...

SPECIALIZED SITE FOR HUMAN HEALTH CARE,
SPECIALLY ON GASTROENTEROLOGY, LIVER AND PANCREAS

స‌డెన్ గా రాళ్లు ఎందుకు ప‌డుతున్నాయి..!

ఈ మ‌ధ్య కాలంలో రాళ్లు ప‌డే స‌మ‌స్య ఎక్కువ‌గా వినిపిస్తోంది. ముఖ్యంగా న‌గ‌రాల్లో ఈ పోక‌డ క‌నిపిస్తోంది. స్పష్టంగా కార‌ణం చెప్పటం క‌ష్టమైనా ఇందుకు దారి తీసే ప‌రిస్థితుల్ని గ‌మ‌నించ‌వ‌చ్చు.
జీర్ణ వ్యవ‌స్థ లో పిత్తాశ‌యం (గాల్ బ్లాడ‌ర్‌), క్లోమం (పాన్ క్రియాసిస్‌) వంటి భాగాల్లో రాళ్లు పేరుకొంటాయి. ఆధునిక జీవ‌న శైలి, జంక్ ఫుడ్ ఎక్కువ‌గా తీసుకోవ‌టం, ఆహారం తీసుకోవ‌టంలో స‌మ‌య పాల‌న పాటించ‌క పోవ‌టం, వంటి కార‌ణాలు కొంత వ‌ర‌కు గాల్ బ్లాడ‌ర్ లో రాళ్ల  స‌మ‌స్యకు దారి తీస్తాయి. రాళ్లు ఏర్పడ‌టం మొద‌లైన వెంట‌నే ల‌క్షణాలు బ‌య‌ట ప‌డ‌క పోవ‌చ్చు. ఈ రాళ్లు సైజ్ పెరిగే దాకా అంత‌ర్గతంగా మార్పులు జ‌రుగుతుంటాయి. ఒక్కసారి ల‌క్షణాలు బ‌య‌ట ప‌డ్డాక వ‌రుసగా స‌మ‌స్య పున‌రావృతం అవుతుంది. ఒక్క సారిగా కడుపులో నొప్పి వ‌చ్చేస్తుంటుంది. ఇది తీవ్రంగా ఉండి, ఇబ్బంది పెట్టేస్తుంది. చాలా సార్లు అర్థ రాత్రి స‌మ‌యంలో ఇది వస్తుంటుంది. నొప్పి కొన్ని సార్లు ఇత‌ర ప్రాంతాల‌కు వ్యాపిస్తుంది. తాత్కాలికంగా మందులు వాడితే ఇది ఉప‌శ‌మిస్తుంది.  గ‌తంతో పోలిస్తే ఇప్పుడు ఆధునిక శస్త్రచికిత్సలు అందుబాటులోకి వ‌చ్చాయి. ఇప్పుడు లాప‌రోస్కోపిక్ విధానంలో చిన్న రంధ్రాలు చేసి ఆప‌రేష‌న్ ముగించ‌వ‌చ్చు. రెండు రోజుల్లో రోగి - ఆసుప‌త్రి నుంచి ఇంటికి వెళ్లిపోవ‌చ్చు. ఇది సుర‌క్షితం మాత్రమే గాకుండా సుఖ‌వంతం అని చెప్పుకోవ‌చ్చు. నిపుణులైన వైద్యుల చేత చికిత్స చేయించుకొంటే ఎటువంటి సైడ్ ఎపెక్ట్ లేకుండా చికిత్స పూర్తవుతుంది. పిత్తాశ‌యంలో రాళ్లకు ఆప‌రేష‌న్ మాత్రమే శాశ్వత ప‌రిష్కారం అని గుర్తుంచుకోవాలి.

అంత స్పీడ్ మంచిది కాదు..!

స్పీడ్ ఎక్కువ‌గా ఉండ‌టం కొన్ని విష‌యాల్లో మంచిది కావ‌చ్చు. కానీ ఆహారం తీసుకొనే విష‌యంలో మాత్రం మంచిది కాదు. చాలామంది ఉద‌యం పూట ఉరుకులు ప‌రుగుల‌తో ప‌ని చేస్తుంటారు. మ‌ధ్యాహ్న స‌మ‌యంలో కూడా ఇదే పంథా అనుస‌రిస్తారు. బిజీ షెడ్యూల్ ఉన్న వారికి ఇది త‌ప్పనిస‌రి కావ‌చ్చు. అంత‌మాత్రాన ఆహారం తీసుకొనేట‌ప్పుడు ఉరుకులు ప‌రుగులు మంచిది కాదు. ఇత‌ర విష‌యాలు ఆలోచిస్తూ గ‌బ గ‌బ నోటిలో కుక్కుకుంటే స‌రైన ఆహారం లోప‌ల‌కు వెళ్లదు.

సాధార‌ణంగా ఆహారంలో అనేక కాంపోనెంట్స్ ఉంచుకొంటారు. హ‌డావుడిగా ఉన్నప్పుడు మాత్రం మొద‌టి కాంపొనెంట్ నే ఎక్కువ‌గా తీసేసుకొంటాం. త‌ర్వాత మిగిలిన దాన్ని వ‌దిలేస్తారు. 1అంతే కాకుండా జీర్ణ కోశాన్ని చేరుకొనే ఆహారం కూడా స‌మ‌పాళ్ల లో ఉండ‌దు. దీని ఫ‌లితంగా స‌జావుగా జీర్ణం అవ‌టానికి ఇబ్బంది ఏర్పడుతుంది. ఇత‌ర విష‌యాల మీద మ‌న‌స్సు పెట్టిన‌ప్పుడు చాలా మంది ఎంత తింటున్నారో గ‌మ‌నించుకోరు. పిల్లల్లో ఈ విష‌యాన్ని ఎక్కువ‌గా గ‌మ‌నించ‌వ‌చ్చు. ఇటీవ‌ల కాలంలో పిల్లలు టీవీ చూస్తూ, లేదా కంప్యూట‌ర్ చూస్తూనో ఆహారం తీసుకొంటున్నారు. దీని కార‌ణంగా ఎంత ఆహారం తీసుకొనేది చూసుకోరు. ఇది మంచి అల‌వాటు కాదు. ఆహారం తీసుకొనేట‌ప్పుడు దృష్టి దాని మీదే ఉంచాలి. అప్పుడు ఆ ఫుడ్ స‌మ‌పాళ్ల లో తీసుకొనేందుకు వీల‌వుతుంది.

