చాలా వరకు రోగాలకు క్రిములే కారణం అన వచ్చు. ఈ క్రిములు ఏ రూపంలో పొంచి ఉంటాయనేది నిర్దిష్టంగా చెప్పలేం. కానీ ఎక్కువ క్రిములు ఉండే ప్రదేశాల్ని మాత్రం గుర్తించవచ్చు. దీన్ని బట్టి జాగ్రత్తలు తీసుకోవటం అవసరం.
క్రిములు దాగి ఉండే ప్రదేశాల్లో వాష్ బేసిన్ ఒకటి. వంట పాత్రల్ని శుభ్రం చేసేందుకు వాడే స్క్రబర్ ను జాగ్రత్తగా గమనించి చూడండి. దీన్ని పదే పదే పాత్రల్ని శుభ్రం చేయటానికి వాడతాం. కానీ, ఒక చోట ఉండే ఆహార పదార్ధాల్ని ఈ స్క్రబర్ తో తుడిచాక దాన్ని అలాగే వదిలేస్తుంటారు. దీంట్లో ఈ ఆహార పదార్థాల అవశేషాలు చేరి పోతాయి. తర్వాత రోజు అదే స్క్రబర్ ను వాడతారు. అప్పటికే ఆహార పదార్థాల అవశేషాలు చెడిపోయి క్రిములకు ఆలవాలంగా మారతాయి. ఇప్పుడు పాత్రల్ని తోమటం ద్వారా .. అక్కడ ఉండే మురికి వదలటం సంగతి పక్కన పెడితే, ముందు రోజు అవశేషాలు, క్రిములు అంటుకొంటాయి. అప్పుడు పాత్రల్లో, ప్లేట్స్ లో ఈ క్రిములు అంటుకొంటాయి. తర్వాత కాలంలో ఈ పాత్రల్లో ఆహార పదార్థాలు పెట్టినప్పుడు వాటి ద్వారా ఈ క్రిములు శరీరంలోకి ప్రవేశిస్తాయి. వ్యాధులకు కారణం అవుతుంటాయి.
ఈ క్రిముల సంఖ్య లక్షల్లో ఉంటుందంటే ఆశ్చర్యం కలగక మానదు. ఇందులో బ్యాక్టీరియా, వైరస్, ప్రోటోజోవన్ లు ఉంటాయి. ఇవి అనేక ప్రమాదాలకు కారణం అవుతాయి. ఇంకా ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే కొన్ని సార్లు ఈ క్రిములు శరీరంలోకి ప్రవేశించాక వెంటనే ప్రభావం చూపించక పోవచ్చు. అదును దొరికే దాకా వేచి చూస్తుంటాయి. అటువంటప్పుడు ఈ క్రిముల్ని వెంటనే గుర్తు పట్టక పోవచ్చు. అనేక ప్రమాదకర వ్యాధుల్ని ఇవి తెచ్చి పెడతాయి.
దీన్ని నివారించుకోవాలంటే స్క్రబర్ ను ఒక కంట కనిపెట్టుకొని ఉండాలి. సాధ్యమైనంత వరకు దీన్ని కూడా శుభ్రం చేసుకోవాలి. వీలుంటే అప్పుడప్పుడు వేడి వేడి నీటిలో స్క్రబర్ ను ముంచి తీయాల్సి ఉంటుంది. అప్పుడు ఈ క్రిములు వేడి నీటిలో నాశనం అవుతాయి. ఏ రోజుకారోజు ఈ స్క్రబర్ ను శుభ్రం చేసుకోవాలి. కొద్ది పాటి వ్యవధి తర్వాత ఈ స్క్రబర్ ను మార్చేసుకోవటం మేలు.
No comments:
Post a Comment