గంట‌లో ఎంతో సాధించ‌వ‌చ్చు. రోజు లో 24 గంట‌లు ఉంటాయి అంటే 48 అర్థ గంట‌లు ఉంటాయి. ఇందులో ఒక్క అర్థ గంట ప్రతీ వ్యక్తి త‌న గురించి తాను కేటాయించుకొంటే ఎంతో బాగుంటుంది.

స‌మ‌యాన్ని ఇత‌రులకు బాగానే కేటాయిస్తాం కానీ, మ‌న గురించి మ‌నం ఆలోచించుకొనే తీరిక ఉండ‌దు. కానీ ప్రతీ రోజు ఏదో ఒక స‌మ‌యం నిర్ధిష్టంగా పెట్టుకొని, ఆ స‌మ‌యంలో అంత‌కు ముందు రోజు చేసిన ప‌నుల‌న్నీ చ‌క్కగా రివ్యూ చేసుకోవ‌చ్చు. అంతే కాకుండా మ‌న ఆరోగ్యం, మ‌న వికాసం, మ‌న ఆలోచ‌న‌లు వంటి విష‌యాల‌న్నీ ఆలోచించుకోవ‌చ్చు.
అంత‌కు మించి ఈ అర‌గంట‌లో న‌డ‌క‌, తేలిక పాటి వ్యాయామం త‌ప్పనిస‌రిగా చేయాలి. న‌డ‌క‌, తేలిక పాటి వ్యాయామంతో శ‌రీరం దృఢంగా ఉంటుంది. వ్యాధి నిరోధ‌క శ‌క్తిని పెంచుకోగ‌లుగుతుంది. అంతే గాకుండా స్థూల‌కాయం, మ‌ధుమేహం వంటి స‌మ‌స్యల‌కు దూరంగా ఉండ‌వ‌చ్చు. అందుచేత అరగంట స‌మ‌యం మ‌న గురించి మ‌నం కేటాయించుకొంటే అది విలువైన‌దే క‌దా..!

ఆయ‌న‌కు కొంచెం హెచ్చు ఉంది...కానీ దానికో లెక్కుంది..!


బ‌రువు ఎక్కువ‌గా ఉంటే చూడ‌టానికి అంత బాగోదు క‌దా..! అంతే క‌దా అని తేలిగ్గా తీసుకోవ‌ద్దు సుమా. బ‌రువు ఎక్కువ‌గా ఉంటే మ‌ధుమేహం, ర‌క్త పోటు వంటి ఆరోగ్య స‌మ‌స్యలు కూడా త‌లెత్తుతాయి. మ‌రి, బ‌రువు ఎక్కువ‌గా ఉండ‌టం అంటే ఎలా గుర్తించాలి.. దీనికి ఏమైనా కొల బ‌ద్ద ఉంటుందా అని పరిశీలిస్తే కొన్ని ప్రాతిపదికలు క‌నిపిస్తాయి.

