...

SPECIALIZED SITE FOR HUMAN HEALTH CARE,
SPECIALLY ON GASTROENTEROLOGY, LIVER AND PANCREAS

ఆధారాలు దొరికాయి..!


ఆధారం అనే దానికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఏ విష‌యంలో అయినా ఆధారం ఉంటేనే న‌మ్మ గ‌లుగుతాం. లేదంటే ఆ విష‌యాన్ని అక్కడితో వదిలేస్తాం. అందుకే ఆధారానికి గుర్తింపు ఉంటుంది. ముఖ్యంగా శాస్త్రీయ‌మైన అంశాల్ని ఆధారం ఉంటేనే ప‌రిగ‌ణించ‌గ‌లుగుతాం.

రెడ్ మీట్ తినే అల‌వాటుతో అన‌ర్థం ఉంద‌నేది ఎప్పటినుంచో చెబుతున్న విష‌యం. కానీ దీనికి హార్వర్డ్ మెడిక‌ల్ స్కూల్ ప‌రిశోధ‌కులు ఆధారాలు సంపాదించారు. దాదాపు ఒక ల‌క్షా 20వేల మందిలో ప‌రిశోధ‌న‌లు జ‌రిపిన త‌ర్వాత రెడ్ మీట్ ఎక్కువ‌గా తినే వారికి క్యాన్సర్‌, గుండె సంబంధిత రోగాలు ఎక్కువ‌గా వ‌స్తాయ‌ని తేల్చి చెప్పారు. ద బ్రిటీష్ హార్ట్ ఫౌండేష‌న్ ఈ ఆధారాల్ని ధ్రువీక‌రించింది. ఇటువంటి ఆహార‌పు అల‌వాట్లు ఉన్నవారికి మ‌ర‌ణాల రేటు 13 శాతం, గుండె సంబంధిత తీవ్ర రోగాల శాతం 18శాతం, క్యాన్సర్ సోకే చాన్స్ 10 శాతం అధికంగా ఉంటాయ‌ని నిర్ధారించారు. రెడ్ మీట్ లో ఉండే సాచ్యురేటెడ్ కొవ్వులు, అదికంగా ఉండే సోడియం ఇందుకు కార‌ణం అవుతున్నట్లు గుర్తించారు. ఈ విషయాల్ని ఇంట‌ర్నల్ మెడిసిన్ ఆర్కైవ్స్ లో ప్రచురించారు. రెడ్ మీట్ ఎక్కువ‌గా తీసుకొనే అల‌వాటు ఉన్న వారు ఆ అల‌వాటు ని త‌గ్గించుకొంటే మంచిద‌ని సూచించారు. శుభ్రం చేసిన ఇత‌ర మాంసాహారాల్ని అల‌వాటు చేసుకొనేందుకు ప్రయ‌త్నించాల‌ని సూచించారు. కోడి, చేప‌, బీన్స్ వంటి వాటిని ప్రత్యామ్నాయంగా ఎంచుకోవ‌చ్చని చెబుతున్నారు. ఈ స్థాయిలో ఆధారాలు దొరికాక‌, ఆరోగ్యక‌ర‌మైన స‌ల‌హాని పాటించేందుకు ప్రయ‌త్నించాలి.


జ్యూస్ తీసుకొనే ముందు ఈ సంగ‌తి గుర్తు పెట్టుకోండి..!

ఈ మ‌ధ్య కాలంలో ఫ్రూట్ జ్యూస్ తీసుకొన్నాక  కొన్ని ఆరోగ్య ప‌ర‌మైన స‌మ‌స్యలు వ‌చ్చిన‌ట్లు గుర్తించ‌టం జ‌రిగింది. వాస్తవానికి జ్యూస్ ఆరోగ్యానికి ఎంతో మంచిది క‌దా..మరి ఇటువంటి ఇబ్బంది ఎందుకు వ‌స్తోంది అన్న సంగ‌తి ఆరా తీస్తే ఒక ఆసక్తి క‌ర‌మైన విష‌యం బ‌య‌ట ప‌డింది.