ఎండ వేళ చ‌ల్లగా ఉండేందుకు మార్గాలు..!

మార్చి చివ‌ర‌లోనే ఎండ‌లు వ‌చ్చి ప‌డ్డాయి. ఉష్ణోగ్రత‌లు బాగా పెరగుతున్నాయి. ఈ స‌మ‌యంలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎండ‌లో తిరిగే వారికి దాహం పెరుగుతుంది. ఈ కారణంగా కొంద‌రు ఎక్కువ‌గా కూల్ డ్రింక్ లు తాగుతారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. అప్పుడ‌ప్పుడు కూల్ డ్రింక్ తాగ‌టం వ‌ర‌కు ఓకే. కానీ ఎక్కువ‌గా వీటిని తీసుకోవ‌టం మంచిది కాదు.

ఈ డ్రింక్ ల‌ను ఎక్కువ‌కాలం నిల్వ చేసేందుకు కొన్ని ర‌సాయ‌నాలు క‌లుపుతారు. ఇవి జీర్ణ వ్యవ‌స్థ కు చేటు తెస్తాయి. ఈ డ్రింక్ ల‌కు అల‌వాటు ప‌డితే శ‌రీరం వీటినే కోరుకొంటుంది. అందుచేత ఎండ‌ల స‌మ‌యంలో శుద్ది చేసిన నీటిని తాగితే చాలు. ఈ నీటిని కూడా మ‌రీ కూల్ గా ఉండే నీరు స‌రి కాదు. ఎండ‌లో బాగా తిరిగి వ‌చ్చి చాలా కూల్ గా ఉండే నీటిని తాగటం మంచిది కాద‌ని గుర్తించుకోవాలి.

ప‌రీక్షల వేళ ఈ జాగ్రత్త తీసుకోండి..!

రేప‌టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్షలు జ‌రుగుతున్నాయి. దాదాపు 12 ల‌క్షల మంది పిల్లలు ఈ ప‌రీక్షకు హాజ‌రు అవుతున్నారు. మార్చి నెల వ‌చ్చిందంటే పిల్లల‌కు ప‌రీక్షల సీజ‌న్ వ‌చ్చేసింద‌నుకోవ‌చ్చు. ఇప్పటికే పాఠశాల విద్యార్థులంతా యాన్యువ‌ల్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్నాయి. నేష‌న‌ల్ క‌రిక్యుల‌మ్ ఫాలో అయ్యే స్కూల్స్ త‌ప్పించి స్టేట్ బోర్డ్ లో  చ‌దివే పిల్లల‌కు ప‌రీక్షల టెన్షన్ బ‌లంగా ఉంది.

ప‌రీక్షల వేళ పిల్లల ఆరోగ్యాన్ని కాపాడ‌టం పెద్దలుగా మ‌న బాధ్యత‌. ఈ స‌మ‌యంలో పిల్లల‌కు పోష‌కాల‌తో కూడిన ఆహారం ఇవ్వండి. బ‌య‌ట తిండిని ఎల‌వ్ చేయ‌టం మంచిది కాదు. త‌గినంత నిద్ర అవ‌స‌రం అని గుర్తుంచుకోవాలి. నిద్ర మానేసి చ‌దివితే మెద‌డు మీద ఒత్తిడి పెరుగుతుంది. దీంతో చ‌దువుకొన్నది కూడా మ‌రిచిపోయే అవ‌కాశం ఉంది. నిద్ర ను మాన‌టానికి లేదా ఎక్కువ సేపు చ‌దివేందుకు ఎక్కువ‌గా టీ, కాఫీలు తాగే అల‌వాటు ఉంటుంది. ఇది మంచిది కాద‌ని గుర్తించుకోవాలి. టీ, కాఫీల కార‌ణంగా తాత్కాలికంగా ఉత్తేజం పొందిన‌ట్లు అనిపించినా అది అప్పటికే. అందుచేత త‌గినంత విశ్రాంతి తో కూడిన ప్రిప‌రేష‌న్ మేలు చేస్తుంద‌ని గుర్తించుకోవాలి. ప‌రీక్ష కేంద్రంలో హైరానా ప‌డ‌టం మంచిది కాదు. అందుచేత అక్కడి వాతావ‌ర‌ణం గురించి పెద్దలు వివ‌రించి చెప్పాలి. ప‌రీక్షల స‌మ‌యంలో పెద్దలు వెంట వెళుతుంటారు. క‌నీసం మొద‌టి ప‌రీక్షకు అయినా పరీక్ష కేంద్రానికి కూడా వెళ్లటం మంచిది. అంత మాత్రాన మార్కుల గురించి ప‌దే ప‌దే పిల్లల చెవిలో పోరు పెట్టడం స‌రి కాదు సుమా..!

పిల్లల్లో ఈ స‌మ‌స్యను గుర్తించారా..!

పిల్లల్లో ఏదైనా స‌మ‌స్య ఏర్పడితే పెద్ద వాళ్లు త‌ల్లడిల్లి పోతారు. అప్పటి దాకా అన్ని ముద్దుగానే ఉంటాయి. స్థూల కాయం స‌మ‌స్య కూడా ఇటువంటిదే. ఇటీవ‌ల కాలంలో బాల్యంలోనే స్థూల కాయం ఏర్పడ‌టం అన్నది ప్రధాన స‌మ‌స్యగా మారుతోంది. ముఖ్యంగా న‌గ‌రాల్లో దీన్ని ఎక్కువ‌గా గుర్తించ‌వ‌చ్చు. న‌గ‌రాల్లో చ‌దువుకొనే పిల్లలు ఎక్కువ‌గా కూర్చొనే ఉండ‌టం, చ‌దువు పేరుతో ఒకే చోట నిల‌క‌డ‌గా ఉండ‌టం, ఆట పాట‌ల‌కు దూరంగా ఉండ‌టం తో ఇది త‌లెత్తుతోంది. ముఖ్యంగా జంక్ ఫుడ్ ఎక్కువ‌గా తీసుకొనే వారిలో దీన్ని గ‌మ‌నించ‌వ‌చ్చు.