స్థూల‌కాయాన్ని గుర్తించ‌టానికి ప్రధానంగా బాడీ మాస్ ఇండెక్స్ మీద ఆధార‌ప‌డ‌తారు. మ‌నిషి బ‌రువు ని కిలోగ్రాముల్లో గ‌ణించాలి. ఎత్తుని మీటర్ల లో కొలిచి దాన్ని స్క్వేర్ చేయాలి. ఈ ఫ‌లితంతో బ‌రువు ని భాగించాలి. ఫ‌లితాన్ని బాడీ మాస్ ఇండెక్సుగా చెబుతారు. ఈ బాడీ మాస్ ఇండెక్సు ఎంత ఉంది అనే దానిపై స్థూల‌కాయం గ‌ణించి చెప్పవ‌చ్చు. ఈ బాడీ మాస్ ఇండెక్సు 18.5 క‌న్నా త‌క్కువ ఉంటే త‌క్కువ బ‌రువు క‌లిగి ఉన్నట్లు లెక్క. 18.5 నుంచి 25 పాయింట్ల దాకా ఉంటే స‌క్రమ‌మైన బ‌రువు ఉన్నట్లు లెక్క. 25 నుంచి 30 దాకా ఉంటే ఎక్కువ బ‌రువు ఉన్నట్లన్న మాట‌. 30 నుంచి 35 దాకా ఉంటే టైప్‌-ఒన్ స్థూల‌కాయం, 35 నుంచి 40 దాకా ఉంటే టైప్‌-టూ స్థూల‌కాయం, 40 దాటి ఉంటే టైప్ - త్రీ స్థూల‌కాయం ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ గ‌ణాంకాలు చెబుతున్నాయి.
స్థూల కాయాన్ని న‌డుము కొల‌త‌ను బ‌ట్టి కూడా చెబుతారు. ఆరోగ్యవంతుడైన పురుషుల్లో  న‌డుము కొల‌త 90 సెం.మీ., మ‌హిళ‌ల్లో 80 సెం.మీ. వ‌ర‌కు ఉండ‌వ‌చ్చు. పురుషుల్లో 102 సెం.మీ. దాటితే ప్రమాదం అనీ, మ‌హిళ‌ల్లో 88 సెం.మీ. దాటితే మాత్రం ప్రమాదం అని చెబుతారు.
స్తూల కాయం అన్నది ఎవ‌రికి వారు లెక్క చూసుకోవ‌చ్చు. బ‌రువు కాస్త  ఎక్కువ‌గా ఉంటే వ్యాయామం, ఆహార జాగ్రత్తల‌తో త‌గ్గించుకోవ‌చ్చు. మ‌రీ ఎక్కవ ఉంటే మాత్రం వైద్యుల స‌ల‌హాతో స‌ర్జరీ, నాన్ స‌ర్జరీ ట్రీట్ మెంట్ లు తీసుకోవ‌చ్చు. ఇప్పుడు ఉన్న ఆధునిక టెక్నాలజీతో సుర‌క్షిత‌మైన చికిత్సను పొంది, బ‌రువు ను త‌గ్గించుకొని చ‌క్కటి శ‌రీర ఆకృతి ని పొంద‌వ‌చ్చు. 

లావు పెరిగిపోతున్నారా..! జ‌ర భ‌ద్రం

లావు పెరుగుతుంటే ఎవ‌రికైనా ఇబ్బందే. దీన్ని ముందుగానే గుర్తించక పోతే త‌ర్వాత కాలంలో స‌మ‌స్యలు త‌లెత్తుతాయి. చాలామంది స్తూల కాయం వ‌ల‌న చూప‌రుల‌కు ఇబ్బంది ఉంటుంది అని భావిస్తారు. అది మాత్రమే కాదు, ఆరోగ్య ప‌రంగా కూడా ఇబ్బందులు ఉంటాయి. స్థూల కాయుల్లో కొవ్వు పేరుకొని పోవ‌టం వ‌ల‌న రక్త ప్రస‌ర‌ణ‌, జీర్న క్రియ వంటి జీవ‌న క్రియ‌లు స‌క్రమంగా ప‌ని చేయ‌వు.

కొవ్వు పేరుకోవ‌టం వ‌ల‌న  కొలెస్టిరాల్ శాతం పెరుగుతుంది. దీని వ‌ల‌న ర‌క్తం స‌ర‌ఫ‌రా స‌క్రమంగా జ‌ర‌గ‌దు. అందాల్సిన ప్రాంతంలో ర‌క్తం స‌క్రమంగా అంద‌క పోవ‌టం వ‌ల‌న అక్కడ‌కు శ‌క్తి స‌రిగ్గా అంద‌దు. అందుకే స్థూల కాయులు కాస్త ఎక్కువ ప‌ని చేసినా, కాస్త ఎక్కువ దూరం న‌డిచినా అల‌సి పోతారు. ఆయాస ప‌డ‌తారు. ఎందుచేత‌నంటే ఆ పనుల కోసం కావాల్సిన శ‌క్తి ఉత్పత్తి కాదు. మ‌రో వైపు నాళాలు మందంగా త‌యార‌వ‌టం అన్నది స్థూల కాయుల్లో త‌లెత్తే మ‌రో స‌మ‌స్య. దీంతో ఊపిరి తీసుకోవటం కూడా క‌ష్టంగా ఉంటుంది.
స్థూల కాయుల‌కు మ‌ధుమేహం పొంచి ఉంటుంది. శ‌రీరంలో స‌క్రమంగా గ్లూకోజ్ ప్రస‌ర‌ణ లేక పోవ‌టం వ‌ల‌న దీన్ని గుర్తిస్తారు. కొ్వ్వులు పేరుకొని పోవ‌టం వ‌ల‌న క్లోమం ప‌నితీరు దెబ్బ తింటుంది. దీని కారణంగా ఇన్సులిన్ స్రావంలో స‌మ‌స్య త‌లెత్తి అంతిమంగా మ‌ధుమేహానికి గురి కావాల్సి వ‌స్తుంది. ఒక్క సారి మ‌ధుమేహం త‌లెత్తితే అది శాశ్వత స‌మ‌స్య అని తెల‌సుకోవాలి. జీవితాంతం జాగ్రత్తలు తీసుకోవ‌టం తో పాటు మందులు వాడాల్సిన అవ‌స‌రం కూడా ఏర్పడ‌వ‌చ్చు.