ఫ్రూట్ జ్యూస్ కు ఆర్డర్ ఇచ్చాక అందులో ఏ ఏ కాంపొనెంట్స్ క‌లుపుతారో గ‌మ‌నించండి. అడిగిన ఫ్రూట్ ను తీసుకొని గ్రైండ్ చేస్తారు. త‌ర్వాత చ‌క్కెర లేదా సాల్ట్ కలుపుతారు. చ‌ల్లగా ఉంటుందంటూ ఐస్ క‌లుపుతారు. స‌రిగ్గా ఇక్కడే తేడా జ‌రిగిపోతోంది. పండు స‌హ‌జ‌సిద్దమైన ఆహారం. చ‌క్కెర ఎటూ ఫ్యాక్టరీ నుంచి వ‌చ్చిన‌దే. కానీ ఐస్ ను జ్యూస్ స్టాల్ య‌జ‌మాని బ‌య‌ట నుంచి తెప్పిస్తాడు. సాధార‌ణంగా ఈ ఐస్ ల త‌యారీకి కలుషిత నీటిని వాడుతున్నట్లు తెలుస్తోంది. పెద్ద ఎత్తున బ‌ల్క్ గా ఐస్ ను త‌యారుచేసే సంస్థలు స్థానికంగా దొరికే నీటిని వాడేస్తున్నారు. ఇందులో క‌లుషిత నీటిని వాడటంతో అందులోఉండే సూక్ష్మ క్రిములు ఈ ఐస్ లోకి సుర‌క్షితంగా చేరిపోతున్నాయి. పైగా కొన్ని ర‌కాల సూక్ష్మ క్రిములకు చ‌ల్లటి ప్రదేశంలో బాగా వ్రద్ది చెందుతాయి.దీంతో ఈ క్రిములు శ‌రీరంలోకి ప్రవేశించి వ్యాధుల్ని తెచ్చిపెడుతున్నాయి. అందుచేత జ్యూస్ లు తీసుకొనే ముందు సాధ్యమైనంత వ‌ర‌కు ఐస్ వ‌ద్దని చెప్పటం మేలు. మొహ‌మాటానికి పోయి అన‌ర్థం తెచ్చుకోవ‌టం మంచిది కాదు క‌దా..!

ఆప‌రేష‌న్ తో అన‌ర్థం ముంచుకొస్తుందా..!

ఆప‌రేష‌న్ అనేది ఆధునిక వైద్య శాస్త్రంలో ముఖ్యమైన చికిత్స విధానం. నిపుణులైన స‌ర్జన్ లు సునిశితంగా చేసే శస్త్ర చికిత్సల ద్వారా ఎన్నో దీర్ఘ కాలిక వ్యాధుల్నిన‌యం చేస్తున్నారు. అయితే క్యాన్సర్ కు కూడా అనేక సంద‌ర్భాల్లో ఆప‌రేష‌న్ అవ‌స‌రం అవుతుంది. కానీ, క్యాన్సర్ కు ఆప‌రేష‌న్ చేస్తే వ్యాధి కార‌క క‌ణ‌జాలం ప‌గిలిపోయి ఇత‌ర‌భాగాల‌కు వ్యాపిస్తాయని, అందుచేత ఆప‌రేష‌న్ చేయ‌కూడ‌ద‌న్న అపోహ ఉంది.
ఇది ఏమాత్రం స‌రి కాదు.  నిపుణులైన స‌ర్జన్ ను సంప్రదించి క్యాన్సర్ కు ఆప‌రేష‌న్ చేయించుకొంటే ఇటువంటి ప‌రిస్థితి త‌లెత్తదు. ముఖ్యంగా క‌డుపు క్యాన్సర్ విష‌యంలో ఉత్తమ చికిత్స విధానాల్లో ఆప‌రేష‌న్ కూడా ఒక‌టి. ఈ ఆప‌రేష‌న్ ద్వారా ప్రాథ‌మిక ద‌శ‌లో ఉండే క్యాన్సర్ ను న‌యం చేయ‌టానికి వీల‌వుతుంది.దీని ద్వారా క్యాన్సర్ కార‌క క‌ణ జాలం ఇత‌ర ప్రాంతాల‌కు వ్యాపించ‌టం జ‌ర‌గ‌దు.  క్యాన్సర్ అంటేనే అవాంఛ‌నీయ క‌ణ‌జాలం పేరుకొని పోవ‌టం అని చెబుతారు. దీన్ని ముందుగానే ప‌సిగ‌ట్టి అడ్డు క‌ట్ట వేయ‌క‌పోతే ఈ క‌ణ‌జాలం విస్తారంగా పెరిగిపోతుంది. అప్పుడు దీన్ని నివారణ చాలా క‌ష్టంగా మారుతుంది. అందుచేత ముందుగానే దీనికి ఆప‌రేష‌న్ ద్వారా అడ్డుక‌ట్ట వేయ‌టానికి వీల‌వుతుంది.