జంక్ ఫుడ్ కార‌ణంగా కొవ్వులు శ‌రీరంలో పేరుకొని పోతాయి. దీంతో ర‌క్త ప్రస‌ర‌ణ మంద‌గించి స‌మ‌స్య ఏర్పడుతోంది.
బాల్యంలో స్థూల‌కాయం ఏర్పడ‌టం కార‌ణంగా అనేక ఇబ్బందులు ఏర్పడ‌తాయి. ఎక్కువ‌గా కొలెస్టరాల్ పేరుకొన‌టం, అధిక ర‌క్త పోటు, గుండె స‌మ‌స్యలు రావ‌టం, మ‌ధు మేహం , ఎముక‌ల స‌మ‌స్యలు, చ‌ర్మం ఇబ్బందులు వంటి స‌మ‌స్యలు ఏర్పడ‌తాయి. ఇటువంటి స‌మ‌స్యల‌కు దారి తీసే స్థూల‌కాయాన్ని ముందుగానే నివారించుకోవాలి.
ఆరోగ్య క‌ర‌మైన ఆహారాన్ని పిల్లల‌ల‌కు ఇవ్వాలి. చ‌దువుతో పాటు ఆట‌పాట‌ల‌కు కూడా అవ‌కాశం ఇవ్వాలి. శ‌రీరానికి త‌గిన వ్యాయామం క‌లిగేట్లుగా చ‌ర్యలు తీసుకోవాలి.

పిల్లల్లో ఈ అల‌వాటు మంచిదేనా..!

పిల్లలు కుటుంబంలో చాలా ముఖ్యం. ఇప్పటి న్యూక్లియ‌ర్ కుటుంబాల్లో ఒక‌రు లేక ఇద్దరు పిల్లలే ఉండ‌టంతో పిల్లల్ని బాగా గారాబం చేస్తున్న ప‌రిస్థితి ఉంది. అందుచేత పిల్లలు అడిగింది కాద‌న‌కుండా ఇచ్చేస్తుంటాం.
ఇప్పటి పిల్లల్లో బిస్కట్లు, చిప్స్ తినే అలవాటు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. ఇది కొంత‌వ‌ర‌కు ఫ‌ర్వాలేదు. కానీ అదేప‌నిగా బిస్కట్లు, చిప్స్ తిన‌టం మాత్రం మంచిది కాద‌ని గుర్తించుకోవాలి.

భోజ‌నం తినే ముందు, టీవీ చూస్తున్నప్పుడు అదే ప‌నిగా తింటుంటారు. దీని కార‌ణంగా భోజ‌నం స‌రిగ్గా తిన‌క పోవ‌టాన్ని మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. ఇక‌, టీవీ, కంప్యూట‌ర్ చూస్తున్నప్పుడు ఎంత తింటున్నదీ, ఏం తింటున్నదీ గ‌మ‌నించ‌రు. దీని కార‌ణంగా ఎక్కువ కొవ్వు ప‌దార్థాలు శరీరంలోకి వెళ్లతాయి. ఫ‌లితంగా చైల్డ్ ఓబేసిటీ కి దారి తీయ‌వ‌చ్చు. పిల్లల్లో స్థూల‌కాయం ఎంత మాత్రం మంచిది కాద‌ని గుర్తుంచుకోవాలి. పిల్లలు బొద్దుగా ఉంటే ముద్దు చేయ‌వ‌చ్చు. ప‌రిమితికి మించితే మాత్రం అన‌ర్థం త‌ప్పద‌ని గుర్తుంచుకోవాలి. అందుచేత ప‌రిమితంగా బిస్కట్లు చిప్స్ ను అనుమ‌తించ‌వ‌చ్చు.

ఆల‌స్యంగా తిన‌టం స‌రైన‌దేనా..!

ఎందులో అయినా స్లో గా ఉండ‌టం లేక స్పీడ్ గా ఉండ‌టం అన్న ది ఒక ప‌ట్టాన చెప్పలేం. స‌రా స‌రిన మాత్రమే చెప్పేందుకు వీల‌వుతుంది. త‌ప్పితే స్లో అన్న మాట వాడాల్సిన స‌మ‌యంలో వాడ‌వ‌చ్చు.

ఉదాహ‌ర‌ణ‌కు బోజ‌నం చేసే విష‌యంలో కొంత మంది చాలా వేగంగా తినేస్తారు. దీని వ‌ల‌న ఆహారాన్ని స‌రిగ్గా న‌మ‌ల‌కుండానే మింగేస్తుంటారు. ఇది స‌రి కాదు. ఎందుకంటే ఆహారాన్ని చ‌క్కగా న‌మిలాకే మింగాల్సి ఉంటుంది. ఆహారాన్ని న‌మ‌లుతున్నప్పుడు నోటిలోని లాలా జలం ఆహారంతో క‌లుస్తుంది. ఇందులోని ఎమైలేజ్ అనే ఎంజైమ్ చ‌క్కగా ఆహారంలోని కార్బోహైడ్రేట్ ల‌ను కొంత వ‌ర‌కు విడ‌కొడుతుంది. అంతే గాకుండా ఘ‌న రూపంలోని ఆహారం...న‌మ‌లుతున్నప్పుడు ద్రవ రూపంలోని లాలా జ‌లంతోక‌లుస్తుంది. దీని కార‌ణంగా క‌డుపులోకి వెళ్లాక చ‌క్కగా జీర్ణం కావ‌టం మొద‌ల‌వుతుంది. దీంతో జీర్ణ ప్రక్రియ బాగా జ‌రుగుతుంది. అందుచేత మ‌హిళ‌లు అయినా, పురుషులు అయినా ఆహారాన్ని త‌గినంత నిదానంగా తిన‌టం మంచిది. అలాగ‌ని గంట‌ల త‌ర‌బ‌డి తిన‌టం ఏమాత్రం స‌రికాదు సుమా..!

