...

SPECIALIZED SITE FOR HUMAN HEALTH CARE,
SPECIALLY ON GASTROENTEROLOGY, LIVER AND PANCREAS

నాటు రూటు ఎంత వ‌ర‌కు సేఫ్‌..!


ఆలోచించండి.. నాటు మార్గంలో వెళితే ఎంత వ‌ర‌కు సుర‌క్షితం. ఎవ‌రో ఏదో చెప్పార‌ని న‌మ్మేసి ముందుకు వెళ్లిపోతే, ఫ‌లితం ఆశాజ‌న‌కంగా ఉండ‌దు. ఒక్కోసారి ఇది విక‌టించే అవ‌కాశం ఉంటుంది. దీనికి ఎన్నో ఉదాహ‌ర‌ణ‌లు క‌నిపిస్తాయి. కామెర్లు విష‌య‌మే తీసుకొంటే.. కామెర్లకు ఎన్నో కార‌ణాలు ఉంటాయి. ఆ విష‌యం తెలుసుకోకుండా కేవ‌లం చెట్టు మందు తింటేనో, నాటు మందు తీసుకొంటేనో త‌గ్గిపోతుంది అనుకొంటే .. అంత‌కు మించిన భ్రమ మ‌రొక‌టి ఉండ‌దు.

కామెర్లు అనేది నాలుగైదు ర‌కాల వైర‌స్ ల వ‌చ్చే వ్యాధి. ఇందులో కొన్ని ప్రమాద‌క‌రం కాగా, మ‌రి కొన్ని అంత ప్రమాదం లేనివి ఉంటాయి. ఏవి ప్రమాద క‌రం అనేది స‌రైన డ‌యాగ్నస్టిక్ ప‌రీక్షల ద్వారానే తేలుతుంది. హెప‌టైటిస్ ఏ, ఈ వంటి వ్యాధులు అంత ప్రమాదం కాద‌నే చెప్పుకోవ‌చ్చు. 70 శాతం దాకా కామెర్లు ఈ ర‌కానికి చెందిన‌వే ఉంటాయి. చాలా సార్లు ఈ ర‌క‌పు కామెర్లు మందులు ఏమీ తీసుకోకుండానే త‌గ్గిపోతాయి. శ‌రీరానికి స‌హ‌జంగా ఉండే వ్యాధి నిరోధ‌క శ‌క్తితో ఈ కామెర్లు దూరం అవుతాయి. అటువంట‌ప్పుడు ఎవ‌రైనా చెట్టు మందు లేక నాటు మందు లేక ప‌స‌ర మందు తీసుకొన్నార‌నుకొందాం. అప్పుడు స‌హ‌జంగానే కామెర్లు త‌గ్గిపోతాయి, తీరాచూస్తే ఈ ర‌క‌పు మందుతో వ్యాధి నివార‌ణ అయిపోయింద‌ని భావిస్తారు. అస‌లు విష‌యం ఏమిటంటే శ‌రీర ధ‌ర్మం తోటే ఆ వ్యాధులు త‌గ్గిపోయాయ‌న్న మాట‌.

అస‌లు ముప్పు మాత్రం హెప‌టైటిస్ బీ, సీ వంటి రకాల‌తో పొంచి ఉంటుంది. ఈ ర‌క‌పు కామెర్లు సోకిన‌ప్పుడు క‌చ్చితంగా వ్యాధి నిర్దార‌ణ ప‌రీక్షలు చేయించుకోవాలి. ఆ త‌ర్వాత నిపుణులైన వైద్యుల్ని సంప్రదించాలి. సుశిక్షితులైన డాక్టర్ చేత వైద్యం చేయించుకోవాలి. స‌రైన మందులు తీసుకొంటేనే వ్యాధి నివార‌ణ అవుతుంది. ఇందుకు బ‌దులు నాటు వైద్యాన్ని ఆశ్రయిస్తే... రోగం ముదిరిపోతుంది. అప్పుడు అస‌లు డాక్టర్ ను సంప్రదిస్తే మాత్రం ఎవ‌రూ ఏమీ చేయ‌లేని పరిస్థితి ఉంటుంది. కొన్ని సార్లు ముదిరిపోయి రోగి చ‌నిపోయే ప‌రిస్థితి కూడా ఏర్పడుతుంది. అందుచేత ఎవ‌రో చెప్పార‌ని చెప్పి నాటు వైద్యాన్ని ఆశ్రయిస్తే మాత్రం ఫ‌లితం విక‌టిస్తుంటుంది.

No comments:

Post a Comment