పెళ్లికి హాజ‌రైతే ఈ విష‌యం మ‌రిచిపోకండి..!

ఈ మూడు రోజులు వ‌రుస పెళ్లిళ్లు కావ‌టంతో రాష్ట్రమంతా సంద‌డి నెల‌కొంది. స‌న్నిహితులు, స్నేహితులు, బంధువుల ఇంట్లో పెళ్లి జ‌రిగితే వెళ్లక త‌ప్పని పరిస్థితి. పెళ్లికి హాజ‌రు అయితే అక్కడ విందు భోజ‌నం చేయాల్సి ఉంటుంది. అటువంట‌ప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకోవ‌టం మేలు.

పెళ్లి లో సామూహిక భోజ‌నాలు చేసేట‌ప్పుడు ర‌క ర‌కాల కూర‌ల‌తో భోజ‌నం త‌యారు చేస్తారు. తెలిసిన వారి ఫంక్షన్లు క‌దా అని చెప్పి ఒకే రోజు నాలుగైదు కార్యక్రమాల‌కు వెళ్లాల్సి ఉంటుంది. అటువంట‌ప్పుడు మొహ‌మాటానికి పోయి ప్రతీ చోట ఫుడ్ తీసుకోవ‌టం మంచిది కాదు. ఒకటి, రెండు సార్లు విందు భోజ‌నం భారీగా తినవ‌చ్చు కానీ, మూడు రోజుల పాటు వ‌రుస‌గా భారీ ఫుడ్ తిన‌టం స‌రికాదు. ముఖ్యంగా నాన్ వెజ్‌, ఆయిల్ ఫుడ్ ఎక్కువ‌గా తీసుకొంటే జీర్ణ కోశ ప‌రంగా స‌మ‌స్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతే గాకుండా సామూహిక భోజ‌నాల్లో శుభ్రత పాటించే చాన్స్ త‌క్కువ ఉంటుంది. ఈ విష‌యాన్ని కూడా దృష్టి లో ఉంచుకొని ఆరోగ్యాన్ని కాపాడుకొంటూ విందు, వినోదాల్ని సాగించ‌టం మేలు. ఇటీవ‌ల కాలంలో ఫంక్షన్ అంటే మ‌ద్యం త‌ప్పనిస‌రి అవుతోంది. ఫ్రెండ్స్ ముందు గొప్పలు పోయేందుకు పీక‌ల దాకా తాగేయ‌టం వ‌ల‌న అంతిమంగా ఆరోగ్యానికి న‌ష్టం అని గుర్తుంచుకోవాలి. ఫ్రెండ్స్ రెచ్చ గొట్టినా స‌రే, మ‌న లిమిట్ ఏమిటో మ‌నం తెలుసుకొని వ్యవ‌హ‌రించాలి.

పెళ్లిళ్లలో పప్పు అన్నం తింటే అన‌ర్థమా..!