వేపుడు కూర‌లు ఎంత వ‌ర‌కు మంచిది..!

మ‌హిళ‌లు ఇంట్లో కాలంతో పోటీ ప‌డి ప‌నిచేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా వ‌ర్కింగ్ విమెన్ అయితే ఈ హ‌డావుడి మ‌రింత ఎక్కువ‌. ఇంటిల్లిపాదికి అవ‌స‌ర‌మైన‌వ‌న్నీ స‌ర్ది పెట్టి , ఆ త‌ర్వాత తాను తినేందుకు ఆహార ప‌దార్థాల్ని స‌ర్దుకొని వెళుతుంటారు. అయితే ఈ హెక్టిక్ షెడ్యూల్ లో వేపుడు కూర‌లు రెడీ చేసుకొని వెళ్లి పోతుంటారు.
ఈ వేపుడు త‌యారుచేసుకోవ‌టం ఈజీగా ఉంటుంది కాబట్టి వంట చేసేట‌ప్పుడు దీని వైపు మొగ్గు చూపుతారు. అంత‌వ‌ర‌కు బాగానే ఉంటుంది కానీ, బాగా ఎక్కువ‌గా వేయించుకొని త‌యారుచేసుకోవ‌టాన్ని కొంత‌మంది ఇష్ట ప‌డుతుంటారు. ఈ అల‌వాటు పెరిగిపోయి, బ‌య‌ట‌కు వెళ్లి భోజ‌నం చేసేట‌ప్పుడు కూడా ఈ హై ఫ్రైడ్ ఐట‌మ్స్ నే తీసుకొంటుంటారు. కానీ అధికంగా వేపుడులు చేయించుకోవ‌టం, మ‌రీ ముఖ్యంగా మాంసాహారాన్ని, సీ ఫుడ్స్ ను వేయించుకొని తిన‌టం వ‌ల‌న అన‌ర్థం దాగి ఉంటుంద‌ని గుర్తుంచుకోవాలి.

మాంసాహారం వంటి ఫుడ్స్ లోప్రోటీన్లు ఎక్కువ‌గా ఉంటాయి. స‌క్రమంగా వండితే ఈ పోష‌కాలు శ‌రీరానికి ఉప‌యోగ ప‌డ‌తాయి. కానీ విప‌రీతంగా వేయించ‌టం వ‌ల‌న ఈ ప్రోటీన్స్ నైట్రజోమైన్స్ గా మారిపోతాయి. ఇవి శ‌రీరానికి ఉప‌యోగ ప‌డ‌క పోగా, చెడు క‌లిగిస్తాయి. కొన్ని సార్లు ఇవి క్యాన్సర్ కార‌కాలుగా మార‌తాయంటే ఈ చెడు ప్రభావం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవ‌చ్చు. అందుచేత స‌క్రమంగా వండిన ఆహారం తీసుకొని, చ‌క్కటి ఫ‌లితాల్ని పొంద‌టం మేలు. మ‌హిళ‌ల‌కు అయినా, పురుషుల‌కు అయినా ఇదే సూత్రం వ‌ర్తిస్తుంది.

శివ‌రాత్రి రోజు ఉప‌వాసం అవ‌స‌రమా..!

శివ‌రాత్రి రోజు ఉప‌వాసం చేయ‌టం ఎప్పటినుంచో ఉన్న ఆన‌వాయితీ. ప‌ర‌మేశ్వరుడ్ని త‌ల‌చుకొని ఆ రోజంతా ఆహారానికి దూరంగా ఉంటారు.
ఈ ఉప‌వాస నియ‌మం పెద్దలు దూర దృష్టి తో ఏర్పాటు చేసిన‌దే.
ఒక్క హిందూ మ‌తంలోనే కాదు. ఇత‌ర మ‌తాల్లో కూడా ఈ ఏర్పాటు క‌నిపిస్తుంది. ముస్లింలు రంజాన్ మాసంలోనూ, క్రైస్తవులు కూట‌మి రోజుల్లోనూ ఉప‌వాసాలు చేస్తారు. వాస్తవానికి నిరంత రాయంగా జీర్ణవ్యవ‌స్థ ప‌నిచేస్తూ ఉంటుంది. దీని వ‌ల‌న ఆ వ్యవ‌స్థ కు ఎప్పటికైనా అల‌స‌ట ఏర్పడుతుంది. అందుచేత ఈ వ్యవ‌స్థ కు కాస్తంత విశ్రాంతి ఇవ్వటం అన్నది స‌రైన ప‌ని. అంటే వారానికో, నెల‌కో ఒక సారి ఒక పూట లేక ఒక రోజు ఆహారానికి దూరంగా ఉండాలి. దీని వ‌ల‌న శ‌రీరంలో జీర్ణ వ్యవ‌స్థ కు కాస్తంత విశ్రాంతి దొర‌కుతుంది. ఈ స‌మ‌యంలో అన్ని భాగాలు కాస్తంత విశ్రాంతి తీసుకొని మళ్లీ పుంజుకొంటాయి. అప్పుడు మెరుగైన జీవ‌న విధానం ఏర్పడుతుంది. అయితే క‌టిక ఉప‌వాసం చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని గుర్తుంచుకోవాలి. అంటే ద్రవాహారం కానీ, మెత్తటి ఆహారం కానీ కొద్ది గా తీసుకొని ఉప‌వాసం చేయ‌వ‌చ్చు. ఎవ‌రి శరీర స్థాయిని బ‌ట్టి వారు ఉప‌వాసం చేయ‌టం మేలు. పెద్ద వారు, మ‌ధు మేహం వంటి స‌మ‌స్యలు ఉన్నవారు మాత్రం వైద్యుల స‌ల‌హా పాటించి మాత్రమే ఉప‌వాసం చేయ‌టం మంచిది.

మ‌హిళా దినోత్సవం రోజున మ‌హిళ‌లు గుర్తుంచుకోద‌గిన అంశం..!