స్థూల కాయుల‌కు శరీర భాగాల్లో కొవ్వు పేరుకొని పోతుంది. ర‌క్త ప్రస‌ర‌ణ అన్నది చురుగ్గా జ‌ర‌గాల్సిన ప్రక్రియ‌. కానీ అన‌వ‌స‌ర‌పు పదార్థాల నిల్వలు పేరుకొని పోవ‌టం వ‌ల‌న గుండె కు సంబంధించిన ర‌క్త నాళాల్లో స‌మ‌స్య త‌లెత్తుతుంది. దీంతో ఆయా నాళాల్లో ర‌క్తపు పంపింగ్ కోసం ఒత్తిడి ఏర్పడుతుంది. ఈ ఒత్తి డి అన్ని ప్రాంతాల‌కు వ్యాపిస్తే క‌రోన‌రీ సంబంధిత స‌మ‌స్యల‌తో పాటు స్ట్రోక్ వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది.
శ‌రీర ఆకృతికి మూలంగా ఎముక‌ల‌తో కూడిన అస్థి పంజ‌ర వ్యవ‌స్థ ను చెప్పవ‌చ్చు. ఈ అస్థి పంజ‌రం త‌గిన బ‌రువును మోసేందుకు డిజైన్ చేయ‌బ‌డి ఉంటుంది. కానీ బ‌రువు అదే ప‌ని గా పెరిగిపోతుంటే మాత్రం ఈ ఎముక‌ల మీద ఒత్తిడి ఏర్పడుతుంది. అటు నాడుల ప‌ని తీరు మీద కూడా ఇబ్బంది ఏర్పడుతుంది.
ఇన్ని స‌మ‌స్యల‌కు కార‌ణ‌మైన స్థూల కాయం అన్నది చాలావ‌ర‌కు స్వయంకృతం. ఎక్కువ ఫుడ్ తీసుకోవ‌టం వ‌ల‌న ఈ స‌మ‌స్య త‌లెత్తుతుంది. అందుచేత స్థూల కాయాన్ని త‌గ్గించుకొనేందుకు ఎవ‌రికి వారు ప్రయ‌త్నించాలి. అప్పుడే పైన చెప్పిన స‌మ‌స్యలు రాకుండా జాగ్రత్త ప‌డేందుకు వీల‌వుతుంది.

మంట‌ల్ని అరిక‌ట్టలేమా..!


మంట అనే ప‌దమే కొంత విచిత్రంగా ఉంటుంది. మండే స్వభావాన్ని వ్యక్తీక‌రించే ప‌దం ఇది. ఈ ప‌దం విన‌గానే దాని స్వభావం అర్థం అయిపోతుంది.