పెళ్లంటేనే పప్పు అన్నం అన్న మాట వినిపిస్తుంది. పెళ్లి లో క‌చ్చితంగా పప్పు వండి వ‌డ్డిస్తారు. అయితే దెబ్బలు త‌గిలిన వారు, గాయాల‌తో బాధ ప‌డుతున్నవారు, ఆప‌రేష‌న్ చేయించుకొని కుట్లు వేయించుకొన్న వారు మాత్రం ప‌ప్పు  అన్నం తిన‌టానికి కొంత వెనుకాడ‌తారు. ఎందుచేత‌నంటే ప‌ప్పు అన్నం తింటే గాయాలకు చీము ప‌డుతుంద‌ని న‌మ్ముతారు. చాలా మంది పప్పు తింటూంటే వారిస్తారు కూడా. ఈ న‌మ్మకం చాలా త‌ప్పు. ప‌ప్పు కు చీము కి ఏమాత్రం సంబంధం లేదు.

పప్పు అంటే ప్రోటీన్స్ ఎక్కువ‌గా ఉండే బ‌ల‌వ‌ర్థక ఆహారం. దీన్ని తిన‌టం వ‌లన శ‌రీరంలో కండ‌రాలు ప‌టిష్టం అవుతాయి. దీని కార‌ణంగా శ‌రీరం దృఢ‌ప‌డి చ‌క్కగా పుంజుకొంటుంది. ఒక వేళ గాయాలు త‌గిలినా, ఆప‌రేషన్ చేయించుకొని కుట్లు వేయించుకొన్నా కూడా ప‌ప్పు తో బాధ‌లు న‌యం అవుతాయి. గాయాలు మాన‌టానికి, కుట్లు చేసిన గాయాలు మాన‌టానికి కూడా పప్పులు ఉప‌యోగ ప‌డ‌తాయి, త‌ప్పితే ఎటువంటి అన‌ర్థం ఉండ‌దు. చీము ఏర్పడటానికి ఇత‌రమైన కార‌ణాలు ఉంటాయి. శుభ్రత పాటించ‌క పోవ‌టం, సూక్ష్మ జీవులు సంక్రమించ‌టం, మురికి నీరు లేక అప‌రిశుభ్రమైన వ‌స్త్రాలు త‌గిలిన‌ప్పుడు ఇన్ ఫెక్షన్ ఏర్పడుతుంది. దీంతో చీము ఏర్పడుతుంది. కేవ‌లం పప్పు ప‌చ్చగా ఉండ‌టం, చీము ప‌చ్చగా ఉండ‌టంతో ఈ విధంగా అపార్థం చేసుకొంటారు. దీనికి ఎటువంటి శాస్త్రీయ‌మైన నిర్ధార‌ణ లేదు. పెళ్లిలోనే కాదు ఎక్కడ  పప్పు అన్నం తిన్నా ఏమాత్రం అన‌ర్థం ఉండ‌దు సుమా...!

ప్రవాస భార‌తీయుల కుటుంబాల్లో త‌ర‌చు వ‌స్తున్న స‌మ‌స్యలు..!