మార్చి 8న మ‌హిళా దినోత్సవం జ‌రుపుకోవ‌టం ఆన‌వాయితీ. స‌మాజంలో మ‌హిళల అభ్యున్నతి గురించి, మ‌హిళ‌లు అందిస్తున్న సేవ‌ల గురించి ప్రస్తావించుకొంటారు. అదే స‌మ‌యంలో కుటుంబంలో మ‌హిళలు ప‌డుతున్న అవ‌స్థలు, వారి సేవ‌ల గురించి క‌చ్చితంగా గుర్తు చేసుకోవాలి. అంతే గాకుండా మ‌హిళ‌ల ఆరోగ్య విష‌యంల తీసుకోవాల్సిన ముఖ్యమైన ఒక జాగ్రత్త గురించి ఇప్పుడుచూద్దాం..

మ‌హిళ‌లు ఉద‌యం పూట చాలా బిజీ. నిద్ర లేవ‌గానే ఇంటి శుభ్రత‌ను ప‌ట్టించుకోవాలి. బెడ్ రూమ్ ద‌గ్గర నుంచి, వంటిల్లు, హాల్‌, పూజ గ‌ది అన్ని శుభ్రంగా ఉంచేట్లుగా చూసుకోంటారు. భ‌ర్తను, పిల్లల్ని రెడీ చేయ‌టం ఒక ప్రహ‌స‌న‌మే. బెడ్ కాఫీ లేదా టీ రెడీ చేయ‌టం, బ్రేక్ ఫాస్ట్ కు టిఫిన్ త‌యారు చేయ‌టం, ఆఫీసులు, స్కూలుకు కావ‌ల్సినివ‌న్నీ సిద్దంగా ఉంచ‌టం, ఆ త‌ర్వాత లంచ్ బాక్స్ త‌యారు చేసి కుటుంబ స‌భ్యుల్ని సాగ‌నంప‌టంతో సరిపోతుంది. అదే వ‌ర్కింగ్ వుమెన్ అయితే డ‌బుల్ ఢ‌మాకా క‌ష్టాలు ఉంటాయి. గ‌బ గ‌బా తాను కూడా రెడీ అయిపోయి, వ‌స్తువులు రెడీ చేసుకొని ఆఫీసుకు పరిగెత్తాల్సి ఉంటుంది. ఇక‌, ప‌ల్లెటూర్లో అయితే ప‌నులు మార‌తాయి త‌ప్పితే ఈ ప‌నుల‌న్నీ త‌ప్పవు.

ఇన్ని ప‌నుల మ‌ధ్య స‌తమ‌తం అవుతున్న మ‌హిళ‌లు చాలా సార్లు చికాకు ప‌డుతుంటారు. ప‌నుల్లో ఉండ‌గా అడ్డు త‌గిలితే గ‌య్ మంటారు అని మ‌హిళా ద్వేషులు అంటుంటారు.ఇటువంటి కామెంట్లు త‌ప్పు కాబ‌ట్టి చికాకు కి కార‌ణం ఏమిటో క‌నుక్కొందాం.
వాస్తవానికి మ‌నం అంద‌రూ రాత్రి 8-9 గం.ల‌కు డిన్నర్ చేస్తుంటాం. త‌ర్వాత నిద్ర పోయి ఉద‌యం నిద్ర లేచి ఉరుకులు, ప‌రుగులు జీవితం మొద‌లెడ‌తాం. మ‌హిళ‌లు అయితే ర‌న్నింగ్ రేస్‌, హై జంప్ లు, లాంగ్ జంప్ లు చేసుకొంటూ కొన్ని సార్లు భ‌ర‌త నాట్యం, క‌రాటే లు కూడా చేసేస్తారు. త‌ర్వాత కుటుంబ స‌భ్యుల్ని బ‌య‌ట‌కు పంపించాక 10-11 గంట‌ల‌కు కాస్తంత ఎంగిలి ప‌డ‌తారు. అప్పటి దాకా తిండి ఏమాత్రం తిన‌రు. ఇదే పెద్ద త‌ప్పు. అస‌లు అన‌ర్థాల‌కు ఇదే కార‌ణం. రాత్రి చేసిన భోజ‌నం లేదా ఫ‌ల‌హారం నుంచి ఉద‌యం మ‌ళ్లీ తినేదాకా దాదాపు 10-12 గంట‌లు గ్యాప్ వ‌చ్చేస్తుంది. అంటే స‌గం రోజు ఖాళీ క‌డుపుతో ఉండి, స‌గం రోజు మొత్తం తిండికి కేటాయిస్తారు. దీంతో ఉద‌యం పూట శ‌రీరానికి కావ‌ల‌సిన శ‌క్తి అంద‌టం లేదు. శ‌క్తి లేక పోవ‌టంతో మెద‌డు ప‌ని చేయ‌టంలో ఇబ్బంది ఏర్పడుతుంది. దీంతో చిరాకులు, ఒత్తిళ్లు ఉంటాయి. ఫ‌లితంగా అల‌స‌ట‌, కోపం కలుగుతుంది. దీన్ని నివారించాలంటే చిన్న పాటి జాగ్రత్త తీసుకొంటే స‌రిపోతుంది. ఉద‌యాన్నే శ‌రీరానికి కావ‌ల‌సిన గ్లూకోజ్ అందించే పాలు, బిస్కట్ తీసుకోవ‌చ్చు. లేదా పండ్ల ముక్కలు నోటిలో వేసుకొన్నా భేష్... అస‌లు ఉద‌యం కొద్ది సేప‌టి త‌ర్వాత బ్రేక్ ఫాస్ట్ చేసేస్తే అన్ని స‌మ‌స్యలు పరిష్కారం అవుతాయి. లేదంటే మ‌హిళ‌ళే కాదు, పురుషుల‌కు కూడా ఉద‌యం పూట చిరాకు త‌ప్పదు.
అందుచేత ఈ జాగ్రత్త ఆడవాళ్లు తీసుకోవాల్సింది, వారి సంగ‌తి వారు చూసుకొంటారు అని వ‌దిలేయ‌వ‌ద్దు సుమా..! ఇంటిల్లి పాది అవ‌స‌రాలు కనుక్కొని మరీ వాటిని అమ‌ర్చి పెట్టే మ‌హిళా మ‌ణుల కోసం ఒక జాగ్రత్త అంతా తీసుకోవాలి. ఇంటి ఇల్లాలు ఉద‌యం పూట బ్రేక్ ఫాస్ట్ చేసేలా చూడ‌టం ఇంటిలోని అందరి బాధ్యత‌గా భావించాలి.