ఈ మంట పుట్టడానికి అనేక కార‌ణాలు క‌నిపిస్తాయి. ఒకే నిర్దిష్ట కార‌ణాన్ని మ‌నం చెప్పలేం కానీ, ప్రధానంగా ఆధునిక జీవ‌న శైలిలో ఉండే ఒత్తిళ్లతో మంట పుట్టడం అన్నది కామ‌న్ గా మారింది.
శ‌రీరంలో ఆహార ప‌దార్థాలు ప్రవేశించ‌గానే జీర్ణాశ‌యంలోని గ్రంథులు ఉత్తేజితం అవుతాయి. వీటి నుంచి ఎంజైమ్ ల‌తో పాటు హైడ్రో క్లోరిక్ ఆమ్లం స్రావితం అవుతుంది. ఇది ఆహారాన్ని ఖైమ్ గా మార్చేందుకు అవ‌స‌ర‌మైన ఆమ్లత్వాన్ని క‌లిగిస్తుంది. అప్పుడు మాత్రమే ఆహారాన్ని జీర్ణం చేసే ఎంజైమ్‌లు ప‌ని చేస్తాయి. కానీ, ఆహార‌పు అల‌వాట్లు స‌క్రమంగా లేక‌పోతే స‌మ‌స్య త‌లెత్తుతుంది. ఆధునిక లైఫ్ స్టయిల్ లో ఒక టైమ్ కు తిండి తిన‌టం అన్నది మ‌రిచిపోతున్నారు. దీంతో ఏదో ఒక టైమ్ లో ఏదో ఒక ఫుడ్ తిన‌టం ఎక్కువ అయింది. దీని వ‌ల‌న ఎప్పుడు గ్రంథులు స్రవించాలో తెలీక‌, స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా ఎంజైమ్‌లు, ఆసిడ్స్ బ‌య‌ట‌కు వ‌స్తుంటాయి. కానీ, జీర్ణాశ‌యంలో త‌గినంత ఆహారం లేక‌పోతే మాత్రం ఈ ఏసిడ్ కు త‌గినంత ప‌ని ఉండ‌దు. అప్పుడు ఈ ఆమ్లం జీర్ణాశ‌య గోడ‌ల మీద‌నే ప్రభావం చూపుతుంది. సరిగ్గా ఈ కార‌ణం వ‌ల్లనే  ఈ మ‌ధ్య కాలంలో చాలామందిలో క‌డుపు మంట స‌మ‌స్యను గుర్తించ‌టం జ‌రిగింది.

దీన్ని అరిక‌ట్టాలంటే ఆహార‌పు అల‌వాట్లను నియంత్రించాలి. స‌రైన టైమ్ కు స‌రైన ఆహారం తీసుకొనేందుకు ప్రయ‌త్నించాలి. ఇందుకోసం టైమ్ షెడ్యూల్ ఫాలో అయితే మంచిది. స‌మ‌స్య తీవ్రంగా ఉంటే వైద్యుల్ని సంప్రదించాలి. ఎసిడిటీ కి విరుగుడు మందుల్ని వాడే ముందు వైద్య స‌ల‌హా తీసుకోవ‌టం మేలు.

సెల‌వుల్లో పిల్లల‌ను కంట్రోల్ చేయాల్సిందేనా...!



సెల‌వులు అంటే పిల్లల‌కు ఎంతో ఇష్టం. సెల‌వుల్లో హాయిగా ఎంజాయ్ చేయ‌వ‌చ్చు అని భావిస్తారు. ఈ మూడ్ ను పెద్దలు కూడా ప్రోత్సహిస్తుంటారు. అంత‌వ‌ర‌కు బాగానే ఉంది. కానీ, వీకెండ్స్ లో కానీ, సెల‌వుల్లో కానీ పిల్లల ఫుడ్ అల‌వాట్లు మారిపోతున్నాయి. ఇది మాత్రం ఆలోచించాల్సిన విష‌య‌మే.

ఇటీవ‌ల కాలంలో జంక్ ఫుడ్ తిన‌టం బాగా ఫ్యాష‌న్ గా మారింది. చిప్స్, బ‌ర్గర్‌, పిజ్జాలు తిన‌టం అన్నదే క్రేజ్ గా మారిపోయింది. ఒక చేత్తో ఈ ఫుడ్ తిన‌టం, మ‌రో చేత్తో కూల్ డ్రింక్ తిన‌టం స్టయిల్ గా పాటిస్తున్నారు. ఈ జంక్ ఫుడ్ వ‌ల‌న శ‌రీరానికి ఎటువంటి ఉప‌యోగంలేదు స‌రికదా.. అన‌ర్థం మాత్రం త‌ప్పదు. కొవ్వు సంబంధిత ప‌దార్థాలతో పాటు అన‌ర్థక మెటీరియ‌ల్ కూడా పోగుప‌డుతోంది. అంతిమంగా ఈ చెడు ప‌దార్థాల వ‌ల‌న వివిధ అవ‌యవాల‌ల్లో కొవ్వు పేరుకు పోతోంది. ఫ‌లితంగా శ‌రీరానికి స‌క్రమంగా అందాల్సిన శ‌క్తి అంద‌కుండా పోతుంది. ఈ ఆహారం వ‌ల‌న మంచి ఉత్పేర‌కాలు మెద‌డుకు అంద‌కుండా పోతాయి.