ప్రవాస భార‌తీయుల కుటుంబాల్లో అక్కడి ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా కొన్ని స‌మ‌స్యలు ఎదుర‌వుతుంటాయి. ఇటువంటి స‌మ‌స్యలు ఇక్కడ పెద్దగా క‌నిపించ‌క పోయినా విదేశీ గ‌డ్డ మీద ఎక్కువ‌గా చూడ‌గ‌లుగుతాం. పేగుకి సంబంధించినంత వ‌ర‌కు అల్సరేటివ్ కొలిటిస్‌, కౌన్స్ డిసీజ్ ను ఎక్కువ‌గా గ‌మ‌నించ‌గ‌లుగుతాం. మొద‌టగా అల్సరేటివ్ కొలిటిస్ గురించి చూద్దాం. దీనికి నిర్దిష్టమైన కార‌ణం లేక‌పోయినా ఆహార‌పు అల‌వాట్లు ప్రభావితం చేస్తాయని చెప్పవ‌చ్చు. దీనికి మానసిక ఒత్తిడి తోడైతే స‌మ‌స్య తీవ్రత ఎక్కువ‌గా ఉంటుంది. అన్ని వ‌య‌స్సుల వారికి ఈ వ్యాధి వ‌స్తున్నప్పటికీ ముఖ్యంగా 15 నుంచి 30 సంవ‌త్సరాల మ‌ధ్య వ‌య‌స్సు వారిలో ఇది తీవ్రంగా ఉంటుంది. క‌డుపులో ఒక్కసారిగా నొప్పి మొద‌లై చెల‌రేగిపోతుంది. క‌డుపులో శ‌బ్దాలు రావ‌టం ద్వారా గుర్తించ‌వ‌చ్చు. మ‌లంలో ర‌క్తం, చీము ప‌డుతుండ‌వ‌చ్చు. దీనికి డ‌యేరియా కూడా తోడు కావ‌చ్చును. బ‌రువు త‌గ్గటం,పిల్లల్లో ఎదుగుద‌ల లోపించ‌టం వంటివి గ‌మ‌నించ‌ద‌గును. నీరు ఎక్కువ తాగ‌టం, బ‌ల‌వ‌ర్థక‌ ప‌దార్థాలు తీసుకోవ‌టం, జంక్ ఫుడ్ కు దూరంగా ఉండ‌టం వంటి జాగ్రత్తల‌తో ఈ ప్రమాదాన్ని నివారించ‌వ‌చ్చు.
ఇక క్రోన్స్ డిసీజ్ విష‌యం చూస్తే.. ఇది ఆహార వాహిక‌లో ఎక్కడైనా త‌లెత్తవ‌చ్చు. శ‌రీరంలో వ్యాధి నిరోధ‌క శ‌క్తి త‌గ్గిన‌ప్పుడు, ఆహార‌పు అల‌వాట్లలో తేడా తోడైన‌ప్పుడు దీన్ని గ‌మ‌నించ‌వ‌చ్చు. పేగుల్లో ఎక్కువ‌గా దీన్ని చెప్పద‌గును.  అన్ని వ‌య‌స్సుల వారిలో ఇది క‌నిపించినా ముఖ్యంగా 15 నుంచి 35 సంవ‌త్సరాల వ‌య‌స్సు వారికి ఎక్కువ‌గా ఈ వ్యాధి క‌నిపిస్తుంది. క‌డుపు నొప్పి తీవ్రంగా ఉండ‌టం ప్రధాన ల‌క్షణం. దీంతో పాటు జ్వరం, ఆక‌లి త‌గ్గటం, టాయ్ లెట్ కు వెళ్లినప్పుడు నొప్పి రావ‌టం, బ‌రువు త‌గ్గటం వంటి ల‌క్షణాలు క‌నిపిస్తాయి. నీరు ఎక్కువ తాగ‌టం, బ‌ల‌వ‌ర్థక‌ ప‌దార్థాలు తీసుకోవ‌టం, జంక్ ఫుడ్ కు దూరంగా ఉండ‌టం వంటి జాగ్రత్తల‌తో ఈ ప్రమాదాన్ని నివారించ‌వ‌చ్చు.

విదేశాల్లో తెలుగు వారి ఇబ్బందుల‌కు ఇదేనా కార‌ణం..!

దేశ విదేశాల్లో తెలుగు వారు అనేక మంది ఉన్నారు. ఇప్పుడు ఖండాంత‌రాల్ని దాటి ఉద్యోగ‌, వ్యాపారాలు చేస్తున్నారు. దీంతో కుటుంబాల‌తో స‌హా అక్కడ ఉండాల్సి వ‌స్తోంది. ఈ క్రమంలో ఆరోగ్యం, ఆహారం విష‌యంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నట్లు గుర్తించారు.