మ‌హా కుంభ‌మేళా కు అటువంటి ప్రచారం స‌రైన‌దేనా..!

మ‌హా కుంభ‌మేళా ముగింపు ద‌శ‌కు చేరుకొంది. ఇప్పటికే కోట్లాది భ‌క్తులు పుణ్య స్నానాలు ఆచ‌రించారు. చివ‌రి 4,5 రోజుల్లో అనేక మంది యాత్రికులు వ‌చ్చే అవ‌కాశం ఉంది.

ఇక్కడ ఒక ప్రైవేటు సంస్థ వారు వెరైటీ ప్రచారం చేస్తున్నారు. అక్కడ తినే రొట్టెలు, చ‌పాతీల క‌వ‌ర్ ల మీద హ్యాండ్ వాష్ కు సంబంధించిన ప్రచారం చేస్తున్నారు. ద‌య‌చేసి చేతుల్ని శుభ్రంగా కడుక్కొన్నాకే ఆహారం తినండి అని సూచిస్తున్నారు. ఇది చాలా ఉప‌యోగ‌క‌ర‌మైన ప్రచారం. ఎందుకంటే ల‌క్షల మంది యాత్రికులు వ‌చ్చే కుంభ మేళా వంటి చోట్ల వ్యక్తిగ‌త శుభ్రత ను పాటించ‌టం కొంత వ‌ర‌కు క‌ష్టమైన విష‌యం. పైగా చాలా మంది దీన్ని అశ్రద్ద చేస్తుంటారు. అందుచేత ఇటువంటి స‌మ‌యంలో వ్యక్తి గ‌త శుభ్రత మీద ప్రచారం చేయ‌టం మంచి ప‌రిణామం. వాస్తవానికి చేతిని అంటుకొని అనేక వేల క్రిములు ఉంటాయి. వీటిని తొల‌గించుకోకుండా అదే చేతుల‌తో ఆహారం తీసుకొంటే క‌డుపు లోకి ఈ క్రిములు చేరే చాన్సు ఉంటుంది. అప్పుడు ఇబ్బంది ఏర్పడుతుంది. ఇప్పుడు ఏ ఏ స‌మ‌యాల్లో చేతుల్ని శుభ్రం చేసుకోవాలో తెలుసుకొందాం..
ఆహారాన్ని త‌యారుచేసేట‌ప్పుడు లేక తినేట‌ప్పుడు, గాయాల్ని శుభ్రం చేసుకొనేట‌ప్పుడు, క‌ళ్లకు ఉండే లెన్స్ ను తీసుకొనేట‌ప్పుడు క‌చ్చితంగా చేతుల్ని శుభ్రం చేసుకోవాలి. దీంతో పాటు మాంసాహార‌పు వంట‌లు వండాక‌, టాయ్ లెట్ కు వెళ్లి వ‌చ్చాక‌, జంతువుల‌తో ఆట‌లాడాక‌, బ‌య‌ట ప్రధేశాల్లో ఆడుకొన్నాక, రొంప స‌మ‌యంలో ముక్కు చీదిన త‌ర్వాత‌, గాయాల్ని శుభ్రం చేశాక త‌ప్పనిస‌రిగా హ్యాండ్ వాష్ చేసుకొనుట మేలు. అందుచేత మ‌హా కుంభ మేళా వంటి చోట్ల వ్యక్తిగ‌త శుభ్రత మీద ప్రచారం మంచిదే అనుకోవ‌చ్చు.

ప్రయాణాల్లో ఈ జాగ్రత్త తీసుకొంటే మేలు..!

ప్రయాణాలు చేసేట‌ప్పుడు అన్ని సౌక‌ర్యాలు మ‌న ఇంట్లో ఉన్నట్లుగా ఉండ‌వు. అక్కడ ప‌రిస్థితుల్ని బ‌ట్టి స‌ర్దుకోవాల్సి ఉంటుంది. దూర ప్రాంతాల‌కు వెళ్లిన‌ప్పుడు త‌ప్పనిసరిగా అక్కడ హోట‌ల్స్ లో కానీ, రెస్ట్ రూమ్స్ లో కానీ బ‌స చేయాల్సి ఉంటుంది. అప్పుడు అక్కడ ఉండే టాయిలెట్స్ ను వాడాల్సి ఉంటుంది.

 ఈ మ‌ధ్య కాలంలో ప్రతీ చోట వెస్ట్రన్ టైప్ టాయిలెట్స్ ను వాడుతున్నారు. అటువంట‌ప్పుడు అంద‌రూ కూర్చొన్నట్లుగానే టాయిలెట్ క్యాప్ మీద కూర్చోవాల్సి ఉంటుంది. దీని కార‌ణంగా ఆ క్యాప్ కు ఉండే మ‌లినాలు కొన్ని సార్లు ఈ కాలి తొడ కింద భాగానికి అతుక్కొంటాయి. ఇటువంటి సంద‌ర్బాల్లో త‌ర్వాత కాలంలో ఆ ప్రాంతంలో దుర‌ద‌లు, మంట‌లు, పొక్కులు వ‌చ్చిన సంద‌ర్భాల్ని చూసి ఉన్నాం. ఇది ఎందుకు వ‌చ్చిందో అర్థం కాక పోవ‌చ్చు. కానీ, ఈ మ‌లినాల్లో ఉండే క్రిములే దీనికి కార‌ణం. అందుచేత వెస్ట్రన్ టైప్ టాయిలెట్స్ ను వాడేట‌ప్పుడు వీలుంటే దాన్ని క్లీన్ చేయించుకోవ‌టం ఉత్తమం. లేదంటే సాధ్యమైనంత తొంద‌ర‌గా స్నానం చేయ‌టం మేలు. స్నానం చేసేట‌ప్పుడు స‌బ్బుతో కూర్చొన్నప్పుడు క్యాప్ మీద ఆనిని భాగంలో శుభ్ర ప‌ర‌చుకోవాలి. దీని వ‌ల‌న ఆ మ‌లినాలు తొల‌గిపోతాయి. ప్రయాణాల్లో ఈ జాగ్రత్త తీసుకొంటే మంచిది.