అందుచేత పిల్లల‌ను జంక్ ఫుడ్స్ కు దూరంగా ఉంచ‌టం పెద్దల బాధ్యత‌. ఈ విష‌యంలో పిల్లల‌కు న‌చ్చ చెప్పి ఈ అల‌వాటు మానిపించుట మేలు.

ఎటో వెళ్లిపోయింది మ‌న‌స్సు.. అక్కడే అస‌లు చిక్కు ఉంది..!



ఎటో వెళ్లిపోయింది మ‌నస్సు... ఈ ప‌దబంధం భ‌లే ఉంది క‌దా నిజంగానే మ‌న‌స్సు అనే దానికి క‌ళ్లెం ఉండ‌దు. అది ఎటు కావాలంటే అటు ప‌రిగెడుతుంటుంది.దీన్ని ఎంత ఆహ్లాదంగా ఉంచుకొంటే అంత చ‌క్కగా ప‌నులు చ‌క్కబెట్టుకోవ‌చ్చు. దీన్ని ప్రశాంతంగా ఉంచుకోవ‌టం అన్నది మ‌న చేతిలో ప‌ని.

ఈ మ‌ధ్య కాలంలో మ‌నుషుల మీద ఒత్తిడి బాగా పెరుగుతోంది. ఆధునిక జీవ‌న‌శైలి, వృత్తి ఉద్యోగాల్లో టెన్షన్ లు, ప్రయాణం వంటి ప‌నుల్లో చికాకు పెరిగి పోతున్నాయి. వాస్తవానికి ఈ విధంగా టెన్షన్ ప‌డిన‌ప్పుడ‌ల్లా శ‌రీరంలో ర్యాడిక‌ల్స్ ఉత్పత్తి అవుతాయి. ఈ రాడిక‌ల్స్ క్రమంగా నెగ‌టివ్ ప్రబావాన్ని చూపుతుంటాయి. టెన్షన్ పెరిగే కొద్దీ వీటి సంఖ్య పెరిగిపోయి మెద‌డు మీద అంటే మ‌న‌స్సు మీద ప్రభావం చూపుతుంటాయి. దీన్ని త‌ట్టుకోలేక ప‌గ‌టి పూట టీ విప‌రీతంగా తాగే వారు కొంద‌రైతే సాయంత్రానికల్లా మ‌ద్యాన్ని ఆశ్రయించే వారు మ‌రికొంద‌రు. ఈ టీలు తాగ‌టం, మ‌ద్యం  తాగ‌టం వ‌ల‌న ఏర్పడే అన‌ర్థాలు అన్నీ ఇన్నీ కావు. ఈ డ్యామేజీ కి అడ్డుక‌ట్ట వేయాలంటే టెన్సన్ ప‌డ‌టాన్ని త‌గ్గించుకోవాలి. ఇందు కోసం మ‌న‌స్సుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. అప్పుడే మ‌న‌స్సు ఎటూ వెళ్లి పోకుండా ఉంటుంది.

ఎక్కువ‌గా టీ తాగితే ఏమ‌వుతుంది..!


టీ తాగ‌టం అన్నది ఈ రోజుల్లో చాలా సాధార‌ణ‌మైన అల‌వాటు. ఇది ప‌రిమితుల్లో ఉంటే ఫ‌ర్వాలేదు. స‌రి కదా నాడీ వ్య వ‌స్థ ను ఉత్తేజ ప‌ర‌చ‌టం, ఆహ్లాదాన్ని క‌లిగించ‌టం వంటి మంచి ల‌క్షణాలు ఉన్నాయి. అయితే ఎక్కువ సార్లు టీ తాగే అల‌వాటు ఉంటే మాత్రం కాస్త ఆలోచించాల్సిందే. ఎక్కువ‌గా టీ తాగ‌టం వ‌ల‌న టీ పొడిలో ఉండే ర‌సాయ‌నాలు ఎక్కువ‌గా శ‌రీరంలో క‌లుస్తాయి. దీని వ‌ల‌న అన‌ర్థాలు త‌ప్పవు.