ఇప్పటి దాకా మ‌న ప్రాంతానికి త‌గిన‌ట్లుగా ఆహార‌పు అల‌వాట్లు ఉంటాయి. అంటే ఉద‌యం బ్రేక్ ఫాస్ట్ గా ఇడ్లీ, దోశ వంటి టిఫిన్లు తీసుకొంటే మ‌ధ్యాహ్నం, రాత్రి స‌మ‌యాల్లో భోజ‌నం తిన‌టం అల‌వాటు. దీంతో ఏ స్థాయిలో కార్బొహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు వంటివి అందుతాయో శ‌రీరానికి అల‌వాటు ప‌డి ఉంటుంది. కానీ విదేశాల‌కు వెళ్లాక అక్కడి స‌మయాల‌కు అనుగుణంగా ఆహార‌పు అల‌వాట్లను మార్చుకోవాల్సి ఉంటుంది. అమెరికా, బ్రిట‌న్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో మ‌న‌దేశపు ఆహారం భేషుగ్గా దొర‌కుతోంది. దీంతో కొన్ని రోజుల వ్యవ‌ధిలోనే ఒరిజిన‌ల్ అల‌వాట్లకు త‌గిన‌ట్లుగా ఆహారం తీసుకోగ‌లుగుతున్నారు. అన్ని ప్రాంతాల్లో ఇది సాధ్యం కాదు కాబట్టి అక్కడి ఆహారాన్ని తీసుకొనేట‌ప్పుడు క్యాల‌రీల రీత్యా ఆరోగ్యక‌ర‌మైన ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. దీని కార‌ణంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌చ్చు. లేదంటే ఆరోగ్య క‌ర‌మైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.

పిల్లల్లో ఈ ల‌క్షణాలు ఉంటే జాగ్రత్త ప‌డాల్సిందే..!

పిల్లలంటే పెద్దల‌కు ఎన‌లేని ఇష్టం. ఇప్పుడు ఉన్న చిన్న కుటుంబాల్లో పిల్లల్ని త‌ల్లి దండ్రులు ప్రాణంగా చూసుకొంటున్నారు. చిన్నారుల‌కు ఏమైనా అయితే త‌ల్లిదండ్రులు ఏమాత్రం త‌ట్టుకోలేర‌న్నది వాస్తవం.
పిల్లల‌కు స్నానం చేయించేట‌ప్పుడు, మ‌ర్ధనా చేయించేట‌ప్పుడు చేతికి గ‌డ్డ త‌గులుతూ ఉంటుంది. చాలా సార్లు ఇది మామూలు గ‌డ్డ కావ‌చ్చును. అయితే అన్ని గ‌డ్డలు సాధార‌ణ‌మైన‌వి కాక‌పోవ‌చ్చు. కొన్ని సార్లు కాలేయంలో క్యాన్సర్ త‌లెత్తిన‌ప్పుడు ఇటువంటి గ‌డ్డలు ఏర్పడ‌తాయి.

 కుడి వైపు ఉంటే మూత్ర పిండాల్లో, ఎడ‌మ వైపు ఉంటే ప్లీహంలో స‌మ‌స్య ఉండ‌వ‌చ్చు. ఇటువంటి క్యాన్సర్ ను ఇత‌ర ల‌క్షణాల‌తో పోల్చుకోవాల్సి ఉంటుంది. బ‌రువు త‌గ్గిపోవ‌టం, ఆక‌లి మంద‌గించ‌టం, క‌డుపులో ఎగువ భాగంలో నొప్పి ఉండ‌టం, నీర‌సించి పోవ‌టం, కాలేయం ప్రాంతంలో ఉబ్బరింపు, మ‌లం రంగు మార‌టం వంటి ల‌క్షణాల్ని చూసుకోవాలి. ఈ ల‌క్షణాల‌కు తోడు కామెర్లు వంటి కాలేయ స‌మ‌స్యలు ఉంటే త్వర‌గా మేలుకోవ‌టం మేలు. గ‌డ్డ ఉన్నప్పుడు సాధ్యమైనంత తొంద‌ర‌గా వైద్యుల్ని సంప్రదించి ప‌రీక్ష చేయించుకోవాలి. సీటీ స్కాన్ వంటి ప‌రీక్షల‌తో స‌మ‌స్యను గుర్తించేందుకు వీల‌వుతుంది. ముంద‌స్తు జాగ్రత్తలు తీసుకొంటే ముప్పు నుంచి ముందే మేలుకోవ‌చ్చు.