ఈ మ‌ధ్యన సెల‌బ్రిటీస్ ఎక్కువ‌గా తాగేస్తున్నారు ఎందుకు..!

సెల‌బ్రిటీస్ ఏ ప‌ని చేసినా ఆస‌క్తి దాయ‌కంగా ఉంటుంది. అందుకే ప్రముఖుల అల‌వాట్లు, ప్రముఖులు చేసే ప‌నుల్ని అంద‌రూ గ‌మ‌నిస్తూ ఉంటారు. రాజ‌కీయ నాయ‌కులు కానీ, సినీ క్రీడా రంగ ప్రముఖులు ఎక్కడ ఉన్నా జ‌నం బాగా గ‌మ‌నిస్తూ ఉంటారు.

ఈ మ‌ధ్య కాలంలో సెల‌బ్రిటీస్ బాగా మంచి నీరు తాగుతున్నారు. బ‌హిరంగ స‌మావేశాలు, ఓపెన్ డిబేట్స్ లో ఈ విష‌యం బాగా గ‌మ‌నిస్తున్నాం. ముఖ్యంగా శుద్ధి చేసిన నీటిని మాత్రమే తాగుతున్నారు. ఎందుకంటే ఆరోగ్య వంతుడైన మాన‌వునికి రోజుకి 2-2.5 లీట‌ర్ల నీరు అవ‌స‌రం ఉంటుంది. ఈ మేర నీటిని తాగ‌టం వ‌ల‌న జీవ‌న క్రియ‌లు బాగా జ‌రుగుతాయి. అస‌లు శ‌రీరంలో 60 నుంచి 75 శాతం దాకా నీరు ఉంటుంది. మొత్తంగా చూస్తే నీరు అనేది శ‌రీర నిర్మాణంలో ఎక్కువ వాటా ఆక్రమించే అంశం గా చెప్పవ‌చ్చు. కండ‌రాల్లో 75శాతం, మెద‌డులో 90 శాతం, ఎముకల్లో 20 శాతం, ర‌క్తంలో 85శాతం వ‌ర‌కు నీరు ఉంటుంది. నిర్మాణంలోనే కాదు విధుల్లో కూడా నీరు చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది.  శ‌రీరంలోని క‌ణాల్లోప‌ల ఆక్సిజ‌న్‌, ఇతర పోష‌కాల్ని ఒక చోట నుంచి ఒక చోట‌కు చేర్చటం, ఊపిరితి్త్తులు, శ్వాస గొట్టాల్లో శ్లేష్మం చేర్చటం, వ్యాధి నిరోధ‌క శ‌క్తిని ఉప‌యోగించ‌టం, ఉష్ణోగ్రత‌ను క్రమ బ‌ద్దీక‌రించ‌టం, వ్యర్థాల్ని బ‌య‌ట‌కు పంపించ‌టం వంటి అనేక ప‌నుల్లో నీరు ముఖ్య పాత్ర పోషిస్తుంది. అందుచేత క్రమం త‌ప్పకుండా అవ‌స‌ర‌మైనంత నీటిని తాగ‌టం సెల‌బ్రిటీల‌ను చూసి మ‌నం నేర్చుకోద‌గిన అంశం. అదే స‌మ‌యంలో అతి స‌ర్వత్రా వ‌ర్జయేత్ అని తెలుసు క‌దా.. అంటే ఎక్కువ‌గా అదే ప‌నిగా నీటిని తాగ‌టం కూడా మంచిది కాదు సుమా..!

మ‌న ఇంట్లోనే రోగాల పుట్ట పొంచి ఉందా..!


చాలా వ‌ర‌కు రోగాల‌కు క్రిములే కార‌ణం అన వ‌చ్చు. ఈ క్రిములు ఏ రూపంలో పొంచి ఉంటాయ‌నేది నిర్దిష్టంగా చెప్పలేం. కానీ ఎక్కువ క్రిములు ఉండే ప్రదేశాల్ని మాత్రం గుర్తించ‌వ‌చ్చు. దీన్ని బ‌ట్టి జాగ్రత్తలు తీసుకోవ‌టం అవ‌స‌రం.

 క్రిములు దాగి ఉండే ప్రదేశాల్లో వాష్ బేసిన్ ఒక‌టి. వంట పాత్రల్ని శుభ్రం చేసేందుకు వాడే స్క్రబ‌ర్ ను జాగ్రత్తగా గ‌మ‌నించి చూడండి. దీన్ని ప‌దే ప‌దే పాత్రల్ని శుభ్రం చేయ‌టానికి వాడ‌తాం. కానీ, ఒక చోట ఉండే ఆహార ప‌దార్ధాల్ని ఈ స్క్రబ‌ర్ తో తుడిచాక దాన్ని అలాగే వ‌దిలేస్తుంటారు. దీంట్లో ఈ ఆహార ప‌దార్థాల అవ‌శేషాలు చేరి పోతాయి. త‌ర్వాత రోజు అదే స్క్రబ‌ర్ ను వాడ‌తారు. అప్పటికే ఆహార ప‌దార్థాల అవ‌శేషాలు చెడిపోయి క్రిముల‌కు ఆల‌వాలంగా మార‌తాయి. ఇప్పుడు పాత్రల్ని తోమ‌టం ద్వారా .. అక్కడ ఉండే మురికి వ‌ద‌లటం సంగ‌తి ప‌క్కన పెడితే, ముందు రోజు అవ‌శేషాలు, క్రిములు అంటుకొంటాయి. అప్పుడు పాత్రల్లో, ప్లేట్స్ లో ఈ క్రిములు అంటుకొంటాయి. త‌ర్వాత కాలంలో ఈ పాత్రల్లో  ఆహార ప‌దార్థాలు పెట్టిన‌ప్పుడు వాటి ద్వారా ఈ క్రిములు శ‌రీరంలోకి ప్రవేశిస్తాయి. వ్యాధుల‌కు కార‌ణం అవుతుంటాయి.
ఈ క్రిముల సంఖ్య ల‌క్షల్లో ఉంటుందంటే ఆశ్చర్యం క‌ల‌గ‌క మాన‌దు. ఇందులో బ్యాక్టీరియా, వైర‌స్‌, ప్రోటోజోవ‌న్ లు ఉంటాయి. ఇవి అనేక ప్రమాదాల‌కు కార‌ణం అవుతాయి. ఇంకా ఆస‌క్తి క‌ర‌మైన విష‌యం ఏమిటంటే కొన్ని సార్లు ఈ క్రిములు శ‌రీరంలోకి ప్రవేశించాక వెంట‌నే ప్రభావం చూపించ‌క పోవ‌చ్చు. అదును దొరికే దాకా వేచి చూస్తుంటాయి. అటువంట‌ప్పుడు ఈ క్రిముల్ని వెంట‌నే గుర్తు ప‌ట్టక పోవ‌చ్చు. అనేక ప్రమాద‌క‌ర వ్యాధుల్ని ఇవి తెచ్చి పెడ‌తాయి.
దీన్ని నివారించుకోవాలంటే స్క్రబ‌ర్ ను ఒక కంట క‌నిపెట్టుకొని ఉండాలి. సాధ్యమైనంత వ‌ర‌కు దీన్ని కూడా శుభ్రం చేసుకోవాలి. వీలుంటే అప్పుడ‌ప్పుడు వేడి వేడి నీటిలో స్క్రబ‌ర్ ను ముంచి తీయాల్సి ఉంటుంది. అప్పుడు ఈ క్రిములు వేడి నీటిలో నాశ‌నం అవుతాయి. ఏ రోజుకారోజు ఈ స్క్రబ‌ర్ ను శుభ్రం చేసుకోవాలి. కొద్ది పాటి వ్యవ‌ధి త‌ర్వాత ఈ స్క్రబ‌ర్ ను మార్చేసుకోవ‌టం మేలు.