టీ ఆకుల్లో ఫ్లోరైడ్ ఉంటుంది. రోజుకి 10-12 సార్లు టీ తాగితే మాత్రం నాలుగు గ్రామ్ ల దాకా ఫ్లోరిన్ శ‌రీరంలోకి చేరుతుంది. సంవ‌త్స రాల త‌ర‌బ‌డి కొనసాగితే మాత్రం ఫ్లోరోసిస్ వృద్ధి చెందే అవ‌కాశం ఉంటుంది. దీంతో పాటు టీ ఆకు లో ఉండే అల్యూమినియం కూడా క్రమంగా ప్రవేశిస్తుంది. దీంతో శ‌రీరంలో విష ప్రభావం క‌నిపిస్తుంది. టీ లో స‌హ‌జంగా ఉండే ఆక్జలేట్ ల‌తో ముప్పు పొంచి ఉంది. త‌క్కువ ప‌రిణామంలో ఇవి మేలు చేస్తాయి. కానీ, ఎక్కువ‌గా తీసుకొంటే మాత్రం మూత్ర పిండాళ్లో రాళ్లు ఏర్పడుట‌కు కార‌ణ భూతం అవుతాయి.కొంత మందికి వేడి వేడి టీ ప‌దే ప‌దే తాగే అల‌వాటు ఉంటుంది. ఇటువంటి వారికి గొంతు క్యాన్సర్ మొద‌ల‌య్యే ప్రమాదం ఉంటుంది సుమా..! మ‌రి కొంత మందిలో ప్రోస్టేట్ క్యాన్సర్ కూడా రావ‌చ్చున‌ని ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి.

ఈ అన‌ర్థాలన్నీ ఒక్క సారిగే వ‌చ్చేస్తాయ‌ని కాదు కానీ ఎక్కువ మోతాదులో ప‌దే పదే టీ తాగ‌టం వ‌ల‌న త‌లెత్తే అనర్థాలు మాత్రమే. దీనికి తోడు టీ కి అల‌వాటు ప‌డితే .. ఒక్క పూట టీ తాగ లేక పోతే ఉండ‌లేని ప‌రిస్తితి ఏర్పడుతుంది. అందుచేత టీ తాగ‌టం మంచిదే కానీ, అతి స‌ర్వత్ర వ‌ర్జయేత్.

అప్పుడు ఓకే.. ఇప్పుడు రాళ్లు ఎందుకు ప‌డుతున్నట్లు..!


రాళ్లు అంటేనే నెగ‌టివ్ ప‌దం. అటువంటి రాళ్లు ఎక్కడ ఉన్నా వాటిని నెగ‌టివ్ గానే చూస్తాం.. స‌రిగ్గా ఈ సూత్రం మ‌నిషి కి వ‌ర్తిస్తుంది. ఎందుకంటే ఈ రాళ్లు చేసే కీడు అంతా ఇంతా కాదు.

మాన‌వ శ‌రీరంలో కొన్ని భాగాల్లో రాళ్లు పేరుకొనే చాన్స్ ఉంటుంది. ఆహారంలో ఆయిల్ పుడ్స్, కొవ్వు కారకాలు ఎక్కువ‌గా తీసుకొంటే వీటి వ‌ల‌న ఆయా ఉత్పన్నకాలు ఘ‌న రూపంలోకి మార‌తాయి. వీటినే మామూలు భాష‌లో రాళ్లు పేరుకొన్నాయి అంటారు. మూత్రపిండాలు, పిత్తాశ‌యం వంటి చోట్ల వీటిని మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. ఇవి శ‌రీరంలో స‌హ‌జంగా జ‌రిగే ప్రక్రియ‌ల‌కు అడ్డుగా నిలుస్తాయి. ఒక వైపు శ‌రీరం త‌న మెట‌బాలిక్ క్రియ‌ల కోసం తీవ్రంగా ప్రయ‌త్నిస్తుంటుంది. కానీ ఈ రాళ్లు వాటికి అడ్డు ప‌డుతుంటాయి. దీంతో నొప్పి జ‌నిస్తుంది. మొద‌ట్లో ఈ నొప్పి ఎందుకు వ‌స్తోందో తెలీదు. కానీ త‌ర‌చు ఈ నొప్పి వ‌స్తుంటే అప్పుడు తీవ్రత తెలుస్తుంది. చాలామంది క‌డుపులో నొప్పి అంటే ఏదో మాత్రలు వేసుకొని, ఇంటి వైద్యం చేసుకొంటూ ఉంటారు.కానీ దీన్ని నిర్లక్ష్యం చేస్తే మాత్రం స‌మ‌స్య తీవ్రం అవుతుంది. అంటే ఈ రాళ్లు పేరుకోవ‌టం మొద‌ట్లో అయితే సాధార‌ణ మందుల‌తో త‌గ్గిపోతుంది. అలా వ‌దిలేస్తే శ‌స్త్ర చికిత్స చేయాల్సి వ‌స్తుంది. ఆయిల్ ఫుడ్ త‌ర‌చు తీసుకొనే వారికి మొద‌ట్లో అంతా ఓకే అనిపిస్తుంది. కానీ త‌ర్వాత కాలంలోనే రాళ్లు ప‌డుతుంటాయి. అందుచేత ఈ ఆయిల్ ఫుడ్స్, మ‌సాలా ఆహార ప‌దార్థాల విష‌యంలో జాగ్రత్త అవ‌స‌రం.