న‌గ‌ర వాసులకు త‌ప్పనిస‌రి స‌మ‌స్య


న‌గ‌ర వాసులు అంటేనే ఉరుకులు ప‌రుగుల జీవితం గడుపుతుంటారు ఒత్తి ళ్ల మ‌ధ్య త‌ప్పనిస‌రిగా పని చేయాల్సి ఉంటుంది. ఈ ఒత్తిడిల కార‌ణంగా మెద‌డుపై భారం ప‌డుతోంది. దీంతో శ‌రీరంలో రాడిక‌ల్స్ ఉత్పత్తి అవుతాయి. ఇవి శ‌రీరంలోని ముఖ్యమైన వ్యవ‌స్థల మీద చెడు ప్రబావం చూపుతుంటాయి. ఈ రాడిక‌ల్స్ తో దీర్ఘ కాలిక వ్యాధులు వ‌స్తుంటాయి. అందులో క్యాన్సర్ ఒక‌టి.
ఫిబ్రవ‌రి మొద‌టి వారంలో ప్రపంచ క్యాన్స్రర్ డే జ‌రుపుకొన్నాం. ఈ సంద‌ర్భంగా అనేక చోట్ల అవ‌గాహ‌న శిబిరాలు జ‌రిగాయి. క్యాన్సర్ కు నిర్దిష్‌టంగా కార‌ణాలు చెప్పలేం. కానీ చెడు అల‌వాట్లు అంటే మ‌ద్యపానం, పొగ‌తాగ‌టం, గుట్కా వంటి అల‌వాటు ఉంటే ఇది వ‌చ్చే అవ‌కాశం ఎక్కువ‌. దీంతో పాటు వేళ పాళ లేని జీవ‌న శైలి, ఒత్తిడితో కూడిన జీవ‌నం కారఃణ‌గా ఇది త‌లెత్త వ‌చ్చు. కుటుంబంలో ఒక‌రికి ఉంటే ఇది రావ‌చ్చును. అందుచేత ఈ విష‌యంలోత‌గిన జాగ్రత్తలు అవ‌స‌రం. క్యాన్సర్ కు సంబంధించిన పూర్తి వివ‌రాలు త‌దుప‌రి పోస్ట్ లో చూద్దాం.

ఆరోగ్యమే మ‌హా భాగ్యం..!

మ‌హిళ‌ల తీరు తెన్నుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. స‌మాజంలో మ‌హిళ‌ల స్థానం స‌మున్నత‌మైన‌ది. ఇంటా, బ‌య‌ట అనేక రంగాల్లో మ‌హిళ‌లు నెగ్గుకొని వ‌స్తున్నారు. అటువంటి మ‌హిళ‌లకు చాలా శ‌క్తి అవ‌స‌రం అవుతుంది.
వాస్తవానికి హౌస్ వైఫ్ అయినా, వ‌ర్కింగ్ విమెన్ అయినా, స్టూడెంట్స్ అయినా ఉద‌యం పూట చాలా ప‌నులు ఉంటాయి. ఒక ర‌కంగా చెప్పాలంటే ఏ ఇంట్లో చూసినా మ‌హిళా మ‌ణులు ఉరుకులు, ప‌రుగుల‌తో ప‌ని చేస్తుంటారు. ఇంటిల్లి పాది కి స‌మ‌కూర్చి పెట్టేది ఇంటి ఇల్లాలే అన‌వ‌చ్చు. అంత‌టి ఒత్తిడి లో ప‌డి మ‌హిళ‌లు ఉద‌యం పూట బ్రేక్ ఫాస్ట్ చేయ‌టం మానేస్తుంటారు. ఈ సంగ‌తి ఎవ‌రు చెప్పినా పెద్దగా ప‌ట్టించుకోరు. వాస్తవానికి రాత్రి ఎప్పుడో తిన్న ఆహారం అర్థ రాత్రికే అరిగిపోతుంది. అప్పటినుంచీ క‌డుపులో ఆహారం ఏమీ ఉండ‌దు. ఉద‌యం పూట శ‌క్తి వినియోగం ఎక్కువ‌గా ఉంటుంది. కానీ శ‌క్తి స‌ర‌ఫ‌రా అవ‌క పోవ‌టంతో శ‌రీర భాగాల‌పై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో కొంత మందిలో కోపం, చిరాకు పెరిగిపోతుంది. అంత‌మంది అవ‌స‌రాలు తీర్చే మ‌హిళ‌ల‌కు, శ‌క్తి అవ‌స‌రాలు తీర్చే ప‌రిస్థితి ఉండ‌దు. కుటుంబ స‌భ్యుల కోసం త్యాగం చేస్తున్న మ‌హిళా మ‌ణులు.. త‌మ ఆరోగ్యాన్ని సైతం త్యాగం చేస్తున్నారు.
ఈ ప‌ద్దతి ని మ‌హిళ‌లు మార్చుకోవాలి. ఉద‌యం చ‌క చ‌క ప‌నులు చేసుకొంటూనే బ్రేక్ ఫాస్ట్ చేసేయాలి. ముఖ్యంగా వెంట‌నే శ‌క్తిని ఇచ్చే గ్లూకోజ్ సంబంధిత ప‌దార్థాల్ని తీసుకోవాలి. అప్పుడే శ‌క్తి స‌క్రమంగా అందుతుంది. ఇంట్లో త‌ల్లి, చెల్లి, అక్క, లేక భార్య క‌డుపు మాడ్చుకొని పనిచేస్తుంటే ఇంట్లో వాళ్లు చూస్తూ వ‌దిలేయ‌కూడ‌దు. చేత‌నైనంత సాయం చేయ‌టంతో పాటు స‌మ‌యానికి ఆహారం తీసుకొనేలా చూసుకోవాలి. ఎవ‌రు ఏం చేస్తాం అని ఊరుకోకూడ‌దు సుమా..!