ఇంటి ప‌ట్టునే అన్నం తింటున్నా.. అన‌ర్ధం పొంచి ఉంటుందా..!

శుభ్రత కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే వారు ఎక్కువ‌గా ఇంటి ప‌ట్టునే ఆహారం తీసుకొంటారు. ఇంట్లో త‌యారు చేసిన ఆహారం అయితే శుచి గా ఉంటుంద‌ని నమ్మకం. బ‌య‌ట ఆహారం అయితే శుభ్రత పాటించ‌ర‌ని, అటువంట‌ప్పుడు వ్యాధుల బారిన ప‌డాల్సి వ‌స్తుంద‌ని భావిస్తుంటారు. ఈ న‌మ్మకం స‌రైన‌దే. త‌ప్పనిస‌రి అయితే త‌ప్ప బ‌య‌ట ఆహారం వ‌ద్దని చెబుతారు. ఒక‌వేళ బ‌య‌ట ఆహారం తీసుకోవాల్సి వ‌స్తే శుభ్రత గా ఉన్న చోటే తినాలని చెబుతారు.
కానీ, ఇంటి దగ్గర ఆహారం తీసుకొంటున్నప్పుడు కూడా కొన్ని సార్లు ఇన్ ఫెక్షన్ కు గురి అవుతున్న సంద‌ర్భాల్ని మ‌నం చూస్తాం. దీనికి కార‌ణం ఏమిటా అని గ‌మ‌నిస్తే ఆస‌క్తి క‌ర‌మైన విష‌యాలు బ‌య‌ట ప‌డ్డాయి. చాలా సంద‌ర్భాల్లో ఆహారం వండిన పాత్రల్ని, భోజ‌నం తిన్న ప్లేట్స్ ను కెమిక‌ల్ సోప్‌, లేక పౌడ‌ర్ తో క‌డుగుతారు. ఆ త‌ర్వాత నీళ్లలో ముంచి తీసేస్తారు. స‌రిగ్గా ఇక్కడే స‌మ‌స్య ఏర్పడుతుంది.

 ఈ కెమిక‌ల్స్ ను ప‌ట్టించి వ‌దిలేసినంత మాత్రాన స‌రిపోదు. జిడ్డు వ‌దులుతోందా.. లేదా అన్నది చూస్తున్నారు త‌ప్పితే శుభ్రంగా క‌డుగుతున్నారా లేదా అన్నది ప‌ట్టించుకోరు. ఇది ఇంట్లో ప‌ని మ‌నుషుల ప‌ని లేక ఇంటి ఇల్లాలు బాధ్యత అన్నట్లుగా వ‌దిలేస్తున్నారు. ఇది త‌ప్పు. ఎవ‌రి బాధ్యత అయినా అనారోగ్యం బారిన ప‌డేది మొత్తం ఇంటిల్లి పాది అని గుర్తుంచుకోవాలి.
ఎక్కువ కాలం వండిన గిన్నెలు లేక తిన్న ప్లేట్స్ ను వ‌దిలేయ‌వ‌ద్దు. ఎండి పోయిన త‌ర్వాత ఆ మురికి వ‌ద‌ల‌టం క‌ష్టం. పైగా కెమిక‌ల్స్ ప‌ట్టించి వ‌దిలేయ‌కూడ‌దు. దీని కార‌ణంగా ఆ కెమిక‌ల్స్ పాత్రల్ని ప‌ట్టి ఉంటాయి. ఇవి ఎగ‌స్ట్రా క్రిముల్ని అంట క‌డ‌తాయి. అందుచేత పాత్రల్ని కెమిక‌ల్స్ ప‌ట్టించాక‌, ఆ మురికి మొత్తం వ‌ద‌లేదాకా శుభ్రంగా క‌డ‌గాలి. 50 పిపిఎమ్ క్లోరిన్ ఉండే మాదిరి గా కెమిక‌ల్స్ ను ప‌ట్టిస్తే చాలు. దీన్ని నీటితో ధారాళంగా క‌డ‌గాలి. వీలుంటే వేడి నీటితో ఒక్క సారి క‌డిగితే చాలా చాలా ఉత్తమం. ఇటువంటి జాగ్రత్త లు తీసుకొంటేనే ఇంటి భోజ‌నం తో మంచి ఫలితాల్ని పొంద‌గ‌లుగుతాం..