మీ ఫుడ్డుతో మీకే ముప్పు..!


వీకెండ్ వ‌చ్చిందంటే బ‌య‌ట‌కు వెళ్లి ఫుడ్ తీసుకోవ‌టం ఈ మ‌ధ్యకాలంలో పెరిగింది. వీకెండ్ స‌మ‌యంలో ఇటువంటి అలవాట్ల లో త‌ప్పు లేదు. కానీ, ఈ ఫుడ్ లోఏమి తీసుకొంటున్నామ‌న్నది మాత్రం ముఖ్యం. ఇప్పుడు ఈ విష‌య‌మే గ‌మ‌నించ ద‌గిన విష‌యం. ఈ మ‌ధ్య కాలంలో పిల్లలు జంక్ ఫుడ్ కు అల‌వాటు ప‌డుతున్నారు.

 బ‌య‌ట‌కు వెళితే చాలు ఆయిల్ తో కూడిన ఫుడ్‌ను తీసుకొంటున్నారు. ఇందుకు త‌ల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా ఉండ‌టం దుర‌దృష్టక‌రం. పిజ్జాలు, బ‌ర్గర్లు రెగ్యుల‌ర్ గా తీసుకొంటున్నారు. ఇటువంటి జంక్ ఫుడ్ అప్పుడ‌ప్పుడు అయితే ఫ‌ర్వాలేదు కానీ క్రమం త‌ప్పకుండా తిన‌టం మాత్రం మంచిది కాదు. దీని వ‌ల్ల క‌డుపులో జీర్ణం కావటం క‌ష్టం అవుతుంది.

ప‌లితంగా క‌డుపు నొప్పి వంటి స‌మ‌స్యలు త‌లెత్తవ‌చ్చు. ఈ క‌డుపు నొప్పి ర‌క ర‌కాల మందులు వాడేస్తుంటాం కానీ, అస‌లు సంగ‌తి గుర్తించ‌టం మ‌రిచిపోతాం. ఈ జంకు ఫుడ్ ను ఆప‌గ‌లిగితే కొన్ని కేసుల్లో క‌డ‌పు నొప్పి మాయం అవుతుండ‌టం గ‌మ‌నించ‌టం జ‌రిగింది. అందుచేత జంక్ పుడ్ ను అదుపు చేయంటం చాలా ముఖ్యం అని గుర్తించాలి.

ఆడ వాళ్లకు మండిందంటే అంతే సంగ‌తులా..!

ఆడ వాళ్లకు మండిందంటే ఏమి జ‌రుగుతుంది.. అస‌లు మంట ఎందుకు వ‌స్తుంది... మంట వ‌చ్చిన‌ప్పుడు ఆడ‌వాళ్లు ఎలా ఉంటారు.. వంటి మాట‌లు చిన్నవిగా ఉంటాయి. కానీ, వీటిని అప్పటికి అలా వ‌దిలేయ‌కూడ‌దు సుమా...! ఎందుకంటే స‌మ‌స్యను అర్థం చేసుకోవాలి కానీ, స‌మ‌స్య రూపం గురించి ఆలోచించ‌కూడ‌దు. దీని వ‌ల‌న స‌మ‌స్య అంతు ప‌ట్టకుండా పోతుంది.