ర‌క్తం ప‌డుద్ది.. జ‌ర భ‌ద్రం..!

ర‌క్తం శ‌రీరంలో చాలా ముఖ్యమైన‌ది. ఇది ప్రస‌ర‌ణ వ్యవ‌స్థ కు బాధ్యత వ‌హిస్తుంది. ర‌క్తం ద్వారా శ‌క్తి ఒక చోట నుంచి ఒక చోట‌కు అందుతుంది. అయితే కొంత‌మందికి మ‌లంలో ర‌క్తం ప‌డుతుంటుంది. ఇది పైల్స్ స‌మ‌స్య కానీ, జీర్ణం లో లోపం కానీ అనుకొని వ‌దిలేస్తుంటారు. కొంత‌వ‌ర‌కు ఈ విష‌యాన్ని కొట్టి పారేయ‌లేం కానీ అన్ని సందర్భాల్లో నిర్లక్ష్యం కూడ‌దు. త‌రుచు ర‌క్తం ప‌డుతుంటే అనుమానించాల్సిందే. ర‌క్తం ఎరుపుగా కానీ, న‌లుపుగా కానీ ఉండ‌వ‌చ్చు. ర‌క్త ప్రస‌ర‌ణ లో ఎక్కడో లోపం ఏర్పడుట వ‌ల‌న ఈ ఇబ్బంది త‌లెత్తిన‌ట్లు గుర్తించాలి. దీంతో పాటు క‌డుపులో నొప్పి ఉండ‌టం, క‌డుపు బిగ‌ప‌ట్టి న‌ట్లు ఉండ‌టం వంటి ల‌క్షణాల్ని గమ‌నించుకోవాలి. ర‌క్తం బ‌య‌ట‌కు పోతుండ‌టం కార‌ణంగా బ‌లహీనం అయిపోతారు. నిస్త్రాణంగా ఉండిపోతారు. అంతేగాకుండా ఇటువంటి వారిలో నాడీ వ్యవ‌స్థ మీద ఒత్తిడి పెరుగుతుంది. అందుచేత కోపం , చిరాకు పెరిగిపోతాయి. అందుచేత ఇటువంటి ల‌క్షణాలు ఉంటే నిపుణులైన వైద్యుల్ని సంప్రదించాలి. రోగం ముద‌ర‌క ముందే వైద్యం చేయించుకోవాలి.