క‌డుపులో మంట లేక క‌డుపులో నొప్పి అనేదానికి చాలా అర్థాలు, ప‌ర‌మార్థాలు ఉంటాయి. ఆ విష‌యం ప‌ట్టించుకోకుండా మామూలు విష‌య‌మే అని ఊరుకొంటే మాత్రం ఒక్కోసారి కొంప మున‌గ‌వ‌చ్చు. మ‌హిళ‌ల‌కైనా, పురుషుల‌కైనా అప్పుడ‌ప్పుడు క‌డుపులో నొప్పి గా అనిపించ‌వ‌చ్చు. అయితే తిన్న ఆహారం జీర్ణం కాన‌ప్పుడు కాస్తంత నొప్పి అనిపించ‌వ‌చ్చు. ఇది స‌ర్వ సాధార‌ణం అయిన విష‌యం. కానీ, అన్ని నొ్ప్పులు ఈ బాప‌తు అనుకోవ‌ద్దు సుమా. వాస్తవానికి మాన‌వ జీర్ణ వ్యవ‌స్థలో అనేక భాగాలు ఉన్నాయి. ప్రాథ‌మిక ఆహార వాహిక‌లో భాగంగా జీర్ణాశ‌యం లేక క‌డుపు, ఆంత్ర మూలం, చిన్న పేగు, పెద్ద పేగు అనే భాగాల‌తో పాటు, కాలేయం, క్లోమం అనే అనుబంధ గ్రంథులు క‌నిపిస్తాయి. వీటిలో వాపు వ‌చ్చినా, ఇన్ ఫెక్షన్ సోకినా, రక్త ప్రసారానికి అంత‌రాయం ఏర్పడినా క‌డుపు నొప్పి అనిపిస్తుంది. స‌రిగ్గా జీర్ణాశయం లేక క‌డుపు ద‌గ్గరే నొప్పి వ‌స్తోందా లేక ఇత‌ర ప్రాంతాల నుంచి అటూ ఇటూ వ్యాపిస్తోందా అన్నదికూడా ముఖ్యమే. ఏదో ఒక సంద‌ర్భంలో వ‌చ్చి పోతే దాన్ని మామూలు నొప్పి గా భావించ‌వ‌చ్చు. కానీ, త‌రుచు నొప్పి వ‌స్తుండ‌టం, నొప్పి వ‌చ్చిన‌ప్పుడు ఎక్కువ సేపు ఉండ‌టం, నొప్పి తీవ్రం గా ఉండ‌టం వంటి ల‌క్షణాలు ఉన్నప్పుడు మాత్రం దీని గురించి ఆలోచించాల్సిందే.

క‌డుపు మ‌ధ్య భాగంలో నొప్పి జ‌నించి, కుడి వైపు కింది భాగంలోకి వ్యాపిస్తే ఉండుక నొప్పి గా, ఎడ‌మ‌వైపు కింది భాగంలో నొప్పి మొద‌లై కుడి వైపు కింది భాగంలోకి వ్యాపిస్తే పురీష నొప్పి అని, మధ్యలో నొప్పి మొద‌లై కుడి దిశ‌గా పైకి వ్యాపిస్తుంటే దాన్ని పిత్తాశ‌య నొప్పి అని చెబుతారు. ఈ అంచ‌నా ప్రాథ‌మిక‌మైన‌దే సుమా..! స‌రిగ్గా నిర్ధార‌ణ కావాలంటే మాత్రం డ‌యాగ్నిస్టిక్ టెస్టులు త‌ప్పనిస‌రి. వ్యాధి తీవ్రం అవుతోంద‌ని భావిస్తే మాత్రం నిపుణులైన వైద్యుల్ని సంప్రదించి చికిత్స జ‌రిపించుకోవాలి. లేని ప‌క్షంలో సమ‌స్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది. నొప్పి ఒకే క‌డుపులో వ‌స్తున్నా.. అన్ని నొప్పిలు ఒక బాప‌తు కాద‌ని గుర్తించుకోవాలి. మ‌హిళ‌ల‌కైనా, పురుషుల‌కైనా ఇన్ని ర‌కాల ఇబ్బందులు త‌ప్పవు. ( మ‌హిళ‌ల్లో మాత్రం గైనిక్ సంబంధిత స‌మ‌స్యల‌తో కొన్ని ర‌కాల నొప్పి వ‌స్తుంటుంది, అది వేరే విష‌యం) అందుచేత నొప్పి ని తేలిగ్గా తీసుకోకుండా అశ్రద్ధ చేయ‌కుండా స‌రైన స‌మ‌యంలో స‌రైన వైద్య స‌ల‌హా తీసుకోవ‌టం మేలు.